[box type=’note’ fontsize=’16’] 27-6-2021 నాడు ఎస్సార్ & బీజీఎన్నార్ ప్రభుత్వ ఆర్ట్స్& సైన్స్ కళాశాల ఖమ్మం నిర్వహించిన “పీవీ నరసింహారావు సృజనశీల వ్యక్తిత్వం-సమాలోచన” లో కస్తూరి మురళీకృష్ణ చేసిన ప్రసంగ పాఠం సంచిక పాఠకుల కోసం. [/box]
[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం.
ఈరోజు మీ అందరితో ఇలా సంభాషించగలిగే అవకాశాన్ని, అర్హతను ప్రసాదించిన వాగ్దేవి సరస్వతీదేవికి ప్రణామాలు ఆచరిస్తూ, సరస్వతీ కటాక్షం పుష్కలంగా కల పండితుడు, సృజనాత్మక రచయిత పి.వి నరసింహారావు గారి సృజనశీల వ్యక్తిత్వం గురించి అధ్యయనం చేసినది, అర్థం చేసుకున్నది మీతో పంచుకుంటున్నాను. ఈ విశ్లేషణకు నేను పి.వి నరసింహారావు గారి రెండు సృజనాత్మక రచనలు ’గొల్లరామవ్వ’ ’మంగయ్యగారి అదృష్టం’ అనే రచనలను ఎంచుకున్నాను. అయితే ఈ రచనల గురించి ఇంతవరకూ వచ్చిన వ్యాఖ్యానాలకు, విమర్శలకు, భిన్నంగా, పి.వి నరసింహారావుల గారి సృజనశీల వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేందుకు పి.వి నరసింహారావుగారు ఈ కథలనే ఎందుకు రచించారు? అన్న విషయాలను విశ్లేషిస్తున్నాను.
ముందుగా మనం కొన్ని పదాలను నిర్వచించుకోవాల్సి ఉంటుంది. సృజనాత్మకత, Creativity అంటే ఏమిటి?
Creativity is the ability to generate a thought or an idea that is completely new, appealing and useful.
సృజనాత్మకత అంటే ఏదైనా ఒక ఆలోచనను కానీ ఊహను కానీ సృజించే శక్తి. ఇది సరికొత్త ఆలోచన అయి ఉండాలి. అధికుల ఆమోదం పొందగలగాలి. ఉపయోగకరంగా ఉండాలి. ఇందుకు భిన్నమైనది destructive, నాశనం చేసేది. అంటే, సృజన అన్నది నిర్మాణాత్మకము, నూతనము, ఆకర్షణీయము అమోదయోగ్యము అయి ఉండాలన్నమాట.
సృజనాత్మక కళాకారులు అంటే creative artists అనేవారు creative thinkers. సృజనాత్మకంగా ఆలోచించగలిగేవారు. తమ ఆలోచనలను తమ కళల రూపంలో వ్యక్తం చేయగలిగేవారు, creative artists and creative thinkers.
మామూలు మనుషులకు సృజనశీలురకు తేడా ఏమిటి? అన్నది వెంటనే వచ్చే ప్రశ్న.
Creative people like to daydream and imagine the possibilities and wonders of the world. they can immerse themselves in imagination and fantasy, yet remain grounded enough to turn their daydreams into reality సృజనశీలురు ఊహిస్తారు ఆలోచిస్తారు. ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు సాధ్యమో వారు ఆలోచిస్తారు. ఆ ఊహలో, ఆలోచనలో ఎంతగా మునిగిపోతారంటే అసాధ్యమనిపించే వాటిని ఆచరణలో పెడతారు. వారు సృజనశీలురు. ఇక్కడ మరో విషయం గురించి తెలుసుకోవాలి.
మనం ఎందుకు సృజిస్తాము?
ప్రస్తుతం మనం రచయిత సృజనశీలత్వం గురించి చర్చిస్తున్నాం కాబట్టి మనం మన సృజన పరిశీలనను రచనలకే పరిమితం చేయాల్సి ఉంటుంది. మనం ఎందుకు సృజిస్తాము అన్న ప్రశ్ననే మరోరకంగా ’రచయితలు ఎందుకు రచిస్తారు?’ అన్న ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి ఒక్క మనిషిలో రచయిత ఉంటాడు. సృజనాత్మక శక్తి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మనతో పాటు ఈ సృజనాత్మక శక్తి ఎదుగుతుంటుంది. ఎవరైతే తన సృజనాత్మక శక్తిని రచనలవేపు మళ్ళిస్తారో వారు రచయితలవుతారు. ఈ శక్తి ఏ వైపు మళ్ళితే వారు అది అవుతారు. ఇప్పుడు మనం మన అసలు ప్రశ్న దగ్గరకు రావాల్సి ఉంటుంది. ఎవరైనా ఎందుకు రాస్తారు?
Writing is a lonely and thankless job. అందరూ హాయిగా, ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, తుళ్ళుతున్న సమయంలో రచయిత ఒక్కడే కూర్చుని ఎదురుగా తెల్ల కాగితాలు వేసుకుని తనలోకి తాను చూసుకుంటూ, పారిపోతూ, ఆవిరైపోతున్న అస్పష్టపుటాలోచనలకు అక్షర రూపం ఇవ్వాలని తపన పడుతూ, నిరాశ చెందుతూ, ఆవేశపడుతూ గంటలు గంటలు, రోజులు రోజులు, నెలలు, సంవత్సరాలు ఎందుకని రచనను సృజిస్తాడు?
ఎందుకని?
నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందున నిషాలందున
ఎటునే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీరూపం కనరానందున
నా గుహలో, గూటిలో, చీకటిలో……
ఒక్కడై సృక్కటం ఎందుకని?……….
