Site icon Sanchika

ర్…ర్… రకుతం గావాలె…!

[dropcap]ఆ [/dropcap]రోజు అమావాస్య…!

అది పదకొండు సంవత్సరాల కొకసారి వచ్చే అరుదైన నూట ఇరవై ఒకటవ అమావాస్య. ఆ అమావాస్య రోజున ఒక ఉపద్రవం సంభవిస్తుంటుందని నిత్యం దుష్టశక్తుల్ని ఉపాసించే మంత్రగాళ్ళ నమ్మకం.

రాత్రి పన్నెండు గంటలు అవడానికి కొన్ని క్షణాల ముందు, ఊరవతల స్మశానంలో కటిక చీకటి సృష్టించిన భయానక శబ్దాలకు ఝడుసుకొని ఉండచుట్టుకు పోయిన మృతదేహాల్లా నేల కరుచుకుపోయి ఉన్నాయి సమాధులు.

భోరు భోరుమని విలపిస్తున్నట్టు హోరుమని వీస్తోంది గాలి.

దడ పుట్టిస్తున్న గాలికి గుండె చెదిరిన చెట్లు తమ గుండెలవిసేలా బాచ్చె గుద్దుకుంటూ రోదిస్తున్నట్టు కొమ్మలతో ఊగిపోతున్నాయి. భీతితో నేల రాలుతున్న ఎండుటాకుల గలగల శబ్దాలు వెన్నులోంచి వణకు పుట్టిస్తున్నాయి.

ఇవేమీ పట్టనట్లు ఒళ్ళంతా విభూతి పూసుకొని, ముఖమంతా ఎర్రని కుంకుమ రాసుకున్న ఓ పదిమంది మంత్రగాళ్ళు వర్సగా బాసింపీట వేసుక్కూర్చున్నారు.

ప్రతి ఒక్కరి ముందు ఎరుపు కుంకుమతో తాంత్రిక బీజాక్షరాలు రాసి ఉన్నాయి. వాటి నడుమ పదకొండు రకాల అడవి పూలు, వాటి మధ్యన బాతు రక్తంతో తడిపిన జానెడు పొడవున్న కట్టె కొయ్యలు నాటి ఉన్నాయి. ప్రతి కొయ్య ముక్కకి పసుపు వర్ణపు నిమ్మకాయ గుచ్చి ఉంది. నిష్ఠతో మంత్రోచ్ఛారణ గావిస్తున్నారంతా.

ఏవో అదృశ్య ప్రేతాత్మలు కంటబడుతున్న ప్రతిసారీ ప్రాణభీతితో పరుగెడుతున్నట్టు గాలి భయవిహ్వలతతో మరిత వేగంగా వీస్తోంది.

ఎవరి ఉపాసన ఏ అదృశ్య శక్తిని ప్రేరేపించిందో? ఏ దుష్టశక్తి ఏ ప్రేతాత్మగా అవతరించబోతోందో?

ఒక మహాద్భుత ఘటనకి తెర లేస్తున్నట్టు స్మశానపు నలుదిశలా ఆవరించి ఉన్న ఎండుటాకులన్నీ ఎవరో వెన్ను తట్టి లేపినట్టు ఒక్కసారిగా జీవం పోసుకోసాగాయి.

ఏ శక్తో ఆవరించినట్టు ఎండుటాకుల్లో కదలిక మొదలయ్యంది. నేల మీద ఆకులన్నీ ఎవరో ఆదేశించినట్టు రివ్వున పైకి లేచాయి, పరుగు పందెంలో పాల్గొంటున్నంత ధృతితో దుసుకు రాసాగాయి స్మశానంలోని ఓ సమాధి వైపు!

మంత్రోపాసకులు కళ్లు మూసుకొని ధ్యాన ముద్రలో మునిగిపోవడంతో ఆ దృశ్యం వారి కంటపడే అవకాసం లేదు. తమ మధ్య ఏం జరుగుతున్నా కళ్ళు తెరిచి చూడాలన్న తెలుసుకోవాలని ఎవరు సాహసం చేయరు. ఉపాసన మధ్యలో కళ్ళు తెరిస్తే దుష్టశక్తులకు తామే బలైపోవాల్సి వస్తుందని మంత్రగాళ్ళకి తెలుసు. నిద్ర లేచే ఆ దుష్టశక్తుల సహకారంతో తమంతా శక్తివంతులమవ్వాలన్నదే వారి ఏకైక ఉపాసనా లక్ష్యం.

