ఇక్కడి మనుషుల అక్కడి జీవితాలు – అక్కడి మనుషుల ఇక్కడి బంధాలు

1
2

[శ్రీ సాయి బ్రహ్మానందం రచించిన ‘క్విల్ట్’ అనే కథా సంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]అ[/dropcap]మెరికాలో నివసిస్తున్న శ్రీ సాయి బ్రహ్మానందం కథకుడిగా, నవలా రచయితగా తెలుగు పాఠకులకు సుపరిచితులే. కథలు, నవలలు కాకుండా కొన్ని కవితలు, పలు వ్యాసాలు రాశారు. ఆయన రచించిన 27 కథలతో కూర్చిన పుస్తకం ‘క్విల్ట్’. వీటిల్లో సుమారు 20 వరకు అమెరికాలోని తెలుగు వాళ్ల జీవితాలను ప్రతిబింబించే కథలున్నాయి.

“గొర్తి సాయి బ్రహ్మానందం గారి దృష్టి నిశితమైంది. పొరలు తొలగించి చూడగలడు. ఇది ఈ కథలు చదివితే తెలుస్తుంది. ఆయన కథలలో వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. అంటే విస్తృతమైన దృష్టి అన్న మాట.” అంటారు శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి తమ ముందుమాట ‘Quite A Warm Quilt’లో.

“దాదాపు ఈ కథలన్నిటిలో narrative tone ఒకే రకంగా ఉండడం వల్ల కొన్ని కథలు చదవగానే కథ చెప్పే వ్యక్తితో నీకు ముందే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కథలన్నిటిలోనూ రచయిత వీలయినంత వరకూ పాత్రలకు దూరంగా తటస్థంగా ఉంటూ, నీకు దగ్గరగా ఉండి కథ చెప్పినట్టు అనిపిస్తుంది” అంటారు శ్రీ రవి వీరెల్లి తమ ముందుమాట ‘నిడివి కంటే లోతు ముఖ్యం కదా!’లో. మిత్రుడైన ఓ పాఠకుడితో నేరుగా సంభాషించినట్టుగా ఉంటుందీ ముందుమాట.

***

తాము పుట్టి పెరిగిన ఇల్లు, సొంతూరి మీద మనుషులకి ఒక రకమైన మమకారం ఏర్పడుతుంది. అది ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు.. తాము పుట్టి పెరిగిన ఇంటిని వదలలేని కొందరుంటారు. తమ పిల్లలు పెరిగి పెద్దయి, మరో చోటకి వెళ్ళిపోయినా, పిల్లలతో పాటు అక్కడి వెళ్ళి ఉండలేక, తమ ఇంట్లోనే పిల్లల జ్ఞాపకాలతో బతికేస్తారు చాలామంది. అలాంటి కోవకి చెందినవాడే ‘ఆ ఇంట్లో ఒకరోజు’ కథలోని ‘స్టీవ్’. కొడుకు ‘బిల్’ జీవితంలోకి తాను చొరబడకూడదనుకుంటాడు. ప్రతి ఏటా క్రిస్‍మస్‍కి కొడుకు కోసం గిఫ్ట్ కొనడం, అతను రాకపోవడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన ‘బిల్’ మిత్రుడికి ఆ కానుకలన్నీ చూపి, ఒక కానుకను తీసుకెళ్ళి కొడుకివ్వమంటాడు. తమని పీడిస్తున్న వ్యాధి ఏమిటో చెప్తాడు. తిరిగి వెళ్తున్న బిల్ మిత్రుడికి (కథ చెప్పే వ్యక్తి) ఇండియాలో ఉన్న తన తండ్రి గుర్తొస్తాడు.

