Site icon Sanchika

పుట్టిల్లు

రామారావు నుండి నిన్న ఫోన్ కాల్ వచ్చింది. ఈ రోజు తన ‘పుట్టిల్లు’ ప్రారంభోత్సవం ఉన్నది అని. నేను ఆ కార్యక్రమానికి తప్పక రావాలని కోరాడు. నాకు అర్థం కాలేదు. అసలు ‘పుట్టిల్లు’ ఏమిటని? అతనికి అంతకుముందే ఒక ఇల్లు ఉన్నదని నాకు తెలుసు. అదే విషయం అడిగాను. వివరాలన్నీ కలిసినప్పుడు చెబుతానన్నాడు.

అసలు రామారావు ఎవరో మీకు తెలియదు కదా? చెబుతాను. రామారావు ఆఫీసులో నా సహోద్యోగి. మంచి మిత్రుడు. రామారావు భార్య సుశీల కూడా నాకు బాగా తెలుసు. చాలా సౌమ్యురాలు. ఇద్దరూ అన్యోన్య దంపతులు. వారికి ఇద్దరు కుమారులు. ఒకరు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇంకొకరు ఆస్ట్రేలియాలో డాక్టర్. రామారావు హైదరాబాద్‌లో, వనస్థలిపురంలో ఒక ఇల్లు కట్టుకుని స్థిరపడ్దాడు. నాతో పాటే పదవీ విరమణ చేశాడు, ఆరు సంవత్సరాల క్రితం. గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందేమి లేదు. ఈ ‘పుట్టిల్లు’ సంగతేమిటో నాకు అర్థం కాలేదు. కొత్తగా మరో ఇల్లు కట్టాడా? ఆ అవసరం ఏమీ లేదే? అలా కడుతున్నట్టు నాకు ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడూ కూడా చెప్పలేదు. నేనుండేది కూకట్‌పల్లిలో కావడం, అతనుండేది వనస్థలిపురంలో కావడం వలన తరచుగా ప్రత్యక్షంగా కలుసుకోలేకపోతున్నాము కాని అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉంటాము. ఎలాగైనా ఈరోజు నా మిత్రుడిని కలవాలని, ఆ ‘పుట్టిల్లు’ విషయం కూడా తెలుసుకోవాలని, ప్రొద్దున్నే వనస్థలిపురం సిటీ బస్‌లో బయలుదేరాను. వనస్థలిపురం చేరడానికి, రామారావు చెప్పిన ‘పుట్టిల్లు’ దగ్గరకు వెళ్ళడానికి, దాదాపు రెండు గంటల సమయం పట్టింది.

అది ఒక పాత ఇల్లు. రంగులు వేసి కొత్తగా ముస్తాబులు చేసినట్లున్నది. కాని గట్టిగానే ఉన్నది. దాదాపు కొత ఇల్లు రూపం వచ్చింది. పూలదండలతో, మామిడాకుల తోరణాలతో చక్కగా అలంకరించబడినది. దానిమీద ‘పుట్టిల్లు’ అని తెలుగులో రాసిన ఒక అందమైన బోర్డ్ తగిలించబడినది. రామారావును కలిశాను. శుభాకాంక్షలు తెలిపాను. నన్ను చూసి చాలా సంతోషించాడు. ఆప్యాయంగా నన్ను కౌగలించుకుని, నేను వచ్చినందులకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రామారావు భార్య కూడా నేను వచ్చినందులకు చాలా సంతోషించింది. నా భార్యను తీసుకురాలేదేమి అని అడిగింది. ఇంట్లో మనుమలూ, మనవరాళ్ళతోనే ఆమెకు సరిపోతుంది, అందువల్ల రాలేకపోయింది అని చెప్పాను.