ఎండటాకుల్ని తమ వెంట తీసుకువెళ్లాల్సిన గాలి పొరలు సైతం తమ విధిని పక్కన పెట్టి…. తామె ఆకుల్ని వెంబడిస్తూ భయవిహ్వలతో కదిలిపోగాయి.

ఏదో అదృశ్య శక్తి ఆదేశిస్తున్నట్టు ఎండటాకులన్ని ఆ సమాధిపై చేరి ఓ సరికొత్త ఆకృతిని సంతరించుకోసాగాయి.

ఒక ఆకుపైన మరొక ఆకు, ఆ ఆకు పైన మరో ఆకు…. అలా అలా కొన్ని అక్షరాలుగా మారాయి. అలా ఆకు మీద ఆకు వేల కొలది ఆకులు చేరి split second లో అవి ఎంత ఎత్తకు పేరుకు పోయాయంటే…. వాటిపైన ఎవరైనా నిలబడి చూస్తే గనుక ఆ శ్మశానంతో పాటు ఊరంతా చిన్న పిల్లలు తయారు చేసుకున్న బొమ్మల్లా కనబడేలా…!

అంతెత్తుకి పేరుకుపోయిన ఆ ఎండుటాకులు అక్షరాకృతి ఏంటంటే…

“ర్… ర్… రకుతం గావాలె!…”

ఆ అక్షరాలు ఒకే ఒక సెకను పాటు నిలబాటుగా ఉన్నాయి. మరుక్షణం సన్నగా మొదలైన పెద్ద పెట్టున ఓ గాలి మోపలా భయానకంగా విన్పించిందా ధ్వని.

‘ర్… ర్… రకుతం గావాలె!….’ అంటూ స్మశానం దద్దరిల్లేలా.

ఆ శబ్దం వెలువడినపుడు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండువుతోంది. అదృశ్య దుష్టశక్తులు నిద్ర మేల్కోంటున్న సమయమది.

మునుపెన్నడూ ఎరుగని ఆ భయానక భీకర శబ్దానికి మంత్రోపాసకులు బిక్కచచ్చిపోయి ఎక్కడి వాళ్ళక్కడ బిర్రబిగుసుకు పోయారు శిలా ప్రతిమల్లా..

వణుకు తెప్పించిన ఆ ధ్వని మోతతో పాటు తక్షణం ఆ ఎండు టాకులన్నీ పెద్ద విస్పోటనం జరిగినట్టు చెల్లా చెదురయ్యాయి. ఎవరో పనిగట్టుకొని ఆ ఎండుటాకుల చర్మాన్ని క్రూరంగా బలిచినట్టు… రక్తసిక్తమై ఉన్నాయి.

అంత క్రోధంతో రగిలిపోతూ ఇన్నేండ్లకి నిద్ర లేచిందా ప్రేతాత్మ…. !!

ఎవరో హడావుడిగా రాసేసినట్టు ‘ర్..ర్… రకుతం గావాలె!…’ అనే రక్తాక్షరాలు ఆ తెల్లని సమాధిపైన ఎర్రని రక్తపు మరకల్లా చిందరవందరగా ఏర్పడ్డాయి!

***

హస్పిటల్స్ స్ట్రీట్‌లో మొదటి అంతస్తులో ఉంటుండే ‘భరత్ బ్లడ్ బ్యాంక్’ రాత్రి పదిన్నర అవుతండగా షాపు మూసే సమయానికి రింగయిన ఫోనెత్తి ‘హలో!’ అన్నాడు భరత్. అప్పటికే మనిషి బాగా అలసి పోయాడు.

అవతలి వైపు నుండి విన్పించిన విషయానికి అంత ఏసిలోనూ ఒక్క సారిగా ముచ్చెమట్లు పోసాయి భరత్‌కి. గభాల్న కర్చీఫ్ తీసి ముఖాన్ని తుడుచుకున్నాడు.

“గాబరా పడాల్సిందేం లేదు. నేను సెప్పింది నువ్విన్నది నువద్దిగానే. సిన్న సీసెడు (పావు శేరు) ఎయిడ్స్ రోగి ర్.. ర్.. రకుతం గావాలె!…” అంటూ విన్పించింది.

భరత్ మైండ్ బ్లాంకయ్యింది.

“గీ పన్జేసిపెడితే…. కోట్రూపాయలందుతయ్ మల్ల…”

“కోటి నా కివ్వడం దేనికి? ఏ ఎయిడ్స్ రోగికిచ్చినా పని సులువయిపోతంది కదా!” అన్నాడు భరత్ తేరుకొని.

