రహస్య(o) ఛేదనం

1
2

[dropcap]జీ[/dropcap]పు దిగి గబగబ స్టేషన్ లోకి అడుగు పెట్టాడు పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్. ఆ సమయానికి టేబుల్ మీద తలవాల్చి గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు కానిస్టేబుల్ రత్నారావు.

ఆ దృశ్యం చూడగానే ఎస్సైకి కోపం బుస్సున ముంచుకొచ్చింది. తన సీటు దగ్గరికెళ్లి కుర్చీని బరబరమంటూ దగ్గరకు లాక్కొని అందులో దబ్బుమంటూ కూలబడ్డాడు. ఆ శబ్దానికి కూడా రత్నారావు అటుఇటు కదిలాడే కానీ మేల్కొన్న పాపాన పోలేదు. దాంతో మరింత కోపం పెరిగింది ఎస్సైకి.

కాలింగ్ బెల్‌ను గట్టిగా కొడుతూ… “రైటర్, ఎక్కడ చచ్చావ్? ఇలా వచ్చి తగలడు” అంటా గట్టిగా గాండ్రించాడు.

ఆ సమయానికి బాత్‌రూమ్‌లో చేరి తీరిగ్గా సిగరెట్ పీలుస్తున్నాడు స్టేషన్ రైటర్. ఆ అరుపుకు సిగరెట్‌ను కిందపడేసి ప్యాంటును సరిచేసుకుంటూ పరుగు పరుగున వచ్చి ఎస్సై ముందు నిటారుగా నిలబడి సెల్యూట్ చేశాడు.

“ఏం జరుగుతోందయ్యా ఇక్కడ? అసలిది స్టేషనేనా? ఒక్కరికైనా బాధ్యత ఉందా, ఆ…” అంటూ హుంకరించాడు.

అతని మాటలు పూర్తికాక మునుపే నిద్రపోతున్న రత్నారావును మోచేత్తో పొడిచి నిద్రలేపే ప్రయత్నం చేశాడు రైటర్. దాంతో నిద్రమత్తుతోటే లేచి నిలబడి ఎస్సైకి సెల్యూట్ చేశాడు రత్నారావు.

“ఏంటయ్యా ఇది? డ్యూటీలో ఉన్నాననుకున్నావా? మీ ఇంటి బెడ్‌రూమ్‌లో నిద్రపోతున్నాననుకుంటున్నావా? గవర్నరు బందోబస్తు కోసం మేము బయట డ్యూటీలు చెయ్యలేక చచ్చిపోతుంటే, స్టేషన్లో మీకెట్లా హాయిగా నిద్రపడుతోందో, ఏమిటో?! అస్తమానం ఇలా నిద్దట్లో జోగకపోతే, ఏ కేసునైనా సాల్వ్ చేద్దామనో, లేదూ ఏదైనా పెండింగ్ కేసును కంప్లీట్ చేసి క్లోజ్ చేద్దామనో ఉండదు. ఆ బుర్రలో అంత తెలివుండి ఏడిస్తేగా! ఎప్పుడూ నిద్రా, నిద్రా…” అని విసుక్కున్నాడు ఎస్సై.

“సారీ సర్, రాత్రి ఆస్పత్రిలో మా అమ్మాయికి డెలివరీ కష్టమయ్యి…” అంటూ రత్నారావు ఇందకేదో చెప్పటానికి ప్రయత్నిస్తుంటే… “ఆ కథలన్నీ నాకు చెప్పమాకు. నాకూ ఉన్నాయి బోలెడన్ని ఫ్యామిలీ కష్టాలు… నేనెవరికెళ్లి చెప్పుకోనూ? ఆ…” అంటూ రత్నారావును కసురుకున్నాడు ఎస్సై. దాంతో మరి నోరు మెదపకుండా మౌనం వహించాడతను.

“అవన్నీ పక్కన పెట్టు. ఫారెస్ట్ వాళ్లకు మన హెల్ప్ కావాలిట. ‘ఆక్సిడెంట్ అండ్ కాప్చ్యూర్డ్ వెహికల్స్’ ఆక్షన్ ఇంకో గంటలో మొదలు పెట్టబోతున్నారట. నువ్వు వెంటనే అక్కడికెళ్లు. నీకు కంపానియన్‌గా వెస్ట్ నుండి ఇంకో కానిస్టేబుల్ కూడా వచ్చి నీతో జాయినవుతాడు. అక్కడ డ్యూటీ ముగించుకొని పన్నెండుకల్లా స్టేషన్ కొచ్చేయాలి, అర్థమైందా? ఊ, క్విక్ వెంటనే బయలుదేరు…” అంటూ గబగబ ఆర్డరు ప్యాస్ చేశాడు ఎస్సై.

“యస్సార్…” అంటూ మారుమాట్లాడకుండా ఎస్సైకి సెల్యూట్ చేసి స్టేషన్నుండి బయటపడ్డాడు రత్నారావు.

