Site icon Sanchika

ప్రాజెక్ట్ నెంబర్ 3456

[dropcap]”సా[/dropcap]ర్… ముఖ్యమంత్రి ఆఫీసు నుండి మీకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు మెయిల్ వచ్చింది. శుభాకాంక్షలు సార్… ఇప్పటివరకు మన కృషి ఫలించినట్లే. కానీ ఒక్క పదినిమిషాలు మాత్రమే ఇచ్చారు. అదీ రేపు ఉదయమే 11.30కు. మరి ఏంచేయాలో, ఏం కాగితాలు తేవాలో చెబితే అన్నీ సిద్ధం చేస్తాను.” అంటూ తోటి సైంటిస్ట్, జూనియర్ అయిన సిమ్రాన్ వచ్చీ రాని తెలుగులో చెప్పింది.

“వావ్… నిజమా!! గ్రేట్… ఎన్నాళ్ల ప్రయత్నం. కానీ పది నిమాషాలేనా? సరే… ప్రయత్నం చేద్దాం. ఏం కావాలో అన్నీ లిస్ట్ చెబుతాను, సిద్ధం చేయి. మనం ఇందులో విజయం సాధిస్తే అందులో ఎక్కువ భాగం క్రెడిట్ నీదే” అంటూ ఆనందంలో అప్రయత్నంగా సిమ్రాన్ చేతిని ముద్దాడాడు సైంటిస్ట్ మిహిర్.

మిహిర్ ఒక సీనియర్ సైంటిస్ట్. ఏదో కొత్త ఆవిష్కరణ చేయాలని, దాని ద్వారా మానవజాతికి మేలు చేయాలని చిన్ననాటి నుండి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న అపర మేధావి. విదేశాల్లో ఎన్నో పరిశోధనలు చేసే అవకాశం వచ్చినా బాగా డబ్బులు ఆశ పెట్టినా భారత్ వదలకుండా తన ప్రయోగశాలలోనే ఏదో విన్నూతంగా చేయాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. అలా కొత్త ఆవిష్కరణకు ప్రయత్నాలు అన్నీ తనకు, తన జూనియర్ సిమ్రాన్, మరియు తన తల్లిదండ్రులకు తప్ప ఇంకెవరికీ చెప్పకుండా సాగిస్తున్నాడు.

బయట ప్రజలకు అతను ఇంకా ఏదో పెద్ద చదువులు చదువుతున్నట్టు గానే తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మిహిర్ ఒక కొత్త పరికరాన్ని కనిపెట్టి దాని వివరాలు చెప్పడానికి, దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలిపే అవకాశం కోసం, తద్వారా ప్రభుత్వ సహాయం పొందటానికి గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి బూసిరెడ్డిని కలవటానికి విశ్వప్రయత్నాలు చేసాడు. అలా వచ్చిన అవకాశమే రేపటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్.

మరి ఏమైనదో చూద్దామా…..

***

ముఖ్యమంత్రి గారితో భేటీ అనగానే తనకు కావలిసిన ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఇంకా ఏవో సీడీలు, పెన్ డ్రైవ్‌లు అన్నీసిద్ధం చేసుకుని ఏది ఎప్పుడు, ఎలా చూపాలో ఒకసారి అనుకుని, అదే క్రమంలో నెంబర్లు వేసుకుని తమ లాప్ టాప్‌లు వేసుకుని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక గంట ముందుగానే చేరుకున్నారు. సెక్యూరిటీ చెకప్ అయిన తరువాత హాలులో కూర్చుని తమ అవకాశం ఎప్పుడు వస్తుందాయని ఎదురు చూస్తున్నారు యువ శాస్త్రవేత్తలు మిహిర్, సిమ్రాన్‌లు.

అనుకున్నట్టుగానే వారి సమయం రావటం లోపలికి రమ్మని ఆహ్వానం రాగానే వెళ్లి ముఖ్యమంత్రి బూసిరెడ్డికి నమస్కరించారు. ముఖ్యమంత్రితో పాటు అక్కడ ఇంకో నలుగురు ఇతర అధికారులు ఉండటం గమనించారు.

“ఓహో… మీరేనా… కుర్ర సైంటిస్టులు, నాతో అపాయింట్మెంట్ గూర్చి గత కొన్ని వారాలుగా ప్రయత్నం చేస్తున్నారు. సరే ఏమిటో చెప్పండి. మీకు తెలుసుగా మీకు ఇచ్చిన సమయం పది నిమిషాలు మాత్రమే. మరి తొందరగా చెప్పండి” అన్నాడు ముఖ్యమంత్రి బూసిరెడ్డి తాపీగా.

ఆయన మాటలకు ఒక్క క్షణం విస్తుపోయి, మరల తేరుకుని చుట్టూ ఉన్న పరివారాన్ని చూస్తూ తాము చెప్పదలుచుకున్నది, మాట్లాడవలసినది ముఖ్యమంత్రి గారితో మాత్రమేనని, వీరంతా ఇక్కడ ఉండకూడదని నిక్కచ్చిగా చెప్పేసారు. వాళ్ల మాటలకు ఒకింత అసహనంగానే విని చుట్టూ ఉన్న పరివారాన్ని బయటకు వెళ్ళమని సౌజ్ఞ చేసాడు బూసిరెడ్డి.

