పుడమితల్లి నేస్తం-6

0
2

[dropcap]మ[/dropcap]ధ్యాహ్నం వేళ పిల్లలూ, వసుధమ్మా, ‘టీవీ’లో మాయాబజార్ సినిమా చూస్తున్నారు. విజయరామయ్య, అమృతా కూడా వచ్చి కూర్చున్నారు.

“అమ్మమ్మా! కృష్ణుడూ, ఘటోత్కచుడూ, సొంత బ్రదర్సా,లేక కజిన్సా?” అనన్య అడిగింది. వసుధ ఓపికగా పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెపుతోంది.

“మీ అమ్మమ్మ ఓ వందసార్లు చూసింది ఈ సినిమాను, అయినా మళ్ళీ చూస్తుంది.”

“నాకు కృష్ణుడి పాత్రలో ఎన్.టి. రామారావు గారిని చూడటం చాలా ఇష్టం, మీరు చూడరేమిటి శ్రీకృష్ణ తులాభారం, భూకైలాస్ సినిమాలు?”

“నిజమే పురాణపురుష పాత్రలు వేయాలంటే వారికి వారే సాటి.”

“అవును నాకు కూడా చాలా ఇష్టం. తాతగారూ! మీరెపుడైనా వారితో మాట్లాడారా?”

“అవునమ్మా! నేనూ, నాటి వ్యవసాయ శాఖామంత్రి శ్రీ వసంత నాగేశ్వరరావు గారూ, ఇద్దరం కలిసి వారింటికి వెళ్ళాము. నాగేశ్వరరావుగారు నన్ను రామారావుగారికి పరిచయం చేయబోతే ‘వీరు నాకెందుకు తెలియదూ? బ్రదర్! ఇంటర్నేషనల్ అవార్డు తెచ్చుకున్నావు చాలా సంతోషం’ అన్నారు. వెంటనే వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. వారి పేరు శ్రీ ఆలపాటి అప్పారావు గారు.

‘అప్పారావుగారూ! నెక్కంటి విజయ రామయ్యగారి కృషి నాకు ఎప్పటినుంచో తెలుసును, వారు ఉన్నంతకాలం మీ సలహాదారుగా తీసుకోండి’ అని చెప్పారు. ఒక పది సంవత్సరాలు కమిటీ సలహాదారుగా పనిచేసాను, వ్యవసాయ సంబంధిత సమావేశాలన్నింటికీ నాకు ఆహ్వానం వచ్చేది. మరొక సందర్భంలో కూడా రామారావు గారిని కలిశాను, అది ఎపుడంటే ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో 1980 నుంచీ 2006 వరకూ సేద్యం చేసాను. అక్కడ హిల్ స్టేషన్ మీద రెండువేల ఎకరాల భూమి ఉంది, ఒకప్పుడు అక్కడ పొగాకు పరిశోధనా కేంద్రం ఉండేది, దానిమీద కొంతమంది రాజకీయ నాయకుల దృష్టి పడింది, అక్కడ ఒక వ్యవసాయ కళాశాల, పండ్ల పరిశోధనా కేంద్రం పెడితే బావుండును అనిపించింది నాకు. వెంటనే స్థానిక ఎం.ఎల్.ఏ గారిని తీసుకుని రామారావు గారిని కలిశాను, అక్కడ అగ్రికల్చరు కాలేజీ, హార్టీకల్చరు కాలేజీ పెట్టడానికి ఆ ప్రాంతం అనువుగా ఉందో లేదో చూసి రమ్మనమని, వైస్ ఛాన్సలర్‌ గారికి చెప్పారు. అపుడు నాతో వి. సుబ్బారావు గారు వచ్చారు, అది అంతా అటవీ ప్రాంతం కదమ్మా! హోటళ్ళూ అవీ ఏవీ లేవు. వారు ఉన్నన్ని రోజులూ భోజన సదుపాయాలూ అన్నీ నేనే చూసుకునీ వాడిని. వసుధ ఆచంట లోనే ఉండేది, వారంవారం వెళ్ళివస్తూ ఉండేవాడిని స్కూటర్ మీద, అపుడు పెట్రోల్, ఆయిల్ ధర కలిపి లీటరు ఒక రూపాయి ఉండేది, నేనూ సుబ్బారావు గారూ కలిసి ఆ ప్రాంతం అంతా తిరిగాము.

“విజయ రామయ్యగారూ! ఇక్కడ మంచి కాలేజీ వస్తుంది” అన్నారు. ఆయన నివేదిక ఇవ్వడం, వెంటనే ఆమోదం రావడంతో భవననిర్మాణం మొదలైంది. అలా మనకు ఒక మంచి, ఉత్తమమైన కళాశాల వచ్చింది అమృతా! అక్కడ మంచి అనుభవమూ, నిపుణతా కలిగిన ప్రొఫెసర్లను నియమించారు. కానీ వారంతా నన్ను బాగా తిట్టుకున్నారు”

“ఎందుకండీ?”

