Site icon Sanchika

రాజకీయ వివాహం-1

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది మొదటి భాగం. [/box]

అధ్యాయం- 1

[dropcap]గ[/dropcap]ట్టిగా చప్పట్లు వినబడేసరికి మంత్రముగ్దురాలులా వేరే లోకం నుండి ఉపన్యాసం ఇస్తున్నట్లు స్టేజి మీద ఉన్న ప్రియాంక ఉలిక్కి పడింది. ఆమె ఇప్పుడు ఒక ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లో ఉంది. దాదాపు వెయ్యిమందికి పైగా సామర్ధ్యం ఉన్న ఆ ఆడిటోరియం ఆ రాత్రివేళ చాలా ప్రశాంతంగా ఉంది. ప్రియాంక మీద పది ఉన్న స్పాట్లైట్ తప్పితే మిగిలిన ప్రదేశం అంతా చిమ్మచీకటి ఆవరించుకుని ఉంది. చెన్నై లోని ఏషియన్ కాలేజ్ అఫ్ జర్నలిజంలో ఆ ప్రాంగణం భూత,భవిష్యత్, వర్తమాన కాలాల్లో ఎన్నో ప్రసంగాలకు, జాతీయ సదస్సులకు, సినీతారల విజయోత్సవాలకు, నిస్వార్ధమైన నిరసన ప్రదర్శనలకు, ఇంకా ఇతరత్రా కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. అటువంటి వేదికపైన ఒంటరిగా ఉంది ఎవరూ లేని సమయంలో ఉపన్యాసం ఇస్తున్న ప్రియాంకను అభినందిస్తున్న సిద్ధార్ధ ఇంకా చప్పట్లు కొడుతూనే నెమ్మదిగా వేదికను చేరుకున్నాడు. ప్రియాంక సిద్ధార్ధ వంక సందేహంగా చూసింది. ప్రియాంకకి సిద్ధార్ధ గత రెండు సంవత్సరాలుగా తెలుసు. వారిద్దరూ జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో స్నేహితులు.

“బాగుంది మేడం. సూపర్బ్ స్పీచ్ నరనరం ఉత్తేజంతో ఉప్పొంగి పోతోంది, ఏదో ఒకటి సాధించాలి అనే తపన అధికం అవుతోంది” తన వంక అయోమయంగా చూస్తున్న ప్రియాంకను ఉద్దేశించి అన్నాడు సిద్ధార్థ.

వారిద్దరి వయసు ఇంచుమించు నెలల తేడాలో ఒకటే. ప్రియాంక ఇరవై ఎనిమిది సంవత్సరాలకు చేరువలో ఉంది. సిద్ధార్థ ఆమెకన్నా ఎనిమిది నెలలు పెద్దవాడు అంతే తేడా. సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చిన సిద్ధార్థ ఐఐటి గ్రాడ్యుయేటే కాకుండా అపరామితమైన మేధాశాలి. తను చదివినది సాంకేతిక విద్య అయినా మాస్ కమ్యూనికేషన్స్, మరియు పారిశ్రామిక రంగ అభివృద్ది మీద కోర్స్‌ను అతను ప్రియాంకతో కలిపి చేస్తున్నాడు. మొట్టమొదట పరిచయంతోనే ప్రియాంక కు, సిద్ధార్ధకు స్నేహం కుదిరింది.

“స్టాపిట్ సిద్ధూ ఇదేమి జోక్ కాదు, నా మీద నేను వేసుకుంటున్న సెటైర్ కాదు, నా గుండెల్లో రగిలే ఆవేదన” కొంచెం బాధగా అంది ప్రియాంక.

అతను ఆ సమయంలో కొద్ది సేపు ప్రియాంక వైపు నిశ్శబ్దంగా చూసి మరుక్షణంలో గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. నవ్వడమే కాకుండా విపరీతంగా కేకలు వేస్తూ ఆ ప్రాంగణం చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. ప్రియాంక అతడిని ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ సందడి అంతా చూసి దూరంగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకు వీరి దగ్గరకు వచ్చాడు. ప్రియాంక ఇబ్బంది పడుతూ ఆ గార్డ్‌కి ఏదో ఒకటి నచ్చజెప్పి పంపించేసింది. కాసేపటికి సిద్ధార్ధ సద్దుమణిగాడు. వారిద్దరూ దూరంగా లైట్ స్థంబం దగ్గర ఉన్న ఒక సిమెంట్ బెంచ్ పైన కూర్చుని ఉన్నారు. పక్కనున్న ఎరుపు రంగు జిపర్ బాటిల్ను సిద్ధార్ధకు అందించింది ప్రియాంక.

“నా జీవితానికి చాలా దగ్గరగా వచ్చిన నీకు నేను చెప్పిన మాటలు హాస్యాస్పదంగా అనిపించడం చాలా బాధగా ఉంది సిద్ధూ. అందరిలోకి నా గురించి పూర్తిగా తెలిసిన నీ నుంచి ఇటువంటి రెస్పాన్స్ నేను అస్సలు ఊహించలేదు” అతనివైపు నిశ్సబ్దంగా చూస్తూ అంది ప్రియాంక. సిద్ధార్థ కాసేపు మౌనంగా ఉన్నాడు.

 “ప్రియాంక, మాములుగా నా గురించి నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో అదే విధంగా నీ నుంచి ప్రజలు కూడా ఇలాంటి స్పీచ్‌లు ఎక్స్పెక్ట్ చెయ్యరు. నీ ఆలోచనల, ఆశయాలు, ఊహలు, లక్ష్యాలు అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయం పట్ల నీకున్న నిర్దిష్టమైన అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది, ఎంతో ఉన్నతమైనది, ప్రస్తుత కాలంలో అవసరమైనది కూడా. కానీ ఈ అన్నిటినీ తరచి చూస్తే నాకొక అనుమానం కలుగుతోంది” సాలోచనగా ప్రియాంక వైపు చూస్తూ అన్నాడు సిద్ధార్థ.

“ఏంటది” అర్ధం కానట్లుగా అడిగింది ప్రియాంక.

“ఇంత ప్రాపంచిక జ్ఞానం, ఇన్ని అభ్యుదయ భావాలు ఉన్న ప్రియాంక ఎందుకు తన తండ్రి గడచిన ఎన్నికల్లో హీనమైన ఓటమి పాలైన తరువాత గళం విప్పింది. ఎన్నికలకు ముందు తన తండ్రి అతని రాజకీయ జీవితం గురించి కించిత్తు కూడా పట్టింపులేని ప్రియాంక, ఎందుకు ఓటమి తరువాత మాట్లాడుతోంది. ఎన్నికలకు ముందు తన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి తండ్రిని పటిష్టపరిచే ప్రయత్నం ఎందుకు చెయ్యలేదు.

