[మాయా ఏంజిలో రచించిన ‘In Retrospect’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(ప్రియమైన వారితో ఉన్నప్పుడు మారే కాలాలు, పరిసరాల పైకి దృష్టి మళ్ళదు. ఒంటరయ్యాక ప్రతి చిన్న మార్పూ కంటబడుతుంది. ప్రేమలో ఒంటరితనాన్ని ప్రకృతికి అన్వయించి ధైర్యవచనం చెప్పిన కవిత!!)
~
[dropcap]గ[/dropcap]డిచిన యేడాది
తన రుతువులన్నింటిని మార్చేసుకుంది
ఉక్కపోసే వేడిగాలులు
పండుబారి రాలిపోయిన
ఎర్రటి ఎండుటాకులు
శీతాకాలపు అతి శీతల చినుకులు
వేడెక్కి ఉన్న భూమిపై కరిగిపోతూ
నిద్రాణంగా భూమిపొరల్లోనున్న దుంపలకు
వసంతకాలపు నొప్పిని
ధైర్యంగా ఎదుర్కోమని చెబుతున్నాయి
మనం ప్రేమలో ఉన్నప్పుడు
గమనించలేదు గానీ…
తన ఇష్టానుసారంగానే
నడిచిపోయే కాలాన్ని,
ఒంటరిగా..
ఇప్పుడు గుర్తుకొస్తుంది నాకు.!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
మాయా ఏంజిలో పేరు గాంచిన రచనలన్నీ మహిళల దుస్థితి గురించి రాసినవే. ప్రత్యేకించి నల్లజాతి స్త్రీల కడగండ్లను కళ్ళకు కట్టేలా రాసినవి. అణగారిపోతున్న ఆఫ్రికన్ అమెరికన్ స్త్రీల గురించి రాయాలన్నదే నిజానికి మాయా లక్ష్యం అయినప్పటికీ, అప్రమేయంగా తన జీవితంలోని సంఘటనలతో కూర్చిన బలమైన భారీ ఆత్మకథగా, ‘I know why the caged bird sings’ రూపు దిద్దుకుంది.
మాయా ఆత్మకథలన్నీ ఆఫ్రో అమెరికన్లు ఎదుర్కొన్న జాత్యహంకారం, తన కుటుంబం, తన ప్రయాణాలు, తాను పొందిన గుర్తింపు, తన జీవితంలోని నీలి నీడలతో నిండి ఉంటాయి.
నిరంతరం పని చేస్తూ ఉండటమే మాయా అభిలాషగా, ధ్యేయంగా ఉండేది. అనేకమంది గృహిణులు, తల్లులు చేసే లెక్కలేనన్ని రోజువారీ పనులు, గుర్తింపుకు నోచుకోని గృహకృత్యాల పైనే ప్రత్యేక దృష్టి సారించి రచనలు చేసేది మాయా.