“ఎందుకంటీ అక్కడ ఇళ్లు లేవు, కుటుంబాలు వచ్చి ఉండటానికి సదుపాయాలు లేవు, అపుడు సమస్యను వీ.సీ. గారికి చెపితే, సమీపంలో ఉన్న సత్తుపల్లి నుంచి కాలేజీకు వెళ్లి రావడానికి బస్సు ఏర్పాటు జేశారు. తరువాత ఐ.సి.ఆర్. డైరెక్టర్ గారి సహకారంతో ఆయిల్ ఫామ్, పండ్ల పరిశోధనా కేంద్రం కూడా వచ్చాయి.”

ఫోను మోగడంతో విజయరామయ్య లేచారు. “నేను విజయరామయ్యను మాట్లాడుతున్నాను, నమస్కారమండీ, సంతోషమండీ, బయోడేటా, వివరాలూ పంపిస్తాను” అని ఫోన్ పెట్టారు.

“ఏమిటి తాతయ్యా! బయోడేటా అంటున్నారు? ”

“అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ గారు ఫోన్ చేసారు, డాక్టర్ జవహర్ ఆలీ గారు నాకు గౌరవ డాక్టరేట్‌ను ఇవ్వవలసిందిగా సూచించారుట. వివరాలు పంపమన్నారు.”

“ఓ… యు ఆర్ గోయింగ్ టూ ఏడ్ వన్ మోర్ ఫెదర్ టు యువర్ కేప్” అంది సంతోషంగా.

“ఇది మీ నిబద్ధతకూ, లక్ష్యసాధనకూ అమ్మవారు ఇచ్చిన బహుమతి” అంది వసుధ భర్తను ప్రేమగా చూస్తూ.

“థాంక్స్ సుధా!”

“నాకు తెలిసింది శ్రమించడం, ఆ… జ్ఞానసరస్వతిని ఆరాధించడం, సరస్వతీ పుత్రులైన శాస్త్రజ్ఞులు నన్నెంతో అభిమానించారు. అమ్మానాన్నలతో పాటూ నా రైతు సోదరులందరికీ నేను రుణపడి ఉన్నాను. ఒకొక్క రకమైన విత్తనం రావడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది, పది పంటలు వేసి ప్రయోగం చేస్తారు, 1985లో మనీలా వెళ్ళినపుడు మన భారతీయ వ్యవసాయ శాస్త్రజ్ఞులు డాక్టర్ జయదేవ్ ఖుష్ గారు నా చేతిలో ఐ.ఆర్.64 అని పిలిచే వరి వంగడాన్ని ఒక కేజీ పెట్టారు, అది పాతిక లక్షల హెక్టార్ల పంటగా భారతదేశం అంతటా బంగారం పండించింది. ఇలా పచ్చని నేలలో నన్ను నడిపించిన నా గురువులు, నా మిత్రులు డాక్టర్ ఎం రామారావుగారికి, ఎస్ శ్రీనివాస రావు గారికి, డాక్టర్ జి. వెంకటరావు గారికి,యు ఎస్ సింగ్ గారికి, నేను ఎంతో రుణపడిఉన్నాను.”

***

 పిల్లలూ పెద్దలూ అందరూ భోజనానికి బల్ల వద్ద చేరారు.

“పాపగారూ! రేపే కదండీ మీ పయానం? అంది సత్యవతి.

“అవునండీ”

“ఒప్పుడు బయలుదేరతారూ? మీకోసం గోరింటాకు రుబ్బి అట్టుకోచ్చానండీ.”

“రేపు పొద్దున్నే. చాలా థాంక్స్” అని లోపలికి వెళ్లి ఒక కవరు తెచ్చి సత్యవతి చేతిలో పెట్టింది అమృత, “ఇది ఈ చీర మీకోసం నా బహుమతి” అంది.

“అయ్యో! వసుధమ్మ కొన్నారు కదండీ మళ్ళా మీరట్టుకొచ్చారు” అంది మొహమాటంగా.

“మంచి ముగ్గులు వేసినందుకు నా బహుమతి.”

“ఈ నాలుగురోజులూ సందడిగా గడిచిపోయిందండీ మీరు రాబట్టి ఆయ్.” అంది

ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న అమృత నవ్వేసింది.

పిల్లలు ప్రయాణం అయినపుడల్లా వసుధమ్మ బెంగ పెట్టుకుంటుంది, అది దాచుకునే ప్రయత్నాన్ని విజయరామయ్య గమనించారు.

