Site icon Sanchika

పుడమితల్లి నేస్తం-1

[dropcap]త[/dropcap]న కళ్ళ ముందు అఖండ జలరాశి గోదావరి తల్లి, వృద్ధ గంగమ్మ, ఎక్కడో నాసిక్ త్రయంబకేశ్వరంలో పుట్టి, పారాడుతూ, పరుగులు పెడుతూ, ఉప్పొంగుతూ, ఒక్కొక్క సారి ఉధృతిగానూ, నెమ్మదిగానూ, ప్రవహిస్తూ, భూమాతతో పచ్చని చెలిమి చేస్తూ, మహారాష్ట్ర నుండి, తెలంగాణా మీదుగా ప్రవహిస్తూ అంతర్వేది వద్ద బంగాశాఖాతంలో సంగమించే దృశ్యం తన కళ్ళముందు కనిపిస్తూ వుంటుంది. మానవ జీవిత గమనానికి, ఈ గోదావరి తల్లి నడకకూ ఏదో సామ్యం కనిపిస్తుంది. అనుకున్నారు విజయరామయ్య. అరవై ఏళ్ళ క్రితం, నాన్న పోయినపుడు కుటుంబ బాధ్యతలు బుజాన వేసుకుని, చదువు మధ్యలో ఆగిపోయిన స్థితిలో, తన దుఃఖాన్ని ఈ తల్లి ఒడ్డున కూర్చుని వెళ్ళబోసుకున్నాడు. ఆనాడు తన మనసు ఒక ఉద్వేగాల స్రవంతి, గమ్యం తెలియని ప్రయాణం.

తన తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకమొచ్చాయి విజయరామయ్యకు.

“ఈ గోదారమ్మ ప్రయాణం లాంటిదే ఈ మానవ జీవితం కూడా నాయనా! ఎక్కడో పుట్టి, ఎక్కడో నడిచి, మరెక్కడో ముగిసిపోతుంది, కలిసిపోతుంది. ఈ ప్రయాణంలో నేల తల్లితో పాటూ బండలనూ, కొండలనూ కూడా ప్రేమించిన ఈ జలధార తన ప్రవాహ రూపాన్ని మార్చుకుంటూ, ఎక్కడా చిక్కుబడక, సాగర సంగమం చేసే ప్రయాణమే నీకు ఆదర్శం నాయనా! నాన్న కోసం బెంగపడకు, ఒక మనిషి తోనో ఒక బంధం తోనో నీ జీవితం ముడిపడలేదు. అడుగిడిన ప్రతీ ఊరూ నీ ఊరే, ఎదురైన ప్రతి మనిషీ నీవాడే, ఏది నీదికాదు, నీది కానిది ఏదీ లేదు. నిరుత్సాహపడకు, అధైర్యపడకు. నలుగురికి ఉపకారం చేసే మార్గంలో వెళ్ళు నాయనా!” అంటూ తల్లి చెప్పిన మాటలను తాను నిత్యం స్మరించుకుంటాడు. అపుడపుడూ ఇలా గోదావరి ఒడ్డున కూర్చుని పెడుతుంటాడు.

ఆకాశం పసుపు, ఎరుపు రంగులతో గోదావరిని అభిషేకిస్తోంది. మార్గశిర మాసం ప్రవేశించింది. చలిగాలి తిరిగింది సమయం ఆరుగంట లైంది. జేబులో సెల్ మ్రోగడంతా ఉలిక్కిపడ్డారు విజయ రామయ్య.

“నాన్నా ఎక్కడున్నారు? నేనూ పిల్లలూ వచ్చి గంటసేపు అయింది , పిల్లలు తాతయ్య ఏరీ? అని మీకోసం అడుగుతున్నారు.” సునంద, పెద్దమ్మాయి అడుగుతోంది ఫోనులో.

