[dropcap]”బ[/dropcap]తికితే అలా బతకాలి. గొప్ప స్ఫూర్తిదాత కాటన్, లీవ్ ఎ మార్క్ బిఫోర్ యూ లీవ్ దిస్ వరల్డ్” అంది అమృత.
చెట్లనీడలు చల్లగా పరుచుకుంటున్నాయి. సూర్యకాంతి చెట్ల ఆకు సందుల్లోంచి జారి వెచ్చగా సుఖాన్నిఇస్తోంది.
అమృత లేచి చేలగట్ల మీద నడిచింది కాసేపు. పచ్చని చేలూ, చెట్లూ, మెరుస్తున్న కళ్ళతో దూడలూ, ఆవులూ, నేలా అన్నీసూర్యకాంతిలో వెలిగి పోతున్నాయి. “ఈ. పూలూ, పళ్ళూ, ఈ ఆకుపచ్చని సామ్రాజ్యానికి మీరు మహారాజు తాతగారూ!” అంది అమృత
విజయరామయ్యకు నవ్వొచ్చింది, సంతోషం కూడా కలిగింది.
“ఇంతటి ప్రకృతి సంపదతో నిత్యం స్నేహం చేసే రైతు కంటే ఎవరూ భాగ్యవంతులు కారు కదండీ?”
“అవునమ్మా! భూమి పుత్రుడు ఎపుడూ ఐశ్వర్యవంతుడే. అంతే కాదు కర్మిష్ఠి, జ్ఞాని కూడా, ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా నష్టపోయేది రైతేనమ్మా! వ్యవసాయ క్షేత్రం తల్లి వంటిది కుటుంబాలను కలుపుతుంది,మనుషులను కలుపుతుంది.”
“శ్రమైక జీవన సౌందర్యాన్ని చూపిస్తుంది. అంతేకాదు ఇక్కడ ఈ ప్రాంతంలో పొలంలో లక్షలు విలువచేసే ధాన్యాన్ని గానీ, గొడ్లను గానీ ఎవరూ దొంగిలించరు. ఆఖరుకు చెట్టు కింద పడ్డ కొబ్బరికాయ కూడా అక్కడే ఉంటుంది. అమృతా! నా జీవిత ప్రయాణంలో కులమతాలను మరిపించిన క్షేత్రభూమి ఇది. శాస్త్ర విజ్ఞానాన్ని అందించిన చేయి ఒక ముస్లిం సోదరుడిదో, క్రైస్తవుడిదో మాకు తెలియదు. శాస్త్రీయతే, దారిగా మమ్మల్ని నడిపించిన నా మితృలు చిరస్మరణీయులు. నాకు వ్యవసాయం నేర్పించిన మా పెద్దన్నయ్య నాగేశ్వర్రావుగారు నాకు తొలి గురువు.” అన్నారు.
“మీరు ఒక పల్లెటూరి పిల్లవాడు, యస్.ఎస్.ఎల్సి వరకూ చదువు సాగింది. మీరు కూడా ఒక సాధారణ రైతు లాగే జీవితాన్ని గడిపేయవచ్చు, కానీ మీరు ఒక విజాత.. – ఒక గ్రీన్ రివల్యూషనిష్ట్, హరిత విప్లవాన్నిసాధించిన కృషీవలుడు మీరు. ఇదెలా సాధ్యపడింది? ఇవన్నీ నాకు చెప్పాలి” అంది.
“నువ్వు పెద్ద పేర్లు పెడుతున్నావు. అవన్నీ నాకు తెలియదు. బహుశా నాలో వున్న తపన, ఆర్తి, ఒక ఆశావహ దృక్పథం, పట్టుదలా, నలుగురికీ పనికి వచ్చే పనిచేయమని చెప్పిన మా అమ్మగారి మాటలు నన్ను నడిపించి వుంటాయి.” అన్నారు. సెల్ మ్రోగడంతో జేబులోంచి తీసి “వసుధా! బయలు దేరుతున్నాం” అన్నారు.
“అమృతా! భోజనానికి టైము దాటిందని మీ అమ్మమ్మ.. పిలుస్తోంది. వెళదాం.” అంటూ లేచారు.
