Site icon Sanchika

క్విల్ట్

[dropcap]E[/dropcap]gos are like volcanoes; you never know when they explode!

నా మేరేజ్ కౌన్స్‌లర్ సిల్వియా టెక్స్ట్ మెసేజ్.

నాకూ, రాజ్‌కి మధ్య తరచూ గొడవలు వస్తూండడంతో కౌన్సలర్‌ని కలిసాను.

గత రెండ్రోజులుగా నాకూ, రాజ్‌కి ఒకటే యుద్ధం.

ఇద్దరమూ ఏకాభిప్రాయానికి రావడం లేదు.  రాజ్ వాదన చూస్తే నాకు చికాకుపుడుతోంది.

ఈసారి  క్రిస్‌మస్‌కి బోస్టన్ వెళదామని అన్నాను. తను వద్దంటాడు. ఎంత కన్విన్స్ చేసినా వినడు.

బోస్టన్ దగ్గర బిల్లెరికా లో మామీ (అమ్మమ్మ) ఉంటుంది. తను ఎప్పట్నుండో రమ్మంటోంది. చూసి రెండేళ్ళు దాటింది. ఎమిలీ పుట్టినప్పుడు వద్దామని అనుకుంది కానీ, ఆరోగ్యం సరిగా లేక రాలేదు. ఎమిలీ పుట్టగానే ఫొటోలు పంపాను.  తనకి చూడాలని ఉందని ఎప్పుడూ అంటూవుంటుంది.

“జెన్నీ, బోస్టన్‌లో వింటర్ భరించలేం. విపరీత మైన స్నో  పడుతుంది కూడా.

అంత చలిలో ఎమిలీని తీసుకెళ్ళాలా? కావాలంటే ఏప్రిల్ తరువాత వెళదాం…”

అన్నాడు రాజ్.  కాదు – ఈ సారి వెళ్ళి తీరాలని నేను పట్టు పడుతున్నాను.

ప్రతీ క్రిస్‌మస్‌కీ ఫీనిక్స్ వెళ్ళడం అలవాటు. క్రితం సారి రాజ్ కూడా వచ్చాడు.

మా అమ్మా, నాన్నలిద్దరూ దాదాపు పదేళ్ళ క్రితం విడాకులు తీసుకున్నారు.

చాలాకాలంగా మా అమ్మ పెళ్ళి చేసుకోకుండానే ఉంది.

మా అమ్మ ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంది. తమ ఆఫీసులో కొత్తగా చేరిన హోసే అనే ఒక స్పానిష్ అతన్ని రెండేళ్ళ క్రితం పెళ్ళి చేసుకుంది. ఎమిలీ పుట్టినప్పుడు ఒక వారం శలవు పెట్టుకొని వచ్చింది.

ఇప్పుడైతే ఈ కాలిఫోర్నియాలో ఉంటున్నాను కానీ, నా బాల్యం అంతా బిల్లరికాలోనే గడిచింది. అదీ మామీ దగ్గర.  నా పెళ్ళికి మామీ వద్దామనుకుంది కానీ అప్పుడూ సుస్తీ చేసి రాలేకపోయింది.

“నరకం ఎక్కడో లేదు – బ్రతికుండగానే ఇక్కడే, ఇదే. ఓపికున్నప్పుడు వెళ్ళాలన్న ఆలోచనుండదు.  వెళ్ళలనుకున్నప్పుడు ఓపికుండదు…” అంటూంటుంది – ఎప్పుడూ మాట్లాడినా.

నా పెళ్ళి రెండు సార్లు జరిగింది. ఒకసారి ఇక్కడా. ఇంకోసారి ఇండియాలో.

మామీ ఇండియా ఎలాగూ రాలేదు.  ఇక్కడికయినా వద్దామని అనుకుంది. మరీ కదల్లేని పరిస్థితుల వల్ల రాలేకపోయింది. తరువాత  నేనూ, రాజ్ వెళదామనీ అనుకున్నాం. వర్క్ హడావిడిలో పడి వీలు చిక్కలేదు. ఈలోగా నాకు ప్రెగ్నెన్సీ. అలా వెళ్ళడం పడలేదు.

“రాజ్! ప్లీజ్ – నాకోసం – మామీకి ఎమిలీని చూడాలని వుంది. తను రాలేదు. ఈ క్రిస్‌మస్‌కి వెళితే సంతోషిస్తుంది…”  – ప్రాధేయపడ్డాను.

“మా అమ్మా, నాన్నల్ని ఇక్కడ వదిలేసి ఎలావస్తాను…? పైపెచ్చు మా నాన్నకి డ్రైవింగ్ కూడా రాదు…”

“మనం అక్కడేం నెలలు ఉండడం లేదు. జస్ట్ ఫైవ్ డేస్. అయినా మీరు క్రిస్మస్ ఎలాగూ జరుపుకోరు కదా…?”

“జరుపుకోవడం కాదు సమస్య. మా అమ్మా, నాన్నల్ని వదిలి రావడం నాకిష్టం లేదు. వాళ్ళు ఫీల్ అవుతారు…!”

“ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? నాలుగు రోజులు ఉంటామంతే… అయినా వాళ్ళేమీ కిడ్స్ కాదు…”

“కావాలంటే నువ్వు వెళ్ళు, నేను ఎమిలీని చూసుకుంటా…”

ఇది విని నాకు చిర్రెత్తుకొచ్చింది.

“రాజ్! ఆర్ యూ స్టుపిడ్? వెళ్ళేదే ఎమిలినీ చూపించడానికి.  నేనొక్కత్తినీ వెళ్ళడానికి నీ పర్మిషన్ అవసరం లేదు…” – చికాగ్గా లేచి వెళిపోయాను.

ఆ తరువాత మామధ్య మాటలు సాగలేదు. ఎదురుపడినప్పుడల్లా  నా కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాను.

ఓ రోజు మా మదర్-ఇన్-లా నన్ను మెల్లగా అడిగింది ఇంగ్లీషులో కూడబలుక్కుంటూ – నువ్వు బోస్టన్ వెళ్ళాల్ట కదాని.

వెళ్ళాలి కాదు – వెళుతున్నామని గట్టిగానే చెప్పాను.

రాజ్ చెప్పే వుంటాడు వాళ్ళ భాషలో. ఎందుకైనా మంచిదని ఆవిడకి అర్థమయ్యేటట్లు వివరంగానే చెప్పాను. ఆవిడేం మాట్లాడ లేదు. వెళ్ళడం ఇష్టం లేదని మొహంలో కనిపిస్తూనే ఉంది. ఐ డోంట్ కేర్!

రాజ్ తల్లి తండ్రులు అతన్ని వదిలిపెట్టరు.  వాళ్ళొచ్చాక మా మధ్య ప్రైవసీ పోయింది.

ఒకసారి సినిమాకి వెళదాం అన్నాను. ఎమిలీని అమ్మా, నాన్న దగ్గర వదిలి వెళదాం అన్నాడు. నాకిష్టం లేదు. మనతో తీసికెళదాం అన్నాను. ఇద్దరి మధ్యా ఆర్గ్యుమెంట్.

మూడ్ అంతా పాడయ్యింది. చివరకి రాజ్ బ్రతిమాలితే బయల్దేరా. వెళ్ళేముందు ఎమిలీ గురించి వంద జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళాను. రాజ్ విసుక్కున్నాడు.

రాజ్ అమ్మా, నాన్నా వచ్చి మూడు నెలలు దాటింది.

నేను వర్క్‌కి వెళ్ళాల్సి వచ్చిందని సాయం కోసం రాజ్ ఇండియా నుండి పిలిపించాడు.  సరే అన్నాను కానీ, వాళ్ళు వచ్చాక రాజ్‌కి నాకూ మధ్య తరచూ మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.

రాజ్ వాళ్ళమ్మకీ, నాకూ కాస్త చుక్కెదురు. ముఖ్యంగా ఎమిలీని హ్యాండిల్ చేసే విధానంలో.  రాజ్ అమ్మ పేరు జయా.

ఆవిణ్ణి పేరు పెట్టి పిలవద్దని రాజ్ విసుక్కుంటాడు. నాకు వరసలు పెట్టి పిలిచే అలవాటు లేదు.

ఇద్దరి మధ్యా ఆర్గ్యుమెంట్స్!

నేను మాత్రం జయా అనే పిలుస్తాను. రాజ్ చెప్పి చెప్పి చెప్పి ఊరుకున్నాడింక.

ప్రతీసారీ తన తల్లి తండ్రులు తననెంత గొప్పగా పెంచిందీ చెప్తాడు.

తనని అమెరికా పంపడానికి అతని తల్లితండ్రులు ఆర్థికంగా ఎంతో కష్టపడ్డారనీ అంటాడు.

ఏదైనా అంటే – అతని తల్లితండ్రులు పైసా పైసా కూడబెట్టి మరీ తనని చదివించారంటాడు. ముఖ్యంగా నేను ఎం.ఎస్ చదువుకోసం లోన్ పేమెంట్ చేసినప్పుడల్లా.

“మీ కుటుంబాలన్నీ విచిత్రంగా ఉంటాయి.  మీ పేరెంట్స్ నీ చదువుకి కట్టగలిగి ఉండీ నిన్ను లోన్ తీసుకోమనడం…” అంటూ వెటకారంగా నవ్వుతాడు.

“ఇవ్వలేక కాదు, నాకూ ఒక బాధ్యత గుర్తు చేయడం కోసం…” అని చెప్పినా వినడు.

రాజ్ పేరెంట్స్‌కి ప్రతీ విషయంపైనా ఆరా. ఒకటికి వంద సార్లు అడుగుతారు. నాకేమో రెండో సారి చెప్పే అలవాటు లేదు.  ఇదే రాజ్‌తో అంటే – అదే ప్రేమ అంటాడు.

“మీ ప్రేమలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంతెందుకూ – మీ అమ్మా, నాన్నా నీ బేబీ షవర్‌కొచ్చినప్పుడు  మనమందరం లంచ్‌కి వెళ్ళాం గుర్తుందా? ఎవరి లంచ్‌కి వాళ్ళే డబ్బులిచ్చారు. అక్కడెందుకుండదు ప్రేమ? అదీ మీ కల్చర్!” అంటూ దెబ్బలాడాడు.

