[శ్రీ జూకంటి జగన్నాథం రచించిన ‘క్యూ ఆర్ కోడ్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]చూ[/dropcap]పు చురుకుగా ఉంది
గ్రహణ శక్తి గట్టిగానే ఉంది
ఏమైందో ఏందో తెలవదు
కనబడదు వినపడదు
ఒకడు ఆకాశానికి
గాలిలో మెట్లు కడుతుంటాడు
ఒకడు ఎక్కి వచ్చిన
నిచ్చెనను తన్నేస్తుంటాడు
ఆరు వరసల రోడ్డు అయినా
యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి
ప్రయాణం నిరంతర యానం
ఒడంబడికల ఒడిలో
భూమి ఒక సరుకు
ప్రతిదీ ఒక క్రయవిక్రయ వస్తువు
మనిషి అంతా కొడితే
ఒక వినియోగదారుడు
మార్కెట్టు ఎందుకు పెరుగి పోతుందో
కళ్ళు తెరిచేసరికి ఎందుకు తరిగిపోతుందో
హెచ్చరిక లేక ఎందుకు మాంద్యం ఏర్పడుతుందో
మనిషి తెలుసుకునే సరికి
అంతా ఎక్కడిది అక్కడ అయిపోతుంది
కన్రెప్పలు ఉండగానే
కనుగుడ్లు మాయమైపోతాయి
అటు ఆరుగాలం కష్టించి
పండించిన పంటకు ధర గిట్టదు
ఇటు వినియోగదారుడికి
సరసమైన వెలకు అసలే లభించదు
మధ్య దళారి బతికే కాలం
కాలరెత్తుకొని నడుస్తుంటుంది
నీ ధర నా ధర వ్యవస్థ ధర
తెలువనే తెలవదు
నిర్దేశించిన నిర్ణయించిన
వెలను మనిషి కలను
క్యూఆర్ కోడ్ లో బంధీ చేయబడింది
స్తోమత ఉన్నా లేకున్నా
జేబులో క్రెడిట్ కార్డు ఉంటే చాలు
ఇక నువ్వు వస్తు మానియా
దునియాను దున్నేయవచ్చు