ప్యార్ కరోనా!

1
2

[dropcap]రా[/dropcap]త్రంతా పని చేసి, తెల్లవారు జామున నిద్రపోయి మధ్యాహ్నం పన్నెండుకు లేచాడు మదన్. వాళ్ళమ్మ ఒక మగ్గుతో కాఫీ తెచ్చి యిచ్చింది. బ్రష్ చేసుకొని వచ్చి, హాల్లో సోఫాలో కూర్చుని, టి.వి. ఆన్ చేశాడు. మగ్ లోని కాఫీని నెమ్మదిగా చప్పరిస్తూ వార్తలు చూడసాగాడు. టి.వి. పాయింట్ ఫైవ్ ఛానల్‍లో వార్తలు చదువుతూందొక వన్నెల విసనకర్ర. అవసరం లేని అభినయాన్ని ప్రదర్శిస్తూ, ఉద్వేగంతో ఊగిపోతూ చెప్పసాగింది.

“మళ్ళీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి! నిన్నటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసులు..” అంటూ ఒక సంఖ్య చెప్పింది. ఇంత వరకూ వాక్సిన్ వేయించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నవారికీ సోకుతూందని చెప్పలేదు. ఎంతమంది దాని బారిన పడ్డారో, ఎంతమంది చనిపోయారో గట్టిగా అరిచి చెబుతోంది. ఆమె కళ్ళల్లో ఎక్సైట్‍మెంట్! మళ్ళీ చేతినిండా, కాదు.. నోటి నిండా పని తగిలినందుకు సంతోషంతో వెలిగిపోతోందామె ముఖం!

విసుగ్గా ఛానెల్ మార్చాడు మదన్. ఇప్పుడు టి.వి. 2.0 వస్తోంది. “ముంచుకొస్తున్న ఫోర్త్ వేవ్!” అనరిచాడొకడు ఉపోద్ఘాతమేమీ లేకుండా. కేసుల పెరుగుదల వివరించాడు. ఇంత వరకూ.. అని, మొదటి వేవ్ నుంచి లెక్కేసి, లక్షల్లో తేల్చాడు సంఖ్యను! పాజిటివిటీ రేటు పెరిగిపోతోందని నెగటివ్ ఆనందంతో చెప్పాడు.

“షిట్!” అనుకొని ఇంకో ఛానెల్ లోకి వెళ్ళాడు. ప్రపంచంలోనే (?) నెంబర్ వన్ తెలుగు వార్తా ఛానెల్ ‘చూస్తూనే వుండండి!’ అది. మదన్‍కు ఎందుకో సొంత రాష్ట్రంలో కూడా అధికారంలో లేకపోయినా, ఫలానా పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అంటూ చెప్పుకొనే నాయకులు గుర్తొచ్చి నవ్వుకున్నాడు. ఆ ఛానెల్ లో అప్పుడే చర్చ ప్రారంభించారు. ‘మళ్ళీ లాక్‌డౌన్ తప్పదా?’ అని పెద్దక్షరాలతో తెర నిండా చూపిస్తున్నారు. పరిస్థితి ముదరకముందే దేశంలో లాక్‍డౌన్ పెట్టాలని ప్రధానమంత్రి ఆలోచిస్తున్నారని, బహుశా రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని ఒక ప్రముఖ సామాజిక విశ్లేషకుడు తెలగపిండి భువి గారన్నారు. ఆయన ఎప్పుడూ ప్రభుత్వంతో టచ్‍లో ఉంటారు మరి!

రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ నేత మరో పానెలిస్టు. ఆయన పేరు డప్పు ధర్మన్న. ఆయన ఇలా అన్నాడు – “కేంద్రం మనకు ఒరగబెట్టేదేమీ లేదు. లాక్‌డౌన్‌ను మేము అమలు చేయం. అదే కాదు, కేంద్రం ఏం చెప్పినా మేము చేయం. రేపు తృతీయ కూటమి అధికారంలోకి వస్తే మా నాయకుడే ప్రధాని! అప్పుడు కరోనాను దేశం నుంచి తరిమి కొడతాం (?)”.