” అందరూ సంపాదించుకుంటున్నారు కదా? అందరూ కలిసున్నామన్నది ప్రధానం. ఎవరు డబ్బు కట్టారన్నది కాదు…యూ నీడ్ టు గ్రో…” అనేసి అక్కణ్ణుండి లేచి వెళిపోయాను.  ఇలా వుంటాయి మా మాధ్య మాటలు.

రాజ్‌తో మా ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోను.

మావన్నీ మెటీరియలిస్టిక్ జీవితాలంటాడు ఎప్పుడూ.

ఇలా ప్రతీ చిన్న విషయానికీ ఒక రాద్ధాంతం ఉంటుంది.

మా ఇన్‌లాస్‌తోనే నాకు సమస్య. రాజ్‌తో పరవాలేదు కానీ, వాళ్ళొచ్చాక ఒకరకమైన సఫకేషన్.

వాళ్ళకి శుభ్రత తక్కువ. నాకేమో పరమ చాదస్తం. ఇల్లంతా నీటుగా వుండాలి. ముఖ్యంగా కిచన్!

నాకు ఎమిలీని ఆ చేత్తో, ఈ చేత్తో ముట్టుకోవడం ఇష్టం ఉండదు.

ఒక్కోసారి ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా బయటకి వచ్చేస్తోంది.

జయాకి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదు.

వాళ్ళ అలవాట్లూ, పద్ధతులూ నాకూ కొత్త.  రాజ్ వరకూ పరవాలేదు కానీ వాళ్ళతో నాకు ఇబ్బందిగానే ఉంది.  కానీ పైకి అనను. రాజ్ ఏమైనా ఫీల్ అవుతాడని.

బోస్టన్ వెళడానికి టిక్కట్లు కొంటానని రాజ్‌కి చెప్పాను.

తనేమీ మాట్లాడ లేదు.  నన్ను కన్విన్స్ చెయ్యడానికి రెండు మూడు సార్లు టెక్స్ట్ మెసేజిలు పెట్టాడు.  నేనయితే వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను.

సిల్వియా టెక్స్ట్ మెసేజ్.

కౌన్సిలింగ్‌లో భాగంగా రోజూ ఒక మెసేజ్ పెడుతూ ఉంటుంది.

Differences are nothing but hidden injuries; you don’t see them, but you suffer.

000

రాజ్ బోస్టన్ రాడని నిర్థారించుకున్నాను.

ఎమిలీ కోసమని ఫస్ట్ క్లాస్ టిక్కట్లు తీసుకున్నాను, కాస్త ఖరీదయినా.

కొన్న తరువాత రాజ్‌కి ఆ ప్రయాణం వివరాల ఈమెయిల్ పంపాను.

రాజ్ దానికి జవాబివ్వ లేదు. తరువాత టెక్స్ట్ మెసేజ్ పంపాను.

మా అమ్మకి మెసేజ్ ఇస్తే కాల్ చేసింది. నేను వెళ్ళడం తనకి సంతోషంగా ఉందని చెప్పింది. ముఖ్యంగా మామీ కోసం.  తనకీ రావాలని ఉంది కానీ, రాలేననీ, తను మెక్సికో వెళుతున్నాననీ చెప్పింది.

సర్‌ప్రైజ్ ఇవ్వాలని, మామీకి చెప్పొద్దనీ అమ్మకి చెప్పాను. క్రిస్‌మస్ దగ్గరకొచ్చాక చెప్పాలన్నది నా ఆలోచన.

ఇంటికొచ్చాక ఎందుకిలా చేసావని? – రాజ్‌మాటల యుద్ధం మొదలు పెడతాడనీ అనుకున్నాను.  ఫస్ట్ క్లాస్ టిక్కట్లు ఎందుకు అంటాడనుకున్నా.

ఏమీ ఎరగనట్లే ఉన్నాడు. నేనే ఉండ బట్టలేక అడిగాను – బోస్టన్ ప్రయాణం మెయిల్ చూసావాని.

చూసానన్నట్లు తలూపాడు కానీ ఏమీ మాట్లాడ లేదు.  అతని బాడీ లాంగ్వేజ్‌ లో అసహనం కనిపిస్తూనే వుంది.

మరలా బోస్టన్ ప్రసక్తే రాజ్ నా ముందర ఎత్త లేదు.

ఫోన్ మ్రోగింది.  సిల్వియా టెక్స్ట్ మెసేజ్.

Egodystonics are like water under carpet.

Not just the carpet, the whole house gets damaged.

000

ప్రయాణం ఇంకో వారం ఉందనగా – మామీకి క్రిస్‌మస్ గిఫ్ట్ ఏం కొనిస్తే బావుంటుందని రాజ్‌ని అడిగాను. ఏమో అన్నట్లు భుజాలు ఎగరేసాడు. మరలా రెట్టించాను.

“ఆవిడకేం ఇష్టమో నాకేం తెలుసు…? నన్నడిగితే ఓ అమేజాన్ గిఫ్ట్ కార్డ్ కొనియ్యి.

