మహాభారతం మరోమారు

0
2

[dropcap]ఇ[/dropcap]తిహాసాలు, పురాణాలలోని ప్రధాన పాత్రలను తీసుకుని విడిగా కథలు, నవలలు రాయడం మామూలే. చివరకు అప్రధాన పాత్రలైన తాటక, ఏకలవ్యుడు, అహల్య, రాధ, యయాతి లాంటి పాత్రలను ఆధారం చేసుకుని నవలలు, నాటకాలు రాయడం మొదలయింది. ఇవి ఎక్కువగా ఆయా కాలాలలో వెలువడిన వాదాలు, ధోరణులకు అనుగుణంగా వెలువడినవే కావడం గమనించదగ్గ విషయం. ఈ ధోరణి దక్షిణ భారతీయ భాషల్లో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, కన్నడ భాష అగ్రస్థానంలో వున్నదనే చెప్పాలి. ఇరావతి కర్వే ‘యుగాంత’, భైరప్ప ‘పర్వ’, గిరీష్ కర్నాడ్ ‘అగ్ని-వర్ష’లతో పాటు హెచ్.జి. రాధాదేవి పంచకన్యలను తీసుకొని ఒక్కొక్కరి మీద విడిగా నవలలు రాశారు. అలాగే డాక్టర్ ప్రభాకర శిశిల గారు ‘మత్స్యగంధి’, ‘పుంస్త్రీ’ అనే నవలలను రాశారు. కన్నడంలో వచ్చిన ‘పుంస్త్రీ’ నవలను అదే పేరుతో తెలుగులో అనువదించిన వేలూరు కృష్ణమూర్తిగారు ఇప్పుడు దాన్ని పుస్తకంగా తీసుకువచ్చారు.

మహాభారత యుద్ధంలో శిఖండి వేసిన పదునైన బాణం భీష్ముడి ఛాతిలో గుచ్చుకోగా, దాని దెబ్బకు యుద్ధరంగం వీడాల్సి వస్తుంది. ఆ బాణం పెరికి వేస్తే భీష్ముడి మరణం తధ్యం. అందుకని వైద్యులు అది తీయకుండా మందులతో, లేపనాలతో అతని నొప్పిని తగ్గిస్తుంటారు. పడక మీది నుండే బాధను తట్టుకుంటూ యుద్ధరంగ విశేషాలను తెలుసుకుంటూంటాడు. తన పతనానికి కారణమైన అంబ మరుజన్మ దాల్చి శిఖండిగా వచ్చి ఉండవచ్చునన్న అనుమానం అతడ్ని పీడిస్తుంటుంది. దాంతో గత సంఘటనలు వెల్లువలా ముంచెత్తుతుంటే కళ్ళ ముందు జరిగే యుద్ధ సన్నివేశాలతో పోల్చుకొని విశ్లేషించడం కనిపిస్తుంది. ఏ హస్తినాపుర రాజ్యాన్ని నిలబెట్టడానికి బ్రహ్మచారిగా, రెండు తరాల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచాడో అతని కళ్లముందే అది సర్వనాశనం కావడం చూడాల్సిరావడం విషాదం. మహాభారత యుద్ధ పరిణామాలను గతానికి వర్తమానానికి అన్వయిస్తూ భీష్ముడు ఒక హేతువాదిగా చేసిన విశ్లేషణలు ఈ నవలలో కనిపిస్తాయి.

అందులో కొన్ని:

  1. పాంచాల రాజు ద్రుపదుడు సగోత్ర వివాహం చేసుకోవడం వల్ల దాని పరిణామమే శిఖండి జననం కావచ్చు.
  2. ప్రతీకార ప్రేరేపితుడైన ద్రుపదుడు ఒక కుమారుని, కుమార్తెను దత్తత తీసుకొని వారిరువురిని యజ్ఞం ద్వారా శుద్ధి చేయించి ‘యజ్ఞ సంభవుల’ని చెప్పుకున్నాడు.
  3. కాశీ రాజు తన కుమార్తెలయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. పరాక్రమమే పందెంగా పెట్టారు. ఆ పోరాటంలో అందరినీ గెలిచినటువంటి రాజకుమారుడికి ఆ ముగ్గురు కన్యలు పూలమాలలు వేస్తారు. ఇదెలాంటి పోటీ? ఒక మగాడికి ముగ్గురు కన్యలను కట్టపెట్టడం? ఇదేమి న్యాయం?
  4. కాశీ రాజు హస్తినాపురానికి స్వయంవర ఆహ్వానం పంపకపోవడం వలన, ఆత్మాభిమానం కొద్దీ తల్లి సత్యవతి పురమాయింపుపై వెళ్లాల్సి రావడం.
  5. సాళ్వరాజు దస్యుడు. క్షత్రియ రాజులు అతడ్ని తమతో సమానంగా పరిగణించెడివారు కాదు.
  6. ‘స్వయంవరంలో గెలిచిన వారిని మేం వివాహం చేసుకోవాలి గానీ, మీరు చూపించిన వారిని కాదు. విచిత్రవీర్యుని మేము వివాహమాడడం మా తండ్రి పోటీకి పెట్టిన నిబంధనలకు విరుద్ధమవడం వలన అధర్మకృత్యం అవుతుంద’ని అంబ వాదన.
  7. రాజమాత సత్యవతీ దేవి విచిత్రవీర్యుడు సమర్థుడు కాదని తెలియజేయడం.
  8. ద్రోణుల వారిలో తాను గమనించిన దోషం ఒక్కటే. ద్రుపదుడు వల్ల కలిగిన అవమానాన్ని మరువలేకపోవడం. క్షమించడం అన్నది అత్యంత గొప్ప గుణం.
  9. గంగాదేవి, సత్యవతీ దేవి, ద్వైపాయనులవారు – వీరిలో ఎవరూ క్షత్రియులు కారు. బీజ క్షేత్ర వాదం యొక్క తాత్త్విక పునాది అత్యంత దుర్భరమైనది.
  10. దుశ్శాసనుడి తలలో బంకమట్టి నిండుకున్నదని తాను ఎన్నోమార్లు అనుకున్నాడు. అతనిది భాతృనిష్ఠ. సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఇలాంటి అంధనిష్ఠ ఉన్నవాడు కావాలి. అలా చూస్తే తన తండ్రి శంతను చక్రవర్తి కోసం తాను చేసిన ప్రతిజ్ఞ ఒకరకంగా అంధనిష్ఠ అవుతుంది కదా!
  11. నేను (భీష్ముడు), ద్రోణుడు మరియు కర్ణుడు జాతి వ్యవస్థను మీరిన వారము. జాతి వ్యవస్థను ఆమూలాగ్రంగా నాశనం చేయాలని చాటి చెప్పే పరుశురాముడు మా మువ్వురికీ గురువు. కుంతి నడవడిక జాతి వ్యవస్థను నాశనం చేసే ప్రయత్నమని నాకనిపించింది.
  12. అర్జునుని స్వార్థం మరియు అహంకారం భీష్మునికి అపరిచితమేమీ కాదు. అదొక పెద్ద సమస్య అని అనిపించలేదు. అన్ని కష్టాలకు యుధిష్ఠిరుని చంచల చిత్తమే కారణమని భీష్ముడు ఎన్నోమార్లు అనుకునేవాడు.