“ఈరోజు ఏం వండావూ స్పెషల్” అన్నారు. చెప్పింది.

“చక్కెరపొంగలి అద్భుతంగా ఉంది” అన్నారు విజయరామయ్య.

“విజయలక్ష్మి గారు వండినట్లు ఉందా?” అడిగింది వసుధ.

“ఆవిడ ఎవరు?” అంది అమృత.

“ఆమె గొప్ప నృత్యకళాకారిణి, నటి అమృతా! ఎల్ విజయలక్ష్మి గారి మెరుపువేగాన్ని కెమెరాలు కూడా అందుకోలేవు అని చెప్పుకునేవారుట.” అన్నారు విజయరామయ్య.

“మనం గుండమ్మకధ సినిమా చూసాము కదూ, అందులో గుండమ్మ కోడలి పాత్ర వేసింది ఎల్ విజయలక్ష్మి గారే” అంది వసుధ.

“అవును నర్తనశాల సినిమాలో ఆమె నృత్యం అద్భుతం అనుకున్నాం కదూ”

“ఇలా ఒకటేమిటి, జగదేకవీరునికధ, పూజాఫలం, ప్రహ్లాద ఎన్నో సినిమాల్లో వారి నృత్యం అద్భుతంగా ఉంటుంది” అంది వసుధ.

“విజయలక్ష్మి గారి భర్త డాక్టర్ సుర్జీత్ కౌర్ దత్తా గారు బెంగాలీ, వారు ఫిలిపైన్స్ అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న గొప్ప శాస్త్రజ్ఞులు. విజయలక్ష్మి గారిది చాలా స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం, పెళ్లి నాటికి చదివింది మెట్రిక్యులేషన్ తరువాత వ్యవసాయ రంగంలో ఎం.ఎస్. చేసి, భర్తతో అమెరికా వెళ్ళినపుడు ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసి, వర్జీనియా విశ్వవిద్యాలయంలో కొంతకాలం బడ్జెట్ ఆఫీసర్‌గా పనిచేసారు. బెంగాలీ, స్పానిష్ భాషలను నేర్చుకునారు, నేను మనీలా వెళ్ళిన సందర్భంలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతున్నపుడు, పదిహేను రోజులు మాకు విందు ఏర్పాట్లు చేసారు, ఒక రోజు నన్నూ బూటాసింగ్ గారిని, అప్పటి ‘ఇర్రి’ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ స్వామినాధన్ గారి ఇంటికి భోజనానికి ఆహ్వానించారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైతును పిలిచేవారు, ఫిలిపైన్స్ ప్రెసిడెంట్ గారి సతీమణి శ్రీమతి ఇమిల్డానా మార్కోస్ ఆ రోజు వంటల పోటీ నిర్వహించారు, నేను మన భారతదేశం తరపున గంధపు చెక్కతో చేసిన గౌతమ బుద్ధుని ప్రతిమను ఇమిల్డానా మార్కొస్ గారికి బహుమతిగా ఇచ్చాను,అది కాకతాళీయం, ఆమె బౌద్ధమతస్థురాలని నాకు తెలియదు. ఎంతో విలువైన కానుకను భారతదేశపు రైతు నాకు ఇచ్చారని చాలా సంతోషపడ్డారు. ఆరోజు వంటల పోటీలో శాస్త్రజ్ఞులు, వారి భార్యలూ కూడా పాల్గొన్నారు. ఎల్ విజయలక్ష్మి గారు చేసిన చక్కెరపొంగలికి మొదటి బహుమతి వచ్చింది. అదీ విషయం, చాలా రుచిగా చేసారని పొరబాటున మీ అమ్మమ్మతో చెప్పాను.”

“ఇంతకూ ఎవరు వండినది బావుంది?” కొంటెగా అడిగింది అమృత.

“మీ అమ్మమ్మ వండినదే… అంతేగామరి!”

గట్టిగా నవ్వేసింది వసుధ. కబుర్లు చెప్పుకుంటూ అందరూ భోజనాలు చేసారు. “తాతగారూ! సాయంత్రం గోదావరిని చూసి వద్దామా?”

“అలాగే.”

***

తన ఎదురుగా నిండుగా ప్రవహిస్తున్న గోదావరి, నీరెండ అలలపై పడి మెరిసిపోతోంది, రెండు పడవలు నీటిమీద సాగిపోతున్నాయి, కనుచూపుమేర గలగలా పరుగెత్తుతున్న నదీమతల్లినీ, ఒక ఆహ్లాదకరమైన సాయంత్రపు అందాలనూ చూస్తూ కూర్చుంది అమృత. యాత్రికుల కోసం కట్టించిన సిమెంటు బెంచి మీద కూర్చున్నారు ఇరువురూ.

