Site icon Sanchika

పుస్తక పరీమళం

[dropcap]ను[/dropcap]వ్వు పుస్తక పరీమళమై వ్యాపిస్తావు!
రాశి ఫలాలు, వంటలూ వార్పులు, ఆరోగ్య సూత్రాలూ
పెద్ద బాలశిక్షలై సంచరిస్తుంటావు!
కొండపల్లివో, గొల్లపూడివో, గ్రంధివో
పుస్తక బేహారివై ప్రయాణీకుల మధ్య
పఠనాసక్తిని రగిలిస్తావు!
కొందరికి కాలక్షేపానివై
మరి కొందరికి జ్ఞాననేత్రమై కన్పిస్తావు!
కళ్ళున్న కబోదుల్ని కదిలిస్తావు!
చెయ్యెత్తి యాచించకుండా అభిమానధనుడవై
నీ కాళ్ళ మీద నీవు అందనంత ఎత్తులో నిలుస్తావు!
సకల భోగభాగ్యాలూ అనుభవిస్తున్నా
సమస్త అంగాలు సక్రమంగా పనిచేస్తున్నా
భూములను భోంచేస్తూ రైతుల ప్రాణాలను హరిస్తూ
నిమ్మకు నీరెత్తని నికృష్టుల కంటే –
నువ్వు ఉత్కృష్టంగా కనిపిస్తావు!
నీ ఆత్మ విశ్వాసం ముందు
నా సానుభూతి నీరుగారిపోతుంది!
అప్రయత్నంగా నా చేయి పర్సును తాకుతుంది!
నీ చెంతనున్న పుస్తకం నన్ను చేరి
నా మస్తకానికి హాయినిస్తుంది!
(శాతవాహన రైలులో పుస్తకాలమ్మే అంధ యువకుడు వెంకన్న కోసం)

 

Exit mobile version