Site icon Sanchika

రైలూ.. జీవితమే

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘రైలూ.. జీవితమే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]జీ[/dropcap]వితమూ రైలు ప్రయాణమే
విధిరాసిన పట్టాల గీతలవెంబడి
నచ్చినా నచ్చకపోయినా చచ్చేదాక
చప్పుడు చేస్తూనో
నిశ్శబ్దపు నిట్టూర్పులు విడుస్తూనో
సింగిల్ లైన్ వ్యవస్థలో
గమ్యం చేరేదాకా సాగాల్సిన ప్రయాణమే

మజిలీ మజిలీలో ఎదురుచూస్తోన్న
ఎన్నో కొన్ని కొత్త బాధ్యతలను
ఎత్తుకుంటూ, లోనికి లాక్కుంటూ
సాదరంగా హృదయానికి హత్తుకుంటూ
ఉన్నచోటులోనే ఎక్కడో కొంత చోటిస్తుంది

కాలంతీరిన బంధాలను
వాటివాటి ఆఖరి గమ్యాలలో దించేస్తూ
ఆర్తితో చెమ్మనిండిన కళ్ళతో
విషాదమైన వీడ్కోలు చెప్పుకుంటూ
నిర్లిప్తంగా ముందుకు సాగుతూనే ఉంటూంది
బైబై అంటూ బొయ్యిమనే హారన్ వేసుకుంటూ

ఎదుటిదారిలో వచ్చే కొన్ని జీవితాలకై
తనదారిలోనే సాగే తనను మించినవాటికై
తప్పనిసరియై అప్పుడప్పుడూ
క్రాసింగుస్టేషన్లలో కాస్తాగి సాగిపోతూంటుంది
తనకై కూడా అక్కడక్కడా క్రాసింగుకై
నిలిచిపోయిన జీవితాలు కొన్నింటినీ
చిరాకుతోనో.. చిరునవ్వుతోనో
నిలవకుండా పలకరిస్తూ వెళుతూనే ఉంటుంది

ఆగిన ప్రతిచోటా పదపదమంటూ
అవసరాల గార్డు ఆగకుండా విజిలేస్తుంటే
మళ్ళీ మొదలవుతూ సాగిన ప్రయాణం
మజిలీల ఆయుష్షును మింగేసాక
ఆఖరిగమ్యం కళ్ళముందు ఆవిష్కరిస్తుంది
మిగిలిపోయిన.. కడదాకా వెంటవచ్చిన
కొన్ని ఆంతరంగిక అనుబంధాలూ
చివరిస్టేషన్లో దిగేసి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతే
మౌనంగా ఒంటరిగా నిలిచిపోతుంది

అక్కడెక్కడికో తీసుకెళ్ళిన విధాత సిబ్బంది
అవసరాలు వదిలివెళ్ళిన వాసనలను
అనుబంధాలు మిగిల్చిపోయిన
ఆత్మీయమైన గురుతులనూ,
మళినాలను, మరవనీయని మరకలనూ
కడిగి, తుడిచి, శుద్ధికర్మలు చేసి
కొత్తగా చేసేస్తే, కొత్త ఊపిరి నింపేస్తే
మరో కొత్త ప్రయాణానికి సిద్ధమంటుంది
కొత్త గమ్యానికి కొత్తజీవితమై సాగబోతుంది

Exit mobile version