Site icon Sanchika

పుడమితల్లి నేస్తం-5

[dropcap]వ[/dropcap]సుధ,అమృత ఇంట్లో అడుగు పెట్టేసరికి హాల్లో ఏవో సంచీలు పెట్టి ఉన్నాయి.

“ఎవరు వచ్చారండీ?” అడిగింది వసుధ.

“నెల్లూరు నుంచి సోమన శీనయ్యగారు వచ్చారు, కూతురు పెళ్లి చేసారుట, విజయవాడ సంబంధంట, విజయవాడ వచ్చి అక్కడ నించి నన్ను చూడటానికి వచ్చారు. ఒక గంట కూర్చుని ఇపుడే మీరు వచ్చేముందే వెళ్ళారు.”

వసుధ కవర్లు తీసి చూసింది. “ఇందులో బట్టలు ఉన్నాయండీ!” అంది.

“అవును నీకూ, నాకూ బట్టలు తెచ్చారు. పిల్ల పెళ్లి జరిగింది, ఆశీర్వదించమని, పిల్లలకు స్వీట్లు, పళ్ళు పట్టుకొచ్చారు. మంచిమనిషి శీనయ్యగారు, అపుడు చవుడు పొలం పదివేలు ఖరీదు చేసేది ఇపుడు పదిలక్షలు అయిందిట. కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని చెప్పారు.”

“పోనీలెండి భగవంతుడు చల్లగా చూశాడు. అయ్యో! సమయానికి నేను కూడా లేను. ఆ పెద్దమనిషికి ఏం మర్యాదలు చేసారు?”

“అబ్బో! మీ అట్లూరి వారికే మర్యాదలు తెలుసు మాకు తెలియదా?”

“ఏం చేసారు?” అంది ఆశ్చర్యంగా

“సత్యవతి జున్ను, పళ్ళు, పెట్టింది.”

“ఆ మర్యాద కాదండీ!”

“అది కూడా మాకేమీ తెలియదా? దేవుడి మందిరంలో ఉన్న వెండి కుంకుమభరణి, ఒక అయిదు వేల రూపాయలు బలవంతంగా జేబులో పెట్టాను, కూతురుకు, అల్లుడుకు బట్టలు కొనిపెట్టమని, తాతయ్య ఆశీస్సులనీ చెప్పాను.”

“హమ్మయ్య! మంచిపని చేశారు.” అంది సంతోషంగా వసుధ. విజయరామయ్య గమ్మత్తుగా మూతి తిప్పడం చూసి గట్టిగా నవ్వేసింది అమృత.

“ఎవరండీ ఆయన?”

“చాలా ఏళ్ల క్రితం 2014లో అనుకుంటాను,నాకు ఒక ఫోన్ వచ్చింది” అంటూ వివరాలు ఇలా చెప్పారు విజయరామయ్య.

“అన్నా! నా పేరు సోమన శీనయ్య. నేను నెల్లూరు, వెంకటగిరి మండలం, ‘పంజాం’ అనే ఊరి రైతును. అన్నా! నాకు ఇపుడు వేరు దారి లేదు, ఆత్మహత్య చేసుకోవాల, బోల్లిమాటలు నమ్మి చవుడు నేల కొనేసాను. పద్నాలుగు ఎకరాలు, నాకున్నది గాక అప్పుజేసి కొన్నాను. ఇద్దరు బిడ్డలు, వాళ్లకు ఏం బెట్టాలి? ఎవురో నీ ఫోన్ నంబరు ఇచ్చినాడు. నువ్వు ఏదైనా దారి జూపిస్తవని నీకు ఫోను జేశాను అన్నా!”

“శీనయ్య గారూ! మీరు కంగారు పడవద్దు, ఆత్మహత్య తలపెట్టకండి, చచ్చిసాధించేది ఏదీలేదు. మీ భార్యాబిడ్డలకు అన్యాయం చేయనని మాటివ్వండి. నేను మీకు చవుడు నేలను తట్టుకుని పండే కొత్తరకం వరి విత్తనాలను, మీ పొలం పద్నాలుగు ఎకరాలకు సరిపడా పంపిస్తాను. మీరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. మీ ఎడ్రసు వివరాలు పంపండి. అంతే కాదు సేద్యం చేసే పద్ధతిని కూడా మీకు నేను చెపుతాను. భయపడవలసిన పనిలేదు. ‘గ్రీన్ సూపర్ రైస్’ అనే వరివంగడం లోని ఒక రకం చవుడు

నేలను కూడా తట్టుకుని నిలబడుతుంది శీనయ్యగారూ! అని చెప్పాను అమృతా!”