అమెరికాలోని ఫ్లీ మార్కెట్ల గురించి, యాంటిక్ పీస్‍ల అమ్మకాల గురించి ప్రస్తావించిన కథ ‘చిరిగిన చిత్తరువు’. పురాతన వస్తువుల అమ్మకం అమెరికాలో చాలా పెద్ద వ్యాపారం. కథ చెప్పే వ్యక్తి తల్లి చనిపోయాకా, ఆమెకి తల్లి ఆస్తి వస్తుంది. ఇల్లు అమ్మేస్తుంది కానీ, తల్లి గీసిన చిత్రాలు, సేకరించిన చిత్రాలు మిగిలిపోయాయి. కొన్ని చిత్రపటాలను ఉంచుకుని మిగతా వాటిని ఎలాగైనా అమ్మేయాలనుకుంటుందామె. ఫ్లీ మార్కెట్‍లో ఆ చిత్రాలను అమ్మకానికి పెట్టినప్పుడు ఓ గడ్డపు వ్యక్తి ఓ చిత్రాన్ని కొనడానికి ఆసక్తి చూపుతాడు, కానీ ఆమె చెప్పిన ధర ఇవ్వలేడు. రెండు మూడు సార్లు వచ్చి బేరమాడి వెళ్ళిపోతాడు. ఒక కొంత కాలానికి ఆ బొమ్మ వెనుక ఉన్న చరిత్ర, ఆ చిత్రకారుని నేపథ్యం తెలిసాకా, ఓ ఆర్ట్ గాలరీ ఏజంట్ కొన్ని వేల డాలర్లకి ఆ చిత్రపటాన్ని కొనడానికి ముందుకొస్తాడు. కానీ ఆమె మనసు మార్చుకుంటుంది, ఇంతకు ముందు ఫ్లీ మార్కెట్‍లో దాన్ని బేరం చేసిన గడ్డపు వ్యక్తికే దాన్ని అమ్మాలనుకుంటుంది. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాలి.

ప్రేమ, సెంటిమెంటు అనే మాటలని ఎరగా వాడుకుంటూ భర్త తన ఎదుగుదలని అడ్డుకుంటున్నాడని గ్రహించి, మెడిసిన్ చదివిన తన విజ్ఞానం, సామర్థ్యం నిష్ప్రయోజనం కాకూడదని భర్తకి, కూతురికి తెలియకుండా అమెరికా నుండి ఇండియా బయల్దేరిపోతుంది ఉత్పల. తోటి ప్రయాణీకుడు వర్మ మాటల్లో పెట్టి ఆమె కథనంతా బయటకి లాగుతాడు. హైదరాబాద్ చేరాకా, ఏదన్నా అవసరమైతే తనకి మెయిల్ చేయమంటాడు. ఈ పరిచయాన్ని పెంచుకోవడం తనకి ఇష్టం లేదని స్పష్టంగా చెబుతుంది. మీ భర్త మంచివాడు కాదేమో అని అతనంటే, మంచివాడే కానీ మీలాగే మగాడు అని వెళ్ళిపోతుంది ఉత్పల ‘అతను’ కథలో. భారతీయ కుటుంబాలు మన దేశంలో ఉన్నా, విదేశాలలో ఉన్నా స్త్రీలు పురుషుల అధికారానికి కట్టుబడి ఉండాలని మగవాళ్ళు భావిస్తారని ఈ కథ సూచిస్తుంది.

డ్యూస్’ అద్భుతమైన కథ. టెన్నిస్ ఆడటమంటే ఎంతో ఇష్టం ఉన్న రావి అనే భారతీయుడు కుపర్టినో టెన్నిస్ క్లబ్‍లో తన మిత్రులతో టెన్నిస్ ఆడతాడు. నాలుగు రోజుల కాంపింగ్ నుంచి తిరిగొచ్చాకా, టెన్నిస్ క్లబ్ నుంచి మెయిల్స్ ఏమైనా వచ్చాయేమో అని చూస్తే, ఒక్క మెయిల్ కనబడదు. మిత్రులకి ఫోన్ చేస్తే ఎవరూ మాట్లాడరు. చివరికి గౌతమ్ అనే మిత్రుడు ద్వారా కారణం తెలుస్తుంది. జాన్ అనే వ్యక్తికి గాయమయ్యేలా ఆడినందుకు తనని అందరూ బహిష్కరించారని తెలుసుకుంటాడు. తను కొట్టిన ఓ షాట్‌ని ఆడలేక జాన్ పడిపోయాడని, అప్పుడు తాత్కాలికంగా చికిత్స చేసి, అతనికి బానే ఉందని తెలిసాకా, కాంపింగ్‌కి వెళ్తాడు రావి. కానీ ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఏం జరిగిందో అతనికి తెలియదు. అందరూ దూరం పెట్టడంతో టెన్నిస్ ఆడడం మానేస్తాడు. ‘జాన్ గాయపడి ఆడలేకపోయాడు, నేను ఆడగలిగీ గాయపడ్డాను’ అనుకుంటాడు. మరి రావి గురించి జాన్ ఏమనుకున్నాడో తెలియాలంటే ఈ కథ చదవాలి.

