Site icon Sanchika

రాజకీయ వివాహం-10

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘.  ఇది 10వ భాగం.  [/box]

అధ్యాయం- 10

[dropcap]ఆ[/dropcap] తరువాత జరిగిన బహిరంగ సభలో ఎటువంటి అల్లర్లూ, ఘటనలూ జరగకుండా సభ చాలా ప్రశాంతంగా ముగిసింది. ఆ సభలో రాహుల్ ప్రజలవద్ద తన గుర్తింపు ద్విగుణీకృతము చేసుకున్నాడు. అందరూ అతడిని తండ్రికి తగ్గ తనయుడని, అభివృద్ధికి మారుపేరని ఏకగ్రీవంగా నిర్ణయించేశారు. త్వరలో జరగబోయే బై ఎలెక్షన్స్‌లో తొలిసారిగా అతను పార్టీ నుండి ఎమ్మెల్యే కావడం ఖచ్చితం అని ఘంటాపథంగా చెప్పారు.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు గుండెపోటు కారణంగా మృతి చెందడంతో ఆ స్థానానికి మళ్ళీ ఎన్నికలు జరగనున్న సందర్భంలో రాహుల్‌ను ఆ సీట్‌కి పోటీ చేయించడానికి జనసమాజ్ పార్టీ నిర్ణయించుకుంది. నిన్న మొన్నటివరకు కేవలం ప్రచారంలోనూ, కార్యనిర్వహణలోనూ, ప్రాతిపదికలు సిద్ధం చెయ్యడంలో మాత్రమే పాలుపంచుకున్న రాహుల్ ఒకవేళ కీలకమైన ఆ స్థానాన్ని దక్కించుకుంటే జనసమాజ్ పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎదుగుతాడని పత్రికలవారు ఊహాగానాలు ప్రచురించారు.

తొలి విజయంతోనే అతను మంత్రి అయినా ఆశ్చర్యం లేదని కూడా కొంతమంది భావించారు. ఆ సభలో రాహుల్ కనబరిచిన లౌక్యం, అసమాన ప్రతిభ, వాక్చాతుర్యం ఇవన్నీ గమనించిన జోగేశ్వరరావు తను తిరిగి వచ్చిన తరువాత రాహుల్‌ను ఎంతగానో మెచ్చుకున్నారు. ఇంకా తనకు రాజకీయాల నుంచి వైదొలగాల్సిన అవసరం వస్తుందేమో అని ఆయన తన పార్టీవారితో సరదాగా అనడం కూడా జరిగింది.

సభ విజయవంతం కావడంతో అక్కడ ప్రియాంక మరియు ఇతర వర్గాలు భావించినట్లుగా ఏర్పడిన వ్యతిరేకత ఏదైనా అది పూర్తిగా సమసిపోయిందనే చెప్పవచ్చు. ఈ పరిణామాలు అన్నీ పరిశీలిస్తున్న ప్రియాంకకు ఒక పక్క ఆనందంగానే ఉంది, మరొక పక్క రాహుల్‌కు ఇంకా ముప్పు పొంచి ఉందేమో అని అనుమానంగా కూడా ఉంది. కానీ తను అనుకున్నట్లుగా ఆదిత్య నారాయణ కానీ, భూషణరావు ఫేక్షన్ కానీ బహిరంగ సభ సమయంలో ఎటువంటి ఘటనలకు పాల్పడకపోవడం ఆమెకు ఆశ్చర్యం అనిపించింది.

ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి విషయమే అయినా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడానికే కష్టంగా ఉంది. ఇటుపక్క త్వరలో జరగబోయే బై ఎలక్షన్స్‌కి తమ పార్టీ అభ్యర్ధిని ఖాయం చెయ్యవలసిన బాధ్యత తనపై ఉండగా ఏమి చెయ్యాలా అనే సందిగ్ధంలో పడింది ప్రియాంక. ఆమె రాహుల్‌కు  పోటీగా ఎవరినీ నిలపడానికి ఇష్టపడలేదు.

రాహుల్ చేస్తున్న కార్యక్రామాలను చూపి ఇటువంటి వారికి మనం సహకరించాలి, ఎంత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అది మన బాధ్యత అని తన వాదనను ఆమె తన పార్టీలో ముఖ్యనేతలకు వివరించింది. ఈ నిర్ణయాన్ని వారు అంతగా స్వాగతించకపోయినా ప్రస్తుతానికి ఆ ఎలెక్షన్లో అభ్యర్ధిని నిలుపకూడదు అనే అనుకున్నారు. అయితే రాహుల్‌ను ఆమె వ్యక్తిగతంగా ఇష్టపడడమే కాకుండా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని పార్టీలో చాలామంది అభిప్రాయపడ్డారు.

