Site icon Sanchika

పురాతన చరిత్రను గుర్తు చేసిన వెల్లూరు కోట

[dropcap]అ[/dropcap]త్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రిస్టియన్ మెడికల్ కాలేజీనీ, స్వాతంత్రోద్యమ సమయంలో ప్రసిద్ధ సమర యోధులు సి. రాజగోపాలాచారి, రామస్యామి వెంకటరామన్ లను జైలులో ఉంచిన సంఘటననూ, విజయనగర రాజులచే నిర్మించబడిన అద్భుతమైన శిల్పకళకు ప్రాధాన్యత వహించిన వెల్లూరు కోటను కలిగి ఉండడం లోనూ, టిప్పు సుల్తాన్ సాగించిన యుద్ధాలను ఇముడ్చుకోవటంలోనూ చారిత్రాత్మక పేరు పొందిన వెల్లూరు నగరాన్నీ; చుట్టుపక్కల ఉన్న ఆలయాల్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నేను చూసిన విశేషాలు మీకు వివరిస్తాను.

హాస్పిటల్ డ్యూటీలో భాగంగా మా బాబు వెల్లూరు లోని మెడికల్ కాలేజీకి వెళ్ళివలసి వచ్చింది. “ఈ ఊర్లో వెల్లూరు పోర్ట్, మ్యూజియం ఉన్నాయి, చూద్దువుగానీ రా” అని మా బాబు అన్నపుడు తెలియలేదు. ఇక్కడ వెల్లారు పోర్టు, మ్యూజియం, జలకంఠేశ్వర ఆలయం, చూశాక “ఇన్ని రోజులు ఎందుకు చూడలేకపోయానా” అనిపించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకునే ఉన్న వెల్లూరులోనే ఇవన్ని ఉన్నప్పటికీ ఎక్కువ ప్రజాదరణ పొందకపోవడంతో ప్రాచార్యంలోకి రాలేదు. అందుకే శ్రీపురం, కాణిపాకం తెలిసినంతగా జనాలకు కోట, ఆలయం తెలియలేదు.

తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లాలోని వెల్లూరుకు మేము రేణిగుంట వరకూ విమానంలో వెళ్ళి, అక్కడనుంచీ కారులో చేరుకున్నాము. రేణిగుంట నుండీ వెల్లూరు వెళ్ళే దారి చాలా అందంగా ప్రకృతికి ఆలవాలంగా అనిపించింది. దారికి రెండు ప్రక్కలా పచ్చని చెట్లు, దూరంగా తూర్పు కనుమలు, తిరుపతి వేంకటేశ్వరుని నామాల ప్రతిధ్వనులు గాలిలో తేలియాడుతగా చెవులకు వీనుల విందుగా వినిపిస్తున్నాయి. పచ్చని మామిడి చెట్లకు పొడవైన కాడలతో వేలాడే మామిడి కాయల పిందెలు, కర్రల్ని పొలంలో పాతి పెట్టినట్లున్న చెరుకు తోటలు నోరూరిస్తూ కనిపిస్తున్నాయి. ఉదయం పది దాటుతుండుడంతో టిఫిన్ చేద్దామని ఒక హోటల్ దగ్గర ఆగాము. రోడ్డుకు ఆనుకుని చాలా పెద్ద హాటల్ కనిపించింది. లోపలికి వెళ్ళి కూర్చుంటే అందరూ ఆరు నామాలతో గుండ్లుతో కనిపించారు. అంటే తిరుపతి స్వామి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుని తిరిగి వెళ్ళే యాత్రలో ఉన్నారన్నమాట. హోటల్ లోని  అన్ని టేబుల్స్ వద్దా పట్టుపంచెలతో గుండ్లతో మోహాన నామాలతో చూస్తుంటే అదోక భక్తి పారవశ్యంలో మునిగినట్లు అనిపించింది. ఇంకా దారి పొడుగునా ఎన్నో చర్చిలు, స్కూళ్ళు ఎత్తైన బిల్డింగులతో కన్పించాయి. ‘కాట్పాడి’ అనే ఊరు దగ్గర ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడులోకి కారు ప్రవేశించింది.