అందరూ వెళ్ళగానే మిహిర్ గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టాడు. ” సార్… నమస్తే. మేము ఒక విన్నూత ఆవిష్కరణకు ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇప్పటికే చాలా మటుకు సఫలీకృతం అయ్యాం. ఆ ప్రాజెక్ట్ పేరు ‘ప్రాజెక్ట్ నెంబర్..3456’ అంటే మనం ఇప్పుడు ఉన్న సంవత్సరానికి సుమారు పదిహేను వందల ఏళ్ల తరువాత ఈ భూమి ఎలా ఉంటుందో, ఇప్పుడు మనం చేస్తున్న పనుల వల్ల ఈ భూగ్రహానికి ఎంత నష్టం, ఏమి లాభమో, అన్నది తెలుస్తుంది. అదే విధంగా మనం భవిష్యత్ లోకి కూడా వెళ్లి చూడవచ్చు. అంటే ఇది ఒక టైమ్ మిషన్ లాంటిది అన్నమాట.

కానీ మేము ఇందులో ఇంకా చేయవలసినది ఏమైనా ఉందంటే అది గతంలోకి వెళ్లటమే, ఇంకా సాధ్యపడలేదు. దాని ప్రయత్నంలోనే ఉన్నాం. ఇది మనదేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం భవిష్యత్‌లో ఎలా, ఎంత ఉపయోగపడుతుందో ముందే మనం ఒక అంచనాకు రావచ్చు. ఇది మన దేశానికే కాదు, ఈ భూగ్రహం మొత్తానికి, ఈ మానవ జాతి మొత్తానికి ఉపయోగపడేట్టు నిర్ణయం తీసుకోవచ్చు. భావితరాలు మనను దోషులుగా భావించకుండా వారికి కూడా ఈ గ్రహం మీద హాయిగా బతికే అవకాశం ఇద్దాం. ఇది టూకీగా 3456 ప్రాజెక్ట్ గురించి” అంటూ మాట్లాడుతూ మిహిర్ ముఖ్యమంత్రి గారి స్పందన కోసం ఉత్సాహంగా చూసాడు.

విస్మయంగా వింటున్న బూసిరెడ్డి తేరుకుని “ఏం సైంటిస్ట్ గారు, ఏమైనా సినిమా స్టోరీ చెబుతున్నారా? బాలయ్య బాబు నటించిన ‘ఆదిత్య-369’ సినిమాకు సీక్వెల్ ఆలోచిస్తున్నారా? భవిష్యత్ లోకి వెళ్ళటం, తిరిగి రావటం, ఇదేంటి ఏమైనా పనికి వచ్చే విషయం చెప్పండి. అంతేకానీ ఇలాంటి సాధ్యంకాని పనుల గురించి చెప్పి, నా సమయం, మీ సమయం వృథా చేయొద్దు. ఇప్పటికి మీకు ఇచ్చిన సమయం ఆరు నిమిషాలు అయ్యింది, ఇంకేమైనా ఉంటే తొందరగా ముగించి దయచేయండి” అంటూ ఒకింత అసహనంగా ముగించాడు.

ముఖ్యమంత్రి మాటలకు కొద్దిగా నిరుత్సాహం చెందిన మిహిర్ మళ్లీ ఉత్సాహం పుంజుకుని “సార్… దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్ట్ నేను చేపట్టాను. నేను సంపాదించినదంతా ఇందులోనే పెట్టాను. నాకు దీనిలో ముందుకు వెళ్ళటానికి ప్రభుత్వం సహకారం, ఆర్థిక సాయం కావాలి. అందుకే మీ సహకారం కోసం వచ్చాను. ఇది రహస్యంగా జరుగుతున్న మిషన్. ఇప్పటివరకు నా తల్లిదండ్రులు, నా సహచర సైంటిస్ట్ సిమ్రాన్‌కు తప్ప ఇది ఎవ్వరకూ తెలియదు. మీకు ఇంకా పూర్తిగా వివరించగలను. దానికి ఇంకొంచెం సమయం ఇవ్వండి” అంటూ ఇంకా ఏదో చెప్పేలోపే ముఖ్యమంత్రి ఇక వెళ్లొచ్చు అంటూ అసహనంగా గుమ్మం వైపు చేయి చూపిస్తూ కాలింగ్ బెల్ కొట్టాడు.