ఆవిడకి నచ్చినవి ఆర్డర్ చేసుకుంటుంది. కదలక్కర్లేకుండా ఇంటికి డెలివర్ చేస్తారు…” అన్నాడు.

మామీకి ఆస్తమా వుంది. బ్లూ యెయిర్ ఫిల్టర్ కొనిస్తే బావుంటుందనిపించింది.

ఇంటర్‌నెట్‌లో ఆర్డరిచ్చి,  క్రిస్మస్ ముందు రోజు డెలివరీ చెయ్యాలని ఆర్డర్ పెట్టాను.

ప్రయాణం దగ్గర పడింది. రాజ్ నన్నూ ఎమిలీనీ శాన్‌ఫ్రాన్‌సిస్కో ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కించాడు. తను కూడా వస్తే బావుండేదనిపించింది. అదే అన్నాను. తను నవ్వేసాడు తప్ప జవాబివ్వ లేదు. నేనెక్కిన ఫ్లైట్ మధ్యాన్నం నాలుగు గంటలకి చేరుకుంటుంది.  వెళుతూ వెళుతూ ఎమిలీ జాగ్రత్తని పదే పదే చెప్పాడు రాజ్!

నాకు క్రిస్‌మస్ ముఖ్యమైన పండగ. నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ముఖ్యంగా మామీతోనూ, మా అమ్మా, నాన్నలతోనూ. క్రితం సారి ఫీనిక్స్ నుండి మా అమ్మ ఇక్కడికే వచ్చింది.

ముఖ్యంగా ఈ క్రిస్‌మస్‌కి రాజ్ రాకపోవడం బాధ కలిగింది.

మొదటి సారి నాకు తెలిసింది – కల్చరల్ డిఫరెన్స్ అంటే.

వెళ్ళేటప్పుడు మామీకి ఒక అయిదొందల డాలర్ల అమేజాన్ గిఫ్ట్ కార్డ్ కొనిచ్చాడు రాజ్.  మామీకి తప్పకుండా ఇస్తానని చెప్పాను.

నన్ను చూడగానే మామీ ఎంతో సంతోషించింది. ఎమిలీని చూసాక ఆమె ఆనందానికి అవధుల్లేవు. మామీ ఇల్లు చూడగానే నాకు ప్రాణం లేచొచ్చినట్లయ్యింది. నేను హైస్కూల్ వరకూ బిల్లరికాలోనే చదివాను.  ఆ ఇంటితో నా అనుబంధం మాటలతో చెప్పలేను. ఒక్కసారి ఇల్లంతా కలియ తిరిగాను.

ఇంటి వెనుక యార్డ్‌లో చిన్నప్పుడు మాకోసం మామీ కట్టించిన ఊయల ఇంకా అలాగే ఉంది.

నేను వస్తున్నానని తెలిసి ఓపిక లేకపోయినా క్రిస్‌మస్ ట్రీ అలంకరించింది.

ఇల్లంతా రంగు రంగు దీపాలు పెట్టింది. ఎందుకు ఇదంతా అనంటే – ఇవన్నీ తను చేయలేదనీ, పని వాళ్ళ చేత చేయించాననీ అంది.

మామీకి సాయంగా ఒక నానీ వస్తుంది రోజూ. ఒక్కోసారి అక్కడే ఉంటుంది కూడా. నానీ పేరు నాన్సీ. నాకూ ఇంతకుముందు పరిచయమే.  మామీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందనీ, ఆస్తమా ఎక్కువగా ఉంటుందనీ చెప్పింది.  మామీని చూస్తే బాధ కలిగింది. బక్క చిక్కిపోయింది. కళ్ళల్లో ఇదివరకటి కాంతి లేదు.

రాజ్ రాలేదని మామీ కాస్త చిన్నబుచ్చుకుంది.

పని వల్ల రాలేకపోయాడనీ, వాళ్ళ పేరెంట్స్‌ని వదిలి రాలేక పోయాడనీ సర్ది చెప్పాను.

మాటల్లో నా మ్యారేజ్ లైఫ్ ఎలా వుందని అడిగింది మామీ.

ఏం చెప్పను? – బావుందీ; అప్పుడప్పుడు లేదు. ఇదే చెప్పాను.

బలంగా నిట్టూర్చింది మామీ.  కాసేపు ఏమీ మాట్లాడ లేదు.

చెప్పడం ఇష్టం లేకపోతే మామీ పొడిగించదు. నాకు చిన్నప్పటినుండీ అలవాటే.

మా అమ్మకీ, నాన్నకీ మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు కూడా మామీ ఏమైందని అడగలేదు. ఆ వ్యవహారంలో తలదూర్చ లేదు. మౌనంగా బాధపడడం తప్పించి.

మామీ! రాజ్, నేనూ ప్రేమించుకున్నాం. మనిషి మంచివాడే. కానీ పెళ్ళికి ముందు కనిపించని ఒక తెర పెళ్ళయ్యాక పెద్దగా గ్లోరిఫై అయ్యింది. అదీ కల్చరల్ డిఫరెన్స్

రాజు వెజిటేరియన్! చికెన్, ఫిష్ తింటాడునా గురించి నీకు తెలుసు కదా!