“ఏందే పిల్లకాయలు ప్రేమలో పడినట్లుండారు. నే జెప్పినగా ఈ పిల్లకాయలను పదవిలో ఎట్టుకుంటే ఈ మల్లెనే అవుతాది. ఇంతెందుకు కడకు పూర్తిగా ఇలీనం జేసేయ్యుండ్రి సరిపాయే” పార్టీ ప్రధాన నాయకుడు హనుమంతరావు గడచిన పార్టీ సమావేశంలో ఈ మాటలు అన్నప్పుడు సిద్ధార్థ్, ప్రసాద్ గారు కూడా ఆమె పక్కనే ఉన్నారు. ఆయనకు ఎలా సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. అసలు మొదటి నుంచీ ఆయనను కాదని తనకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారని హనుమంతరావు నిరాశ చెందాడు అనే విషయం అర్థమయ్యింది.

 కనుక ఆయన వ్యాఖ్యలు ఆమెకు అంతగా ఆశ్చర్యం కలిగించడం లేదు. ప్రస్తుతానికి ఆయనను శాంతింపజేయడానికి అటువంటిదేమీ లేదని ప్రజల్లో తమ పార్టీపట్ల నమ్మకం పెరగాలన్నా, తమ పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంది అనే ఆలోచన ప్రజల్లో బలంగా ఏర్పడాలన్నా ఇది ఎంతో అవసరం అని ఆమె గట్టిగా చెప్పింది. సిద్దార్థ, ప్రసాద్ గారి వర్గం ఇంకా పార్టీలో ఇతరులు ఆమె వాదాన్ని బలపరచడంతో అభ్యర్ధిని నిలపకూడదనే నిర్ణయం ఖాయమయ్యింది.

ఇప్పుడిప్పుడే తమ పార్టీలో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న తన కుమారుడిని ఆ స్థానానికి పోటీ చేయించాలని హనుమంతరావు యోచన. తను అనుకున్నది జరగకపోవడంతో ఆయన తన వర్గాన్ని కూడగట్టుకుంటున్నట్లుగా ఆమెకు తరువాత సమాచారం తెలిసింది. ఈ సమయంలో తను చెయ్యగలిగినది ఏమీ లేదు అని ఆమెకు అర్థమయ్యింది. తన తండ్రి నకునారెడ్డి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఐనప్పటి నుంచీ పూర్తిగా మంచం మీదే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.

తనకు ప్రభుత్వం ద్వారా లభించిన స్థలం విషయంలో ప్రియాంకను సంప్రదించిన దుర్గ ఇప్పుడు తనతోపాటు తమ ఇంట్లోనే ఉంటోంది. తన తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవడంలో దుర్గ తన తల్లికి ఎంతో సహాయపడుతోంది. ఆమెలాంటి ఎంతో మందికి సరైన విధంగా న్యాయం చెయ్యడం ప్రస్తుతం తన ముందున్న లక్ష్యాల్లో ఒకటి, ఇటుపక్కన జనసమాజ్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పూర్తిచేసి తమ ప్రభుత్వం పైన ప్రజల నమ్మకాన్ని ధృడపరుచుకోవాలనే లక్ష్యంలో ఉన్నారు జోగేశ్వరరావుగారు. ఈ విషయమై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచవలసినదిగా ఆయన రాహుల్‌ను ఆదేశించారు. తను చేస్తున్న పనులకు రాహుల్‌ను మెచ్చుకోవాలో లేదంటే రోజురోజుకూ తన దగ్గర పెరుగుతున్న అభ్యర్థనలను అనుసరించి ప్రజలకు న్యాయం చేకూరేలాగ, భూమి లబ్దిదారులకు అందేలాగ చెయ్యాలో ఆమెకు అర్థం కాక ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో పడింది.