అంతవరకు నెమ్మదిగా ఉన్న మిహిర్ “సార్. వెళ్లిపోతున్నాం. కానీ వెళ్లే ముందు మీకు రాబోయే మూడు రోజుల్లో జరిగే ఒక ముఖ్య ఘటన చెబుతున్నా. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒక రకంగా భవిష్యవాణి వినిపిస్తున్నాను. ఎల్లుండి సాయంకాలం కల్లా మీ హెల్త్ మినిస్టర్ నారాయణ రావు అకస్మాత్తుగా మరణిస్తారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆయన అలా చనిపోవడం ఒక మిస్టరీగా మారుతుంది. మీ ప్రమేయం లేకుండానే పరిశోధన మొదలవుతుంది. ఇది మీ ప్రభుత్వానికి ఒక మచ్చ లాగ మారుతుంది. వారం తరువాత ప్రతిపక్షాల వత్తిడి తట్టుకోలేక ఈ కేసు సీబీఐకు బదిలీ అవుతుంది. ఆ తరువాత ఏమి జరుగుతుందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు చెప్పను. అప్పుడు ఎలాగూ నన్ను పిలుస్తారు. మీకు ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం కలగాలిగా” అని, “ఇక మీ ఇష్టం” అంటూ అక్కడ నుండి లేచిపోయాడు.

అప్పటిదాకా యథాలాపంగా వింటున్న ముఖ్యమంత్రి బూసిరెడ్డి ఒక్క నిమిషంపాటు స్తబ్దుగా ఉండి పోయాడు.

ఇంతలో ఆయన కొట్టిన కాలింగ్ బెల్ విని నలుగురు సిబ్బంది లోపలికి వచ్చారు. నెమ్మదిగా తేరుకున్న బూసిరెడ్డి మిగతా సిబ్బందిని మరల వెనక్కు వెళ్ళిపొమ్మని, నేను పిలిచే దాకా ఎవ్వరూ లోపలకి రావద్దని చెప్పి, మిహిర్, సిమ్రాన్ లను కూర్చోమని చెప్పాడు.

“సైంటిస్ట్ గారు, నాకు ఇంకా నమ్మశక్యంగా లేదు. అయిన మీరు ఏదో ప్రమాదం అంటూ మా హెల్త్ మినిస్టర్ గురించి మాట్లాడారు. అందుకే కొద్దిగా ఆలోచనలో పడ్డాను. సరే మీకు మరింత సమయం ఇస్తున్నా, ఏం చెబుతారో చెప్పండి. అంతా అయిన తరువాత నమ్మకం కలిగితే తప్పకుండా సహకరిస్తాను. లేకుంటే మీరు వెళ్లిపోవచ్చు. ఈ ప్రాజెక్ట్ దేని గురించి, దీని వల్ల ఉపయోగం ఏమిటి కాస్త వివరించండి” అంటూ మిహిర్ మాటలకు విలువ ఇస్తూ ఆసక్తిగా అడిగాడు ముఖ్యమంత్రి బూసిరెడ్డి.

ముఖ్యమంత్రి మాటలు విన్న మిహిర్, సిమ్రాన్‌లు సంతోషంగా వివరించడానికి ఉద్యుక్తులయ్యారు. మిహిర్ చెబుతుంటే, సిమ్రాన్ లాప్ టాప్‌లో దానికి సంబంధించిన వివరాలు చూపించడం మొదలుపెట్టింది.

“సార్… మా ప్రాజెక్ట్ పేరు 3456. మనం చేసే ఆలోచనలు, పనులు, భవిష్యత్‌లో ఎంత మంచి చేస్తాయో, ఎంత కాలం వాటి వల్ల మనకు ఉపయోగం అన్నది చెబుతుంది. భవిష్యత్‌కు వెళ్లి అక్కడ నుండి మళ్లీ తిరిగి రాగలం. సూక్ష్యంగా చెప్పాలి అంటే ఇది ఒక ‘భవిష్యవాణి దర్శించగల కాలయంత్రం’. ఇప్పుడు మనం భూమ్మీద పాటిస్తున్న పద్ధతులు, అమలు పరుస్తున్న విధానాలు ఇలాగే కొనసాగితే 3456వ సంవత్సరంలో ఎలా ఉంటుందో, మానవ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో, మనుషులు ఎలా ఉంటారో, మన ముందు తరాలు ఏమి బాధలు పడతాయో, వారికి ఎలాంటి కష్టాలు ఇప్పుడు మనం చేసే పనుల వల్ల వస్తాయో వివరంగా దర్శించవచ్చు.

మూడువేల నాలుగు వందల యాభై ఆరో సంవత్సరంలో ఎలా ఉంటారో ఈ లాప్ టాప్‌లో చూడండి. ఇది గ్రాఫిక్స్ కాదు, ఆ సంవత్సరంలో నిజంగా జరిగిన సంఘటన నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు, మనం ఇప్పుడు చేస్తున్న పనుల పర్యవసానమే ఇది.” అంటూ లాప్ టాప్‌లో చూపించడం మొదలు పెట్టాడు.

విస్మయంతో కూడిన ముఖంతో ముఖ్యమంత్రి ఆ వీడియోని తదేకంగా చూడటం మొదలుపెట్టాడు.

