మతోన్మాదం, రాజకీయ ఉచ్చులతో నలిగిపోతున్న నైజీరియన్ బాల్యం – పర్పల్ హైబిస్కస్

0
1

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]ప[/dropcap]ర్పల్ హైబిస్కస్ అంటే నీలి మందారం అని అర్థం. నల్లటి శరీర ఛాయను నీలి రంగుతో పోల్చడం మన దేశంలో కూడా ఒక సాంప్రదాయం. నీలమేఘ శ్యాముడు అని రాముడిని, కృష్ణుడిని, విష్ణువుని మనం పూజిస్తూ ఉంటాం కదా. అలాగే నల్ల జాతీయుల ప్రస్తావన వచ్చినప్పుడు కూడా పర్పల్ కలర్‌ని ఉపయోగిస్తారు పాశ్చాత్యులు. నలుపుని తరతరాలుగా హీనంగా చూసే సంస్కృతిలో, నలుపుని పర్పల్ అంటూ ఒక సానుకూల స్పందన ఆశిస్తూ నల్ల జాతీయుల ప్రస్తావన వచ్చిన చాలా చోట్ల బ్లాక్ బదులు పర్పల్ అంటూ సంబోధించడం కనిపిస్తుంది. “ది కలర్ పర్పల్” అనే అలిస్ వాకర్ పుస్తకం మనకు తెలుసు. ఆ వుద్దేశంతో రాసిన పుస్తకంగానే ఈ పర్పల్ హైబిస్కస్ అనిపిస్తుంది. దీన్ని రాసిన రచయిత్రీ నైజీరియన్ దేశస్తురాలు చిమామన్దా నగిచో అడిచె. చినువా అచిబె ‘థింగ్స్ ఫాల్ అపార్ట్’ నవల ప్రపంచంలో చాలా మందికి చేరువైన అద్భుతమైన పుస్తకం. ఆ నవల స్పూర్తితోనే వీరు థింగ్స్ ఫాల్ అపార్ట్ అనే వాక్యంతో ఈ నవల మొదలెడతారు. చినువా అచిబే ప్రభావం ఈ రచయిత్రి పై ఎంత ఉందో మనకు ఆ ప్రయోగంతోనే అర్థం అవుతుంది. ఈ నవల కథావస్తువు కూడా ఇంచుమించు థింగ్స్ ఫాల్ అపార్ట్ తో పోలి ఉంటుంది. అయితే ఇది ఒక పద్నాలుగేళ్ళ అమ్మాయి ద్వారా నడిచిన కథ. మతోన్మాదం, నైజీరియాలోని రాజకీయ పరిస్థితుల కారణంగా తమ మూలాలకు దూరమవుతున్న తరాల వేదన ఈ నవలలో కనిపిస్తుంది.