“సూసైడ్ ఈజ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఎ టెంపోరెరీ ప్రొబ్లెం” అన్నారు శివ్ కెహర అనే వ్యక్తిత్వ వికాస నిపుణులు” అంది.

“నిజం! సమస్యలు జీవితంలో వస్తాయి కానీ జీవితమే సమస్య కాకూడదు, ఉత్తుంగ తరంగ శోభితం జీవితం కదా! జీవితానికి పొంగూ, కుంగూ, రెండూ ఉంటాయి. దీనికి పిల్లలను సన్నద్ధం చేయడమే పెద్దవాళ్ళు చేయవలసిన పని.” అన్నారు.

“అవును తాతయ్యా, తరువాత ఏమైంది?”

“చెప్పినట్టుగానే గ్రీన్ సూపర్ రైస్ ఎస్.ఎ.ఎల్ 10 రకం పంపించి,సేంద్రీయ పద్ధతులను కూడా చెప్పాను. ఆ సంవత్సరం ఎకరానికి నలభై బస్తాల ధాన్యం పండింది” అని సంతోషంగా చెప్పారు.

“అన్నా! నిలువునా పానం తీసుకునే వాడిని బతికిపోయాను. అని చెప్పారు శీనయ్య. ”

“ఈ గ్రీన్ సూపర్ రైస్‌ని నేను 2014 అక్టోబరులో, ‘ది వరల్డ్ ఫార్మర్ డే’ ఉత్సవాలకు మనీలా వెళ్ళినపుడు ‘డాక్టర్ జవహర్ ఆలి’ అనే శాస్త్రజ్ఞులు నాకు ప్రత్యేకంగా ఏడు రకాల గ్రీన్ సూపర్ రైస్ ఇచ్చారు. వాటిలో మూడు రకాలు బాగా ప్రసిద్ధి చెందాయి. తరువాత కొత్తగూడెం మార్కెట్ యార్డ్ చైర్మన్ రెడ్డిగారికి కూడా అరవై ఎకరాలకు సరిపడా విత్తనాలు ఈ గ్రీన్ సూపర్ రైస్ పంపాను, వారు ధర చెల్లించి తీసుకున్నారు”.

“అసలు ఈ చవుడు భూములు ఎలా ఏర్పడతాయీ?”

“ఈ చవుడు భూములను పాల చవుడూ, ఉప్పు చవుడూ అంటారు. కొన్ని చోట్ల ఉప్పునీరూ, మురుగు నీరూ కారణంగా ఆర్గానిక్ బాక్టీరియా చనిపోతాయి. నేల గట్టిపడి నీరు ఇంకదు. భూమి తన సహజత్వాన్ని కోల్పోతుంది. దీనికి విరుగుడుగా అనేక ఆధునిక వ్యవసాయ పనిముట్లు, పద్ధతులు వచ్చాయి. పొలాన్ని దమ్ము చేసి,శుభ్రపరచి సేంద్రీయ, రసాయినిక ఎరువులు వేసి, పంటలు వేస్తారు. ఇపుడు చవుడు భూములు చాలావరకూ తగ్గిపోయాయి.”

“ఆధునిక శాస్త్రవిజ్ఞానం రైతులకు అందడంవల్లనే ఇది సాధ్యమయింది కదండీ?”

“అవును అమృతా! ఈ మానవ జీవితంలో అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానమే. విజ్ఞానమే అన్ని సమస్యలకూ సమాధానం చెపుతుంది అన్న ఒక చైతన్యం రైతాంగంలో కూడా కలుగుతోంది ఇపుడిపుడే. దానికి ప్రభుత్వాలూ,వ్యక్తులూ మరింత దోహదపడాలి.”

“అవును తాతయ్యా”

***

ఉదయం పదిగంటలైనా ఇంకా చలి వీడలేదు. వసుధ అమృత, సత్యవతి వంటగది వరండాలో కూర్చుని కూరలు తరుగుతున్నారు.