దీన్నిబట్టి అలోచించి చూస్తే తండ్రి ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అతి చిన్న వయసులోనే ప్రవేశించడమే ఆమె యోచనగా అనిపిస్తోంది. దానికితోడు సహజంగా తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న రాజకీయ లక్షణాలతో ఆమెకేవలం స్వార్ధపరురాలైన ఒక పొలిటీషియన్ మాత్రమే. ఆమె చెప్పిన సిద్ధాంతాలు అన్నీ కేవలం గాలిలో మాటలు మాత్రమే” అని ముగించాడు సిద్ధార్ధ. దెబ్బతిన్నట్లుగా అతని వైపు చూసింది ప్రియాంక.

“సారీ ప్రియాంక ఇలా మాట్లాడి నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నువ్వు ఇలా మాట్లాడితే నేనే కాదు ఏ మాత్రం విషయజ్ఞానం ఉన్న సామన్యుడైనా ఇలానే అర్ధం చేసుకుంటాడు. అనకూడదు కానీ ప్రస్తుత సమాజంలో కొంతమంది ప్రజల్లో అంతెందుకు స్త్రీలలోనే స్త్రీల పట్ల నమ్మకం సడలింది. వారు నిన్ను బంగారుగూటిలో ఉన్న చిలుకలా మాత్రమే చూస్తారు. ప్రజాశ్రేయస్సు కోరుకునే దానివైతే ఎందుకు ఎన్నికలకు ముందు ఈ నినాదాన్ని లేవదీయలేదు” అడిగాడు సిద్ధార్ధ.

 “నీకు అర్ధం కాదు సిద్ధూ. అస్సలు రాజకీయాలు, ఎన్నికలూ అనేవి ఎప్పుడూ నా టార్గెట్ కావు. అస్సలు నేను ఇవన్నీ సమూలంగా నాశనమై ప్రజలతోపాటుగా నేను కూడా బాగుపడాలి అని కోరుకునేదాన్ని. అటువంటప్పుడు నేనెలా రాజకీయాల్లోకి వస్తాను. ఐనా గడచిపోయిన మాట మా డాడ్ ఓడిపోయి ఆరు నెలలు దాటింది.నిజం చెప్పాలంటే ఇది జరగడానికి ముందే నేను డాడ్‌ను ఈ రాజకీయాల నుండి వైదోలగమని హెచ్చరిద్దాం అనుకున్నాను, లేదా ప్రేమతో చెప్దామనుకున్నాను. కానీ నాకా సమయంలో ధైర్యం సరిపోలేదు. డాడ్ అంటే ఎప్పుడూ నాకు భయమే. కానీ ఆయనకు నాపైన అమితిమైన వాత్సల్యం ఉంది” ఆమె ఆ మాట అంటున్న సమయంలో ఆమె కంట్లో ఒక గౌరవమైన భావాన్ని గమనించాడు సిద్ధార్ధ. ఏం చెప్పాలో తనని ఏ విధంగా సమాధానపరచాలో మాటలకోసం చూస్తున్నాడు సిద్ధార్ధ. కాసేపు ఆమెను నిశ్శబ్దంగా వదిలేసాడు.

 “మొదట నా దగ్గర రెండు ప్రశ్నలు ఉన్నాయి ప్రియాంక. ఒకటి ఏ విషయం మీద అయినా మనలో భయం ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. మరి అటువంటప్పుడు మీ నాన్న అంటే భయపడే నువ్వు ప్రజలకు మంచి జరిగే విషయంలో అవసరమైతే మీ నాన్నకు ఎదురు వెళ్ళగలవు అని ప్రజలు నమ్ముతారు. రెండవది అంతా జరిగిపోయిన తరువాత ఎవరిని ఉద్ధరించడానికి నువ్వీ ప్రసంగం ఇస్తున్నట్లు.

కేవలం నీ తండ్రి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అతని ద్వారా రాజకీయ లబ్ది పొంది అతని స్థానాన్ని అక్రమిచుకోవడానికి కాదా? సగటు మానవుని అభిప్రాయం ఇది. దీనికి జవాబు చెప్పి తీరాలి. ఎందుకంటే నీవిగా నువ్వు చెప్పే మాటల్లో ఏ కొంచెం నిజాయితీ ఉన్నా రేప్పొద్దున్న నిన్ను గెలిపించి నీ ద్వారా అభివృద్ది సాధించాలి అని అనుకునేది ఆ సగటు మానవుడే కనుక” తన అభిప్రాయాన్ని నిర్భయంగా తన స్నేహితురాలికి తెలియపరిచాడు సిద్ధార్ధ.

“చూడు సిద్ధూ నా తండ్రికి భయపడుతున్నాను అంటే దానికి అర్ధం ఆయన అన్నీ ప్రజావ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటారు అని కాదు కదా. ఒకవేళ అదే నిజమైతే నాలుగుసార్లు మా డాడ్‌ను ఎందుకు నువ్వన్నావే ఆ ప్రజలే గెలిపించారు. అది ఒక అనిర్వచనీయమైన భావన అంతే. ఇకపోతే అస్సలు రాజకీయాలే ఉండకూడదు అనుకునే నేను ఇక వాటిమీద లబ్దిపొండడం ఏముంది. పైగా నేను చెప్పిన విషయాలు స్థూలంగా కనుక గమనిస్తే అందులో శ్రమకి, స్వశక్తికీ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాను. ఇంక ఇందులో రాజకీయం ఏముంది”

“అంటే ఏమి చెప్పాలో ముందుగానే నిర్ణయించుకున్న నువ్వు కమ్యూనిస్ట్‌వా, సోషలిస్ట్‌వా, లేదా డెమొక్రాట్‌వా” ఆమె మాటలకు అడ్డుపడుతూ అడిగాడు సిద్ధార్థ.

 “కమాన్ సిద్ధూ ఐ థింక్ యు కెన్ డూ బెటర్ దేన్ దట్. సగటు మానవుడి నుండి నువ్విప్పుడు ఒక జర్నలిస్ట్ కింద ఎదిగావ్. ఇంకా ప్రయత్నిస్తే ప్రజాప్రతినిధి ఆ పైన ప్రతిపక్షం ఇలా పైపైకి వెళ్తావు, అప్పుడు నాకు నిన్ను ఎదుర్కోవడం ఇంకా సులభం అవుతుంది. ఎందుకంటే మనం ఎంత ఎత్తుకు వెళ్తే మనకి మన పక్కనున్న వాళ్ళు అంత తక్కువగా కనపడతారు.

అలాంటి వారు ఎప్పుడూ తమ పతనాన్ని తమ చేతుల్లోనే పెట్టుకుని తిరుగుతారు. కానీ మీ అందరికీ అర్ధంకాని విషయం ఏంటంటే నేను ఏ ప్రశ్నలు ఎవరినీ అడగడం లేదు. సమాజం యొక్క సహాయంతో తమంతట తాముగా ఎదిగే అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరినీ ఈ ప్రశ్నలు వేసుకోమని తమ జీవితాన్ని తామే మేరుగుపరుచుకోమని మాత్రమే సూచిస్తున్నాను. అలాంటప్పుడు మనకు ఎవరి అవసరం ఉండదు. నేను సూచించే ఈ మార్గం కేవలం జీవన విధానం మాత్రమే రాజకీయం కాదు” కొద్దిగా ఆవేశపడుతూ సమాధానం చెప్పింది ప్రియాంక.

