క్వీన్ ఆఫ్ డ్యాన్స్ – తంజావూరు బాలసరస్వతి

8
3

[dropcap]13[/dropcap]-05-2021 తేదీ తంజావూరు బాలసరస్వతి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

కొన్ని తరాల నుండి తంజావూరు సంస్థానంలో ఆస్థాన దేవదాసి కళాకారులుగా విలసిల్లిన కుటుంబం నుండి వచ్చారు తంజావూరు బాలసరస్వతి. తన ఊరినే ఇంటి పేరుగా మార్చుకున్న ఆమె దేశవిదేశాలలో తన భరతనాట్య ప్రదర్శనల ద్వారా దేశానికి పేరు తెచ్చారు.

వీరు 1918 మే 13వ తేదీన నాటి మదరాసు ప్రెసిడెన్సీ ఈనాటి తమిళనాడు లోని తంజావూరులో జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మాళ్, మొదరాపు గోవిందరాజులు.

బాలసరస్వతి పూర్వీకులు తరతరాలుగా తంజావూరు సంస్థానంలో ఆస్థాన నాట్యకారిణులుగా పనిచేశారు. వీరందరూ సంగీత కళాకారులు కూడా! ‘సంగీత, నాట్య సమలంకృతే’ లాగా విలసిల్లింది ఈ కుటుంబీకుల కళార్చన.

వీరి తల్లి జయమ్మాళ్ వద్ద ఉగ్గుపాలతోనే సంగీతాన్ని నేర్చుకున్నారు. 5 ఏళ్ళకే ప్రముఖ నాట్యగురువు కందప్పపిళ్ళై దగ్గర నాట్యాభ్యాసం మొదలు పెట్టారు. 7వ ఏట కాంచీపురంలోని అమ్మనాక్షి దేవాలయంలో అరంగేట్రం చేశారు.

తరువాత కాలంలో అరయక్కుడి రామానుజ అయ్యర్, డా. వి. రాఘవన్, గౌరీ అమ్మాళ్, చిన్నయ్య నాయుడు, వేదాంతం లక్ష్మీనరసింహశాస్త్రిల వద్ద నాట్యాన్ని అభ్యసించారు.

చెన్నపట్టణంలో అసలు సిసలు అరంగేట్రం జరిగింది. ఆ తరువాత వీరు వెనుదిరిగి చూడలేదు.

1934లో కలకత్తా నేటి కోల్కొతాలో ‘All Bengal Music Conference’ లో ప్రదర్శనను ఇచ్చారు. ప్రముఖ నాట్యకళాకారులు శ్రీ ఉదయశంకర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విధంగా భరతనాట్యాన్ని దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతానికి తీసుకు వెళ్ళిన తొలి నాట్య కళాకారిణిగా రికార్డును నెలకొల్పారు.

1937లో వారణాసిలో జరిగిన “All India Music Conference’ ప్రదర్శనలో గురుదేవులు రవీంద్రనాథ ఠాగూర్ వీరిని ప్రశంసించారు. అంతేకాదు తమ విశ్వభారతి విశ్వవిద్యాలయానికి రమ్మని ఆహ్వానించారు.

మన జాతీయగీతం ‘జనగణమన’కు నృత్యాన్ని తయారు చేసి ప్రదర్శించి రవీంద్రుని ప్రశంసలను పొందారు.

1950 నాటికి భరతనాట్యం పట్ల ఆసక్తిని మరింతగా పెంచుకున్నారు. ‘మద్రాసు మ్యూజిక్ అకాడమి’తో కలసి నృత్య పాఠశాలను స్థాపించారు. చాలామంది శిష్యులను తయారు చేశారు. శిష్యులు వీరిని ‘బాలమ్మ’ అని పిలిచేవారు.

1961లో జసాన్ దేశ పర్యటనకు వెళ్ళారు. టోక్యోలో ‘East-West Music Encounter Conference’లో నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఈ విధంగా తూర్పు ఆసియా వారికి భరతనాట్య శోభని పరిచయం చేశారు.

1962లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని 16 కేంద్రాలలో నాట్య ప్రదర్శనలలో పాల్గొన్నారు. వెస్లియన్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ లలో నాట్యాన్ని ప్రదర్శించారు. ‘టెడ్‌షాన్స్ జాకబ్స్ షిల్లో డాన్స్ ఫెస్టివల్’లో నాట్య ప్రదర్శన వీరి జీవితంలో గొప్ప చారిత్రక సంఘటన. టెడ్‌షాన్, రూత్ సెయింట్ డెనిస్ వంటి విశ్వ విఖ్యాత కళాకారులను కలిసిన అమృత క్షణాలవి. వీరి కోసం ప్రత్యేకంగా ‘చారిత్రక దినం’ పాటించారు.