***
“అమ్మమ్మా! మీది పెద్దలు కుదిర్చిన వివాహమా? లేక లవ్ మేరేజ్‌నా?” అడిగింది.
నవ్వింది వసుధ “అప్పుడు పెళ్ళిళ్ళు చాలా వరకూ పెద్దలు కుదిర్చినవే. ఏవో ఒకటో రెండో ప్రేమ పెళ్ళిళ్ళు వుండచ్చు. అయితే మాది ప్రేమ లేని పెళ్ళికాదు. ఇష్టపడే చేసుకున్నాం. 1970లో ఏలూరు సెయింట్ థెరీసా కాలేజీలో ఇంటరు రెండవ సంవత్సరం చదువుతుండగా మా పెళ్ళి జరిగింది. అపుడు నా వయసు పదిహేడు.”
“మరి మీ చదువు? తరవాత?” అంది.
“పెళ్ళికి ముందువరకు బాగానే చదువుకునేదాన్ని, మార్కులు బాగానే వచ్చేవి.” అంది వసుధ. లేచి వెళ్ళి అలమారు లోంచి ఆల్బమ్ తీసింది.
“అమృతా! చూడు ఇది నా పెళ్ళి ఆల్బమ్” అని చేతికి ఇచ్చింది. పూసగుచ్చినట్టు నాటి కబుర్లు చెప్పటం మొదలు పెట్టింది.
అమృత పేజీలు తిప్పుతూ చూస్తోంది. ఒక అమాయకపు ముగ్ధలా, ఉన్న వసుధనూ,, హీరోలా వున్న విజయరామయ్యనూ, పెళ్లి నాటి అందాలను చూస్తోంది.
“హనుమాన్ జంక్షన్ దగ్గరగా వున్న చిన్న పల్లెటూరు కొత్త పల్లి మా ఊరు.
ఒకరోజు ఓ అందమైన యువకుడు వచ్చి, వసుధ తండ్రి రాఘవులు గారితో తనను విజయరామ్‌గా పరిచయం చేసుకున్నాడు. తన తల్లి రామలక్ష్మి గారు పంపారని, వసుధ తల్లి, లలితాంబ గారితో తమకు వున్న బంధుత్వం గురించి చెప్పమన్నారని అన్నాడు. లలితాంబ చాలా సంతోషించింది.
కొత్త గొంతు విని లోపలి నించి వచ్చిన వసుధను చూశాడు విజయ్. మల్లెపూవు వంటి మేనిఛాయతో, తీర్చి దిద్దినట్లు వున్న ముఖకవళికలతో కణ్వాశ్రమంలో వున్న శకుంతలలా వుంది ఈ అమ్మాయి అనుకున్నాడు విజయ్. తనను చూడగానీ. వెంటనే లోపలికి వెళ్ళిపోయింది.
“అమ్మా! పూర్ణా! మనవాళ్ళే కాసిని పాలు పట్టుకురా!” అబ్బాయికి అంది లలితాంబ
“అబ్బే ఏం వద్దండీ! భోజనం అయింది” అన్నాడు మొహమాటంగా.
“ఎక్కడ భోజనం చేస్తున్నావు బాబూ? ఇక్కడ హోటల్స్ బావుండవు” అన్నారు రాఘవులు,
చెప్పాడు విజయ్. వంద ఎకరాలు కౌవులుకు తీసుకుని మొక్కజొన్న పంట వేశానని, కొత్తపల్లిలో వుండాల్సిన పరిస్థితి గురించి చెప్పాడు.
“మీరు పరాయి వారు కాదని తెలిసిందిగా. ఇక్కడ వున్నన్ని రోజులు మా ఇంట్లోనే భోజనం చెయ్యండి. ” అంది లలితాంబ –
‘ఒకరోజు కాదు గదండీ, నా తిప్పలు నేను పడతాను. శ్రమ తీసుకోవద్దండి” అన్నాడు.”
“మీ ఇంటికి మేం వస్తే ఇలాగే అంటారా? అమ్మగారితో నేను మాట్లాడతాను” అన్నారు రాఘవులు
వసుధ పాలు తీసుకొచ్చింది.
“ఏం చదువుతున్నారు?” అడిగాడు విజయ్.
