Site icon Sanchika

పుడమితల్లి నేస్తం-4

[dropcap]“ఓ[/dropcap]ర్పు పట్టడం అనేది అమ్మ నేర్పిన క్రమశిక్షణలో అతిముఖ్యమైన అంశం నాకు. ఆ రోజు నాకు డాక్టరు జి.వి చలంగారు, నాకు గురుతుల్యులు, రైతు పరమైన విజయాన్నేగాక, ఆర్థికంగా నేను నిలదొక్కుకునేందుకు బాట వేశారు. అపుడే భారత ప్రభుత్వం నాకు నేషనల్ అవార్డును ప్రకటించింది. అటు వసుధతో నా వివాహం, జీవితాన్ని మలుపు తిప్పింది. ఎర్రనేల మొక్కజొన్న పంటకు అనువైనదనీ, మంచి ధరపలికే మొక్కజొన్న పంట వేయమనీ నాకు సలహా ఇచ్చారు. హనుమాన్ జంక్షన్ చేరువలో ఉన్న కొత్తపల్లి గ్రామంలో వంద ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాను.”

“చెప్పండి తాతగారూ!”

“అమృతా! ఎకరానికి కేవలం పద్నాలుగు క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి వచ్చే హైబ్రీడ్ మొక్కజొన్న నా సేద్యంలో ఇరవై ఆరు క్వింటాళ్ళుకు పెరిగింది. ఇంత దిగుబడి రావడం భారతదేశంలోనే ప్రప్రథమం, పర్సనాలిటీ డెవలప్మెంటు అనే వ్యక్తిత్వవికాస శిక్షణా సంస్థలుండటం ఇప్పుడు చూస్తున్నాను. బాల్యంలోనే ఆ అవకాశం లేని వారికి అది అవసరమే కావొచ్చు, కానీ మా అమ్మ, మా జీవిత విధానంలోనే విలువలను మాకు తెలియకుండానే ఏర్పరిచారు. ‘అతిథిదేవోభవ’ అన్న భావన గోదావరి జిల్లాల గాలిలో నీరు లోనే వుందమ్మా!

అహంభావికి పరిశీలన వుండదు. తొందరపాటు వల్ల తప్పులు చేస్తాడని అమ్మ చెప్పేది. తుకారాం అభంగాలను పాడేది. ‘చిన్న చీమకు చక్కెర దొరుకును, పెద్దమనిషికీ ఉప్పే కరువూ, పెద్దచెట్లనూ కూల్చుతుఫాను చిన్నమొక్కనూ కదల్చగలదా?’ అంటూ అణకువ మనిషి సంస్కారానికి చిహ్నం అని చెప్పేది. ఆమె చదువుకున్నది పెద్ద బాలశిక్ష, కానీ ఆవిడ జ్ఞానమంతా త్యాగరాజు కీర్తనలు, అన్నమయ్య పాటలూ, తుకారాం అభంగాలూను, తాను ఇలా పనులు చేసుకుంటూ పాడుకునే పాటల్లోని జీవన సారం,మా మనసుల మీద ప్రభావం చూపేది.”

“మా అన్నదమ్ముల్లో నాల్గవ సంతానం మా ‘కాశీ’ అన్న. అన్న మానసిక వికలాంగుడు. ఆయన యాభై ఏళ్ళు జీవించారు. మా నాన్న వీరస్వామి గారు, ఆయన సంతానం ఏడుగురుకూ సమానంగా ఆస్తి పంచారు. మా కాశీ అన్నకు కూడా సమానంగా ఇచ్చారు. అందరం ప్రేమగా చూసుకునేవారం. ఓపిక వున్నంత వరకూ అమ్మ చూసుకునేవారు. తరువాత మా చెల్లి లక్ష్మి, మా కాశీ అన్నకు అన్నం కలిపి నోటిలో పెట్టడం, పాలు పట్టడం లాంటి పనులను ఎంతో ప్రేమతో చేసేది. ప్రతి పండుగకు కొత్త బట్టలు వేసి ఒక చంటి బిడ్డను సాకినట్లు చూసేవారు ఇంటి సభ్యులందరూ. మా అన్నదమ్ములు పరస్పర సహకారంతో ఐకమత్యంగా వుండటానికి మా అమ్మగారు కారణం. ఒకే గూటి బిడ్డలం, ఆ పలుకులే నేర్చుకున్నాం మేము.” అన్నారు.

