[box type=’note’ fontsize=’16’] “వొక అతి సున్నిత మనస్కురాలైన అమ్మాయి క్రమంగా యెలా మారుతుంది, యెలాంటి సంఘర్షణలకు లోనవుతుంది, అన్నీ చాలా ప్రతిభావంతంగా ప్రదర్శించిన సినిమా రాజీ. ఇది సస్పెన్స్ ధోరణిలో వుండటం వొక కారణం, మనం కళ్ళు తిప్పకుండా చూస్తాం” అంటూ “రాజీ” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]
[dropcap]గు[/dropcap]ల్జార్, రాఖీల కూతురు మేఘనా గుల్జార్. ఇప్పుడామె దర్శకురాలు. మొదట్లో చూసిన చిత్రాలు నాకు అంతగా ఆకర్షించకపోయినా 2016లో వచ్చిన “తల్వార్” మాత్రం బాగా నచ్చింది (విశాల్ భారద్వాజ్ స్క్రీన్‌ప్లే వొక కారణం). ఇప్పుడొచ్చిన ఈ “రాజి” కూడా. ఇప్పుడిక ఆమె కూడా విస్మరించడానికి వీలులేని దర్శకురాలయ్యింది.
హరీందర్ సిక్కా వ్రాసిన “కాలింగ్ సెహ్మత్” ఆధారంగా తీసిన చిత్రమిది. దీని కథ నిజంగా జరిగిన ఘటనల ఆధారంగా అల్లినది అంటారు. కాలం 1971. హిదాయత్ ఖాన్ (రజత్ కపూర్) వొక భారతీయ ఇంటెలిజెన్స్ ఏజంటు. అతని స్నేహితుడు పాకిస్తాన్ ఆర్మీ బ్రిగేడియర్ సయ్యద్ (శిశిర్ శర్మ). తనకు కేన్సర్ సోకిందనీ, యెక్కువ బతకడనీ, తమ స్నేహాన్ని పురస్కరించుకుని తన కూతురు సెహ్మత్ (ఆలియా భట్) ను సయ్యద్ కొడుకు ఇక్బాల్ కు ఇచ్చి చేద్దామని వుంది, అభ్యంతరం లేకపోతే అంటాడు. అలా ఆ పిల్లలకు వివాహం నిశ్చయమవుతుంది. హిదాయత్ మనసులో వున్నది వేరు. తను, తన తండ్రి భారత దేశం కోసం అన్నీ త్యజించినవాళ్ళే. ఇక ఈ పని ముందుకు సాగాలంటే తనకున్న వొకే వొక్క కూతురు 20యేళ్ళ విద్యార్థిని మీద వేయక తప్పదనుకుంటాడు. ఆమెను దగ్గర కూర్చోబెట్టి వివరంగా చెబుతాడు. ఆమెలో కూడా ప్రవహించేది అదే రక్తం కాబట్టి ఇష్టంగానే వొప్పుకుంటుంది. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ అధికారి దగ్గర శిక్షణ పొందుతుంది సెహ్మత్. వివాహమయ్యాక పాకిస్తాన్‌లో అత్తవారింట అడుగు పెట్టిన క్షణం నుంచే ఆమె పని, తన దేశానికి హాని తలపెట్టే ఆ దేశపు వ్యూహాలు యెలా వున్నాయి లాంటివి తెలుసుకోవడం మొదలు పెడుతుంది. వొక పక్క ఆ ఇంట్లో అందరి మన్ననలు పొందుతూనే మరో పక్క ఆ దేశం ఘాజి ని ఉపయోగించి ఐ ఎన్ ఎస్ విక్రాంత్ మీద జరపబోయే దాడి వివరాలు తెలుసుకుని ఇండియాకు చేరవేస్తుంది. (తెలుగులో ఘాజి చిత్రం వచ్చింది ఇదే అంశం మీద.) ఆ ఇంట్లో పనిచేస్తున్న అబ్డుల్ (ఆరిఫ్ జకాఇయా) మాత్రం మొదటినుంచే ఆమెను అనుమానంగా చూస్తుంటాడు. ఇవన్నీ దాగే విషయాలు కాదు కదా. మిగతా కథంతా ఆమె తను పట్టుబడకుండా తన పని యెలా నెరవేరుస్తుందో వివరిస్తుంది.
