పునాది

1
1

[box type=’note’ fontsize=’16’] అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ‘లేఖిని’ రచయిత్రుల సంస్థ నిర్వహించిన పోటీలో ఎంపికయిన కథ. రచన ప్రమీలా రాణి ఈరంకి. [/box] 

[dropcap]అ[/dropcap]ది ప్రభుత్వ బాలికల పాఠశాల. ఉదయం 11.00 గంటల సమయం. తొమ్మిదో తరగతిలో తెలుగు పాఠం చక్కగా సాగిపోతోంది. అప్పుడే నోటీస్ పట్టుకువచ్చాడు అటెండర్ నూకారావు. ఆ నోటీస్ చదివి వినిపించారు టీచర్. “అమ్మాయిలు ఈ నెల అంటే నవంబర్ 19వ తేది స్వర్గీయ ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు, మన పాఠశాల లో ‘స్త్రీ శక్తి’ పైన వ్యాసరచన పోటీ వుంటుంది. అందరూ పేర్లు రేపటికల్లా ఇవ్వండి. ఎల్లుండి పోటీ వుంటుంది. 19వ తేది మీకు బహుమతి ప్రధానం వుంటుంది.” నోటీస్‌లో టీచర్ సంతకం చేసాక ప్యూన్ వెళ్లిపోయాడు. అమ్మాయిలు గుసగుసలు మొదలు పెట్టారు.

“ఏమిటమ్మా ఏదో నోటీస్ వస్తే అలా డిస్ట్రబ్ అవడమేనా? పాఠంలోకి రండి.” అన్నారు.

“టీచర్ ఒక సందేహం.” అంటూ లేచింది.కావ్య.

“ఏమిటి?”

“స్త్రీ శక్తి అంటే దేని గురించి రాయాలి?”

“అబ్బా గొప్ప డౌట్ అడిగావు, మన చరిత్రలో ఎంతోమంది స్త్రీలు తమ శక్తియుక్తులతో దేశభక్తిని చాటుకున్నారు. వాళ్ళందరి గురించి రాయండి. రాకెట్స్‌లో ప్రయాణించేవాళ్ళు, యుద్ధంలో పాల్గొనే వాళ్ళు ఇలా ఎంతో మంది. అందుకే మన వాళ్ళు ఆడవారి గురించి ఒక లోకోక్తి చెబుతారు, ‘మగువలు నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్’ అని. లీడర్ అన్నపూర్ణా, పోటీలో పాల్గొనేవాళ్ళ పేర్లు లంచ్ టైంలో తీసుకోమ్మా.” చెప్పారు టీచర్. ఇంతలో బెల్ మోగింది. టీచర్ వెళ్లిపోయారు. మళ్ళీ లెక్కల సార్ వచ్చేవరకూ పిల్లలు ఈ పోటీ గురించే మాట్లాడుకున్నారు. మాట్లాడనిది, ఒక్క నీలిమనే. ఆమెకు ఇలాటి పోటీల్లో పాల్గొనాలనే ఉత్సాహం లేదు, ప్రత్యేకంగా కనపడాలనే తహతహ లేదు. అందుకే లెక్కల బుక్ తీసి ఈ రోజు చెప్పబోయే లెక్కలను చూడసాగింది. క్లాస్ లీడర్ అన్నపూర్ణ లెక్కల హోం వర్క్ బుక్స్ అందరి దగ్గరా తీసుకోసాగింది.

“నీలూ నీ బుక్ ఇవ్వు.” అంది.

“నేను హోం వర్క్ చెయ్యలేదు.”

“సరే. సార్ వచ్చాక హోం వర్క్ చెయ్యని వారిని పీరియడ్ మొత్తం నిలబెడతారు.”

నీలిమ క్లాస్ అయ్యేవరకూ నిలబడే లెక్కలు నేర్చుకుంది. ఆ పిరియడ్ అవగానే లంచ్ టైం.

“నీ రైటింగ్ బాగుంటుంది, పోటీకి పేరు ఇవ్వు నీలు.” అంది సోఫియా. ఆమె నీలిమ ఇంటిపక్కన వుండే సులేమాన్ కూతురు.

“రైటింగ్ బాగుండటం కాదు, ‘స్త్రీ శక్తి’ గురించి తెలియాలి.” అందరినీ వెక్కిరించే సుధ అంది.

నీలిమకు అ ఎగతాళికి కోపం రాలేదు. దేని గురించి వ్రాయాలో నిర్ణయించుకుంది. “అన్నపూర్ణా, నా పేరు రాసుకో.” అంది.

మర్నాడు స్కూల్లో వ్యాస రచన పోటీ జరిగింది. అప్పటికప్పుడే తెలుగు టీచర్లు ముగ్గురూ అవి దిద్దసాగారు. దిద్దుతున్న జయప్రద ఒక పేపర్‌లో విషయం చూసి ఆగిపోయింది. అది తొమ్మిదో తరగతి చదివే నీలిమది.ఆమెకు ఎంత ఆశ్చర్యం కలిగిందంటే… ఆ పేపర్‌ను మిగతా ఇద్దరికి చూపించింది. “ఛ ఇలా ఊరుకోకూడదు, మనం ఇచ్చిన సబ్జెక్ట్ ఏమిటి? ఈ నీలిమ రాసినదేమిటి? అన్నట్టు ఆమె సి సెక్షన్ కదూ అంటే మన జయగారి స్టూడెంటే, పిలిచి అడుగుదాం, ఈ రాతలేమిటో.” అంది శ్యామల.

