ప్రొఫెషనల్ ర్యాగింగ్

2
4

[dropcap]“నే[/dropcap]ను మీ కాలేజికి గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం ఏంటి రా” అని ఆశ్చర్యంతో అడిగాడు రమణ.

“మా లెక్చరర్ ఇవాళ మనింటికి వచ్చి మరీ నిన్ను ఆహ్వానిస్తానన్నారు నాన్నా” అంటూ కుర్చీలో కూలబడ్డాడు కొడుకు.

“అయినా దాన్ని గెస్ట్ అప్పియరెన్స్ కాదు నాన్నా గెస్ట్ లెక్చర్ అంటారు” అని నవ్వసాగాడు ఆ పుత్రరత్నం పవన్.

“ఏదైతే ఏముంది లేరా, అయినా నేను ఒక బ్యాంకులో గుమాస్తాగిరి వెలగబెట్టేవాడిని, నేను మీలాంటి ఎమ్.బి.ఎ. స్టూడెంట్స్‌కి ఏమి చెప్పగలను” అని నిట్టూర్చాడు రమణ.

“మీ అనుభవాలు మాకు ఉపయోగపడతాయని మా లెక్చరర్స్ అందరూ మూకుమ్మడిగా ఏకగ్రీవ తీర్మానం చేసారు” అంటూ పవన్ తన తండ్రి రమణను కాకా పట్టసాగాడు.

రమణ గత ముప్పై ఏళ్ళుగా బ్యాంకులో పనిచేస్తున్నాడు. మంచి జీతం, సదుపాయాలు, వేళకి ఇంటి భోజనంతో అతని జీవితం సాఫీగా గడిచిపోతోంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు పవన్ ఒక మంచి పేరున్న కాలేజిలో ఎమ్.బి.ఎ. రెండవ సంవత్సరం చదువుతున్నాడు. అలా మంచి భార్య, కొడుకుతో సంసార సాగరం ఈదుతుండే రమణ ఒక్కసారిగా తనను కాలేజి గెస్ట్ లెక్చరర్‌గా రమ్మనేసరికి ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఆదివారం కావడంతో రమణ ఇంట్లోనే ఉంటాడని తెలిసి పవన్ కాలేజి ప్రిన్సిపాల్ రమణను కలవడానికి పవన్‌కి ఫోన్ చేసి మరీ ఆ రోజు సాయంత్రం రమణ ఇంటికి వచ్చారు. కుశల ప్రశ్నలు, పలకరింపులు అయ్యాక పవన్ గురించి రమణ దగ్గర చాలా గొప్పగా చెప్పారు ప్రిన్సిపాల్. మెల్లగా గెస్ట్ లెక్చరర్ గా రమణను ఆహ్వానించాడు కాలేజి ప్రిన్సిపాల్.

దానికి రమణ మొహమాట పడుతూ “సార్! నేను చదివింది మామూలు డిగ్రీ, ఏదో బి.కామ్. అదీ ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం. ఆ చదువుతో నేను గెస్ట్ లెక్చర్ ఏమి ఇచ్చేది. నా ఉద్యోగం అంటారా? నేను చేసేది బ్యాంకులో గుమాస్తాగిరి. దానితో నేనేమి చెప్పగలను” అని సున్నితంగా తప్పించ యత్నించాడు. కాని ఆ ప్రిన్సిపాల్ “సార్! మీ అనుభవాలు మా కాలేజి విద్యార్థులకు ఉపయోగపడతాయి, దయచేసి కాదనవద్దు” అని మరలా మరలా రిక్వెస్ట్ చేయడంతో రమణకు ఒప్పక తప్పింది కాదు. గెస్ట్ లెక్చర్ ఎప్పుడు ఇవ్వాలో ఆ తేది, సమయం మళ్ళీ చెప్తామని ప్రిన్సిపాల్ వెళ్లి పోయాడు.