పిచ్చెక్కినట్లయి టి.వి. ఆఫ్ చేశాడు మదన్. టీపాయ్ మీదున్న ఆ రోజు పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. అందులో ఇదే!

“ఒరేయ్! స్నానం చేసి వస్తే భోజనం వడ్డిస్తా!” అన్నది తల్లి హాల్లోకి వచ్చి. మదన్ నవ్వి, “తర్వాత చేస్తాలేమ్మా! పెట్టెయ్యి!” అన్నాడు. టెక్కీలు మన లాగా రోజూ స్నానం చేయరు మరి.

బాత్‍రూమ్‌కు పోయి ముఖం, కాళ్ళూచేతూలూ కడుక్కొని వచ్చాడు. టవల్‍తో తుడుచుకుని, మెడ మీద, చంకల్లో, రొమ్ము మీద శాండల్‌వుడ్ పౌడర్ పూసుకున్నాడు. పూర్వం యోగులు భస్మస్నానమని, ఒళ్ళంతా విభూది పూసుకునేవారు చూడండి, అలా!

భోజనం చేసి, డ్రస్ వేసుకుని, బైక్ తాళాలు తీసుకొన్నాడు. ఇంతలో అతని సెల్ మ్రోగింది. అట్నుంచి పలికిన కంఠాన్ని విన్న వెంటనే మదన్ ముఖం పొద్దుతిరుగుడుపువ్వంత అయింది. తల్లికి వినబడకుండా, గబగబా తన రూం లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు.

“హాయ్ స్వీటీ! ఇప్పుడే బ్రంచ్ చేసి బయల్దేరుతున్నా. ఎక్కడ కలుద్దాం?”

“ఇనార్బిట్ మాల్ కొచ్చేయి మూడు గంటల కల్లా. పావు తక్కువ నాలుగుకు ‘అయితే కామేశానికి..’ సినిమా చూద్దాం. అక్కడి నుంచి ఇందిరా పార్కుకి..” అన్నడి స్వీటీ. స్వీటీ పేరు మధుర.

“సరే! డన్!” అన్నాడు మదన్.

బైక్ మీద కూర్చుని కిక్ కొట్టబోతుండగా, సారీ! ఇప్పుడు ఆ ‘కిక్కే’ లేదు కదా! స్టార్ట్ చేయబోతుండగా తల్లి పరుగు పరుగున వచ్చి ఫేస్ మాస్క్, చిన్న శానిటైజర్ సీసా ఇచ్చింది.

“అబ్బా! ఎందుకమ్మా ఇవన్నీ! రెండో డోసు, మూడో బూస్టర్ డోసు కూడా వేసుకున్నాం కదా అందరం?” అన్నాడు విసుగ్గా.

“ఏమోరా! వారం రోజులుగా టి.వి.ల్లో, పేపర్లలో మళ్ళీ ఊదరగొడుతున్నారు. భయమేస్తుంది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి కన్నా!” అన్నదా తల్లి.

‘ఈ ‘ఎందుకైనా మంచిది’ అన్న కాన్సెప్ట్ మీదే కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతూందే అమ్మా’ అనుకున్నాడు మనసులో. “సరేలే” అని మాస్క్ పెట్టుకుని, శానిటైజర్ బాటిల్ జేబులో పెట్టుకుని బండికి ముందుకు పోనిచ్చాడు మదన్.

అతడు ‘మాల్’ చేరేసరికి పది నిముషాలు తక్కువ మూడు. మధుర ఇంకా రాలేదు..

‘స్వీటీ ఈజ్ అల్వేస్ లేట్!’ అంటూ ప్రేమగా విసుక్కున్నాడు. ప్రేమగానే విసుక్కోవాలి మరి. వచ్చింతర్వాత నిజంగానే విసుక్కున్నాడంటే అంతే!