ఎమిలీ పుట్టాక సాయంగా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళు పూర్తి వెజిటేరియన్స్. వాళ్ళున్నంత కాలం మీట్ వండద్దని చెప్పాడు. అలాగే అని అక్కడికీ సర్దుకున్నానువాళ్ళ పద్ధతులూ అవీ కొంచెం విచిత్రంగానే ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అలా అని పైకి చెప్పలేను.

ఎమిలీకి గెర్బర్ ఫుడ్ పెట్టేదాన్ని. రోజు  వర్కుకెళుతూ ఆవిడకి గెర్బర్ ఫుడ్ పెట్టమని ఇచ్చాను. ఆవిడకి ఇంగ్లీషు అంతగా రాదు. ప్రతీదీ ఒకటికి రెండు సార్లు చెప్పాలి.  ఇంటికొచ్చాక రాజ్ నామీద చికాకు పడ్డాడువాళ్ళమ్మకి మీట్ ఫుడ్ ఇచ్చి ఎందుకు ఎమిలీకి పెట్టమన్నావని.

అది ఎమిలీ కి పెట్టే  ఫుడ్. ఆవిడకేమీ నేను తినమని చెప్పలేదుగా?

మెల్లగా మాటల యుద్ధం మొదలయ్యిందితన పేరెంట్స్ని నేను గౌరవించడం లేదంటాడు. ఇదీ అని చెప్పలేను కానీ, వాళ్ళకి నాతో కంఫర్ట్ జోన్ లేదు. నాక్కూడాఇదొక్కటే కాదు. చాలా వున్నాయిరాజ్తో గొడవపడడం ఇష్టం లేదుతనేమన్నా వాదించను

ప్రయాణం కూడా వద్దని అన్నాడు. అందుకే రాలేదు…”  – చెప్పకూడదనుకున్నా ఆపుకోలేకపోయాను.

మామీ ఏమీ అనలేదు. గట్టింగా నవ్వేసింది.

నన్ను దగ్గరగా తీసుకుంది – “యిట్ విల్ బి ఆల్  రైట్…!” అని మాత్రం అంది.

నాలో నేను సతమవుతున్న బాధకి మామీ  వెంట్‌లా అనిపించింది.

మనసులో ఉన్నదంతా కక్కేసాను.

క్రిస్‌మస్ ఈవ్ రేపనగా ఓ రోజు రాత్రి డోర్ బెల్ మ్రోగింది.

ఇంత రాత్రి ఎవరా అని తలుపు తీసి చూస్తే రాజ్.

రాజ్ వస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు.

ఒక్క ఉదుటన వెళ్ళి కావలించుకున్నాను. కళ్ళ నీళ్ళొచ్చాయి.

నా ఆనందానికి అవధుల్లేవు.  రాజ్‌ని చూసి మామీక్కూడా.

పగలూ, రాత్రీ లేదు – సిల్వియా మరో టెక్స్ట్ మెసేజ్.

Hugs are warm; they break the ice with a simple touch.

000

ఆ ఉదయం మామీకోసం ఆర్డరిచ్చిన బ్లూ ఎయిర్ ఫిల్టర్ డెలివరీ వచ్చింది.

అంత పెద్దది క్రిస్‌మస్ ట్రీ దగ్గర పెట్టడం ఇష్టం లేక, నేను గరాజులో పెట్టించాను.

క్రిస్‌మస్ ట్రీ దగ్గర ఇంకేదయినా గిఫ్ట్ పెడితే బావుంటుందనీ, అదీ ఎమిలీ పేర మామీకి పెట్టించాలనీ నాకనిపించి,ది. మామీకి క్విల్టులంటే ఇష్టం.

క్రిస్‌మస్ ఈవ్ ఉదయం మామీకి క్విల్ట్ కొనిద్దామని రాజ్‌కి చెప్పాను.

మాకు కొంచెం దూరంలో నాషువా మాల్ ఉంది. వెళదామని అడిగాను.

తను ఎమిలీని చూసుకుంటాననీ, నన్నే వెళ్ళమన్నాడు.

నాతో పాటు వస్తాననీ మామీ కూడా సిద్ధమయ్యింది. ఆమెకి ఓపిక లేదు.

పరవాలేదు ఎలక్ట్రిక్ వీల్ చెయిర్‌లో కూర్చుంటాననీ, నానీ తోడుగా ఉంటుందనీ అంటే సరే నన్నాను.

రాజ్ – మామీకి ఇవ్వడానికి నీ పేర ఏదైనా కొననా అని అడిగితే గిఫ్ట్ కార్డ్ ఉంది కదా, ఇంకేం వద్దని చెప్పాడు.

మాల్‌కి వెళ్ళే దారిలో మామీ నా చిన్నప్పటి విశేషాలు గుర్తుచేసింది.

“జెన్నీ, నీకో విషయం తెలుసా… బిల్లరికా మాల్ మూసేస్తారట. ఈ మధ్య అందరూ ఇంటర్నెట్‌లో కొనుక్కోవడంతో షాప్స్‌లో సేల్స్ పడిపోయాయట. అయినా ఒక వస్తువుని చూడకుండా ఎలా కొనుక్కుంటా చెప్పు? నీకు గుర్తుందా…? క్రిస్‌మస్ వస్తే మాల్స్ ఎంత కళ కళలాడుతూ ఉండేవో కదా?