“నువ్వు చెప్పినదంతా నిజమే కానీ జనాలు నిన్ను నమ్మడానికీ ఆమోదించడానికీ కొద్దిగా సమయం పడుతుంది. పైగా మీ తండ్రి  నకునారెడ్డి గారు. తమ పార్టీ పరాజయం నుండి ఇంకా కోలుకున్నట్లు లేదు” మెల్లగా అన్నాడు సిద్ధార్థ.

“మళ్ళీ చెప్పినా నీకు అర్ధం కాదేంటి సిద్ధూ? నేను ఎవరినైనా నమ్మించాలి అని కానీ ఎవరిచేతైనా ఆమోదింపబడాలి అని కానీ అనుకోవడం లేదు. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే ఐ హేట్ పోలిటిక్స్. నేను ఒక పోలిటీషియన్ కూతురుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను” బాధ నిండిన కంఠంతో అంది ప్రియాంక.

“నువ్వోప్పుకున్నా ఒప్పుకోకపోయినా, బాధపడినా, సిగ్గుపడినా, గర్వపడినా, ఏమి చేసినా జనం నిన్ను వారసురాలి కిందే చూస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా కానీ వారసత్వానికున్న ఘనత ఇంకా దేనికీ లేదు. తాము ఎన్ని నేరాలు చేసినా, ఎంత మంది గొంతు కోసినా, ఎన్ని దారుణాలు చేసినా తమ దేశం పేరో, తమ తండ్రి పేరో మరేదో చెప్పిన మరుక్షణం జనం మన ప్రమేయం లేకుండా వారసత్వం మనకు అంటగడతారు. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం, నువ్వేమి దీనికి అతీతం కావు” ఒక్కసారి ప్రియాంక వైపు చూసాడు సిద్ధూ. అతనికి తన మనోవేదనను ఏ విధంగా తెలియపరచాలా అని ఆలోచిస్తూ నిస్సహాయంగా చూస్తోంది ప్రియాంక.

“సో ఇప్పుడు నువ్వు చెయ్యదలచినది ఏంటో నిర్ణయించుకో. నీ లక్ష్యం ఏంటి రాజకీయమా, ప్రజాశ్రేయస్సా? వారసత్వమా,పౌరసత్వమా? నీ మాటలు ప్రకారమే చెప్పాలంటే శ్రమా? రాజకీయమా?” సూటిగా అడిగాడు సిద్ధార్థ.

అప్పుడు సమయం సరిగ్గా రాత్రి పదిగంటలు అయ్యింది. దూరంగా ఉన్న క్లాక్ టవర్ అందుకు సూచనగా పదిసార్లు మోగింది.ఇంకా ఏమి మాట్లాడాలో తెలియక సతమవుతున్న ప్రియాంకను ఉద్దేశించి “ కమాన్ మిస్ ప్రియాంక ప్రజలు మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. మీ మౌనాన్ని వారు రకరకాలుగా అర్ధం చేసుకునే ప్రమాదం ఉంది” ఆమెను నవ్వించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సిద్ధార్థ. కొద్దిగా తెలికపడడంతో చిన్నగా నవ్వింది ప్రియాంక.

“ఏంటి సిద్ధూ నా మాటలు నాకే అప్పజెప్తున్నావా. రాజకీయాలే కావాలనుకునేదాన్ని అయితే ఇంతసేపు మన కాన్వర్సేషన్ వేరేలాగ ఉండేది.నాకు కావాల్సింది నాతో కలిపి ప్రతీ ఒక్కరి శ్రమతో కూడి రాజకీయాలులేని ఒక మెరుగైన ప్రపంచం. దీనికోసం నేను ఎంత శ్రమపడడానికి అయినా సిద్ధమే” ఆవేశంగా అంది ప్రియాంక.

“నీ ఆఖరిమాటను కొద్దిగా మార్పు చేద్దాం అనుకుంటున్నాను ప్రియాంక. నువ్వు ఒప్పుకుంటాను అంటే మాత్రమే” తన వంక ఆలోచనగా చూస్తున్న ప్రియాంకను ఉద్దేశించి అన్నాడు సిద్ధార్థ.

“అంటే ఏంటి నాకు అర్ధం కాలేదు సిద్ధూ” అడిగింది ప్రియాంక.

“ఏమీలేదు ఎంత శ్రమ పడడానికి అయినా సిద్ధమే అన్నావు కదా దానికి బదులు ఏమి చెయ్యడానికైనా సిద్ధమే అను సరిపోతుంది” కొద్దిగా హింట్ ఇస్తున్నట్లుగా కనుబొమ్మలు ఎగరేస్తూ చెప్పాడు సిద్ధూ.

“ఏమి చెయ్యడానికైనా సిద్ధమే అంటే ఏమి చెయ్యాలని నీ ఉద్దేశం” తన అయోమయం ఇంకా ఎక్కువ కాగా అడిగింది ప్రియాంక.

“ఏమీ చెయ్యనవసరం లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించు సరిపోతుంది. నీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇస్తాను. ఇంకా మనకు అండగా మీ ఫాదర్ ఉండనే ఉన్నారు. ఇంకా నీ లక్ష్యానికి మార్గం సుగమం అయినట్లే.” ఉత్సాహంగా అన్నాడు సిద్ధార్థ.

“నో నెవర్, కలలో కూడా నేను అటువంటి జీవితాన్ని ఎన్నుకోను. నేను ఏ మనిషికీ వ్యతిరేకంగా వెళ్దాం అనుకోవడం లేదు. ఒకమేరుగైన వ్యవస్థలో నేను కూడా భాగస్వామిగా ఉండాలి అనుకుంటున్నాను అంతే” కొంచెం ఉద్వేగంగా చెప్పింది ప్రియాంక.

“నిన్ను ఎవరూ ఎదురువెళ్ళమని, వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పడం లేదు. కానీ మనకు ఎదురొచ్చేవాళ్ళనూ ప్రజల బలహీనతలను దెబ్బకొట్టే వాళ్ళనూ ఆపాలనుకోవడం తప్పు కాదుకదా” ఆమెకు అర్ధం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు సిద్ధార్థ.

“నీ దృష్టిలో నువ్వు కరెక్ట్ అయినప్పటికీ మన పనేదో మనం చేసుకుంటూంటే మన జోలికి ఎవరూ రారు అనేది నా వాదన. తరచితరచి చూస్తే రెండూ ఒకదానికి మించి మరొకటి బలమైనవి. ఏది ఏమైనా కానీ అందరి అంతిమ లక్ష్యం ఒకటే శాంతి, సామరస్యం, ప్రగతి” కొంచెం స్థిమిత పడుతూ చెప్పింది ప్రియాంక.

