[box type=’note’ fontsize=’16’] దర్శనం అంటే మనం వెళ్లి గుడి లోనో గోపురం మీదో, కొండ పైనో విగ్రహాన్నో, దేన్నో చూడటం కాదని చెబుతూ, అసలైన దర్శనమేదో వివరించారు జొన్నలగడ్డ సౌదామిని “పునః సిద్ధి” కథలో. [/box]
[dropcap]సీ[/dropcap]తారావమ్మ గారికి వార్ధక్యం వొచ్చింది. అయినా ఆవిడ నందుడి వాళ్ళింటికి వెళ్ళటం మానలేదు. కృష్ణుడికి పళ్ళూ ఫలహారాలూ తీసుకెళ్లటం మానలేదు. వ్రజ భూమిలో ఆవిడకి ఉన్న పేరు వల్ల ఆవిడ ఏమి చేసినా ఎవ్వరూ నోరు మెదిపేవాళ్ళు కారు. ప్రతి రోజూ పొద్దున్నే పనులు అన్నీ కానించుకుని ముంతెడు తరవాణి తాగి యశోద వాళ్ళింటికి వొచ్చి కృష్ణుడు ఆవుల్ని మేపటం కోసం వెళ్ళేంత వరకూ కృష్ణుడితో కాసేపు మాట్టాడి, ఆడి పాడి మధ్యాన్నం పండో కాయో తిని కాసింత నిద్ర కూడా యశోదమ్మ గారింట్లోనే కానిచ్చి మెల్లిగా దీపాలు పెట్టే వేళకి వెనక్కి వొచ్చిన కృష్ణుణ్ణి చూసి బుగ్గలు పుణికి ముద్దేట్టుకుని ఇంటికి బయలుదేరేది. ఇంటికొచ్చి మడికట్టుకుని మంత్ర జపాలన్నీ కానిచ్చి కాసిన్ని పాలు తాగి పడుకునేది.
ఇలా కొంత కాలం సాగిన తరవాత ఆవిడికి కళ్ళు కనిపించటం తగ్గింది. అయినా అలాగే ఎవరి సాయమో తీసుకుని నందుడి ఇంటికి వెళ్ళటమూ, అక్కడ కళ్ళ పైన చెయ్యడ్డు పెట్టి కృష్ణుణ్ణి చూడటమూ, ముద్దాడటమూ చేసేది. కృష్ణుడు కూడా ఆవిడ రాంగానే “మామ్మా వొచ్చావా” అంటూ దగ్గిరికొచ్చి “ఇటురా, కూచుందువు గాని” అని ఆవిడ చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్లి దొడ్లో ఉన్న అరుగు మీద కూచోపెట్టి తనూ ఎక్కి ఆవిడ పక్కన కూచుని కబుర్లు చెప్పేవాడు.
ఓ రోజున “ ఒరే, తండ్రీ, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి ఆ మూల ఉన్న కర్రావు నీది. మిగతా తెల్లావులన్నీ తెల్లగా ఉన్నాను కనక నావి” అంది సీతారావమ్మ గారు. “సరే మామ్మగారూ, నల్లగా ఏవేవి ఉంటాయో చప్పండి” అన్నాడు కృష్ణుడు.
“మేఘాలు”
“అవి నావి, ఇంకా”
“శ్రీ మన్నారాయణ మూర్తి, కాళికా అమ్మవారు, పార్వతీ దేవి, అర్జునుడు, ద్రౌపది అంతా నల్లటి వాళ్ళే”
“సరే వాళ్ళంతా నా పక్షం మరి మీ వైపు?”
“శివుడు తెలుపు, సరస్వతీ దేవి తెలుపు, పాల సముద్రం తెలుపు”
“చూశారా, చూశారా పార్వతి నలుపు శివుడు తెలుపు, పాల సముద్రం తెలుపు, విష్ణుమూర్తి నలుపు. తెలుపు లేకుండా నలుపూ, నలుపు లేకుండా తెలుపూ లేవు కదా. మీరు లేకుండా నేనూ, నేను లేకుండా మీరు లేరు. అవునా కాదా?”
“చిట్టి భడవా, నీ పొట్ట నిండా ఆలోచనలూ, నోటి నిండా మాయ మాటలూ” అంటూ కృష్ణుడి బొడ్డు చుట్టూ కితకితలు పెట్టింది సీతారావమ్మ గారు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి.
ఆవిడకి కళ్ళు కనిపించటం పూర్తిగా పోయింది. ఇంట్లో అన్ని పన్లకీ మనవరాలు జయని తోడు తీసుకుని చేసుకునేది. అయినా పొద్దున్న అయ్యేటప్పటికి అలాగే తడుముకుంటూ యశోద వాళ్ళింటికి బయలుదేరేది.
చూసి చూసి జయకి విసుగొచ్చింది.
“మామ్మా, నీకు కళ్ళు కనిపించవు కదా, మరి పొద్దున్నే యశోదత్తా వాళ్ళింటికి తయారవుతావు ఎందుకూ? అక్కడేమన్నా కనిపిస్తయ్యా నీకు” అంది.
విని నవ్వి ఊరుకుంది సీతారావమ్మ గారు. యథాప్రకారం జయని తోడూ తీసుకుని కృష్ణుడి వాళ్ళింటికి వెళ్లి వొచ్చింది.
మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ తయారు అవుతున్న మామ్మని చూసి జయ విసుగుతో “మళ్ళీ తయారు అవుతోంది చూడు” అని చెల్లెలు ప్రమద్వరతో అనటం విన్న సీతారావమ్మ గారు జయని తయారవమని తొందరపెట్టి బయలుదేరి మెల్లిగా నడుస్తూ “విశ్వేశ్వర ఆలయానికి తీసుకెళ్ళు” అంది. జయ ఆశ్చర్యపడి మెల్లిగా ఆలయానికి తీసుకెళ్ళి మెల్లిగా ప్రదక్షిణం చేయించి “ఇదిగో మామ్మా శివలింగం ఇక్కడ వుంది” అని చూపించింది. అటు వైపు తిరిగి నమస్కారం చేసి, అక్కడే ఉన్న నందీశ్వరుడిని మెల్లిగా తడిమి ఆనవాలు పట్టి కొమ్ముల మధ్యగా చూసి శివ శివా అని మనవరాలు చెయ్యి పట్టుకుని పక్కకి వొచ్చి కూచుంది సీతారావమ్మ గారు. ప్రసాదంగా ఇచ్చిన కొబ్బరికాయని కొట్టి మామ్మ చేతిలో పెడుతూ “దర్శనం సరిగా అయిందా మామ్మా” అంది జయ.
జయ చేతిని పట్టుకుని దగ్గిరికి లాక్కుని పొదువుకుంది సీతారావమ్మ గారు. “దర్శనం అంటే ఏమిటో తెలుసా” అని అడిగి సమాధానం కోసం ఆగకుండా “దర్శనం అంటే మనం వెళ్లి గుడి లోనో గోపురం మీదో, కొండ పైనో విగ్రహాన్నో, దేన్నో చూడటం కాదు. నిజానికి మనం దేవుడు ఎదురుగ్గా కనిపించినా చూడగలమా? ఎందుకూ పనికిరాని ఈ తోలు కళ్ళతో నామ రూపాలని దాటిన ఆ భగవంతుణ్ణి చూట్టం సాధ్యమేనా చెప్పు? దర్శనం అంటే మనం జనాలని తోసుకుంటూనో, అధికార దర్పాన్ని ఉపయోగించో ధన బలాన్ని ప్రదర్శించో గుళ్ళో ఉన్న విగ్రహాన్ని చూడటం కాదు. అనేక మంది మునులూ ఋషులూ తపస్సు చేసిన పుణ్య స్థలాలలో మనస్సు నిలపటం సులభం అవుతుంది కాబట్టి అట్టాంటి గుళ్ళల్లోకి వెళ్లి మనస్సు స్థిమిత పరుచుకుని భగవంతున్ని మనసా వాచా కర్మణా ధ్యానం చేస్తే ఆయనకి కరుణ కలిగి ఆయన మనల్ని దయతో కటాక్షించటం దర్శనం అంటే. ఎల్లప్పుడూ మనల్ని కాపాడే ఆయన, మనల్ని అటూఇటూ తిరగకుండా సత్యమూ శుద్ధ చైతన్యమూ అయిన దాని మీద మనస్సు నిలిపేందుకు సహాయపడే ఆయన, మనల్ని కరుణించి, కటాక్షించి ఆయన తన సత్యమూ సుందరమూ అయిన రూపాన్ని మనకు చూపించటమే దర్శనం అంటే. అది ఆ దేవదేవుడు తనకు తానుగా మన మీద కరుణ కలిగి తనని తాను చూపించుకునేది కానీ మనం చూస్తే చూడబడేది కాదు” అని ఆగింది.
జయకి ఏమీ అర్ధం కాలా. అలా నోరు వెళ్ళబెట్టి నిలుచుంది. ఒక ముద్దు పెట్టి “ఇప్పుడు చూడు, దేవుడు ఎలాగైనా ఉండొచ్చు. మన నందుల ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు కృష్ణుడు, దేవుడు వాడిలాగా వొచ్చాడు అనుకో. ఎంతో ముద్దుగా ఉంటాడు కదా, వాడిని మనం ఎంత చూసినా ఎన్నిసార్లు చూసినా మనకి దర్శనం కాదు. అదే వాడు, వాడికి దయ కలిగి, నన్ను చూసాడనుకో, మాట్లాడాడనుకో నవ్వాడనుకో. దేవుడు అనుకున్నాం కదా వాడిని. అప్పుడు మనకి కలిగేది దేవుడి దర్శనం. దివ్య దర్శనం. దాని కోసమే ఇన్ని సార్లు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేది” అన్నది సీతారావమ్మ గారు.
“అంటే కృష్ణుడు దేవుడా మామ్మా?” అంది జయ.
“దేవుడు అన్నిచోట్లా ఉన్నాడు. మనం ఎవరిలాగా చూడాలనుకుంటే వారిలాగా కనిపిస్తాడు. నీకు ఒకళ్లల్లో కనిపించవచ్చు. నాకు వేరే వాళ్ళలో కనిపించొచ్చు. నాకు కృష్ణుడిలో కనిపిస్తున్నాడు. అందుకే రోజూ వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. వాణ్ని నేను చూడటానికి కాదు, నన్ను వాడు చూడటానికి” అని జయ చెయ్యి పట్టుకుని వడిగా అడుగులు వేసింది సీతారావమ్మ గారు.