భూగోళం అంతా అంధకారంగా ఉంది. ప్రజలంతా భూగృహంలోకి వింత వస్త్రాలు ధరించి నడుస్తున్నారు. మనుషులు అంతా మూడే అడుగులు పొడవు కలిగి, వంటిపై ఎక్కడా జుట్టు అన్నది లేకుండా చర్మం ముడుతలు పడి ఉన్నారు. కనుబొమలు దగ్గర చిన్నటి చారికలా ఉన్నది. చెవిడొప్పలు చాలా చిన్నవిగా, ఉన్నాయా లేవా అన్నట్లు అయిపోయాయి. ఆడవారి, మగవారి ముఖాలకు తేడా లేకుండా పోయింది. ముఖాలలో దైన్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలుగుల్లో ఎలకల్లా భయం భయంగా నడుస్తున్నారు. వాళ్ళు తింటున్న ఆహారం ఏమిటో అర్థం కాకుండా ఉంది. మనుషులు జీవిత కాలం కూడా ఐదోవంతుకు పడిపోయింది.

అలా ముందుకు వెళితే, భూఉపరితలం అంతా బోడి మైదానాలుగా మారి ఉన్నాయి. ఇదివరలో నదులు ప్రవహించినట్లు నల్లటి చారికలు కనబడటం జరిగింది. పర్వతాలు చిన్న గుట్టలుగా జీవం లేకుండా మారాయి. సముద్రాలన్నీ చిక్కగా కెరటాలు సందడి లేకుండా మిగిలాయి. భూమిపై జలపాతాలు, ఇతర జంతుజాలాలు, అడవులు ఏమీ కనిపించడం లేదు. ఏవో కొన్ని ఆకారాలు, తప్ప సముద్రాలలో ఓడలు ఎక్కడా లేవు.

భూమ్మీద ఎక్కడ చూసినా బొద్దింకల మయమే. సముద్రంలో చేపలు పెద్దవిగా ఉన్నా ఈద లేక ఇబ్బంది పడుతున్నాయి. కలియుగాంతం ఎంతో దూరం లేదని చూడంగానే అర్థం అయిపోతోంది. ఆకాశంలో కొన్ని నక్షత్రాలు చాలా పెద్దగా ఎర్రగా కాలిపోతూ కనిపిస్తున్నాయి.

సూర్యుని గమనం కూడా తగ్గిందో లేక దిశ మారిందో అర్థం కాకుండా ఉంది. భూ వాతావరణంలో ఎక్కడా పచ్చదనం కానరాకుండా బూడిద రంగులో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి.

ఆ వీడియోని చూస్తున్న ముఖ్యమంత్రి బూసిరెడ్డికి జరుగుతున్న విషయం ఏమీ అర్ధం కాలేదు. నిజమా లేక ఏమైనా కంప్యూటర్‌లో ఉత్త పరిమాణాలా, ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు ఆలోచనలతో సతమతం అయ్యాడు. అంతలోనే తేరుకొని కాసేపు ఆ వీడియోని ఆపమని సౌజ్ఞ చేసాడు.

ముఖ్యమంత్రి గారిని అర్ధం చేసుకున్న సిమ్రాన్ ఆ వీడియోని అక్కడితో ఆపింది. ముఖ్యమంత్రి బూసిరెడ్డి, మిహిర్ వైపు తిరిగి “ఇదంతా నిజమా లేక భ్రమా.. అలా ఎలా భవిష్యత్‌కు వెళ్లి తెలుసుకోగలుగుతారు. నమ్మశక్యంగా లేదు. ప్రజలు అంతా భూగృహాల్లోనే ఎందుకు ఉన్నారు? వాళ్లంతా అదేదో విచిత్ర వస్త్రధారణలో ఎందుకు ఉన్నారు? అసలు అది మన దేశమేనా. నదులు మరీ అంతలా ఎండిపోయాయి ఏమిటి? వానలు పడటం లేదా? అసలు పచ్చదనమే లేకుండా, పర్వతాలు, కోనలు, జలపాతాలు లేకుండా భూమి అంత బొడిగా ఎలా ఉంది. ఆ సముద్రంలో ఏమైనా బతుకుతాయా? ప్రజల ఆహారం ఏమిటి? నక్షత్రాలు ఎర్రగా ఎలా మండిపోతున్నాయి? ప్రశాంతంగా ఉండాల్సిన ఆకాశం ఎర్రగా ఉంది. అలా ఆకాశం ఎర్రగా ఉంటే, అయితే ఏదో ఉత్పాతానికి హేతువట. మా చిన్నప్పుడు అనుకునేవారు. వాతావరణంలో ఇంత మార్పు జరుగుతుందా? మరి మనం ఇప్పుడు అమలు చేస్తున్న ‘మనం వనం’ కార్యక్రమాలు పనిచేయలేదా, కొనసాగింపు లేదా? అసలు ఈ ప్రాజెక్ట్ నిజమేనా? ఇలా జరుగుతుంది అన్నది నిజమేనా?” అంటూ ఎన్నో సందేహాలు, ప్రశ్నలు పరంపర కురిపించాడు.