ముహూర్తం సమయానికి ‘పుట్టిల్లు’ ద్వారానికి కట్తిన రిబ్బన్ కత్తిరించి లోపలికి మొదటి అడుగు వేసింది ఎవరో కాదు, రామారావు భార్య సుశీలే. తదుపరి చిన్న పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత వచ్చిన వారందరికీ ఇల్లు చూపించారు. నాలుగు గదులు, ఒక హాల్, కిచెన్, ప్రతి గదిలో రెండేసి సింగిల్ కాట్స్, వాటిపై స్పాంజ్ పరుపులు – చూస్తుంటే ఒక హాస్టల్‌లా ఉన్నది. గదులకు ఎయిర్ కండిషనర్లు కూడా అమర్చారు. ఒక్కో మంచం వద్ద ఒక చిన్న స్టీల్ అలమర కూడా ఉన్నది. హాల్‌లో పెద్ద డైనింగ్ టేబుల్ , కుర్చీలు ఉన్నవి. గోడకు స్మార్ట్ టీవీ కూడా అమర్చారు. ప్రతి గదికీ అటాచ్డ్ బాత్ రూం కూడా ఉన్నది. మొత్తానికి అన్ని వసతులున్న అతిథి గృహం లాగా ఉన్నది. ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో మంచి పూల మొక్కలు కూడా ఉన్నవి.

నేను ఇక్కడకు రాగానే, ఆత్రం ఆపుకోలేక అడిగాను రామారావుని ఏమిటీ ఈ ‘పుట్టిల్లు’ కథ అని. “తొందరెందుకు భోజనాలయ్యాక చెబుతాను కదా” అన్నాడు. మొత్తం ప్రారంభోత్సవ కార్యక్రమం అయిన తర్వాత, సంప్రదాయ విందు ఏర్పాటు చేశాడు. శాఖాహార భోజనం పూర్తిగా ఆంధ్రా స్టైల్‌లో ఉంది. చక్కెర పొంగలి, గారె, పప్పు, పులిహోర, స్వచ్చమైన నెయ్యి, నాలుగు రకాల కూరలు, గోంగూర పచ్చడి, కొబ్బరికారం, పప్పుచారు, వడియాలు, చల్ల మిరపకాయలు, గడ్డ పెరుగు వడ్డించారు. చివరలో అరటిపండు, కిళ్ళీ కూడా ఇచ్చారు. మొత్తం మీద భోజనం చాలా రుచికరంగా ఉంది. చాల సంవత్సరాల తర్వాత, ఇలాంటి భోజనం తిన్నానేమో, తృప్తిగా అనిపించింది. భోజనాలయ్యాక వచ్చినవారందరూ ఒక్కొక్కరు వెళ్ళిపొయ్యారు. రామారావు దంపతులు కూడా భోంచేశాక, నేనూ, రామారావు ఒక గదిలోకి వెళ్ళీ కూర్చున్నాము. ఇప్పుడు చెప్పమన్నాను, ‘పుట్టిల్లు’ సంగతి.