సాంస్కృతిక వైవిధ్యాలు ఒక్కోసారి కుటుంబాలలో విరోధాలకి దారితీస్తాయని చెప్పే కథ ‘క్విల్ట్’. భారతీయులు, అమెరికన్స్ వివాహ సంబంధంతో కలిసినప్పుడు – ఇరువైపుల నుంచి తల్లిదండ్రుల మధ్య ఏర్పడే అనుబంధాలని పరస్పరం గౌరవించుకోకపోతే అవి విచ్ఛిన్నమైపోతాయి. ఇరు దేశాల సంస్కృతుల వైవిధ్యం వల్ల వ్యక్తుల మధ్య అపోహలు ఏర్పడడం సహజమే. కానీ తమ మధ్య బంధాన్ని నిలుపుకోవాలనా, దృఢతరం చేసుకోవాలన్నా, ఆ అపోహలని తొలగించుకోవాల్సిందే. ‘అభిప్రాయబేధాలుంటాయి, ఉండాలి కూడా. లేకపోతే జీవితానికి అర్థం లేదు’ అన్న మామీ మాటలు ఎంతో నిజం. కథలో భాగంగా సిల్వియా నుంచి వచ్చే సందేశ వాక్యాలు బావున్నాయి.

మెరుగైన జీవితం కోసం అమెరికా వెళ్ళాలనుకునే మెక్సికన్ల గురించి చెప్పిన కథ ‘సరిహద్దు’. సక్రమ పద్ధతిలో అమెరికా చేరలేక, ఏజంట్ల ఒత్తిడికి లొంగి, అక్రమమార్గంలో అమెరికా చేరి చిన్నా చితకా ఉద్యోగాలు చేసి జీవనం గడుపుకునే మెక్సికన్లు అమెరికాలో అనేకమంది. అలా అక్రమపద్ధతిలో బయల్దేరిన హేవియర్, అతని ప్రియురాలు లిలియా మొదటిసారి దొరికిపోతారు. రెండో ప్రయత్నంలో అమెరికా అధికారులు లిలియాని మాయం చేస్తారు. మిగతా వాళ్ళని తిప్పి పంపేస్తారు. మూడవ ప్రయత్నంలో అమెరికాలోకి ప్రవేశించగలుగుతాడు హేవియర్. ఏ పని చేస్తున్నా, లిలియా ఆచుకీ కనిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. తీరా ఓ చోట లిలియాని చూసాకా అతని మనసు వికలమవుతుంది. ఎలాగైనా స్వదేశానికి వెళ్ళిపోవాలనుకుంటాడు. చట్టవిరుద్ధంగా వచ్చే మెక్సికన్లు, చట్టబద్ధంగా వచ్చే ఇండియన్లు అమెరికాకి ఎందుకు అవసరమో హేవియర్ చెప్తాడు.

ప్రేమ వేరు జీవితం వేరు అని అంటుంది ‘ఆఖరి చూపు’ కథ. ఇండియా వచ్చిన నెరేటర్‍కి మాజీ భర్త చనిపోయాడని తెలుస్తుంది. ఆఖరి చూపు చూడ్డానికి కూతురు అనూతో సహా వెళ్దామనుకుంటుంది. మాజీ తండ్రి పైన అమితమైన ద్వేషం పెంచుకున్న అనూ రానంటుంది. అయితే మాజీ తండ్రి కోటి రూపాయల విలువైన ఆస్తిని అనూ పేరు మీద రాసాడని మారు తండ్రి ఆమెకు ఓ కవర్ అందిస్తాడు. మనుషుల్ని ద్వేషించినంత సులభంగా వస్తువుల్నీ, ఆస్తుల్నీ ద్వేషించలేం అంటుంది నెరేటర్.