తమిళనాడులోని వెల్లూరు లోకి రాకముందే చిత్తూరు జిల్లాలోనే కాణిపాకం అనే వినాయక ఆలయాన్ని దర్శించాము. నేను విన్నదాని కన్నా వేరుగా ఉన్నది. ఈ ఆలయం వెలుపల చాలా పెద్ద కోనేరు ఉన్నది. ఆలయం కూడా చాలా పెద్ద స్థలంలో ఉన్నది.

ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళ రాజైన మొదటి కుళుత్తుంగ చోళుడు నిర్మించాడని చెబుతారు. ఇక్కడి వినాయక విగ్రహం సంవత్సరాలు పెరిగేకొద్దీ పెరుగుతుందనీ చెబుతారు. అంతేకాక ఈ స్వామి విగ్రహం బావిలో ఉంటుందనీ విన్నాను. అయితే ఇప్పుడు ఆలయాని కొత్తగా మార్పులు చేర్పులు చేయడంతో వినాయకుడు బావి పై భాగానే కనిపిస్తున్నాడు. విగ్రహం కింద నుంచి ఒక నీటి జల వస్తున్నది.

ఆలయంలో టిక్కెట్లు టీసుకుంటున్నపుడు హైదరాబాదులో నివసించే స్నేహిత కుటుంబం కనిపించింది. అక్కడ అకస్మాత్తుగా కనిపించేసరికి చాలా ఆనందంగా అనిపించింది. అందరం కలిసే దర్శనం చేసుకున్నాము. జూన్ నెల  అయినప్పటికీ బాగా ఎండగా ఉండి వళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఆలయం బయట ఒక వ్యక్తి గాంధీజీ వేషంలో కదలకుండా నిలబడ్డాడు. సిల్వర్ రంగు పులుదలకుని కదలకుండా విగ్రహంగా నిలబడటం ఎంత కష్టం. అతనికి కొంత డబ్బిచ్చి ఫొటో తీసుకున్నాం.

ఈ గుడిలో బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయట. నేను ముంబయి లోని సిద్ది వినాయక చూసినప్పుడు కాణిపాకాన్ని చూడాలనుకున్నాను. కానీ కోరిక ఇన్నాళ్ళకు తీరింది. వరసిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకోవటం పూర్తయ్యింది.

కాట్పాడి దాటి వెల్లూరు వెళ్ళాక సురభి అనే హోటల్లో రూమ్ తీసుకున్నాం. కాసేపటికి రెస్ట్ తీసుకోగానే శ్రీపురం వెళ్దామని రూమ్ అనుకున్నాం. ఈ దేవాలయం బంగారంతో కప్పబడి స్వర్ణదేవాలయంగా పేరు గాంచింది.

ఇది కట్టినప్పటి నుంచి చూడాలని ఉన్నా లోపల  నడవవలసిన దూరం ఉన్నదనడంతో అమ్మను తీసుకుని వచ్చే ధైర్యం చేయలేకపోయాను. చివరకు అమ్మ మరణించాక గానీ ఈ ఆలయ దర్శన భాగ్యం కలగలేదు. గుడి లోపల నడుస్తున్నపుడు భాగవతం, గురుగ్రంధ సాహిబ్, భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాల నుండి తీసుకున్న మంచి సూక్తులు గోడల మీద కనిపిస్తూ, ఉంటాయి.

మనం నడిచే దారి కూడా నక్షత్రం ఆకారంలో ఉంటుంది. మరైకుడి ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్యలో కొండల దిగువగా వంద ఎకరాల స్థలంలో అద్భుతంగా కొలువై ఉన్నదీ ఆలయం. ఆలయానికి మూడు వైపులా నీరు, ఒకవైపున ఆలయ ప్రవేశం ఉంటుంది. సుమారు 2 కి.మీల నడక అనంతరం స్వర్ణ కవచంతో ధగధగాయమానంగా వెలిగిపోతూ దర్శనమిస్తే అలసటలు మాయమై కళ్ళు పెద్దవై ఆశ్చర్యానందాలకు లోనవుతాం. ఆలయ నిర్మాణంలో చెక్కిన లతలు, పువ్వులు, నగిషీలు అత్యంత సుందరంగా కనిపిస్తూ భక్తుల మనసును కట్టి పడేస్తాయి. నేత్రానందంగా చెక్కిన స్వర్ణకారుల హస్త కళా చాతుర్యానికి, నైపుణ్యానికి చేతులెత్తి మొక్కవలసిందే లక్ష్మి నారాయణని దర్శించుకుని వెల్లూరు హాటలుకు చేరుకున్నాం.

