రైతన్నకు బాసటగా ‘సమరభేరి’

0
2

[dropcap]కేం[/dropcap]ద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ చుట్టుపక్కల అన్నదాతల పోరాటం మొదలై పది నెలలు దాటింది. పోరాటంలో ఎంతోమంది రైతులు అసువులుబాశారు.  రైతుల ఆందోళనకు గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ప్రముఖ కవి గోలి మధు కవితా సమరంతో సంఘీభావం ప్రకటించారు. రైతులు ఎంత ఆవేశంతో, ఆవేదనతో ఉద్యమం కొనసాగిస్తున్నారో అంతే తీవ్రస్థాయిలో ఉద్యమం మొదలైన తొలిరోజుల్లో మధు 25 రోజుల్లో 58 కవితలు రాశారు. రైతు సమరభేరి పేరుతో వాటిని పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. ఆ తరువాత కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. చట్టాలు రద్దు కాలేదు. ఉద్యమం ఉధృతమైంది. మధు కవిత్వ శైలి కూడా పదునెక్కి అదేరీతిలో కొనసాగుతోంది. మళ్లీ మరో 55 కవితలు రాశారు. మొత్తం 113 కవితలతో రెండో ముద్రణ కూడా తీసుకువచ్చారు. ఇటీవల మంగళగిరిలో ‘రైతు సమరభేరి’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. 2020 సెప్టెంబరు 15 ఒక బిల్లు, 17న రెండు బిల్లులు లోక్ సభలో ఆమోదం పొంది చట్టాలయ్యాయి. ఈ మూడు వ్యవసాయ చట్టాలకు దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా పంజాబ్, హరియాణాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ సరిహద్దులలో గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా లక్షలాది మంది రైతులు దాదాపు పది నెలలుగా చేస్తున్న పోరాటం చరిత్ర సృష్టించింది. ఏ ప్రభుత్వమైనా రైతులకు లబ్ధి చేకూరేవిధంగా, పండిన పంటకు గిట్టుబాటుధర లభించే విధంగా వారికి రక్షణగా చట్టాలు రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారికి సర్వవిధాల లబ్ధి చేకూరేవిధంగా, వారికి రక్షణగా, అండగా నిలిచే చట్టాలను రూపొందించింది. రైతులకు ఆదాయ పెంచడం, వినియోగదారుల ప్రయోజనాల కోసం ఈ మూడు చట్టాలు చేసినట్లు కేంద్రం పేర్కొంది. అయితే, చట్టాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులపై నియంత్రణాధికారం కేంద్రానికి సంక్రమిస్తుంది. ఈ చట్టాలు రైతులకు మేలు చేసేవిలా కనిపించినా, బహుళజాతి సంస్థల చేతిలో రైతులు చిక్కుకునే ప్రమాదం ఉందని రైతుల ఆందోళన. వీటి వల్ల చిన్న, సన్నకారు రైతులు చితికిపోతారని, రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతాయని వారి భయం. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేవిధంగా వీటిని చేశారని ప్రతిపక్షాల ఆరోపణ. అన్ని వ్యవసాయ ఉత్పత్తులు కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యంలోకి వెళతాయన్నది వారి వాదన. ఆచరణలో వినియోగదారులకు కూడా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దతలేదు. కనీస మద్దతు ధర అమలుకాకపోతే కోర్టును ఆశ్రయించే అవకాశం కూడాలేదు. ఈ నేపథ్యంలో రైతుల పోరాటాన్ని, పోరాటంలో మృతి చెందిన రైతులను చూసి గోలి మధు చలించిపోయారు. సామాజిక స్పృహతో తన వంతుగా స్పందించి కవితా సమరం కొనసాగిస్తున్నారు. రైతులు అక్కడ సమరభేరి మోగిస్తే, మధు ఇక్కడ కవితా సమరభేరి మోగించారు. తన కవితల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించడానికి నడుం బిగించారు. రైతు శ్రమని అర్ధం చేసుకొని రైతాంగం ఉద్యమానికి తన వంతు అండగా నిలిచారు. రైతుకు సేద్యం, స్వేదం చిందించమే తెలుసు, కార్పొరేట్ శక్తుల వలే మోసం చేయడం తెలియదని తన కవితల ద్వారా ఎలుగెత్తి చాటారు. మధు వృత్తి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌లో వర్క్ ఇనస్పెక్టర్, ప్రవత్తి మాత్రం సామాజిక స్పృహతో రచనలు చేయడం. ముఖ్యంగా కవిత్వం రాయడం. ఈ మధ్య కాలంలో రైతు ఉద్యమంపై కనీసం ఓ కవితన్నా రాయనిదే మధుకు నిద్రపట్టదు.