డబ్బు అసమానలతలను పెంచడమే కాదు, అవకాశాల్ని మింగేస్తుందని చెప్పిన కథ ‘బతుకాట’. తన కొడుకు కోసం కార్తీక్ అనే ఓ పేదింటి కుర్రాడిని బలి చేస్తాడు వెట్రివేలు. ఆ కుర్రాడిలో ప్రతిభని గ్రహించిన వెట్రివేలు మిత్రుడు, మాజీ టెన్నిస్ ఆటగాడు అయిన నెరేటర్ కార్తీక్‍కి అమెరికా నుండి సాయం చేద్దామని ప్రయత్నిస్తే, కార్తీక్ తిరస్కరిస్తాడు. ఎందుకో అతను చెప్పిన కారణం హృదయాన్ని బరువెక్కిస్తుంది.

ఐ హేట్ మై లైఫ్’ కథ అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబాలలోని ఆడపిల్లల పెంపకం గురిచి చెబుతుంది. అమెరికాలోనైనా, ఇండియాలోనైనా ఆడపిల్లల మీద అతిగా నిఘా/నియంత్రణ పెట్టనవసరం లేదని ఈ కథ చెబుతుంది. వర్జినిటీ అనేది ఆడపిల్లలకేనా, మగపిల్లలకి అక్కర్లేదా అని ప్రశ్నించిన కూతురుని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు తండ్రి.

తన వృత్తి మీదున్న నమ్మకం కంటే ఒక చిత్రకారుడి సంవేదనే ముఖ్యమని న్యూరో సర్జన్ డేవిడ్ అంటాడు ‘అహిగా’ కథలో.  అహిగా ఎవరు, అతనికి ఎందుకు సర్జరీ చేయాల్సి వచ్చింది? అతనికి సరూకి ఏమిటి సంబంధం అన్న ప్రశ్నలకు జవాబులు కథలో దొరుకుతాయి. నేటివ్ అమెరికన్స్ గురించి చెప్తూనే, చిత్ర కళ గురించి ఎన్నో వివరాలిస్తుందీ కథ. ఏ వాక్యాలతో కథని ప్రారంభించారో, అవే వాక్యాలతో కథని ముగించడం విశేషం.

అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబంలోని తల్లి – తన కొడుకు సిద్ధూ తాను చెప్పినట్టే ఉండాలని, చదువు తప్ప మరో వ్యాపకం ఉండకూడదని శాసించి, పెంచుతుంది. అమెరికాలో జరిగే స్పెల్ బీ పోటీలో పాల్గొని గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కొడుకుపై ఒత్తిడి చేస్తుంది. స్కూల్ తరఫున విహారయాత్రకి వెళ్ళిన సిద్ధూకి ఎరిక్ అనే కుర్రాడు పరిచయం అవుతాడు. అతని ద్వారా బాస్కెట్ బాల్ ఆడడం నేర్చుకుంటాడు. గలుబె అనె వాయిద్యం వాయించడం నేర్చుకుంటాడు. కానీ ఉన్నట్టుండి ఎరిక్ వాళ్ళ కుటుంబం అమెరికా నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడి కెళ్ళారో సిద్ధూకి తెలియదు. చివరికి స్పెల్‍ బీ పోటీలలో నెగ్గుతాడు సిద్ధూ. కొన్ని రోజులకి ఎరిక్ గూగుల్ ఛాట్‌లో పలకరిస్తాడు. తన కుటుంబంలో జరిగిన విషాదాన్ని చెప్తాడు. స్పెల్ బీ పోటీలు ఏమయ్యాయి అని అడిగితే నెగ్గాననీ, అందుకు కారణం ఎరిక్ అని అంటాడు. అయినా మళ్ళీ, ‘గెలిచింది నేను కాదు మా అమ్మ’ అంటాడు. సంగీతంలో గాని నాట్యంలో గాని పిల్లలు కాస్త ప్రతిభ చూపగానే పలు టివీ ఛానల్స్‌లో పార్టిసిపేట్ చేయించి, ‘చైల్డ్ ప్రాడిజీ’ అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచేసే తల్లిదండ్రులను/టీవీ షోలు మనకి గుర్తొస్తాయి ‘గలుబె’ కథ చదివాకా.

పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను బ్రతకనీయవు అని అనుకున్న జె.పి. – వాల్‌మార్ట్‌లో థాంక్స్ గివింగ్ సేల్‍లో తను ఓ స్పానిష్ కుర్రాడితో ప్రవర్తించిన తీరుని మర్చిపోతాడు. చిన్న కథే అయినా ఎన్నో ప్రశ్నలను ముందుకు తెస్తుంది ‘థాంక్స్ గివింగ్’ కథ.

‘మనుషులు ఎందుకింత కాంప్లెక్సుగా ఉంటారు’ అన్న అంశం చుట్టూ అల్లిన కథ ‘నీడ’. అవమానం అనే దావానలం ముందు సింపతీలు, ఓదార్పులు నీటిబొట్టులాంటివి అని భావించిన రాజ్, దినకరన్ మీద ద్వేషం పెంచుకుంటాడు. తన ఉద్యోగం పోవడానికి కారణం దినకరన్ అని గట్టిగా నమ్ముతాడు. కానీ అసలు కారణం స్టీవ్ చెప్పినా దినకరన్‍ మీద కోపం పోదు. ఈలోగా దినకరన్ మావగారు ఎవరో తెలిసి అతని మీద ద్వేషం ఇంకా పెరుగుతుంది. రచయిత ఈ కథని సెకండ్ పర్సన్ నెరెటివ్‍లో చెప్పడం – బహుశా రవి వీరెల్లి గారి ముందుమాటకి ప్రేరణ ఏమో అనిపిస్తుంది.

టెన్నిస్ నేపథ్యంగా సాగిన ‘లవ్ ఆల్’ చక్కని కథ. ఆటలో ప్రస్ట్రేషన్ ఎక్కువై, టెన్నిస్ రాకెట్లను విరగ్గొట్టే అభిలో మార్పు ఎలా వచ్చింది? టెన్నిసే వద్దనుకున్నవాడు, ఆ ఆటపై మళ్ళీ అంత అభిమానం ఎందుకు పెంచుకున్నాడో తెలియాలంటే ఈ కథ చదవాలి.

సినిమా స్క్రీన్ ప్లే పద్ధతిలో చెప్పిన కథ ‘పార్డన్ మీ ప్లీజ్’. కోలుకోలేని గాయం చేసి పారిపోయిన విలియమ్‍ని ప్రతిమ క్షమించలేకపోతే, విలియమ్ కోసం తన చిన్నప్పటి ఆనందాన్ని దూరం చేసిన తల్లిని క్షమించలేనంటాడు ప్రతిమ కొడుకు సాగర్.

మామూలు మనుషులు’ సగటు మనుషుల స్వభావాలను ప్రస్తావిస్తుంది. సగటు మనిషిగా ఉంటూనే ఔన్నత్యం ప్రదర్శించిన ఓ వ్యక్తి గురించి చెబుతుంది. యువత ప్రవర్తన గురించి, మీడియా వాళ్ళ బాధ్యత గురించి ఎన్నో ప్రశ్నలు సంధిస్తుందీ కథ.