“అమృతా! నా పడకగదిలో ఉన్న బీరువాలో చాలా పుస్తకాలు ఉన్నాయి. వ్యవసాయ సంబంధిత పుస్తకాలతో బాటూ స్వామీ వివేకానందుల వారి గురించినవి, అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథ, ఇంకా కలాం గారి ఇతర పుస్తకాలు, పుల్లెల రామచంద్రుని గారు రచించిన రామాయణ, భారతాలూ, నీకు కావలసినవి తీసుకుని వెళ్ళు,అవన్నీ నేను చదివినవే.”

“ధాంక్యూ! వెరీ మచ్”

పిల్లలు అనన్య, తేజ వచ్చిన రోజునుంచీ తోటి పిల్లలతో క్షణం తీరుబడి లేకుండా ఆటలు ఆడుకుంటున్నారు.

“అక్కా!… మేం డాబామీద గాలిపటాలు ఎగురవేస్తున్నాం… చాలా ఎత్తుకు వెడుతున్నాయి. నువ్వు కూడా వస్తావా?” అడిగాడు తేజ.

“లేదురా పండూ! నేను పుస్తకాలు సర్దుతున్నాను, మీరు ఆడుకోండి.”

“అక్కా… ఇంక మనం మూడు రోజుల్లో వెళ్లిపోతామా?” అడిగింది బిక్కమొహం పెట్టి అనన్య.

“లేదు, నాలుగురోజుల్లో” అని నవ్వింది అమృత.

పిల్లలకు అమ్మమ్మ ఇల్లు స్వర్గం,నిజానికి తనకూ అలాగే ఉంది.

“తాతగారూ! పుస్తకాలు అన్నీ గజిబిజిగా ఉన్నాయి,ఒక క్రమంలో సర్దిపెడతాను.”

“అవునమ్మా! ఈ మధ్య ఓపిక ఉండటం లేదు, బంగారుతల్లివి సర్దిపెట్టు.” అన్నారు .

పుస్తకాలు అన్నీ తీసి ఒక్కొక్క అరలో ఒక్కొక్క విభాగంగా సర్దడం మొదలుపెట్టింది అమృత. చాలావరకూ వ్యవసాయ పత్రికలూ, అన్నదాత, కృషీవలుడు, రైస్ టుడే పత్రికలు, నెక్కంటి విజయరామయ్య ముఖచిత్రం ఉన్నవి అన్నీ ఒక అరలో పెట్టింది. 1985లో నాటి అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగారు బూటాసింగ్ గారు ఇచ్చిన ప్రశంసా పత్రాన్ని చదివింది.

“వరి పంట పరిశోధనలో మీరు భారతదేశానికి గర్వకారణమయ్యారు. ఇంకా తోటి రైతాంగానికి అవగాహన కలిగిస్తూ, స్ఫూర్తిదాయకంగా ఉన్నందుకుగానూ, మిమ్ములను అభినందిస్తున్నాము.”

చదివి కవరులో పెట్టింది. ఇంకా కొన్ని ఫోటోలు తీసింది.1988లో ‘జుఅరీ అగ్రోకేమికల్స్ లిమిటెడ్’ వారు ‘కృషి సామ్రాట్’తో సత్కరిస్తున్నప్పటి చిత్రాలను తీసి ఆల్బంలో పెట్టింది. ఇలా విజయరామయ్య గారు అందుకున్న ప్రసంశా పత్రాలను ఒక ఫైల్లోనూ, ప్రముఖులతో ఉన్న చిత్రాలను ఆల్బం లోనూ పెడుతోంది. 1980లో రైస్ రీసెర్చ్ స్టేషన్ మారుటేరు సిల్వర్ జూబ్బ్లీ ఫంక్షన్‌లో అందుకున్న బెస్ట్ ఫార్మర్ అవార్డు, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డుతో 1987 ఆగస్ట్ పదిహేనున సత్కరించినదీ, 1989లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఇచ్చిన ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డ్, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఫామ్ ఫౌండేషన్ నుంచి బంగారు పతకం అందుకుంటున్న చిత్రం, 1992 నవంబరులో ఐ.ఆర్.64 వరివంగడాన్ని భారతదేశం అంతటా ఇరువై అయిదు లక్షల హెక్టారులలో విస్తరింపజేసినందుకుగానూ అందుకున్న ప్రశంస అది. 1998 ఏప్రిల్ ఇరువది నాలుగున ఆచార్య ఎం.జి రంగా విశ్వవిద్యాలయం ‘కృషిరత్న’ అవార్డుతో సత్కరించిన పత్రం, కాకతీయ కళాసమితి నాగభైరవపాలెం గుంటూరు జిల్లా వారిచే ఆంధ్రాబ్యాంకు ప్లాటినం జూబ్లీ సందర్భంగా రిజర్వుబేంక్ గవర్నరు గారిచే అవుట్‌స్టాండింగ్ రైస్ ఫార్మర్ అవార్డు, 1985లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో డాక్టర్ ఎన్.టి. రామారావు గారిచే అందుకున్న బెస్ట్ ఫార్మర్ అవార్డు, 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారినుంచి, డాక్టర్ ఐ. వి. సుబ్బారావు బెస్ట్ ఫార్మర్ అవార్డు, నాటి ముఖ్యమంత్రి రోశయ్య గారి నుంచీ అందుకున్నారు విజయరామయ్య.