ఈ షాపింగ్ అనేదే ఒక పెద్ద పండగ నిజంగా. నీకు గుర్తుందో లేదో తెలీదు – నీ చిన్నప్పుడు గిఫ్ట్స్ కొనడానికని నెల్లాళ్ళ ముందునుండీ ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఇంకొకళ్ళకి తెలీకుండా వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్స్ కొనడం, క్రిస్‌మస్ ఈవ్ నాడు అవి విప్పి చూసి మురిసి పోవడం…ఇవన్నీ నాకు కళ్ళకు కట్టినట్లున్నాయి.  మీ అమ్మా, నాన్నా క్రమం తప్పకుండా వచ్చేవారు.  నువ్వు సరే సరి. ఇక్కడే ఉన్నావు.

వారం క్రితం పక్కింటి లోరా చెబుతోంది – మాల్స్ అన్నీ వెల వెలబోతున్నాయనీ. అందరూ ఇంటర్‌నెట్‌లోనే కొంటున్నారనీ.  ఏమో నావరకూ అది ఊహక్కూడా అందదు. ఒకటికి రెండు వస్తువులు చూసుకోవడం, అదీ పట్టుకు చూసి ఫీల్ అవ్వడం, ఇవన్నీ రిలేషన్స్‌లో  భాగం.

నీ పుట్టినరోజుకని నీ కిష్టమైన డ్రెస్ కొనాలని మీ నాన్న తిరగని షాపు లేదు. గిఫ్ట్ కంటే కూడా అది కొనడం కోసం పడే శ్రముందే – అదే ప్రేమంటే జెన్నీ. అక్కడ గిఫ్ట్ ఏదన్నది అనవసరం. ఒకరి కోసం ఇంకొకరు తాపత్రయ పడటం…మీరందరూ వెళిపోయాకా మీరిచ్చిన గిఫ్ట్ చూసినప్పుడల్లా నాకళ్ళు చెమర్చేవి.

మీ అమ్మ రాలేనని నాకోసం ఒక గిఫ్ట్ పంపింది…అది చూసాక – మీ అమ్మ వచ్చుంటే బావుండేది…అనుకున్నాను…” అని చెబుతూ మామీ కళ్ళు తుడుచుకుంది.

ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకోగలను. ఏం చెప్పగలను?

నా ఉద్యోగం ఈ బే కంపెనీలో.

హైస్కూల్లో ఉండగా నా మొదటి డేట్‌ని తరచూ కలిసిందీ ఇక్కడే.  షాపింగ్, లంచ్, ఆ తరువాత మూవీకి – ఇవన్నీ ఈ మాల్ చుట్టూనే ఉండేవి.

మామీ చెప్పినట్లు – మాల్ అనేది మా జీవితాల్లో ఒక భాగం. ఒక మెమరీ.

మనుషులూ, వస్తువుల్లాగే  స్థలాలకీ లైఫ్ ఉంటుందేమో?

మామీకి ఒక రంగు రంగుల క్విల్ట్ కొన్నాను. అది కొనేటప్పుడు మామీని ఫుడ్ కోర్ట్ దగ్గరకి తీసుకెళ్ళమనీ నానీకి చెప్పాను. మామీ నాకూ, ఎమిలీకీ, రాజ్‌కి గిఫ్ట్స్ కొంది. అవేమిటో నాకు తెలీకూడదని నన్ను దూరంగా వెళిపోమనీ చెప్పింది.

ఆమె చేదస్తం చూస్తే నవ్వొచ్చింది. చేదస్తం అనలేను.  అనుబంధం అనుకోవాలి అని సర్ది పెట్టుకున్నాను.

చిన్నప్పుడు క్రిస్‌మస్ ఈవ్ నాటి రాత్రి గిఫ్ట్స్ ఓపెన్ చెయ్యడం ఒక థ్రిల్.  క్రిస్‌మస్ ట్రీ కొనడం దగ్గర్నుండీ, అలంకరించడం వరకూ అన్నీ మధురమైన జ్ఞాపకాలు.

ఈ క్రిస్‌మస్ నెల్లాళ్ళూ మా ఇంట్లో పెద్ద సందడే!

ఎమిలీకి ఇటువంటి జ్ఞాపకాలు ఉంటాయో లేదో అన్న ఆలోచనే భయంగా ఉంది.

ముఖ్యంగా రాజ్ ఫ్యామిలీతో ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్ చూస్తే .

ఒక కిడ్ మించి వద్దని రాజ్ అస్తమానూ హెచ్చరిస్తూనే ఉంటాడు.

ఆటో మెసేజింగ్ అనుకుంటా.  సిల్వియా నుండి మరో టెక్స్ట్ మెసేజ్.

Vacations are your best friends; they rekindle the love instantly!

000

క్రిస్మస్ పండగ మామీతో గడపడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.

ముఖ్యంగా ఎమిలీ, రాజ్‌లతో కలిసి ఈ రెండ్రోజులూ నాతో ఉండడం.