అవార్డుల కోసమా? పొగడ్తల కోసమా? డబ్బు కోసమా? సన్మానాలు, శాలువల కోసమా? ఇందులో దేనికోసమైనా అతడు రచయిత కాడు అతని రచన రచన కాదు. Writing is a form of catharsis. Catharsis అంటే కొన్ని తెలుగు డిక్షనరీలలో విరేచనమగుట, చికిత్స అన్న అర్థం కనిపిస్తోంది. Catharsis అంటే the process of releasing on, thereby providing relief from story or depressed emotions. తీవ్రమైన భావావేశం నుంచి, అణచివేయబడ్డ భావనల నుంచి విడుదల పొందటం catharsis. దీనికి తెలుగులో సరైన పదం మనోప్రక్షాళన. మనోప్రక్షాళనగా ఆరంభమైన రచన ప్రక్రియ రాను రాను రచయిత ఆవేశాలు, ఆదర్శాలు, నిరాశలు, ఆనందాలు అన్నిటినీ వ్యక్తపరిచే వేదికగా మారి రచయితకు అతని రచనకు గుర్తింపును, వ్యక్తిత్వాన్ని ఇస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన రచయితల పేరుపొందిన రచనలన్నీ పరోక్షంగా రచయితల స్వీయాత్మకథనాలే. అంటే, రచనలలో మనకు కనిపించేది రచయిత వ్యక్తిత్వం. రచయిత జీవితం. ఇలా వ్యక్తపరచగలగటం మామూలు మనుషులను సృజనశీల రచయితల నుంచి వేరుచేస్తుంది అంటే ఒక రచయిత సృజనశీలత్వం గురించి అవగాహన రావాలంటే రచన ఎలా చేశాడు? రచన శైలి ఏమిటి? రచనలో సంఘటనను ఎలా సృజించాడు వంటివి అత్యవసరమైనా ’ఈ కథే ఎందుకు రాశాడు రచయిత?’ అన్న విషయాన్ని విశ్లేషించటం సాహిత్య విశ్లేషణలో ఒక ప్రధానమైన అంశం. రచయిత సృజనశీలత్వాన్ని బోధపరిచే అంశం.
ఒక వ్యక్తికి అనుక్షణం అలల్లా ఆలోచనలు వస్తుంటాయి. ఏ వ్యక్తీ ఆలోచించకుండా ఉండలేడు. ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఏ ఆలోచన లేదంటే ఆ వ్యక్తి చైతన్య రహితుడై ఉంటే తప్ప సాధ్యం కాదు. కాబట్టి రచయితకైనా, మామూలు మనిషికైనా అనంతంగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సామాన్యుడు ఆలోచనల నుంచి ఆలోచనకు వెళ్ళిపోతుంటాడు. ఏదైనా సంతోషకరమో, బాధాకరమో అయిన సంఘటన జరిగితే ఆలోచనలన్నీ దానిచుట్టే కేంద్రీకృతమవుతాయి. సామాన్యుడు కాస్సేపు ఆనందించో, బాధపడో ముందుకు సాగిపోతాడు. రచయిత అలా కాదు. రచయితను ఆ సంఘటన పట్టి వదలదు. వేధిస్తుంది, పీడిస్తుంది, నిలవనీయదు. మరో పని చేయనీయదు. రచయిత యాంత్రికంగా నిత్యజీవితంలో పనులు చేసుకుంటూ పోతున్నా శరీరానికి అయిన గాయం బాధించటం ఎలా మానదో, అలా ఈ ఆలోచన మానని గాయంలా వేధిస్తూనే ఉంటుంది. చివరికి ఆ వేదనకు అక్షరరూపం ఇచ్చేవరకు అతడిని అది వదలదు. అక్షరరూపంలోకి రాగానే ఆ బాధ అతడిని వదులుతుంది. ఇంతలో కొత్త బాధ మొదలవుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అయితేనే ఆ వ్యక్తి సృజనాత్మక రచయితగా నిలుస్తాడు. అందుకే రచన catharsis అయింది. అతని మనస్సు రచన వెలువడటంతో ప్రక్షాళనమవుతుంది. మళ్ళీ మరొకటి వచ్చి చేరుతుంది. వచ్చిన ప్రతి ఆలోచన రచనగా మారదు. నీటిలో పడీన ప్రతిరాయి అలను సృజిస్తుంది. కానీ ఆరంభమైన కేంద్రం నుంచి ఒడ్డును అన్ని అలలు తాకవు. అలా తాకాలంటే ఆ అలకు తగిన శక్తినివ్వాలి. అంటే రచయిత సృజనాత్మక సరస్సులో తగినంత కలవరం కలిగించిన ఆలోచననే అక్షరరూపం దాలుస్తుంది. ఆ అక్షరరూపం దాల్చిన ఆలోచన ద్వారా మనం రచయిత సృజనశీలత్వాన్ని అంచనా వేస్తాం.