ఇటువంటి సమయంలో తనకు బాసటగా నిలిచాడు సిద్దార్థ. ప్రస్తుతం తన జీవితం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా తను సిద్ధార్థపైనే ఆధారపడవలసినంతగా అతను ఆమెకు దగ్గరయ్యాడు. ఆరోజు సాయంత్రం అతనితో మాట్లాడడానికి నిర్ణయించుకుని అదే విషయం అతడికి చెప్పి తన ఇంటికి రావలసినదిగా ఆహ్వానించింది.

నకునారెడ్డిని పరామర్శించి పార్టీ విషయాలూ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వగైరా విషయాలన్నీ ఆయనతో చర్చించిన తరువాత వాళ్ళింటి లాన్లో ప్రియాంకతో పాటు కూర్చుని ఉన్నాడు సిద్ధార్థ. పనివారు అప్పుడే వచ్చి టీ స్నాక్స్ అక్కడ పెట్టి వెళ్ళారు.

“నీ ముఖం చూస్తేనే అర్ధమవుతోంది, చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లున్నావ్” ఎంతసేపటికీ ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి సిద్ధార్థ అన్నాడు. దానికి ఆమె చిన్నగా నవ్వింది.

“అయినా ప్రియాంక నాకొక విషయం అర్థం కాదు, ఎప్పుడు చూసినా ప్రపంచం మొత్తాన్ని నీ భుజస్కంధాలపై మోస్తున్నట్లు అంత దీనంగా, నీరసంగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లోతుగా శూన్యం వైపు చూస్తుంటావ్. నీ జీవితంలో నవ్వులు, సరదాలు అనేవి ఉండవా. లేదంటే ఏదైనా నాన్ లాఫింగ్ థెరపీ లాంటిదేమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా?” కొద్దిగా సందర్భాన్ని తేలికపరచడానికి అడిగాడు సిద్ధార్థ. ఆమె టీలో ఒక షుగర్ బ్లాక్ వేసుకుని కొద్దిగా సిప్ చేసింది. అతడి మాటలకు ఆమెకు నవ్వొస్తున్నా కానీ పెద్దగా బయటపడలేదు.

“ఎంతసేపు నేను మాట్లాడవే కానీ నువ్వు కొద్దిగా కూడా స్పందించవా. ఏమిటో కాలేజ్ డేస్ కన్నా ఇప్పుడు నీ మూడీనెస్ శృతి మించినట్లుంది. అస్సలు నన్ను ఇక్కడికి ఎందుకు రామ్మన్నవో అర్థం కావడంలేదు” అతను అలా ఉడుక్కోవడం ఆమెకు సరదాగా అనిపించింది, తాను ప్రస్తుతం అనుభవిస్తున్న టెన్షన్ అంతా చేత్తో తీసివేసినట్లు అనిపించింది.

ఇంతలో పక్కనే ఉన్న పూలతోటకు నీళ్ళు పెడుతున్న దుర్గ కనిపించింది ఆమెకు. ఆమె దుర్గవైపు చూడడం గమనించిన సిద్ధార్థ అడిగాడు ఆమెను.

“అవునూ ఈ అమ్మాయి ఎవరు.? ఎప్పుడూ చూసినట్లు లేదే?” ఆమె దూరంగా ఉన్న దుర్గకు సైగ చెయ్యగా చేటంత మొహం చేసుకుని పరుగుపరుగున వారిద్దరూ కూర్చున్న దగ్గరకు వచ్చింది దుర్గ. వచ్చేరాగానే సిద్ధార్థకు నమస్కారం చేసింది ఆమె, అది గమనించిన సిద్ధార్థ ఆశ్చర్యపడ్డాడు. ఈ కాలంలో కూడా ఇలాంటివారు ఉంటారా అని అతనికి అనిపించింది.

ఆమెను పరిచయం చేస్తూ “ఇందాకటివరకు నేను ఇలా ఎందుకు ఉంటాను అని అడిగావు కదా దానికి సమాధానమే ఈమె. పేరు దుర్గ వైజాగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. తన తండ్రి మరణానంతరం ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చింది. నాకొక రిపోర్టర్ ద్వారా పరిచయమైన దుర్గ ప్రభుత్వం వారు స్వాధీనపరుచుకున్న స్థలం నిమిత్తం ఏదైనా పరిష్కారం చూపించమని నన్ను అడిగింది. ప్రస్తుతం ఈమె మాత్రమే కాకుండా ఎంతోమంది సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఈ భూవివాదం.