రాజ్ మీద అపారమైన ప్రేమకలిగింది. ఐ యామ్ లక్కీ అనుకున్నాను.

క్రిస్‌మస్ ఈవ్ నాడు గిఫ్ట్స్ అన్నీ తెరిచి చూసాం. ఎమిలీకి మామీ డైమండ్స్ సెట్ కొనిచ్చింది. అవి కాకుండా కనీసం పది జతల ఫ్రాక్సూ, లెక్కలేనన్ని బొమ్మలూ.

రాజ్‌కి టిఫనీ వాచ్ బహుమతిగా ఇచ్చింది. రాజ్ అది మామూలు వాచ్ అనుకున్నాడు. తరువాత ఇంటర్నెట్‌లో దాని ఖరీదు చూసి ఆశ్చర్యపోయాడు.

నిజంగా ఈ క్రిస్‌మస్ నాకు మరపురానిది.

“థాంక్స్ రాజ్! – ఐ లవ్ యూ! “ మనసులోనే అనుకున్నది పైకి అన్నాను.

రాజ్ నవ్వేసాడు.

ఆ రాత్రి మామీ నేనిచ్చిన క్విల్ట్ కప్పుకునే పడుక్కుంది.

ఈ నాలుగురోజులూ క్షణాల్లా గడిచి పోయాయి.

మేం వచ్చేస్తుంటే – ఎమిలీని చూస్తానని అనుకోలేదనీ అంటూ మామీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.  రాజ్‌కీ  పదే పదే థాంక్స్ చెప్పింది.  రాజ్ పేరెంట్స్ కూడా వచ్చుంటే బావుండేదని, వాళ్ళకి తరపున ఇవ్వమని రెండు గిఫ్ట్స్ ఇచ్చింది.

క్రిస్మస్ అయిన రెండ్రోజులకి నేనూ, ఎమిలీ కాలిఫోర్నియా బయల్దేరాం.

ఇంటికొచ్చాక ఎందుకో రాజ్ పేరెంట్స్ కాస్త అసహనంగా ఉన్నట్లు అనిపించింది.

వచ్చినప్పటినుండీ చాలా ముభావంగా వున్నారు.

మామీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు మాత్రం – ఆమె ఎలా వుందని అడిగారంతే.

ఈ క్రిస్మస్ రెండ్రోజులూ సిల్వియా నుండి మెసేజ్ లేదనుకున్న మరు క్షణమే ఫోన్ రింగ్.

Differences are like epidemic – not just you, they contaminate others too.  

000

క్రిస్‌మస్ వెళ్ళిన నాలుగు వారాల తరువాత మామీకి సీరియస్ అయ్యి పోయిందన్న వార్త వచ్చింది.  నేను, ఎమిలీని తీసుకొని వెళ్ళాను. రాజ్ రిలీజ్ వర్క్ వుందని రాలేకపోయాడు.

మా అమ్మా, ఆమె భర్తా – మా నాన్నా కూడా వచ్చారు.

తను పోయేముందు తన కాఫిన్‌లో బంధువులందరి ఫొటోలూ పెట్టాలనీ, వాళ్ళ గుర్తుగా తన దగ్గరున్న వస్తువులు పెట్టమనీ నానీకి చెప్పిందట.

ముఖ్యంగా నేనిచ్చిన క్విల్ట్ పీస్ కూడా.

కేథోలిక్ సాంప్రదాయ ప్రకారం బిల్లరికాలో బంధువులూ, స్నేహితుల మధ్య మామీ అంత్యక్రియలు ముగిసాయి.

మామీ మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుందీ మెమోరియల్ సమయంలో మాట్లాడాను.  మా అమ్మా, నాన్నా కూడా మాట్లాడారు.  చివరిసారిగా మామీకి వీడ్కోలు చెప్పాను. నా దుఃఖానికి అంతులేదు.

నేనొచ్చేస్తుంటే – నాన్సీ ఒక చిన్న చీటీ ఇచ్చింది. అది మామీ నాకోసం రాసిందట.

“డియర్ జెన్నీ – నువ్వు క్రిస్‌మస్‌కి ఎమిలీ, రాజ్‌లతో రావడం నా చివరి క్షణాలకి ఒక అర్థం మిగిల్చాయి.

మీరిద్దరూ కలిసుండాలి.

అభిప్రాయభేదాలుంటాయి. ఉండాలి కూడా. లేకపోతే జీవితానికి అర్థం లేదు.

అన్నింటినీ హరించేది ఆలింగనం ఒక్కటే!

గివ్ హిమ్ ఎ హగ్!

ఐ లవ్ యూ, రాజ్‌ అండ్ ఎమిలీ.

థాంక్యూ ఫరెవర్!

విత్ లవ్ — మామీ”

చదువుతూంటే  కళ్ళు చెమర్చాయి.

సమయం సందర్భం లేదు – ఇంకో టెక్స్ట్ మెసేజ్.

Wipe out your worries; no fragrance is more powerful than a smile.

000

తిరిగొచ్చాక – మామీ అంత్యక్రియలు అన్నీ ఆమె కోరుకున్నట్లుగానే జరిగాయనీ, మా అమ్మా, నాన్నా అందరూ వచ్చారనీ వివరంగా రాజ్‌కి  చెప్పాను.