పి.వి నరసింహారావు చేసిన రెండు రచనలు ‘గొల్లరామవ్వ’, ‘మంగయ్య గారి అదృష్టం’ల నడుమ దాదాపు యాభై ఏళ్ళ వ్యత్యాసం ఉంది. గొల్లరామవ్వ 1949లో కాకతీయ పత్రికలో పరిచయం అయింది. మంగయ్య గారి అదృష్టం 1999లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితం అయింది. పి.వి నరసింహారావు గారు జూన్ 1921లో జన్మించారు. గొల్లరామవ్వ కథను ఆయన 21వ ఏట రాశారంటారు. కానీ అది ప్రచురితమయింది 1949లో అంటే 28 ఏళ్ళ వయసులో. మంగయ్య గారి అదృష్టం ప్రచురితం అయింది 1999లో అంటే 77 ఏళ్ళ వయస్సులో. ఇది మనకందరికీ అనుభవమే. ఇరవై, ముఫ్ఫయి ఏళ్ళ వయసులో మనకు ప్రధానంగా అనిపించినది అరవైఏళ్ళ వయసులో అనిపించదు. పి.వి నరసింహారావు యవ్వనంలోనే జాతీయోద్యమం వేపు ఆకర్షితుడయ్యాడు. నిజాం వ్యతిరేక పోరాటంలో భాగమయ్యాడు. ఆకాలంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటం ఆయనను ఉత్తేజితుడ్ని చేసిందనటంలో ఎలాంటి అనృతం లేదు. పోరాటంలో పాల్గొనటమే కాదు, పోరాటంలో పాల్గొన్నవారిని, వారి కష్టాలను, కడగండ్లను, వారి దీక్షను, ఆవేశాన్ని, ఆదర్శాన్ని అన్నిటినీ అతి దగ్గరగా చూసి అనుభవించాడని ఊహించటమూ పెద్ద కష్టం కాదు. విప్లవవీరులనే కాదు విప్లవవీరులకు మౌనంగా మద్దతునిచ్చే సామాన్యులను, వారి మనస్తత్వాలను, వారి బలహీనతలను వారి దేశభక్తి భావనను కూడా అతి దగ్గరగ చూసి, గమనించి భావించి, అర్థం చేసుకోవటంలోనూ ఆశ్చర్యం లేదు. ఆ కాలంలో ఎంతోమంది సామాన్యులు ఆశ్రయం ఇచ్చి ఆదుకోకపోతే ఇంకెంతోమంది విప్లవవీరులు నిజాం దంష్ట్రలలో చిక్కుకుని నలిగిపోయి ఉండేవారు. ఇదంతా అతి దగ్గరగా చూసి ఉంటారనటంలో సందేహం లేదు. అయితే ఆ కాలంలో సాహిత్యం నిజాంను విమర్శిస్తూనే విప్లవవీరులను పొగడుతూ, వారి ధైర్య సాహసాలను కీర్తించే విధంగానో సృజించేవారు. దీనిలో సామాన్యుల పోరాట పటిమను, త్యాగాన్ని గుర్తించి, ప్రదర్శించిన రచనలు అరుదు. మహాత్మగాంధీ ప్రభావంతో శాంతియుత పోరాటాన్ని, సత్యాగ్రహాన్ని, సాంఘిక సంస్కరణలను ప్రదర్శించే రచనలూ వచ్చేవి. వాటిలో కూడా సామాన్యుల కష్టాలను, త్యాగస్ఫూర్తిని ప్రదర్శించిన కథలు అరుదు. ఇది సృజనాత్మక రచయితగా పి.వి నరసింహారావు గారిలో ఆలోచనలను రగిల్చి ఉంటుంది. కథా రచయితగా ఆయన నిజాం దుశ్చర్యలను వర్ణించవచ్చు. విప్లవవీరుల ధైర్యాన్ని, త్యాగాన్ని చూపించవచ్చు. కానీ అవి అలాంటి ఎన్నో కథలలో ఒకటి అయిపోతాయి. కాబట్టి తన ప్రత్యేకత, రచయితగా తాను ఇతరులకన్నా భిన్నమైన రీతిలో సృజన చేయగలగటం సాధ్యమవ్వాలంటే పి.వి నరసింహారావు అందరు చూపే విధంగా కాక మరో కోణంలో జరుగుతున్న సంఘటనను చూపాలి. సామాన్యుల త్యాగాన్ని, దేశభక్తిని ఎత్తిచూపాలి. కోట్లున్నవాడు లక్ష దానం చేయడం విశేషమే అయినా గొప్ప విశేషం కాదు. అయిదు వందల రూపాయలు ఉన్నవాడు అయిదువందలూ దానం చేయడం అద్భుతం. ఇక్కడ విలువ అంకెలో ఉండదు. హృదయంలో ఉంటుంది. ఆ హృదయాన్ని తన రచనలో ప్రదర్శించడం ద్వారా ఇతరుల రచనలకు భిన్నంగా నిలవటమే కాక ఎవరూ చూపని సామాన్యుల వైపు దృష్టిని మరల్చినట్టవుతుంది. సామాన్యుల మద్దతులేని ఏ పోరాటం కూడా నిలవదు. కాబట్టి ఈ దృక్కోణంలో కథను సృజించాలన్న ఆలోచన స్థిరపడి ఉంటుంది.
నిజానికి గొల్లరామవ్వ కథను మరే రచయిత రచించినా అది ఇలా ఉండదు. ఒక రచన సంవిధానం రచయిత దృక్కోణం ఆధారంగా ఏర్పడుతుంది. ఇదే కథను విప్లవకారుడి దృక్కోణం నుంచి చెప్పవచ్చు. The insider లో ఈ కోణంలో ఉంటుంది కథ. లేకపోతే మామూలు narrative styleలో రచించవచ్చు. మామూలుగా చెప్పవచ్చు. లేకపోతే పూర్తిగా గొల్లరామవ్వ దృష్టినుంచి కథ చెప్పవచ్చు. ఇంకా మల్లమ్మ దృక్కోణంలో చెప్పవచ్చు. దీన్ని సస్పెన్స్ కథలా రాయవచ్చు. గొల్లరామవ్వ ఎంత ఏడ్చి మొత్తుకున్నా పోలీసులు మంచంమీద లేచి కూర్చున్న యువతీయువకులను పరిశీలనగా చూడవచ్చు. ఇలా కథలో సస్పెన్స్‌ను పెంచవచ్చు. కానీ రచయిత దృష్టి సస్పెన్స్‌ను సృజించటం పైనే ఏదో ఒక కోణాన్ని clarify చేయటం పైననో లేదు. కథ పేరులోనే రచయిత ఉద్దేశ్యం తెలుస్తోంది. అలాగని గొల్లరామవ్వ వ్యక్తిగత దీనగాథను చెప్పటంలో లేదు. ఒక్కో చోట ఒక్కో సంభాషణ ఉంటుంది. ’నా ముంగట్నే నా కొడుకు కోడలు రుచ్చలోలె పడిపోయిర్రు. ఈ పోర్ని నా నెత్తిన పడేసిన్రు. దెబ్బకొడ్తేనేమో రద్ది. కొట్టకుంటే బుద్ధిరాదు. ఎక్కడి పీడతెచ్చి పెడితివిరా నా పానానికి! యాడున్నావుర కొడుకా! నా కొడుకా! ముసలిముండను చెరబెట్టిపోయినావు కొడుకా! నా కొడుకా! నేనేం జేతురో కొడుకో! నా కొడకా! ’ అంతే.. ఆమె జీవితం ఏమిటి? ఎన్ని కష్టాలు పడింది? ఆమె ఆర్థిక స్థితిగతులు ఏమిటి? రచయిత మనకు చెప్తే కథ పరిధి పరిమితం అయిపోతుంది. ఇది తప్ప ఆమె వ్యక్తిగత జీవితంలోని కష్టాలు కడగండ్ల ప్రసక్తిరానే రాదు. ఇది కూడా ఎప్పుడొచ్చింది?