మదన్ గచ్చిబౌలి లోని ఒక ఐటి కంపెనీలో పని చేస్తున్నాడు. మధుర వర్కింగ్ వుమెన్స్ హాస్టల్‍లో ఉంటూ, పంజాగుట్ట లోని అరోరా బిజినెస్ స్కూల్లో ఎం.బి.ఎ. చేస్తుంది. ఇద్దరికీ పరిచయం అయి, ప్రేమగా మారి, దాదాపు సంవత్సరం కావస్తూంది. మరో ఆరు నెలల్లో మధుర ఎం.బి.ఎ. అయిపోతుంది. ఆ బి.స్కూలు అటానమస్. అందరికీ డిగ్రీలు వస్తాయి. కొంతమందికి క్యాంపస్ ప్లేస్‍మెంట్స్ కూడా. మధురకు కూడా ఒక స్టార్టప్ కంపెనీ ఉద్యోగం ఇచ్చింది. జీతం తక్కువ. చేరాలా వద్దా అని ఆలోచిస్తోంది.

మదన్ షార్ట్స్, టీ షర్ట్ వేసుకున్నాడు. ఈ మధ్య షార్ట్స్‌లో తిరగడం మామూలయిపోయింది కుర్రాళ్ళకు. జుట్టు ఎలా వుందంటే నెత్తిన దిబ్బరొట్టె బోర్లించినట్లుంది. చుట్టూ అంట కత్తిరింపు. గడ్డం పెంచి ట్రిమ్ చేసుకున్నాడు. ఇవ్వాళ్ళ రేపు గడ్డం లేకపోతే ‘యూత్’ కాదు కదా! కుడి చెవికి ఒక పోగు!

రోడ్ క్రాస్ చేసి వస్తూ మధుర కనబడింది. ఆమె కూడా మాస్క్ పెట్టుకుంది. ఆ అమ్మాయి వేసుకునే డ్రస్ లన్నీ అతనికి చిరపరిచితాలే కాబట్టి సమస్య లేదు, గుర్తించటానికి.

“హాయ్ మదన్!” అంది అతని దగ్గరికి వచ్చి.

“హాయ్ స్వీటీ!” అన్నాడు ఆనందంగా! ఆమె చేతిని అందుకోబోయాడు.

“ఉండు!” అంటూ బ్యాగ్ లోంచి శానిటైజర్ తీసి తన చేతులకి రాసుకుని అతని చేతుల్లో రెండు చుక్కలు వేసింది. అతడు అరచేతులు రుద్దుకుని ముఖం చిట్లించాడు. అతనికి ఆ వాసన పడదు!

టి.వి.ల ప్రభావంతో చాలామంది మాస్కులు పెట్టుకుని ఉన్నారు ముఖాలకు. వాళ్ళు దీర్ఘదర్శులు. మరి కొందరు మాస్కులే లేకుండా ధీమాగా తిరుగుతున్నారు. వాళ్లు ప్రాప్తకాలజ్ఞులు! అంటే అంతగా వస్తే చూసుకుందాంలే అనే రకాలు.

మధురకు కరోనా అంటే చాలా భయం! అసలే జాగ్రత్త మనిషి.

“షల్ వుయ్ హావ్ సమ్ కాఫీ!” అని అడిగాడు.

“వైనాట్?” అంది స్వీటీ.

ఇద్దరూ ఎస్కలేటర్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్‍లో ఉన్న ‘కాఫీ డే’ లోకి వెళ్ళారు. ఎస్కలేటర్ లోంచి బయటకి వస్తూనే మళ్ళీ యిద్దరికీ శానిటైజర్ అప్లయి చేసింది మధుర.

రెండు ‘క్యాపచీనో’లు ఆర్డర్ చేశాడు. పెద్ద పేపర్ మగ్గుల్తో తెచ్చిచ్చాడు బేరర్. దాని మీద రెండంగుళాల ఎత్తున లేత గోధుమ రంగు నురగ. మగ్గు పై బాగంలో, మొత్తంలో నాలుగో వంతు నురగే వుంది. ఇద్దరు చక్కెర కలుపుకోకుండానే తాగసాగారు, చక్కెరలో ‘క్యాలరీ’లు ఎక్కువని! కాఫీలో లేనట్లు!