నా చిన్నతనంలో ఎవరికి పెద్ద జబ్బు చేసినా గుంటూరు తీసుకెళ్ళేవారు. మేము చీరాలలో ఉండేవాళ్ళం. గుంటూరులో తగ్గకపోతే పేషెంటును రాయవెల్లూరు తరలించేవాళ్ళు. రాయవెల్లూరు వెళ్ళారంటే ఇంక బతకడం కష్టమే అనుకునేవాళ్ళు. ఒకవేళ బతికి వస్తే “అబ్బో ఫలానా అతనికి రాయవెల్లూరు వెళ్ళి నయం చేయించుకుని వచ్చారు” అని చెప్పుకునేవాళ్ళు. అంటే తీవ్రమైన ప్రమాద పరిస్థితిని సూచించినట్లే నన్నమాట. నా చిన్నతనం నుంచీ ఎందరి మాటల్లోనో గొప్పగా విన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీని ఇప్పుడు చూశాను.

వంద సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగిన ఆరోగ్య దేవాలయాన్ని సందర్శించాను. వేల లక్షల మంది రోగులు స్వస్థతను చేకూర్చుకుని ఆరోగ్యవంతులై ఇళ్ళకు చేరిన పవిత్ర దేశాలయమిది. 1900వ సంవత్సరంలో స్థాపించబడి ఎందరో వైద్యదేవుళ్ళను అందించిన సంస్థ కూడా. ప్రపంచం లోనే మొదటి కుష్టు వ్యాధికి చికిత్స నందించడం మరియు భారతదేశంలో మొదటి ఓపెన్ హార్ట్ సర్జరీని నిర్వహించడం, మరియు దేశంలోనే తొలి మూత్రపిండ మార్పిడిని నిర్వహించడం వంటి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుందీ ఆసుపత్రి.

డాక్టర్ ఇదా ఎస్. స్కడర్ ఆధ్వర్యంలో 1900 వ సం॥లో అమెరికన్ క్రిస్టియన్ మిషినరీ చుట్టు పక్కల గ్రామాల ప్రజల కోసం నిర్మించబడింది. ఎందరో ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు ఇక్కడి విద్యార్థులే. భారతదేశంలో రెండవ ర్యాంకును పొందిన ఈ ఆసుపత్రిని చూడటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

అన్నివిభాగాలూ తిరిగి చూశాను. లోపల ఏ బిల్డింగులో నుంచి ఏ బిల్డింగు లోకి వెళుతున్నామో తెలియడం లేదు. బిల్డింగుల మధ్య పైన బ్రిడ్జిలు ఉన్నాయి. ప్రతిరోజూ పదివేలకు పైగా పేషంట్లను చూస్తారట. దాదాపు మూడు వేల మంది వైద్య విద్యార్థులు చదువుకుని నిపుణులై వెళుతున్నారు. మా అబ్బాయి ఈ వివరాలన్నీ చెప్తూ “అమ్మా ఇక్కడ నీ కిష్టమైన విషయం ఒకటి చూపిస్తా” అంటూ ముందుకు నడిచాడు. ‘ఆసుపత్రిలో నాకిష్టమైన సబ్జెక్టు ఏమిటి? నేనేమీ డాక్టర్ను కాదుగదా!’ అనుకుంటూ కొద్దిగా ఆశ్చర్యంతో ముందుకు వెళ్ళాను. మా అబ్బాయి పిల్లల విభాగం లోకి దారి తీశాడు. సరేనని వాడి వెనకే నడుస్తూ వెళితే పిల్లలు ఆడుకునే ‘లాడర్ అండ్ స్లైడ్’ దగ్గర ఆగాడు.