బయట పోలీసులు దబదబా బాదుతున్నారు. అప్పుడామె నిద్రలేవటం లేదని మల్లమ్మని తిడుతుంది. “వీల్ల వైస్యు వక్కలుగాను, బజార్ల గంత లొల్లయితంటె మా రాజుగ గుర్రుకొడుతాన్రు… ఈ అంగడప్పోరి నేంజేతు?” అని తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ కొడుకు కోడలును తలచుకుంది. ఈ ఒక్క ‘దృశ్య సృజన చాలు’ రచయిత కథను ఎంత జాగ్రత్తగా సహజానికి అతి దగ్గరగా ఉంచుతూ, పాత్రల ఉద్విగ్నతలను, సంఘటనలోని నాటకీయతను, emotional intensity ఉద్దీపితం చేస్తూ రచించాడో అర్థం చేసుకునేందుకు. సాధారణంగా రచనలో స్పష్టంగా కనబడేదాని కన్నా కనబడనిది పాఠకుడిని ఎక్కువగా బంధించాలి. అది అత్యుత్తమ రచనా సంవిధానానికి అసలైన నిదర్శనం అంటారు. అదిగో అది ఇక్కడ కనబడుతోంది. మల్లమ్మకు, యువకుడికి ‘పోలీసులకు అనుమానం రాకుండా గట్టిగా పట్టుకోండి’ అని చెప్తోంది. ఆమె గుండెలో ఎన్ని తుఫానులు చెలరేగుతున్నాయో. ఎన్ని అగ్ని పర్వతాల విస్ఫోటనం జరుగుతున్నాయో ఊహించాలంటే భయం వేస్తుంది. లోలోపల జరుగుతున్న అలజడి మాటల రూపంలో బహిర్గతమవుతుంది. ఎలాగైతే లోలోపల ఉడుకున్న లావా బహిర్గతమయ్యే కన్నా ముందు పొగలు వెలువడటం నిప్పు కణికలు విరజిమ్ముతుందో అగ్నిపర్వతం అలాంటి మానసిక స్థితి ఆమెది. రచయిత ఎంతగానో ప్రజలను పరిశీలించి, వారి ఆలోచనలను అర్థం చేసుకొని, వారి మానసిన వ్యవస్థలను అవగాహన చేసుకోందే ఇలా రాయటం కుదరదు. ఆ పాత్ర తానే అయి, పాత్ర ఉద్విగ్నతలు, భయాలు, నిరాశలు, ఆవేదనలు అన్నీ తాను అనుభవిస్తూ వాటిని అర్థం చేసుకుని అక్షరరూపం ఇవ్వటం ద్వారా జరిగిన ఓ సంఘటనను ’పునఃసృజించటం’లో రచయిత సృజనశీలత ప్రస్ఫుటమవుతుంది. సినిమాలు నటీనటుల నటనను కెమేరాలో బంధించి తెరపై ప్రదర్శిస్తాయి. అలాగే రచయిత జరిగిన ఒక సంఘటనను తన మనస్సనే కెమెరాలో బంధించి సృజనాత్మకతతో ‘షూట్’ చేసి అక్షరాల దృశ్యాలను పాఠకుల మనస్సనే తెరపై ప్రదర్శిస్తాడు.
ఈ సందర్భంలో అప్రస్తుతం అనిపించినా ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. హిందీలో ‘మేరా నామ్ జోకర్’ అని ఒక సినిమా ఉంది. రాజ్‍కపూర్ దర్శకుడు. దాన్లో ఒక దృశ్యంలో రాజ్‍కపూర్ పాత్ర తల్లి చనిపోతుంది. ఆమెకు తన కొడుకు సర్కస్‍లో పనిచేయడం నచ్చదు. ఎందుకంటే ఆమె భర్త సర్కస్‍లో పనిచేస్తూ చచ్చిపోతాడు. కానీ రాజ్‍కపూర్ తల్లి నుంచి నిజం దాచి సర్కస్‍లో పనిచేస్తుంటాడు. ఒకరోజు ఆమె సర్కస్‍కి వచ్చి చూస్తుంది. నిజం తెలుసుకుని మరణిస్తుంది. అది జోకర్ రాజ్‍కపూర్‍కి తెలుస్తుంది. కానీ వెంటనే సర్కస్‍లో జోక్స్ చేయాల్సి ఉంటుంది. అతడు ఓ పక్షిని వదిలి ‘అమ్మా… అమ్మా’ అని అరుస్తుంటాడు. అతని ముక్కులోంచి, చెవుల్లోంచి, ఒంట్లోని పలుభాగాల్లోంచి నీళ్ళు ఫౌంటెన్‍లా వెలికివస్తాయి. కళ్ళల్లో నీళ్ళు వాటిల్లో కలిసిపోతాయి. అందరూ నవ్వుతారు. కానీ అసలు నిజం తెలుసుకుని వారి హృదయాలు బరువెక్కుతాయి. ఇదిగో అలాంటి సన్నివేశం గొల్లరామవ్వలోది. ప్రమాదకర పరిస్థితిలో గొల్లరామవ్వ పోయిన కొడుకు కోడలిని తలచుకుని ఏడవటం అంటే, ఇప్పుడు తన రక్షణలో ఉన్నవారికేమౌతుందో అన్న భయాన్ని కప్పిపుచ్చటమే. ఇదీ అసలు సృజనాత్మకత. మేరానామ్ జోకర్, 1970లో విడుదలయింది! 1983లో విడుదలైన హిందీ సినిమా ‘పుకార్’లో కూడా గోవా విప్లవవీరుడైన రణధీర్ కపూర్‍ను ఓ అమ్మాయి గొల్లరామవ్వ కాపాడినట్టు కాపాడుతుంది. అయితే సినిమాలో ఆ దృశ్యం అయిదు నిమిషాలు కూడా ఉండదు. ఎలాంటి ప్రభావం చూపదు.