మొట్టమొదటి సారిగా అలాంటి అవకాశం రావడంతో రమణ చాలా శ్రద్ధగా ఉపన్యాసం ప్రిపేర్ అవసాగాడు. వారం రోజుల తర్వాత అక్టోబర్ రెండు, గాంధీ జయంతి కావడంతో, ప్రిన్సిపాల్ ఫోన్ చేసి మరీ రమణను కాలేజికి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి గెస్ట్ లెక్చర్ ఇవ్వాలని చెప్పాడు. అలా అలా చూస్తుండగానే అక్టోబర్ 2 వచ్చేసింది. టిప్ టాప్‌గా రెడీ అయి రమణ కొడుకుతో కొడుక్కి కొనిచ్చిన బైక్‌పై కొడుకు కాలేజికి బయలుదేరాడు.

***

కళాశాల అంతా సమాజంలో పేరుమోసిన పెద్ద మనుషులతో సందడి గా తయారైంది. అంతమంది పెద్దవాళ్ళతో స్టేజ్ పంచుకునేసరికి మనసులో ఆనందంతో పూరీలా పొంగిపోయాడు రమణ. వచ్చిన ఫేమస్ వ్యక్తులు అందరూ గాంధీ గురించి, సమాజం గురించి, సమాజంలో ఎలా బాధ్యతగా బ్రతకాలో చెప్పుకుంటూ పోయారు. అలా రమణ వంతు వచ్చింది. స్టేజ్ పై యాంకర్ కమ్ అధ్యక్ష పాత్ర పోషించిన వ్యక్తి పిలవడంతో రమణ మైక్ ముందు నిలబడి ప్రసంగించడం మొదలు పెట్టాడు .