నేను క్వశ్చన్ మార్క్ మొహంతో వాడిని చూశాను. వాడు నవ్వుతూ “ఇదే నీకిష్టమైనది” అన్నాడు. పిల్లలాడుకునే జారుడుబండ చూపించి ‘నాకిష్టమైనదంటాడేమిటి’ అని పరిశీలిస్తుండగానే ఏదో అనుమానం వచ్చింది. ఇది ‘సిటి స్కాన్ మెషిన్ కదా’ అన్నాను నేను ఆశ్చర్యంగా. “నువ్వు హాస్పిటల్ వేస్టుతో పనికొచ్చే బొమ్మలు చేస్తావు కదా! అందుకే నీకిది చూపించాను. పాడైపోయిన సిటి స్కాన్ మెషిన్‌ను పిల్లలాడుకునే జారుడు బండగా మార్చారు. నీకు పోటీ అమ్మా” అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. “నాకేం పోటీ కాదు, నేనే మొదట కనిపెట్టాను కాబట్టి ఆసుపత్రి వ్యర్థాల కళాకృతుల వినియోగంలో పేటెంట్ హక్కులు నావే” గర్వంగా చెప్పాను నేను.

వెల్లూరు అంటే కేవలం హాస్పిటల్ షేషెంట్లు మాత్రమే అనుకున్న నాకు ఇక్కడ చరిత్ర, పురాతన ఆలయాలు రాజుల కోటలున్నాయంటే ఆశ్చర్యం అనిపించింది. ప్రసిద్ధమైన వెల్లూరు కోట, పురాతనమైన జలకంటేశ్వర ఆలయం, ఆనాటి రాజులు ఉపయోగించిన వస్తువులున్న గవర్నమెంటు మ్యూజియం ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక చోటే ఉన్నాయి. ఊరి మధ్యలో ‘పాలారే’ నది ప్రవహిస్తూ ఉన్నది. ఈ నది ఒడ్డునే నగరం నిర్మించబడింది. వెల్లూరు కోట ప్రాకారాలు ప్రధాన రహదారులు వెంట మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాకారాల పక్కన లోతైన కందకాలు తవ్వి అందులో నీరు నింపబడి ఉంటుంది. పూర్వం నిర్మింపబడిన కోటలన్నీటికీ శత్రువుల దాడులను తప్పించుకోవడానికి ఇలా కందకాలు వాడి వాటిలో మొసళ్ళను కూడా వదిలేవారు.

కోట అంతా శిధిలమై పోగా కొద్ది భాగం మాత్రమే గుర్తుగా ఉంచబడింది. దీనిని విజయనగర రాజులు నిర్మించారట. 15వ శతాబ్దంలో కట్టబడిన ఈ కోటలో టిప్పు సుల్తాన్ వంశస్థుల సమాధుల్ని కలిగి ఉన్నది. శ్రీరంగపట్నం వద్ద జరిగిన యుద్ధంలో (1777) టిప్పు సుల్తాన్‌ను చంపి వారి సంతానాన్ని ఈ కోటలో బందీలుగా పెట్టాడట ఆనాటి మైసూరు రాజు. ప్రస్తుతం కోటలో ఐదు మహళ్ళు మాత్రమే ఉన్నాయి. హైదర్ మహల్, టిప్పు మహల్, రాజ మహల్, రాణి మహల్, కాండి మహల్ అనే ఐదు మహళ్ళకు వాళ్ళను బందీలుగా ఉంచటం వల్ల వాటికా పేర్లు వచ్చాయి. ఎత్తైన బురుజులు, విశాలమైన కోట గోడలు, లోతైన అగడ్తలు ఉన్న ఈ కోట దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచినది.