“ఏమిటో మనసు బాల్యంలోకి వెళ్ళిపోతుంది పదేపదే”

“మొక్కజొన్న పంట గురించి చెపుతున్నారు” అంది అమృత

“అవునుకదూ! మొక్కజొన్న పంట వంద ఎకరాల్లో వేసి మూడు ఏళ్ళు పరిశోధనలు చేశాను.  మొదటి రెండు సంవత్సరాలలో కేవలం ఒక క్వింటాల్ మాత్రమే పెరిగింది. పంట వేయడంలో రెండు వరుసలు మేల్ సీడ్, ఆరు వరుసలు ఫీమేల్ సీడ్ వేస్తారమ్మా! మేల్ సీడ్ ధర క్వింటాల్ కు ముఫ్ఫై రూపాయలు వుంటే, ఫీమేల్ సీడ్ ధర మూడు వందల రూపాయలు వుండేది. నేను మొక్కజొన్న సేద్యానికి రాకముందు ఎకరానికి కేవలం పధ్నాలుగు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చేదని చెప్పానుగా. మొక్కకూ, మొక్కకూ మధ్య పన్నెండు అంగుళాల దూరాన్నినేను తొమ్మిది అంగుళాలకు తగ్గించాను, వరుసకూ వరుసకూ మద్య గల దూరాన్ని నేను ముప్పై అంగుళాల నించి ఇరవైఏడు అంగుళాలకు తగ్గించాను. అంతేకాకుండా పూవు పూసే టైమ్‌లో సెల్ఫ్ పోలినేషన్ గాకుండా క్రాస్ పోలినేషన్ చేయించాలి. అంటే తెలుగులో స్వపరాగ సంపర్గం. లేదా ఆత్మపరాగ సంపర్గం అంటారు అంటే ఒక పువ్వు లోని పుప్పొడి అదే పువ్వు లోని కీలాగ్రం మీద పడటాన్నిఆత్మపరాగ సంపర్గం లేదా ఆటోగమీ అంటారు. ఇది జరిగితే పంటను తీసుకోరు. మొక్కల మీద వెన్నులు లేకుండా తీసివేయాలి. నేను వేసిన డెబ్భైఐదు ఎకరాల పంటను చూడటానికి ముఫై మంది ప్రభుత్వ వ్యవసాయరంగ అధికారులు వచ్చారు. అమృతా! మొక్కజొన్న కండె మీద జూలు వుంటుంది చూశావా?”

“అవునండీ”

“ఆ జూలు పొత్తు లోని ప్రతీ గింజకూ కనెక్ట్ అయి వుంటుంది. పరపరాగ సంపరం జరిగినప్పుడు వెన్ను మీంచి పడ్డ పుప్పొడి గర్భాశయంలోకి ప్రవేశించి గింజలు పాలు పోసుకుంటాయి. ఇక్కడ మనం చేసే పని ఏమిటంటే వెన్నులు రాగానే తీసేస్తాం. తరువాత పరపరాగ సంపర్కంద్వారా హైబ్రెడైజేషన్ జరుగుతుంది. ఈ వెన్నులను పినకిల్స్ అంటారు. ఇదంతా శ్రద్ధ తీసుకున్నాను. అయితే ఎరువులను సాధారణంగా నీటిలో కలిపి వేస్తారు. మొక్కజొన్నగింజ పాతిన మూడవ రోజుకు మొక్క వచ్చేస్తుంది. మొక్క బలంగా ఎదగాలని, ఎరువు మొక్కలకు అందాలని మొక్క పక్కనే నాలుగు అంగుళాల గోయ్యి తీయించి ఒక చిన్న కప్పుతో ఆ గోతిలో ఎరువు పెట్టించాను. అమృతా! నేషనల్ సీడ్ కార్పొరేషన్ వాళ్ళ ఇచ్చిన విత్తనాలను వంద ఎకరాల్లో కాకుండా డెబ్బై అయిదు ఎకరాల్లో వేశానమ్మా! పాపులేషన్ పెరిగింది. మొక్కలు. బలంగా ఎదిగాయి. పన్నెండు ఆకుల తరువాత వచ్చే మొక్కజొన్న పొత్తు చిన్నదిగా వుంటుంది. అలాగాక నాలుగైదు ఆకుల తరువాత వచ్చే మొక్కజొన్న కండె బలంగా వుంటుంది. ఫ్లవరింగ్ సమయం వచ్చింది.  వెన్నులు కూడా తీసేశాము వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టరు శంకరరావు గారు వచ్చారు”.