రేపటి గతం’ విలక్షణమైన కథ. అన్యాయం జరిగిన యువతి కాస్త బెదురుగానైనా పోలీస్ స్టేషన్‍కి వెళ్ళి కంప్లయింట్ ఇస్తుంది. కేసులో పెద్దవాళ్ళ పిల్లల ప్రమేయం ఉందని గ్రహించిన ఇన్‍స్పెక్టర్ ఆమెని జడ్జ్ గారింటికి తీసుకువెళతాడు. జడ్జ్ చట్టంలోని లోటుపాట్లని చెప్పి ఆమెకో సలహా ఇస్తాడు. మరి ఆమె చేస్తుంది?

వానప్రస్థం’ కథలో మూర్తిగారు, వర్ధనమ్మ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని పట్టించుకోని పిల్లల గురించి ఆలోచించకుండా తమ బ్రతుకు తాము బ్రతుకుతూ చుట్టు ఉన్నవారికి తమకి వీలైనంత సాయం చేస్తూ జీవితం తృప్తిగా గడపడం చూసిన రాంబాబు – ఎక్స్‌పెక్టేషన్ అనేది కేన్సర్ లాంటిదని అది మనల్ని, చుట్టుపక్కల వాళ్ళని కనిపించకుండా దహించేస్తుందని గ్రహిస్తాడు. పిల్లల ప్రవర్తనతో ఇబ్బంది పడి వృద్ధాశ్రమంలో చేరిన అక్కాబావలని తనతో అమెరికా తీసుకువెళ్ళాలనుకుంటాడు. కానీ మూర్తిగారు, వర్ధనమ్మని చూశాకా అక్క రావల్సింది అమెరికాకి కాదు, గంగలకుర్రుకి అనుకుంటాడు.

విద్యార్థి దశలో హేళనలకి గురైనప్పుడు – అందరూ సలహాలిచ్చేవారే తప్ప, సముదాయించేవారొక్కరూ లేకపోవడం ఎంత మానసిక వ్యథ కలిగిస్తుందో ‘బ్లాక్ పెరల్’ కథ చెబుతుంది. స్కూలు రోజుల్లో తనని వేధించిన జస్టిన్ అనే కుర్రాడు – ఇప్పుడు తన కంపెనీలో తన క్రింద ఉద్యోగం చేయడానికి అవకాశం ఇస్తుంది కృష్ణ. ఊహించనింత జీతం ఆఫర్ చేయిస్తుంది. అతను ఉద్యోగంలో చేరితే అతన్ని అవమానించాలని అనుకుంటుంది. అనూహ్యంగా జస్టిన్ ఆ ఆఫర్‍ని తిరస్కరిస్తాడు. తాను ప్రస్తుతం చేస్తున్న కంపెనీలో కొనసాగుతానని తెలియజేస్తాడు. అతని గురించి మరింత తెలుసుకున్నప్పుడు – అమెరికా లోని తల్లిదండ్రుల కోసం ‘బ్లాక్ పెరల్’ అనే యాప్ తయారుచేశాడని తెలుస్తుంది.

అమెరికాలో తన మిత్రుడు బ్రూస్ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురై భార్యతో విడాకులు తీసుకుని ఒంటరి జీవితంలో బాధలు అనుభవిస్తుంటే మరో పెళ్ళి చేసుకోమని సలహా ఇస్తాడు హరి. బ్రూస్ రెండో పెళ్ళి చేసుకున్నప్పుడు – రిసెప్షన్‍కి వెళ్తూ, ఆ సమయంలో అమెరికాలో ఉన్న తన తండ్రి రాజారావుని కూడా తీసుకువెళ్తాడు. బ్రూస్ రెండో పెళ్ళి గురించి రాజారావు ఆక్షేపిస్తే, హరి దాన్ని సమర్థిస్తాడు. కొన్నాళ్ళ తరువాత ఇండియాలో రాజారావు రెండో పెళ్ళి చేసుకున్నాడని తండ్రిని అసహ్యించుకుంటారు హరి, దివ్యలు. తనెందుకు రెండో పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందో కొడుక్కి రాసిన ఉత్తరంలో వివరిస్తాడు రాజరావు ‘ఒంటరి విహంగం’ కథలో.