“ఇంటరు బైపీసీ” అంది వసుధ. మీనాల్లా కదులుతున్న కాటుక కళ్ళతో చాలా అందంగా వుంది ఈ అమ్మాయి అనుకున్నాడు. ఇంటి దగ్గర తల్లి మరీమరీ చెప్పడంతో బాటూ పూర్ణ పట్ల తనకు కలిగిన ఆకర్షణతో రోజూ వారి ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు.
హద్దులు దాటని సంస్కారం, శ్రమించే తత్వం. కళగా వున్న ముఖం, చక్కని పర్సనాలిటీ, వత్తుగా వున్న నల్లని జుట్టూ, ముఖ్యంగా మాట్లాడే తీరూ, ఇవన్నీ చూసి, విజయ్ మీద సదభిప్రాయం కలిగింది ఇంట్లో అందరకూ, విజయ్‌తో చనువు కూడా పెరిగింది. వసుధ, చెల్లెలు పద్మా, ఒక రిక్షాలో బయలుదేరితే, తమ్ముడు ప్రసాద్, విజయ్ స్కూటర్ మీద కూర్చుని హనుమాన్ జంక్షన్‌లో, హీరో కృష్ణ నటించిన ‘అసాధ్యుడు’ సినిమా చూసి వచ్చారు. వేసవి రాత్రిళ్ళు ఆరుబయట మంచాలు వేసుకుని కబుర్లు చెప్పుకునే వారు. ఒక నెల గడిచింది వసుధ తల్లి, తండ్రి విజయ్ గురించి మాట్లాడుకోవడం, వసుధ చెవిన పడింది. సుధ తనను దొంగ చూపులు చూడటం గమనించి నవ్వుకునేవాడు విజయ్.
సెలవులు అయిపోయి హాస్టల్‌కు ఏలూరు ప్రయాణం కోసం బట్టలు సర్దుకొంటూంది వసుధ.
బయటకు వెళ్ళబోతూ ‘సుధా!’ పిలిచాడు విజయ్.
అమ్మ, నాన్న బయటకు వెళ్ళారు. చెల్లి ముందు గదిలో చదువుకుంటోంది.
“ఏమిటి?” అంటూ వచ్చింది బిడియంగా.
“నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీకు ఇష్టమైతె చెప్పు మీ నాన్నగారితో మాట్లాడుతాను. మనం పెళ్ళి చేసుకుందాం “అన్నాడు. ముందు తెల్లబోయింది,సిగ్గుతో ముఖం ఎర్రబడింది, నవ్వుదాచుకుంది.
“ఆగు…. అలా పారిపోకు… చెప్పు ఇష్టం వుందా? లేదని చెప్పినా ఫరవాలేదు.” మాట పూర్తి కాకుండానే ఇంట్లోకి పారిపోయిన వసుధ ను చూసి నవ్వుకున్నాడు విజయ్
“తరవాత?” అంది కుతూహలంగా అమృత.
“తరవాత అమ్మ, నాన్న నన్ను పిలిచి మీ తాతయ్యగారి కుటుంబం గురించి చెప్పారు. పెళ్లి గురించి అడిగారు.
“ఇంత కంటే ధనవంతుడిని, చదువుకున్న వాడిని తీసుకురాగలను కానీ ఇంతకంటే సంస్కారవంతుడిని మాత్రం తీసుకుని రాలేనమ్మా!” అన్నారు నాన్నగారు. నాన్న టీచరుగా పనిచేశారు. 1970లో మా పెళ్ళి జరిగి పోయింది.
“తాతయ్య లవ్ స్టోరీ బావుంది. మరి మీ చదువు? మీకెరీర్?” అంది ఆశ్చర్యంగా అమృత.