***

రత్నారావు స్పాట్ కు వెళ్లేసరికి, అక్కడ ఆరుబయట ఒక షామియానా వేసుండటం కనిపించింది. ఆక్షన్లో వెహికలు కొనటానికొచ్చిన కొంతమంది వ్యక్తులు షామియానా క్రిందున్న కుర్చీలలో కూర్చొని కనిపించారు. వాళ్లకు ఎదురుగా ఒక టేబుల్, దాని వెనక ఒక ఎగ్జిక్యూటివ్ చెయిర్, దానికిరువైపులా కొన్ని మామూలు చెయిర్లు వేయబడి ఉన్నాయి. టేబుల్ మీద ఒక చక్కటి టేబుల్ క్లాత్ పరచబడి దానిమీదొక ఫ్లవర్‌వాజ్, ఒక మోస్తరు గంట, కొన్ని వాటర్ బాటిళ్లూ ఉన్నాయి.

ఫారెస్టాఫీసర్ గదిలోకి అడుగుపెట్టి ఆఫీసరు సెల్యూట్ చేశాడు రత్నారావు. అతడు సెల్యూట్‌ను రిసీవ్ చేసుకుంటున్నట్టుగా ఒక చిర్నవ్వు నవ్వాడు. అప్పటికే అక్కడ వెస్ట్ కానిస్టేబుల్ యాచేంద్ర నిలబడి ఉండటం కనిపించింది.

“మీ అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. ఇవ్వాళ ఆక్షన్ పాడేవాళ్లు కూడా కొంతమందే వచ్చారు. అయినా ఎందుకైనా మంచిదని పిలిపించాను. ఎంతమంది వచ్చినా సెక్యూరిటీ అన్నది ముఖ్యం కదా? ఎటూ అక్కడ మావాళ్లు ఉండనే ఉంటారు, వాళ్లతోపాటు మీరూ ఉంటే సరిపోతుంది. ఓకే! బయటుండండి, ఇంకో ఐదు నిమిషాల్లో ఆక్షన్ మొదలు పెట్టేస్తాం” అనగానే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లూ నవ్వుతూ ఆ ఆఫీసర్‌కు మరోమారు సెల్యూట్ చేసి గదిలో నుండి బయటికొచ్చారు.

“ఏం యాచేంద్రా ఎలా ఉన్నావు? అంతా హ్యాపీనే కదా?” అంటూ పలకరించాడు తనతోటి కానిస్టేబుల్‌ను.

“ఏం హ్యాపీనో, ఏమో రత్నం! మన డిపార్ట్‌మెంట్‌లో హ్యాపీ అంటూ ఉండేది పైవాళ్లకే కానీ, మనక్కాదుగా” నిట్టూర్చాడు.

“ఊ ఊ… నీలో ఇంకా ఆ ‘పోలీస్ కానిస్టేబుల్’నన్న చీప్ ఒపీనియన్ పోనట్టుంది. రిటైరయ్యేలోపు కచ్చితంగా నువ్వూ ఒక పోలీసాఫీసరు వవుతావులే, బాధపడకు!” అంటూ అతణ్ణి ఓదారుస్తూ వెళ్లి ఆక్షన్ పాడేవాళ్ల వెనక నిలబడ్డారిద్దరూ.

ఆఫీసు ప్రాంగణమంతా పచ్చటి చెట్లతో కళకళలాడుతోంది. ఆఫీసర్ గది ముందు రకరకాల పూలమొక్కలు వయ్యారాలు పోతున్నాయి. ఆయన గది పక్కగా ఉన్న రేకుల షెడ్లో స్టాఫ్ వెహికల్స్ పార్కింగ్ చేయబడి ఉన్నాయి. దానికి మరోపక్కన, ప్రమాదాల బారినపడ్డ, వివిధ సందర్భాల్లో పట్టుబడ్డ వెహికల్స్ కొన్ని వరుసగా నిలబెట్టబడి ఉన్నాయి. వాటిలో టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్, ఫైవ్ వీలర్స్ (అదే లెండీ… స్టెప్నీతో కలిపి) ఉన్నాయి.

నిన్నటిదాకా ఆ వెహికల్స్‌ను పట్టించుకునే నాథుడే లేడు. అవన్నీ పాతబడి, దుమ్మూ ధూళీ పేరుకుపోయి, చక్రాల్లో గాలి లేక, వాటి మధ్యన ఏవేవో పిచ్చిమొక్కలు మొలిచి ఉన్నాయి. ఇవ్వాళ ఆక్షన్ ఉందన్న కారణంగా వాటిమీద వాటర్ పైప్‌తో నీళ్లు పట్టినట్టున్నారు. ఇప్పుడవి కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాయి.

అక్కడున్నవాళ్ల ఉత్సాహం చూస్తోంటే ఎలాగైనా చీప్‌గా వెహికలను కొ(ట్టే)నేయ్యాలన్న ఆతృత కనిపిస్తోంది.

ఇంతలో… అక్కడికి ఒకవ్యక్తి కుంటుకుంటూ వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు. నల్లని ముఖం, సన్నని శరీరం, చెదిరిన జుత్తు, నలిగిన బట్టలు… అతణ్ణి ఎక్కడో చూసినట్టుగా అనిపించింది రత్నారావుకు.

గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నించాడు. ఆ… గుర్తొచ్చింది!