అంతా విన్న మిహిర్ చిన్నగా నవ్వి వివరించడం మొదలు పెట్టాడు.

“ఇదంతా భ్రమ కాదు సార్. కటువైన నిజం. ఈరోజు ఉన్న మన తరం తీసుకున్న స్వార్థ నిర్ణయాలు, చేస్తున్న ఆగడాలు, ప్రకృతితో ఆడుతున్న ఆటల పర్యవసానమే ఇది. భావితరాలకు మనం ఇవ్వబోయే బహుమానం. ఇదంతా ఏదో మీకు గ్రాఫిక్స్‌తో స్టూడియోలో చేసిన వీడియో కాదు. ఊహించి రాసిన స్క్రిప్ట్ కాదు. ఇదంతా 3456 సంవత్సరంలో ప్రజల జీవన గతి. ఇలాంటి పరిస్థితులు రాబోవు తరాలకు రాకుండా, ఇప్పుడు ఉన్న తరాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు బాధ్యత తీసుకోవాలి. గ్లోబల్ వార్నింగ్‌ను ప్రతిక్షణం నిర్లక్ష్యం చేశారు. ఈ బాధలన్నీ మనం కాదుగా, మాకెందులే అన్న స్వార్ధ ధోరణే ఈ స్థితికి తీసుకువచ్చింది.

ప్రతి మనిషి, ప్రతి ప్రభుత్వం, ప్రతీ దేశం, తమ తమ స్వార్థం కోసమే పని చేసారు, చేస్తున్నారు. ఎవ్వరికీ భవిష్యత్‌పై దార్శనికత లేదు. ఉన్న కొద్దిమంది మాటలు ఎవ్వరూ నమ్మటంలేదు. వారిని హేళనగాను, వారి సిద్ధాంతాలను అతిగా ఊహించే ఊహాలుగాను అనుమానించి అవమానిస్తున్నారు, ప్రకృతితో మమైకం అయి జీవించాలి. మనమే కాదు, ఈ గ్రహంపై ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటి మనుగడ ప్రశ్నార్ధకంగా కాకుండా ఉంచమని, ఒకవేళ అలా చేయక పోతే జీవన చక్రం దెబ్బతిని సమతుల్యత కొల్పోతుందని ఎన్నిసార్లు నెత్తి నోరు బాదుకుంటున్నా, వినక, చూసీచూడనట్టు పనిచేసిన మన ప్రభుత్వ యంత్రాంగం విధానాల వల్ల ఇలా జరిగింది. ఇది ఏదో ఒక్క దేశం వల్ల జరగలేదు. మొత్తం మానవ జాతి తప్పిదాలకు భూగ్రహం అలా దర్శనమిస్తోంది.

ఇలాంటి పరిస్థితి ఎన్నో వేల సంవత్సరాల తరువాత రావాలి. కానీ మనం చేసిన అకృత్యాల వల్ల చాలా తోందరగానే వచ్చేసింది. కలియుగాంతం ఎప్పుడో, ఎక్కడో లేదు, మనకు మనమే దాన్ని ఆహ్వానించుకుంటున్నాము. మనం ఉన్న ఈ శతాబ్దం చివరకే మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది. దాని ప్రభావం ఈ విధంగా ఉంటుంది. రేడియో ధార్మికత భూగ్రహం అంతా ఆవరించి పరిణామ క్రమం మారి పోయింది. ఇప్పుడు ఉన్న ఆరడుగుల ఎత్తు, మూడు అడుగులకు కుదించుకుపోయింది. చెవి డొప్పలు చిన్నగా కుచించుకు పోయాయి.వాళ్ళు ధరించింది వింత వస్త్రధారణ రేడియో ధార్మికత సోకకుండా ప్రత్యేకంగా చేసింది. వారి ఆహారం సిలికాన్, కార్బన్ నుండి తయారు చేసుకున్న పిండి పదార్ధాలు. వారు తాగే నీరు శుద్ధి చేయబడిన సముద్ర జలం. ఒకరకంగా చెప్పాలంటే వారు తినేది, త్రాగేది విషం మాత్రమే. అందుకే వారి ఆయుః ప్రమాణం ఇరవై సంవత్సరాలు దాటదు.

ఆడవారికి, మగవారికి జన్యుపరమైన మార్పులు ఆరో ఏటకే వచ్చేస్తాయి. వారి వంటిమీద, నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా ఉండదు, చర్మం ముడతలు పడి ఉంటుంది. వీరికి ప్రాణ వాయువు, నీరు అంతా రేషన్‌లో తీసుకోవాలి. జాగ్రత్తగా వాడుకోవాలి. ఇక ఇతర జీవజాలం చాలా మటుకు నాశనం అయినట్లే. రేడియేషన్ తట్టుకోగల బొద్దింకలు మాత్రమే ఈ భూమిపై ఉన్నాయి. అందుకే అన్ని బొద్దింకల పుట్టలు. బహుశా ఈపాటికే మీకు మన భావితరాల జీవితం, జీవన విధానం ఎలా ఉండబోతోందో అర్ధం అయ్యింది కదా.