“పుస్తకాల చదువు అక్కడితో ఆగిపోయింది. పెళ్ళి తరవాత అత్తవారి ఇల్లే కాలేజీ, సర్వస్వం అప్పటి ఆడపిల్లలకు, ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన కుటుంబాల్లో ఆడపిల్లలకు కెరీర్ అనే పదం తెలియదు. బాధ్యత అన్నమాట ఆడపిల్లను కట్టిపడేసేది. పెళ్ళికి ముందు పుట్టిల్లు, పెళ్ళి అయ్యాకా అత్తవారి ఇల్లు మరొక ప్రపంచం తెలియని రోజులు అవి జంటగా మా జీవితం ప్రారంభించాకా, వెలితి అన్న మాటను నేను ఫీల్ అవ్వలేదు. పిల్లలు, వాళ్ళ భవిష్యత్తూ, అందునా, మాది తరతరాలుగా వ్యవసాయమే వృత్తి అయిన కుటుంబం కావడం చేత ఎప్పుడూ బిజీగానే గడిచిపోయింది. తీరుబడి దొరికినపుడు, యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, రంగనాయకమ్మ గార్ల రచనలు చదువుతూండేదాన్ని. మీ తాతగారూ నేనూ కలిసి చాలా ఊళ్ళు చూసి వచ్చాం. మా ఇద్దరదీ జాయింట్ అకౌంటేనమ్మా. నీదీ నాదీ అంటూ వేరు లేదు.”
“ఇప్పటి ఆడపిల్లలు నీలాగా వ్యక్తులుగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. కాలం మారుతూ వుంటుంది. ఆ మార్పుని అనుసరించే మనుషులు ప్రవర్తిస్తూంటారు. నిజానికి ఇప్పటి ఆడపిల్లలు ఇటు సంసారాన్ని, అటు చేపట్టిన ఉద్యోగ బాధ్యతలను, సమన్వయ పరుచుకుంటూ రాణిస్తున్నారు. సహజంగానే ఒత్తిడిని కూడా అనుభవిస్తున్నారు. తాతయ్య చదివింది తక్కువే కానీ ఆయన చూసిన ప్రపంచం చాలా పెద్దది. అదే నాకు కూడా భాగం పంచి ఇచ్చారు. మా మధ్య అపుడపుడూ చిర్రు బుర్రు చిరాకు లేతప్ప, గొడవలూ ఎప్పుడు లేవు.”
“ఏది మంచిదంటారు అప్పటి కాలమా? ఇప్పటి రోజులా?” అంది అమృత
“ప్రతీ వ్యవస్థలోనూ, కష్ట, నష్టాలూ, సుఖసంతోషాలు ఉంటాయి. ఇదే ప్రమాణం అని చెప్పలేము, ఇదే ప్రయాణం అనీ చెప్పలేము. కానీ జీవించడంలో ఒక ఆనందం వుంది. అది పూర్తిగా వ్యక్తిగతమైనది ఎవరి ఆనందం వారు వెతుక్కొనవలసిందే.” అంది ఆవలిస్తూ.
“కాసేపు విశ్రాంతి తీసుకోండి అమ్మమ్మా!” అని లేచింది అమృత.
***
సమయం నీరెండకు చేరింది. చెరువు మీంచి గాలి ఆహ్లాదంగా వీస్తోంది. మాలతి పందిరి కింద రెండు కుర్చీలు వేసుకుని తాతయ్య, మనవరాలు కబుర్లలో పడ్డారు.
“చెప్పండి మిష్టర్ ఐ.ఆర్.8” అంది నవ్వుతూ అమృత.
నవ్వేశాడు విజయరామయ్య.
“అది 1967 నాటి కాలం, ఆశ్వీజం ప్రవేశించింది. ఆరోజు మా పెద్దన్నయ్య నాగేశ్వర్రావుగారి సంతోషం ఇంతా అంతా కాదు. వ్యవసాయంలో నాచేత ఓనమాలు దిద్దించినచిన తొలి గురువు మా పెద్దన్న. కేవలం పదిసెంట్ల భూమిలో ‘ఐ.ఆర్.8’ అనే వరి వంగడం వేశాను. అదీ ఎలాగో తెలుసునా అమృతా!”
