[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘పుట్టినరోజు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap] రోజు ఉదయాన్నే మోహన్ డ్యూటీకి బయలుదేరుతుంటే..
“రేపు పాప పుట్టినరోజు. సెలవు పెట్టండి.” అని ఓ లిస్టు చేతికిచ్చింది భార్య. ఖర్చంతా కలిపితే వేలల్లోనే ఉంది. అంత డబ్బు చేతిలో లేదు.
‘ఏదో ఒకటి చేయొచ్చులే’ అనుకుని పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. హెడ్ కానిస్టేబుల్ దుర్గారావుకి సెల్యూట్ కొట్టి, “సార్! జీతం రాగానే ఇస్తాను. కొంచెం డబ్బు అప్పుగా కావాలి” అన్నాడు.
“అప్పుతో పనేంటయ్యా? అలా ఊళ్ళో రౌండ్స్‌కి వెళ్ళు. ఏ బైకో, లారీనో ఆపు. ఎవడో ఒకడు తగలకపోతాడా? నువ్విలా అమాయకంగా ఉంటే.. ఎలాగయ్యా” అన్నాడు.
రౌండ్స్‌కి బైక్ మీద బయలుదేరాడు మోహన్.
జంక్షన్లో నిలబడ్డాడు. ఓ బైక్ ఆపి పేపర్లన్నీ చూశాడు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఏం చెప్పాలో తెలియక పంపించేసాడు. ఆ తర్వాత మరో రెండు బైకులుని ఆపాడు. ఏదైనా లోపం కనిపిస్తుందేమోనని డేగ కళ్ళతో వెతికాడు. లేని కారణాల్ని సృష్టించటానికి మనస్సాక్షి అంగీకరించలేదు. ఆ తర్వాత ప్రయత్నించినా ఫలితం శూన్యం.
తన అవసరాన్ని అడ్డుపెట్టుకుని అవకాశం కోసం వెతుకుతుంటే.. గంటలు గడుస్తున్నాయే తప్ప ఒక్క కేసు పట్టుబడడలేదు. టైం పదకొండయింది.
పోస్టాఫీస్ సెంటర్‌కి వచ్చాడు.
పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత పుట్టిన కూతురుకి పుట్టినరోజు ఘనంగా చేయాలనుకోవటంలో భార్య తప్పులేదు. ఎదుగూ బొదుగూ లేని మధ్య తరగతి జీవితం. తన కిష్టమైన మిలిటరీ సి.డి.ఎస్. పరీక్షలకు సిన్సియర్‌గా అప్పియరయ్యాడు. కానీ ఫలితం దక్కలేదు. దొరికిన కానిస్టేబుల్ ఉద్యోగంతో జీవితం నెట్టుకొస్తున్నాడు.
పోస్టాఫీస్ వైపు గుడి పూజారి చేతిలో పెద్ద కవరు పట్టుకుని వెళ్తున్నాడు.
“ఏయ్! పంతులూ! ఇలా రా!”
“లెటర్లు డబ్బాలో వేసి వస్తాను”
“ముందు రా!”
పూజారి వచ్చాడు. అతనికి నలభై ఏళ్ళుంటాయి.
“ఏంటా కవరు?”
“ఎవరో ఎవరికో రాసింది”
తీసుకుని చూశాడు మోహన్.
“ఇది నీ చేతికి ఎలా వచ్చింది?” గట్టిగా అడిగాడు.
పూజారి మొహంలో భయం కనిపించింది. అతని భయం కానిస్టేబుల్ మోహన్‌కి ధైర్యాన్నిచ్చింది. తన కూతురు పుట్టినరోజుకి కావలసిన డబ్బులో కొంతైనా పూజారి దగ్గర నుంచి గుంజాలనుకున్నాడు.
“ఈ లెటర్ నీ చేతికి ఎలా వచ్చింది?” గద్దించి అడిగాడు.
“……….”
“గొంతు చించుకుని అడుగుతున్నాను కదా! చెప్పు.”
“………..”
“నువ్వు ఇక్కడ చెప్పవులే కానీ స్టేషన్‌కి పద. అక్కడ నాలుగు తగిలిస్తే నిజం దానంతట అదే బయటకు వస్తుంది” అన్నాడు.
స్టేషన్ మాట వినగానే పూజారికి చెమటలు పట్టాయి. నా టైం బాగలేదివ్వాళ అనుకున్నాడు.
“నేను చెప్పేది సావధానంగా వినండి.”
“చెప్పు” అన్నాడు మోహన్ నిర్లక్ష్యంగా.
“గుడి పక్కన ఉన్న పోస్ట్ డబ్బాలో ఈ కార్డు వేద్దామని వెళ్లాను. కార్డు లోపలికి పడకపోవడంతో వంగి చూశాను. పోస్ట్ డబ్బా ద్వారంలో ఈ పెద్ద కవరు సగం బయటికి, సగం లోపలికి వేలాడుతోంది. దానిని తీసినా నా పోస్ట్ కార్డు లోపలికి వెళ్లడం లేదు. రెండూ కలిపి పోస్టాఫీస్ దగ్గరున్న పెద్ద డబ్బాలో వేద్దామని తీసుకొస్తున్నాను. అంతకుమించి నాకేం తెలియదు. నేను ఏ తప్పూ చేయలేదు.”