ఇక భూమి ఉపరితలంపై అధిక వేడిమి, రేడియేషన్, ఇసుక నేలలు, కర్బన వాయువు తప్ప మరోటి ఏమీ లేదు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇప్పుడు ఉన్నట్లుగా రెండు వందల దేశాలు, ఎన్నో జాతులు, ఎన్నో భాషలు, ఎన్నో సంస్కృతులు ఏమీ లేవు. ఉన్నది, కొద్దిగా మిగిలిన మానవ జాతే. వారికీ బ్రతుకు దుర్భరంగా ఉంటే దేశాలు అంటూ కొట్టుకునే ఆలోచనే రావటం లేదు.

సముద్రాలను చూసారు కదా, చిక్కగా ఉన్నాయి. పొటాషియం, సోడియం లవణాలు పెరిగి, లవణ సాంద్రత పెరిగింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ‘డెడ్ సీ’ ప్రపంచం అంతా విస్తరించింది. సముద్ర జలాలు ఎర్రగా లేదా పింక్ రంగులో ఉండటానికి కారణం అదే. ఈ పరిస్థితి తట్టుకున్న కొన్ని సముద్ర చేపలు మిగిలి అతి కష్టం మీద ఈదుతున్నాయి. మనం ఈ సంద్రంలో పడినా మునిగిపోము. దానికి ఉన్న చిక్కదనం వల్ల జరగదు.

మనం చేసిన దురాగతానికి మన గ్రహమే కాదు అంతరిక్షం కూడా పాడై పోయింది. స్టార్ వార్స్ అంటూ యుద్ధోన్మాదంతో పనికిరాని ప్రయోగాలు చేసి, గ్రహాంతర ప్రయాణాలు అంటూ ప్రయత్నం చేస్తూనే ప్రకృతి విరుద్ధంగా చేయవలసిన పనులు చేశారు.

అందువల్ల అంతరిక్షంలో కూడా కొన్ని నక్షత్రాలు వాటి కాలం కన్నా ముందే మండి పోయి కూలిపోతున్నాయ్. అందువల్లే అవి ఎర్రగా వెలిగిపోతున్నాయి. అదే కాకుండా ఆకాశం కూడా కలుషితమయి ఎర్రగా మారి పోయింది. సూర్యుని గమనం కూడా మారి ఋతువులు క్రమం తప్పాయి. వాటి వల్ల వర్షాకాలం తగ్గింది. ప్రతి ఐదు ఏళ్లకు మాత్రమే కొద్దీ వానలు పడుతున్నాయి. దాని పర్యవసానమే నదులు, జలపాతాలు, పూర్తిగా ఎండిపోవటం.

ప్రతీ వ్యర్ధాన్ని సముద్రంలో కలిపివేయటం వల్ల అది కూడా పూర్తిగా కలుషితం అయ్యింది. లవణాలు సాంద్రత పెరిగి అందులో జీవించే జల చరాలు చాలా మటుకు చనిపోయాయి. అలాగే మంచు ఖండాలు, పర్వతాలు కరిగిపోయి ప్రపంచం కుదించుకు పోయింది. ఇప్పుడు మిగిలిన భూభాగం ఈ భారతదేశం అంత మాత్రమే మిగిలింది. మిగతాది అంతా సముద్రమే. ఇదంతా మన మానవ జాతి స్వయం కృతాపరాధం. జీవానికి అనువుగా ఉన్న గ్రహన్ని మనం ఇలా తయారు చేసుకున్నాం.

ముఖ్యమంత్రి గారు మీరు విన్నది,. చూసినది అంతా 3456 సంవత్సరంలో జరుగుతున్నదే మనం చూస్తున్నాం ఇందులో అబద్ధం ఏమీలేదు. మీరు ఈ ప్రాజెక్టును నమ్మవచ్చు. మీకు నమ్మకం, వీలు కుదరగానే మిమ్మల్ని ఒకసారి భవిష్యత్‌కు తీసుకు వెడతాను” అంటూ ముగించాడు.

వాళ్ళ మాటలు విన్న ముఖ్యమంత్రి బూసిరెడ్డికి నోటిలో మాటలు రాలేదు. ఒక్కసారి భయం కమ్మింది. నిజంగా ఇంత దారుణంగా ఉంటుందా. అసలు ఇది కలా, నిజమా అర్ధం కాకుండా ఉండటంతో మౌనంగా ఉండిపోయాడు.

“సార్ ఇంకా ఏమైనా మీ సందేహాలు ఉంటే అడిగితే చెబుతాను” అంటూ మిహిర్ నెమ్మదిగా చెప్పాడు.

కాసేపు మౌనం తరువాత ముఖ్యమంత్రి “మిహిర్ గారు…. ఇదేదో ఇంకా కలగానే ఉంది. నమ్మలేకపోతున్నా. నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి. నేను ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. మీకు ఇవ్వవలసిన సహకారం, ఆర్థికసాయం అన్నీ అందిస్తాను. ఒక్కరోజు సమయం ఇవ్వండి” అంటూ తన అభిప్రాయం చెప్పాడు.