“ఏమిటి విజయ్ మొక్కలు దగ్గరగా కనబడుతున్నాయి?” అని అడిగారు.

చెప్పాను దూరం తగ్గించానని. వెంటనే ఆయనకు. చాలా కోపం వచ్చేసింది.

“మేం చదువుకున్నది దేనికి? ఇలాచేస్తే గింజ చిన్నదిగా వస్తుంది. జల్లెడలో జారిపోతుంది” అని నా మీద గట్టిగా అరిచారు. ‘నాకు బీహార్‌లో చాలా ఆఫర్లు వచ్చాయి. ఇపుడు చాలా నష్టం వస్తుంది’ అని అలిగి ఆ రోజు భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. నేను నలభై మందికి వంటలు చేయించాను. మిగిలినవారు భోజనాలు చేశారు. నాకు చాలా బాధ కలిగింది.”

“మరి మీరేమన్నారు తాతయ్యా?”

“ఏమంటాను. భోజనం చేయమని బ్రతిమలాడాను. గింజలు పాలు పోసుకున్నాకా వచ్చి చూడండి సార్ అపుడు కూడా మీరు నష్టపోయారని భావిస్తే, ఎన్నిలక్షలు మీరు నష్టపోయారో అన్ని లక్షలూ నేను మీకు ఇస్తాను అని మాట ఇచ్చాను.”

“ఓ.. గ్రేట్” అంది అమృత ఉత్సాహంగా. “చెప్పండి తరువాత”

వసుధ పాలగ్లాసు తెచ్చి విజయరామయ్యకు ఇచ్చింది. ఆయన తాగి కింద పెట్టారు, అమృత కాఫీ కప్పు తీసుకుంది.

“నెల తరువాత ఒక నలభైమంది ఉద్యోగులతో శంకర్రావు గారు వచ్చారు. నేను అందరకూ భోజనాల ఏర్పాట్లు చేసి ఎప్పటిలాగే మౌనంగా కూర్చున్నాను. వచ్చిన వారందరూ మొక్కలను పరిశీలిస్తున్నారు శంకర్రావుగారు నాలుగైదు మొక్కల నించి కండెలను తెంపి చూసి ఆశ్చర్య పోయారు.

“ఓ మైగాడ్! ఏం చేశారు విజయ్? మొక్కజొన్న కండెలు చాలా ఆరోగ్యంగా వున్నాయి, బలంగా వున్నాయి.” అంటూ ఓ పది కంకులు కోసి చూశారు. సాధారణంగా పొత్తు మొదట్లో గింజలు పెద్దవిగా వుండి, చివర్లో చిన్నవిగా వుంటాయి. “ఇది ఎలా సాధ్యం! గింజలన్నీ చివరి వరకూ బలంగా వున్నాయ” అంటూ పొలం అంతా తిరుగుతూ పొత్తులను పరిశీలించారు. షాక్ తిన్నారు అలాగే కూర్చుండి పోయారు. “నేను మిమ్మల్ని తిట్టి బాధపెట్టాను. విజయ్! ఇదెలా సాధించావు? అద్భుతం! ఏం చేశావు విజయ్?” అంటూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తరువాత నేను చేసిన పనిని వివరించానమ్మా!