రామారావు కొంచెం సేపు కళ్ళు మూసుకున్నాడు. ఒక నిట్టూర్పు విడిచాడు. కళ్ళు తెరచుకుని చెప్పసాగాడు. “శివరాం, నా పిల్లలు ఒకరు అమెరికాలో, మరొకరు ఆస్ట్రేలియాలో ఉన్న సంగతి నీకు తెలుసుగా. వాళ్ళు అక్కడ పౌరసత్వం కూడా సంపాదించుకున్నారు. వారికి, వారి పిల్లలకు అక్కడి జీవితం బాగా అలవాటయ్యింది. వాళ్ళు అక్కడే స్థిరపడేటట్లున్నారు. మమ్మల్ని చూడటానికి ఎప్పుడో సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో ఒక్కసారి, వారికి వీలయినప్పుడు వస్తున్నారు, పోతున్నారు. మనకి అవసరమైనప్పుడు వాళ్ళు రారు, వచ్చే అవకాశం కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు. ఈ స్థితి నా ఒక్కడిదే కాదు. ఇతర దేశాలలో పిల్లలున్న తల్లిదండ్రులందరిదీ ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్న ఆస్తులు కూడా మన తదనంతరం వారు చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు. మనం ఉన్నంతవరకే ఇవి మనవి. తరువాత వాళ్ళు అమ్ముకుని సొమ్ములు పంచుకోవచ్చు. ఈ మధ్య నాలో ఒక ప్రశ్న చెలరేగింది. నేను ఒకవేళ ముందు చనిపోతే, నా భార్య పరిస్థితి ఏమిటి? ముసలితనములో తనకి అండగా ఎవరు ఉంటారు? బంధువులుంటారా? వారికి వారి కుటుంబాలు ఉంటాయి. ఎవరైనా అంత శ్రద్ధగా ఎందుకు చూసుకుంటారు? తెలిసిందేగా, ఈ రోజుల్లో, అంతా ‘ధనమూలమిదం జగత్’, డబ్బు లేనిదే అయినవాళ్ళు కూడా అన్నం పెట్టరు. ఉచితంగా ఎవరూ సహాయం చేసే స్థితిలో లేరు. ముసలితనంలో ఒంటరిగా నా భార్య ఆర్థిక లావాదేవీలు జరుపుకోగలదా? ఎవరి సహాయమో తీసుకోవాలి. ఎవరి సహాయం తీసుకోవాలో కూడా తెలియాలిగా? అనారోగ్య పరిస్థితులలో వైద్య సహాయం ఎవరు చేస్తారు? పిల్లల దగ్గరికి వెళితే, వారికి అదనపు భారం తప్ప, ప్రయోజనం ఉండదు. మలివయసులో, ఆ చలి దేశాలలో మనం జీవించలేము. అందుకే నాకొక ఆలోచన వచ్చింది. వెంటనే అమలుకు పూనుకున్నాను. నా దగ్గరున్న సేవింగ్స్‌తో, ఆ ఇల్లు బేరానికొస్తే కొన్నాను. దానికి మరమ్మతులు చేయించి, రంగులు వేయించి, ‘పుట్టిల్లు’ అని నామకరణం చేశాను. తర్వాత మిగిలిన డబ్బుతో, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను. ఈ కాలనీలోనే నివసిస్తున్న, సమాజసేవా దృక్పధం కలిగిన ఒక లాయర్‌ను, ఒక డాక్టర్‌ను, ఒక బ్యాంక్ మేనేజర్‌ను, ఒక ఇంజనీర్‌ను, ఒక రోటరీ క్లబ్ మెంబర్‌ను, ఎంచుకుని, వారిని ట్రస్ట్ సభ్యులుగా చేర్చాను. వారు మనస్ఫూర్తిగా ఆ ‘పుట్టిల్లు’ బాధ్యతను చూసుకుంటామని నాకు హామీ ఇచ్చారు.”

“శివరాం, నీకు తెలుసుగా. ఆడవారికి మలివయసు వచ్చేటప్పటికి, వారి పుట్టింటివాళ్ళు ఎవరూ ఉండరు. ఆ వయసులో, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు నిరాదరిస్తే, వారు ఎక్కడికి పోతారు? భర్త బ్రతికునన్నాళ్ళు మంచి బ్రతుకు బ్రతికి, చివరకు దయనీయ స్థితిలో జీవితం గడపాలంటే ఎంత మానసిక క్షోభో, అనుభవించేవారికే తెలుస్తుంది. చివరకు వృద్ధాశ్రమంలోనో, అనాధాశ్రమంలోనో బ్రతుకునీడ్చే స్థితి ఎంత బాధాకరమో గదా!