“ప్రజలకు ఏమైనా మంచి చెయ్యాలంటే ఆల్రెడీ జరిగిన చెడును ముందుగా ప్రక్షాళన చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే ముందు మనచేతుల్లో అధికారం ఉండాలి. సో ఆ ప్రకారం చూస్తే నువ్వు చెప్పిన శ్రమ ద్వారా శాంతి, సామరస్యం ఎట్సెట్రా ఎట్సెట్రా స్టఫ్ అంతా కూడా విజయం తరువాత వస్తుంది. దానికి రాజకీయం ఒకటే మార్గం. మనం ఎంతమంచి వాళ్ళమైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన మాటకు అంతగా విలువ ఉండకపోవచ్చు. అందుకే నీకు వేరే మార్గం లేదు రాజకీయం తప్ప. చూద్దాం భవిష్యత్తులో ఏమి జరగబోతోందో. ఏది ఏమైనా కానీ నా సపోర్ట్ ఎప్పుడూ నీకే ప్రియాంక” ఆశ్చర్యంగా చూస్తున్న ప్రియాంకతో అన్నాడు సిద్ధూ.

“ఏంటి అలా చూస్తున్నావు”

“ఏమి లేదు అప్పుడే నువ్వు నీ రాజకీయం నా మీద ప్రయోగించడం ప్రరంభించావేమో అని” చిన్నగా నవ్వుతూ అతడిని ఆటపట్టించింది ప్రియాంక.

తను అన్నది అర్ధంకాగానే ఆమె వెంటపడ్డాడు సిద్ధూ. గట్టిగా అరుస్తూ అతడిని నుంచి తప్పించుకోవడానికి గ్రౌండ్ చుట్టూ తిరుగుతోంది చంద్ర ప్రియాంక రెడ్డి డాటర్ అఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్  నకునారెడ్డి. కొద్దిసేపటికి ఇద్దరు అలిసిపోయి మళ్ళీ అదే సిమెంట్ బెంచ్ పైన కూర్చున్నారు.

“చివరగా నాదొక అనుమానం ప్రియాంక. నిన్ను సమాజం వైపు ఇంతలా ప్రేరిపించన సంఘటన కానీ వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారేమో అని తెలుసుకోవాలని ఉంది” అభ్యర్దిస్తున్నట్లు అడిగాడు సిద్ధూ. “కారణాలు ఏమైనప్పటికీ నా చుట్టుపక్కల నా స్నేహితుల మొదలుకుని నాతో పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరిలో ఎంతో కొంత మేరకు అసంతృప్తిని నేను గమనిస్తూ వచ్చాను, అలా ఎందుకు జరుగుతోంది అని నాకు నేనే ప్రశ్నించుకుంటే వచ్చిన సమాధానమే ఇంతకుముందు నువ్వు నా దగ్గర నుంచి విన్న ప్రసంగంలాంటి ఆత్మఘోష. దీనికి ప్రత్యేకమైన కారణాలు అన్వేషించడం మూర్ఖత్వమే అవుతుంది” తన చెప్పదలచుకున్నది సూటిగా చెప్పింది ప్రియాంక.

“ఒక్కోసారి నిన్ను అర్ధం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ప్రియాంక, నీకు పూర్తిగా దగ్గర అనుకున్నవాళ్ళకి కూడా” అతను లేచి ఆ క్షణంలో భావరహితమైన ఆమె వదనం వైపు ఒకసారి చూసి అక్కడనుండి నిష్క్రమించాడు. ఆమె అలా సూన్యంలోకి చూస్తూనే ఉండిపోయింది. పదకొండుగంటలు సూచిస్తూ క్లాక్ టవర్ దగ్గర గంట మోగింది.

***

హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లోని పదిహేనవ అంతస్తు చాలా నిశ్శబ్దంగా ఉంది. మిగిలిన అన్ని అంతస్తులతో పోలిస్తే అక్కడ హోటల్ సెక్యూరిటీ కూడా ఎక్కువగానే ఉంది. వీరితో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అలెర్ట్‌గా ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లో జరగబోయే సమావేశానికి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొడుగాటి నల్లటి సూట్లు ధరించిన వ్యక్తులు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు.

వారిలో కొంతమంది ధరించిన సూట్ లోపల ఎవరికీ కనపడకుండా ఉన్న ఒక రివాల్వర్ భద్రపరచబడి ఉంది. అతి ముఖ్యమైన వ్యక్తుల కోసం మాత్రమే సెక్యూరిటీ సంస్థ ఇటువంటి సౌకర్యాలు కలిపిస్తుంది. ఇప్పుడు అక్కడ జరగబోయేది మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత శాసనసభ సభ్యుడు అయిన  నకునారెడ్డిడి ఆధ్వర్యంలో జరిగే అంతరంగిక సమావేశం. ఎన్నికల తరువాత చీలిపోయిన తన పార్టీలో ఇప్పుడు రెండు వర్గాలు ఉన్నాయి.

ఆ సమావేశానికి పార్టీ సభ్యులు, పార్టీలో తన పక్షంలో మిగిలిన పదిహేనుమంది ఎమెల్యేలు మాత్రమే కాకుండా గత ఎన్నికల్లో పార్టీని బలపరచిన నలుగురు ఐదుగురు పారిశ్రామికవేత్తలు నకునారెడ్డి ద్వారా లాభం పొందిన కొంతమంది వ్యక్తులు కూడా వచ్చారు. వీళ్ళందరినీ ఈ సమయంలో సమావేశపరచడానికి ప్రముఖ పారిశ్రామికవేత్త భూషణరావు హస్తం ఉంది. భూషణ్ ఇండస్ట్రీస్, ధన్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంకా అనేక సంస్థలకు యజమాని భూషణరావు అంతేకాకుండా గత ఎన్నికల్లో జె.హెచ్. పార్టీ ఎలెక్షన్ క్యాంపెయిన్‌ను తన ఆర్ధిక బలంతో ప్రోత్సహించి చివరిగా పార్టీ ఓటమితో నష్టపోయింది కూడా భూషణరావే.

సహజంగా వ్యాపారస్తుడైన భూషణరావు తన పెట్టుబడిని ఏ విధంగా అయినా రాబట్టుకోవడానికి ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే రూలింగ్ పార్టీ అయిన జనసమాజ్ పార్టీ వల్ల చాలా వరకు ఇరిగేషన్, ఎలెక్ట్రిసిటీ మరియు ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్లు చాలావరకు చెయ్యిదాటిపోయాయి. ఇకమీదట మరింత నష్టం ఎదుర్కునే పరిస్థితిల్లో భూషణరావు లేడు, అందుకే తన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి చర్చించడానికే ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశానికి ఒక్కొక్కరే రావడం ప్రారంభించారు.

అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు అయ్యింది. ఆ మీటింగ్‌కు మీడియా దూరంగా వుండే విధంగా భూషణరావు మనుషులు చర్యలు తీసుకున్నారు. కొద్దినిమిషాలలో నకునారెడ్డి, భూషణరావు ఇంకా తదితర పెద్దతలకాయలు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పెద్ద రౌండ్ టేబుల్ మీద అందరికీ డ్రింక్స్ సర్వ్ చెయ్యబడ్డాయి.

“ఇప్పటికే నష్టాన్ని ఎదుర్కున్న నేను మరింత నష్టాన్ని ఆహ్వానిస్తూ ఈ మీటింగ్ ను ఆర్గనైజ్ చేయ్యదినికి గల కారణం మీకు ఈ పాటికే అర్ధం అయ్యి ఉండాలి” తన చేతిలోని విస్కీ గ్లాస్‌తో రౌండ్ టేబుల్ చుట్టూ పచార్లు చేస్తున్న సమావేశాన్ని ప్రారంభిస్తున్నట్లుగా అన్నాడు.

