[లుసిల్లే క్లిఫ్టన్ రచించిన అనే ‘won’t you celebrate with me’ ఆంగ్ల కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Lucille Clifton’s poem ‘won’t you celebrate with me’ by Mrs. Geetanjali.]
~
[dropcap]అ[/dropcap]వును.. చెప్పు.. పండగ చేసుకొవూ నాతో కలిసి!
రా.. నా దగ్గరికి?
నేను సాధించుకున్న ఈ ఉన్నతమైన జీవితాన్ని..
ఏ నమూనాలూ.. నకలూ లేకుండా..
ఒక ప్రత్యేకమైన జీవితాన్ని పొందినందుకు..?
బేబీలాన్‌లో ఒక నల్ల జాతి స్త్రీగా పుట్టినందుకు..
ఏ అవకాశాలు లేకుండా..
ఒక్క నన్ను నేను తప్ప
ఇంకేమి చూడగలిగానని చెప్పు..?
అయినా కానీ నేను సాధించాను..
ఇక్కడ ఈ బ్రిడ్జి మీద నక్షత్ర కాంతికి..
నల్లని మట్టికి మధ్య ..
ఒక చేయి నా మరో చేతిని
గట్టిగా బంధించినట్లే పట్టుకుని నేను..
ఆనందంగా.. స్థిరంగా నిలబడి ఉన్నప్పుడు..
..నువ్వు నాతో కలిసి పండగ చేసుకోవడానికి రావూ?
ఆశ్చర్యపోతావు ఎందుకు??
సరే.. ఎందుకు నువ్వు వచ్చి
నా ఆనందాన్ని పంచుకోవాలో ఇక చెప్పేస్తాను!
ఎందుకంటే.. విను! ప్రతి రోజూ, నన్ను
నా చుట్టూ ఉన్నది ఏదో ఒకటి
చంపేయాలని అనుకుని నా దగ్గరికి వచ్చేదా..?
కానీ నన్ను నాశనం చేయడం సాధ్యం కాక
ఓడిపోయి వెనక్కి వెళ్లిపోయేది..
ఎంత పెద్ద విజయం అది? అదన్న మాట ..
అందుకే నువ్వు నాతో కలిసి
ఉత్సవం చేసుకోవడానికి రావాలి..
ఎందుకంటే నేను విజేతను కాబట్టి.
నీకు ఇంకా విశదంగా చెబుతా విను!
బాబీలోన్ నదీతీరాన మేము కూర్చుని
జియోన్లను జ్ఞాపకం చేసుకుంటూ
ఏడుస్తూ ఉండేవాళ్ళం.
అక్కడ చీనారు వృక్షాల మీద
మా వీణలను అందకుండా కట్టి పడేసే వాళ్ళం!
ఎందుకంటే మమ్మల్ని బంధించిన వాళ్ళు
మమ్మల్ని పాడమని వేధించే వాళ్ళు..
అది కూడా ఆనందంతో పాడే పాటలు!.
“మా కోసం ఒక జియోను పాట పాడండి”..
అని గద్దించే వాళ్ళు!
అసలు మాది కాని ఈ పరాయి దేశంలో ఉంటూ
యెహోవా పాటలను ఎట్లా పాడగలం చెప్పు?
మేము పాడలేదు..
వాళ్ళు మాతో పాడించలేక ఓడి.. వెళ్లిపోయారు
ఎంత అద్భుతమైన విషయమో కదా ఇది!
ఇక ఇప్పుడు నమ్ముతావు కదూ..
మరి రా నాతో పండగ చేసుకుందాం!
~
మూలం: లుసిల్లే క్లిఫ్టన్ (Lucille Clifton)
అనువాదం: గీతాంజలి
లుసిల్లే క్లిఫ్టన్ (27 జూన్ 1936 – 13 ఫిబ్రవరి 2010) న్యూయార్క్‌లోని బఫెలోకి చెందిన అమెరికన్ కవయిత్రి, రచయిత్రి, విద్యావేత్త. 1979 నుండి 1985 వరకు ఆమె మేరీల్యాండ్ Poet Laureate గా ఉన్నారు. కవిత్వానికిచ్చే పులిట్జర్ ప్రైజ్ కోసం క్లిఫ్టన్ రెండుసార్లు ఫైనలిస్ట్.