ఇది సస్పెన్స్ ధోరణిలో వుండటం వొక కారణం, మనం కళ్ళు తిప్పకుండా చూస్తాం. అయితే మొదలైన కాస్సెపట్లోనే మెదడునిండా సవా లక్ష ప్రశ్నలూ, ఆలోచనలూనూ. ఇదేమిటి పాకిస్తాన్ ను శత్రు దేశంలా చూపించలేదు. మన దేశం పట్ల వున్న భక్తిని భూతద్దాలతో చూపించలేదు. ఆమెకు అన్నిటి కన్నా దేశమే ప్రధానం అనుకున్నప్పుడు తన చేత హత్యలు జరిగినప్పుడు ఆమె ఆకులా వణికిపోవడమేమిటి, గర్వంతో చాతీ పొంగాలి గాని. రహస్యం బయట పడ్డాక ఆమె భర్త తండ్రితో అంటాడు: ఆమె తన దేశం కోసం పోరాడుతుంది, మనం మన దేశం కోసం పోరాడినట్లే. అదేమిటి పరస్పర శత్రువులైనా అవ్వాలి, పరస్పర ప్రేమ వున్న భార్యా భర్తల్లా అయినా వుండాలి; రెండూ వుంటే యెలా. మన మనసులో దేశభక్తికి సంబంధించి యెప్పుడూ సవాలు చేయని భావజాలాలన్నీ ప్రక్షాళన పొందుతాయి. మనుషులను కేవలం పౌరులుగా కాకుండా మానవీయ విలువలున్న మనుషులుగా, లోలోన మానసిక సంఘర్షణ పడుతున్న వ్యక్తులుగా చూస్తాం. దేశభక్తి అంటే ఇతర దేశాలను ద్వేషించడమా? దేశాలమధ్యనున్న సరిహద్దులకు అతీతంగా యేదీ వుండదా? ఇలాంటివన్నీ వెంటాడుతాయి ప్రేక్షకుడిని. మనం చూసిన ఇలాంటి సినిమాలన్నిటికీ భిన్నంగా వుంది.
ఇంతకు ముందు చిత్రానికి స్క్రీన్‌ప్లే మరో గొప్ప దర్శకుడు వ్రాశాడనుకున్నాము కదా. దీనికి స్క్రీన్‌ప్లే మేఘనా గుల్జార్ భవాని అయ్యర్ తో కలిసి వ్రాసింది. కాబట్టి తన సామార్థ్యాలను అన్ని విధాలా నిరూపించుకున్నట్టయ్యింది. చాలా సూక్ష్మంగా పరిశీలనలు చేసి, ఆ పీరియడ్నీ, ఆ సన్నివేశాలనీ చిత్రీకరించింది. మొదటి మార్కు ఆవిడకే. ఆమె తర్వాత క్రెడిట్ ఆలియా భట్ దే. హైవే, ఉడతా పంజాబ్ లాంటి చిత్రాలలో అద్భుతంగా నటించిన ఆమె ఇందులో కూడా చాలా బాగా చేసింది. వొక అతి సున్నిత మనస్కురాలైన అమ్మాయి క్రమంగా యెలా మారుతుంది, యెలాంటి సంఘర్షణలకు లోనవుతుంది, అన్నీ చాలా ప్రతిభావంతంగా ప్రదర్శించింది. యెక్కువ సంభాషణలు లేకుండానే, తన తీక్షణమైన చూపులతో ఆ ఇంటి నౌకరుగా ఆరిఫ్ జకారియా కూడా. ఇక రజత్ కపూర్, శిశిర్ శర్మ, జైదీప్ అహ్లావత్ లు కూడా చాలా బాగా చేశారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆలియా భట్ భర్తగా చేసిన విక్కీ కౌషల్ గురించి. మసాన్ లో వో అమాయక టీనేజర్ ప్రేమికుడుగా, రమణ్ రాఘవ్ లో కరడుగట్టిన ఏ.సి.పి గా చేసి మెప్పించాడు. ఇందులో కూడా మొదట్లో ఆ భార్యాభర్తల మధ్య మౌనాలు దూరాలు వుంటాయి. ప్రేమ అంకురించడం సమయం తీసుకుంటుంది. ఇద్దరు వొకరికొకరు పూర్తిగా కొత్త, వేర్వేరు దేశస్థులు కూడానూ. అతనేమో చాలా నెమ్మది, సున్నితం. భార్య గురించి తెలిసిన తర్వాత విలవిలలాడిపోతాడు, యేడ్చేస్తాడు. అంత ప్రేమ. కానీ తనూ తన దేశానికి కట్టుబడి వుంటాడు. ఈ complexities అన్నీ చాలా బాగా వ్యక్తపరుస్తాడు. చూసినవాళ్ళకి “పింజర్” చిత్రంలో మనోజ్ బాజ్పాయి గుర్తుకు రావచ్చు. ఇతని నుంచి కూడా గొప్ప చిత్రాలు ఆశించవచ్చు. పాటలు బాగున్నాయి. శంకర్ ఎహసాన్ లాయ్ ల సంగీతమూ. గుల్జార్ పాటల గురించి చెప్పేదేముంది! దిల్బరో పాట గాని, అయ్ వతన్ పాట గాని చాన్నాళ్ళపాటు గుర్తుండి పోతాయి. ముఖ్యంగా ఆ అయ్ వతన్ పాట చూడండి, అది యే దేశపు జాతీయ గీతంగా అవలీలగా ఇమిడిపోగల రచన. వొక రకంగా అది ఈ సినెమా ఆత్మను కూడా ఆవిష్కరిస్తుంది. వీలైతే తప్పక చూడండి.