ఇలా చూస్తూంటే కవరు లోంచి కొన్నిచిత్రాలను తీసింది అమృత. అవి, నాటి యు.ఎస్. ప్రెసిడెంట్ జార్జ్ బుష్, నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిగారితో, మరియు ఇర్రి డైరెక్టర్స్‌తో వేదిక పంచుకున్న విజయరాయ్యగారు, 2013లో గ్లోబల్ అగ్రికల్చర్ సమితి వారు అందించిన ప్రశంసాపత్రాన్ని ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోది చేతుల మీదుగా అందుకుంటున్న చిత్రం, అది. 2014 జనవరి పద్ధెనిమిదిలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వారు నాటి వ్యవసాయ శాఖామంత్రి, హైకోర్ట్ న్యాయమూర్తి చేతుల మీదుగా అందించిన ‘స్ఫూర్తి’ అవార్డు, ఇలా అన్నిటినీ తీసి పొందికగా పెడుతోంది అమృత. కవరు లోంచి జారిపడ్డ ఉత్తరం చూడగానే అమృత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.

ఆ ఉత్తరం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి వచ్చింది. అది ఇంగ్లీష్ భాషలో వుంది.

“ప్రియమైన నెక్కంటి విజయరామయ్య గారూ,

ఇటీవల కాలంలో నేను భారతదేశం వచ్చిన సందర్భంలో,ఆఫ్రికా మరియూ దక్షిణ ఆసియాలో ఒత్తిడికి తట్టుకొనగలిగే వరి ధాన్యాన్ని అందించే ఎస్.టి.ఆర్.ఎ.ఎస్.ఎ, అమూల్యమైన కార్యాచరణ చేస్తోంది ఈ ప్రయత్నానికి మీరు తోడ్పాటును అందిస్తున్నందుకుగాను మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ కాలాన్ని, నిపుణతనూ మాతో పంచుకున్నందుకు గానూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను”

కింద సిన్సియర్లీ బిల్ గేట్స్ అని సంతకం ఉంది.

ఆ ఉత్తరం పుచ్చుకుని ముందుగదిలో కూర్చున్న విజయరామయ్య వద్దకు పరుగెత్తింది అమృత.

“తాతగారూ! నాకు చెప్పలేదే? మీరు బిల్ గేట్స్ నుంచి గొప్ప అభినందనను అందుకున్నారు. చెప్పండి” అంటూ చేతులు పట్టుకుంది.

“ఫౌండేషన్ నుంచి వచ్చిన ఉత్తరం చూశావా?”

“ప్రపంచ భాగ్యవంతులలో ఒకరు, అంతే గాక ఔదార్యం కలిగిన వారూ బిల్ గేట్స్, వారు నాలాంటి గ్రామీణ రైతుకు డిల్లీకు రమ్మనమని ఆఫ్వానం పంపారు.”

“చెప్పండి”

“ఆ రోజు నాకు లైజన్ ఆఫీసర్ డాక్టర్ యు ఎస్ సింగ్ గారి నుంచి ఫోన్ వచ్చింది.”

