పుళింద

0
1

[box type=’note’ fontsize=’16’] మాటిచ్చిన రాముడు వొస్తాడా అనే కొద్దిపాటి సందేహమున్నా, సత్యమంటే తనే అయిన మూర్తి అబద్ధం చెప్పడని తనకి తాను ధైర్యం చెప్పుకున్న పుళింద కథని వివరిస్తున్నారు జొన్నలగడ్డ సౌదామిని. [/box]

[dropcap]రా[/dropcap]మయ్య ఇటే వస్తున్నాడని తెలిసిన దగ్గరనించీ మతంగముని ఆశ్రమంలో ఉన్న నలుగురూ చేసే హడావిడికి అంతులేకుండా ఉంది.నిజానికి మతంగ మహర్షి సిద్ధి పొంది చాలా ఏళ్ళయ్యింది. పోయేముందు, మహర్షి తనకు సేవలు చేస్తున్న అక్కాచెల్లెళ్ళు శబరీ, పుళిందల్ని పిలిచి కొన్నేళ్ళ తరవాత దశరధరాముడు వస్తాడనీ, ఆయన ద్వారా వాళ్ళకి మోక్షం వొస్తుందనీ చెప్పి సిద్ధి పొందారు. అప్పటి నించీ ఆ అక్కా చెల్లెళ్ళు రాములవారు ఎప్పుడొస్తాడా అని వేచి ఉన్నారు. రాముడు వొస్తే ఏమి చెయ్యాలనీ, ఎట్లా ఆయనకి స్వాగతం పలకాలనీ, ఏమేం మధుర పదార్ధాలు చేసి పెట్టాలనీ, పూలదండలెట్లా కట్టాలనీ, రోజుకి పదిసార్లు ఎట్లా ఆయనకి సేవ చెయ్యాలని అక్కా చెల్లెళ్ళిద్దరూ మళ్ళీ మళ్ళీ ఆలోచించటం, చెప్పుకోవటం, ఇది కాదు, అది బావుంటుందే అనటమూ జరుగుతున్నయ్యి. ఆయన ఇంత పొడుగుంటాడనీ, కాదు కాదు, అంతనీ, ఇట్లా ఉంటాడనీ, కాదు అట్లా అనీ అక్క చెల్లెళ్ళ మధ్య మాట్లాటలూ, అప్పుడప్పుడు చిన్న పోట్లాటలూ, సాగుతూనే ఉండేవి. శబరి రాముడి మీద పాటలు కట్టటమూ, పుళింద వాటిని పాడడమూ, శబరి నైవేద్యాలు తయారు చెయ్యటమూ, పుళింద పూజా గృహాన్ని పూలతో అలంకరించటమూ చాలా ఏళ్ళు జరిగాయి.

ఆశ్రమమని వాళ్ళు పిలుచుకునే ప్రదేశంలో నాలుగు చిన్న గుడిసెలున్నయ్యి. మొదటి దాంటో శబరి ఉంటుంది. రెండోదాంట్లో మతంగ మహర్షి పాదుకలు ఉంటయ్యి. మూడోదాంట్లో పుళింద ఉంటుంది, నాల్గో దాంట్లో శబరికీ, పుళిందకీ సహాయంగా ఉంటానికొచ్చిన ప్రియంవద, మల్లికా అనే ఇద్దరు చిన్నారులుంటారు. పొద్దున్నే పుళింద లేస్తూనే పాట అందుకుంటే ప్రియంవద, మల్లికా జత కలిపేవాళ్ళు. పొద్దున్న మొదలెట్టిన పాట మళ్ళీ రాత్రి నిద్రపోయేదాకా పుళింద గుడిసెలో మోగుతూనే ఉంటుంది. అక్క రాసిన పాటలూ, తనకి తోచిన మాటలూ అలా అనేక రకాలుగా పాడుకోవటమూ, రకరకాలుగా పూల దండలు కట్టి అక్కడ ఉన్న పూజా గృహాన్ని పరిమళింపచెయ్యటమూ పుళింద పని. మందిరంలో ఉన్న దేవుళ్ళు పూదండల బరువుకి కింద పడిపోతే మళ్ళీ వాళ్ళని లేవతీసి కూచోబెట్టేది శబరి. శబరి మట్టుక్కూ మతంగ మహర్షి ఉపదేశించిన మంత్రాలు జపిస్తూ కూచునేది. ఆ గుడిసెలోంచి ఎప్పుడూ ఏ శబ్దమూ వొచ్చేది కాదు.