నాలుగు వందల డెబ్భై రూపాయలు బిల్లు అయింది. ముఫ్ఫై రూపాయలు ‘టిప్పు సుల్తాన్’కు వదిలేశాడు. టెక్కీల సంపాదనంతా వీకెండ్స్‌లో మాల్స్‌కే సరిపోతుంది. మంత్ ఎండ్‌లో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వీకెన్‌డ్ (weakened) అవుతుంది.

సినిమా టికెట్లు గీతమీదే (ఆన్‍లైన్) బుక్ చేసి ఉన్నాడు మదన్. రెండూ ఏడు వందలు! లోపలికి వెళ్ళి కూర్చున్నారు. అందులో హీరో బ్రాహ్మడు. హీరోయిన్ ముస్లిం. బ్రాహ్మలను ఎన్ని రకాలుగా కించపరచాలో అన్ని రకాలు పరచి, దర్శకుడు తన సెక్యులర్ స్పిరిట్‌ని చాటుకున్నాడు. ముస్లింల జోలికి పోలేదు. పోతే తంతారని తెలుసు. వెకిలి హాస్యం. పిచ్చి పంచు డైలాగులతో సినిమా సుసంపన్నమయింది. హాలు నిండా కూర్చున్న తెలుగు సినిమా మహారాజ పోషకులు కేరింతలు కొడుతూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు! వారు చల్లగా ఉన్నంత వరకూ కమర్షియల్ తెలుగు సినిమాలకేమీ ఢోకా లేదు.

ఇంటర్వెల్! ఒక పెద్ద డబ్బాడు పాప్ కార్న్, రెండు పాకెట్లు ఫ్రెంచ్ ఫ్రైస్, రెండు పెద్ద కూల్ డ్రింక్ టిన్నులు ట్రేలో పెట్టుకుని తెచ్చాడు. అన్నీ దాదాపు ఎనిమిది వందలు! అన్నీ తింటూ, తాగుతూ సినిమా చూశారు. అలా సమకాలీన నాగరికతను కాపాడారు లవర్స్ ఇద్దరూ.

సినిమా అయింతర్వాత బయటకు వచ్చారు. బయట ఫుట్‌పాత్ మీద మిర్చీబజ్జీలు, పునుగులు వేస్తున్నాడు బండి మీద. మదన్‍కు నోరూరింది. తిందామంటే అవి హైజినిక్ కాదు వద్దంది స్వీటీ.

ఇందిరా పార్క్ చేరుకునేసరికి చీకటి పడింది. ప్రేమికుల చాటుమాటు వ్యవహారాలకు ఆ పార్కు చాలా సౌకర్యంగా ఉంటుంది. పార్కు ఎదురుగా రామకృష్ణ మఠం, పార్కు ముందు అమ్మవారు ప్రేమికులను ఆశీర్వదిస్తుంటారు.

ఇద్దరూ వెళ్లి ఒక పొద చాటున కూర్చున్నారు. ఇద్దరూ మాస్కులు తీసేశారు. కొంచెం పొడి దగ్గు వచ్చింది మదన్‌కు. కాసేపాగి తుమ్మాడు!

స్వీటీ ముఖంలో రంగులు మారాయి! అనుమానంగా చూసింది మదనుడి వైపు!

అతడు మాత్రం మామూలుగానే ఉన్నాడు. కర్చీఫ్‍తో ముఖం తుడుచుకున్నాదు. స్వీటీకి దగ్గరగా జరిగి గుసగుసగా అన్నాడు – “గివ్ మీ ఎ కిస్”.

అతన్ని దూరంగా నెట్టేసింది మధుర.

“వద్దు మదన్! ప్లీజ్! ఈ ఫోర్త్ వేవ్ ఏదో తేలేంత వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. అసలే దగ్గుతున్నావు! తుమ్మావు కూడా!” అంది.

“అంటే నాకు కరోనా సోకిందని డిసైడ్ అయిపోయావా అప్పుడే!” అన్నాడు కోపంగా.