“అమ్మా!! కొడేరు గోదావరి గట్టున కూర్చున్నాను. ఇదిగో, ఇపుడే బయలుదేరుతున్నాను. అరగంటలో మీ ముందుంటాను” అని చెప్పి గబగబా లేవ బోయి, కాస్త నిభాయించుకుని, నెమ్మదిగా లేచారు ఎనభై రెండేళ్ళ విజయరామయ్యగారు. రెండడుగులు, వెయ్యగానే డ్రయివర్ వచ్చి కారు డోరు తీసి పట్టుకున్నాడు. “కేశవులూ! అమ్మాయి వచ్చింది హైదరాబాదు నించి, ఇంటికివెళ్ళిపోదాం” అన్నారు.

“ఆయ్! అలాగే నండయ్యా!” అన్నాడు కేశవులు.

ఒకసారి తలతిప్పి గోదావరి తల్లికి నమస్కరించుకుని కారులో కూర్చొన్నారు విజయ రామయ్య. కారు కదిలింది.. కారు ఆచంట గ్రామంలో ప్రవేశించి రామలింగేశ్వరాలయం మీదుగా కచేరీసావిడి చేరి కుడివైపుకు మలుపు తిరిగింది. మరొక పది నిమిషాల్లో పచ్చరంగు డాబాముందు ఆగింది. ఇంటి ముందున్న పందిరి మీద అల్లుకుని గుత్తులుగా పూసిన మధుమాలతి పూలు, దీపకాంతిలో తెల్లగా మెరుస్తున్నాయి. పరిసరాల్లోకి వ్యాపించిన సన్నని పరిమళం ఆహ్లాదంగా వుంది “ఈ ఇంటితో తన అనుబంధం తన వయసు తోనే పెరిగింది. అమ్మ, నాన్న, తన అన్నలు అయిదుగురూ, గుత్తిలో కాయల్లా ఒక్కొక్కరూ రాలిపోయారు. ఆరుగురి అన్నదమ్ముల్లో చివరివాడు తాను, ఏడవ సంతానం లక్ష్మి తన చెల్లెలు: ఇద్దరం మిగిలాం. జ్ఞాపకాల్లోంచి దిగి, ఇంట్లోకి అడుగు పెట్టారు విజయరామయ్య.

“అదిగో… తాతయ్య వచ్చేశారు” కూతురు సునంద, మనవడు పదేళ్ల విశ్వతేజ, మనవరాలు పన్నెండు సంవత్సరాల వయసున్న అనన్య ఎదురువచ్చారు. ఆపేక్షగా అల్లుకున్న పిల్లల్ని దగ్గరకు తీసుకున్నారు విజయ రామయ్య.

“చలిగాలి వేస్తోంది నాన్నా! ఈ వేళప్పుడు ఒంటి మీద షాల్, స్వెట్టర్ కూడా లేకుండా ఎలా వెళ్ళారు నాన్నా?” తండ్రి బుజం చుట్టూ చేయి వేసి ప్రేమగా అడిగింది సునంద.

“అలవాటే కదురా! ఫరవాలేదు. నాకేం చలిగాలేదు. అల్లుడు గారు కూడా వచ్చివుంటే బావుండేది. పోనీలే నీతో పిల్లల్ని తీసుకోచ్చావు అదే సంతోషం. మీ అమ్మ మనవల కోసం కలవరిస్తోంది.”

“అవును నాన్నా! ఈ కరోనా బాధ మూలంగా పిల్లలకు సెలవలు ఇచ్చారు. ఈసారి వీళ్ళు మీ దగ్గర పదిరోజులుంటారు. మాతోపాటూ మా బావగారి అమ్మాయి అమృత కూడా వచ్చింది.

గోదావరి జిల్లాల లోని పల్లెటూరి అందాలు చూస్తుందిట. అదీగాక తనకు ఎ.జి. బియస్.సీ.లో చేరాలని వుందిట. మిమ్మల్ని కలసి వ్యవసాయరంగం గురించి ఏవో అడుగుతుందని నాతో కూడా తీసుకొచ్చాను.” అంది సునంద విజయరామయ్య పెద్దకూతురు.