రెండు నెలల క్రితం ఒక రోజు… ఆ ఊళ్లోనే బడా రాజకీయ నాయకుడైన పాండురంగం తమ స్టేషన్ కొచ్చాడు. అతని పనివాళ్లు ఒకవ్యక్తి చేతుల్ని వెనక్కు విరిచికట్టి లాక్కుంటూ వచ్చారు. అతను చాలా బలహీనంగా ఉన్నాడు.

పాండురంగం అతణ్ణి ఎస్సై ముందు నిలబెట్టి… “వీడు మా ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. దొంగిలించిన వస్తువులేవిరా అంటే ఏమీ చెప్పనంటున్నాడు. ఇతనిమీద కేస్ బుక్ చేసి, మీ స్టైల్లో నాలుగు తగిలించారంటే అప్పుడు బయటికొస్తాయి విషయాలన్నీ!” అన్నాడు ఆవేశంగా.

“ఏం దొంగతనం చేశాడు?” ఆ దొంగను ఎగాదిగా చూస్తూ అడిగాడు ఎస్సై.

“బంగారం! పది సవర్ల నగలు ఎత్తుకెళ్లాడు” అక్కసుగా అన్నాడు పాండురంగం.

“రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు అంటున్నారుగా, మరి నగలేవీ దొరకలేదా?” ఆశ్చర్యంగా అడిగాడు ఎస్సై.

“లేదు! అదే ఆశ్చర్యంగా ఉంది! ఆ కాసేపట్లోనే వాటిని ఎక్కడ దాచాడో మరి. ఎంత కొట్టినా చెప్పనంటున్నాడు.”

ఎస్సై లేచి ఆ దొంగ దగ్గరికెళ్లి అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ….“నీ పేరేమిట్రా?” అని అడిగాడు కర్కశంగా.

“కాశీం సార్!” అన్నాడతను భయం భయంగా.

“మర్యాదగా ఆ నగల్ని ఎక్కడ దాచావో చెప్పు? లేకుంటే ఇక్కడే రక్తం కక్కుకుని చస్తావ్, చెప్పూ!” అన్నాడు క్రూరంగా. అతను బెదురు బెదురుగా ఎస్సైని చూస్తూ… “నిజంగా నాకేమీ తెలియదు సార్!” అన్నాడు.

“తెలియదూ… ఓకే! నీ నుండి నిజం ఎలా రాబట్టాలో నాకు తెలుసులే! కానిస్టేబుల్, ఇతణ్ణి సెల్‌లో వేసి జీరో డిగ్రీని అప్లై చెయ్యండి. అప్పుడు నిజమెలా చెప్పకుండా ఉంటాడో అదీ చూస్తా” అన్నాడు పంతంగా ఎస్సై.

తర్వాత పాండురంగం వైపుకు తిరిగి. “మీరొక కంప్లైంట్ రాసిచ్చి వెళ్లండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. మరేం దిగులుపడకండి. మీ నగలు మీకు చేర్చే బాధ్యత నాది!” అని అతనికి హామీ ఇస్తున్నట్టుగా అన్నాడు ఎస్సై.

ఈలోపు కానిస్టేబుల్ రత్నారావు ఆ ‘దొంగ’ను సెల్ లో పెట్టి లాక్ చేశాడు. ఆనాడు డ్యూటీలో ఉండి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా రత్నారావుకు అర్థమైందేమిటంటే – ఆ దొంగ దొంగతనం చేసి ఉండడనికి కారణం, అతను ఆ కుంటికాలును పెట్టుకుని దొంగతనం చేసి పారిపోవటమన్నది అసంభవం! నమ్మశక్యంగా లేదు.

ఆ మరునాడు జరిగిన సంఘటన మరింత ఆశ్చర్యాన్నీ, అయోమయాన్ని కలిగించాయి రత్నారావుకు.

మరునాడు, పాండురంగం కొడుకు స్టేషన్ కొచ్చి, “నిన్న మీరు సెల్‌లో పెట్టిన వ్యక్తికి నేను బెయిల్ తీసుకొచ్చాను. దయచేసి అతణ్ణి విడిచిపెట్టండి!” అన్నాడు ఎంతో సౌమ్యంగా.

“ఏమిటిదంతా, నాన్సెన్స్! ఆటగా ఉందా మీకు?” అంటూ అతనిమీద కస్సుమన్నాడు ఎస్సై.

“ఇందులో ఆట ఏమీ లేదుసార్. నగలు దొంగతనం జరిగినమాట వాస్తవం. అతను దొంగతనం చేశాడో లేదో ఎవరికీ తెలియదు. కానీ పట్టుబడ్డాడు. ఒక దివ్యాంగుడు జైల్లో ఉండటం నాకు బాధనిపించింది. మా నాన్న ఒక మూర్ఖుడు. ఎంత చెప్పినా వినలేదు. అందుకే లీగల్‌గా అతణ్ణి బయటికి తీసుకొచ్చే పనిచేశాను. దట్సాల్!!” భుజాలెగరేస్తూ అన్నాడతను.

అతని చేష్టలకు ఒళ్లు మండిపోయింది ఎస్సైకి. చేతిలోని లాఠీని విసురుగా సెల్ కేసి విసిరాడు.