మనం ఏ సీ జే లో ఉన్నప్పటి నుంచీ నన్ను పడే పడే వేధిస్తున్నది ఈ సమస్య. ప్రభుత్వం నష్టపరిహారం పేరున ఇస్తున్నది ఎంత మాత్రం సరిపోక, స్థలం కోల్పోయి ఉపాధి లేక అనేక కష్టాలు అనుభవిస్తున్న ఇటువంటివారికి మనం ఏ రకంగా సహాయపడగలము. అభివృద్ది జరగడానికి ఇష్టపడని వారెవరుంటారు చెప్పు.

నాకు రాహుల్ పట్ల అభిమానం కానీ, ప్రభుత్వం పట్ల వ్యక్తిగతమైన ఇష్టాలు కానీ లేవు, మనం ఇదివరలో చాలాసార్లు చర్చించినట్లుగా నేనెప్పుడూ సమస్య మూలాలనుంచి పరిష్కరించడానికి మాత్రమే ప్రయత్నిస్తాను. అందుకే అడుగుతున్నాను చెప్పు సిద్ధూ, ఇప్పుడు నేను ఎవరి వాదనతో ఏకీభావించాలి, ఎవరితో పాటుగా ప్రయాణించాలి.

వ్యతిరేకతలేని సమాజంలో ఉండాలనే నా ఆకాంక్ష తప్పంటావా. లేదా తప్పొప్పులతో సంబంధం కార్యసాధనపై దృష్టిపెట్టాలా ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను. ఇందులో రాహుల్ పట్ల పక్షపాతం కానీ, వ్యతిరేకత కానీ ఏమీ లేదు. ఒక సగటు మనిషి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నాను నేను” కొద్దిగా ఉద్వేగంగా అంది ప్రియాంక. ఆమెను ఆ సమయంలో చూస్తే ఆత్మీయతతో కూడుకున్న జాలి కలిగింది సిద్ధార్థకు. అంతసేపు జరిగిన సంభాషణలో దుర్గ ఏమీ మాట్లాడకుండా వారిద్దరినూ గమనిస్తూ అక్కడే కూర్చుని ఉంది.

“ప్రియాంక, నీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ రాహుల్ మన ఇద్దరికీ మిత్రుడు అనే విషయం ప్రజల దృష్టిలో నుంచి పక్కకి పోలేదు. అస్సలు ఇదంతా నా వల్లనే జరుగుతోంది అని నాకు అనిపిస్తోంది. అయితే మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే రాజకీయం అంటేనే ఒకరిమీద ఒకరు బురద జల్లుకోవడం. నువ్వు హనుమంతరావుగారు అన్న విషయాన్ని బాగా వ్యక్తిగతంగా తీసుకున్నట్లు ఉన్నావు.

ఇలాంటివన్నీ సహజంగా జరిగేవే. మనం ఆలోచించవలసినది ఏంటంటే ప్రస్తుతం ప్రజల తరఫున ప్రభుత్వానికి అనుకూలంగానో, లేదా వ్యతిరేకంగానో నువ్వు ఎలా అంటే అలా ఒక పక్షం తీసుకున్నాము. అప్పుడు మనం చెయ్యవలసినది మన పక్షాన్ని బలపరుచుకోవడం, దానికి అవసరమైతే ఏ పని చెయ్యడానికైనా వెనుకాడకపోవడం.” ఆమె వంక చూస్తూ అన్నాడు సిద్ధార్థ.

“నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. ఏ పని చెయ్యాలని నీ ఉద్దేశం.” అడిగింది ప్రియాంక. “ఏమీ లేదు ప్రియాంక ప్రస్తుతం మన పార్టీలో జరిగే పరిణామాలను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతున్నాం అని నాకు అనిపిస్తోంది. అలాంటప్పుడు మనం ప్రజల సమస్యల గురించి ఆలోచించాలి అంటే ఇంకా కష్టం అవుతుంది. అందుకే పార్టీ వివరాలు చక్కదిద్దడానికి మనకి ప్రసాద్ గారికన్నా పలుకుబడి ఉన్నవారు, కేంద్ర ప్రభుత్వంతో కాంటాక్ట్స్ ఉన్నవారు మొత్తంగా చెప్పాలంటే అంకుల్ తరువాత అదే విధంగా ప్రజల్లో గుర్తింపు ఉన్నవారు కావాలి. అందుకే అలాంటివారిని మన పార్టీలోకి తిరిగి తీసుకురావాలి అనుకుంటున్నాను.” ఆమెను సూటిగా చూస్తూ అన్నాడు.