“ఇలా ఎన్నో యుగాలనించీ ఈ గోదావరి పరిగెడుతూనే ఉంది కదండీ?”

“అవును! ఎన్నో యుగాలనించీ ప్రవహిస్తూనే ఉంది, ఒక జల ప్రవాహం, ఒక జీవన ప్రవాహం జరిగిపోతూనే ఉంది. పాత నీరులా పాత తరం ఆలోచనలూ ఆశయాలూ సముద్రంలో కలసిపోతాయి, కొత్తనీరు మీ తరంలాగా కోటి ఆశలతో, ఆశయాలతో ఉరకలు పెడుతూ వస్తుంది” అంటూ చేతులు జోడించి నమస్కరించారు.

“ఎప్పటికపుడు ఆశ చిగురిస్తూనే ఉంటుంది, ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి” అంది అమృత.

“అవును! గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకుని వస్తాడు, దేశంలో క్షామం ఏర్పడి, తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో మహర్షి తన తపోశక్తితో, తోటి రుషులకూ, వారి శిష్యులకూ కరువు నుంచి విముక్తి కలిగించి, అన్నపానాలకు కరువు లేకుండా చేసాడు. ఇది పురాణం కావచ్చు లేదా నాటి విజ్ఞానం, సైన్సు కూడా కావచ్చును. ఈ గోదావరి నది పొడవు పద్నాలుగు వందల, అరవై కిలోమీటర్లు. ఉభయగోదావరి జిల్లాలలో కాలవల పొడవు ఆరువందల కిలోమీటర్ల పైనే, చానెల్స్, పంట బోదెలూ కలిపితే మూడున్నరవేల కిలోమీటర్లు ఉండవచ్చు,లక్షల ఎకరాల్లో పంటసాగుకు ఈ కాలువల్లో నీరే ఆధారం. ఎక్కడో అరేబియా సముద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాద్ జిల్లా రేoజల్ మండలం లోని కలవకుర్తి వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది, తరువాత ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి, భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. రాజమండ్రి ధవళేశ్వరం వద్ద గోదావరి ఏడు పాయలుగా చీలుతుంది. గౌతమి, వశిష్ట, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, పుణ్యభాగ, కశ్యప ఇలా సప్తర్షుల పేర్లతో పిలవబడతాయి. ఈ పరీవాహక ప్రాంతంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.” అన్నారు.

“దేవుడిని నమ్మేవారూ, విజ్ఞానాన్ని నమ్మేవారూ, ఇద్దరూ ఒప్పుకునేది శక్తిని.” అంది అమృత.

“అవును”

“అందులో రైతు కొలుచుకునేది ఈ ప్రకృతినే, ఈ ప్రత్యక్ష దేవతనే, అశ్వారావు పేటలో నేను వ్యవసాయం చేస్తున్నపుడు రైతు కూలీలు వరినాట్లు వేసే ముందు, సూర్యునికి, నీటికి, భూమికి నమస్కరించుకుని పని మొదలుపెడతారు. అందరూ కలిసి ఒక సైనిక వందనంలా చేసే ఆ ప్రక్రియ చూడటానికి ఎంతో బావుంటుంది.”

“నమస్కరించడం ఒక సంస్కారం కదూ తాతయ్యా, అది రెండు విషయాలను చెపుతుంది, ఒకటి నా పరిమితులను నేను గుర్తించాను, రెండవది నీలో ఉన్న ప్రతిభనో లేక నీ అనుభవాన్నో నేను గౌరవిస్తున్నాను.”

“చక్కగా చెప్పావు తల్లీ!”

“ఇపుడు నేను మీకు నమస్కరిస్తున్నాను” అంటూ లేచి విజయరామయ్యగారి కాళ్ళకు వంగి నమస్కారం చేసింది అమృత. “ఒక రైతుకు చేసే వందనం, భారతీయ రైతాంగం అందరకూ చేసే వందనం” అంది. విజయరామయ్యగారి కళ్ళు చెమర్చాయి, అమృత తలపై చేయివేసి నిమిరారు “చల్లగా ఉండు తల్లీ!”

ఫోన్ మోగింది, “వచ్చేస్తున్నాం సుధా!” జవాబిచ్చారు,

“అమృతకు పొద్దున్నే ప్రయాణం ఉంది. ఇంకా బట్టలు సర్దుకోలేదు, కేశవుల్ని చీకటితోనే వచ్చెయ్యమని చెప్పండి” అంది వసుధ.

“అలాగే”

“బయలుదేరదాం”

అమృత భుజం మీద చేయి ఆసరాగా వేసుకుని నెమ్మదిగా అడుగులు వేసారు విజయ రామయ్యగారు.

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here