“నమస్తే! తాతగారూ! వెరీ గ్లాడ్ టూ మీట్ యూ! సునంద పిన్ని మీ గురించి చాలా చెప్పింది.” పద్దేనిమిదేళ్ళ అమృత విజయ రామయ్యతో కరచాలనం చేసింది. “చాలా సంతోషం తల్లీ, నువ్వు మా వూరుకు రావడం. బాగా చిన్న పిల్లపుడు చూశాను నిన్ను ఏం చదువుతున్నావు?”

“ఇంటరు పూర్తి అయింది. హైదరాబాదులోనే మా అమ్మమ్మ గారింట్లో వుండి చదువుతున్నాను.”

“మీ అమ్మా! నాన్నగారూ, అమెరికాలో వుంటున్నారుగా, మరి నువ్వు వెళ్ళలేదా అక్కడకి?”

“అమ్మ అక్కడకు వచ్చి మెడిసిన్ చదువుకోమంటోంది. ఇంకా నిర్ణయించుకోలేదు. సెలవల్లో వెళ్ళి వస్తున్నానండీ. మై పేరెంట్సే ఆర్ డాక్టర్స్ దే లీడ్ ఏ వెరీ బిజీ లైఫ్ తాతగారూ!”

“నాకు తెలుసును మీ అమ్మా, నాన్నగారు” అన్నాడు నవ్వి విజయరామయ్య.

“నాన్నా! ఎల్లుండి ప్లైట్‌కు నేను వెడతాను” అంది సునంద.

“ఈసారి అయినా నాలుగు రోజులుంటుందనుకున్నాను.” నిష్ఠూరంగా అంది విజయరామయ్య గారి భార్య, వసుధ.

“నీకు తెలిసిందేగా నాన్నా!” అంది బాధగా సునంద. అల్లుడు చేస్తున్న వ్యాపారాల్లో సునంద కూడా పాలు పంచుకొంటుందని తెలుసు విజయరామయ్యకు.

 “ఈ రెండు రోజులైనా మీతో అమ్మతో సంతోషంగా గడుపుతాను” అంటూ తల్లిని వాటేసుకుంది సునంద.

‘చెల్లి కంటే నేను బెటర్ కదు.నాన్నా?” అంది. విజయ రామయ్య చిన్న కూతురు, అల్లుడు, మనవరాలు అమెరికాలో వుండి, రెండు మూడేళ్ళ కొకసారి వచ్చివెడుతుంటారు. పిల్లల రాకతో పండుగ సంబరం వచ్చిందని తృప్తి పడ్డారు దంపతులు

తూరుపు తెల్లవారకుండానే అమృత నిద్రలేచింది. సునంద పిన్ని హైదరాబాద్‌కు వెళ్ళిపోయింది. డ్రైవర్ కేశవులు, రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు దింపి వచ్చాడు. పిన్ని అంటే తనకు ఎంతోఇష్టం, అమ్మ, నాన్న దూరంగా వున్న లోటుని సునంద పిన్నిభర్తీ చేసింది. తను పుట్టినపుడు అమ్మ అమెరికాలో మెడిసిన్ చదువుకుంటూ ఉండేది. అందుకని అమ్మమ్మ తనను పెంచి పెద్ద చేసింది. బాబయ్య శ్రీధర్, సునంద పిన్నికి తాను బాగా చేరువైంది. కుటుంబ విలువలు, మనుషుల మధ్య ఆత్మీయతలు ఇవన్నీ పిన్ని వల్లనే తనకు అనుభవంలోకి వచ్చాయి. పిన్ని ఎపుడూ తాతగారు విజయ రామయ్యగారి గురించి చెబుతూవుండేది. తన చిన్న వయసులోనే తండ్రి పోయిన కారణంగా ఇంటరులో చదువు ఆపి తండ్రి ఆనారోగ్య కారణంగా అప్పుల పాలైన కుటుంబాన్ని నిలబెట్టేందుకు, బాధ్యతను బుజాన వేసుకుని వ్యవసాయ క్షేత్రంలో పాదం మోపి, వ్యవసాయరంగాన్నే ఒక హరిత విప్లవంతో ముందుకు నడిపించిన ఘనత మా నాన్నది అమృతా!” అని చెప్పేది పిన్ని.. ‘ఇపుడు స్వయంగా ఈ వూరు వచ్చింది ఎన్నో తెలుసుకోవాలి’ అని అనుకుంది అమృత.

