నవ్విస్తూనే చురకలు వేసే – పుత్తూరు పిల‘గోడు’

0
1

[ఆర్. సి. కృష్ణస్వామిరాజు గారి – పుత్తూరు పిల‘గోడు’ – అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ]

[dropcap]ఆర్. [/dropcap]సి. కృష్ణస్వామిరాజు గారు ఈ మధ్యే వెలువరించిన తాజా కథాసంపుటి – పుత్తూరు పిల‘గోడు’. దీనికి సరదా కతలు అని కూడా ట్యాగ్‍లైన్ పెట్టి, ఈ కథలు హాస్యస్ఫోరకమైనవని రచయిత కవర్ పేజీ మీదే కావార్థ సూచన చేశారు.

చిత్తూరు జిల్లా మాండలీకం మీద గణనీయమైన పట్టు ఉన్నవారు రాజుగారు. ఈ కథల్లో, సామాన్య ప్రజల నోళ్ళలో నానే పదాలను, పద బంధాలను, సామెతలను ఆ యాస లోనే సుసంపన్నం చేశారు రచయిత. ప్రాంతీయ యాసలను సర్వజనామోదం చేయడంలో శ్రీయుతులు నామిని, అట్టాడ, గంటేడ, రావిశాస్త్రి, తెలిదేవర వంటి వారి వరుసలో కృష్ణస్వామిరాజు గారు కూడా చేరతారనటం అతిశయోక్తి కాదు.

‘లేస్తే కత – కుచ్చుంటే కత’ అని అదే మాండలికంలో పుస్తకానికి ముందుమాట రాశారు శ్రీ మధురాంతకం నరేంద్ర. అది ఔచిత్యమే కాక, విశేషం కూడా. ‘హాస్యమూ వైద్యమే’ అని రచయిత తన మాట రాసుకున్నారు. హాస్యానికి మానసిక రుగ్మతలు నయం చేయగల శక్తి ఉందని, తద్వారా ఆయన నిరూపించారు.

“మానవుల్లోని సహజమైన బలహీనతలను మాత్రమే పరిహసించాలి, శారీరక లోపాలను ఎత్తి చూపి నవ్వించడం హాస్యం కాదు. హాస్యం పరమార్థం సంస్కరణ కూడా” అన్న జోనాథన్ స్విఫ్ట్ నిర్వచనానికి దర్పణం పడతాయి ఈ కథలు.

రాజుగారి హాస్యం సునిశితమైనది. గిలిగింతలు పెడుతుంది. నవ్విస్తూనే చురకలు వేస్తుంది. షెరిడాన్ తన ‘రైవల్స్’ నాటకంలో ప్రవేశపెట్టిన ‘మాల్ అప్రాప్రిజమ్’ అన్న ప్రక్రియను తెలుగు భాషకు చక్కగా అడాప్ట్ చేసుకున్నారు రాజుగారు. అంటే ‘షెరిడాన్’ను అనుకరించారని కాదు. ‘Great men think alike’ అని కదా ఆర్యోక్తి!

ఇతర భాషల లోని కొన్ని పదాలకు తెలుగులో వేరే అర్థాలు ఉంటాయి. ‘మాతాడు’ అంటే కన్నడలో మాట్లాడమని. మా తాడు అంటే తాడు మాది అంటున్నారనుకుని గొడవపడతారొక కథలో. తమిళ పిల్లవాడు ఒకడు ఏడుస్తుంటాడు. ఎందుకో చెప్పడు. ‘కాదు’ అంటుంటాడు. ‘కాదు’ అంటే తమిళంలో ‘చెవి’ అట. చెవినొప్పితో ఏడుస్తున్నాడన్న మాట!

‘ఏడ్చింది’ అనకుండా ‘ముక్కు చీదింది’, ‘ఏం మాట్లాడలేదు’ అనే దానికి, ‘కై, కుయ్ అనడు!’ అంటారు రచయిత.

‘అండా’ కావాలంటుందొక అమ్మాయి. అంటే కోడిగుడ్డని ఆమె ఉద్దేశం. కథానాయకుడు కిష్టడు నీళ్ళు కాచుకునే పెద్ద ‘హండా’ తీసుకొని వెళ్ళి ఇస్తాడు. ‘హంపి వెంకట మామ నిర్యాణము’ అని బోర్డు రాసిపోతాడొకడు. ‘నిర్మాణము’ కొచ్చిన దుస్థితి అన్నమాట.

కిష్టడు ఇందులో రాజుగారే. “No Writer can escape from his life” అన్నాడు కదా ఛార్లెస్ డికెన్స్! అతని తల్లి అతనికి ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్, అన్నీ. ఎవరి తల్లయినా అంతే కదా! కథల్లో పెద్దగా ఎక్కడా తండ్రి ప్రస్తావన ఉండకపోవటం కొంత అసహజంగా అనిపిస్తుంది.

తులసమ్మ అనే ఆమె విధవ. ఊర్లో ఎవరు చనిపోయినా వెళ్ళి రాగాలు పెట్టి ఏడుస్తుంది. ఇంటికి వచ్చిన నవ్వుకుంటుంది. ‘నా మొగుడేనా పైకి పోయేది? ఊళ్ళో ఇంకెవరూ పోరా’ అనేది ఆమె వెర్షన్. విధవగా తనను చిన్న చూపు చూస్తున్నారనే కసిని ఇలా తీర్చుకుంటుంది.