పి.వి నరసింహారావు రచించిన ‘గొల్లరామవ్వ’ విప్లవవీరుల త్యాగాన్ని పోరాట పటిమను చూపుతూనే, ఆ పోరాటంలో ఎవరూ గుర్తించని, గుర్తించినా అంతగా పట్టించుకోని అనన్య సామాన్యమైన సామాన్యుల త్యాగంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇది పి.వి నరసింహారావు గారి వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఆయన సృజనాత్మక దృష్టి సామాన్యులవేపే తప్పించి గొప్పవారిపై ప్రసరించలేదు. పలుకారణాల వల్ల తనలోని రచయితను ఆయన అణచివేసుకుని రాజకీయాలలో మునిగిపోయినా రాజకీయాలలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు పేద ప్రజలపై ఆయనకున్న అవగాహనను సానుభూతిని స్పష్టం చేస్తాయి. అయితే ఎలాగైతే గొల్లరామవ్వ కథా రచనలో ఆయన ఎలాంటి పటాటోపాలు, ఆర్భాటాల Style వాడలేదో ఆయన నిత్యజీవితంలోనూ అలాగే నిశ్శబ్దంగా, చల్లగా, పనులు చేసుకుంటూ పోయారు తప్ప ప్రచారాలు, ఆర్భాటాల జోలికి పోలేదు. ఎలాగైతే గొల్లరామవ్వ చివర్లో ‘నా పేరు గొల్లరామవ్వ అంతే’ అంటుందో అలాగే అన్నీ సాధించి ఆయన పి.వి నరసింహారావుగా ఉండటానికే ఇష్టపడ్డారు. Credit వేరే వారికి కట్టబెట్టి నిశ్శబ్దంలో ఒదగటానికే ఇష్టపడ్డారు. ఇది ఆయన సృజనశీలత్వం. ఇది 1940ల నాటి కథ. ఇప్పుడు మనం 1988లో రచించిన ’మంగయ్యగారి అదృష్టం’ దగ్గరకు వద్దాం. ఈ నలభై ఏళ్ళ కాలంలో పి.వి నరసింహారావు గారి జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. విద్యార్థి జీవితం నుంచి రాజకీయ జీవితంలోకి మారేరు. పోరాటం నుంచి పదవులందుకునే స్థాయికి ఎదిగారు. నిజాం పాలన దాటి కాంగ్రెస్ పాలనలోకి వచ్చారు. తానే పాలకవ్యవస్థలో ఒక భాగం అయ్యారు. గతంలో సామాన్యులను ఎంత దగ్గరగా చూశారో, ఇప్పుడు అసామాన్యులుగా భావించే పాలకులనూ అంతే దగ్గరగా చూశారు. సామాన్యుల ఆలోచనలను, ఆందోళనలను, ఆవేశాలనూ, నిరాశలను, ఆనందాలను ఎలాగ అవగాహన చేసుకుని, సానుభూతితో అర్థం చేసుకున్నారో అలాగే పాలకులనూ అర్థం చేసుకున్నారు. ఎలాగ సామాన్యుల దృక్కోణంలో ‘గొల్ల రామవ్వ’ను రచించారో, అలాగే ‘పాలకుల దృక్కోణం’లో ‘మంగయ్య గారి అదృష్టం’ సృజించారు. అంటే, ఒక కోణంలోనుంచి చూస్తే సృజనశీలిగా పి.విలో మార్పు రాలేదు. కానీ కలిగిన అనుభవాలు, నేర్పిన గుణపాఠాలు, తెలుసుకున్న విషయాల వల్ల మానసికంగా కలిగిన పరిణతి వల్ల ఆయన రచన సంవిధానంలో మార్పు వచ్చింది. ఇంతకు ముందటి ఆవేశం స్థానే ‘వ్యంగ్యం’ చోటు చేసుకుంది. ఆదర్శం స్థానంలో అవగాహన వచ్చింది. ‘తనని చూసి నవ్వుకునేవాడు పరిణితి చెందినట్టు లెక్క’ అంటారు. తనని చూసి తాను నవ్వుకునే ‘పరిణతి’ ‘మంగయ్యగారి అదృష్టం’లో కనిపిస్తుంది. గమనిస్తే ఈ లక్షణం గొల్లరామవ్వ కథలోనూ కనిపిస్తుంది. యువకుడి ఆవేశాన్ని గొల్లరామవ్వ ‘హాస్యం’గా నెట్టేసిన తీరు ఇందుకు నిదర్శనం.
“చాల్లే చేసిన కాడికి! బాద్దురు గాడ పో! బాగా తిని ఉండబుద్ది కాక పోలీస్‍తోటి వైరం పెట్టుకుంటడ ఉచ్చిలిపోరడు!” యువకుడి ఆవేశాన్ని చూసి వ్యంగ్యం చేస్తున్న పరిణితి పొందిన ముసలమ్మ మనకు ‘మంగయ్య గారి అదృష్టం’లో అడుగడుగునా వ్యవస్థను, వ్యవస్థ పాలకులను, వ్యవస్థలో చిక్కుకున్న సామాన్యులను చూసి నవ్వుకునే పరిణతి పొందిన రచయిత కనిపిస్తాడు. ‘మంగయ్యగారి అదృష్టం’ ప్రధానంగా వ్యంగ్య రచన. కానీ తరచి చూస్తే దానిలో గొల్లరామవ్వలోని గాంభీర్యం, విషాధం, నిస్సహాయత, నిస్పృహలు అంతర్లీనంగా కనిపిస్తాయి.
