Site icon Sanchika

మమ్ముట్టి నటనా జీవితంలో మరో మైలురాయి ‘పుళు’

[dropcap]సో[/dropcap]నీ లైవ్ ఓటీటీలో లభ్యం – 115 నిమిషాలు.

***

ఈ చలన చిత్రం తెలుగులో ‘పురు’ అనే పేరుతో శబ్దానువాదం చేయబడింది. ‘పురు’ అంటే ఏమిటో మనకు తెలియదు. దర్శకుడికైనా తెలుసో లేదో మనకు తెలియదు.

మలయాళంలో ‘పుళు’ అంటే ‘పురుగు’ అని అర్థం.

ఈ చలన చిత్రాన్ని మీరు సంపూర్ణంగా ఆస్వాదించాలి అంటే ఈ కింది రెండింటిలో ఒక వర్గానికి చెందిన వారయి ఉండాలి. అప్పుడే ఈ చలన చిత్రాన్ని మీరు పూర్తిగా ఇష్టపడతారు.

ఒకటవ వర్గం: సినిమాని సినిమాగా చూస్తున్నాం అని అనుకునే మంచివారు

రెండవ వర్గం: అభ్యుదయవాదులుగా చలామణి అవుతున్న బ్రాహ్మణద్వేషులు

మీరు మొదటి వర్గానికి చెందిన వారయితే, ఒక చిన్న హెచ్చరిక.

ఈ చలన చిత్ర దర్శకులు మిమ్మల్ని నెమ్మదిగా రెండో వర్గములోకి మార్చేదానికి ఈ చిత్రాన్ని ఒక ఆయుధంగా ఎన్నుకున్నాడు అని తెలుసుకోవాలి అలాగని చెప్పి ఎక్కడా బ్రాహ్మణులను నేరుగా కించపరచలేదు ఆయన. చిత్రాన్ని చివరిదాక చూస్తే, చిత్రంలోని ప్రతి పాత్రని మలచిన తీరు సనాతనవాదులని పరమ దుర్మార్గులుగా, అనాలోచిత నిర్ణయాలు తీసుకునేవారిగా చూపించారు. అదే విధంగా సనాతన ధర్మాన్ని తుంగల్లో తొక్కేవారిని, బ్రాహ్మణ్యాన్ని, దేవతలని కించపరిచేవారిని అతి ఉత్తములుగా చిత్రీకరించటంలో దర్శకులు ఎటువంటి సంకోచం చూపలేదన్నది స్పష్టమవుతుంది.

మీరు రెండో వర్గానికి చెందిన వారయితే చింతే లేదు. హాయిగా ఈ సినిమా చూసేయవచ్చు.

***

ఇది నిస్సందేహంగా ఒక చక్కటి చలన చిత్రం. కథ ఆద్యంతం నత్త నడక నడిచినా, ఎక్కడా బోర్ కొట్టకుండా తీయగలిగారు. కథ ఎటుదారి తీస్తోందో ఎంతకీ అర్థం కాదు. ఆ తరువాత ఒక్క సారిగా షాక్ మీద షాక్ తగులుతుంది మనకు.

మొదట స్థూలంగా ఈ చలన చిత్రం కథ చెప్పుకుందాం.

కథ ఏమిటి అంటే:

కుట్టన్ (మమ్ముట్టి) ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఆయన సద్బ్రాహ్మణుడు. ఆయన రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఆఫీసర్ అని మనకు అర్థం అవుతు ఉంటుంది. ఆయన భార్య చనిపోయుంటుంది. కానీ ఆవిడ ఎక్కడా కనిపించదు కథలో. మామూలు ఫార్ములా చిత్రాలలో లాగా గోడకి ఫోటో వేసి, దండ వేసే విధంగా కూడా ఏమి ఉండదు. పాత్రల సంభాషణలని బట్టి అర్థం చేసుకోగలం మనం.

ఈయన చాలా ఖరీదైన బంగళాలో అతి సౌకర్యవంతమైన, సంపన్నమైన జీవితం జీవిస్తుంటాడు.