***

“అందరికీ నమస్కారం, ఇక్కడ నా కంటే ఎంతో పెద్ద వాళ్ళున్నారు. వయసులో, అనుభవంలో చాలా పెద్ద వాళ్ళు. ఈ సమాజంలో ఎలా బ్రతకాలో, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి నన్ను మాట్లాడుతూ నా ఉద్యోగ అనుభవాన్ని వివరించమన్నారు ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు. కొన్ని ఓటములు, గెలుపులు మనం జీవితంలో ఎలా బ్రతకాలో, బ్రతకకూడదో తెలియచేస్తాయి. ప్రతీ ఓటమితో మనం చెప్పాల్సింది ఒక్కటే ‘నువ్వు, నేను కలిస్తే మాయ చేస్తూ గెలుపును సాధించగలం’ అని. మీ జనరేషన్ విద్యార్థులకు చెప్పాలంటే ‘ఎ మ్యాజిక్ యు, వి కెన్ డు టు విన్’. ఈ సందర్భంలో నా అనుభవం ఒకటి చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుర్రవాడు నేను పనిచేస్తున్న బ్రాంచ్‌లో క్లర్క్ గా చేరాడు. అతని పేరు రాజా. కొత్తగా చేరిన రాజాని మేనేజర్ వాడుకోవడం మొదలు పెట్టాడు. సీనియర్లు కూడా అతనికి పని అప్పగించి తిరుగుతుండేవారు. పిచ్చాపాటీలు, బాతాఖానీలు షరా మామూలే. నేను మాత్రం రాజాకు పని నేర్పుతూ, అతని అనుమానాలు నివృత్తి చేసేవాడిని. అతనిలో ఉండే లక్షణం ముందు సావకాశంగా వినడం, ఆ తరువాత అనుమానాలుంటే తీర్చుకోవడానికి ప్రశ్నించడం. ఇది నాకు అతనిలో బాగా నచ్చేది. అలా మేమిద్దరం గురుశిష్యులమయ్యాం. రాజా డిగ్రీ కంప్లీట్ చేసి మా బ్యాంక్‌లో చేరాడు. పేదరికం వలన పై చదువులు చదవలేక పోయాడు. మన కళాశాలల్లో ర్యాగింగ్ చేసినట్లే మా ఆఫీసులో రాజాని ఏడిపించేవారు. అంటే ప్రొఫెషనల్ ర్యాగింగ్ అన్నమాట. అతని పేదరికాన్ని, బట్టలను, చివరికి అతను ధరించే చెప్పులను కూడా గేలి చేసేవారు. అన్నింటినీ చిరునవ్వుతోనో, మౌనంతోనో దాటవేసేవాడు. ఒకరోజు నేనే నిగ్గదీసి అడిగినా నాకు కూడా చివరికి చిరునవ్వే సమాధానంగా దొరికింది. రాజా వారాంతాల్లో ఇంటికి వెళ్ళేవాడు. ఆ విషయం తెలుసుకున్న మేనేజర్ వెళ్లే సమయంలో రాజాను పిలిచి మరీ పని అప్పగించేవాడు. ఆదివారాలు కూడా రమ్మని బలవంతం చేసేవాడు. రాజా వచ్చినా కానీ మేనేజర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అన్నట్లు తప్పుకునేవాడు. ఒకరోజు రాజా మేనేజర్ పర్మిషన్‌తో ఆఫీస్‌కి లేటుగా వచ్చాడు. ఆఫీస్‌కి వచ్చిన తర్వాత అందరిముందూ రాజాకి మరోసారి క్లాస్ తీసుకున్నాడు. కావాలని అతనికి ఎక్కువ పని పురమాయించి ఆ పని ముగిసిన తర్వాతే ఇంటికి వెళ్లమన్నాడు. ఇంతలో మేనేజర్‌కి ఇంటి నుంచి ఫోన్ రావడంతో ఇంటికెళ్ళి పోయాడు. మేనేజర్ కొడుక్కి యాక్సిడెంట్ అయిన విషయం ఆ రోజు మధ్యాహ్నం మాకు తెలిసింది. రాజాతో సహా అందరం వెళ్లి హాస్పిటల్లో ఉన్న మేనేజర్ కొడుకుని పరామర్శించాం. అపుడు నేను మళ్ళీ అడిగాను ‘నీకసలు కోపం రాదా? ఎందుకు మేనేజర్ ఇంటికి వెళ్ళి మరీ నువ్వు పలకరించావు’ అని. మరలా రోజు వారి నవ్వే రాజు నుంచి సమాధానమైంది. అలా కొన్ని నెలలు గడిచాయి. మేనేజర్ రాజా గురించి చెడ్డగా రిపోర్ట్ రాయడంతో రాజా ప్రొబిషనరీ పిరియడ్ పొడిగించారు. ఆ లెటర్‌ను ఆనందంతో మేనేజర్ రాజాకు ఇచ్చాడు. అందుకు ప్రతిగా రాజా తన రాజీనామా లేఖను మేనేజర్‌కు అందించాడు. మేనేజర్ ఒక హాట్ షాక్ తిన్నాడు. ఆ షాక్ లోనే కారణం ఏమిటని