ఆయన మాటలు విన్న సిమ్రాన్, మిహిర్‌లకు చాలా ఆనందం వేసింది. ఆయన మాటలకు సరే అని అక్కడ నుండి బయలుదేరారు. అలా వెళ్లిపోతున్న దారిలో సిమ్రాన్, మిహిర్‌తో “ఎందువల్ల ఇవాళే మన విషయం ముఖ్యమంత్రి తేల్చలేదు. పూర్తిగా ప్రాజెక్ట్ అర్ధం అయ్యింది కదా”

“హహహ… అర్ధం కాలేదా… ఇంకో మూడు రోజుల దాకా మనకు పిలుపు రాదు. మన భవిష్యవాణి నిజమా కాదా అన్న మీమాంస. ఓ రెండు రోజులు పోయిన తరువాత జరిగితే మనని పిలుస్తారు. గుర్తుపెట్టుకో. మనం వచ్చే గురువారం సాయంత్రం మూడు గంటలకు ఆయనతో భేటీ అవుతాం. ఇది తధ్యం. ఇదే జరగబోయే భవిష్యత్తు. ఆయనతో అత్యవసర సమావేశం ఉంటుంది” అంటూ “మనం ఈ లోపు కొన్ని సమకూర్చు కోవాలి. నేను చెబుతాను సిద్ధం చేయి” అంటూ తమ పనుల్లో మునిగిపోయారు.

***

మూడు రోజులు గడిచాయి, మిహిర్ చెప్పినట్లే బుధవారం ఉదయం కల్లా నారాయణ రావు చనిపోవడం, అనుమానం అంతా రాజకీయ ప్రత్యర్థి బూసిరెడ్డి ఈ హత్య గావించినట్లు ప్రజలు, పత్రికలు గగ్గోలు పెట్టడం మొదలయింది. ఈ మరణాన్ని ఒక రాజకీయ హత్యగా అభివర్ణించారు.

అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మిహిర్, సిమ్రాన్ లతో ఏకాంతంగా సమావేశం అయ్యాడు.

అందులో బూసిరెడ్డి మాట్లాడుతూ “మిహిర్ గారు… తిన్నంగా ముఖ్య విషయానికి వచ్చేద్దాం. మీరు చెప్పిందే జరిగింది. బహుశా జరిగే పరిణామాలు కూడా మీకు తెలిసే ఉంటాయి. ఇది మావాళ్లు చేసిన రాజకీయ హత్య. దీన్నుండి ఏదో రకంగా బయట పడాలి. కానీ ఏం నిర్ణయం తీసుకుంటే మాకు కలసి వస్తుందో మీరే చెప్పాలి. దానికి మీ కష్టానికి ఫలితం ఇచ్చేస్తా. మీరు ఎంత అడిగితే అంత సిద్ధం చేయిస్తాను. ముందు ఈ గండం నుంచి గట్టు ఎక్కించండి. తరువాత మీరు, నేను కలసి ఈ ప్రాజెక్టు ను బలోపేతం చేద్దాం. దాని ద్వారా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలేద్దాం” అంటూ పక్కా రాజకీయాన్ని రంగరించి మాట్లాడాడు.

అంతా వింటున్న సిమ్రాన్‌కు కోపం వచ్చింది.. కానీ మిహిర్ మాత్రం నవ్వుతూ “ముఖ్యమంత్రి గారు ఇదేదో మొన్ననే అడిగి ఉంటే కాస్త చవకగా వచ్చేవాడిని కదా, ఈ ప్రమాదం రాకుండా తప్పేది. కథ ఇంకోలా ఉండేది. ఇప్పుడు పరిస్థితి చేయి దాటింది. అవసరం మీది. అందువల్ల నాకు ఒక ముప్పై కోట్లు ముందుగా ముట్టజెబితే, మిమ్మల్ని ఈ గండంనుండి గట్టు ఎక్కిస్తాను. అదేవిధంగా మీరు ఎల్లకాలం ఇదే పీఠంపై ఉండేలా అద్బుతమైన సలహా ఇస్తాను. అర్థం అయ్యింది అనుకుంటా. కానీ మీరు ఒక చిన్న త్యాగాన్ని కూడా చెయ్యాలి. మరి మీరు సరే అంటే ఏర్పాట్లు చేయండి” అంటూ ముగించాడు.

మిహిర్ మాటలకు సిమ్రాన్ విస్మయంగా చూస్తుంటే, బూసిరెడ్డి ఒక్క క్షణం ఆగి ఆలోచనలో పడి “మిహిర్ గారు… మీరు ఎలా అంటే అలా…. ముందు నన్ను బయట పడియండి.”అంటూ క్లుప్తంగా ముగించాడు.