“అబద్ధం అతికేటట్టు చెప్పాలి”
“.. .. .”
“ఇంతకీ నీ పేరేంటి?”
“రామశర్మ”
“రామశర్మకి, రషీద్‌తో లింకేంటి? ఈ లెటర్ లో ఏం రాశావు?”
“భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ లెటర్ ఎవరిదో నాకు తెలియదు. నన్ను నమ్మండి”
“ఇదంతా స్టేషన్లో చెబుదువు గాని నడువు”
మోహన్‌ని అనుసరించాడు రామశర్మ.
తెలిసినవాళ్ళెవరైనా చూస్తే పరువు పోతుంది. అంతకు ముందే ఈ పోలీస్‌ని బ్రతిమాలితే.. అనుకుని..
“నేనే తప్పూ చేయలేదు. నన్ను నమ్మండి.” అభ్యర్థించాడు.
“స్టేషన్‌కి వచ్చి ఇన్‌స్పెక్టర్ దగ్గర ఇదే విషయం చెప్పు”
“తప్పు చేయలేదని చెప్తున్నాను కదా!”
“హెడ్ కానిస్టేబుల్ దగ్గర చెప్పి నీ మీద కేసు లేకుండా చెయొచ్చు. కానీ ఆయన డబ్బు మనిషి. చెయ్యి తడపకపోతే..” నసిగాడు మోహన్
“చెయ్యి తడపడం ఏమిటి?”
“అదే పంతులూ! లంచం”
“లంచమా?!?”
“ఇష్టమైతేనే ఇవ్వు. లేదంటే లాకప్పు, కేసు, కోర్టు” అన్నాడు.
రామశర్మ మౌనంగా నడుస్తున్నాడు.
“మాట్లాడవేంటి పంతులూ?”
“లంచానికి నేనెక్కడికెళ్ళాలి? నా దగ్గర అంత డబ్బు లేదు”
“తీవ్రవాదులు మారువేషాల్లో, ఊళ్ళలో తిరుగుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఎవరు? ఎక్కణ్ణుంచి వస్తున్నారో.. తెలియటంలేదు. స్టేషన్‌కి పద”.
త్రోవలో పంతుల్ని భయపెట్టాలని ఎంతో ప్రయత్నించాడు మోహన్.
అవేవీ పట్టించుకోకుండా మౌనంగా నడుస్తున్నాడు రామశర్మ.
ఇద్దరూ పోలీస్ స్టేషన్ సమీపానికి వచ్చారు.
“పంతులూ! కేసు లేకుండా చూసుకుంటాను. హెడ్‌కి ఎంతో కొంత ఇవ్వు”.
“ఎన్నో ఏళ్ల నుండి స్వామికి నిత్య కైంకర్యాలు చేస్తున్నాను. ఆయన్నే నమ్ముకున్నాను. నన్ను జైలుకు పంపాలనుకుంటున్నాడు కాబోలు. లోపల వేసిన వాడికి, బయటికి తీసుకురావడం తెలియదా?” అన్నాడు నిర్భయంగా.
“నువ్వేమీ అంబానీ, అదానీ కాదు. హెడ్‌కి చెప్పి, కేసు లేకుండా చేయిస్తా” అన్నాడు.
“అంత డబ్బుంటే పూజారిగా ఎందుకుంటాను?”
మోహన్‌కి కోపం వస్తోంది. ఇద్దరూ స్టేషన్ ముందుకు వచ్చారు. ఏ తప్పు చేయని రామశర్మను ఎలా కేసులో ఇరికించాలో తెలీలేదు. నిర్భయంగా నిలబడ్డ పూజారిని చూస్తుంటే.. ఇప్పుడు ఎలా వదిలించుకోవాలనే ఆలోచనలో పడ్డాడు మోహన్.
“పంతులూ! పనుంటే వెళ్ళు. నీ కేసు తర్వాత చూద్దాం” అన్నాడు.
“అదెలా!?! తేల్చుకోకుండా వెళ్తే, ఏ అర్ధరాత్రో వచ్చి అరెస్ట్ చేసి, ఊరూరూ తిప్పి, జైల్లో వేస్తే.. అప్పుడేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్లాలి? ఇక్కడైతే నాకు తెల్సినవాళ్ళు కొంతమందైనా ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ దగ్గరికి వెళ్తే తేలిపోతుంది కదా!”
“నిన్ను వదిలేస్తున్నాను. వెళ్లిపో!” అన్నాడు.
అటుగా వెళ్తున్న ఓ పెద్దాయన ఆగి..
“ఏమైంది?” అన్నాడు.
“రేపు నా కూతురు పుట్టినరోజు. పూజలు, హోమం చేయించాలని పంతుల్ని అడుగుతున్నాను” అంతకని అబద్ధం చెప్పాడు మోహన్.
రామశర్మ అది విన్నాడు.