“అర్థం అవ్వడానికి ఏముంది మీ డబ్బు ఎంత పెట్టినా మా పార్టీని గెలిపించలేకపోయారు. పదవిలో లేని మేము ఇప్పుడు మీకు ఏ విధంగానూ ఉపయోగపడము. రీసెంట్‌గా మీకు కేటాయించబడిన భూమిని కూడా ప్రభుత్వం లాగేసుకోవాలి అనుకుంటోంది. మేము తిరిగి పదవిలోకి వస్తే కానీ మీరు పెట్టిన డబ్బు వెనక్కి రాదు. అంతేకదా మీరు చెప్పేది” ఒక ఎమెల్యే అన్నాడు.

“చూడండి ప్రసాద్ గారు ఇప్పటికే మనం నష్టపోయాం అన్నది నిజమే అయినప్పటికీ ప్రజలకి మనమీద నమ్మకం పోలేదు. ఒకటి రెండు ప్రాజెక్టులు చేయ్యజారినంత మాత్రాన మీకు కలిగే నష్టం ఏమి లేదు. పైగా భూషణరావు గారి సంస్థల పైన నాకు అపరిమితమైన నమ్మకం, వారి సామర్థ్యం పైన గట్టి విశ్వాసం ఉన్నాయి. రాబోయే రోజులలో ప్రభుత్వానికి అవసరమైన ఎన్నో ప్రాజెక్టులలో తమ సహకారాలు అందిస్తారు అని భావిస్తున్నాను. ఆ వైపుగా కృషి చేస్తాను అని కూడా చెప్తున్నాను” తను మధ్యలో జోక్యం కల్పించుకుని చెప్పాడు  నకుమా రెడ్డి. ఎమెల్యే ప్రసాద్ కొద్దిగా తగ్గి తన సీట్లో కూర్చున్నాడు.

 “మీ రాజకీయాలు ఏమైనా ఉంటే జనాలమీద ప్రయోగించండి రెడ్డిగారు. ఒక పక్క కేంద్రస్థాయిలో అంతర్జాతీయ పర్యటనల ద్వారా పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఉంటే, లోకల్‌గా ఉండి మనం చేతులు ముడుచుకు కూర్చుంటే ప్రయోజనం ఏముంది. అస్సలు మీ బదులు ఆ జోగేశ్వరరావుని నమ్ముకున్నా నాకు మంచి జరిగేదేమో. ఐ థింక్ ఐ బెట్ ఆన్ ద రాంగ్ హార్స్” కొంచెం కటువుగా అన్నాడు భూషణరావు. అతను అన్నమాటలకు కొద్దిగా సీరియస్ లుక్ ఇచ్చాడు  నకునారెడ్డి.

“మీరు లుక్‌లు ఇవ్వడం వల్లన ఏమి ఉపయోగం లేదు గురువుగారు. ఇందాకా మీ ప్రసాద్‌గారు చెప్పినట్లుగా నా పవర్ ప్రాజెక్ట్ కోసం మీ హయాములో ప్రభుత్వం ద్వారా కేటాయించబడిన స్థలం తక్కువకు కట్టబెట్టారని, ప్రస్తుతం ప్రభుత్వం ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించాలి అనుకుంటోంది అని తిరిగి దానిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు జోగేశ్వరరావు. ఆ ఇతర అవసరాలేంటో ప్రభుత్వం వారు చెప్పరు, మీకున్న సంఖ్యా బలంతో మీరు గట్టిగా ప్రశ్నించలేరు. నాకు ఇమీడియట్‌గా వచ్చే నష్టం ఏమి లేకపోయినప్పటికీ అతడిని తీసిపడేయ్యలేము కదా. అందుకే మధ్యంతరమో, ప్రత్యామ్నాయమో మరేదో మార్గం చూస్తారనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది. అంతేకాని మీ హామీలు పదే పదే వినడానికి కాదు” మరోసారి  నకునారెడ్డితో గట్టిగా చెప్పాడు భూషణరావు. నకునారెడ్డి పార్టీకి చెందిన మిగిలిన ఎమెల్యేలు అంతా గుటకలు మింగారు.

“భూషణరావు గారు రాజకీయం అంటే గుర్రపు పందెమో క్రికెట్ మ్యాచో కాదు టీమ్స్‌ను కొనుక్కుని పోటీపడడానికి. ప్రజాభాగస్వామ్యం కలిగిన ఒక అతిపెద్ద వ్యవస్థ. మీరు మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడకండి ఎలెక్షన్స్ అయ్యి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే మధ్యంతరం గురించి మాట్లాడితే ప్రజలు మొఖాన ఉమ్మేస్తారు. అందులోనూ ఎన్నికల్లో మీరు నా ప్రమేయం లేకుండా కొన్ని సొంత నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని నేను ఏనాడు ఎత్తి చూపలేదు. ఇప్పుడు వచ్చి ఏదో నా ఒక్కడివల్లా మీరు నష్టపోయారు అన్నట్లుగా మాట్లాడడం ఏమి బాగాలేదు. అయినా ఇప్పుడు మించిపోయింది ఏమి లేదు మీ స్థలం విషయంలో కోర్ట్ ఇంకా ఎటువంటి తీర్పు ఇవ్వలేదు కాబట్టి మీరు భారం నా పైన వేసి ధీమాగా ఉండండి” అతడిని కొంచెం అనునయించడానికి ప్రయత్నించాడు నకునారెడ్డి.

“మీరు ఏదో ఒకటి చేస్తారనే అప్పట్లో మీమీద నమ్మకం ఉంచాను కానీ మీ సామర్థ్యం తరువాత కదా బయటపడింది. ఎనీవే దాని గురించి నాకిప్పుడు పెద్దగా బాధ లేదు. లాయర్లను కొంటారో, లాబీలే చేస్తారో మరేమైనా చేస్తారో అది మీ ఇష్టం. మీరు ఎలాగైనా దీనికి పరిష్కార మార్గం అలోచించి నాకు ఫేవర్‌గా ఆ స్థలం వచ్చేలా చెయ్యండి. అవతల పవర్ ప్రాజెక్ట్‌కు వనరులన్నీ సిద్ధపరచుకుని నేను ఇప్పటికే ఎంతో ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. లేదంటే నేను నా పద్ధతిలో ప్రత్యామ్నాయం వెతుక్కోవలసిన అవసరం ఉంటుంది” ఆ చివరిమాటలు అంటునప్పుడు భూషణరావు కళ్ళల్లో అదొక రకమైన మెరుపు కనిపించింది.