స్వరం హెచ్చించి “పైసల్ గావాల్నా… సలహాల్జెప్తవా?… రేపీ టైంకి ఫోన్జేత్త మల్ల. పైసల్ నీకు రకుతం నాకు . బస్ గంతే!” పోన్ కట్టయ్యింది.

***

డబ్బు యావ కొందరు మనుషుల్నెలాంటి నీచమైన పనికైనా ఉసిగొల్పుతుంది. ఎలా కాదు… ఎంత సంపాదించామన్నది భరత్ అభిమతం. లేబర్స్ దగ్గర, ఆటో లారీ డ్రైవర్స్, రిక్షావాలాల దగ్గర తక్కువ ధరకి బ్లడ్ కొనేసి అవసరం మన్న పేషెంట్ల నుండి అధిక మొత్తం గుంజుతుంటాడు భరత్.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వెనకేసుకోగలిగాడు.

ఆ రోజు వచ్చి క్యాష్ లెక్క చూసుకుంటూ నోట్లని కట్టలు కడుతూ కూర్చున్న table పైన ఉంచుతున్నాడు. యాధాలాపంగా ఎదురుగా ఉండిన గోడ గిడియారం వంక తలెత్తి చూశాడు. అంతే ఉన్న పళంగా ఎవరో అమాంతగా లేవనెత్తి దూరంగా విసిరేసినట్టు…. భరత్ అంతెత్తున ఎగిరిపడ్డాడు. షా… షాక్! … షాక్!!

అక్కడ గడియారం లేదు. ఓ మనిషి పుర్రె వేలాడుతోంది. చిన్న ముల్లు, పెద్ద ముల్లు ఎముకలై కదలాడుతున్నాయి. తన విదిల్చి చూశాడు. మళ్ళీ గడియారం కనబడింది.

మనిషి ఉన్న పళంగా గజగజవణికి పోయాడు. నోట్లో తడారిపోయింది. చప్పున వాటర్ బాటిల్ తీసి గాజు గ్లాసులోకి వాటర్ ఒంపుకుంటుంటే తడబడి గ్లాసు చేయి తగిలి కింద పడి తునాతునాకలయ్యింది. నలువైపుల చిల్లిన నీటి తడి రక్తపు మరకల్లా అగుపించింది. చప్పున వాటర్ బాటిల్ వదిలేసాడలాగే.

భరత్ నుదుటికి పట్టిన చెమటని ఎడం చేత్తో తుడుచుకుంటున్న క్షణాన వినపడిందా శబ్దం….

చెల్లా చెదురైన గాజు ముక్కులన్నీ ప్రాణం పోసుకొని గ్లాసు పగిలిన ఇందాకటి చోటుకి వేగంగా కదిలి రాసాగాయి. ఎవరో పనిగట్టుకొని ఒక పద్ధతి ప్రకారం పేరుస్తున్నట్టు ఆ గాజు ముక్కలన్నీ కొన్ని అక్షరాల్లో ఒదిగిపోయాయి.

సన్నగా మొదలైన ఆ శబ్దం అతడి చెవులు మార్మోగేలా వినపడింది భయానకంగా… ‘ర్… ర్… రకుతం గావాలె!…’ అంటూ.

అతడి ఊపిరాగి పోయ్యిందొక్క క్షణం.

ఇంతలో సెల్ మోగింది. తీసి స్విచాన్ చేశాడు గాభరాగా.

“రకుతం…గావాలె…” వినపడిందా మాట.

“రెడీ…. చేసా….” అంటుండగానే మళ్ళీ పలికిందా స్వరం ఈసారి కటువుగా “నీ… రకుతం… గావాలె…రా…” అంటూ.

ఉలిక్కిపడ్డాడు! అసంకల్పితంగా సెల్ చేజారింది. వినపడుతూనే ఉన్నాయి ధ్వని తరంగాలు…. పదే పదే రీ ప్లే చేస్తున్నట్లు! కింద పడిన సెల్లోంచి.

ఏదో అదృశ్య శక్తి ఆదేశాన్ని శిరసావహిస్తున్నట్టుల వెర్రిగా తలుపుతూ లేచాడు. పక్కనే ఉన్న బెడ్ పైన పడుకొని నీడిల్ గుచ్చుకుంటుంటే ఆగిపోయిందా స్వరం. అప్పటి వరకు ఎవరో మంత్రించినట్టు యాంత్రికంగా పనులు చేసుకు పోతున్న భరత్, సెల్ స్వరం ఆగగానే తేరుకుని మంచం పై నుండి లేవబోయాడు.