ఇన్నేళ్ళు గడిచిన తరవాత ఇప్పుడు రాములవారు తమ్ముడితో ఇటువైపొస్తున్నారని వార్త. శబరి అప్పటికే పెద్దదైంది. ఆశ్రమానికి ఎప్పుడూ వొచ్చే చెంచు కుల పెద్ద పాపయ్యతో ఒక్కసారి మతంగ ఆశ్రమానికి రమ్మని స్వామికి వినతి పంపుతూ, అతనితో విప్పపూల రసమూ,తేనే, తను తయారు చేసిన మధుర పదార్ధాలూ పంపిస్తూంటే, పుళింద పొద్దుట్నించీ అడవిలో వెతికి వెతికి తెచ్చిన పూలతో రెండు మాలలు చిత్రంగా అల్లి పంపింది. పాపయ్య మధ్యాహ్నానికి తిరిగొచ్చి రాములవారు రేపు వొస్తారని చెప్పాడు. “రాముడేమన్నాడు”, “ఏ పదార్ధం ఎక్కువ ఇష్టంగా తిన్నారు వాళ్ళు” “పూల మాలలు ధరించారా” “తేనె తాగారా” ఇల్లా మొదలైన పృశ్నలతో పొట్టుపొట్టయిపోయాడు. ఇక లాభంలేదని, తను వెళ్ళి ముందర లక్ష్మణ స్వామికి సంగతంతా నివేదించటమూ, ఇంతలో రామ ప్రభువు వొచ్చి సంగతంతా వినటమూ, మర్నాడు వొస్తానని మాటివ్వటమూ పూస గుచ్చినట్టు చెప్పాడు. పదార్ధాలేమీ తినలేదా అన్న శబరి ప్రశ్నకి తన ఎదురుగా కొద్దిగా తేనె మాత్రమే పుచ్చుకున్నారనీ, రామ ప్రభువు మట్టుక్కు పూలదండల్ని గుచ్చిన వైనం బాగా పరిశీలించి ఎంతో మెచ్చుకున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. శబరీ పుళిందా ఒకర్నొకరు చూసుకున్నారు. ఆనందం ఎక్కువై మాటలు రాక పుళింద వెళ్ళి అక్కని ఒక్కసారి కావిలించి కన్నీళ్ళు కార్చింది. శబరి సముదాయించి మర్నాడు ఏమేం చెయ్యాలో చెప్పింది.

మర్నాడు రామలక్ష్మణులు వొచ్చారు. ఆశ్రమం శోభాయమానంగా వెలిగిపోతోంది. రాత్రంతా పుళిందా పిల్లలూ కలిసి కట్టిన పూలదండలతో ఆశ్రమామంత ఒక పూలచెట్టు లాగా తయారైంది. మరువమూ, పారిజాతాలూ, పొగడపూలూ, గన్నేరూ, మందారా, మాలతీ, పున్నాగ అన్నీ చిత్ర విచిత్రంగా కలిపి అల్లిన రెండు మాలలు చేతిలో పట్టుకుని ఆశ్రమంలోకి రాగానే మొదట్లోనే ఉన్న తన కుటీరం దగ్గర, రాగానే స్వాగతం పలికి లోపలికి తీసుకెళటానికి వేచి ఉంది పుళింద. రామ ప్రభువు వొచ్చాడు. పుళింద, ఆనందాశ్రువులు నిండిన కళ్ళతో ముందుకెళ్ళి చేతిలో ఉన్న పూల దండల్ని సమర్పించాలని చూసింది. “నీ దగ్గరికి తరవాత వొస్తాను పుళిందా” అని ప్రభువు సూటిగా శబరి కుటీరం వైపు దారితీశాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిన్న ఎదురుగ్గా లేనప్పుడు మెచ్చుకోవడమూ, ఇవాళ్ళ ఎదురుగా ఉన్నప్పుడు చూడను కూడా చూడకపోవడమూ” అనుకుని కన్నీళ్ళని తుడుచుకుని మెల్లిగా అక్క కుటీరం వైపు వెళ్ళింది. శబరి తన చేత్తో పెడుతున్న పళ్ళనీ, మధురాలనీ రామ ప్రభువు ప్రేమతో తింటం చూస్తోంది పుళింద. కొద్ది సేపు తర్వాత రామ ప్రభువు లేచి, “శబరీ, నీ కర్మ పరిపక్వం అయ్యింది. నీకు విముక్తిని ప్రసాదిస్తున్నాను” అంటే శబరి సాష్టాంగ నమస్కారం చేసింది. రామ ప్రభువు వెళ్ళిపోతున్నా శబరి లేవకపోతుంటే “అక్కా, లే” అని లేపబోతే శరీరం చల్లగా తగిలి పుళింద ఏడుస్తూ కూచుంది. రాముడు వెళ్ళిపోయాడు.