కేసు విత్ డ్రా కాలేదు, అది మూసివేయబడలేదు, నేరస్థుడు పట్టుబడలేదు, వస్తువులు లభించలేదు, కానీ కేసు లీగల్‌గా ప్రొసీడ్ కాబడింది. ముద్దాయి బయటపడ్డాడు!

తండ్రి ఒకడిమీద కేసు పెడతాడు, కొడుకు ఆ వ్యక్తికి బెయిల్ తీసుకొస్తాడు. ఏంటిదంతా? రత్నారావుకు అంతా అయోమయంగా అనిపించింది. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందనిపించింది. కానీ, దాని గురించి ఆలోచించే సమయం లేకపోవటంతో మనసులోనుండి దాన్ని పూర్తిగా చెరిపేశాడు రత్నారావు.

అలా ఆనాడు దొంగగా ముద్రవేయబడ్డ ‘కాశీం’, ఈనాడు ఆక్షన్లో బండిని కొనటానికి రావటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది రత్నారావుకు. నిజంగా ఆనాడు నగల్ని ఇతనే దొంగిలించాడేమో? అనిపించింది రత్నారావుకు.

ఇంతలో ఆక్షన్ మొదలైంది! టూ వీలర్స్ నుండి ఆక్షన్ మొదలు పెట్టారు. పాడేవాళ్లు పాడుతున్నారు. కొనేవాళ్లు ఎంతకైనా తెగించి పాడి వాహనాన్ని సొంతం చేసుకుంటున్నారు.

ఒకసారి కాశీం వైపుకు చూశాడు రత్నారావు. అతను మొబైల్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు.

లఘుశంక తీర్చుకోవటానికి ఎక్కడైనా వాష్ రూమ్ కనిపిస్తోందేమోనని అటుఇటు చూశాడు రత్నారావు. దూరంగా రూఫ్‌లెస్ టాయిలెట్స్ కనిపించేసరికి మెల్లగా అటుకేసి నడిచాడు.

అక్కడికెళ్లి నిలబడ్డాడు. తల పైకెత్తి చూస్తే వీథిలో వెళ్లేవాళ్లంతా కనిపిస్తున్నారు. కానీ వాళ్లకు తను కనిపించడు.

ఇంతలో రోడ్డుమీద ఒక కారు సర్రున దూసుకొచ్చి ఆగింది. ఆ ‘డస్టర్ కారు’ ఎవరిదో ఇట్టే గుర్తుపట్టాడు రత్నారావు. అది రాజకీయనాయకుడు పాండురంగానిది.

కాశీం మెల్లగా కుంటుకుంటూ వచ్చి అటుఇటు చూసి కారు దగ్గరకు నడిచాడు. అతణ్ణి చూసి షాక్‌కు గురయ్యాడు రత్నారావు. ఆనాడు దొంగ అని అనుమానించి కేసు పెట్టిన కాశీంతో, పాండురంగానికి ఏం పని?

కారు వెనకడోర్ మిర్రర్ కొద్దిగా కిందికి దిగింది. పాండురంగం ముఖం కనిపించింది. అతను కాశీంతో ఏదో మాట్లాడాడు. వాళ్లరూ అలా మాట్లాడుకోవటం రత్నారావుకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించసాగింది. జీపులోనుండి ఒక బ్యాగును తీసి కాశీంకు అందించాడు పాండురంగం. కాశీం దాన్ని అందుకోగానే మళ్లీ మిర్రర్ పైకి వెళ్లిపోయింది. ఒక్క సెకను తర్వాత కారు అక్కణ్ణించి వేగంగా వెళ్లిపోయింది. అంతా అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు రత్నారావు.

ఒకనాడు దొంగగా ఫిర్యాదు చెయ్యబడ్డ కాశీంకు, పాండురంగానికీ మధ్య బాగానే సాన్నిహిత్యం ఉన్నట్టుందే? మరి ఎందుకీ నాటకాలు? దీని వెనకున్న మతలబు ఏంటీ? ఇద్దరూ కలిసి ఏం చేద్దామనుకుంటున్నారు? ఏమిటిదంతా?!

కాశీం లోపలికొచ్చి ఆక్షన్‌లో పాల్గొని ఒక ‘జీపు’ను దక్కించుకున్నాడు. దానికి కట్టవలసిన అడ్వాన్స్ అమౌంటును ఇందాక జీపులో నుండి తీసుకొచ్చిన బ్యాగులోనుండి బయటికి తియ్యటం చూశాడు రత్నారావు. అంటే కాశీం జీపు కొనటానికి కావలసిన ఆర్థిక సహాయం పాండురంగమే సమకూర్చాడన్నమాట! ఎందుకు? అతనే డైరెక్ట్‌గా ఆక్షన్లో పాల్గొని జీపును దక్కించుకోవచ్చుగా? అయినా పాతబండిని ఆక్షన్లో కొనాల్సిన ఖర్మ పాండురంగానికేముందనీ? అది అతని హోదాకు భంగం కలిగిస్తుందనా? అయితే, ఈ పాతవాహనం కాశీం కోసమేనా? అదే నిజమైతే ఒక నేరస్థుడికి ఎందుకు సాయం చేస్తున్నట్టు?