చీకటిరంగును ఒదిలించుకుని తూరుపు ఎర్రబడింది. విజయరామయ్య గారి మేడ ఎదురుగా కనిపించేదూరంలో ఒక పెద్ద చెరువు. ఆ గట్టునే ఆనుకున్న రామలింగేశ్వర ఆలయం నించి గంటలు మ్రోగుతున్న శబ్దం వినబడుతోంది. ఎత్తైన గాలి గోపురం మీద ఎగురుతూ రామ చిలుకలూ, పావురాసందడి చేస్తున్నాయి. రామలింగేశ్వారాలయం పక్కనేవున్న గంధర్వ మహల్ చాలా శోభయమానంగా వుంది. ఈమహల్ లో పధ్ధెనిమిది పడకగదులు నూట అయిదు కోటగుమ్మాలు నాలుగు పెద్ద హాల్సు వుంటాయని పిన్ని చెప్పింది. ఇది రాజస్తానీ ఆర్కిటెక్చర్‌తో నిర్మించబడి వంద సంవత్సరాలు అవుతోందని పిన్ని చెప్పింది. అందమైన చెక్కడంతో బురుజులతో చిన్నరాజభవనంలా వుంటుంది. దృశ్యాన్ని కొంత మంచు తెరలు కప్పుతున్నాయి. అమృత డాబా పైన నిలుచుని ఊరి అందాల్ని చూస్తోంది. కోట చుట్టూ రక్షక భటుల్లా నిలుచున్న కొబ్బరి చెట్లు వూరి చుట్టూ పచ్చని వలయాకారంలో కనిపిస్తున్నాయి. కిందకు చూస్తే, పిట్టగోడనానుకుని పూసిన రంగురంగుల మందారాలూ, పచ్చ, తెలుపు చేమంతులూ, వీధి వరండా గ్రిల్‌కు పాకిన జూకా మల్లి తీగ నిండుగా విరబూసిన పూవులు, పెరట్లో వుంచిన లిల్లీ మొక్కల మడులు, మరువం, కనకాబరం,ఇంకా పూర్తిగా విచ్చుకోని గులాబీ పూల నించి వీస్తున్న గాలి, సుగంధాలను తీసికొస్తూంది.

సిటీ లైఫ్ నించి, కరోనా హవుస్ అరెస్ట్ నుంచీ లభించిన స్వేచ్ఛ ఇది. అమృతకు చాలా సంతోషంగా వుంది ఇక్కడకు రావడం

“అమృతా! పాలు తాగుతావా కాఫీ కలపనా?” పిలిచింది వసుధ

“కాఫీయే అమ్మమ్మా ! వస్తున్నాను.” అంది.

“ఇంత పెద్ద డైనింగ్ టేబులా! మైగాడ్” అంది. సుమారు పాతికమంది ఓకేసారి కూర్చుని తినేందుకు సరిపడా నైజులో వున్న టేబుల్ని చూసి అడిగింది అమృత.

“మీ తాతయ్య కోసం వచ్చే అగ్రికల్చరల్ సైంటిస్టుల కోసం ఈ ఏర్పాటు చేశారు. అందరి భోజనాలూ ఇక్కడే కదా!” అంది.

“ఇంతమందికీ మీరే వండేవారా?”

“అవునమ్మా! అయితే నాకు సాయం చేయడానికి ఇద్దరు మనుషులు వుండేవారు.”

“అమ్మతా! మార్నింగ్ వాక్‌కు వస్తావా?”

“రెండు నిమిషాలు తాతగారూ!”