పదేళ్ళు గడిచినయ్యి. రాముడు రావణుణ్ణి చంపడమూ, రాజ్యం చేస్తూ ఉండటమూ, జనం కథలుగా చెప్పుకోసాగారు. ఆశ్రమంలో పుళింద రోజూ రాముడు తనతో “నీకోసం మళ్ళీ వొస్తాను పుళిందా” అన్న మాటని తలుచుకుంటూ, రాముడి సత్యవాక్య పరిపాలనని గుర్తు తెచ్చుకుంటూ, ఎప్పుడు వొస్తాడో అని ఎదురు చూస్తోంది. “నిన్ను అనుగ్రహించటానికి భగవంతుడు ఎప్పుడైనా రావొచ్చు. నీ బాధ్యత ఏంటంటే ప్రతిక్షణమూ ఆయనకోసం శ్రద్ధా విశ్వాసం ఏ మాత్రం తగ్గకుందా ఎదురుచూట్టం” అని గురువుగారు చెప్పిన మాట మరచిపోలేదు ఆమె. వయసు మీదపడుతోంది కానీ ఓపిక చేసుకుని అక్క రాసిన పాటలన్నీ ఇదివరకు లాగానే పాడుతోంది. రామ ప్రభువు వొచ్చిన దగ్గర్నించీ మరీ ఎక్కువ విరగబూస్తున్న పూలచెట్ల నించి ప్రియంవద పూలన్నీ కోసుకొస్తే వాటన్నిట్నీ రోజూ పొద్దున్నే కూచుని చిత్రంగా కట్టటమూ, రామ ప్రభువు వొస్తాడేమోనని సాయంత్రం దాకా ఆ మాలల్ని నీళ్ళు జల్లుతూ జాగ్రత్తగా అట్టేపెట్టటమూ, సాయంత్రం ఆ మాలల్ని రామ విగ్రహానికి అర్పించటం రోజూ జరుగుతున్న కథే. ఇంకాస్త వయసైంది. జ్ఞాపక శక్తి కూడా తగ్గుతోంది. రాముడు వొస్తాడా అనే కొద్దిపాటి సందేహమూ, సత్యం అంటే తనే అయిన మూర్తి అబద్ధం చెప్పడని ధైర్యం చెప్పుకోవడమూ జరుగుతోంది. గొంతు పెగలటల్లేదు కానీ పాటలన్నీ గుర్తుకొచ్చినంతవరకు లోగొంతుకతో పాడుతోంది. కళ్ళు సరిగ్గా కనిపించకపోవతంతో ప్రియంవద అల్లిన మాలలు ఎల్లా ఉన్నాయో అని చేతిలో తడిమి సరిచూట్టమూ జరుగుతోంది.

రామ ప్రభువు రాచకార్యాల మధ్యలో ఏదో మంచి మాటో, పాటో విన్నట్టు “భేష్, బావుంది” అని ఊరికే అనటం రాజసభలో చర్చనీయాంశమైంది. రామ ప్రభువు తన ఆంతరంగికుణ్ణి పిలిచి ఏదో చెప్పి పంపించటం ఏదో పెద్ద విషయం జరగటానికేనని అందరూ చెవులు కొరుక్కున్నారు.