“ఛ! ఛ! అలా ఎందుకనుకుంటాను? మనం జాగ్రత్తగా ఉండాలని.. అంతే” అనునయంగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కింది. మదనుడు శాంతించాడు. నిరాశగా అన్నాడు:

“మొన్నటి వరకూ ఈ కరోనా గొడవే. ముద్దు పెట్టుకుందామంటే భయం, కౌగిలించుకుందామంటే భయం. సరేలే తగ్గిపోయింది కదా అనుకొంటే మళ్ళీ మొదలుపెట్టారు! ఇలా ఎంత కాలం స్వీటీ? దీని తర్వాత ఫిఫ్త్ వేవ్ రాదని నమ్మకం ఏమిటి? రాకపోయినా, వచ్చేలా చేస్తారు ఈ టీవీల వాళ్ళూ, వాక్సిన్‍ల వాళ్ళూ, కార్పోరేట్ ఆసుపత్రుల వాళ్ళూ! నీ చదువయి ఉద్యోగంలో చేరిన వెంటనే పెళ్ళి చేసుకుందాం! ఈ బాధ ఉండదు!”

కిలకిలా నవ్వింది మధుర. “పెళ్ళయిన వాళ్ళయినా కరోనా వేవ్‍లో శృంగారానికి దూరంగా ఉండాలేమో కదా!” అంది అల్లరిగా.

మధురకు చెలగాటం, మదన్‍కు ప్రాణసంకటం! ‘ప్రేమ ఎంత మధురం! ప్రియురాలు అంత కఠినం’ అని ఏనాడో చెప్పాడు మనసుకవి ఆత్రేయ!

“సరే, కనీసం బుగ్గ మీదయినా..” అంటూ ముందుకు వంగాడు. అయిష్టంగానే ఒప్పుకుంది.

మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఎక్కడ కలుద్దాం?” అనడిగాడు.

“నేను మా ఊరు వెళుతున్నా. వచ్చింతర్వాత కాల్ చేస్తా” అన్నది నవ్వుతూ పిల్లి. ఎలుక గింజుకుంది.

“అంతవరకూ నన్ను కాల్చేస్తూ ఉంటావన్న మాట” అన్నాడు కసిగా.

కాసేపుండి బయటకొచ్చారు. మధురను ఆటో ఎక్కించి ఖైరతాబాద్‌కు పంపించాడు. మనసంతా వికలంగా ఉంది. ఎదురుగా ఉన్న రామకృష్ణమఠంలోకి నడిచాడు. అక్కడ కరోనానందస్వాముల వారు అనుగ్రహ భాషణం చేస్తున్నారు. వెళ్ళి కూర్చున్నాడు. ‘కరోనా’ను ఆధ్యాత్మికానికి అన్వయించి చెబుతున్నాడాయన. అందుకే ఆయనకా పేరు వచ్చిందట.

“నాయనలారా! ప్యార్ కరోనా! అంటుంది మీలాంటి యువకుల హృదయం. ప్రియురాలిని కలుసుకుని, ముచ్చు ముచ్చట తీర్చుకోవాలని ఆరాటపడుతుంది. కానీ కరోనా దాన్ని అనుమతించదు. భౌతిక దూరాన్ని పాటించమంటుంది. మాస్క్ పెట్టుకోమంటుంది.”

“మాస్క్‌ను తెలుగులో ఏమంటారో?” ఒక జిజ్ఞాసువు పక్కనున్నతన్ని అడిగాడు.

“మూతిగోచీ” అన్నాడు అతడు వెటకారంగా.

స్వామి కొనసాగించారు. “అందుకే శారీరక సంబంధం లేని ప్లేటోనిక్ లవ్‌ను మీరు పండించుకోండి. శృంగారానికి అతీతమైన ప్రేమ గొప్పది. కరోనా మే ప్యార్ కర్నా జరూర్ హై! ఆత్మా సే కరోనా! శరీర్ సే నహీ!”

“గాడిద గుడ్డేం కాదూ!” అనుకుంటూ లేచి బయటకొచ్చాడు మదన కామరాజ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here