[box type=’note’ fontsize=’16’] వొక నిజాయితీపరుడైన అధికారి నిర్వహించిన ‘రెయిడ్’ అంటూ, రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో వెలువడిన హిందీ సినిమా ‘రెయిడ్‘ని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]
1980లలో IRS అధికారులు నిర్వహించిన రైడ్ల ఆధారంగా అల్లిన కథే “రెయిడ్”. కథానాయకుడు అమేయ్ పట్నాయిక్ (అజయ్ దేవ్‌గన్) వొక నిజాయితీపరుడైన ఐ టి అధికారి. అందుకని అతన్ని వొక చోట నిలకడగా నాలుగు నాళ్ళు చేయనివ్వరు. చీటికి మాటికి ట్రాన్స్ఫర్లే. అలాంటి వొక ట్రాన్స్ఫర్లో అతను లక్నో కు వస్తాడు. అతని భార్య మాలిని (ఇలియానా) గొణుక్కుంటుంది : నాకు ఇల్లు సర్దడం, మళ్ళీ పేక్ చేయ్యడంతోనే సరిపోతుంది, మీ ఉద్యోగం పుణ్యమాని. అలా అంటుందేగాని భర్తకు నైతిక సమర్థన అందిస్తుంది. ఆమె భయమల్లా అతని ప్రాణానికి పొంచి వున్న ప్రమాదం. ఈ వూళ్ళో రామేశ్వర్ సింఘ్ (శౌరభ్ శుక్లా) అక్రమ సంపాదనలు, పన్నుల యెగవేత గురించిన సమాచారం అందుతుంది. అతని ఆస్తులపై రెయిడ్లు నిర్వహించాలి. బలమైన సాక్ష్యాలు లేవు. నిరూపణ కాకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయి. అయినా సరే అమేయ్ గురించి ఎరిగిన మనిషిగా అతని పూచీ మీద రెయిడ్లు చెయ్యడానికి అనుమతి లభిస్తుంది DG నుంచి. మొదట్లోనైతే అతనికి యేమీ దొరకదు. కాని అతనికి అజ్ఙాత ఇంఫార్మర్ ఇస్తున్న సమాచారాల ఆధారంగా చేస్తూ పోతాడు. ఫలితంగా కోట్ల విలువ చేసే బంగారు నాణాలు, నగలు, డబ్బు ఇలా చాలానే బయటపడుతుంది. ఆ రెయిడ్లు ఆపించడానికి విశ్వప్రయత్నం చేస్తాడు సింఘ్, ప్రధాన మంత్రి (ఇందిరా గాంధి) ని వొప్పించడం వరకూ. కాని తనకు వ్రాతపూర్వకంగా ఆదేశాలు కావాలని అమేయ్ అనేసరికి, ప్రధాని కూడా వెనక్కు తగ్గుతారు. ఇక మిగిలింది మాలినిపై దాడి చేయడం. ఆమె అదృష్టవశాత్తు అది తప్పించుకుంటుంది. చివరి అస్త్రంగా రౌడీల గుంపు సాయంతో అమెను చంపటం. సరైన సమయంలో పై నుంచి వచ్చిన పోలీసు బలగం కారణంగా అతను ఆ ఆపద నుంచి బయట పడతాడు.
Spoiler alert: ఈ రెండు వాక్యాలు దాటదలిస్తే దాటేయండి. ఇంతకీ ఆ అజ్ఙాత వ్యక్తి యెవరు? సింఘ్ పరివారంలోనే వొకరు ఆ పని చేస్తున్నట్టు అతనికే తెలిసిపోయింది. మనకు మాత్రం చివర్న దర్శకుడు వెల్లడి చేస్తాడు. సింఘ్ కోడలు, ఆమె ప్రియుడు కలిసి చేసిన పని అది. కారణం ఆమెను బలవంతంగా సింఘ్ నపుంసకుడైన కొడుకుకు కట్టబెడతారు. అందుకు పగ తీసుకోవడం కోసం చేసిన పని ఇది.
ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా. ఇతని ఇదివరకటి చిత్రాలతో పోలిస్తే కొంచెం నిరాశ కలుగుతుంది. అలాగని బాగా తీయలేదని కాదు. సమయం యెట్లా గడిచిందో తెలీకుండా గడిచిపోతుంది. ఇదివరకటి చిత్రం “ఘన్‌చక్కర్” చూశాక ఇది చూస్తే ప్రాణం లేచి వస్తుంది. కాని “ఆమిర్”, “నో వన్ కిల్ల్‌డ్ జెస్సికా” లతో పోలిస్తే ఊహూ. అవి మనసు మీద చెరగని ముద్రలు వేసిన చిత్రాలు. ఇలాంటి కథకి పాటలు అంతరాయంగానే వుంటాయి. యెంత బాగున్నా సరే.మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాటలు, కొంత రొమాన్సు ఇలా ఇరికించినట్టు అనిపించింది. ఇలియానా అందాల బొమ్మగా తప్ప ఆమె పాత్రకు పెద్దగా నటనావకాశం లేదు. అజయ్ దేవ్‌గన్ కు పరిమితంగా నటన వచ్చు. కాబట్టి తెలివిగా మేచో పాత్రలు, సీరియస్ పాత్రలు (హం దిల్ దే చుకే సనం) లాంటివి యెంచుకుంటాడు. (గోల్‌మాల్ సిరీస్ లో హాస్యం కూడా పర్లేదూ). ఈ చిత్రంలో బాగా నటించింది శౌరభ్ శుక్లా. బర్ఫీ లో లాగానే ఇందులో కూడా మరచిపోలేనిరీతిలో నటించాడు. ఇక అతని తల్లిగా చేసిన పెద్దావిడ కూడానూ. తల్లి మీద కోపంతో జిలేబి బలవంతంగా తినిపిస్తుంటే ఆమె మొత్తుకుంటుంది : వద్దురా నాకు మధుమేహం అని. క్రౌర్యం చూపించడానికి అర్ధ నిముషం చాలు. అలాగే బయటపడుతున్న సంపద చూసి అంటుంది : నాకు కడుపులో రాళ్ళుంటే వైద్యానికి డబ్బు లేదన్నారు కదర్రా, ఇదంతా యెక్కడిది? నాకైతే ముందుగా పథేర్ పాంచాలిలోని చున్నిబాలా దేవి గుర్తుకొచ్చింది. ఆ పాత్ర నిడివి పెద్దదనుకోండి. ఆ తర్వాత “ఖోస్లా కా ఘోస్లా” లోని ముసలావిడ. ఇంకా చెప్పుకోవాలంటే అమిత్ త్రివేది బేక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. స్క్రిప్ట్, సినెమేటోగ్రఫి బాగున్నాయి. సినెమా చాలా భాగం వొకే ఇంట్లో తీయాల్సి వచ్చినప్పుడు చూసే వాళ్ళకు విసుగు, claustrophobia కలగకుండా వుండేలా తీశాడంటే చాయాచిత్రగ్రాహకుడు ఆల్ఫోన్స్ రాయ్ (ఆమిర్ కు కూడా ఇతనే) ను మెచ్చుకోవాల్సిందే.
మొత్తానికి చూడతగ్గ చిత్రమే. మళ్ళీ ఆమిర్ లాంటి చిత్రాలకోసం యెదురు చూస్తూ వుంటాను.