ఒక అసమాన దృశ్యానికి సంకేతంగా టేబుల్ మీద నోట్లన్నీ రెక్కలొచ్చినట్టు ఎగుర్తూ వచ్చి భరత్ దేహంపై పడ్డాయి. అతడి చేతుల్ని, కాళ్ళని స్టిక్కర్ వేసినట్టు బలంగా అదమి పట్టాయి. లేచే ప్రయత్నం మానుకొని పిచ్చి చూపులు చూస్తుండిపోయాడలాగే.

మంచం పక్కన స్టాండుకి వేలాడుతోన్న బాటిల్ లోకి రక్తమంతా ఒక్కసారి ఎవరో గొట్టం పెట్టి బలంగా పీల్చినట్టు వచ్చేసింది అత్యంత వేగంగా, ఆరు లీటర్ల రక్తం ఏకబిగిన అతడి శరీరం నుండి వ్చచేసరికి పరిమామం సరిపోక బాటిల్ కాస్తా విస్ఫోటనం జరిగినట్టుల అత్యంత ధృతితో పగిలిపోయింది.

చుక్కలేకుండా రక్తమంతా తోడేసినట్టువడంతో బాగ నీరసపడిపోయిన భరత్… ఎందరో జీవితాలతో ఆటలాడుకున్న భరత్.. చివరిగా రక్తపు బిందువుల కోసమే పరితపించ సాగాడు. ‘ర్… ర్…. రక్తం కావాలి అంటూ మూల్గసాగాడు.

అప్రమత్తంగా ఎదురుగా గోడపై నున్న తన నిలువెత్తు ఫోటో వైపు పరికించి బలహీనమైన చూపు. ఎరైజర్‌తో తుడిచేసినట్టు అతడి రూపం లేదక్కడ. భయవిహ్వలుడై పోయాడు. ఎవరిదో అస్పష్టరూపం కనబడేసరికి అంత నీరసంలోనూ అంతెత్తున ఎగిరిపడ్డాడు.

ఆ రూపు రేఖల్ని అతి కష్టం మీద పోల్చుకుంటున్నాడు… నెమ్మదిగా గుర్తుకు వస్తోంది… యస్! అది తన రెగ్యులర్ కష్టమర్ వీరయ్య రూపం!

అ… అతను చ.. ని.. పో.. యా.. డు కదా…?!

దడుసుకున్న భరత్ శక్తి నంతా కూడదీసుకొని హృదయవిదారకంగా అరిచాడు…

“న్.. న్… నో!” అంటూ

***

పరుగు పరుగున వచ్చిన ఆటో డ్రైవర్ వీరయ్య అయాసపడుతూ “గీ రకతం గావాలి సారూ!” అంటూ భరత్ చేతిలో ఓ చీటి పెట్టాడు.

దాన్నందుకుని తలపంకించిన భరత్ – “ ‘ఏ పాజిటివ్’. సరే బదులుగా నీ రక్తం కావాలి” అన్నాడు.

తలూపిన వీరయ్య పక్కనే ఉన్న బెడ్ పైన పడుకున్నాడు.

పని పూర్తయ్యాక రక్తం బాటిలడిగితే డబ్బులిమ్మన్నాడు భరత్.

ఆశ్చర్యపోతూ “నా రకతానికి గా రకంతం సెల్లు” గదా అన్నాడు

భళ్లున నవ్విన భరత్ “భలేవాడివయ్యా వీరయ్యా! నీ విచ్చిన రక్తానికి రెండొందలు మినహాయిస్తే మిగతా ఎనిమిది వందలు కట్టాల్సిందే” అన్నాడు కరాఖండిగా.

“నా కన్నబిడ్డకు సారిది. సేతుల పైసలు గూడ లేవు. గిట్లనే మల్లొ నాల్గు సార్లు రక్తమిత్తలే..” అన్నాడు వీరయ్య, భరత్ పైసల పిశాచని తెలిసి.

ఒప్పకోలేదు భరత్.

“రేపటికి రూపుందా వీరయ్యా, డబ్బులు కట్టి తీసుకపో…”

“నన్ను నమ్ము సారూ! గోస తగులుది. నా బిడ్డ బతుకాలె సారూ!” రెండు చేతులు జోడించి కన్నీటి పర్యంతమయ్యాడు వీరయ్య. కాళ్ల మీద కూడ పడ్డాడు.