రెండురోజుల తర్వాత ఆశ్రమంలో ప్రియంవద అల్లిన మాలలని చేత్తో తడిమి ఇక్కడ తప్పనీ, అక్కడ తప్పనీ తీసి మళ్ళీ అల్లించింది. ఆశ్రమం నిండా అల్లిన మాలల్ని వేళ్ళాడదీయించింది. రెండు మాలలు, రాముడిదీ, లక్ష్మణుడిదీ, విడిగా మరువమూ, కనకాంబరమూ ఎక్కువగా పెట్టించి కట్టించినవి తన దగ్గిరే పెట్టుకుని, పాటలు పాడటం మొదలెట్టింది. కన్నీళ్ళతో, ఒకసారి కరుణించి నీ మోము చూపు అంటూ వొళ్ళు మరిచిపోయి పాడేస్తోంది. రామ ప్రభువు అయోధ్యలో “భేష్,బావుంది” అని ఎక్కువ సార్లు అంటున్నాడు. సాయంత్రమైంది. ద్వారం దగ్గిర అలికిడయ్యింది. పక్కనే కూచున్న ప్రియంవద “ఎవరూ” అంటే “నా పేరు రామభద్రు”డని వినపడగానే పుళింద ఆనందంతో “స్వామీ వొచ్చావా” అని లేచింది. పక్కనే జాగ్రత్తగా పెట్టిన రెండు పూల మాలలూ తీసుకుని ద్వారం దగ్గిరికి వెళ్ళింది. కన్ను సరిగ్గా కనిపించకపోయేసరికి చెయ్యి అడ్దం పెట్టుకుని “వొచ్చావా ప్రభూ” అని చూసింది. ద్వారంలో ఆనాడు వొచ్చిన రామభద్రుడే మళ్ళీ కనిపించేసరికి పొంగిన ఆనందంలో “నీలమేఘశ్యామా, రామచంద్ర ప్రభూ” అని అక్క శబరి రాసిన పాట పాడుతూ స్వామికి చేతిలో ఉన్న రెండు మాలలూ సమర్పించి స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసింది. మళ్ళీ చెయ్యి అడ్డుపెట్టుకుని ఒక సారి ప్రభువు మోము చూసింది. నవ్వుతూ “నీ పాటలు బావున్నయ్యో నీ మాలలు బావున్నయ్యో తెలీటల్లేదు” అన్నాడు రామభద్రుడు. “ఏవి నీవవుతయ్యో అవి అన్నీ బావుంటయ్యి కదా ప్రభూ” అని అంది పుళింద.

మెడలో ఉన్న మాలని పట్టుకుని “ఎంత చిత్రంగా అల్లావూ” అనీ “దీనికింత అద్భుతమైన వాసన ఎల్లా వొచ్చిందీ” అని అడిగాడు. “గడ్డిపూలకి వాసనేమిటి ప్రభూ, నీకు తగిలితే వొచ్చింది ఈ వాసన, నిన్ను తలుచుకుంటే వొచ్చింది ఈ పూల అల్లికా ప్రభూ” అని “ఈ జన్మకి ఇది చాలు ప్రభూ” అని వొంగి రామ ప్రభువు పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసింది.

“అమ్మా నా పేరు రామభద్రుడు. శ్రీరామ చంద్ర మహాప్రభువు వారి సేవకుణ్ణి. పుళింద అమ్మవారిని చూసి రమ్మని ప్రభువులవారు పంపిస్తే వొచ్చాను తల్లీ. లే తల్లీ” అని నిలబడ్డాడు ఆంతరంగికుడు. ప్రియంవద వొచ్చి లేపబోతే శరీరం చల్లగా తగిలింది. అదే క్షణాన విచిత్రంగా అల్లిన ఒక పూలమాల శ్రీరామచంద్రప్రభువు వారి గళసీమని ఆకస్మికంగా అలంకరిచటం చూసి సభికులందరూ ఆశ్చర్య చకితులయ్యారు. శ్రీరామచంద్రమహాప్రభువు “భేష్, బావుంది” అని ఆనందోత్ఫుల్ల తరంగితమైన మోముతో అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here