Site icon Sanchika

పుట్టినరోజు

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘పుట్టినరోజు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]లో[/dropcap]కం ఆహ్వానిస్తూనే ఉంటుంది
ప్రతీక్షణం కోట్లాది ప్రాణాలను
తనను అందంగా చేస్తారనీ
తన జీవికను ఆనందంగా ఉంచుతారనీ..

కానీ
ఏ కొందరో
కేవలం ఏ కొద్దిమందో
లోకాన్ని నిరుత్సాహపరుచరు
నిరాశ చీకట్లలోకి తోసివేయరు

తమ అడుగు అడుగులో
అందాన్ని అలా అలా అద్దుతారు
తమ నిండైన దోసిళ్ళతో
ఆనందాన్ని అనంతంగా విరజిమ్ముతారు
భవిష్యత్తు దారిలోకి
వింత వెలుగులను వెదజల్లుతారు
కలల విహారాన్ని నిజం చేస్తూ
కొత్త రంగులను కొద్దికొద్దిగా పరిచయంచేస్తారు

లోకానికి
తమకు తామై
ఓ గొప్ప బహుమతిని అందిస్తారు..
తమను తామే
ఓ గొప్ప బహుమతిగా అందించుకుంటారు..
ఆ కొద్దిమందిలో
ఆ కొన్ని బహుమతుల్లో
నీవున్నావు, నీవూ ఉన్నావు..

జన్మదిన శుభాకాంక్షలు నీకు..!
ధన్యవాదాలు, నిన్ను నిన్నుగా కన్నవాళ్ళకు..!!

Exit mobile version