“చెప్పండి.” అంది
“ప్రభుత్వ వ్యవసాయ రంగం వారు ఈ కొత్త వరి విత్తనాన్ని కోయంబత్తూర్‌లో ఒక ఎకరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామంలోనూ ఒక ఎకరం వేశారు. అది ఐ.ఎ.డి.పి ప్రోగ్రాం, దక్షిణభారత దేశంలో ప్రభుత్వ వ్యవసాయ రంగంవారు అధ్యయనం చేస్తున్నారు. వాళ్ళు వేశాకా మిగిలిన మొక్కలను కాలువలో పడేశారు. నేను ఆ మొక్కలను తెచ్చుకుని పది సెంట్ల భూమిలో నాటించాను. పండిన పంటను చూడటానికి అన్న వచ్చారు. నాలుగు బస్తాల ధాన్యపురాశిని కప్పడానికి, పదిసెంట్ల భూమిలో వచ్చిన ఎండుగడ్డి చాలలేదు, అన్న సంబరపడి పోయారు – 1967 కు ముందు అక్కుళ్ళు, కృష్ణకాటుకులు, అనే వరి పంటను మాత్రమే వేసేవారు. ఎకరానికి పదిహేను బస్తాలు మించి పండేవి కావు. చిన్నపుడు వాతో చదువుకున్న నా మితృడు, గురువు, డాక్టరు జీ వెంకట్రావు గారు. మారుటేరు రైస్ రీసెర్సి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు. వారి సలహతో పిలిఫైన్స్ అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ నించి ఫ్లైట్లో విత్తనాలను తెప్పించుకుని, చెన్నై నించి లారీలో ఆచంట కు తెప్పించుకున్నాను. రైతుగా నా భవిష్యత్ కు అక్కడే పునాదులు పడ్డాయి.
“ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ఇనిస్టిట్యూట్” కదండీ అంది.
“అవునమ్మా! ఇది అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ఫిలిపీన్స్ లోని మనీలాలో ఉంది. భారతదేశంతో సహ పదిహేను దేశాలలో ఈ సంస్థ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.”
“చెప్పండి”
“ఈ ఐ.ఆర్.8 విత్తనాలను ఎకరానికి ముప్ఫై కేజీల చొప్పున వేయి ఎకరాలకు సరిపడా వాళ్ళు పంపించారు. మా పొలం పాతిక ఎకరాలు ఉంది. మొత్తం రెండు వేల ఎకరాలకు ఎకరానికి పదిహేను కేజీల చొప్పన పంపిణీ చేసాను. అప్పటి యువత ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వారంతా నా పర్యవేక్షణలో ఎరువులు వేశారు. రబీలో రెండు వేల ఎకరాలకు వరినాట్లు వేశాం. అమృతా! చాలా ఆశ్చర్యంగా ఎకరానికి నలభైఐదు బస్తాల ధాన్యం పండిందమ్మా! ప్రభుత్వం వారు వేయించిన ఎకరంలో కేవలం పద్దెనిమిది బస్తాలు మాత్రమే పండింది. కోయంబత్తూరులో కూడా పద్ధెనిమిదే వచ్చింది. మా రైతుల సంతోషానికి హద్దులేదు.”
“అద్భుతం తాతగారూ!”
“అవునమ్మా! అప్పటికి అది అద్భుతమే. నాన్నగారి అనారోగ్య కారణంగా అప్పటికి రెండు లక్షల రూపాయలు అప్పుల్లో వున్నాం. 1967 నాటికి రెండు లక్షలంటే చాలా పెద్దమొత్తం. ఈ ఐ.ఆర్.8 దిగుబడితో ఆ అప్పు మొత్తం తిర్చేశానమ్మా అమృతా!” నాటి విజయోత్సాహం విజయరామయ్య గొంతులో ధ్వనిస్తోంది.
“ప్రభుత్వ వ్యవసాయ రంగం వారు వేసినపుడు తక్కువ పంట ఎందుకు వచ్చింది?”
“ప్రభుత్వ వ్యవసాయ రంగం వారు ఎరువులు ఎక్కువగా వేయడం చేత, దిగుబడి తగ్గిందమ్మా! గోదావరి జిల్లాల భూములు సహజంగానే సారవంతమైనవి. అందుచేత చాలా కొద్ది ఎరువులతో నేను సేద్యం చేయించాను.”
“రియల్లీ గ్రేట్” అంది.