“మిస్టర్ విజయ్! నేను యుఎస్ సింగ్‌ను మాట్లాడుతున్నాను. మిస్టర్ బిల్ గేట్స్ భారతదేశం వచ్చారు. ఢిల్లీలో ఉన్నారు. మిలియన్ల డాలర్లు రైతు సంక్షేమ నిమిత్తం ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఉన్నారు. మీరు చేసిన కృషి గురించి తెలుసుకున్నారు. మిమ్మల్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో పాల్గొనడానికి ఆహ్వానించమన్నారు. మీరు వెంటనే డిల్లీకు బయలుదేరి రండి.”

“విషయం ఇంగ్లీష్‌లో చెప్పారు నాకు హిందీ రాదు. నేను వెంటనే హైదరాబాద్ వెళ్లి అక్కడనించి ఢిల్లీకి వెళ్లాను. హోటల్ తాజ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు అయింది. అది 2009 ఆగష్ట్ ఒకటవ తేది, సమావేశానికి ముప్ఫై మంది ఐ.ఏ.ఎస్ సెక్రటరీలు వివిధ రాస్ట్రాలనుంచీ ఆహ్వానించబడ్డారు. వారి సలహా ప్రకారం, బీహార్,ఒరిస్సా,ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి సహాయం చేసే ఉద్దేశంతో బిల్ గేట్స్ ఉన్నారు. అయితే లైజన్ ఆఫీసర్ యు ఎస్ సింగు గారు, మీరు అడగవలసినది రైతును, ప్రభుత్వసలహాదారులను కాదు అని చెప్పి వారి అంగీకారంతో నాకు ఆహ్వానం పంపారుట. వ్యవసాయ రంగ శాస్త్రజ్ఞులు, మిస్టర్ బిల్ గేట్స్, యు ఎస్ సింగు గారితో పాటూ నేను కూడా వేదికను పంచుకున్నాను. నన్ను మాట్లాడమన్నారు.”

“నేను మైక్ ముందు నిలబడ్డాను, నేను కొంతసేపు ఇంగ్లీష్ లోనూ కొంతసేపు తెలుగులోనూ మాట్లాడాను. నేను మాట్లాడినదంతా ఇంగ్లీష్ లోకి అనువదింపబడింది.”

~

“ఈ సమావేశానికి హాజరు అయిన పెద్దలందరకూ నా నమస్కారములు,

“మిస్టర్ బిల్ గేట్స్! మీరు పెద్దమనసుతో రైతాంగానికి సహాయం చేయాలనుకుంటున్నారు, మీరు చేసే ఆర్థిక సహాయం రాష్ట్రాలకూ, ప్రభుత్వాలకూ ఇస్తే మా రైతాంగానికి ఒక్క రూపాయి కూడా అందదు. భారతదేశంలో వరి పరిశోధనా సంస్థలకు నిధులు లేవు. భారతదేశం లోని వరి పరిశోధనా సంస్థలకు, ఇక్రిశాట్ సంస్థకు, అమెరికాలోని మొక్కజొన్న పరిశోధనా సంస్థకూ, కెనడాలోని గోధుమ పరిశోధనా సంస్థకూ మీరు ఆర్థిక పుష్టిని కలిగించడం ద్వారా ఇటు రైతాంగానికి అటు ప్రభుత్వాలకూ కూడా మేలుచేసినవారు అవుతారు. కేవలం వరి మాత్రమే కాదు, జొన్న, మొక్కజొన్న,గోధుమ వంటి పంటలకు మేలు రకాలైన విత్తనాలను రైతులకు ఇవ్వడం ద్వారా అందరకూ సహాయం అందుతుంది. కృతజ్ఞతలు. అని చెప్పానమ్మా!”

~

“అలా నేను మాట్లాడటం పూర్తికాగానే బిల్ గేట్స్ లేచి గబగబా నా వద్దకు వచ్చి, కరచాలనం చేసి నన్ను ఎంతో అభినందించారు. సమావేశమంతా కరతాళధ్వనులతో మ్రోగిపోయింది. హోటల్ గదికి వచ్చి సింగు గారు నన్ను కౌగలించుకున్నారు.