ఆనాటి ఆక్షన్ ముగించి ఆఫీసర్ రిలాక్స్‌గా కుర్చీలో వెనక్కు వాలగానే, రత్నారావు వెళ్లి ఆయన్ను కలిశాడు.

కొద్దిసేపు ఇద్దరూ ఏదో గుసగుసగా మాట్లాడుకున్నారు. తర్వాత ఆఫీసర్ లేచినిలబడి గొంతు సవరించుకొని – “ఆ చూడండీ, మీరు చెల్లించాల్సి మొత్తాన్ని ఇప్పుడే పే చెసెయ్యాలి. అలాగే మీమీ వెహికల్స్‌ను రెండు రోజుల్లో ఇక్కణ్ణించి క్లియర్ చేసెయ్యాలి. మీరు కొన్న ఈ వెహికలకు కొత్త నెంబర్లు అలాట్ చెయ్యబడతాయి. వాటిని వితిన్ టెన్ డేస్ లోపల మావాళ్లే ప్రత్యక్షంగా మీ ఇంటికొచ్చి అందిస్తారు. ఆ పైన మీరు వాటిని ఆ రోడ్ మీద తిప్పుకోవచ్చు! ఓకేనా!!” అంటూ ముగించాడు.

తృప్తిగా ఊపిరి పీల్చి వదిలాడు రత్నారావు.

***

“హలో, ఎవరూ… కాశీమేనా మాట్లాడేది?” మొబైల్లో అడిగాడు రత్నారావు.

“ఆ, నేనే! నువ్వెవరు?” అటునుండి ప్రశ్నించాడు కాశీం.

“మొన్న నువ్వు వేలంపాటలో మహింద్రా జీపు కొన్నావు చూడూ, ఆ ఆఫీసునుండి మాట్లాడుతున్నాం.”

“అట్టనా. ఏంటి సార్ ఇసయం?”

“ఏం లేదు, నువ్వింకా కొన్ని కాగితాల్లో సంతకాలు పెట్టాలి. కొన్ని పత్రాలు చెక్ చేయటానికి మీ ఇంటికి రావాలి, నువ్వు ఇంట్లోనేగా ఉన్నావు?” అడిగాడు రత్నారావు.

“ఆ, ఉన్నా! అన్ని పత్రాలూ సూపించినానుగా, ఇంకా ఏం పత్రాలు సెక్ సెయ్యాలి?” అనుమానించాడు కాశీం.

“ఆధార్ కార్డు, రేషన్ కార్డు… ఇట్టాంటివి!”

“ఆ, రాండి, ఎంత సేపటికొస్తారు?” అడిగాడు కాశీం.

“ఇంకో అర్థగంటలో!”

“అట్టనే రాండి!” మొబైల్ ఆఫ్ చేసి కాశీం ఇంటికేసి దృష్టిని నిలిపాడు రత్నారావు. అతను ఇంటి దగ్గర లేకపోయేసరికి ఫోన్లో మాట్లాడాడు.

అనుకున్నట్టే పదే పదినిమిషాల్లో స్కూటర్లో వచ్చి దిగాడు కాశీం. రెండు నిమిషాలయ్యాక లేచి కాశీం ఇంటి దగ్గరికెళ్లాడు రత్నారావు. “కాశీం… కాశీం…” అంటూ పిలిచాడు.

“ఆ ఇంట్లోనే ఉండాను రాండి…” అంటూ రత్నారావును ఇంట్లోపలికి పిలిచాడు కాశీం. “అయితే నీకు మహింద్రా జీపు బాగా నచ్చిందన్నమాట! ఏదీ బయట కనిపించదేం?” అడిగాడు రత్నారావు.

“మెకానికల్ కాడుంది?” చెప్పాడు కాశీం.

“ఏ మెకానిక్? అతను రిపేరు బాగా చేస్తాడా?”

“బాగానే సేస్తాడు. ఎందుకట్టా అడగతా ఉండారు?”

“ఏంలేదు, నాకు తెలిసిన మెకానిక్ ఒకడున్నాడులే! రిపేరు బాగా చేస్తాడు. ఎలాంటి బండినైనా బాగుచేస్తాడు. డబ్బు కూడా తక్కువే తీసుకుంటాడు. అందుకని అడిగాను అంతే, ఇంకేం లేదు!”

“ఈడూ నాకు బాగా తెలిసినోడే! రిపేరి బాగానే చేస్తాడు.” అన్నాడు కాశీం.

అతనికి అనుమానం కలగకుండా, కొన్ని కాగితాల మీద సంతకాలు తీసుకున్నాడు రత్నారావు.

అతను కాగితాలమీద సంతకాలు పెడుతుంటే ఇంటినంతా జాగ్రత్తగా పరిశీలించాడు.