ఆయనకి హైస్కూల్‌కి వెళ్ళే వయసున్న కొడుకు ఉంటాడు. వాడి పేరు రిషికేష్/కిచ్చు (వాసుదేవ్ సాజిష్). ఈ కుర్రాడిని మమ్ముట్టి అత్యంత క్రమశిక్షణతో పెంచుతుంటాడు. అలాగని చెప్పి కొట్టడు, తిట్టడు. కేవలం కనుసైగతో ఆ కుర్రాడిని శాసిస్తుంటాడు. వాడి బాగు కోసం తాను మరో పెళ్ళి చేసుకోకుండా, వాడిని చాలా చక్కగా పెంచుకుంటున్నాను అని అనుకుంటాడే కానీ, వాడికి తల్లి ప్రేమ లేదు, ఇటు ఈయన క్రమశిక్షణ కారణంగా తండ్రితో ప్రేమగా దగ్గర అవలేకపోతుంటాడు. వాడికి స్వేచ్ఛ మృగ్యం. ఆయన తన పోలీస్ శిక్షణ తాలూకు అనుభవాన్నంతా రంగరించి ఆ కుర్రాడిని క్రమశిక్షణతో పెంచుకుంటున్నానని అనుకుంటుంటాడు కానీ వాడికి మానసికంగా దూరం అవుతున్నాను అని తెలుసుకోడు.

ఆయన క్రమశిక్షణ ఎలాగుంటుందంటే, ఆయన బయటనుంచి రాగానే, ఈ కుర్రాడు చదువుకుంటూ కనిపించాలి. డస్ట్ బిన్ వద్ద ఏదయినా చిన్న చిత్తు కాగితం కనిపిస్తే, ఆయన గంభీరంగా ఒక సారి గొంతు సవరించుకుంటాడు.

కార్ ఎక్కి కూర్చోగానే తను సీట్ బెల్ట్ తగిలించుకుని, ఈ కుర్రాడి వంక సాభిప్రాయంగా చూస్తాడు. అంతే, వాడు కిక్కురుమనకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి.

ప్రతి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకునేటప్పుటు, నిలువుగా ఎన్ని సార్లు, అడ్డంగా ఎన్ని సార్లు బ్రష్ చేసుకోవాలో ఆయన ఒక సారి చెబుతాడు గంభీరంగా.

ఆ కుర్రాడు ఏమీ చేయలేక తరచు తండ్రిని పొడిచి చంపేసినట్టు ఊహించుకుని తృప్తి పడుతుంటాడు (??), ప్రతి రాత్రి పడుకునే ముందు.

ఈ మమ్ముట్టి గారికి భారతి (పార్వతి తిరువోతు) అని ఓ చెల్లెలు ఉంటుంది. ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి, తనకంటే పెద్ద వాడైన ఒక నాటక కళాకారుడు కుట్టప్పన్ (అప్పుణ్ణీ శశి)తో సహజీవనం చేస్తుంటుంది. ఈ పెద్ద మనిషి ఒక దళితుడు. అతనికి ఇది వరకే పెళ్ళి అయిఉంటుంది. మరి ఆవిడని ఈయన వదిలేశాడా, ఆవిడ ఈయన్ని వదిలేసిందా తెలియదు, కానీ ఈయన గారు శంబూక వధ, తదితర నాటకాలు, అభ్యుదయ నాటకాల పేరిట హిందూ ధర్మాన్ని కించపరిచే నాటకాలు, బ్రాహ్మణ వాదాన్ని విమర్శిస్తూ కవితలు గట్రా వ్రాస్తూ బోలెడు అవార్డులు తెచ్చుకుంటూ ఉంటాడు. ఈయన్ని ఆకాశానికెత్తేసే పత్రికలు, మీడియా హవుసులకూ కొదవలేదు. ఏతావాతా ఆయన పెద్ద సెలబ్రిటీగా చెలామణి అవుతుంటాడు.

వీరు మమ్ముట్టి ఉండే ఊరికే వచ్చి సహజీవన కాపురం పెట్టాలనుకుంటారు. ఇంటి యజమానులు, వీరిద్దరి మధ్య వయోబేధాన్ని గమనించి, మేరేజ్ సర్టిఫికెట్ చూపించండి అంటూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ దశలో వీరు, ఒక మిత్రుడి సాయంతో, మమ్ముట్టి నివసించే అపార్ట్‌మెంట్ లోనే ఇంకో ఫ్లాట్ లోకి వచ్చి స్థిరపడతారు. మమ్ముట్టి వారి ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడడు. ఆ అమ్మాయి తరచు వచ్చి మేనల్లుడిని (కిచ్చు) తమింటికి తీస్కు వెళ్ళటం, వాడికి రకరకాల కథలు చెప్పటం, వాడికి ఇష్టమైన తిండి పదార్థాలు వండిపెట్టడం చేస్తూ ఉంటుంది. తన భర్త నటించే నాటకాలకి కూడా తరచు తిస్కువెళుతుంటుంది.  సహజంగానే మమ్ముట్టికి ఇవన్నీ నచ్చవు. కానీ ఏమీ అనడు. దిగమింగుకుని జీవిస్తుంటాడు.