తన తదనంతరం మామీ ఇల్లు ఒక చారిటీకి రాసిచ్చిందన్న విషయం కూడా.

“అదేంటి…? నీకివ్వచ్చు కదా…? నీ లోన్ అయినా తీరేది…” అన్నాడు.

రాజ్‌తో వాదించడం ఇష్టం లేదు. అతని ఆలోచన గ్రహించగలను.

ఆమె ఆస్తి; ఆమె ఇష్టం అని మాత్రం అన్నాను.

తన బంధువుల గుర్తుగా కాఫిన్‌లో వస్తువులు పెట్టాలని కోరుకుందనీ, ఎమిలీ పేర మామీకిచ్చిన క్విల్ట్ ముక్క ఒకటీ, నా చిన్నప్పుడు మామీ కొన్న డైమండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కాఫిన్‌లో పెట్టామని చెప్పాను.

“అందరివీ ఉన్నాయి, నీ తరపునుండే లేదు…”

నాకేసి కళ్ళు చిట్లించి చూసాడు.

“…చివర్లో చటుక్కున గుర్తొచ్చింది… ఆమె రూమంతా వెతికితే దొరికింది. ఆమె తలగడ క్రింద…అదే పెట్టాను.”

ఏవిటన్నట్లు ఆశ్చర్యంగా  చూసాడు.

“…నువ్వు మామీకిచ్చిన గిఫ్ట్ కార్డ్ …!”  మాటలు పెగల్లేదు నాకు.

“అది ఆవిడ క్యాష్ చేసుకుందా…?”

తెలీదన్నట్లు తలూపాను. వేంటనే కంప్యూటర్ దగ్గరకెళ్ళి చెక్ చేసి వచ్చాడు.

“నువ్వైనా చూడద్దా! మామీ క్యాష్ చెయ్యలేదు. చూస్తూండగా అయిదొందలు వేస్ట్! ” అన్నాడు.

“ఆ టైమ్‌లో ఎలా చెక్ చేస్తానను కున్నావ్? నువ్విచ్చావని ఒకటికి పదిసార్లు చెప్పుకొని ముచ్చటపడింది. అందుకే అది పెట్టాను…”

మామీ రాజ్ ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ కవర్లోనే తలగడ క్రింద ఉంచుకుంది.

అదే చెప్పాను. నా మాటలు వినకుండా విసురుగా వెళిపోయాడు. నాకూ చికాకు పుట్టింది.

ఆ సాయంత్రం ఎమిలీని ఈవెనింగ్ వాక్‌కి తీసుకెళ్ళి ఇంటికొచ్చాను. రాజ్ అమ్మా, నాన్నలతో వాళ్ళ గదిలో ఉన్నాడు.

లోపలికి వెళ్ళబోతూ రాజ్ ఇంగ్లీషులో అంటున్న మాటలు విని ఒక్కసారి అవాక్కయ్యాను.

“అంతగా ఏదో ఒకటి ఆ కాఫిన్‌లో పెట్టాలంటే గ్రీటింగ్ కార్డ్ పెట్టొచ్చుగా… వాళ్ళందరి పేరునా అంటే అర్థముంది. నే కల్సిందే ఒకసారి. ఆ అయిదొందల డాలర్ల కార్డ్ పెట్టాలా… జెన్నీయే  పెట్టిందట. షీ ఈజ్ స్టుపిడ్ …ఆ మామీ ఆస్తంతా చారిటీకి రాసిందట. అది జెన్నీకి ఇవ్వచ్చు కదా…? ఇలాగే ఏడుస్తాయి వీళ్ళ రిలేషన్స్ …”

ఒక్కసారి రాజ్ పీక నులిమేయాలన్నంత కోపం వచ్చింది.

ఎమిలీ చదువుకోసం మామీ తన సేవింగ్స్ ఇచ్చిందని ఇంతవరకూ చెప్పలేదు.

ఇక ముందు చెప్పను కూడా.

నేను వచ్చినట్లు గమనించి నవ్వుతూ బయటకి వచ్చాడు రాజ్.

“జెన్నీ! నీకో సర్‌ప్రైజ్!” అంటూ ల్యాప్‌టాప్ బ్యాగ్ నుండి ఒక ప్యాకెట్ తీసిచ్చాడు.

దాని మీదున్న ముసుకు తీసి చూసాను.

అందమైన ఫొటో ఫ్రేములో  “నేనూ, మామీ, ఎమిలీ”!

బిల్లరికా వెళ్ళినప్పుడు రాజ్ తీసిన ఫొటో అది.

నోట మాట లేదు.

నాకూ, ఎమిలీకి ఒక కిస్ ఇచ్చాడు.

రాజ్‌ని అర్థం చేసుకోవడం నా వల్ల కావడం లేదు.

ఫోన్ మ్రోగింది.  సిల్వియా నుండి టైమ్‌లీ మెసేజ్.

Personal differences are like air balloons; pop them with a “KISS”!

000

( * క్విల్ట్రంగు ముక్కల దుప్పటీ (బొంత) )

Exit mobile version