ఇద్దరూ చెరువుగట్టు పక్కనే నడుస్తున్నారు.. “అమృతా! ఈ శివాలయంలోని స్వామి శ్రీరామలింగేశ్వరుడు అమ్మవారు పార్వతీదేవి ఏటా శివరాత్రి ఉత్సవాలు అయిదు రోజులు ఘనంగా జరుగుతాయి. అన్నదానానికి రెండు వందల కేజీల బియ్యం, మన ఇంటి నుంచి పంపుతాము, గొప్ప న్నత్యకళాకారులు, నాటక పరిషత్తుల వారు వచ్చి ఇక్కడ ప్రదర్శనలు యిస్తారు. చుట్టు పక్కల గ్రామాల నించి వందల మంది ప్రజలు ఈ తీర్ధానికి వస్తారు.”

“ఇలా రోజూ ఎంతదూరం నడుస్తారు?”

“ఒక కిలోమీటరు…”

“మీ వయసెంత తాతగారూ?”

“నాకు ఎనభై రెండు నిండాయి..”

“మైగాడ్! అలసట అనిపించదా?”

“నాకు షుగరు, బి.పి లాంటి సమస్యలు ఏవీ లేవమ్మా! ఇప్పటికీపోలం వెళ్ళి వస్తూంటాను.”

“మరి నీ వయసెంత? అడిగారు నవ్వుతూ. ఐ హేవ్ కంప్లీటేడ్ సెవెంటీన్ అంది.

‘నాకంటే పెద్దదానివి కొంచం మరి చూడు అందుకే నడవలేకపోతున్నావు’ అని నవ్వారు

“యూ నాటీ! తాతగారూ! “అంటూ బుజం మీద చెయ్యి వేసి చిన్నగా నెట్టింది.

“ఏంటిది? ముసలాడిని పడిపోతాను.”

“మీరు ముసలి వారా? అన్బిలీవబుల్! “

‘మీ గొంతులోగానీ, మీనడకలోగానీ, ఎక్కడా నాకు ముసలితనం కనిపించడం లేదు. మీకు డెబ్భై ఏళ్ళ వయసంటే నమ్ముతారు.”

“అంతేనా ఇంకా యాభై అంటావేమో అనుకున్నాను.”

నవ్వేసింది అమృత. తాను చిన్నప్పుడు చదువుకున్న హైస్కూలూ, పాతకాలం నాటి టూరింగ్ టాకీస్ సినిమాహాలును, రైస్ మిల్లు, ప్రభుత్వఆసుపత్రిని చూపించారు. వేణుగోపాల స్వామి ఆలయం మీదుగా నడిచి ఇంటిముఖం పట్టారు. దారిలోచెట్ల నుంచి రాలి పడ్డ పున్నాగ పూలను ఏరుకొంది అమృత.

“తాతగారూ నాకు మీలాగా వ్యవసాయం చేయాలని వుంది. అగ్రికల్చరల్ బి.యస్.సీలో చేరాలని అనుకుంటున్నాను.”,

“మంచిదేనమ్మా! ఇపుడు మెట్ట పంటలు ఎక్కువ భాగం ఆడవారే పండిస్తున్నారు. ఎపుడైనా పొలం చూశావా?”

“లేదు బయట నించి చాలా సార్లు చూశాను.”

“రేపు ఉదయం మన పోలానికి వెడదాం.’

“మెట్ట పంటలు అంటే?” అంది.

“మొక్కజొన్న, జొన్న, కందులు, పెసలు, మినువులు వగైరా.” కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు.

ఉదయమే లేచి రెడీ అయి తెలుగు పేపరు చదవుతూ కూర్చొంది అమృత

“అబ్బో! నీకు తెలుగు చదవడం కూడా వచ్చా అమృతా?”

“అదేమిటి తాతగారూ! తెలుగు మన మాతృభాష, చదవడం రాదని ఎందుకనుకున్నారు?” అంది ఆశ్చర్యంగా.

“ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకు ఇంగ్లీషు తప్ప తెలుగు రాదు. పదవ తరగతి చదివే పిల్లలు కూడా పది వాక్యాలు తెలుగులో రాయలేకపోతున్నారు, బాధగా ఉంటుంది. జాతి ఉనికికి భాష వెన్నెముక లాంటిది కదూ!”