ఇదిలా ఉండగా, ఇంకో పారలెల్ కథ నడుస్తూ ఉంటుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మమ్ముట్టి మీద తరచు హత్యా యత్నాలు జరుపుతూ ఉంటారు. ఇది ఒక ఉపకథ. తన చెల్లెల్ని, బావగారిని, చివరికి స్వంత టీనేజి కొడుకుని కూడా అనుమానిస్తాడు మమ్ముట్టి.

చివరకు కథ ఎలా అంతమైంది అనేది తెలుసుకోవాలంటే, మీరు ‘పుళు’ చూడాల్సిందే. మీ మనోభావాలు గాయపడితే నాది బాధ్యత కాదు.

***

ఇక ఈ సినిమాలో ముఖ్యమైన కొన్ని ముఖ్యాంశాలు.

***

మమ్ముట్టి చర్యలని సమర్థించటానికి ఎవరికైనా బోలెడు కారణాలు కనిపిస్తాయి ఈ చిత్రంలో.

సంప్రదాయవాది ఆయన. ఆయన చెల్లెలు, ఆయన్ని కాదని ఇంట్లోంచి వెళ్ళిపోయి తనకన్నా వయసులో పెద్దవాడైన వ్యక్తితో పెళ్ళి కూడా చేసుకోకుండా సహజీవనం చేస్తూ, తన అలవాట్లకి భిన్నంగా ఆహారాన్ని వండి, వడ్డిస్తూ, తానూ తింటూ, ఇలాంటి జీవితం మమ్ముట్టి ఎదురుగా  గడుపుతూ ఉంటే, మమ్ముట్టి కోణంలో ఒక సారి ఆలోచించండి, ఆయనకి ఎంత ఆక్రోశం కలుగుతుందో.

ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తినవచ్చు. అది వారి వ్యక్తిగత అభిరుచి. అలాంటి వ్యక్తి తన పిల్లల్ని తన అభిరుచులకి అనుగుణంగా పెంచుకోవచ్చు, అది ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ.

అభ్యుదయవాది అయిన మేనత్త, క్రమశిక్షణలో పెరుగుతున్న టీనేజి కుర్రాడిని, మందు, మాంసంతో కూడిన పార్టీకి తీస్కువెళితే, ఆ కుర్రాడి తండ్రి మనసు ఎలా తల్లడిల్లి పోతుంది, ఒక సారి మమ్ముట్టి కోణంలో ఆలోచించండి.

***

’నీ స్వేచ్ఛ ఎంత వరకు? నా స్వేచ్ఛకి అడ్డు తగలనంత వరకే’, అలాంటిది, నువ్వు నా జీవితంలోకి చొచ్చుకువచ్చి, నా నమ్మకాలని, నా సంప్రదాయాలని, నా మనోభావాలని కించపరిస్తే నేనేం చేయాలి? నేను నీకు అడ్డు రాలేదు. నీవే ప్రతి అడుగులో నాకు అడ్డు వస్తున్నావు. నన్ను ధిక్కరిస్తున్నావు. నన్ను రెచ్చగొడుతున్నావు. నన్ను ఏం చేయమంటావు?’ ఈ మాటలు ఏవీ మమ్ముట్టి అనడు.

ఆయన పాత్రని చిత్రీకరించిన విధానంలో దర్శకులు మనకు ఎన్నో కోణాలని ఆవిష్కరిస్తారు ఆ పాత్రలో. ఆయన విచిత్రమైన పరిస్థితులలో అడకత్తెరలో పోక చెక్కలాగా చిక్కుకుపోతాడు. ఆయన పరిస్థితులకి లొంగి పోతాడు.

ఇలాంటి సంఘర్షణే రాంగోపాల్ వర్మ శిష్యుడు ఆనంద్ చంద్ర, మిర్యాలగూడా లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీసిన ‘మర్డర్’ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలో చూపిస్తాడు. కానీ ఈ ‘పుళు’లో ఎంతో సున్నితంగా భావ సంఘర్షణలు చూపారు.

మళ్ళీ మమ్ముట్టి పాత్ర గూర్చి.

ఈ చలన చిత్రంలో,

అసలే ఆయన సంప్రదాయవాది.

అసలే ఆయన అహంకారి.

అసలే ఆయనకి రాజసం ఎక్కువ.