తనకు కావలసినది దక్కించుకోవడానికి హత్యలు చేయించడానికి కూడా వెనుకాడని తత్వం భూషణరావుది అని  నకునారెడ్డికి తెలుసు. తన ప్రభుత్వం హయాములోనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మరియు ఇద్దరు పోలీసు ఆఫీసర్లు హత్యకు గురైన సంఘటనల విషయంలో భూషణరావు కొమ్ముకాసాడు  నకునారెడ్డి. కొన్నికొన్ని సమయాల్లో తమకు నచ్చకపోయినా ఇటువంటి పనులు చెయ్యక తప్పలేదు. చిన్నగా నిట్టూర్పు విడిచాడు జనార్ధన్.

***

“హే ఇటు చూడండి రా మన ప్రియాంక ఈ వీడియోలో ఎంత క్యూట్‌గా ఉందో” ఆనందంతో కేరింతలు కొడుతూ అన్నాడు గణేష్. అతని చుట్టూ నలుగురు యువకులు గుమిగూడి ఉన్నారు.

వారంతా ఒక బెడ్ మీద కూర్చుని లాప్టాప్‌లో ఎదో వీడియో చూస్తూ పగలబడి నవ్వుతున్నారు, మధ్యమధ్యలో గట్టిగా అరుస్తున్నారు. వారందరినీ విసుగునిండిన వదనంతో దూరంనుండి గమనిస్తున్నాడు రాహుల్. అతను ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జోగేశ్వరరావు ఒక్కగానొక్క కొడుకు. అతను కూడా ఏషియన్ కాలేజీ లోనే ప్రియాంక చేసే కోర్సు చేస్తున్నాడు.

గతంలో జోగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రిగా కూడా తన సేవలను అందించాడు. రాజకీయపరంగా బద్ధ శత్రువులుగా కనిపించే జోగేశ్వరరావు, నకునారెడ్డి ఒకే ఊరు వారు కావడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి.

“అందం వ్యక్తిత్వంతో పాటు ఒక హై ప్రోఫైల్ స్టేటస్ కూడా ఉండడం చాలా అరుదుగా జరుగుతుందే. దానికి తోడు ఆమె ఇంకా అన్‌మేరీడ్ అండ్ ఓపెన్లీ అవైలబుల్. సో హూ ఈస్ గోయింగ్ తో బీ ద ప్రిన్స్. యు, యు, యు,యు…” అని తన చుట్టూ ఉన్న నలుగురి వంకా చూస్తూ కళ్ళని చక్రాల్లా తిప్పుతూ అడిగాడు గణేష్.

“ఆర్ మీ..?” చివరిగా తన వైపు వేలు చూపించుకుని గట్టిగా నవ్వాడు గణేష్.

“ఎనఫ్ రా గణేష్, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావ్. ఆమె గురించి నీకేమి తెలుసని. అస్సలు నీకీ వీడియో ఎలా వచ్చింది” విసురుగా లాప్టాప్ లాక్కుంటూ అడిగాడు రాహుల్.

నిజంగానే ఆ వీడియోలో ప్రియాంక చాలా అందంగా ఉంది. అందరి కళ్ళూ ఆమెకే ఆకర్షింపబడే విధంగా ఉంది. ఆమె ఆ ముందర రోజు రాత్రి సభాప్రాంగణంలో ఎవరూ లేని సమయంలో తనకోసం తాను నిర్వహించిన ఆ ప్రసంగాన్ని ఎవరో దొంగచాటుగా వీడియో తీసి యూట్యూబ్ లోకి ఎక్కించారు.

ఈ మధ్య కొద్దిగా ప్రాముఖ్యం ఉన్నవారినే వదలకుండా ఉన్నారు ప్రజలు మరి అలాంటిది మాజీ ముఖ్యమంత్రి కూతురు అంటే రాలుగాయిలు ఊరుకోరు కదా. ఇప్పుడు ఆ వీడియోలోనే స్పాట్ లైట్ వెలుగులో ఆమె ముఖం మరింత స్పష్టంగా కనపడుతోంది. ఐదడుగుల ఎనిమిది అంగుళాలు పొడవు, పొడవుకు తగిన బరువు, నవ్వితే సొట్ట పడే నునుపైన బుగ్గలు. ఎప్పుడూ ఎదో సమాధానాన్ని వెతికే తీక్షణమైన చూపు. దిష్టి చుక్కలా పెదవికిండా గెడ్డం మీద చిన్న మచ్చ.

ఎప్పుడూ పెదవులపైన చెరగని ధృడమైన దరహాసం, సిమెంట్ కలర్ టాప్ వైట్ కలర్ లెగ్గిన్‌తో చాలా సింపుల్ అండ్ స్టన్నింగ్‌గా ఉంది ప్రియాంక. ఆమె మేడలో ఎప్పుడూ హృదయం గుర్తు ఉన్న గొలుసు కనిపిస్తూ ఉంటుంది. చూపరులకు ఎంతో మనోహరంగా కనిపించే ప్రియాంకను చూసి ఆ క్షణంలో రాహుల్ కొద్దిగా చలించాడు అనడంలో అతిశయోక్తి లేదు.

“నువ్వెందుకు బాబూ అంత ఆవేశపడుతున్నావు కొంపతీసి నువ్వుగానీ ట్రై చేస్తున్నావా ఏంటి. అలాంటిదేమైనా ఉంటే చెప్పేయ్ రా బాబూ మేమందరం. అస్సలే మీమీ ఫాదర్స్ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. ఏదో ఒకరోజు మీరు ఇద్దరూ కలవడం ఖాయం. అందులోను నీలాంటి ఆజానుబాహుడు, అందగాడు, గుణవంతుడు ఉండగా మేడం గారు ఇంకా మమ్మల్ని ఏమి చూస్తారు” నిస్సహాయంగా తన మిగిలిన స్నేహితుల వంక చూస్తూ చెప్పాడు గణేష్.

“షటప్ నోటికి ఎంతమాట వస్తే అంత అనేయ్యడమేనా. అయినా నేను నా జీవితంలో ప్రియాంకను ఇప్పటివరకు చాలా తక్కువసార్లు చూసాను, అది కూడా చాలా ఫార్మల్ మీటింగ్స్‌లో. సో నేను ఆమెను ట్రై చేస్తున్నాను అన్నదానికి చాన్సెస్ చాలా తక్కువ.

చూడ్డానికి బాగున్నంత మాత్రాన ప్రేమ పుట్టదు కదా, అందులోనూ రాజకీయాలు వేరు నిజజీవితం వేరు. మా డాడ్ ఎప్పుడూ నాతో పాలిటిక్స్ డిస్కస్ చెయ్యరు, సో మేము కలుస్తామా లేదా అన్నది నువ్వు, నేను కాదు దేవుడే డిసైడ్ చెయ్యాలి. సో పిచ్చిపిచ్చి ఆలోచనలు మాని మనం చెయ్యబోయే ప్రోగ్రాం గురించి ఆలోచించడానికి ట్రై చెయ్యి” కొంచెం ఘాటుగా సమాధానం ఇచ్చాడు రాహుల్. తనకి కూడా మనసులో ఏదో ఒక మూల ప్రియాంక అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ ఆ విషయం అందరి ముందు బయట పడదలచుకోలేదు రాహుల్.

