రాతిరి రంగస్థలం

5
2

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘రాతిరి రంగస్థలం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]రా[/dropcap]తిరి రంగస్థలం మీద
దర్జాగా తిష్టవేసి కూచుంటే చీకటి
వెలుగుల చిరునవ్వులు నవ్వుతూ
అడుగెట్టింది చిన్నారి దివ్వె ఒకటి
అ వెలుగుల పచ్చదనానికి
కళ్ళు పచ్చబడ్డాయేమో, ఒళ్ళు వెచ్చబడిందేమో
ఆసనాన్ని వదిలి, ఆ స్థలాన్నుంచి కదిలి
దూరదూరంగా
మూలమూలల్లోకి పారిపోయింది చీకటి

ఉక్రోషంతోనో,
మరి ఓడిన ఉన్మాదంలోనో
ఏ మేఘసందేశం పంపిందో
ఏ మూగ హిందోళగీతం పాడిందో
ఉరుకుల పరుగుల మీద
చెలుని సాయానికై రివ్వున ఎగిసొచ్చింది
చీకటి నేస్తం చల్లని చిరుగాలి
దివ్వెల వెలుగులపై ప్రకటించింది
ఆకస్మికదాడిని విసురుగా పైపైకి వాలి

చెదరిపోతున్న వెలుగుల వలువలను
గట్టిగా పట్టేసుకుని
చుట్టుగా కట్టేసుకుని,
చుట్టగా చుట్టేసుకొని,
వత్తిగిలి పడుకుని ఉన్న వత్తిని పైకి లాక్కుని
చేరువలోని చమురుని చకచకా పీల్చుకుని
రెపరెపల పలుకలుగా
ఎర్రెర్రని కాంతులు కక్కసాగింది దివ్వె
వేడిపొగల బుసలతో
భగ్గుభగ్గు మంటలను పుక్కిలించసాగింది దివ్వె

గాలిచెలి సాయంతో దివ్వెను ఆర్పాలనే
చీకటికి రాతిరంతా చెలగాటం
దినదినగండంగా క్షణభంగుర జీవనంగా
దివ్వెకు రేయంతా ప్రాణసంకటం
అనుక్షణం పోరాటం.. అస్తిత్వానికై ఆరాటం

సుప్రభాత లలిత స్వరాల నేపథ్యంలో
ఉషోదయం తూరుపు పొదచాటునుండి
కిరణశరాలు గురిచూసి వేసీ వేయకుండానే
చావుకేకలు పెడుతూ చల్లగా జారుకుంది చీకటి
రాతిరయితే గాని మరి తెలియదు
ఆ చీకటి చచ్చిందో? లేక బతికుందో?

రాతిరి రంగస్థలంపై తన కొలువు
ఈరోజుకు ఇక ముచ్చటగా ముగిసిందని
కొండెక్కింది కొంటెకోణంగి దివ్వె
కోటి నిట్టూర్పులు తృప్తిగా విడుస్తూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here