“ఇంతకీ ఎవరి గురించి నువ్వు మాట్లాడేది” అడిగింది ప్రియాంక.

“ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ కేంద్రమంత్రి నాచిరెడ్డిని నేను తిరిగి పార్టీలోకి ఆహ్వానిద్దామనుకుంటున్నాను. దీనిపై నీ అభిప్రాయం ఏంటి?” ఆమె సాలోచనగా సిద్ధార్థవైపు చూసింది. ఏమి చెయ్యాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుంది.

***

“మీరేమి మాట్లాడుతున్నారో మీకు అర్ధమవుతోందా. జైలులో ఉన్న వ్యక్తిని కలిసామంటే మనమీద ప్రతిపక్షాలు, ప్రజలూ మీడియా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ అనుమానం రావడం ఖాయం. అస్సలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరువు దీనితో పూర్తిగా గంగలో కలిసిపోతుంది. అంతేకాకుండా సునంద కేసు విషయంలో ఇప్పటికీ పోలీస్ వారికి స్పష్టత లేదు, ఒక పక్క నుంచి రాహుల్, ఇంకా అతని తొత్తులైన ఆ మహిళా సంఘం వాళ్ళు సిబిఐ ఎంక్వయిరీ జరిపించాలని కేంద్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు.

ఇంకా రెడ్డిగారిమీద గౌరవంతో హోం మినిస్టర్ పెద్దగా స్పందించడంలేదు. దాన్ని అలుసుగా తీసుకుని మనం ఇలాంటి మంతనాలు జరపడం ఎంతవరకు శ్రేయస్కరం ఆలోచించండి సిద్ధార్ధ. ఒకపక్క మన పార్టీలో అధ్యక్షుడి విషయంలో జరిగిన పోటీలో కొంతమంది పార్టీ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారని మనకి సమాచారం తెలిసింది కూడా. అందుకే ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోండి” తన దగ్గరకు వచ్చిన సిద్ధార్థతో అన్నాడు ఎం ఎల్ ఏ  ప్రసాద్.

వారిద్దరూ ఇప్పుడు హైదరాబాద్ సిటీకి దూరంగా ఉన్న ప్రసాద్ గారి గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. తను ఎలాగైనా నాచిరెడ్డిని కలుసుకోవాలని సిద్ధార్థ పట్టుదలతో ఉన్నాడు, అందుకే పార్టీలో పెద్దలని ఒకసారి సంప్రదించి వారి అనుమతి తీసుకోవాలని అతని అభిప్రాయం.

“సర్ నాకు మీరు చెప్పినదంతా అర్ధమయ్యింది. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే నాచిరెడ్డి గారికి ముప్పై నలభయ్యేళ్ళ మధ్యలో ఉన్నవారిలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన అరెస్ట్ ఐన దగ్గర నుంచి మీడియాకు ఇతరులకూ తెలియని అంతరంగిక సభల్లో ఆయన గురించి పలు చర్చలు జరుగుతున్నాయి.

దానికి కారణం ఆయన రచయిత అవ్వడం ఒక కారణం అయితే, సహజంగానే ఆయనకున్న చరిస్మా, ఇంకా టెన్నిస్ స్టార్ చరణ్‌తో అతనికున్న అనుబంధం ఒక కారణం. ఇప్పుడు ఆయన పట్ల వ్యతిరేకంగా ప్రచారాలూ అవీ చేస్తూ, మహిళల హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతున్న వారందరూ ఒక సమయంలో ఆయన అభిమానులూ, అంతరంగీకులూ కూడా. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది అనుమానాల గురించీ ఆపేక్షల గురించీ కాదు.

ఎలాగ మన పార్టీని బలపరుచుకోవాలి అని. నాకు నకునారెడ్డి గారంటే చాలా గౌరవం సార్, ఆయన చేసిన మంచి పనుల వల్ల ప్రజలు ఈనాటికీ లాభపడుతున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే గత ఎన్నికల్లో ఆయన ఇతరులకు మేలు చేసే విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలను పక్కన పెట్టారని నా అభిప్రాయం.