సైన్యం’ ఓ ప్రయోగాత్మకమైన కథ. దుర్మార్గుడైన తమ యజమానిని చంపడానికి మంచం, టైం పీస్ వంటివి పన్నాగం పన్నటం ఈ కథ ఇతివృత్తం. నాటక ప్రదర్శన నేపథ్యంగా రచించిన కథ ‘నేను అహల్యను కాను’. బాగా నటిస్తాడన్న పేరు వచ్చేసరికి దురుసుతనం అలవర్చుకున్న రామకృష్ణ అనే నటుడికి విజయలక్ష్మి అనే నటి బుద్ధి చెప్తుంది ఈ కథలో.

రచయిత రాసిన పాత్రలు ప్రాణం పోసుకుని, ఆ రచయితనే ఎదిరిస్తో ఏమవుతుందో ‘కథాకలహం’ కథ చెబుతుంది. ‘ఊర్మిళరేఖ’ కథ ఆధునిక కుటుంబ జీవనానికి రామాయణాన్ని అన్వయిస్తూ చెప్పిన కథ. వనవాసానికి భర్తని అనుసరించిన సీత త్యాగమూర్తి అయితే, భర్త ఆదేశం ప్రకారం అయోధ్యలోనే ఉండి అత్తగార్ల సేవలు చేసిన ఊర్మిలది అంతే త్యాగమని చెప్పే ప్రయత్నం చేస్తుందీ కథ. భర్త దుబాయ్ వెళ్ళిపోతే, అత్తమామగార్లు, పిల్లల బాధ్యతలను మోసిన నిర్మల కథ ఇది.

మనుషులు కలుసుకోకపోతే పంచుకోడానికి మాటలు మిగలవు అంటుంది ‘ఆయన’ కథ. చివరి దశలో తండ్రిని చూసుకున్న కొడుకు తన అనుభవాలను అమెరికన్ మిత్రుడితో ఈమెయిల్‌లో పంచుకోవడం ద్వారా కథని నడిపిస్తారు రచయిత.

పడుపువృత్తి చేసే ఓ మగవాడి కథ ‘ఇండియా గేట్’.

తిరుమల కొండకి నడిచివెళ్ళేటప్పుడు చిరుతపులులు భక్తులపై దాడి చేస్తున్న ఘటనలు మనం ఇటీవల చూశాం. ‘చిరుత’ అనే కథలో కూడా అమెరికా నుంచి స్వామివారిని దర్శించుకోడానికి వచ్చిన ఓ భక్తుడిని, అతనికి సహాయంగా ఉన్న వడివేలుని చిరుత గాయపరుస్తుంది. వడివేలు గాయపడినా దాన్ని ఎదిరించి పోరాడతాడు. అయితే చిరుతపులి కన్నా తిరుమలలో ప్రమాదకరమైన వారెవరో వడివేలు చెప్తాడీ కథలో.

***

చాలా కథల్లో ముగింపు తర్వాత ఏమవుందనే అంశాన్ని పాఠకుల ఊహకే వదిలేస్తారు రచయిత. టెన్నిస్ నేపథ్యంగా రాసిన కథల ద్వారా రచయితకి ఆ క్రీడలో ఉన్న ఆసక్తి, ప్రవేశం పాఠకులకి అర్థమవుతాయి. ఈ కథలన్నీ తెలుగునేల మీద, అమెరికాలలోని వ్యక్తుల బంధాలు, ఉద్యోగాలు, ఆశనిరాశలు, సాఫల్య వైఫల్యాలు, జీవన పోరాటాలను చాటుతాయి. ఇక్కడి మనుషుల అక్కడి జీవితాలు, అక్కడి మనుషుల ఇక్కడి బంధాలను ఈ కథలు హృద్యంగా వ్యక్తీకరిస్తాయి.

***

క్విల్ట్ (కథా సంపుటి)
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి
పేజీలు: 278
వెల: ₹300.00
ప్రతులకు: అనల్ప బుక్స్, సికింద్రాబాద్ 7093800303
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 90004 13413
ఆన్‍లైన్‌లో:
https://telugu.analpabooks.com/quilt
https://www.amazon.in/dp/B0BWK4G4V9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here