ప్రశ్నించారు. తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయదలుచుకున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు చెప్పాడు. నోటీస్ పీరియడ్ పనిచేసాక రాజా చిన్న పార్టీ లాంటిది ఇచ్చి అందరికీ అల్విదా చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన రాజా అప్పుడప్పుడు నాతో ఫోన్‌లో మాట్లాడేవాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ మేనేజర్ పెద్ద స్థాయికి అంటే జనరల్ మేనేజర్ అలియాస్ జి.మ్. రేంజ్‌కి ఎదిగాడు. ఒక జి.మ్.గా ఒకసారి అతను ఒక కలెక్టర్ మీటింగ్‌కు వెళ్ళాల్సొచ్చింది. టక్, టై, సూటు, బూట్లు, వేసుకుని దర్పంగా వెళ్ళాడు. రావల్సిన వారందరూ ముందుగా వచ్చారు, కానీ కలెక్టర్ మాత్రం రాలేదు. అందరూ కలెక్టర్ కోసం ఎదురు చూస్తుండసాగారు. చెప్పిన టైంకి అయిదు నిమిషాల ముందర కలెక్టర్ వచ్చారు. మీటింగ్ జయప్రదంగా ముగిసింది. కలెక్టర్ తన క్యాబిన్‌కు వెళ్లి ముఖాముఖి మాట్లాడటానికి అందరు జి.మ్. లను ఒక్కొక్కరిగా పంపించమన్నారు. అలా మా మేనేజర్ వంతు రాగానే చాలా గర్వంగా కలెక్టర్ గదిలో ప్రవేశించాడు. మా మేనేజర్ ను చూడగానే కలెక్టర్ తన సీట్లో నుంచి లేచి మరీ ఎదురొచ్చి నమస్కరిస్తూ సాదరంగా ఆయన్ని ఆహ్వానించాడు. తనకు అంత గుర్తింపు, గౌరవం దక్కేసరికి మా మేనేజర్‌లో గర్వం గోదావరిలా ఉప్పొంగింది. అన్నీ విషయాలు మాట్లాడి వెళ్ళిపోతుంటే అప్పుడు కలెక్టర్ మేనేజర్‌తో “సార్! మీరు నన్ను గుర్తుపట్టారా?” అని అడిగాడు. దానికి మేనేజర్ “మీరు ఈ జిల్లా కలెక్టర్ సార్, మీరు తెలియదా” అని అంటే “సార్! నేను మీతో కలిసి పనిచేసిన రాజాను” అని కలెక్టర్ అనగానే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మరీ గుర్తుకు తెచ్చుకున్నారు అప్పటి మేనేజర్ కమ్ ఇప్పటి జనరల్ మేనేజర్. “నువ్వు, ఐ మీన్, మీరు ఇక్కడెలా?” అని ఆశ్చర్యపడుతూ అడిగాడు. దానికి రాజా నవ్వుతూ “నేను బ్యాంకులో జాబ్ రిజైన్ చేసాక సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రిపేర్ అయ్యాను. తద్వారా నేను ఐ.ఎ.స్.కు సెలెక్ట్ అయ్యాను. ఆ బ్యాంక్ జాబ్ నా పాకెట్ మనీకి, సివిల్ సర్వీస్ కోచింగ్ ఖర్చులకు. అందుకే నేను బట్టలకి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే వాడిని కాదు. నాకు ఫిజికల్ అప్పియరెన్స్ మీద నమ్మకం లేదు సార్” అన్నాడు. జనరల్ మేనేజర్ కి ఏం మాట్లాడాలో తెలియలేదు. మరలా రాజానే అందుకుని “నేను ఇవాళ ఇంత మంచి అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో ఉన్నానంటే కారణం మీరు కూడా ఒకరు సార్, ఎందుకంటే ఎర్లీ స్టేజ్ లో నేను అవమానాలు, ఒత్తిడుల నుంచి ఎలా బయటపడాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలో మీలాంటి వాళ్ళ వలననే నేర్చుకున్నాను. అలా అని నాకు మీ మీద వ్యక్తిగత కోపాలు, పగలు లేవు. నేను ఒకరోజు లేటుగా వస్తే మీకు గుర్తుందో లేదో కాని, ఆ రోజు నన్ను నానా విధాలుగా దుర్భాషలాడారు. ఆ కారణం ఆ రోజు మీకు చెప్పకుండా దాటేసాను. ఇప్పుడు చెప్తాను. ఏంటంటే మీ అబ్బాయి స్కూల్‍కి వెళ్తున్నపుడు యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు మీ అబ్బాయి రక్తం బాగా పోయి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ అబ్బాయిది ఓ నెగెటివ్ గ్రూప్. అలాంటి వ్యక్తులకు రక్తం ఆ గ్రూపు వాళ్లే ఇవ్వాలి వేరే వాళ్ళది సరిపడదు. నాదీ ఓ నెగెటివ్ కావడంతో ఆ రోజు నేను రక్తం ఇచ్చివచ్చేసరికి లేట్ అయింది” అన్నాడు. ఆ మాటలకు జనరల్ మేనేజర్ ఆశ్చర్యపోయాడు. తన కొడుకు శరీరంలో రాజు రక్తం ప్రవహిస్తుంది అనే ఊహే అతన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. “నా కొడుకు యాక్సిడెంట్ మీకు ఎలా తెలిసింది” అని అడిగాడు. దానికి ఇప్పటి కలెక్టర్ “నేను, మీ అబ్బాయిని హాస్పిటల్ చేర్పించిన హాస్పిటల్ కాంపౌండర్ ఇద్దరం రూమ్మేట్స్. ఎవరికో రక్తం కావాలంటే నేను హాస్పిటల్‍కు వెళ్ళాను, తీరా వెళ్లి చూస్తే ఆ పేషెంట్ మీ అబ్బాయి. మీ అబ్బాయిని నేను అంతకుముందు మన ఆఫీస్ పార్టీలో చూసాను. రక్తం ఇచ్చినట్లు మీకు చెప్పవద్దని వాడికి, హాస్పిటల్ వాళ్ళకి చెప్పాను. అందుకే వాళ్ళు మీతో రక్తం సిద్ధంగా ఉందని మీకు అబద్ధం చెప్పారు. మేలు చేసే అసత్యం కూడా మంచిదే కదా సార్” అని సమాధానం ఇచ్చారు. జనరల్ మేనేజర్ కన్నీళ్ళతో “మరి నాకెందుకు ముందే చెప్పలేదు” అని సున్నితంగా రాజా భుజం పట్టుకుని అడిగాడు. దానికి రాజా “సార్! ఒక వ్యక్తితో మనకు అవసరం ఉన్నా, లేక ఆ వ్యక్తి మనకు సహాయం చేసినా ఆ వ్యక్తితో మనం ప్రవర్తించే తీరు చాలా సార్లు అబద్ధంగా, నటనగా ఉంటుంది. మీ దృష్టిలో ‘నేను’ అంటే ఏంటి అనేది నిజంగా నేను తెలుసుకోవాలి అనుకుంటే ఆ విషయం చెప్పకూడదు అనుకున్నాను అందుకే చెప్పలేదు. మీరు ఒకసారి అన్నారు ‘నీ వల్ల నేను ఒక గుమాస్తా చేత కూడా సలహాలు చెప్పించు కావాల్సి వస్తోంది’ అని. నాకు మీ అబ్బాయి యాక్సిడెంట్ గురించి చెప్పింది సెవన్త్ ఫెయిల్ అయిన ఒక కాంపౌండర్. మీ అబ్బాయి అని తనకు తెలియనప్పుడే నన్ను రక్తం ఇవ్వమని కోరాడు. నేను వాడి మాటలు నిర్లక్ష్యం చేసుంటే ఒక్కగానొక్క మీ అబ్బాయి నిండు ప్రాణం పోయేది కదా. ఎంతో మంది డాక్టర్లు, ధనవంతుల సహాయ సహకారాలతో ఆ కాంపౌండర్ ఒక చిన్న హాస్పిటల్ మొదలుపెట్టి ఎంతో మంది వైద్యులను నియమించుకుని ఇప్పుడు ఆ హాస్పిటల్ ఎమ్.డి. స్థాయికి వెళ్ళాడు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం, ఆర్థికంగా డబ్బు ఉన్నవారి వద్ద నామమాత్రపు ఫీజులు తీసుకుంటూ అతను హాస్పిటల్ కొనసాగిస్తున్నాడు. మన చేతికి ఉన్న అయిదువేళ్ళే ఒకేరకంగా ఉండవు. అయినా పిడికిలి ఎంత శక్తివంతంగా ఉంటుంది. ఒకే తల్లి గర్భాన జన్మించే పిల్లలే ఒకే రకంగా ప్రవర్తించరు. అయినా అందరూ ఐకమత్యంగా ఉంటే ఎంత బాగుంటుంది. అలానే ఒక రోజులో కుటుంబ సభ్యులతో కంటే ఎక్కువ భాగం కలిసుండే ఉద్యోగుల మధ్య వృత్తిపరమైన తేడాలు, భేదాభిప్రాయాలు, గొడవలు ఉంటే ఉండచ్చేమోగాని వ్యక్తిగతంగా ఉండకూడదు సార్. ఆ సంఘటనతో ఇప్పటి జి.మ్. ‘సార్! ఇన్నేళ్ళ తరువాత నా తప్పు నేను తెలుసుకున్నాను అనడం కంటే నాలోని ‘నేను’ ఏంటో తెలుసుకున్నాను నా లోపాలతో సహా అని అనడం కరెక్ట్’ అనడంతో కలెక్టర్ రాజా ‘సార్! మీరు నా గురువు లాంటి వారు,నేనెప్పటికీ మీ రాజానే’ అనంటూ ప్రేమతో చేయి కలిపాడు. అలా కలెక్టర్ గదిలోంచి బయటకు వచ్చిన జనరల్ మేనేజర్‌కి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లనిపిచ్చింది.”