వెంటనే వెళ్ళి సీడ్ కార్ర్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని తీసుకొచ్చారు. ఆయన “మీరు అద్భుతాన్ని సాధించారు. మీరు నేషనల్ అవార్డుకు అర్హులు” అంటూ నన్ను అభినందనలతో ముంచెత్తారు. అంతే కాదు నారుమడి నుంచి పంటకోసే వరకూ నేను అమలు చేసిన విధానాన్ని ఇంగ్లీషు భాషలో ప్రింటు చేయించి, భారతదేశంలో వున్న అన్ని రాష్ట్రాలకు పంపించారమ్మా!

భారతదేశం లోనే ప్రప్రథమంగా ఎకరానికి ఇరవైఅరు క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది.”

“నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ ఫర్ ఎ విల్లింగ్ హార్ట్” అంది చప్పట్లు కొట్టి అమృత.

“తరువాత ఇతర రాష్ట్రాల వారంతా అదే విత్తనాలు మాకు కావాలని డిమాండ్ చేశారు. మేలురకం విత్తనాలు ఈనాటికీ విజయరాయ్, ఏలూరు, కొత్తపల్లి, చింతలపూడి నుంచే భారతదేశం అంతటా కొనుగోలు చేయబడతాయి. రైతులంతా భాగు పడ్డారు. అప్పుడు కౌలుకు వంద రూపాయలకే ఎకరం దొరికేది. ఇపుడు కౌలుకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వాళ్ళే నేర్చుకున్నారు” అన్నారు సంతోషంగా విజయరామయ్య.

***

పెద్ద పండుగ సంక్రాంతి వచ్చింది. ఇప్పటికీ గోదావరి జిల్లాలలో మనుషులంతా సంబరంగా జరుపుకునే పండుగ ఇది. బీదా బిక్కీ మనుషులు కూడా కుటుంబాలతో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. చీకటి వీడకుండా ఇళ్ళముందు భోగిమంటలూ, గుమ్మాలకు బంతిపూల దండలూ, కళ్ళాపి జల్లిన వీధులన్నీ ముత్యాలముగ్గులతో కళకళలాడిపోతాయి. కొత్తబట్టలూ, అరిసెలూ, పూతరేకులూ, కజ్జికాయలూ మొదలైన పిండివంటల తయారీలో ఇళ్ళ నించి వచ్చే ఘుమఘుమలూ, హరిదాసుల సంకీర్తనలతో సంక్రాంతి వచ్చింది. కోడిపందాలూ, పేకాటలూ, పలుకరింపుల మధ్య ఒక సంగీతంలా వినవచ్చే గోదావరి జిల్లాల గ్రామీణ ప్రాంతపు యాస, వీటన్నిటితో సంక్రాంతి పండుగ వచ్చింది.

తలంటుపోసుకుని వసుధ ఇచ్చిన కొత్త చుడీదార్ వేసుకుంది అమృత.

“డ్రెస్ చాలా బావుంది,ఇంత చక్కగా సరిపోయేలాగా ఎలాకొన్నారు?”

“మీ సునంద పిన్నికి తెలుసుగా, నువ్వేం బట్టలు వేసుకుంటావో. నాకు తెలియదు తీసుకుని రమ్మనమని చెప్పాను.”

“థేంక్యూ” అంది.

పండుగ సంబరంలో అమృతకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే, ఇంటికి వచ్చిన పేదలకు లేదనకుండా ఒక క్వింటాల్ ధాన్యం, బియ్యం పేదలకు పంచడం. ఇలా ఏటా జరుగుతుందని వసుధ చెప్పింది. ఇలా పంచడంలో పిల్లలు అనన్య, విశ్వతేజ, తనతో పోటీ పడేవారు. ఒక చిన్న ప్లాస్టిక్ గిన్నెలో బియ్యం పోసుకుని, కొంత చిల్లర డబ్బులు వాటిమీద ఉంచి, వచ్చిన వారి జోలెలో పోసి, థాంక్స్ అని చెప్పి లోపలికి వచ్చేవారు, ఇలా ఉదయం నించీ సాయంత్రం దాకా, పండుగ మూడు రోజులూ ప్రతీ ఏటా జరుగుతుందనీ, తమ ఇండ్ల నుంచే కాకుండా కాస్తోకూస్తో పెట్టగలిగే వారందరూ ధాన్యాన్ని, బియ్యాన్ని పంచుతారనీ సునంద పిన్ని చెప్పింది.