చట్టాల నిర్మూలనే లక్ష్యమని, అప్పటివరకు పోరు ఆగేదిలేదని రైతుబాంధవులు వేస్తున్న అడుగులు విశ్వానికి వెలుగు రేఖలని… కలుపు మీద చేసే పోరు స్ఫూర్తిగా పురుగుపుట్రపై చూపే తెగువే ఆయుధంగా… హస్తినలో తిరగబడ్డాడు రైతు … నేను సైతం అని గోలి మధు తన కవితలతో కదంతొక్కారు. బతుకు చిత్రం తిరగబడి, రైతు జీవన చిత్రం ఛిద్రమౌతుంటే రైతు పేరిట సొమ్ముచేసుకున్న విశ్వాసమైనాలేక సంఘీభావమే కరువాయే… అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతకు మూడు వ్యవసాయ బిల్లుల బాణాలు గుచ్చుకుని విలవిలలాడుతుంటే వారి ఓట్లతో అధికారం చేపట్టిన వారికి రైతుల పట్ల దయలేదని, ఆకలి తీర్చేది రైతు, ఆకలి తీర్చుకుని అణగదొక్కేది పాలకవర్గం అని ఆక్రోశం వెళ్లగక్కారు. ధర్మాగ్రహానికి దుర్మార్గం తలవంచక తప్పదులే అన్న భావనతో మధు ఉన్నారు. చైతన్యం ప్రవాహమై గడ్డకట్టే చలిలో కూడా నిలిచిన రైతు బాంధవులకు శిరసాభివందనం చేశారు. నల్లచట్టాల నిర్మూలనకై ఉపక్రమించిన పరాక్రమానికి అక్రమార్కుల విధ్వంసంపై ధ్వజమెత్తిన రైతు పిలుపు చరిత్రలో మరో మలుపని చాటారు. ముదనష్టపు మూడు వ్యవసాయ బిల్లులు అమలైతే కనిపించే అవసరాలకు కార్పొరేట్ దిక్కైతే పులినోట చిక్కే బతుకే రైతు బతుకు అని అద్వితీయంగా రాశారు. ఈ బిల్లులు అమలైతే రైతుకే కాదు మానవాళికీ పగులుతుంది మాడు అని హెచ్చరించారు. గజగజ వణికించే చలిలో గిజగిజలాడుతూ అన్నదాతలేమో ఊపిరి వదులుతూ ఉద్యమాల బాటలో వెలిగిపోతోంది భారతావని అని ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డకట్టే చలితో చెలిమి చేస్తూ… సమరం చేస్తున్న రైతుకు ఒక్కొక్క సంఘీభావపు పలకరింత వారికి పులకరింతై మదగజాన్ని తరిమివేసే శక్తినిస్తుందని కవితీకరించారు. హస్తినలో బిగిసిన పిడికిలి ఎర్రకోటను ఉక్కిరిబిక్కిరిచేయక మానదని ముందే చెప్పారు. కార్పొరేట్ల చెరలోకి నెట్టివేయబడుతున్నది ఒక్క రైతే కాదు దేశభవిత కూడా అని హెచ్చరించారు. మొన్న ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఆ తరువాత రైల్వే ఒక్కొక్కటి వడివడిగా కార్పొరేట్ల కౌగిలిలో ఒదిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అపార వనరులు కార్పొరేట్లపరమై ప్రభుత్వ సంస్థలన్నీ బడాబాబుల సంకల్లోకి దూరుతున్నాయన్న వాస్తవాలను తెలియజెబుతూ జనంలో చైతన్యాన్ని నింపుతున్నారు. పుడమి పుత్రుల ప్రాణత్యాగాలకు, సంకల్పబలానికి ప్రపంచమే నివ్వెరపోతుందన్నారు. ఆవేదన అగ్నికణమై, ఆలోచన అంకుశమై పాలకుల్ని నిలువరించేదే.. అదే అదే హస్తినలోని అన్నదాత హోరన్నారు. దేశద్రోహలంతా దేశభక్తులై అధర్మాన్ని పరాకాష్టకు చేర్చారని, చావులెన్నైనా సడలని పోరు, మిషన్ గన్నులు లేవు, పాలకుల అండదండలులేవు, ఐనా మానవాళికి దిశానిర్దేశం చేసే దిశగా సాగుతున్న పోరని విశ్లేషించారు. చలిలో పెద్దపులులై పోరాడుతూ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమై సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రైతన్నల త్యాగాలకు సలాం సలాం లాల్ సలాం అని కొనియాడారు. రైతు ఉద్యమానికి మద్దతు తెలపని, సంఘీభావం ప్రకటించని నటచక్రవర్తులకు, సినీ పెద్దలకు, చివరకు మీడియాను కూడా వదలకుండా అందరికీ మధు తనదైన శైలిలో చురకలంటించారు. రైతు సమరభేరికి చేయూతగా నిలవాలని, కళ్లు తెరవండి తరలిరండి రైతు పోరుకు బాసటగా నిలవండి భరతమాత పుత్రులారా రండి అని పిలుపునిచ్చారు మధు.

***

రైతు సమరభేరి (కవితా సంపుటి)
రచయిత : గోలి మధు, 9989186883
పేజీలు: 144,
వెల: ₹ 100
ప్రచురణ: మానవ వికాస మండలి
ప్రతులకు : మానవ వికాస మండలి, ఎన్.సీ.సీ. రోడ్డు, మంగళగిరి-522503
9848199098

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here