దేవతల నడుమ అభిప్రాయ బేధలు వస్తాయి. అవి పంతాలు పట్టింపులకు దారి తీస్తాయి. నారదుడు మధ్యలో దూరతాడు. చివరికి వారి పట్టుదలల నడుమ అనాకారి, అర్భకుడు, అతిసామాన్యుడు అయిన మంగయ్యను పావును చేస్తాడు. బ్రహ్మ ఎవరి తలరాతను ఎలా రాస్తే అలా జరుగుతుంది. దాన్ని మార్చాలని దేవతలు పంతం పడతారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పనిసరిగా ఎదిరించి, ఖండించి తీరాలనే ప్రతిపక్షంలాగా! మంగయ్య అనాథ. అహంకారి. ఆపై దేవతల కోపం. దాంతో అతడి దారికి అన్నీ ప్రతిబంధకాలే. కానీ బ్రహ్మరాత అతని వైపుంది. దాంతో వంద ప్రతిబంధకాల నడుమ ఒక దారి కనబడుతుంది. వందపాముల మధ్య ఒక నిచ్చెన దొరకగానే అన్నిటినీ దాటుకుని పైకి ఎగబ్రాకుతాడు. చివరికి అతని తలరాతలో ప్రధానమంత్రి పదవి ఉండదు. అదీ కథ. ఇదంతా రచయిత తనని తాను చూసుకుంటూ, తాను భాగమైన వ్యవస్థను చూసి నవ్వుకుంటూ రాసిన రచన అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రచనలో మన వ్యవస్థ కనిపిస్తుంది. మన భాగ్యవిధాతల దౌర్భాగ్య ప్రవర్తనలు కనిపిస్తాయి. వారి అహంకారాలాటలు, అధికార పోరాటలు నడుమ చిక్కుపడి గిలగిలలాడే సామాన్యుడు కనిపిస్తాడు. ఏవరేమి వాదించినా, ఎంతగా గింజుకున్నా, చివరికి విజయం సాధించే అడ్మినిస్ట్రేషన్ కనిపిస్తుంది.
‘దేవీదేవతలు ఇలాంటి అదైవిక స్థాయికి దిగజారి పోతారని ఎవరూ ఊహించలేరు’ అన్న వ్యాఖ్య కూడా వస్తుంది. ఇక్కడ దేవీ దేవతలు మన భాగ్యవిధాతలకు ప్రతీకలు. వారినంతా ఒక ఉన్నతస్థానంలో ఊహించుకుంటాం మనం. ఉదాత్తులుగా భావించుకుంటాం. కానీ వారూ సామాన్యులే. సామాన్యుల కన్నా కనాకష్టం అన్న ఆలోచన చేదుగా ఉంటుంది. ఊహకందదు. ఎంతో దగ్గరగా వెళ్ళి చూస్తే కానీ అసలు నిజాన్ని ఆమోదించటం కష్టం. అందుకే ‘దేవీదేవతలు ఇలాంటి అదైవిక స్థాయికి దిగజారి పోతారని ఎవరూ ఊహించలేరు’ అంటూ దిగజారి ప్రవర్తిస్తున్న దేవిదేవతల స్థాయిలో ఉన్న పాలకులపై విసురు విసురుతున్నాడు రచయిత. వారు దిగజారటం రచయిత ప్రత్యక్షంగా చూసి ఉంటాడు. తొలిసారి అలా చూసినప్పుడు ఆయనలో కలిగిన అపనమ్మక భావం ఇలా వ్యక్తమయింది. వెంటనే మరో వ్యంగ్యం!
ఆ దివ్య కలహంతో ఏదో ఒక ముఠాలో చేరక తప్పని పరిస్థితి రావటం రాజకీయాలలోముఠాలు ఏర్పడటం, ఆ ఏదో ఒక ముఠాలో చేరని వాడి మనుగడ కష్టం అవుతుంది. వాడి రాజకీయ ఎదుగుదల ప్రమాదంలో పడుతుంది. అత్యంత వ్యంగ్యంగా సమకాలీన భారతీయ రాజకీయాల పరిస్థితిని దేవతలపై ఆరోపించి చూపుతున్నాడు రచయిత. The insiderలో కూడా ఈ ముఠాలు, కుట్రలు, కుతంత్రాల ప్రస్తావన వస్తుంది. కానీ ఆ రచన దృష్టివేరు. ధోరణి వేరు. ఈ రచన దృష్టి వేరు ధోరణి వేరు. ఈ రచన చేసేటప్పుడు రచయిత మానసిక స్థితి వేరు. ఆదర్శాలతో రాజకీయాలలో ప్రవేశించిన తరం మారి, కేరీర్ గా రాజకీయాల్లో అడుగుపెడుతున్న తరం తెరపైకి వస్తోంది. ప్రజాసేవ పరమార్ధం అన్న ఆలోచన పోయి, స్వార్ధమే తారకమంత్రం అన్న భావన స్థిరపడుతోంది. అవినీతి అనర్ధదాయకం అన్న తరం పోయి, అవినీతే అసలునీతి అన్న తరం తెరపైకి వస్తోంది. నిర్మోహం అన్న పదం మరుగై అహంకారం లక్షణమవుతోంది. ఇదంతా అతి దగ్గరగా రచయిత చూశాడు. అనుభవించాడు. అది రచన సంవిధానంపై ప్రభావం చూపిస్తుంది. ’ఈ దేవతలందరూ పనీపాటా లేకుండా తమ దేవతల మెదళ్ళను దయ్యాల కర్మాగారంలో మార్చటం వల్ల పాలన దెబ్బతింటోంది. సామాన్యులు కష్టపడాల్సి వస్తోందన్న వ్యంగ్యం కనిపిస్తుంది. అంతేకాదు ‘అన్నివిధాల సౌఖ్యాలకు అలవాటు పడ్డ ఆ బూర్జువా దేవతలు’ అనటంలో ఉన్న వ్యంగ్యం సామాన్యమైనది కాదు. ఈ వాక్యం వెనుక దాగి ఉన్న వ్యంగ్యం, ఆలోచనల పరమార్థాల గురించి విశ్లేషించాలంటే సమయం సరిపోదు. ఇక ‘దేవతలెవరంటే?’ అన్న వివరణ అత్యద్భుతమైనది. ఈ రచనలో ప్రతివాక్యం ఎంతో లోతైన ఆలోచనలను పొదుగుతున్నవి. ఇక శాఖల నడుమ వివాదాలు, అహంకారాలు వంటివి సమకాలీన బ్యూరోక్రసీని కళ్ళముందు నిలుపుతాయి. ఇదొక వ్యంగ్యం ప్రతీకాత్మకమైన రచన సంవిధానం.