అసలే ఆయనకి అధికారం వల్ల వచ్చిన మత్తు ఇంకా దిగలేదు.

అసలే ఆయనకి క్రమశిక్షణ ఎక్కువ

డబ్బుకి కొదవలేదు ఆయనకి.

ఉదాత్తుడైన ఆయన, కొడుకు కోసం త్యాగం చేసి, రెండో పెళ్ళి చేసుకోలేదు. ఇలా రూపు దిద్దారు ఆ పాత్రని.

‘ఎందుకు నాలా అందరూ ఉదాత్తంగా ఉండరు?’

‘ఎందుకు నాలాగా అందరూ సంప్రదాయబద్ధంగా ఉండరు?’

‘ఎందుకు నాలా అందరూ విలువలతో కూడిన జీవితాన్ని జీవించరు?’

‘ఎందుకు అందరూ క్రమశిక్షణని ఉల్లఘించి జీవిస్తూ ఉంటారు?’

ఈ మాటలు ఆయన ఎక్కడా బయటకి చెప్పడు. కానీ ఆయన నటన ద్వారా తెలుపుతూ ఉంటాడు.

ఒక సందర్భంలో ఆయన తన చెల్లి ఇంటికి విందుకు వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఆయన పక్కనే కూర్చున్న అతిథులు (వామపక్ష వాదులు) ప్లేట్లలో మాంసాహారం భుజిస్తూ ఆయన వంక చూస్తూ ‘మీకు ఓకే కద’ అంటారు. అప్పుడు ఆయన నటన చూడాలి.

ఆ తర్వాత ఆయన వాష్ బేసిన్ వద్ద చేతులు, మొహం కడుక్కుని పుక్కిలించి అక్కడ ఉన్న టవల్‌ని యథాలాపంగా అందుకుని, ఉత్తర క్షణమే దాన్ని అక్కడ పారేసిన వైనం మన కండ్లారా చూడాల్సిందే.

నటన అంటే ఇలాంటి చిన్నచిన్న హావభావాలే కద. మన బాలయ్యకి చూపించాలి ఈ సినిమాని ఈ విషయంగా అని అనిపించింది.

మమ్ముట్టి పాత్రని మలచిన తీరు అద్భుతం. ఒక కొత్త దర్శకుడు తన మొదటి ప్రయత్నంలో ఇలాంటి చిత్రం తీశాడు అంటే అది నిజంగా ఒక గొప్ప విషయం.

మమ్ముట్టికి నూటికి వెయ్యి మార్కులు వేయవచ్చు ఈ పాత్ర పోషణకి.

ఒక సందర్భంలో తన బావగారిని లిఫ్ట్‌లో కలుస్తాడు మమ్ముట్టి. ఆ సందర్భంగా ఆయన మాట తూలి చెల్లెలి మొగుడి కులాన్ని వారి పూర్వీకుల కులవృత్తిని ప్రస్తావిస్తూ కించపరుస్తాడు.

ఈ సీన్ తీయటం వెనుక దర్శకుడి ఉద్దేశాలు సుస్పష్టం. ఏ బ్రాహ్మణుడు ఇప్పటి సమాజంలో అలా మాట్లాడడు. కానీ ఈ దర్శకుడి టార్గెట్ బ్రాహ్మణద్వేషాన్ని రగల్చటమే కద.

***

ఈ చిత్రం  షూటింగ్ 2021లో ప్రారంభం అయింది. నేరుగా థియేటర్లలో విడుదల చేద్దామనుకుని కూడా  చివరి నిమిషంలో వారు మే 12, 2022న సోనీ లైవ్ ఓటీటీ ప్లాట్‍ఫాం పై విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ లోకి కూడా శబ్దానువాదం చేశారు. ప్రధానంగా ఇది మలయాళ చిత్రం.

***

పాత్రలు పాత్రధారులు:

కుట్టన్ – మమ్ముట్టి

భారతి – పార్వతి తిరువోతు

కుట్టప్పన్ – అప్పుణ్ణీ శశి

వాసుదేవ్ సాజిష్ – కిచ్చు

మోహన్ – నెడుమూడి వేణు

***

సాంకేతిక బృందం:

దర్శకత్వం – రతీన (తొలి ప్రయత్నం)

రచన – హర్షద్

నిర్మాత- ఎస్ జార్జ్

ఫోటోగ్రఫీ -తేనీ ఈశ్వర్

సంగీతం-జేక్స్ బిజోయ్

Exit mobile version