“ఓహో! ..ఇదా! సంగతి!?” అని పెద్దగా నవ్వాడు.
“పంతులూ! వెళ్ళమంటే వెళ్లకుండా, నిలబడి నవ్వుతున్నావేంటి?” అన్నాడు కోపంగా.
“పుట్టినరోజు, హోమం, పూజ ఇవన్నీ నిజమేనా?!” అన్నాడు నవ్వుతూ.
“అవన్నీ నీకనవసరం. ముందు వెళ్లిపో.. స్వామీ! నీకో దండం” అన్నాడు దణ్ణంపెట్టి.
“మీకు అసలేం కావాలో చెప్పండి.” అన్నాడు రామశర్మ.
“…….”
“పర్లేదు చెప్పండి” అన్నాడు.
“రేపు నా కూతురు పుట్టిన రోజు. కొత్తగా ఈ ఊరికి వచ్చాను. ఇక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు. హెడ్డుని అప్పు అడిగితే.. ఏదైనా కేసు బుక్ చేసి తీసుకురమ్మన్నాడు. అందుకే మిమ్మల్ని..” అన్నాడు తలొంచుకుని.
“పాప పేరేంటి?!”
“అతులిత”
“హనుమ పేరే.”
“నా ప్రవర్తన నాకే సిగ్గుగా ఉంది స్వామీ! ఇలా ఏనాడూ అలవాటు లేదు” అన్నాడు తలొంచుకుని.
“మంచివాళ్ళు తప్పు చెయ్యాలనుకున్నా చెయ్యలేరు. దానికాయన సహకరించడు”
“నన్ను క్షమించండి!” అని మోహన్ వెళ్లబోతుంటే..
“ఆగండి” అని పంచముడిలో ఉన్న డబ్బు తీసి ఇవ్వబోయాడు.
“మిమ్మల్ని ఏకవచనంలో అమర్యాదగా మాట్లాడినందుకే సిగ్గుపడుతున్నాను. డబ్బులిచ్చి నన్నింకా..”.
“పర్లేదు.. తీసుకోండి”
“స్వామీ! ఇప్పటికే సిగ్గుతో చచ్చిపోతున్నాను. మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు.” అన్నాడు చేతులు జోడించి.
“మీలో మానవత్వం ఇంకా ఉంది. మీరు సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది. నాకు కాదు. మీ మనస్సాక్షికి.
రేపు మీ భార్యని, పాపని గుడికి తీసుకురండి. పాప పేర అర్చన, ఆకు పూజ చేయిస్తాను. దక్షిణ ఏమీ తీసుకోను” అని వెళ్తున్న రామశాస్త్రి కనుమరుగయ్యేదాకా చూశాడు మోహన్.
***
కొంతమంది పరిచయం, మాటలు జీవితంలో ఎంతో మార్పు తెస్తాయి. మోహన్ జీవితంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన మోహన్ జీవితాన్నే మార్చేసింది.
పోలీసు ఉద్యోగంలో ఇమడలేక బ్యాంకు పరీక్షలు రాశాడు. బ్యాంకు క్లర్క్‌గా సెలెక్ట్ అయ్యాడు మోహన్.
అప్పటినుంచీ.. ఏ ఊళ్ళో ఉన్నా.. కూతురి పుట్టిన రోజుకు తప్పనిసరిగా ఆ ఊరు వచ్చి, రామశర్మతో పూజ చేయించి ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీగా మారింది.
ఇప్పుడు మోహన్ ఉద్యోగ జీవితం మేనేజర్ స్థాయికి ఎదిగింది.
అతులిత చదువులో మంచి ర్యాంకులు సాధిస్తోంది.
***
ఆరోజు మోహన్ భార్య, కూతురుతో గుడికి వచ్చాడు. పూజ సామాగ్రితో పాటు ఒక కవర్ కూడా పెట్టాడు.
“ఏమిటిది?” అడిగాడు రామశర్మ.
“చూడండి. మీకే తెలుస్తుంది”
కవర్ తీసి చూసి ఆశ్చర్యంగా
“చదువుల తల్లీ! ఐ.ఏ.ఎస్. కి సెలెక్ట్ అయ్యావా? చాలా సంతోషం. అంతా నీ కృషి, ఆ పైవాడి కృప”
“దానికంటే ముందు ఆ రోజు మీరు మనస్ఫూర్తిగా విద్యా ప్రాప్తిరస్తు అని దీవించిన ఆశీర్వాద బలం” అన్నాడు మోహన్.
రామశర్మ కాళ్ళకు నమస్కరిస్తున్న అతులితను “దీర్ఘాయుష్మాన్ భవ, సకలకార్యసిద్ధిరస్తు” అంటున్న రామశర్మ కళ్ళలో ఆనంద బాష్పపు తడి.
“అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యం తవకిం వద
రామదూత కృపాసింధో
మత్కార్యం సాధయ ప్రభో”
అంటూ గర్భగుడిలోకి వెళ్లి లెటరు స్వామి పాదాల దగ్గర ఉంచి ఆకు పూజ ప్రారంభించాడు తరతమ బేధం తెలియని రామశర్మ.