అందుకే, నాకీ ఆలోచన వచ్చింది. ఏ స్త్రీ అయినా, ఏ వయసులో వారైనా, అయినవారి నిరాదరణకు గిరి అయితే, వారికి ఈ ‘పుట్టింట్లో’ ప్రవేశం లభిస్తుంది. అలాంటివారికోసమే నా ఈ ‘పుట్టిల్లు’. అలా వచ్చిన వారికి కావలసిన మనోస్థైర్యం ఈ పుట్టిల్లు ట్రస్ట్ సభ్యులు అందిస్తారు. వారికి కావలసిన వసతి భోజన సౌకర్యాలు పూర్తిగా ఉచితం ఈ పుట్టింట్లో. నేను, నా పెన్షన్‌లో సగం ప్రతినెలా ఈ ‘పుట్టిల్లు’కు ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. దాతలు ఎవరైనా విరాళాలు అందిస్తే స్వీకరిస్తాము. వాటికి ఇన్‌కం ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చే సౌలభ్యం కూడా ఏర్పాటు చేశాం. ఇదీ సంక్షిప్తంగా ఈ ‘పుట్టిల్లు’ వ్యవహారం. శివరాం, ఇప్పుడు చెప్పు. నేను చేసిన పని మంచిదేనంటావా?” అని రామారావు నన్ను ప్రశ్నించేదాకా, నాకు ఇది కలా, నిజమా అనిపించింది. రామారావు స్వతహాగా మంచివాడు. నాకు తెలుసు. ఇతరుల కష్టాలు చూసి చలించే స్వభావం ఉంది. కాని ఇన్ని అభ్యుదయ భావాలున్నాయా అని ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను. 

అమాంతం రామారావుని కౌగలించుకుని ‘ఇది చాలా మంచి పని. ఎవ్వరూ చెయ్యలేని పనిని చేశా’వని మనసారా అభినందించాను. అంతేకాదు, అప్పుడు నాకనిపించింది. ఇంత మంచి కార్యక్రమంలో నేనెందుకు పాలు పంచుకోకూడదూ అని. వెంటనే నేను అన్నాను. “రామారావ్, నాదొక చిన్న విన్నపం. ఏదో ఉడుతాభక్తిగా, నేను కూడా నీ ఈ మంచి ప్రయత్నానికి కొంత సహకారం అంచించదలచుకున్నాను. ఒక లక్ష రూపాయలు నా తరఫున విరాళంగా ఇద్దామని నిర్ణయించుకున్నాను. నీవు కాదనకూడదు. ఇంటికి వెళ్ళాక ట్రస్ట్ బ్యాంక్ ఎక్కౌంట్‌కు ఎమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తాను.”

“నో నో శివరాం, నిన్ను పిలిచింది విరాళం కోసం కాదు. నా స్నేహితుడిగా, నీవీ కార్యక్రమంలో నా ప్రక్కన ఉంటే బాగుంటుందని, నా ప్రయత్నాన్ని నీకు తెలపాలనీ పిలిచాను. చాలా దూరం నుండి నువ్వు నా మాట మన్నించి వచ్చినందులకే నాకు ఎంతో సంతోషంగా ఉంది” అని నా చేతులు పట్టుకుని మరీ చెప్పాడు రామారావు.

నేను కూడా రామారావు చేతులు పట్టుకుని మరీ చెప్పాను. “రామారావు, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఏమిటంటే, ఒకవేళ నా భార్యకు కూడా అలాంటి పరిస్ఠితి వస్తే మీ ‘పుట్టింట్లో’ ఆమెకు ప్రవేశం కల్పించాల్సి వస్తుందేమో. ఎవరు చెప్పగలరు? ఈ ‘పుట్టిల్లు’ మనందరిదీ అని భావించే నేనీ విరాళం ఇస్తున్నాను. కాదనకు. ముందే ఈ విషయ అంతా తెలిస్తే, నాతో పాటే ‘చెక్’ తెచ్చేవాడిని. ఈ మంచి కార్యక్రమంలో నన్నూ భాగం పంచుకోనియ్యి” అని బ్రతిమిలాడాను.

చివరకు రామారావు “శివరాం, నీ మనసు నాకు తెలుసు. మంచి కార్యక్రమాలను ఎల్లప్పుడూ సమర్ధిస్తూ ఉంటావు. నీ సహకారానికి ధన్యవాదములు” అని చెప్పాడు.

రామారావు దగ్గర సెలవు తీసుకుని, సంతృప్తీ, ఆనందం నిండిన హృదయంతో, ఇంటికి చేరీ చేరగానే, నా భార్యకు ఈ విషయం చెప్పాను. విషయమంతా విని, తను కూడ ఎంతో సంతోషించడమే గాకుండా, నా నిర్ణయాన్ని సమర్థించి, రామారావు గొప్పతనాన్ని బాగా మెచ్చుకుంది.

Exit mobile version