“హెచ్.ఎమ్.గారికి చెప్పడం మంచిది” ఇంకో టీచర్ మేరీ అంది. ముగ్గురూ మేడం రూమ్ లోకి వెళ్ళారు. ఇది చదివిన ఆవిడకీ ఆగ్రహం వచ్చింది. రెండు నిమిషాలలో నీలిమ ఆమె గదిలో వుంది.

“ఏమిటమ్మాయ్.. ఈ రాతలు మన దేశానికి పేరు తెచ్చిన స్త్రీల గురించి రాయమంటే, ఈ మామూలు ఆడవాళ్ళ గురించి రాశావేం?”

నీలిమ భయపడలేదు. “మీరు చెప్పిన స్త్రీలలో మనం ఎవరిని చూడలేదు మేడం, మీరు ఎప్పుడైనా దూరం నుంచైనా ఇందిరాగాంధీ గారినైనా చూసారేమో, మా తరం వాళ్ళు అదీ లేదు, వాళ్ళు గొప్పవాళ్ళే కాదనడం లేదు. వాళ్ళ గొప్పదనాన్ని, దేశం అంతా పొగిడింది, ప్రపంచం అంతా వారిని గుర్తించింది. నేను వ్యాసంలో రాసిన ఆడవాళ్ళ గురించి ఒకే వూళ్ళో వుంటున్న మీకైనా తెలుసా, అలాటి ఆడవాళ్ళకున్న కాస్తో కూస్తో తెలివి, అందం,అన్నీ కుటుంబం కోసమే ఖర్చై పోతున్నాయి. అది స్త్రీ శక్తి కాదా. మా నాన్న ఆటో డ్రైవర్, మా అమ్మ పెట్రోల్ బంకులో పనిచేస్తోంది. ఇద్దరూ పని చేస్తున్నట్టు కనబడుతుంది, కానీ ఇంటికి వచ్చేది మా అమ్మ జీతం ఒకటే. పైగా మా అమ్మకు రోజూ తిట్లు, దెబ్బలు. మన సోఫియా వాళ్ళింట్లో కూడా అంతే టీచర్.” ఆమె తన చేతిలో వున్న లెక్కల బుక్ తీసి చూపించింది.

“ఏమిటమ్మాయ్ ఈ రంగు?”

“రంగు కాదు మేడం రక్తం.”

“ఆ..” శ్రోతలు ముగ్గురికీ కాస్త భయం,ఆశ్చర్యం కలిగింది. జయప్రద  నీలిమను కొత్తగా చూస్తోంది, తలవంచుకుని తనేమో, తన పనేమో అన్నట్టు వుండే ఈ పిల్ల ఇంత ధైర్యంగా మాట్లాడటం.

“మానాన్న తాగి వచ్చి మా అమ్మను కొట్టాడు. ఆమె ఆయనను బెదిరించడానికి చాకు తీసింది, మా నాన్న కర్ర తీసుకు మా అమ్మ నెత్తి మీద కొట్టాడు. అప్పటికి ఆమె తప్పుకుంది కాబట్టి, తల మీద చిన్న దెబ్బతో పోయింది. ఆమె తల మీద నుంచి రక్తం చింది నేను హోంవర్కు చేసి అక్కడ పెట్టిన ఈ బుక్ మీద పడింది. అందుకే మొన్న లెక్కల సార్ హోంవర్కు చేయని వాళ్ళు నిలబడమంటే నిలబడ్డాను. కానీ బుక్ చూపించలేదు.  మీరు చెప్పిన వాళ్ళందరూ కొద్దో, గొప్పో పేరు తెచ్చుకున్నవాళ్ళే. వాళ్ళుదేశం కోసమో, వృత్తి కోసమో పోరాటం చేసినవాళ్ళు. పదవి కోసం, అధికారం కోసమో కష్టపడ్డవాళ్ళు. కానీ, మా అమ్మ లాటివాళ్ళు, సోఫీ వాళ్ళ అమ్మ లాటివాళ్ళు కుటుంబం కోసం ఎంతో చేస్తారు. అందులో వాళ్ళ స్వార్థం చాలా తక్కువ. కుటుంబాన్ని నిలబెట్టడం కోసం, పిల్లలను చదివించడం కోసం వాళ్ళు ప్రతినిత్యం పోరాటం చేస్తూనే వుంటారు. ఎన్నితరాలు గడిచినా మీరు చెప్పిన వాళ్ళగురించే తలచుకుంటామా, చెప్పుకుంటామా, మరి బతకాలనే ఆశతో నిత్యం పోరాటం చేసే వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు. వాళ్ళు ‘పునాదు’ల లోపలే వుండిపోయి, మీరు చెప్పిన పేరు తెచ్చుకోలేరు. వారికంటే మా అమ్మలాటివాళ్ళకే ‘ఎక్కువ శక్తి’ కావాలి. మీరు నాకు బహుమతి ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ నా అభిప్రాయం,  స్త్రీ శక్తి అంటే ఇదే.”

వింటున్న నలుగురు ఒకేసారి చప్పట్లు కొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here