“ఏమో బాబూ ఆ విషయాలేమీ నాకు తెలియవు అమ్మాయి బాగుంటుంది, ఈడూజోడూ సరిగ్గా సరిపోతుంది ఏమైనా ఆశ పడతావేమో అని చెప్పానంతే” కొంచెం పెద్దవ్యక్తి తరహాలో గణేష్ చెప్పిన తీరుకి అందరూ మనస్పూర్తిగా నవ్వారు.

***

సమయం ఉదయం ఎనిమిది గంటలు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. చిన్న చిన్న పక్షుల శబ్దాలు ఆ వాతావరణానికి తోడై ప్రకృతి చాలా రమణీయంగా గోచరిస్తోంది. సూర్యుని లేలేత కిరణాలు భూమిపై పది నేల అదోరకమైన కొత్త రంగు ఏర్పరుచుకుని మనోహరంగా దర్శనం ఇస్తోంది. వడివడిగా అడుగులేస్తూ వచ్చిన ఒక ఎనిమిదేళ్ళ చిన్నారిపాప తన భుజాన ఉన్న చిన్న సంచీని పక్కన ఉన్ననచి అందులో ఉన్న ప్లాస్టిక్ సంచీను పక్కన పెట్టి అక్కడే నేలపై కూర్చుంది.

తన చిట్టిచిట్టి చేతులతో నింపాదిగా ఆ సంచీను విప్పి అందులో ఉన్న చిన్న మొక్కను తన పక్కన పెట్టుకుంది. ఇంకా దేనికోసమో వెతుకుతుండగా భుజాన చిన్న తుండు గుడ్డ వేసుకున్న తాత ఒకతను ఆ పాప దగ్గరకు వచ్చి ఆ పాపను ఎత్తుకుని బుగ్గలు పునికిపుచ్చాడు

“ఏమి కావాలి పాపా. ఏం చేద్దాం అని వచ్చావ్ ఇక్కడకి ఇంత ఉదయమే” ఆ పాపను ముద్దు చేస్తూ అడిగాడు. తన చేతులకి అంటిన మట్టి తీస్తూ ఆమె అక్కడ చేతి సంచీ పక్కన ఉన్న మొక్క వైపు చూపించింది. వెంటనే అతను కొంచెం ఎదరకు వెళ్లి తనకు అవసరమైన పనిముట్లు తెచ్చుకుని అక్కడే ఒక అడుగు లోతులో చిన్న గోతిని తవ్వాడు.

ఆ పాప తన బుడిబుడి అడుగులతో చేతి సంచీ దగ్గర ఉన్న మొక్క తీసుకువచ్చి అక్కడ తాత తయ్యారు చేసిన గోతిలో ఉంచి తన చిన్న చిన్న గుప్పిళ్ళతో మట్టి తీసుకుని మెల్లిగా ఆ గోతిని పూడ్చడం ప్రారంభించింది. తాత తన వంతుగా పనిముట్లతో మిగిలన గోతిని పూడ్చాడు, ఇద్దరూ కలిపి అక్కడ పాతిన మామిడి మొక్కకు నీళ్ళుపోసారు. పాప ముఖంలో ఒక వెలుగు కనిపించగానే ఆ ప్రదేశం మొత్తం ఒక్కసారి హర్షధ్వానాలతో చైతన్యవంతం అయ్యింది. అక్కడికి వచ్చిన జనాలు అందరూ పాప చేసిన పనిని కొనియాడారు.

అది హరితభూమి అనే కార్యక్రమం నిర్వహింపబడుతున్న వేదిక. కార్యక్రమం సందర్భంగా రాహుల్ మరియు గణేష్‌తో కూడిన అతని మిత్ర బృందం తయ్యారు చేసిన ఆ లఘుచిత్రం అందరినీ ఎంతో ఆకట్టుకుంది. పరిశుభ్రత పాటించడం, ఆధునిక పద్ధతుల్లో వ్యర్థ నిర్వహణ ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. చెన్నైలోని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న ఆ విశిష్ట కార్యక్రమం ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది.

ఇందులో ఎంతోమంది యువకులు, సామజిక సేవా సంస్థలు, విద్యార్ధులు, ఉపాధ్యాయుల స్వచ్చందంగా పాలుపంచుకున్నారు. ప్రొఫెసర్ వరదరాజన్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఆసియన్ కాలేజీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపడుతున్న ఆయన దేశవిదేశాలలో విద్యనూ అభ్యసించడమే కాకుండా అతి చిన్న వయసులోనే ఎంతో మంది మహనీయుల మన్ననలు అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక కూడా సిద్ధార్ధతో కలిపి అక్కడకి రావడం తటస్థించింది. ప్రియాంకను ఆమెకు తెలీకుండానే మూడవ వ్యక్తి ద్వారా రాహుల్ ఆహ్వానించాడు, అయినప్పటికీ ఇటువంటి కార్యక్రమాల్లో ఆమె తనంతట తానుగా పాలుపంచుకుంటుంది. ఈ సంగతి తెలిసనప్పుడు ప్రొఫెసర్ వరదరాజన్ ఈ కార్యక్రమానికి వస్తే అది అందరికీ ఉపయోగకరం అవుతుంది అని భావించి అదే ఆమె సూచించింది.

వరదరాజన్ నిమ్న వర్గానికి చెందిన వ్యక్తి. చాలా తెలివైనవాడు. అంతేకాకుండా ప్రతీ విషయంలోనూ క్రియాశీలతను ప్రదర్శించేవాడు. అతనిది ఆశ్చర్యకరమైన స్వభావం. అతనికి కుటుంబంలో కానీ, వృత్తిలో కానీ మరే ఇతర అంశంలో అయినామిత్రులు కానీ, శత్రువులు కానీ ఎవరూ లేరు. అయన ధ్యాస నిరంతరం పుస్తక పఠనంలోనే ఉంటుంది. చరిత్రలో జరిగిన అంశాలను వర్తమాన కాలానికి అన్వయించి వాటి ద్వారా భవిష్యత్తుకు పునాది వెయ్యగలగాలి అని అతడి వాదం.

అతనికి పరిచయం ఉన్న అందరూ అతడిని ఒక శాడిస్ట్, జడుడు అని అనుకుంటారు అయినాకూడా అన్ని విషయాల్లో అతని సలహాలే తీసుకుంటారు. సహజంగా అతను ఎక్కువగా ఇటువంటి పబ్లిక్ ప్రోగ్రామ్స్‌కి రారు, కానీ ఎటువంటి వారినైనా తన అభ్యర్థనతో కట్టిపడేసి రప్పించగల ఆకర్షణ ప్రియాంకలో ఉంది. వరదరాజన్ మానసిక స్థితిని అర్ధం చేసుకుని అతనికి దగ్గరగా వచ్చిన అతి తక్కువ వ్యక్తులలో ప్రియాంక ఒకరు, అందుకే ఆమె అభ్యర్థనను కాదనలేక అతను ఆ కార్యక్రామానికి వచ్చాడు.

