Site icon Sanchika

రేడియో నేస్తం

[dropcap]మా[/dropcap] చిన్నతనంలో రేడియో ఒక నేస్తం. వివిధ భారతిలో పాటలు వినటమంటే మనసుకు ఎంతో ఆహ్లాదం. ఉదయం పూట జనరంజనిలో పాటలు వింటూ కాలేజికి తయారవ్వడం హుషారుగా ఉండేది. 9.30కు పాటలు పూర్తయ్యేలోపు తయారై ఇంటి నుంచి బయటపడి పావుగంటలో కాలేజికి చేరిపోయే వాళ్ళం. రేడియోలో వచ్చే పాటలకు గొంతు కలుపుతూ మనమే అంత బాగా పాడుతున్నట్లు ఫీలై పోయేవాళ్ళం. పాట రాబోయే ముందు వచ్చే మ్యూజిక్‌ను బట్టి రాబోయే పాట ఏమిటో చెప్పేవాళ్ళం. అందరికీ ఇది వచ్చేది కాదు. ఆ పాట కరెక్టయితే ఏనుగు అంబారి ఎక్కినంత సంతోషం. ఆదివారం నాడయితే అక్కలు, అన్నలు అందరూ కూర్చుని ఇలా రాబోయే పాటను ఉహించే పోటీలు పెట్టుకునే వాళ్ళం. ఎవరు ఎక్కువగా పాటల పేర్లు చెపితే వాళ్ళు గెలిచినట్లుగా చెప్పేవారు. గెలవటం కన్నా పాటలు గుర్తుపట్టటంలో తెలివి ఉందని పక్కవాళ్ళు గొప్పగా చూస్తుంటే అదో తియ్యని అనుభూతి.

రేడియోలో పాటలు వినడమే కాదు, ఆ పాటలు పాడాలని ప్రయత్నించేవాళ్ళం. దాని కోసం రేడియోలో ఆ పాట వచ్చినపుడు పెన్నూ పుస్తకం దగ్గర పెట్టుకొని రాసుకునే వాళ్ళం. ఒకసారికే రాయడం కుదిరేది కాదు. మూడు నాలుగు సార్లు వచ్చాక గానీ పాట రాయడం పూర్తయ్యేది కాదు. అప్పుడు మేడ మీదకు వెళ్ళి ఆ పాటను పాడి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. పాట బాగా వచ్చాక ఇంట్లో పాడి వినిపించాక, ఎవరింట్లో పేరంటం వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఆ పేరంటంలో ముగ్గురు నలుగురం పాడేవాళ్ళం. వాళ్ళలో ఎవరిదీ బాగుందని మెచ్చుకున్నారు! ఎవరిదీ ఓ మోస్తరుగా ఉందన్నారు! అన్నీ మిగతా వారి మాటల్ని బట్టి పెద్ద సింగర్‌లా ఆనందపడే వాళ్ళం.

మా ఇంట్లో మా అమ్మ బాగా పాడుతుంది. అమ్మా తనతో పాటు నన్నూ పాడమనేది. సినిమా పాటలయితే నేనే పాడాల్సి వచ్చేది. రేడియోలో ఎక్కువ సార్లు వచ్చే పాటలన్నీ పాడాలని ప్రయత్నించినవే. ఆకలి రాజ్యంలోని ‘సాపాటు ఎటూ లేదు’ అన్న పాట అప్పట్లో బాగా ఆకర్షించింది. ఇంట్లో వాళ్ళు ఇలాంటి పాటలు పెద్దగా ఇష్టపడేవారు కాదు. సంగీత ప్రధానమైన పాటలు పాడమనేవారు.

శంకరాభరణం సినిమా పాటలు అంటే ఇంటిల్లిపాదికి ఇష్టం. అప్పట్లో సీతార, ఆనందభైరవి, సప్తపది, శృతిలయలు వంటి సంగీత ప్రధానమైన సినిమా పాటలు రేడియోలో వస్తుంటే  తన్మయత్యంలో మునిగి తేలేవారు. మా అమ్మ కూడా పని పక్కన పెట్టి పాటలు వినేసి వెళ్ళేది.

మా అమ్మ ప్రతిరోజూ మద్యాహ్నం వచ్చే స్త్రీల కార్యక్రమాలు, పాటలు వినేది. శ్రీరంగం గోపాల రత్నం గారు పాడిన పాటలు మధ్యాహ్నం వచ్చేది. అప్పట్లో మధ్యాహ్నం పూట వచ్చే నాటికలన్ని స్త్రీలకు సంబంధించినవే ఉండేవి. అందులో ఎక్కువగా కుటుంబ నియంత్రణకు సంబందించినవే ఉండేవి. ఆ తర్వాత రాత్రి పూట 8,9 గంటలకు నాటికలు వస్తుండేవి. మా అమ్మా వాటిని వింటూ ఉండేది. మా అమ్మా పుస్తకాలు చదవటం కన్నా రేడియోలోనే ఎక్కువగా వినేది.

క్రికెట్ పోటీల స్కోర్లు వినడానికి మగపిల్లలు చిన్న ట్రాన్సిస్టర్ రేడియోలు చేతిలో పెట్టుకునేవారు. కొంతమంది అల్లరి పిల్లలు కాలేజీలకు రేడియోలు తీసుకుపోయి క్రికెట్ స్కోర్లు వింటుండేవారు ‘వాడా! రేడియోని చెవికి వేలాడేసుకొని తిరుగుతాడు’ అంటూ రేడియో వెంటబెట్టుకు తిరిగే అబ్బాయిల్ని ఎగతాళిగా అనేవారు.

పొద్దస్తమానూ రేడియో వెంటేసుకు తిరిగేవాళ్ళను పెద్దవారు ‘పనిపాటా చెయ్యరని’ అనేవారు. ఈ కాలమైన అతిగా ఏ వస్తువుకైనా అతుక్కుపోతే అలాగే ఉంటుందనుకుంటాను. రేడియో, చెవి ఫోన్, వస్తువు ఏదైనా అతిగా చూడటం అనర్థం. ఇప్పుడు పిల్లల్ని ఫోన్ అతిగా వాడుతున్నారన్న విమర్శను చేస్తున్నాం కదా! ఆ రోజుల్లో కూడా ఇంట్లో పని వదిలి, మనుష్యులతో మాట్లాడకుండా రేడియోలో మునిగి పోయేవాళ్ళను విమర్శించేవారు. ఏ పనైనా ఏ ఆటవిడుపైనా సమయానుకూలంగా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు.

ఆహ్లాదనికే కాదు విషాదానికి రేడియోనే ఉపయోగ పడేది. దివిసీమ తుఫాన్ల సమయంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే రేడియోనే. తుఫాను హెచ్చరికలు రేడియో ద్వారానే విన్నాం. దివిసీమ శవాల దిబ్బగా మారిందని విని కంటతడి పెట్టనివారు లేరు. అలాగే నేను డిగ్రీ చదువుతుండగా ప్రధాని ఇందిరాగాంధీ గారు మరణించిన విషాద సంఘటన రేడియోలోనే విన్నాం. ఇలా విషాదాలకూ, ఆహ్లాదాలకూ రేడియోనే అందరికి నేస్తం.

Exit mobile version