జాజా మరియు కాంబిలి అన్నా చెల్లెళ్ళు. వీరి తండ్రి యూజీన్ మత ప్రచారకుడు. యూరోపియన్ల మత ప్రచార ధోరణులకు లోంగిన నైజీరియన్ పౌరుడు. యూరోపియన్లు తీసుకువచ్చిన క్రిస్టియానిటీని పూర్తిగా తన మార్గంగా తీసుకుని తన దేశంలోని మతాలను దేవుళ్ళను ద్వేషిస్తూ, వాటిని అనాగరిక మతాలుగా దేవుడికి దూరం చేసే ఛాందస సాంప్రదాయాలుగా పరిగణించి ఆ సాంప్రదాయ పద్దతిలో జీవిస్తున్న వారిని పాపులని ద్వేషిస్తూ ఉంటాడు. అతని తండ్రి సాంప్రదాయవాది అందుకని అతనితో ఎటువంటి సంబంధం పెట్టుకోడు యూజీన్. తన పిల్లలను తండ్రికి చాలా దూరంగా ఉంచుతాడు. చర్చ్ అంటే అతనికి అమితమైన గౌరవం. తన జీవితాన్ని దానికి సంపూర్ణంగా అంకితం చేస్తాడు. తాను నమ్మిన క్రైస్తవ మత సాంప్రదాయలను ప్రశ్నించిన వారిని అంగీకరించని వారిని శత్రువులుగా పరిగణీస్తాడు. ఇంట్లో అతనో నియంత. పిల్లలను తన చర్చ్‌కి అలవాటు చేయడానికి కఠినమైన క్రమశిక్షణ పాటిస్తాడు. ప్రార్థనలో కాని మత సంబంధమైన ఎటువంటి విషయాలలో కాని భిన్నంగా ప్రవర్తించినా పిల్లలకు కఠినమైన శిక్షలు తప్పవు. వారి అరికాళ్ళ పై సల సల కాగే నీళ్ళు పోయడం చేతి వేళ్ళు విరిచేయడం, బెల్టుతో విపరీతంగా రక్తం వచ్చేలా కొట్టి వారిలో పశ్చాత్తాపం కలిగించే ప్రయత్నం చేయడం ఇవన్నీ అతను నమ్మిన సిద్ధాంతాలు. భార్య బిట్రిస్ ప్రతి రోజు అతని కోపానికి ఎదో ఒక సందర్భంలో బలి అయిపోతూ ఉంటుంది. రెండుసార్లు ఇతని దెబ్బల కరణంగా గర్భం పోగొట్టుకుంటుంది. ఈమెకు భర్త అంటే అమితమైన భక్తి. నైజీరియాలో స్త్రీలు భర్తకు చాలా మంది సంతానాన్ని ఇవ్వాలనే సంప్రదాయం ఉంది. కేవలం ఇద్దరు పిల్లలు మాత్రమే తాను ఇవ్వగలిగినా ఎంతో మంది యూజిన్‌ను మరో స్త్రీని పెళ్ళి చేసుకొమ్మని లేదా సంతానాన్ని మరో స్త్రీతో కనమని బోధించినా, అతను ఒప్పుకోడు. అందుకని బిట్రిస్‌కి అతనంటే అమితమైన భక్తి. తనను కొట్టే హక్కు అతనికి సంపూర్ణంగా ఉందని నమ్మే సగటు భార్య ఆమె. పిల్లలపై అతను అమలు చేసే శిక్షలకు కూడా అమె ఎదురు చెప్పదు. కాని రోజు రోజుకు ఈ శిక్షల స్థాయి పెరుగుతూ అవి భరించడం చాలా కష్టమవుతుంటుంది.

యూజిన్ చెల్లెలు ఇఫోమియా. ఆమె నైజీరియన్ యూనివర్సిటిలో ప్రొఫెసరు. ఆమె భర్త మరణించిన తరువాత తన ముగ్గులు పిలల్లతో ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. దేవునిపై భక్తి ఉన్న చదువుకున్న యువతి. అయితే తన దేశ సాంప్రదాయాలను అమితంగా ప్రేమిస్తుంది. తండ్రి అంటే చాలా గౌరవం. తన పిల్లలకు ఆమె తండ్రితో మంచి అనుబంధం ఏర్పడడానికి తల్లిగా తన వంతు పాత్ర నిర్వహిస్తుంది. ఆమె దృష్టిలో మతం ప్రశాంతత కోసం కాని దాన్ని ఉన్మాద స్థాయిలో మార్చుకోవడం మూర్ఖత్వం. యూజిన్ పిల్లలయిన జాజాను, కాంబలిని బలవంతంగా తనతో కొన్ని రోజులు గడపడానికి తీసుకుని వెళుతుంది. అత్త ఇంట్లో పద్దతులు వీరిద్దరినీ ఆశ్చర్యపరుస్తాయి. అత్త పిల్లలు తమ తాతతో గడిపే విధానం, సాంప్రదాయ పద్దతులను వారు అర్థం చేసుకుని గౌరవించే విధానం, అలాగే ఆ ఇంట్లో పిల్లల ఆలోచనలు స్వేచ్చగా సాగడం. మతాన్ని వారు ప్రేమించే తీరు, ఇవన్నీ వారిలో తమ జీవన విధానం పట్ల ఆలోచనలు కలగజేస్తాయి. అత్త ఇంట్లో ఒక ఆత్మ కనిపిస్తుంది. పేదరికంలో కూడా ఒక సంతోషం ఉంటుంది. అత్త ఇంట్లో మతం అంటే ప్రేమ. కాని తమ ఇంట్లో మతం అంటే ఒక భయం. ఈ వైరుధ్యాలు కలవరపెడతాయి.

