పుస్తకంలో.. పువ్వు

1
3

[అలెగ్జాండర్ పుష్కిన్ 1828లో రచించిన ‘The Flower’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Alexander Pushkin’s poem ‘The Flower’ by Mrs. Geetanjali.]

~

[dropcap]ఎ[/dropcap]వరు పెట్టారీ పువ్వుని..
నా పాత పుస్తకంలో.. పరిమళాన్ని కోల్పోయి..
ఎండిపోయిన పువ్వుని..
కాగితాల మధ్యలో ఎవరు పెట్టారు..
ఎందుకు పెట్టారు?
ఏ మార్మికమైన జ్ఞాపకాలను మేల్కొలపడానికి..?
ముప్పిరి గొన్న ఏవో జ్ఞాపకాలతో..
అప్పటికప్పుడు నా ఆత్మలోని అణువణువూ మేల్కొంది.
**
ఇంతకీ ఎప్పుడు పూసి ఉంటుంది ఈ పువ్వు?
పోయిన వసంత కాలంలోనా.. దాని కంటే ముందేనా..
ఎప్పటినుంచి వికసించడం మొదలై ఉంటుంది ఈ పువ్వు?
పోనీ.. ఏ కాలంలో పూసి ఉంటుంది?
ఎక్కడ తుంచబడింది.. ఎవరలా తెంపి ఉంటారు?
తెంపింది పరాయివాళ్ళా..
లేక ఆత్మీయులా.. ఎవరు.. ఎవరు?
ఇక ఈ పువ్వుని ఇలా కాగితాల వెనకెందుకు పెట్టారు..
అచ్చం సమాధి మీద పెట్టినట్లు?
**
ఏ ప్రేమికుల మధురమైన కలయికలని గుర్తుచేసుకోవడం కోసం..
దురదృష్టం నిర్దాక్షిణ్యంగా విడదీసిన వియోగ విషాదాన్ని
తడుముకోవడం కోసం ఇక్కడుందీ పువ్వు?
పోనీ ఆ అడవి చెట్ల నీడల్లో..
వెచ్చని నీరెండ నిండిన ఆ పచ్చని మైదానపు అంచు మీద నుంచి,
ఏకాంతంలో.. అలా ఒంటరిగా.. నిశ్శబ్దంగా..
చేసిన కాలి నడకకి ఆ ప్రేమ పక్షులని సిద్ధం చేసినప్పటి
ఆ సంధ్యా సాయంత్రాల స్మృతుల తాజాదనం కోసమా..
ఆ పువ్వునలా పుస్తకంలో ఉంచారు?
**
అవునూ.. ఇంతకీ అసలు ఆమె బతికే ఉందా..
అతని ప్రాణప్రదమైన ప్రియురాలు?
పోనీ కనీసం అతగాడైనా ఆమెతో ఉన్నాడా?
ఈ క్షణం వాళ్ళిద్దరి సురక్షిత స్థలం ఎక్కడుంది?
లేదా.. అగాధమంతటి లోతుని కనుక్కోలేనట్లున్న..
అసలు అంచనాలకే అందనట్లున్న పుస్తకం లోని ఈ పువ్వు లాగా
ఇద్దరూ ఈ పాటికి శుష్కించి పోయి ఉంటారా..
ఏమై ఉంటారు వాళ్లిద్దరూ..??

~

మూలం: అలెగ్జాండర్ పుష్కిన్

అనువాదం: గీతాంజలి


అలెగ్జాండర్ పుష్కిన్ ఆధునిక రష్యన్ సాహిత్యకారులలో అగ్రగణ్యుడు. Romantic Era కి చెందిన గొప్ప కవి, నాటకకర్త, నవలా రచయిత. తన కవిత్వం ద్వారా ఎందరో రష్యన్ కవులకి మార్గదర్శకం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here