గోడమీదున్న ఒక ఫోటోమీద అతని చూపులు నిలిచిపోయాయి. గత ఎన్నికల్లో ఏదో పార్టీ అభిమానులు ఊరేగుతున్న ఫోటో అది. అందులో కాశీం స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతను పట్టుకున్న పార్టీ జెండాను బట్టి అది ఏ నాయకుడి ఊరేగింపో అర్థం చేసుకున్నాడు రత్నారావు. ‘సో, పాండురంగానికీ, కాశీంకు పూర్వ పరిచయం ఉందన్నది సుస్పష్టం.’ మనసులో అనుకున్నాడు.

ఒరిజినల్ ఆధార్, రేషన్ కార్డులు తీసుకురమ్మని తన దగ్గరున్న కాగితాల్లోని నెంబర్లతో సరిపోల్చుకుంటూ…”అన్నట్టు నీకు జీపు డ్రైవింగ్ వచ్చా?” అని అతని కాలుకేసి చూస్తూ ప్రశ్నించాడు రత్నారావు.

“రాదు!” జాగ్రత్తగా బదులిచ్చాడు కాశీం. “మరి జీపును ఏం చేద్దామని?” ఆసక్తిగా అడిగాడు రత్నారావు.

“డైవర్ని పెట్టుకొని బాడిక్కి తిప్పదామనీ…” చెప్పాడు కాశీం. అలాగా అన్నట్టు తలూపాడు రత్నారావు.

“ఇంకో నాలుగైదు రోజుల్లో నీ బండికి అలాట్ చేసిన కొత్త నెంబరు ప్లేటుతో నిన్ను మళ్లీ కలుస్తాను.” అంటూ లేచి బయటికొచ్చాడు రత్నారావు. తను వచ్చినపని అయిపోయింది. నెక్స్ట్ తన టార్గెట్?….

***

పాండురంగం కారెక్కి ఇంటినుండి వెళ్లిపోయిన ఐదునిమిషాల తర్వాత ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు రత్నారావు.

బాగా బలిష్ఠంగా ఉన్న పనివాడొకడు వచ్చి తలుపుతీశాడు. పోలీస్ యూనిఫామ్‍లో ఉన్న రత్నారావును చూసి కాస్త కంగారుపడ్డాడతను. తనొచ్చిన విషయం చెప్పి పంపాక పాండురంగం భార్య వచ్చి రత్నారావును మర్యాదపూర్వకంగా లోపలికి తీసుకెళ్లింది. ఆ లోపలికి నడుస్తుంటే అడుగడుగునా వస్తాదుల్లాంటి పనివాళ్లు కనిపించారు. వాళ్ల కళ్లుగప్పి తను పని సాధించగలడా?!

“ఏం లేదమ్మా, రెణ్నెళ్ల క్రితం మీ ఇంట్లో నగల దొంగతనం జరిగింది కదా, దానికి సంబంధించి ఒక నేరస్థుణ్ణి పట్టుకున్నాం. అతణ్ణుండి కొన్ని నగల్ని కూడా రికవరీ చేశాం. అవి మీవో కాదో ఒకసారి స్టేషన్ కొచ్చి చూసి చెబితే, మిగతా పనులు మా ఎస్సైగారు చూసుకుంటారు. అది చెప్పి పోదామనే వచ్చాను!” విషయాన్ని తేలికపరుస్తూ చెప్పాడు రత్నారావు.

“అలాగా! చాలా సంతోషం. మమ్మల్ని ఎప్పుడు రమ్మంటారు?” నవ్వు ముఖంతో అడిగింది ఆమె.

“మీరెప్పుడొచ్చినా సరే!” బదులిచ్చాడు రత్నారావు.

“ కాఫీ ఏమైనా తాగుతారా?”

“కాఫీ వొద్దమ్మా! మీ పెరట్లో మునగచెట్టు ఉన్నట్టుంది. మా ఆవిడకి మోకాళ్ల నొప్పులు! కాసిన్ని ఆకులు తెంపుకెళితే, ఉడకేసి కట్టుకుంటుంది” అనుకున్న అబద్దం బాగానే చెప్పాడు రత్నారావు.

“అయ్యో, దానికేం భాగ్యం. నారాయణా, సార్‌కంటా కాసిన్ని మునగాకును తెచ్చివు.” అంటూ పనివాణ్ణి పురమాయించింది. వాడు అలాగేనంటూ తలూపి పెరటికేసి అడుగులు వేశాడు.

“ఎక్కువేం వద్దమ్మా, కాసిన్నే… లేత ఆకుగా చూసి తెంపుకుంటే సరి!” అంటూ మరో మాటకు తావివ్వకుండా తనూ అతని వెనకే పెరట్లోకి దారితీశాడు రత్నారావు. పెరట్లో అక్కడక్కడా పనివాళ్లు ఉండటం కనిపించింది రత్నారావుకు.

ఇందాకటి పనివాడు దోటి(కొక్కెం ఉన్న కర్ర)ని తీసుకొచ్చి లేత మునగాకు కొమ్మల్ని చూసి తెంపసాగాడు.