“1967,68ల వాటికి నేను యువకుడిని, చిన్నవాడిని నాటికి తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న కొందరు ఊరి పెద్దలు నన్ను వ్యతిరేకించారు. ఐ.ఆర్.8 వంగడాలకు దిగుబడి రాదనీ, నేను అబద్ధాలు చెపుతున్నానని, యువతను పెడదోవ పట్టిస్తున్నానని నన్ను విమర్శించారు. పంట దిగుబడి చూశాకా వారికి నోట మాట రాలేదు. మా గ్రామం ఒక యాత్రా స్థలం అయిపోయింది. ప్రభుత్వ ఆదేశం మేరకు వివిధ రాష్ట్రాల నించి సుమారు మూడు వేలమంది శాస్త్రజ్ఞులు తర్ఫీదు నిమిత్తం ఆచంట వచ్చారు. వివిధ జిల్లాల నించీ అయిదారు వేలమంది.. రైతులు వచ్చి తెలుసుకున్నారు. ఇది 1967 నాటి మాట. నాటి వ్యవసాయ శాఖామంత్రి భారతరత్నగౌరవాన్నిపొందిన శ్రీ సి సుభ్రమణ్యం గారు వ్యవసాయరంగంలో డైరెక్టరుగా పని చేస్తున్న టి. వి రెడ్డిగారు, పార్లమెంటు మెంబర్లు మోహన్ ధారియా, శ్రీపెండే కంటి వెంకట సుబ్బయ్యగారు ఇంకా నలభై మంది పార్లమెంటు సభ్యులు వచ్చారు.
“1960లో భారతదేశం ఆహార కొరతను ఎమర్కొంటోంది. అధిక దిగుబడి నిచ్చే వరి వంగడాలను రైతులకు పరిచయం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాని ఫలితంగా ఐ.ఆర్.8 ని రైస్ రిసెర్చి ఇనిస్టిట్యూట్ వారు పరిచయం చేశారు. శ్రీ సి సుబ్రమణ్యం గారు, శ్రీ ఎసి సుబ్బారెడ్డి గార్ల ఆధ్వర్యంలో విజయవాడలో ఒక మీటింగ్ పెట్టారు.”
“అమృతా! ఆ మీటింగ్‌లో నేను రెండు వేల ఎకరాలకు సరిపడా ఐ.ఆర్.8 విత్తనాలను ఆచంట గ్రామ రైతాంగానికి ఇయ్యవలసిందిగా ప్రభుత్వాన్ని కోరాను. రబీలో పంట వేయడం, ఇలా అత్యంత అధిక దిగుబడి రావడం జరిగింది. నాటి ఆచంటలో ఏర్పాటు చేసిన మీటింగ్లో. సి.సుబ్రహ్మణ్యంగారు “ఈ కుర్రాడు విజయరామ్ నన్ను సుప్రీం కోర్టులో గెలిపించాడు” అన్నారు. అప్పటి ధాన్యపు బస్తా ధర ముప్పై అయిదు రూపాయలు వుండేది. అప్పటి కప్పుడే ప్రభుత్వం మరొక పదిహేను రూపాయలు బోనస్ ప్రకటించింది. దాంతో బస్తా ధర యాభై రూపాయలు అయింది. రైతుల సంతోషానికి మేరలేదు.
వ్యవసాయ శాస్త్రజ్ఞులూ, పార్లమెంటుమెంబర్లు, భారతరత్న డాక్టర్ ఎమ్.ఎస్ స్వామినాథన్, నాటి భారత ప్రభుత్వ సెక్రెటరి శ్రీ బి శివరామన్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ చాన్దలర్ (chandler) వంటి ప్రముఖులు ఆచంట వచ్చారు
రెండు వేల ఎకరాల్లోనూ హెక్టారుకు 8.3 టన్నుల పంట హరితవిప్లవానికి నాంది పలికింది అప్పటి నుంచి శాస్త్రజ్ఞులు నన్ను “మిస్టర్ ఐ.ఆర్.8! అని పిలిచేవారు” అని నవ్వారు.
“తాతగారూ! ఇంత కష్టపడితే, బస్తాకు యాభై రూపాయలేనా?”
“అప్పటి రూపాయికి విలువ వుందమ్మా! నారుమళ్ళనించి కోతల దాకా ఎకరానికి కేవలం మూడు వందల రూపాయలు ఖర్చు అయ్యేది. రైతుకూలీ మగవారికి మూడు రూపాయలు, ఆడవారికి, రెండు రూపాయలు వుండేవమ్మా! ఆనాడు ఆచంటను చూడటాని వచ్చిన పదివేలమందికీ, భోజన సదుపాయాలను మా కుటుంబమే చూసుకుందమ్మా!”