ఇఫోమియా ఇంటికి మరో మత ప్రచారకుడు వస్తూ ఉంటాడు. ఇతను క్రైస్తవ మత ప్రచారకుడే కాని వీరి తండ్రిలా నిరంకుశవాది కాదు. నైజీరియన్ సాంప్రదాయాలను భాషలను గౌరవిస్తూ ప్రేమను పంచే వ్యక్తి ఇతను. అతని పట్ల ఆకర్షితురాలవుతుంది కాంబిలి. అమాకా చర్చ్‌లో హోలి కమ్యూనియన్ స్వీకరించవలసిన రోజు వస్తుంది. కాని చర్చ్ హోలీ కమ్యూనియన్ కోసం అమ్మాయిల పేరు మారుస్తుంది. అది కేవలం ఒక్క రోజు చేసే పండుగ. తరువాత వారినెవ్వరూ ఆ పేరుతో పిలవరు. కాని ఆ మార్చే పేరు నైజీరియన్ పేరు కాకూండా యూరోపియన్ పేరు అయి ఉండాలన్నది చర్చి సాంప్రదాయం. అమాకా దీన్ని వ్యతిరీకిస్తుంది. హోలీ కమ్యూనియన్‌కు తాను వ్యతిరీకిని కానని కాని తన దేశం పేరుతో మాత్రమే కమ్యూనియన్ జరగాలి అని అలా కాని పక్షంలో తాను కమ్యూనియన్ స్వీకరించనని ప్రకటిస్తుంది. ఆమెను ఆమె తల్లి కాని ఆ మత ప్రచారకుడు అమాడి కాని విమర్శించరు, ఆమె ఇష్టాన్ని గౌరవిస్తారు. ఇది కాంబలిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మొట్టమొదటి సారి మతంలో ఉండవలసిన వ్యక్తి గౌరవాన్ని అనుభవిస్తుంది.

నైజీరియాలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుంది. యూనివర్సిటి మొత్తం ఆ ప్రభావానికి లోనవుతుంది. స్వతంత్ర ఆలోచనలున్న ప్రొఫెసర్లను ఉద్యోగం నుండి తొలగిస్తారు. ఇఫోమియా గతిలేని పరిస్థితులలో అమెరికాకు వీసా కోసం ప్రయత్నిస్తుంది. ఆమెకు అక్కడ ఉద్యోగంతో పాటు కుటుంబం మొత్తానికి వీసాలు వస్తాయి. తమ భావాలకు విలువలేక ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో ఎంతో ప్రేమించే తమ దేశాన్ని ఆ కుటుంబం వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది.

ఇల్లు చేరిన జాజా, కాంబిలి తండ్రి వేధింపులను భరించలేని స్థితికి చేరుకుంటారు. మొట్టమొదటి సారి తండ్రి పై తిరుగుబాటు చేస్తాదు జాజా. చెల్లెలితో అత్తను సాగనంపటానికి ఆమె ఇంటికి వెళతాడు. ఒక రాత్రి తండ్రి మరణించాడన్న సమాచారం వస్తుంది. ఇంటికి వెళ్ళిన తరువాత తండ్రి అనుమానస్పదమైన పరిస్థితులలో మరణించాడని అతని శవాన్ని అటాప్సీకి తీసుకెళ్ళారని తెలుస్తుంది. అప్పుడు బెట్రిస్ తానే భర్తపై విష ప్రయోగం చేసానని పిల్లలకు చెబుతుంది. తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న జాజా తన తండ్రిని తానే హత్య చేసానని చెపుతాడు. తండ్రితో అతని గొడవలు ఇంటి పనివారికి తెలుసు. అందువల్ల బెట్రిస్ ఎంతగా ఆ హత్యకు కారణం తను అని చెప్పినా అధికారులు ఆమెను కొడుకుని రక్షించుకోవడానికి ప్రయత్నించే ఒక తల్లిగా మాత్రమే తలచి జాజాను అరెస్టు చేస్తారు. బిట్రిస్ మతి స్థిమితం కోల్పోతుంది. ఇఫోమియా కుటుంబం అమెరికా వెళ్ళిపోతుంది. జైలు అధికారులకు లంచం ఇచ్చి ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాల శిక్ష అనంతరం జాజా ని విడిపించుకుంటారు కాంబిలీ, ఆమె తల్లి బెట్రిస్. కాని ఆ కుటుంబం మళ్ళీ మానసికంగా ఆరోగ్యకరంగా జీవించే పరిస్థితులు మాత్రం ఇక ఉండవు.