***

అలా తన ప్రసంగాన్ని ముగిస్తూ రమణ అప్రయత్నంగా కన్నీళ్ళు పెట్టుకోసాగాడు. విద్యార్థులందరి కరతాళధ్యనులతో ఆ ప్రదేశం నిండిపోయింది. ఇంతలో ఒక విద్యార్థి లేచి “సార్! ఆ మేనేజర్ ఇప్పుడు ఎక్కడున్నారు” అని సున్నితంగా ప్రశ్నించాడు. రమణ చిరునవ్వుతో “అప్పటి మేనేజర్, ఇప్పటి జనరల్ మేనేజర్ మీ ముందున్న నేనే. ఆ రోజు యాక్సిడెంట్‌కు గురైన నా కుమారుడు, గెస్ట్ లెక్చర్ ఇవ్వమని మీ ముందుకు నన్ను లాక్కొచ్చిన మీ స్నేహితుడు పవన్” అన్నాడు. అందరూ ఆశ్చర్యపోతూ చూడసాగారు. రమణ కొనసాగిస్తూ “మీకు చెప్పిన కథలో రాజాకు పనిలో సాయం చేసిన క్లర్క్, రాజాను సపోర్ట్ చేస్తూ నాకు సలహాలు ఇచ్చిన గుమాస్తా ఇద్దరూ ఒకరే, అతని పేరు రామనాధం. మీరందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ర్యాగింగ్ చేసిన మీ జూనియర్ విద్యార్థి భవిష్యత్తులో మీరు చేయబోయే ఉద్యోగంలో మీ పై అధికారిగా రావచ్చు. అప్పుడు ఆ అధికారి మిమ్మల్ని ప్రొఫెషనల్‍గా ర్యాగింగ్ చేస్తే మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. రాజాతో నాకు ఎదురైన అనుభవంతో నేను నేర్చుకున్న గుణపాఠంతో నేను ఎంత ఎత్తుకు ఎదిగినా నా స్టార్టింగ్ పాయింట్ మర్చిపోకుండా ఉండటానికి నేనెప్పుడూ అందరి దగ్గరా నేనొక గుమాస్తా గానే చెప్తుంటా. ఇంతలో మరో విద్యార్థి లేచి “సార్! మరి రాజా ఎక్కడున్నారిప్పుడు? మీతో కాంటాక్ట్‌లో ఉన్నారా?”అని ఆత్రుతగా అడిగాడు. ఆనందంతో కన్నీళ్ళు కళ్ళల్లో ఉబుకుతుండగా వాటికి ఆనకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ “ఈ సభలో నాకంటే ముందు మాట్లాడిన పెద్దమనిషి, ఇప్పుడు నవ్వుతూ కూర్చున్న ఈ జిల్లా కలెక్టర్ గారే ఆ రాజా” అని రాజాని చూపించాడు. అప్పుడు రాజా నమస్కరిస్తూ కృతజ్ఞతా భావంతో తన గురువు రమణను కౌగిలించుకున్నాడు. ఆ ప్రాంగణం మరోసారి కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here