సృజనాత్మక రచనకు, సృజనాత్మకేతర రచనకూ ప్రధానమైన తేడా ఇదే. కాల్పనికేతర రచనలో ‘నిజం’ చెప్పాల్సి ఉంటుంది. సృజనాత్మక రచనలో ‘నిజం’ నిక్కచ్చిగా చెప్పవచ్చు ఊహాజనిత పాత్రపై ఆరోపించి. అంటే కాల్పనిక రచనలో రచయితకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది. అందుకే పి.వి నరసింహారావు పాలన వ్యవస్థను విమర్శించేందుకు ‘మంగయ్య అదృష్టం’ అనే కాల్పనిక రచన సంవిధానాన్ని ఎంచుకున్నాడు. తన స్వీయ జీవిత చరిత్ర లాంటి కాల్పనిక రచన నవలను రచించి చెప్పలనుకున్నది చెప్పారు. పాఠకులు ఏ పాత్రలో ఎవరిని ఊహించుకున్నా రచయితకు సంబంధం ఉండదు. ఎందుకంటే రచన కాల్పనికం. ఊహ. All characters are fictitious and do not resemble any person dead or alive. If they do, it is unintentional and incidental. ఏ కోర్టు కూడా ఏమీ చేయలేదు. ఈ స్వేచ్ఛ కాల్పనిక రచన ఇస్తుంది. పైగా పీవీ నరసింహారావు confrontationist కాడు. కనుకనే ‘మంగయ్య అదృష్టం’ రచనలో పి.వి నరసింహరావులోని వ్యంగ్య విమర్శకుడు విజృంభించాడు.
“వాస్తవం చెప్పాలంటే మానవులనబడే ఒక అవకతవక జాతిని సృజించాలన్న విచిత్ర సంకల్పం నా ప్రాణనాధులు. బ్రహ్మదేవులకు కలిగిన లగాయతు వారి శాఖలో ఏదీ సరైన నిర్ణయం జరగడం లేదు” అంటుంది బ్రహ్మ భార్య సరస్వతి దేవి. మన పార్లమెంటులో జరిగే సమావేశాలకు దేవతల సమావేశం ప్రతీక. “మీరందరూ దివ్యదృష్టి సంపన్నులు. నా మనవి మన్నించి ఒక్కమారు కళ్ళుమూసి ఈ భూమి అనబడే నిర్భాగ్య గ్రహాన్ని తిలకించండి. మన భాగ్యరేఖన శాఖ వారి పుణ్యమా అని ఆ మానవ ప్రపంచం సాంతం గందరగోళంలో అల్లల్లాడి పోతోంది”. ఇదీ ఆరోపణ. అత్యద్భుతమైన వ్యంగ్యం ఉంది వాదనలో. మనం ఇలాంటి ఆరోపణలు లోకసభ, రాజ్యసభ టీవి పెడితే చాలు కరువుతీరా వినవచ్చు. కానీ తిన్నగా లోకసభ, రాజ్యసభలను విమర్శిస్తే ప్రమాదం. వాటికి ప్రతీకగా ఓ కాల్పనిక గ్రహం, ఆ గ్రహంలో విచిత్ర జీవుల సమావేశం ఊహించి అక్కడ ఈ పార్లమెంటును ఆరోపిస్తే ఏమన్నా ఎవరూ ఏమీ అనేందుకు వీలులేదు. ఈ రచయితలు అనేకులు ఇలాంటి రచనలు చేశారు. అంతెందుకు పి.వి నరసింహారావు అమితంగా అభిమానించి అనుసరించే విశ్వనాధ సత్యనారాయణ ఇలాంటి వ్యంగ్య రచనలు బోలెడన్ని చేశారు. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, హహాహూహూలు ప్రఖ్యాతి పొందినవి. ‘దమయంతి స్వయంవరం’ అని మరో రచన ఉంది. పేరులోనే వ్యంగ్యం. దమయంతి స్వయంవరం ఒక farce. ఆమె నలుడినే పెళ్ళి చేసుకుంటుందని అందరికీ తెలుసు. కానీ నలుడి వేషం వేసుకుని దేవతలు స్వయంవరానికి వస్తారు. దమయంతి నలుడుని ఎంచుకుంటుంది. ఉద్యోగాలు ఎవరికి ఇవ్వాలో ముందే నిర్ణయమయిపోతుంది. కానీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు దమయంతీ స్వయంవరంలా! అదీ వ్యంగ్యం. అదే వ్యంగం మనకు ‘మంగయ్య అదృష్టం’లో అడుగడుగునా ప్రతి వాక్యంలో ప్రతి పదంలో కనిపిస్తుంది.
ఇక్కడ దేవతల సభలో మరో చమత్కారం చేశారు రచయిత. భార్యాభర్తల నడుమ వైరం. సభ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ దాన్ని తిలకించటం సరస్వతి బ్రహ్మశాఖపై విసుర్లు విసిరింది. ఆరోపణలు చేసింది. ఇప్పుడు బ్రహ్మ వాటికి సమాధానం చెప్పాలి.
అప్పుడు బ్రహ్మ స్థితి వర్ణన చూడండి – సభికులందరూ స్వయంగా భార్యే భర్తగారిని ఘోర పరాభావం చేసే ఆ దృశ్యాన్ని ప్రత్యేకమైన ఆసక్తితో చూస్తున్నారని గమనించాడు. ‘ఇక్కడ మనస్తత్వ ప్రదర్శన చూడండి’ పైపెచ్చు ఆయనకు మరింత చీదర కలిగిస్తూ కుడివైపు విష్ణువూ ఎడమవైపు శివుడూ అదోలా ముసిముసి నవ్వులు చిలకరిస్తున్నారు. ఈ వర్ణన చూడగానే విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులో ఓవైపు విష్ణుశర్మ మరోవైపు తిక్కన ఎలా కథా రచయితను బాధపెడతాడో ఆయన ‘టంగు ఎలా తెంపుతారో’ గుర్తోస్తుంది. డబుల్ ధమాకా వ్యంగ్యం ఇది.