ఈలోపు వేగంగా ఆ పరిసరాలను పరిశీలించాడు రత్నారావు. చాలా విశాలంగా ఉంది. పెరడు. పెరటి నిండా రకరకాల పూలమొక్కలు, పండ్ల చెట్లు కనిపిస్తున్నాయి. చివరన పెద్ద షెడ్డు ఒకటి కనిపించింది. షెడ్డు పక్కన ఎందుకూ పనికిరాకుండా పాడైపోయిన కొన్ని పాత వాహనాలు కనిపించాయి. మరోపక్కన రకరకాల వాహనాల ఇంజిన్లు, విడి

భాగాలు, పెయింట్ స్ప్రే యంత్రం, ఇంకా ఏవేవో పనికిమాలిన వస్తువులు కనిపించాయి. ఒక మూలన ఒక వాహనం మీద టార్పాలిన్ పట్ట మూసి ఉంది. దాన్ని పరిశీలించాలనుకున్నాడు. ప్యాంటు జేబులో నుండి మొబైల్ ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ దాని వెనక్కు వెళ్లాడు. టార్పాలిను కొద్దిగా పక్కకు జరిపి చూశాడు. అతని అనుమానం నిజమైంది. అది కాశీం ఆక్షన్లో కొన్న జీపే! అది మెకానిక్ దగ్గర ఉందని కాశీం చెప్పిన మాట అబద్దమన్నమాట!

ఇంతలో ఒక పనివాడు తనను చూసి అక్కడకు రావటం కనిపించింది. జీపు పక్కనుండి బయటికొచ్చి ఫోన్‌లో మాటల్ని కంటిన్యూ చేస్తూ… జేబులో నుండి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకుంటూ… ఠక్కున ఏదో కిందపడిపోయినట్టుగా వంగి దేన్నో వెతకసాగాడు రత్నారావు. “ఏం సార్, ఏం ఎతుకుతున్నారు?” దగ్గరికొచ్చి అడిగాడు ఒకడు.

“జేబులో నుండి కర్చీఫ్ తీస్తుంటే ఐదురూపాయల కాయిన్ కిందపడిపోయింది. దాన్ని వెతుకుతున్నాను.”

“అట్టాగా…” అంటూ అతనూ వెతకటం మొదలుపెట్టాడు. కాయినను వెతుకుతున్నట్టుగా నటిస్తూ ఒకచోట ఏదో మట్టిలో పూడుకుపోయి కనిపిస్తే కాలితో మట్టిని పక్కకు తోసి చూశాడు రత్నారావు. అదేదో బండి నెంబర్ ప్లేట్ అనిపించింది. ఒకటి కాదు, దానికింద నాలుగైదు నెంబర్ ప్లేట్లు ఉన్నట్టున్నాయి. అన్ని ఎందుకున్నాయక్కడ? ఆలోచిస్తూ వెతకసాగాడు.

పెరట్లోకి వచ్చినప్పటి నుండి తన ముక్కుపుటాలకు ఏదో సువాసన తగులుతోంది. అదేమిటో మాత్రం అతనికి అర్థం కాలేదు. అది ఆ షెడ్ లోపలినుండి వస్తున్నట్టుగా అర్థమైంది. ఏమై ఉంటుందది? దాన్నెలాగైనా తెలుసుకోవాలి?

ఉన్నట్టుండి షెడ్ వైపుకు పరుగెడుతూ…“పాము, పాము… నాగుపాము, చంపండి, చంపండి!” అంటూ అటుఇటు చూసి ఒక కర్రను తీసుకొని షెడ్ ముఖద్వారం దగ్గరకు వేగంగా చేరుకున్నాడు రత్నారావు.

అందరూ తలా ఒక కర్ర పట్టుకొని షెడ్ దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. “ఇక్కడే చూశాను. నల్లగా ఉంది. ఆరడుగులుంటుందేమో. మెల్లగా కదులుతోంది. నల్లనాగులా అనిపిస్తోంది. కరిచిందంటే క్షణాల్లో ప్రాణాలు పోతాయి” అని ఆ పనివాళ్లతో చెప్పి మెల్లగా అడుగులో అడుగువేస్తూ తలుపు దగ్గరికెళ్లి, సందులోనుండి లోపలికి చూశాడు. ఏవో పొడవుగా కర్రల్లాంటివి పేర్చబడి ఉన్నాయి. వాసన ఇప్పుడు ఇంకాస్త దగ్గరగా వస్తోంది. ఎలాగైనా లోపలికి వెళ్లాలి? ఎలా?!

“పాము లోపలికెళ్లి దాక్కున్నట్టుంది. తలుపులు తియ్యండి! వెతికి చంపుతాం. లేదంటే ఎప్పటికైనా మీకు ప్రమాదమే” వాళ్ల కళ్లల్లో భయం స్పష్టంగా కనిపించింది. కానీ వాళ్లెవరూ షెడ్ తలుపులు తెరిచే ప్రయత్నం చెయ్యలేదు.

“ఏం మీకు ప్రాణాలమీద ఆశల్లేవా?దాక్కున్న పాము ఎప్పుడు ఎటువైపు నుండి వచ్చి కరుస్తుందో, ఎవరు చెప్పగలరు?” అంటూ షెడ్ లోపలికి చూస్తూ… “అదిగో అదిగో అక్కడుంది నాగుపాము, అటు కదులుతోంది. ఆ కుర్చీ కిందికి దూరింది…” అని అరిచాడు రత్నారావు. ఇంతలో విషయం తెలుసుకొని పాండురంగం భార్య షెడ్ తాళాలు పట్టుకొచ్చింది.