“వింటూంటే ఎంత బావుందండీ! ఈ విజయం వెనకాల మీ కృషిని అర్ధం చేసుకుంటున్నాను” అంది.
“అమృతా! నన్ను విమర్శించిన పెద్దలు మా అమ్మగారిని కలిసి, ఈ విజయం గురించి చెప్పి ఎంతగానో అభినందించారు. ఆరోజు మా అమ్మగారి కళ్ళలో పొంగిన పుత్రవాత్సల్యం ఆనందభాష్పాలుగా వర్షించింది.”
అంటూ తల్లి జ్ఞాపకాలలో చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నారు విజయ రామయ్యగారు. చీకటి పడింది చంద్రోదయమైంది.
“అమృతా! లోపల కూర్చోండి చలిగాలి తిరిగింది” అంటూ కేకపెట్టింది వసుధమ్మ. విజయరామయ్య లేచి లోపలికి వెళ్ళారు.
“రెండు నిమిషాలు అమ్మమ్మా! ముగ్గులు చూసి వస్తాను” అంది.
వసుధ గారికి వంట పనుల్లో సాయం చేసే సత్యవతి ఇంటి ముందు కళ్ళాపి జల్లి, ముగ్గులు వేయడం చూస్తోంది అమృత. పక్కఇళ్ళ నించి కూడా ఆడపిల్లలు వచ్చి ముగ్గులు వేసుకుంటున్నారు. చుక్కలు పెట్టి, కలుపుతూ, పెద్దపెద్ద ముగ్గులను ఎంతో కళాత్మకంగా నిమిషాల్లో వేసేస్తున్నారు. మధ్యలో గొబ్బెమ్మలను వుంచి బంతిపూలను అలంకరించారు.
“చాలా బాగా వేశారండి” అంది అమృత.
“నెల పొడుపు కదండీ మరి యిలాగే యేస్తారు. మీరు కూడా యేసుకుంటారా మీ ఊల్లొ?
“వేస్తాం గానీ ఇంత పెద్దవి కావు. చాలా బావున్నాయి అంది.
“నేర్చుకుంటే యేసేయచ్చు, ఇదేం బెమ్మ యిద్య కాదు” అంది సత్యవతి, ఆఖరు రోజున రధం ముగ్గుయేసి అలాగ కలుపుకు పోవాలండి ఆయ్!” అంది.
గోదావరి జిల్లాలలో గ్రామీణ ప్రాంతం వారికే సొంతమైన ఒక ప్రతేకమైన యాస అది. ఈ యాసలో ఒక ప్రాంతీయత , సంస్కారం, సైకాలజీ మర్యాద అన్నీ ఉట్టిపడతాయి అనుకుంది అమృత.
***
శుక్రవారం రోజున ఉదయమే లేచి తలంటు పోసుకుని అమ్మమ్మ కోరినట్లు పరికిణి, ఓణీ వేసుకుని చక్కగా ముస్తాబయింది అమృత. పెరట్లో పూసిన రకరకాల పూలనుకోసుకుని బుట్టలో పెట్టుకుంది. వసుధ కొబ్బరి కోరును పంచదారతో కలిపి వెండి గిన్నెలో పెట్టి ఇచ్చింది. అరటిపళ్ళు, కొబ్బరి కాయలను బుట్టలో పెట్టింది. వసుధమ్మతో కలిసి రామలింగేశ్వరాలయం చూడటాని బయలుదేరింది అమృత. రెండు చెరువులను కలుపుతూన్న గట్టు మీంచి నడక సాగించారు ఇరువురూ. చెరువుకు ఆవలి గట్టును ఆనుకొని వున్న రామలింగేశ్వరాలయం గాలి గోపురం చాలా ఎత్తుగా వుంది. గోపురం మీద రామ చిలకలూ, పావురాలు సందడి చేస్తున్నాయి. ఆచంటీశ్వరుని స్ధల పురాణం చెప్పింది వసుధ అమృతకు. సిటీలో స్కూటీ నడపడానికి వీలుగా కుర్తీలు, డ్రెస్సులూ వేసుకోవాడానికి అలవాటు పడిన అమృతకు, పరికిణీ, ఓణీలో నడక నెమ్మదిగా సాగుతోంది. అయినా ఈ కొత్త అనుభవం బావుంది. హడావిడి లేదు, ఒత్తిడి లేదు ఒక నెమ్మది, ప్రశాంతతతో బాటూ ఈ ఆత్మీయతను తాను ఎప్పటికీ మరచి పోలేదు అనుకుంది. కంప్యూటర్‌లూ, పార్టీలు, పబ్‌లూ ఆ జీవితానికీ, ఇక్కడ వున్న జీవన విధానానికి వున్న వ్యత్యాసాన్ని గమనిస్తోంది అమృత.