ముఖ్యమంత్రి మాటలు విన్న మిహిర్ గొంతు సవరించుకుని ” సార్… నాకు ఇచ్చే ముప్పై కోట్లలో, మూడు కోట్లు వందల కట్టలు మాత్రమే కావాలి. మిగతాది బంగారం ఇటుకలు, కణికలు రూపంలో కావాలి. అదీ ఒక గంటలో సమకూర్చాలి. అదే నా ప్రస్తుత ఫీజు. ఇక రెండో విషయంకు వస్తే మీ ఉంచుకున్నామే కొడుకు రేపు ఉదయం కల్లా ఆత్మహత్య చేసుకోవాలి. అంటే అతడు ఆత్మత్యాగం చేస్తే ఇంకో రెండు ఎన్నికలు అయ్యే వరకు మీకు ఢోకా ఉండదు. అతని ఆత్మహత్యకు, నారాయణ రావుకు ముడి పెట్టండి… మీకు నేను వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ కేసు దానంతట అదే సమసి పోతుంది. మనం వచ్చే నెల పదో తారీఖు పార్టీ చేసుకోవచ్చు.” అంటూ ముగించాడు మిహిర్.

మిహిర్ మాటలకు తలొగ్గిన ముఖ్యమంత్రి చాలా త్వరగానే అన్ని ఏర్పాట్లు మిహిర్ కార్లో చేసి సాగనంపాడు. డబ్బుతో బయటకు వచ్చిన మిహిర్ డ్రైవింగ్ చేస్తుంటే కోపంతో కుతకుతలాడిపోయింది సిమ్రాన్… మిహిర్ కూడా అమ్ముడై పోయాడని. సిమ్రాన్ ముఖం చూస్తూ నవ్వుకుంటూ ఇంటికి పోయాడు. ఇంట్లోకి వెళ్లిన సిమ్రాన్ కోపం దిగక భోజనం చేయకుండానే నిద్రపోడానికి వెళ్లి పోయింది.

మిహిర్ మాత్రం ఏవో సద్దుకుంటూ రాత్రంతా గడిపాడు.

***

“హేయ్… మిహిర్… బయట చూడు. మనం ఎక్కడ ఉన్నాం. ఏదో కొత్త ప్రదేశంలో ఉన్నావేమో.” అంటూ నిద్రపోతున్న మిహిర్‌ను లేపి అడిగింది సిమ్రాన్.

“ఏమైంది” అంటూ లేచిన మిహిర్ కిటికిలోంచి బయటకు చూసి సిమ్రాన్ కేసి నవ్వాడు.

“సిమ్రాన్… మనం కాలయంత్రంలో ఇంకో పన్నెండు సంవత్సరాలు ముందుకు వచ్చేసాము. బూసిరెడ్డి కథ ముగిసింది. మనం వెళ్ళంగానే మన మీద హత్యాప్రయత్నంకు సిద్ధం అయ్యాడు. అలాంటిది ముందే జరుగుతుంది కాబట్టే నేను వాడిని తప్పుడు సలహా ఇచ్చి తప్పుడు దోవ పట్టించాను. దాని వల్ల వాడు బాగా ఇరుక్కుని, ఇంట్లో పిల్లలు కొట్టుకుని అందరూ చచ్చారు. అలాంటి స్వార్ధ రాజకీయ నాయకుడి వల్ల దేశానికి ఏమీ ప్రయోజనం ఉండదు. ఇక మనకు ఆ భయం లేదు. మనం కాలయంత్రంలో వేరే రాష్ట్రానికి వచ్చేసాం. మన కుటుంబం అంతా క్షేమం. ఇక్కడ ఒక గొప్ప నాయకుడితో మనకు రేపే పరిచయం. అతను దార్శనికుడు. అతని వల్ల మన ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. మనం చేయకలిగే ప్రయత్నం చేసి ఈ గ్రహాన్ని కాపాడుకుందాం.” అంటూ ముగించాడు మిహిర్.

మిహిర్ మాటలను నమ్మలేకుండా వింటూ సిమ్రాన్ “నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. నువ్వు బంగారం, డబ్బులు వంద నోట్లు ఎందుకు ఆడిగావ్… అర్థం కాలేదు.” అంటూ ఆత్రంగా అడిగింది.

ఆమె మాటలకు పెద్దగా నవ్వుతూ “అదా… ఇప్పుడు బంగారం తులం ఎంతో తెలుసా…రెండు లక్షలు. అంటే మనం తెచ్చిన బంగారం ఖరీదు… ఇప్పుడు ఆరు రెట్లు. అదీ విషయం. ఇక వంద నోట్లా, అవే ఇప్పుడు చెల్లుబాటు అవుతాయి. ఐదు వందల నోట్లు ఏడాది క్రితం రద్దు అయిపోయాయి. అర్థం అయ్యిందా” అంటూ ఆమె నెత్తిపై చిన్న మొట్టికాయ వేసి నవ్వాడు. ఇద్దరూ నవ్వుకుంటూ తదుపరి కార్యక్రమంలో పడిపోయారు.

Exit mobile version