ఇంగ్లండ్ లోని ‘ఎడిన్‌బరో’ నగరంలో వరుసగా ఎనిమిది రాత్రులు వీరి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసి గౌరవించారు. ఒక భారతీయ కళాకారిణికి ఈ గౌరవం అపూర్వమే మరి.

వీరు ఆగర్భ తమిళురాలు. అయినప్పటికీ కూచిపూడి, భరతనాట్యం లను అభ్యసించడం కోసం తెలుగు భాషను నేర్చుకున్నారు. ఒకసారి ‘ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్నాటక సంగీతంతో ముడిపడిన భరతనాట్యంలో ప్రావీణ్యతను పొందాలంటే తెలుగును క్షుణ్ణంగా అభ్యసించవలసిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు.

నాట్యంలో వీరికి గల ప్రావీణ్యతను గురించి నాటి ఆకాశవాణి డైరెక్టర్ శ్రీ నారాయణమీనన్ (కేంద్ర సాహిత్య అకాడమి చైర్మన్) ఈ విధంగా తెలియ జేశారు.

అలరిప్పు-5, జాతిస్వరం-9, శబ్దం-8, వర్ణాలు-15, (వర్ణాలలో తెలుగు-12), పదం-97 (పదంలో67 తెలుగు), తెలుగు జావళీలు-51, థిల్లానాలు-8 మొదలయిన అంశాలను అన్నింటినీ వీరు చేయగలిగారు. ఇంకా వందల సంఖ్యలో కురవంజి, పద్యాలు, శ్లోకాలు, విరుత్తం మొదలయిన అంశాలు కూడా ఉండడం విశేషం.

అందువల్లే ‘ఎరల్ ఆఫ్ హార్డ్ డే’ వీరిని “ప్రపంచ అపూర్వ నర్తకీమణులు ముగ్గురిలో ఒకరు” అని ప్రశంసించడం విశేషం.

అమెరికన్ ప్రేక్షకులు ‘Queen of Dance’ ‘నాట్యలోకానికి రాణి’ అని కితాబు నిచ్చి గౌరవించారు.

పండిట్ శంభుమహరాజ్, ఉస్తాద్ అమీర్ ఖాన్ ల వంటి గొప్ప కళాకారుల ప్రశంసలను పొందడం విశేషం.

‘నేషనల్ సెంటర్ ఫర్ ఫెర్మార్మింగ్ ఆర్ట్స్’ వారు బాలసరస్వతి గారిని గురించి ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించమని ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ సత్యజిత్ రేని కోరారు. ఆయన స్వయంగా మద్రాసు వచ్చి ఈ డాక్యుమెంటరీని చిత్రించారు. ఈ చిత్రాన్ని ‘బాల’ అనే టైటిల్‌తో సుసంపన్నం చేశారు.

బాలసరస్వతి మద్రాసులోని కిల్‌పాక్‌లో ఒక ఇల్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే “The BalaSaraswathi Institute of Performing Arts’ సంస్థను నడుపుతున్నారు. ఈ బాధ్యతలను బాలసరస్వతిగారి మనవడు “అనిరుద్ధ నైట్’ నడపడం విశేషం.

వీరి కుమార్తె ‘లక్ష్మి నైట్’ కూడా ప్రముఖ నర్తకీమణి. వీరు బాల్యంలో నేర్చిన సంగీతానుభవం కుమార్తె నృత్య ప్రదర్శనలలో పాడడానికి తోడ్పడింది.

వీరికి 1955లో సంగీత నాటక అకాడమి అవార్డు, 1957లో ‘పద్మభూషణ్’, 1977లో ‘పద్మవిభూషణ్’ పురస్కారాలు లభించాయి. 1973లో చెన్నై మ్యూజిక్ అకాడమి వారి ‘సంగీత కళానిధి’ పురస్కారం, 1976లో ‘సంగీత నాటక అకాడమి ఫెలోషిప్’ 1978లో విశ్వభారతి విశ్వవిద్యాలయం వారి ‘దేశికోత్తమ’ పురస్కారాలు లభించాయి.

భరతనాట్యాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలలో, ప్రపంచంలోని వివిధ దేశాలలో ప్రదర్శించి విశ్వవిఖ్యాత ప్రశస్తిని పొందిన తంజావూరు బాలసరస్వతి 1984 ఫిబ్రవరి 9వ తేదిన మరణించారు.

వీరి జ్ఞాపకార్థం 2010 డిసెంబర్ 3వ తేదిన 5 రూపాయల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

మే 13 వ తేదిన వీరి జయంతి సందర్భంగా ఈ నివాళి.

***                                                         

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here