ఇక్కడ మరో ఆరోగ్యకరమైన వ్యంగ్యం ‘ఆ సభికుల కేకల నడుమ బ్రహ్మదేవుడు ఉపన్యసిస్తాడు. ఆయనకు నాలుగు ముఖాలుండటం వల్ల నలువైపులా ఒకేసారి తన వాగ్దాటిని ప్రసరిస్తూ సభికులందరినీ అదరగొట్టగలిగాడు.’ ఇలాంటి వ్యాఖ్యాలు కథను మరింత ఆసక్తికరం చేస్తాయి. livelyగా మలుస్తాయి. మనకు తెలుసు చట్టసభల్లో ఒక నాయకుడు మాట్లాడుతుంటే ఎంత గోల జరుగుతుందో. అంతగోల జరుగుతున్నా నాయకుడు ఏమీ పట్టనట్టు మాట్లాడుతూనే వుంటాడు. అదే ఆ నాయకుడికి స్పీకర్లలాంటి నాలుగు తలలుంటే అతను మాట్లాడే మాటలు నలువైపులా ప్రసరిస్తుంటే! ఇక్కడే సృజనశీలి రచయితకూ, సామాన్య రచయితకూ తేడా తెలుస్తుంది. సామాన్య రచయిత రాసుకుంటూ పోతాడు. సృజనశీలి రచయిత అన్ని పాత్రలు తానే అయి వారి అనుభవాలను తన అనుభవాలుగా చేసుకుని వారి దృష్టిలోంచి ఆలోచనను ప్రదర్శించటమే కాదు, తాను పైనుంచి దైవంలా జరుగుతున్నదాన్ని మనోనేత్రంతో దర్శిస్తూ లాజికల్‍గా కథను అల్లుతాడు. ఇక్కడ బ్రహ్మ నాలుగు ముఖాలు నాలుగు వైపుల శబ్దాన్ని ప్రసరింపచేయటం అన్నదాన్ని రాయటం ఉన్మత్త ఊహాశాలి, సృజనశీలికే సాధ్యం. ఈ సృజన ఇంతవరకూ మన ఏ సినీ కళాకారుడూ రచయిత చేయనిది. ఇక బ్రహ్మదేవుడు తన ఒక్కశాఖకే కాదు, మిగతా అన్ని శాఖలలో లోపాలు ఎత్తిచూపించి, సమస్యను universal చేయటం రాజకీయ ఉపన్యాసాల చాతుర్యానికి అతిగొప్ప నమూనా. సమస్యను universal చేయటం, వ్యక్తిగతం చేయటం, కమిటీ వేయటం, కమిటీ రిపోర్టు వచ్చేదాకా సమస్యను వాయిదా వేయటం….. ఈలోగా కొత్త సమస్య వస్తుంది, పాత సమస్య మరుగున పడుతుంది. కాలం గడుస్తుంది. సభ మారుతుంది. సభికులు మారతారు. సమస్య కాలం పొరలలో అలాగే ఉండిపోతుంది. అందుకే స్వతంత్ర భారతదేశ సమకాలీన రాజకీయాలను గమనిస్తే, కొత్త సమస్యలను మరపించేందుకు పాత సమస్యలను తవ్వితీస్తారు. పాత సమస్యలను అణచేందుకు కొత్త సమస్యలను సృష్టిస్తారు. ఈ విషయం పి.వి నరసింహారావు The insider లో గానీ, బ్రాబ్రీమసీదు సంబంధిత రచనలుగానీ చదివితే ఇంకా లోతుగా బోధపడుతుంది.
ఈ సందర్భంలో ఒక వ్యాఖ్య గమనర్హం ‘మీ ఉద్రేకాతిరేకంలో ఒకే వ్యక్తికి ధనం, ఆరోగ్యం, పాండిత్యం, అధికారం వగైరా కట్టబెడితే ఇక మరో వ్యక్తి సర్వరోగాలూ, దారిద్ర్యం నిరక్షరాస్యత, బానిసత్వం మొదలైనవి ఇవ్వక తప్పుతుందా?’ బ్రహ్మ చాలా ప్రతిభావంతంగా సమస్యను దారి మళ్ళించాడు. సమకాలీన సమాజంలోని వికృతపుటాలోచన ధోరణులపై వ్యంగాస్త్రం వదిలాడు.
చివరికి సమస్య పరిష్కారాన్ని మరొకరిపై నెట్టేస్తాడు బ్రహ్మ. వారి దృష్టిని మంగయ్యపై ప్రసరింప చేస్తాడు నారదుడు. ఇక దేవతల యుద్ధానికి మంగయ్య కేంద్రమవుతాడు.
ఇది ప్రస్తుత సమాజంలోని రాజకీయ వ్యవస్థను, మనస్తత్వాలను అత్యంత వ్యంగ్యంగా, నిక్కచ్చిగా ప్రతిభావంతంగా చూపిస్తుంది. ఒక రచనను ఎంచుకోవటం దాన్ని logical గా నిర్మించి, పాత్రల మనస్తత్వాలను ప్రదర్శిస్తూ పద్ధతి ప్రకారం అడుగు అడుగు ముందుకు తీసుకువెళ్తూ ఒక ముగింపుకు తీసుకువచ్చే పద్ధతిలో పి.వి నరసింహారావు సృజనశీలత్వం కనిపిస్తుంది. గొల్లరామవ్వ అయినా, మంగయ్య అదృష్టం అయినా logical step by step building up of a story bringing it to a logical conclusion అన్నది స్పష్టంగా తెలుస్తుంది.
నిజానికి పివి నరసింహారావు గారి రచనలపై లోతైన విశ్లేషణలు సాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయన రచనా సంవిధానంపై, ఆలోచనలపై విశ్వనాధ సత్యనారాయణ గారి రచనలు, వ్యక్తిత్వ ప్రభావాన్ని లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ శతజయంతి ఉత్సవాల ఫలితంగా పి.వి రచనలపై వ్యక్తిత్వంపై గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యయనం సాగుతోంది. విశ్లేషణలు సాగుతున్నాయి. ఇందులో నేను సైతం అనే వీలును కల్పించిన అందరికీ ధన్యవాదాలు. బహు కృతజ్ఞతలు. సెలవు.