విదుల్చుకుంటూ “విసిగించకు. కాదు కూడదని మొండికేస్తే, ఇదిగో నీ రక్తపు బాటిల్ నువ్వే తీసుకపో!” అంటూ కుర్చున్న చోటు నుండి దిగ్గన లేచాడు భరత్.

బండ గుండె కరగదని తెలిసి “ఓర్నీ పైసల పిసాచీ పాణం కంటే గా పైసలే ఎక్కువైనయా… నీ రకతం గూడ గిట్లనే అమ్మకోపో… పసువా” తిడుతూ ఆందోళనగా బయటకు నడిచాడు, బిడ్డెట్లున్నదోనని తలపోస్తూ.

ఆటోని హస్పిటల్‌కి పరుగెత్తించాడు.

మనసులోని ఆలోచనలు… చెమ్మగిల్లిన కళ్ళతో అస్పష్టత… ఒకే ఒక్క సెకను ఆదమరిచిన వైనానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు వీరయ్య.

ఎదురుగా వస్తున్న లారీకి ఢీకొని ఆటో రెండు పల్టీలు కొడుతూ అల్లంత దూరన ఆగింది.

వీరయ్య… స్పాట్ డెడ్ వార్తని మర్నాడు జిల్లా పేపర్ ఎడిషన్స్‌లో చూసి షాకయ్యాడు భరత్.

***

అంత భయంలోనూ ఆ రోజు వీరయ్యకు చేసిన అన్యాయం గుర్తొచ్చి భరత్ అణువణువు తెగ వొణికి పోయింది.

అప్పుడు జరిగిందా విచిత్ర సంఘటన…

గోడ మీద ఫోటో నుండి విడివడిన వీరయ్య ఆత్మ నెమ్మదిగా కదలి ఫ్రిజ్‌లోంచి వెతికి ఓ రక్తపు బాటిల్‌ని బయటకు తీసింది. ఊపిరి బిగపట్టి చూస్తున్న భరత్‌పై ప్రాణాలు పైకే పోయాయి.

అది ఎయిడ్స్ రోగి రక్తం! కోటి రూపాయలు వస్తాయని భరత్ భ్రమిసిన బాటిల్! దాన్ని మంచం పక్క స్టాండుకి వేలాడదీసాక మాయమయ్యాందా ఆత్మ.

ఆ రక్తం భరత్‌కి అటాచ్ చేసిన నీడిల్ గుండా దేహంలోకి వెళ్తోంది. కాని విచిత్రంగా రక్త నాళాల్లోకి చేరకుండా తిరిగి చర్మరంధ్రాల్లోంచి స్వేదబిందువుల్లా రక్తం చుక్కులు చుక్కలుగా బయటకు ఎగచిమ్ముతోంది.

ఒక రంధ్రంలోంచి బయటకు వస్తూ, మరొక రంధ్రంలోకి చేరుతూ అలా అతడి చర్మం తూట్లు తూట్లుగా పొడిచిన జల్లెడ మాదిరై… చూసే వారికి భరత్ దేహాన్నెవరో రక్తపు ధారలో కుట్టేస్తున్నారోమోనన్త అతి భయానకంగా!…

మొనదేలిన సూదుల్తో శరీరాన్నెవరో ఆగకుండా గుచ్చేస్తున్న భావన కలుగుతుంటే బాధ తాళలేక భరత్ అరుస్తూ కేకలు వేస్తూ గిలగిలా కొట్టుకుంటూ చివరకు కళ్ళు తేలేసి తల పక్కకు వాల్చేస్తుండగా జరిగిందది.

కదలక ఆగి భరత్‌ని అంటి పెట్టుకుని ఉన్న చిరిగిన నోట్లన్నీ విడివడి ఎవరో విసిరేసినట్టు ఆ గది నిండా చెల్లా చెదుర్యాయి.

ఏదో అదృశ్యశక్తి ఆదేశించినట్టు తిరిగి ముక్కలన్నీ ఎగిరొచ్చి భరత్ రక్తదేహంపై ఒక దాని మీద ఒకటి పడి అక్షరాకృతి దాల్చసాగాయి.

ఆనక చిన్నగా మొదలై పెద్దపెట్టున ఓ తుఫాను మోతలా భయాందోళనగా విన్పించిందా ధ్వని…

“ర్… ర్…. రకుతం గావాలె!…” అంటూ శ్మశానపు సమాధుల్లోంచి మృత కళేబరాలు సైతం ఉలిక్కిపడి నిద్ర లేచేలా!!

అప్పుడాగి పోయిందతడి గుండె.

Exit mobile version