బ్రిటీషువారి కాలంలో శ్రీలంక రాజు క్యాండీని యుద్ధ ఖైదీగా తీసుకుని వచ్చి ఈ కోటలోనే ఉంచారు. అందుకే దీనికి క్యాండీ మహల్ అనే పేరు వచ్చింది. అలాగే శ్రీ పెరుంబుదూర్‌లో రాజీవ్ గాంధీని హత్యచేసిన LTTE వాళ్ళను కూడా ఈ కోటలోనే బంధించారు. ఈ విషయం చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రాకారాల మీద తుపాకులు ఎక్కుపెట్టిన సైనికుల బొమ్మలున్నాయి. దూరం నుంచీ వచ్చే శత్రురాజుల్ని గమనించడానికి ఎత్తుగా ఉన్న నిర్మాణం పైకి నేను ఎక్కలేక కింద నుంచే ఫొటోలు తీయలేదు. మా అబ్బాయి పైకి ఎక్కి నగరం మొత్తాన్ని పోటోలు తీశాడు.

అతి పురాతనమైన జలకంటేశ్వరాలయాన్ని చూసినప్పుడు – తమిళనాడులో ఆలయాలు అద్భుతంగా ఉంటాయనే మాట స్ఫురణ కొచ్చింది. నేను పూర్తిగా తమిళనాడు రాష్ట్రంలోని దేవాలయాలను చూడాలి. కొన్ని మాత్రమే చూశాను. అదీ నేను చిన్నగా ఉన్నప్పుడు చూడటంతో వాటిలోని మహత్మ్యం తెలియలేదు. మొదట్లోనే ఉన్న కళ్యాణ మండపాన్ని చూస్తే నాకు మా ఓరుగల్లు లోని వేయిస్తంభాల గుడి గుర్తుకొచ్చింది. విజయనగర శిల్ప కళలలో మనలని మంత్రముగ్ధుల్ని చేస్తుంటే పోటోలు, వీడియోలు తీసుకున్నాం.

ఈ గుడి దగ్గరకు వచ్చేసరికి సన్నగా జల్లు పడుతూ ఉన్నది. తడుస్తూ, ఆస్వాదిస్తూ గుడినంతా చూశాము. గుడి మాత్రం దర్శనానికి అనుకూలంగా లేదు. రాబోయే మహా కుంభాభిషేకానికి కడుగుతూ శుభ్రం చేస్తున్నందున దర్శనానికి అనుమతి లేదు కానీ ఆలయం చుట్టూతా తిరుగుతూ దేవతామూర్తుల్ని దర్శించాము. ఇదోక వింత అనుభవం. అన్నీ మూర్తుల్ని పీచులో రుద్ది కడుగుతూ వందల మంది భక్తులు పనిచేస్తుంటే విచిత్రంగా అనిపించింది. ఇక్కడున్న కల్యాణ మండపాన్నీ లండనుకు తరలించాలని బ్రిటీషువారు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో మనమీ రోజు  ఈ కల్యాణ మండపాన్ని చూడగలుగుతున్నాము.

కోటలోని ప్రాంగణమంతా పెద్ద పెద్ద మర్రిచెట్లు, రావి చెట్లుతో నిండి ఉన్నది. ఎంతో గంభీరంగా తరతరాల చరిత్రను తమలో దాచుకున్నట్లుగా మౌన ముద్ర దాల్చిన రుషుల్లా ఏ భావం లేక కదలక మెదలక నిలబడి ఉన్నాయి. ఆ మర్రి చెట్ల ఉడలు కిందకు వేలాడుతూ ఉన్నాయి. ఎప్పుడో చిన్నతనంలో ఉడలు పట్టుకుని ఆడుకున్న ఆటలు గుర్తొచ్చాయి. మా అబ్బాయికీ విషయం చెప్పాను. “మా చిన్నతనంలో మర్రి ఊడల్ని పట్టుకుని వేలాడుతూ ఆడుకునే వాళ్ళం” అని. “అది ఊడి వస్తే పడిపోతారు కదా” అనడిగాడు. “లేదు చాలా గట్టిగా ఉంటాయి” అని చెప్పాను. మా అబ్బాయిని మర్రి ఊడల్ని పట్టుకోమని ఫోటోలు తీశాను.