నలభై ఐదు సంవత్సరాలకే మొత్తం ప్రపంచం జ్ఞానాన్ని సంపాదించిన అతను ఒకానొక సమయంలో ఏకబిగిన ఇరవై ఎనిమిది గంటలు పాటు గ్రంధాలయంలో కూర్చున్న చోట నుండి కదలకుండా చదివి స్పృహ తప్పాడు. ఇటువంటి ఎన్నో సంఘటనలు కూడుకున్న అతని జీవితం ఎప్పుడో ప్రపంచంతో సంబంధం కోల్పోయి ఒకరకమైన డిటాచ్మెంట్ ఏర్పరుచుకుంది.

“రండి సర్ మీరు ఈ కార్యక్రమానికి రావడం మాలాంటి ఎంతోమంది వ్యక్తులకు ప్రోత్సాహకరం” ఆయనను సభావేదిక వైపు నడిపిస్తున్న గణేష్ అన్నాడు. అతని పక్కనే రాహుల్ కొంచెం దూరంలో ప్రియాంక ఆమెకు కొంచెం ఎడంగా సిద్ధార్థ నిల్చుని ఉన్నారు. వరదరాజన్ పెద్దగా స్పందించలేదు. గణేష్ రాహుల్ వైపు చూడగా అతను నిశ్శబ్దంగా ఉండమన్నట్లు సైగ చేసాడు.

అక్కడ ఐదు వందలమంది పైగా వివిధవర్గాలకు చెందిన ప్రజలు వచ్చి ఉన్నారు. అందరూ ఏదో కొత్త విషయాన్ని వినడానికి ఉత్సాహపడుతున్న వారికిమల్లే కనిపిస్తున్నారు. వరదరాజన్ వేదికను అలంకరించిన కొద్ది సమయానికి రాహుల్ సభను ఉద్దేశించి మాట్లాడడం ప్రారంభించాడు. అతని సంభాషణ మొత్తం ఆంగ్లంలో జరిగింది.

“మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతీ ఒక్కరికీ ఎంతో ఉపయోగకరమైనది, ప్రతీ ఒక్కరిలో సామాజిక స్పృహ మేల్కొలిపేది. మీకు తెలుసు అభివృద్ది చెందిన దేశాలలో వ్యర్థపదార్ధాల నిర్వహణ కూడా అత్యంత సాంకేతిక నైపుణ్యంతో జరుగుతుంది. మనదేశంలో ఇటువంటి పద్ధతులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. పరిశుభ్రత కూడుకున్న పచ్చదనం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని మనందరికీ తెలుసు.

వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరూ శుభ్రత పాటించిన రోజున మన పరిసరాలు వాటంతట అవే నివాసయోగ్యంగా, ఆరోగ్యకరంగా మారతాయి. ఆరోగ్యకరంగా ఉన్న పరిసరాలే అభివృద్ధికి పునాదులు. దురదృష్టవశాత్తు నేను మాట్లాడినటువంటి మాటలు మాట్లాడే వారిని మనలో చాలామంది రాజకీయమని అభిప్రాయపడుతున్నారు. కానీ నిత్యం మనం నివసించే సమజంలో మనయొక్క భాగస్వామ్యం కూడా ఉండడం వల్లనే మెరుగైన సమాజం ఏర్పడుతుంది అన్నది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం.

నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి స్వచ్చందంగా వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు. చివరగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వరదరాజన్ గారిని తమ అభిప్రాయాన్ని మనతో పంచుకోమని అభిలషిస్తూ సెలవు తీసుకుంటున్నాను” ప్రజల హర్షధ్వానాల మధ్య రాహుల్ వరదరాజన్‌ను ఆహ్వానించాడు. నిశ్శబ్దంగా మైక్ దగ్గరకు వచ్చిన వరదరాజన్

“నాకు ఇటువంటి కార్యక్రమాలకు రావడం పెద్దగా అలవాటు లేదు. అయినప్పటికీ నాకు ఎంతో ప్రియమైన విద్యార్థులు కనబరుస్తున్న చొరవ నిజంగా నాకు చాలా నచ్చడంవల్లే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడా గొంతు విప్పని నేను ఈరోజు రాహుల్, ప్రియాంక లాంటి వారు చేస్తున్న కృషిని గుర్తించి కొద్దిగా సమాజంలో వ్యక్తిగత బాధ్యతగా నా భావాలను కొద్దిగా మీతో పంచుకుందాం అనుకుంటున్నాను” అతను ఈ మాటలు అనడంతో స్టేజి మీద రాహుల్‌కు కొద్దిగా దూరంగా ఉన్న గణేష్ ఎవరూ గమనించకుండా రాహుల్ వైపు చూసి తన కుడిచేతిని పైకెత్తి కన్నుకొట్టాడు. రాహుల్ దానికి చిన్నగా నవ్వాడు. వీరిద్దరి చేష్టలను దూరంనుంచి గమనించింది ప్రియాంక. వరదరాజన్ ఏం చెప్తాడో అని కుతూహలంగా ఎదురు చూస్తున్నారు అక్కడికి వచ్చిన ప్రజలు.

“నేనొక హిస్టరీ ప్రొఫెసర్ని. నా చిన్నతనంనుంచీ చరిత్ర పట్ల ఆకర్షితుడినయ్యాను. నాతోటి చదువుకున్న విద్యార్ధులందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలాంటివి చదువుతూంటే నాకు మాత్రం చరిత్ర అంటే విపరీతమైన ఇష్టం ఏర్పడింది. నా స్నేహితులు అందరూ చరిత్ర నిష్ప్రయోజనమైనది దానికి ఆధునిక ప్రపంచంలో స్థానం లేదు అని వాదించేవారు. నేను వారిమాటలు పట్టించుకోలేదు ఫలితంగా మెల్లమెల్లగా నా స్నేహితుల సంఖ్య తగ్గడం ప్రారంభించింది.

చరిత్ర అనేది నిరూపించబడిన ఒక శాస్త్రానికి ప్రతీక, కనుక అది కూడా ఒక శాస్త్రమే. ఎవరైతే చరిత్రను విస్మరించి బహిష్కరిస్తారో వారు చరిత్రను పునరావృతం చేస్తారు. అందులో నూటికి తొంబై శాతం నష్టమే జరిగే అవకాశం ఉంది. మన నిర్మించుకున్న నేటి సౌధాలు నిన్న మనం గడించిన మేధస్సు మీద ఆధారపడినవే అని గమనించండి. ఇకపోతే ప్రస్తుతం మనం జరిపే ఈ హరిత భూమి కార్యక్రమం చరిత్రలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

రాహుల్ లాంటి యువకుల అవసరం సమాజానికి ఎంతో ఉంది. ప్రతీ ఒక్కరూ తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని తమ జీవితాల్లో అన్వయించుకుంటే వ్యర్థ నిర్వహణ ప్రభుత్వానికి చాలా సులభతరం అవుతుంది. ఇది గ్రహించి అందరూ అభివృద్దిపథంలో నడుస్తారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.”

అంతటితో కార్యక్రమం ముగియగా రాహుల్ బృందం అక్కడి నుంచి నిష్క్రమించింది. ప్రియాంక వరదరాజన్ దగ్గరకు వెళ్లి ఏదో విషయం మాట్లాడుతోంది.

(సశేషం)

Exit mobile version