“మిస్టర్ విజయ్! బిల్ గేట్స్ గారు వారి గ్లోబల్ మానేజర్‌ను మీ ఊరు పంపుతారట మీ పొలాల చిత్రాలను, వివరాలను తీసుకుంటారు.” అని చెప్పారు.

“వచ్చారాండీ?”

“వచ్చారు, యు ఎస్ సింగు గారితో పాటూ ఒక మహిళ, గ్లోబల్ మానేజర్ వచ్చారు. వారి పేరు గుర్తులేదు. ఒకటి గుర్తు ఉంది ఏమిటంటే ఆ రోజు మీ అమ్మమ్మ వారికి భోజనంలో మామిడికాయ పులిహోర పెట్టింది. భోజనం చాలా బాగుందన్నారు. తరువాత పొలానికి వెళ్లి, కావలసిన ఫోటోలు, వివరాలూ తీసుకుని రాజమండ్రి వెళ్లి అక్కడనుంచి విమానంలో ఢిల్లీకు వెళ్ళిపోయారు. తరువాత ఇక్రిశాట్ సంస్థకూ, ఇతర వ్యవసాయ పరిశోధనా సంస్థలకూ ‘బిల్ అండ్ మెలిండా గేట్స్’ ఫౌండేషన్ నుంచి కోట్లాది రూపాయలు ఆర్ధిక సహాయం అందినట్లు ఆ సంస్థల డైరెక్టర్‌లు నాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పారు.”

“యు ఆర్ గ్రేట్ తాతగారూ!” సంబరంగా అంది అమృత.

“అమ్మా! ఈరోజు మీ యువతకు ఉన్న అవకాశాలు గొప్పవి, చదువులు పెద్దవి, మీ విజ్ఞానం,ఈ సాంకేతికపరమైన అభివృద్ధి ఒక బడుగు రైతుకు అందినపుడు మాత్రమే అది సఫలమైనట్లు, ఎన్ని ఘనవిజయాలైనా ఒక పేదరైతు కష్టాల ముందు వెలవెల బోతాయి, మతం చేయలేని పనులను, పూరించలేని అసమానతలను కొంతవరకూ సైన్సూ, విజ్ఞానం పూరించగలిగలిగింది, కానీ కరుడుగట్టిన స్వార్థాన్ని, దయారాహిత్యాన్ని నిలబెట్టి ప్రక్షాళన చేసేందుకు మనకు చిత్తశుద్ధి కావాలి, ప్రాణాలు పణంగా పెట్టినవారు గాలిలో కలిసిపోయారు. ”

“అవును తాతగారూ! ఆర్మ్స్ స్ట్రెంగ్త్ ఈజ్ షార్ట్ లివ్డు”

“సమాజాన్ని నియంత్రించగలిగే విద్య, మతం, చట్టం, ఈ మూడూ ఏ రకంగా విఫలమవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి వ్యక్తులనూ, సమాజాలనూ సంస్కారవంతంగా ప్రభావితం చేయగలిగే కొత్త శక్తులను మీ తరం సాధించగలగాలి. నిజానికి ఈరోజు సమాజం ఒక మిధ్య. మనుషులు విడివిడిగా గుంపులో కలసి ఉంటున్నారు, పూర్వం కుటుంబాలనూ, చిన్నచిన్న సమూహాలనూ ఒక ఐడియాలజీ, ఒక భక్తి, ఒక భయం, ధర్మం ప్రభావితం చేసేవి. ఈ రోజు ఒక మనిషి సాటి మనిషి నించి నేర్చుకునేది, వంటబట్టించుకునేది స్వార్థాన్ని మాత్రమే. ఇంతటి నిరాశాజనకమైన పరిస్థితిలో ఆశ, నమ్మకం అడుగంటి పోతాయి. అలాంటి చవుడు భూమి నించి కూడా ఎపుడో, ఎకడో ఒక మొలక చిగురిస్తుంది, అది నీవు కావచ్చు మరొకరు కావచ్చును. ఆ విత్తనాన్ని, ఆ వంగడాన్ని మనం కాపాడుకుందాం, వృద్ధి చేసుకుందాం, అపుడది సమిష్టి విజయానందం అవుతుంది.”

విజయరామయ్యగారి లోని ఉద్వేగాన్ని, ఆలోచననూ పంచుకొంటూ శ్రద్ధగా వింది అమృత.

(సశేషం)

Exit mobile version