యూజిన్ స్వతహాగా మంచి వ్యక్తి. ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఒక పత్రిక నడుపుతూ ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా,బెదిరింపులు వచ్చినా లొంగక తన నమ్మకాలకు అనుగుణంగా పత్రిక నడుపుతూ వెళతాడు. ఆ పత్రిక ఎడిటర్‌ను చంపేస్తే అతని కుటుంబ భాద్యత సంపూర్ణంగా తీసుకుంటాడు. ఎందరి పేద వారికో సాయపడుతూ ఉంటాడు. ఎటువంటి డబ్బు ఆశకు లొంగడు. కాని ఇవన్ని తన మత పరిధిలోనే చేసుకుంటూ ఉంటాడు. అతని మంచితనం మత ఛాందసవాదం మాటున దాగి ఉంటుంది. మతం అతనికొక ఉన్మాదం. తన మతాన్ని అంగీకరించని వారందరు అతనికి శత్రువులే. ఈ ఉన్మాదం కారణంగానే కుటుంబం పై అంత నిరంకుశత్వం ప్రయోగిస్తాడు. పాపులను శిక్షించాలని అతను పాటించే మతం చెబుతుంది కాబట్టి అది అతను తప్పని సరిగా పాటిస్తాడు. కాని తన పిల్లలను తన దేశ మూలాలనుండి తాను దూరం చేసి అనాథలుగా మారుస్తున్నానన్నది అతనికి అర్థం కాదు.

ఆ దేశ రాజకీయ పరిస్థితుల కారణంగా ఎంతో మంది కొత్త తరం వారు ఇతర దేశాలకు వెళ్ళవలసి వస్తుంది. అమాకా ఒక ఉత్తరంలో రాస్తుంది. అమెరికాలో అన్నీ ఉన్నాయి. పెట్రోల్ ఉంది, కరెంట్ ఉంది, పంపు తిప్పితే వేడి నీరు ఉంది. కాని ఇది నా దేశం కాదు. మేము నైజీరియాలో కలిసి ఉన్న కుటుంబంలా బ్రతకలేకపోతున్నాం” అంటుంది. మతం వారిని వారి మూలాలకు దూరం చేస్తే, రాజకీయ వాతావరణం వారిని దేశానికి దూరం చేసింది. ఎవరికీ, దేనికి కాకుండా మిగిలిపోయిన అలాంటి ఎందరి పిలల ఒంటరితనమో ఈ పాత్రలలో మనకు కనిపిస్తుంది.

తమ సాంప్రదాయాలను, తమ దేశ గతానికి తమను దూరం చేసి తమ మూలాలను నాశనం చేసి తమ అస్థిత్వానికి ద్రోహం చేస్తున్న మతం, రాజకీయం పట్ల బాధను ఒక నైజీరియన్ యువతి ఈ నవల ద్వారా పంచుకునే ప్రయత్నం చేసారు. తమది కాని దేశం తమకు ఎన్ని సౌకర్యాలను ఇచ్చినా ఆ ఆత్మను ఇవ్వలేదన్నది సత్యమే కదా. వారి ఒంటరితనాన్ని, బాధను ఈ నవల చాలా సున్నితంగా చర్చిస్తుంది. నైజీరియా దేశ ప్రజల స్థితిని, వారు తమ అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి పడుతున్న బాధను అర్థం చేసుకునే క్రమంలో బాగా ఉపయోగపడే నవల ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here