సంధ్య వేళైంది. గుడిలో దీపాలు వెలిగించారు. ధ్వజస్థంభానికి వున్న ఆకాశదీపాన్ని చూసి నమస్కారం చేసింది వసుధ. ఆలయంలో శ్రీరామలింగేశ్వరుడూ, పార్వతీదేవీ ప్రధాన దేవతలు కాగా, ఆలయం చుట్టూ వున్న చిన్న, చిన్న గుడిల్లో గణపతి,సుభ్రమణ్యేశ్వరుడూ, కాలభైరవుడూ, ఆంజనేయస్వామి, సత్యనారాయణ మూర్తుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠింపబడి వున్నాయి. ఆలయ ప్రాంగణం పరిశుభ్రంగానూ, జేగంటల మ్రోతతో ఒక పవిత్రమై అనుభూతిని కలుగ జేస్తోంది. గర్భగుడిగోపురం పైన దశావతారాలు, సకల దేవతా మూర్తుల అందమైన విగ్రహాలను చెక్కారు…
“అమృతా! ఈ ధ్వజస్థంభం విజయరామయ్య గారి తాత ‘నెక్కంటి నాగయ్య’ గారు ప్రతిష్ఠించారుట. తుఫాను టైములో పడిపోతే మళ్ళీ విజయరామయ్య గారు అశ్వారావుపేట అడవులనించి ఒక ప్రతేకమైన చెక్కను తెప్పించి ఈ ధ్వజ స్థంబాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఇది అయిదు వందల ఏళ్ళ వరకూ చెక్కుచెదరదని చెప్పారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కూడా తాతయ్యే చేశారు. ఆకాశ దీపానికి అయ్యే తైలం ఖర్చు అంతా తాతగారే పంపుతారు” అంది వసుధమ్మ
శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమపూజ చేయించింది వసుధ. చెక్కెర కలిపిన కొబ్బరినీ, అరటిపళ్ళనూ స్వామికి నివేదన చేశారు. ఎర్రని పట్టుచీరలో, బంగారు నగలతో, పూలహారాలతో, మహా సౌందర్యంతో వెలిగిపోతోంది పార్వతీదేవి, అమ్మవారి మూర్తి. పుట్టి బుద్ధి తెలిసాకా ఒక దేవాలయంలో ఇంత ప్రశాంతంగా, భక్తి భావంతో గడపటం ఇదే మొదటిసారి అనుకుంది అమృత.
శివలింగం మీదున్న నాగమల్లిపూవును తీసి అమృత చేతిలో ఉంచారు పూజారి. పూవును చూసి ఆశ్చర్యపోయింది అమృత. శివలింగంపైన సర్పాకృతిలో వున్నట్టు న్న ఈ పూవుని అమృత ఎపుడూ చూడలేదు. “లేతగులాబీ. పసుపురంగుల సమ్మేళనంలో, సన్నని పరిమళంతో ఎంతోబావుంది” అంది. “అవును ఈ చెట్టుపూవులు కొమ్మలకే కాదు చెట్టు మొదట్లో కాండానికి కూడా పూస్తాయి” అంది వసుధమ్మ. ఇక్కడ శివరాత్రికి వండే అన్నపు రాశి చాలా పెద్దదిగా వుంటుంది. అది చూసి అగ్రికల్చరల్ సెక్రటరీ శివరామన్ ఐసియస్ గారు చాలా థ్రిల్ అయిపోయారు. అన్నపు రాశికి సాష్టాంగ నమస్కారం చేశారు. కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు.
(సశేషం)