మహాభారత యుద్ధంలో శిఖండి చాటునుండి అర్జునుడు వేసిన బాణం దెబ్బకు కూలిన భీష్ముడికి అర్జునుడే అంపశయ్యను ఏర్పాటు చేయడం, అర్జునుడు బాణం వేసి పాతాళ గంగతో భీష్ముని దాహం తీర్చడం లాంటివేవీ ఇందులో లేవు. చివరకు దుర్యోధనుని మరణాంతరం భీష్ముడు చనిపోవడానికి గాను తన గుండెలో గుచ్చుకున్న బాణాన్ని తీసివేయమని ద్రౌపదిని కోరడంతో నవల ముగుస్తుంది. ఇందులోని ప్రధాన పాత్రలు రెండు. ఒకటి ‘పుం’. అది భీష్మాచార్యులు. మరొకటి ‘స్త్రీ’. అది అంబ. ఈ రెండు ప్రధాన పాత్రల సంఘర్షణ నేపథ్యం నుండి మహాభారత యుద్ధాన్ని విశ్లేషించడం ఇందులో కనిపిస్తుంది. ఇంకో కోణంలోంచి చెప్పాలంటే అంబను నాయికగా చేసుకుని శిఖండి ‘పుంస్త్రీ’గా మారి భీష్ముని మరణానికి కారణమయ్యే వరకు జరిగిన సంభాషణలను ఇందులో వివరించడాన్ని మనం చూడవచ్చు. “మున్ముందు మరో జన్మ అన్నది ఒకటి వున్నట్లయితే అటు మగవాడూ కాని, ఆడది కానీ జీవిగా జన్మించి నిన్ను చంపుతా” అనే వాక్యంతో మొదలవుతుందీ నవల. చాలా అధ్యాయాలను ఇదే వాక్యంతో ముగించి కొత్త అధ్యాయాన్ని ఎత్తుకోవడం ఒక ప్రయోగంగా నిలిచిపోతుంది.

నవల చదువుతుంటే స్త్రీ స్వాతంత్ర్యం, సమానత్వం ఇలాంటి మాటలు చదువుతుంటే చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి. అక్కడక్కడ వాడిన ‘ప్రభుత్వం’ అనే మాటకు బదులుగా ‘రాజ్యం’ అనీ, ‘జాతి వ్యవస్థ’కు బదులుగా ‘వర్ణ వ్యవస్థ’ అని వాడితే బాగుండేది. అలాగే కాశీలో ఉన్న అపరిశుభ్రత, అసహ్యతల గురించి మాట్లాడడం కూడా విచిత్రమే. ఇతిహాసాలను ఎంత తిరగరాస్తే మాత్రం స్థల కాలాలను పట్టించుకోకపోతే ఎలా?

డాక్టర్ ప్రభాకర శిశిల రాసిన ఈ కన్నడ నవలకు వేలూరి కృష్ణమూర్తి చేసిన అనువాదం బాగుంది. మొత్తానికి ఈ పుస్తకం ఉత్కంఠతో, ఆసక్తికరంగా చదివింపజేస్తుంది.

***

పుంస్త్రీ (నవల)
కన్నడం: డాక్టర్‌ ప్రభాకర శిశిల
అనుసృజన: వేలూరి కృష్ణమూర్తి
పేజీలు: 200, వెల: ₹120/-
ప్రతులకు: పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, ఫోన్ 040 – 27678430,
ఇతర ప్రధాన పుస్తకకేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here