షెడ్ తాళాలు తియ్యబడ్డాయి, లోపలికి మెల్లగా అడుగులో అడుగు వేస్తూ మొదట రత్నారావు వెళ్లాడు. అతని వెనకే ఒక్కొక్కరుగా నలుగురు ప్రవేశించారు. పామును చంపటానికి కర్రలతో తయారుగా ఉన్నారు.

ఇంతలో ఎవరో షెడ్ లోపల స్విచ్ వేశారు. చమక్కుమని వెలిగిన బల్బు వెలుగులో షెడ్డంతా స్పష్టంగా దర్శనమివ్వసాగింది. అక్కడక్కడా…. సా మిల్లులో పేర్చినట్టుగా పొడవాటి కర్రలు పేర్చబడి ఉన్నాయి. కానీ వాటిమీద టార్పాలిన్ వేసి కప్పెట్టారు. అదేమిటో తెలుసుకోవాలి?

గోడవారకు వెళ్లిన రత్నారావు ఇద్దరిని కర్రల చివరికెళ్లి ఉండమని సైగ చేశాడు. మరో ఇద్దరిని కర్రలమధ్యగా నిలబడమని సూచించాడు. తన చేతిలోని కర్రను అక్కడ పేర్చి ఉన్న కర్రల సందులోకి దోపి అటుఇటు కదిపాడు. తర్వాత వాళ్లకు అనుమానం కలగకుండా పామును వెతుకుతున్నట్టే టార్పాలినను కాస్త పక్కకు జరిపి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ తిన్నాడు. అవి ఎర్రచందనం దుంగలు. రహస్యంగా అక్కడ దాచిపెట్టారు.

విషయం పూర్తిగా అర్థమైపోయింది రత్నారావుకు. కాసేపు పాముకోసం వెతుకుతున్నట్టుగా నటించి, తర్వాత తనకు డ్యూటీకి టైమౌతుందని ఆమెకు తెలిపి మునగాకును తీసుకుని అక్కడనుండి బయటపడ్డాడు.

***

“పాండురంగం బడా రాజకీయనాయకుడు. మంత్రుల అండతో, అధికారం ముసుగులో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. ముందు తన నమ్మినబంటుల మీద కేసులు బనాయించి వాళ్లనొక నేరస్థులుగా పోలీసు రికార్డ్సుల్లోకి నమోదు చెయ్యిస్తాడు. తర్వాత తన కొడుకు ద్వారా వాళ్లకు బెయిల్ తీసుకొచ్చి వాళ్లను బయటికి తీసుకొస్తాడు. ఆ విధంగా కాశీంమీద కేసు బనాయించటం మనకు తెలిసిన విషయమే. ఇదంతా పాండురంగం తన సేఫ్టీ కోసమే చేసుకునే ఏర్పాటన్నమాట. ఆ తర్వాత పాత వాహనాల వేలం పాటలో తాను ప్రత్యక్షంగా కాకుండా, తనవాళ్లను పాల్గొనేలా చేస్తాడు. అలా వేలంపాటలో కొన్న పాత వాహనాన్ని తీసుకొచ్చి ముందు దాని రంగుమార్చేస్తాడు. ఆ తర్వాత దానికున్న ఇంజిన్‌ను కూడా మార్చేస్తాడు. దాంతో వేరే ఇంజిను దీనికి ఏర్పాటై పోతుందన్నమాట. ఆక్షన్లో కొన్న వాహనం నెంబరును కూడా దీనికి తగిలించడు. ఇంకేదో ఫేక్ నెంబరు దీనికి ఫిక్స్ చేస్తాడు. ఇప్పుడు టోటల్ వెహికల్ ఒక అతుకుల బొంతలా తయారవుతుంది. ఒకవేళ రైడింగ్ లో వెహికల్ పట్టుబడ్డా అదెవరిదో కనిపెట్టటం కష్టం. ఏదీ ట్రేసవుట్ కాదు. అలా యథేచ్చగా ఎర్రచందనం స్మగ్లింగ్ కొనసాగిస్తున్నాడు. ఒకవేళ రెడ్ హ్యాండెడ్‌గా తనవాళ్లు ఎవరైనా పట్టుబడ్డా వాళ్లమీద అప్పటికే కేసు బనాయించి ఉంటుంది కనుక వాళ్లు నేరస్థులుగా జైలుకు వెళతారు కానీ, పాండురంగానికి ఏమీ కాదు. అతను మాత్రం ఒక పెద్దమనిషిలా సమాజంలో చలామణి అయిపోతుంటాడు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం అతను చేస్తున్న సంఘవిద్రోహక చర్య! అతనిమీద కచ్చితంగా చర్యలు తీసుకోవలసిందే!” అంటూ ముగించాడు పోలీస్ కానిస్టేబుల్ రత్నారావు.

ఎస్సై నవ్వుతూ లేచి వచ్చి రత్నారావుకు మనస్ఫూర్తిగా షేక్ హ్యాండిచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here