“అవునండీ! అమ్మమ్మ నా చదువు పట్ల శ్రద్ధ తీసుకున్నారు. తెలుగు చదవడమే కాదు. తెలుగు కథలూ, కవిత్వం కూడా చదువుతుంటాను.” అంది అమృత.

“చాలా సంతోషం తల్లీ! మీ తమ్ముడు విశ్వతేజకూ, చెల్లి అనన్యకూ కూడా తెలుగు నేర్పించమని సునందకు చెపుతుంటాను.”

“అవునండీ. నేను కూడా వాళ్ళకి తెలుగు పాఠాలు చెపుతుంటాను.”

కేశవులు వచ్చాడు, కారు బయలుదేరింది.

అమృత హరితవనం లోకి అడుగు పెట్టింది.

కారు చూసి సత్యం పరుగెత్తుకోచ్చాడు. “పనస చెట్టు నీడలో రెండు కుర్చీలు వెయ్యి సత్యం! అమ్మాయి, నేనూ ఇక్కడ కూర్చుంటాము.”

‘ఆయ్! అలాగీనండీ , పాప పెద్దమ్మాయి గోరి పాప కదండీ”

“అవును. అమృతా! ఇతను ‘సత్యం’ మా జీతగాడు కుటుంబంతో ఇక్కడే వుంటాడు. ఆ కనబడుతున్న ఇల్లు ఇతని కోసం కట్టించిందే. ఈ పాత పెంకుటిల్లు ఇది నాన్నగారి కాలం నుంచీ వుంది. ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చును. కుడివైపుగా వున్నది పశువుల షడ్డు ఒక ఆరు గేదెలూ, నాలుగు ఆవులు వున్నాయి ప్రస్తుతం.”

“తాతగారూ! చాలా పళ్ళు చెట్ల మీదనే వున్నాయి.” అంది సంబరంగా.

“చూసిరా! ఇది పన్నెండు ఎకరాల భూమి.”

 అరటి, జామ, మామిడి, బొప్పాస కొబ్బరి, గులాబ్ జామ కాయల చెట్లను చూస్తూ తిరిగింది. చంటిపిల్లలను ఎత్తుకుని నిలబడ్డ తల్లులు లాగా ఉన్నాయి చెట్లు.

రకరకాల శబ్దాలకు అలవాటు పడిన తన చెవులకు,ఈ నిశ్శబ్దం ,పైరు మీంచి వచ్చే గాలి సుఖం ఎలా.. వుంటుందో తెలిసింది.

“ఈ చిన్న మొక్కలను నారుమడి అంటారని చెప్పింది పిన్ని”

“అవునమ్మా! నాట్లు వేసిన నూట ఇరవై అయిదు రోజులకు పంట పండుతుంది.”

“అంటే నర్సరీ టూ హర్వెస్టింగ్ కదండీ!”

“అవునమ్మా! కరీఫ్ , రబీ రెండు పంటలు వేస్తారు.”

“ఇదే మొదటిసారి పొలంలోకి వచ్చి, ఇంత వివరంగా చూడటం ఇదే తాతగారూ! వెరీ బ్యూటిఫుల్ ఎక్సిపీరియన్స్” అంది,

“అమృతా! వి ఆల్ షుడ్ బి థేంక్ ఫుల్ టూ సర్ ఆర్థర్ కాటన్.”

“పేరు విన్నాను. మీ బెడ్రూంలో వున్న పెద్ద చిత్రపటం మీద పేరు చూశాను” అంది.