“మీకు ఎవరు ఇలా ‘థాంక్స్’ చెప్పమన్నారు?” అడిగింది అమృత.

“అమ్మమ్మ చెప్పింది” అంది అనన్య.

అమృతకు చాలా సంతోషం కలిగింది, దానం చేసేడపుడు కూడా వినమ్రంగా ఉండాలని నేర్పించిన పెద్దవాళ్ళ సంస్కారానికి మనసులోనే నమస్కరించుకుంది.

పొలంలో పని చేసే జీతగాళ్ళకు, సత్యవతికి, పిల్లలకు అందరకూ కొత్తబట్టలు తెప్పించింది వసుధ.

మధ్యాహ్నం భోజనాలు అయ్యాక విజయరామయ్య గారికి వసుధమ్మకు అమ్మమ్మ పంపిన గద్వాల్ చీర ఖద్దరు పంచలు పెట్టి కాళ్లకు నమస్కరించింది అమృత. అక్షతలువేసి దీవించారు ఇద్దరూ.

“నువ్వు మాకు మూడో ఆడపిల్లవి అయ్యావు అమృతా! ఈ వారం రోజులు మీ తాతగారు ఎంతో సంతోషంగా గడిపారు. చీర చాలా బావుందనీ మీ అమ్మమ్మకు చెప్పు.”

“నేను మీతో గడిపిన ఈ సంతోషకరమైన సమయాన్ని ఎప్పటికీ మరచిపోలేను అమ్మమ్మా! అమ్మా నాన్నకు ఇక్కడ కబుర్లు అన్నీ మెయిల్ చేశాను.”

“చాలా సంతోషపడ్డారు,రాత్రి మీ నాన్న,నాతో మాట్లాడారు అమృతా!” అన్నారు విజయరామయ్య.

“అవునండీ! అమ్మ కూడా నన్ను ఏజీ బి.ఎస్.సి.లో చేరమని చెప్పేసింది” అని సంతోషంగా చెప్పింది అమృత.

“ఈరోజు సాయంత్రం మనం కొత్తూరులో ఉన్న తాతయ్య చెల్లెలు లక్ష్మి గారి ఇంటికి వెళదాం” అంది వసుధ.

***

కారు కొత్తూరుకు బయలుదేరింది, దారిపొడవునా ఇళ్లు పొలాలు చెట్లు మనుషులను పరిశీలిస్తూ కూర్చుంది అమృత కారులో.

“ఈ ఊరి ఆడవాళ్లకు ఇంటి ముందు పూల మొక్కలు వేసుకోవటం అంటే చాలా ఇష్టం” అంది వసుధ.

“సునంద పిన్ని కూడా చెబుతూ ఉంటుంది, పేదల ఇళ్లు కూడా, ఇంటి ముంగిళ్ళలో చెట్టు నిండా విరబూసిన ముద్ద మందార పూలు ఉంటాయనీ, ఇంటి ముందున్న పంట కాలువ దానిమీద చిన్న వంతెన లాగా వేసిన తాటి దూలం, పక్కనే ఉన్న ఒక గడ్డి వాము ఇంటి చూరు మీద పాకిన సొర పాదు, పాదు మీద కనబడుతున్న సొరకాయలు, ఇంటికి ఫెన్సింగ్ లాగా వేసిన బంతి మొక్కలు, వీటిని చూడగానే గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టామని తెలిసిపోతుంది. ఒక నోస్టాల్జియాను అనుభవిస్తామని పిన్ని చెప్పేది.”