ఈ మ్యూజియంలో డైనోసార్ రమ్మని పిలుస్తూ ఉంది. ఆ పక్కన్నే నెమలి ఉన్నది. లోపలికి వెళ్ళే దారి పక్కలంతా శిలాశాసనాలున్నాయి, ఆయుధాలు ఆరుబయటే అమర్చబడి ఉన్నాయి. యుద్ధట్యాంకులు, బాంబులు, మందుగుండు సామాన్లు వంటి చాలా ఆయుధాలు బయటనే ఉన్నాయి. గదుల్లో పురావస్తు, శిల్పాలు, చెక్క శిల్పాలు, కంచు శిల్పాలు, హస్తకళలకు సంబంధించిన అన్నిరకాల లోహ వస్తువులు, నాణేలు అన్నీ వరసగా అమర్చబడి ఉన్నాయి.

రాజులు వేసుకున్న దుస్తులు, వారు వాడిన పాత్రలు, ఇంటి వస్తువులు ఎన్నో విభాగాల వారీగా పెట్టారు. ఏనుగు దంతంలో చేయబడిన చెస్ బోర్టు కాండీ రాజు ఉపయోగించాడట. నేను ఎన్నో వీడియోలు తీసి పెట్టాను. ఇందులో జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం, భూగర్భశాస్త్రం, ఆంట్రోపాలజీ, ఆర్కియాలజీ, ఆర్ట్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎన్నో వస్తువులున్నాయి.

 

 

 

చరిత్రను తెలుసుకుంటుంటే ఎంతో ఆనందంగా ఉన్నది. కానీ హైస్కూలులో ఉన్నపుడు సోషల్ సబ్జెక్టు అంటే చాలా చిరాకుగా ఉండేది. ఈ రాజులూ, రాజ్యాలూ, యుద్ధాలూ వాటి సంవత్సరాలూ ఏవీ గుర్తుండేవి కాదు. ఒక రాజు పేరు బదులు మరొక రాజు పేరు రాసేవాళ్ళం. వాళ్ళేం చేస్తే మనకెందుకు అన్నట్లుగా ఉండేది. పెద్ద వాళ్ళం అయ్యాక పూర్వపు రాజుల చరిత్రను చదువుతుంటే ఎంతో గొప్పగా అనిపిస్తున్నది. బ్రిటీషు కాలంలో వారికి ఎదురు తిరిగిన మొదటి తిరుగుబాటు కూడా ఈ వెల్లూరు కోట నుంచే జరిగిందట. ఒకే ప్రాంగణంలో ఉన్న ఆలయం, మ్యూజియం, మందిరాలు, కోటలను చూస్తూ కాలమే తెలియలేదు. సన్నగా వర్షం పడుతూ తడుస్తూ ఉంటే వాటి చరిత్ర తెలుసుకుంటూ ఆ రాజభవనాల్లో తిరుగుతుంటే గమ్మత్తైన అనుభవంగా మిగిలింది.

కోట పైబాగం దాకా ఎక్కి దిగి వచ్చాక అక్కడొక టీస్పాల్ దగ్గర కూర్చున్నాం. కాళ్ళు నొప్పులుగా ఉండటంతో కూర్చుని టీ తెప్పించుకుని తాగాము. చిరు జల్లుల వర్షంలో తడుస్తూ ఒకవైపు సన్నని చలికి వణుకుతూ వేడి వేడి టీ తాగుతుంటే బాగుందనిపించింది. పుర్వ కాలపు గాజు గ్లాసుల్లో ఇచ్చిన ‘టీ’ని పాత కాలపు రోజులు గుర్తు చేసుకుంటూ తాగాము. మా ఇంట్లో ఇలాంటి గాజు గ్లాసులుండేవి. మా చిన్నప్పుడు బయటి వాళ్ళెవరన్నా వస్తే ఇలాంటి గాజు గ్లాసుల్లోనే కాఫీ ఇచ్చేది అమ్మ. స్టీలు గ్లాసులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా ఎన్నో పాత సంగతుల్ని పురాతన చరిత్రను గుర్తు చేసిన వెల్లూరు కోట చూడవలసిన ప్రదేశం. వెల్లూరు నుంచి హైదరాబాదుకు స్లీపర్ బస్సులో వెళ్ళాం. యాత్ర పూర్తయింది.

Exit mobile version