“అవునమ్మా! గోదావరి జిల్లా ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టుకుని పూజించుకుంటున్న మహానీయుడు కాటన్ దొర, ప్రాతఃస్మరణీయుడు. నూటయాభై ఏళ్ళ క్రితం, పత్తి, ఆముదం లాంటి మెట్ట, పంటలే గతి ఈ జిల్లాల వారికి, పక్కనే గోదావరి ఉరకలెత్తుతున్నప్పటికీ ఆ నీటిని వినియోగించుకోలేని దుస్థితి వారిది. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఆనకట్టతో గోదావరి జిల్లాల రూపురేఖలే మారిపోయాయి. పూర్వం వర్షాలు లేక పంటలు పండేవి కావు. పండినా గోదావరి వాటిని మింగేసేది వరదలు వస్తే లక్షల మంది చనిపోయేవారు. అలాంటి కోనసీమను అన్నపూర్ణగా మార్చిన దేవుడు కాటన్ దొర. ఆయన ఒక్క ఆలోచన గోదావరి జిల్లాల తలరాతను మార్చి వేసిందమ్మా!

బ్రిటన్లో పుట్టిన మహానుభావుడు 1821లో మద్రాస్ చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో చేరారు. 1836లో కొలనూరు ఆనకట్టను నిర్మించి తంజావూరు జిల్లాకు నీరందించాడు. తరువాత 1839లో వచ్చిన ఉప్పెనకు అల్లాడిపోయాయి గోదావరి జిల్లాలు. రెండు లక్షల మందికి పైగా చనిపోయారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం సమస్యను పరిష్కరించమని కాటన్‌ను ఆదేశించింది. ఉభయగోదావరి జిల్లాలలో గుర్రం మీద పర్యటించిన కాటన్ ప్రజల దుస్థితి చూసి కదిలి పోయాడు. ఉభయ జిల్లాలను కలుపుతూ ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించాడు. ద్రష్టలు అంటే వీరే, దివ్యదృష్టి అంటే వీరిదే అనిపిస్తుంది నాకు” అన్నారు విజయరామయ్య కాస్త ఉద్వేగంగా.

అవునంటూ తలూపింది అమృత

అన్నిరకాల పళ్ళూకోసి బుట్టలోపెట్టి తెచ్చాడు సత్యం కొబ్బరి బాండాలు చెక్కి అందులో స్ట్రా వేసి, ఇద్దరికీ ఇచ్చాడు.

“చక్రకేళి గెల రెండత్తాలు పండాయండి. కోయించ మంటారా?” అడిగాడు.

“అడగాలిరా నన్ను? కోయించి కారులో పెట్టించు”

“జామకాయలన్నీ పక్షులు తినేత్తున్నాయండీ, కాయదొరికింది ఇంద పాపమ్మా!” అంటూ అమృత చేతిలో ఒక కాయి పెట్టాడు సత్యం.

“థేంక్యూ సత్యం గారూ” అంది.

“ఆయ్” అని నవ్వుతూ వెళ్ళాడు.

“ఇంకా చెప్పండి తాతగారూ!” దోరగా ఉన్నకాయను కొరికి తింటూ అంది.

“తరువాత 1846 ఆనకట్ట నిర్మాణం మొదలైంది. 1852కల్లా దాన్నిపూర్తిచేశారు. మహానుభావుడు ఎంత కష్టపడ్డారో.. నిర్మాణానికి ప్రభుత్వం నించి సరియైన నిధులువచ్చేవి కావుట. ఎండదెబ్బకు అస్వస్థత కలిగినా పట్టుదలగా పనిచేశాడు రోజుకు, మూడు వేల మంది కూలీలు పనిచేసేవారట. వారిలో సగంమంది కూలీలు ఉచితంగా చేసేవారట. ఆయన నిర్మించిన అక్విడెట్లు ఇప్పటికీ ఉపయోగపడుతున్నాయి. గోదావరి పుష్కరాల్లో ఇక్కడి రైతులు ఈ నాటికి కాటన్ దొరకు పిండం పెడతారు. తమ బిడ్డలకు కాటమ్మ, కోటయ్య లాంటి అని పేర్లు పెట్టుకునేవారుట.”

విజయ రామయ్య గారి గోంతులో ధ్వనిస్తున్న కృతజ్ఞతా భావాన్ని, గుండెలోంచి పలుకుతున్న మాటలను శ్రద్ధగా వింది అమృత.

(సశేషం)

Exit mobile version