ఒక అరగంటలో కారు ఇంటి ముందు ఆగింది. ఇల్లు, ఇంటి చుట్టూ ఉండే ఆవరణ చాలా విశాలంగా ఉన్నాయి. పెరడు అంతా రకరకాల పూల చెట్లతో పరిశుభ్రంగా ఉంది. రక రకాల మందారాలు రంగురంగుల చేమంతులు, పాల బంతులు,గులాబీ మొక్కలు అన్నీ విరగబూసి ఆహ్వానిస్తున్నాయి.  ఇంటి గేటుకి ఈశాన్యంలో ఒక నీటి గుంట ఏర్పాటు చేసి అందులో వేసిన ఎర్ర కలువలూ,నీలికలువలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

అతిథులను ఆహ్వానించారు లక్ష్మి గారు. మర్యాదలూ పరిచయాలు అయ్యాకా, ఇంట్లో కళాత్మకంగా ఉంచిన వస్తువులన్నిటినీ చూస్తోంది అమృత.

“మీరు వీణ వాయిస్తారా అమ్మమ్మ గారూ?”

“అవునమ్మా! మా చిన్నతనంలోనే నాకు వీణ నేర్పించారు మా అమ్మగారు. డొక్కా సుబ్బారాయుడు గారు గొప్ప వైణిక విద్వాంసులు, వారి వద్ద పది సంవత్సరాలు సంగీత సాధన చేశాను. పిల్లలు, పెద్దవాళ్ళై ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయాక నాకు ఈ సంగీత సాధనే కాలక్షేపం, ఇటీవల కాలంలో ఎక్కువ సేపు కూర్చోలేక పోతున్నాను”  అన్నారు లక్ష్మీ గారు.

ఇంత పెద్ద ఇంట్లో తాము ఇద్దరమే ఉంటామని, పిల్లలు వచ్చివెడుతూ ఉంటారని అన్నారు లక్ష్మి గారు.

అమృత అడగగానే త్యాగరాజ కృతిని ‘సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి’, ‘వసంత రాగం’లో వినిపించారు. తీయని గొంతుతో పాడుతూ వాయిస్తూ ఉంటే చాలా సంతోషంగా వింది అమృత. మరొక రెండు హిందీ పాటలు, లలిత సంగీతం విన్నాక ఇంటి ముఖం పట్టారు అమృతా, వసుధ.

“పాట చాలా మాధుర్యంగా ఉంది” అంది అమృత.

“నీకు సంగీతం ఇష్టమా?”

“చాలా ఇష్టం, సంగీతాన్ని, సహజత్వాన్ని, సౌందర్యాన్ని ఇష్టపడనివారు ఉంటారా? ఒకవేళ ఉంటే నాకు వాళ్ళ మీద అనుమానం కలుగుతుంది” అంది అమృత.

వసుధ నవ్వేసింది.

“డొక్కా సుబ్బారాయుడు గారు చాలా గొప్ప విద్వాంసులు ఆయన డొక్కా సీతమ్మ గారి మునిమనవడు.”

“డొక్కా సీతమ్మ గారు ఎవరు? మునిమనవడు అంటే గ్రేట్ గ్రాండ్ సన్, అవునా?”

“అవును, వంద ఏళ్ల క్రితం గాథ ఇది, డొక్కా సీతమ్మ గారిది లంకలగన్నవరం, ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. కోడేరు వద్ద గోదావరి దాటితే మన లంకలగన్నవరం వెళ్ళిపోతాం. 1841, 1909 మధ్య కాలంలో సీతమ్మగారు జీవించారు. తండ్రి భవానీ శంకరం గారు. చిన్నతనంలోనే తల్లి పోయింది. తండ్రి ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ ఉంటే ఆయనకు సహాయం చేస్తూ ఉండేది సీతమ్మ. భర్త జోగారావు గారు, వారిది అనుకూలమైన దాంపత్యం. ఒకప్పుడు సీతమ్మ వారి గాథ తెలుగు పుస్తకాలలో పాఠ్యాంశంగా వుండేది. సీతమ్మ గారి ప్రత్యేకత ఏమిటంటే వచ్చిన వారు ఎవరైనా ఎప్పుడైనా లేదనకుండా అన్నం పెట్టేవారు. అప్పుడు రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజులు కదా! గోదావరి ప్రజలు కాలినడకనో, లేక బండ్ల మీదనో ప్రయాణం చేయవలసి వచ్చేది అట. హోటళ్ళు అవి లేని కాలంలో ఆమె ఇల్లే కొన్ని శతాబ్దాలు మనుషుల ఆకలి తీర్చింది.”