రంగమ్మ, కోడలికి వంట రాకపోయినా ఏమీ అనదు. పైగా పొగుడుతుంది. “తిడితే తిట్టు మిగులుతుంది, పొగిడితే పని జరుగుతుంది” అంటుంది. లౌక్యం! పాత్రలందరికీ ఏదో ఒక వరుస కలపకుండా ఉండలేరు రాజుగారు. గ్రామీణ ఆప్యాయతలకు, అనుబంధాలకు చక్కని ఉదాహరణ ఇది.

ఆయన ఉపమలు కూడా హాస్యంతో తొణికిసలాడతాయి. ‘ఆర్కిమెడిస్ ఆలోచించినట్లు ఆలోచించి’, ‘ఆమె ముఖం మడత పెట్టిన గొడుగు విప్పినంత పెద్దదయింది’, ‘పెద్ద దోసకాయంత ముఖం చిన్న నిమ్మకాయంత’ ఇలా ఉంటాయి రాజుగారి పోలికలు.

మానవ స్వభావ చిత్రణను, పిల్లలలో ఉన్న జిజ్ఞాసను, కొన్ని విశ్వసత్యాలను హాస్యం అనే చక్కెర అద్ది మనతో తినిపిస్తారు రచయిత. చప్పిడి ముక్కు చెంగన్న, డప్పు శబ్దానికి అనుగుణంగా చిందులేస్తూంటాడు. అప్పుడు రచయిత ఇలా అంటారు – “ఎగరాలని ఉన్నా, ఎవరైనా ఏమైనా అనుకుంటారని చాలామంది మగోళ్లు తిన్నె మీదనే కూర్చుని కాళ్లు ఆడిస్తూ ఉన్నారు!”. లోకం కోసం మన ఆరోగ్యకరమైన ఇన్‍స్టింక్ట్‌ను చంపుకునేవారిపై వేసిన సెటైర్ ఇది.

‘శ్లేష’లు కూడా హాస్యాలే! ‘వీపు రుద్దించుకుఓవడం’ (పెళ్ళానితో) అనేది వేరే అర్థంలో వాడి మనల్ని నవ్విస్తారు రచయిత. పొట్టి కళావతికి పొడుగు మొగుడు కావాలట. నారాయణమ్మ ఇలా అంటుంది, “పొట్టి పొడుగుల దేముంది? బుద్ధులు బాగుండి మొగుడూ పెళ్లాలిద్దరూ కలిసిపోతే చాలు”. ఎంత లోతైన మాట! ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా దంపతులు అన్యోన్యంగా ఉండాలని ఆమె కోరిక.

‘కొట్టిన వాళ్ళ ముందే కులకాల!’  – ఇలాంటి నానుడులను సృష్టించటంలో రాజుగారు దిట్ట. ‘Envy takes no holiday’ అన్న ఫ్రాన్సిస్ బేకన్ గారి మాటలు మనకు గుర్తొస్తాయి. మనల్ని చూసి అసూయపడే వాళ్ళను చూసి మనం ఎంజాయ్ చేయాలట! దటీజ్ ది స్పిరిట్!

“అమ్మా, పాలకు తోడు వేస్తే పెరుగు అవుతుందని కనుక్కునవారు ఎవరే?” అని కిష్టడు అడిగితే, “ఎవరు కనుక్కుంటే ఏమిరా కిష్టా, కమ్మటి పెరుగు తినే అదృష్ట భాగ్యం కలిగించినారు కదా!” అంటుంది అమ్మ. మనం అనుభవించే ఎన్నో సౌకర్యాలను కనిపెట్టిన వారెవరో మనకు తెలియదు. అయినా వారికి మనం కృతజ్ఞులమై ఉండాలని రచయిత సూచించారు.

బంతి భోజనాల్లో తన కొడుకు పక్కన ఎవరో కూర్చుని వాడికి వేసిన ‘అరచేయంత’ జాంగ్రీ, బాదుషాలను, పిల్లోని ఏమార్చి ఎవరో తినేస్తున్నారని, “వాడి పక్క ఎవరు కూర్చుంటున్నారో ఒక కన్నేసి పెట్టరా కిష్టా!” అంటుంది చెంచులక్క. తల్లికి తన పిల్లల పట్ల ఉండే ‘కన్‍సర్న్’ని అలా ఆవిష్కరించారు హృద్యంగా!

ప్రతి కథలో అంతర్లీనంగా ఒక సందేశం. సున్నితమైన హాస్యంతో దానిని రంగరించడం వలన కథలకు రీడబిలిటియే కాక, క్రెడిబిలిటీ కూడా పెరిగింది. ఈ కథలన్నీ ఆంధ్రప్రభ దినపత్రికలో ‘కిష్టడి కథలు’ అన్న పేరుతో ఒక ‘కాలమ్’గా వచ్చాయి.

హాస్యప్రియలందరూ చదవదగ్గ పుస్తకం – పుత్తూరు పిల‘గోడు’

***

పుత్తూరు పిల‘గోడు’ (కథలు)
రచన: ఆర్. సి. కృష్ణస్వామిరాజు
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 107
వెల: ₹ 160/-
ప్రతులకు:
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆర్. సి. కృష్ణస్వామి రాజు
ఫోన్ 9393662821

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here