“ఎంత గొప్ప మనసు!” అంది అమృత.

“ఒకసారి ఆమె లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకుందామని అంతర్వేది పల్లకిలో వెడుతున్నారు. పల్లకిని మోసే మనుషులను బోయలు అంటారు. వారు గోదావరి ఒడ్డున పల్లకిని ఆపి అలసట తీర్చుకుంటున్నారు. ఈలోగా గోదావరి ఒడ్డు ఒక పడవ వచ్చింది. పడవ నుంచి పెళ్ళివారు దిగారట. వాళ్ల పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ‘ఇదిగో మనం గన్నవరం వచ్చేశాము, ఇంకాసేపట్లో మీకు సీతమ్మ సత్రంలో అన్నం పెడతారు.’ అని అనునయిస్తున్నారట. అది విని సీతమ్మ గారు తనను త్వరగా ఇంటికి తీసుకుని వెళ్ళమని పల్లకి మోసే బోయలను కోరిందట.

‘పెళ్లి వారు వస్తున్నారు వారికి వంట సిద్ధం చేయాలి’ అని చెప్పిందట.

మరొక సందర్భంలో ఒక తుఫాను రాత్రి వర్షంలో ఒక మనిషి లంక దిబ్బలలో ఇరుక్కు పోయాడట, రాత్రివేళ ఆకలితో కేకలు వేస్తున్నాడట. ఆ కేకలు విని సీతమ్మ భర్తను బ్రతిమలాడి పొంగుతున్న గోదావరిని లెక్కజేయకుండా తెప్ప వేసుకుంటూ వెళ్లి లాంతరు వెలుగులో ఆ మనిషిని వెతికి పట్టుకొని అన్నం పెట్టి వచ్చిందట. పిఠాపురం రాజావారు సీతమ్మ చేస్తున్న సేవకు ఆనందపడి ఒక గ్రామాన్ని బహుమతిగా ఇస్తానంటే అది వ్యాపారం అవుతుంది కాబట్టి వద్దు అని చెప్పిందిట”

“వాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ!” అంది అమృత.

“రాత్రిపూట దొంగలు వచ్చి అన్నం తిని పోతూ ఉండేవారట. బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ సెవెంత్ తన పట్టాభిషేక సమయంలో ఒక కుర్చీలో సీతమ్మగారి ఫొటో ఉంచి గౌరవించు కొన్నాడట. అందుకుగాను ఈమె ఫోటో తీసుకురమ్మనమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించారట, ముందు ఒప్పుకోకపోయినా, కలెక్టర్ గారి ఉద్యోగం పోతుందని సీతమ్మ సమ్మతించారు.. దానికి ఒక ప్రశంసాపత్రాన్ని నాటి చక్రవర్తి ఎడ్వర్డ్ సెవెంత్ పంపారట. అంతేగాక ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఒక అక్విడెక్ట్‌కు సీతమ్మ పేరుపెట్టి గౌరవించుకున్నారు. వీరు డొక్కా సీతమ్మ గారి వంశంలోని డొక్కా సుబ్బారాయుడు గారు.

ఇప్పటికీ సీతమ్మ గారి సత్రం ఉంది నేనూ, మీ తాతయ్యా, వెళ్లి చూసి వచ్చాం. ఆస్తులు కరిగిపోయి వారికే గడవటం కష్టమైన స్థితిలో కూడా ఆమె అన్నదానాన్ని కొనసాగించారు.”

“ఎలా?” ఆశ్చర్యంగా అడిగింది.

“ఆమె భర్త జోగయ్య గారు పొలం సాగు చేయిస్తూ ఉంటే భూమిలో ఒక బిందె దొరికిందట. దాని నిండా బంగారు నాణేలు ఉన్నాయట.”

“విల్ పవర్” అంది అమృత.

“అవును మంచి సంకల్పానికి భగవంతుడి సాయం ఉంటుందని మీ తాతయ్య అంటారు” అంది వసుధ.

 కబుర్లలో ఉండగా కారు ఇంటి ముందు ఆగింది.

(సశేషం)

Exit mobile version