మనం చేసిన పనిని ఇతరులు ఎంతవరకూ ఆమోదిస్తారు అనే విషయం పక్కనపెట్టి ఏదో ఒకరికో ఇద్దరికో పేదవారికి లాభం చేకూరుతుందని ఆయన కొన్ని తప్పటడుగులు వేసారు. వాటిని తప్పటడుగులు అనడం కన్నా ఆధునిక జీవన విధానం పట్ల కొంతవరకూ ఏర్పడిన అవగాహనా రాహిత్యం వల్ల కలిగిన అవరోధాలు అనడం సమంజసం.

అందులో ఒకటి నాచిరెడ్డి మీద వస్తున్న ఆరోపణలు సమర్థవంతంగా ఎదుర్కోకపోవడం. నకునారెడ్డిగారి  ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ప్రజలు దాన్ని తిరస్కరించారు. దానికి కారణం ప్రజలు ఆలోచనా ధోరణి మారింది అందుకు అనుగుణంగా మనం కూడా వారికి చేరువ అవ్వడానికి ప్రయత్నించాలి.

ఇకపోతే ఈ మీడియా కథనాలూ, మహిళా సంఘాల రాద్ధాంతాలూ అంటారా ఇవన్నీ పైపైన మాటలు అంతే, ఎప్పుడైతే మనం చిన్నదీ పెద్దదీ అనే తేడా లేకుండా ధైర్యంగా వాటికి సమాధానం ఇస్తామో అప్పుడే అవ్వన్నీ చల్లారిపోతాయి. ఒక్కసారి నాకు ఆయనతో మాట్లాడే అవకాశం కల్పించండి, నేను ఆయన అంతరంగాన్నీ ప్రజలకు తెలియపరుస్తాను. దాంతో ఆయన విడుదలయ్యే అవకాశం కూడా ఉంది.

బయటకి వచ్చిన ఆయనను మన పార్టీ సాదరంగా ఆహ్వానించి ప్రజలముందర నిలబెడితే మన పార్టీ అంతర్గత కుమ్ములాటను కూడా అరికట్టినట్లు అవుతుంది. పెద్దవారు నాకన్నా నాచిరెడ్డికి పార్టీలో హనుమంతరావులాంటి నాయకులతో ఉన్న అనుబంధం మీకే బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఒకసారి నా కోరికను నెరవేర్చమని అడుగుతున్నాను” ఆయనతో అర్థిస్తున్నట్లుగా మాట్లాడాడు సిద్ధార్థ.

ఒకరకంగా ఆలోచిస్తే అతను చెప్పినది కూడా నిజమే నకునారెడ్డి గారు నాచిరెడ్డి విషయంలో పెద్దగా స్పందించలేదు, ఆయనెప్పుడూ ప్రజాసేవా కార్యక్రమాలు రైతులపైన మాత్రమే దృష్టి సారించాడు కానీ, పార్టీలోని వారికి వ్యక్తిగతమైన సహాయాలు చెయ్యలేదు, ఆ మాటకి వస్తే అస్సలు తనతో తప్ప మరెవ్వరితోనూ వ్యక్తిగతమైన సంబంధాలు కూడా పెట్టుకోలేదు.

ఏది ఏమైనా సిద్ధార్థ మాటలను ప్రసాద్ కొట్టి పారేయ్యలేకపోయాడు, దానికి తోడు సిద్ధార్థ్ ప్రియాంకకు ఆంతరంగిక మిత్రుడు అనే విషయం కూడా ఆయన మనసులో మెదిలింది. “సరే మీరు చెప్పినదంతా బాగానే ఉంది, మరి ఈ సమయంలో నకునారెడ్డిగారితో ఈ విషయం చర్చించడం అంత మంచిపని కాదేమో అని నాకు అనిపిస్తోంది. ఏమి చెయ్యాలో మరి మీరే నిర్ణయించుకోండి, కానీ నేను మాత్రం మీరేమి చేసినా నా పూర్తి సహకారం అందిస్తాను, నా అభిప్రాయం ప్రకారం మీరు నాకన్నా ముందే ప్రియాంకతో ఈ విషయం చర్చించి ఉంటారు” ఆయన ఆఖరిమాట అనడంతో ముసిముసిగా నవ్వాడు సిద్ధార్థ్

“మేమిద్దరం మంచి స్నేహితులం సార్. అందుకే ఏ విషయమైనా ముందర మేమే మాట్లాడుకుని తరువాత పార్టీ పెద్దల అభిప్రాయం కోసం వస్తాము. ఆమెతో నాకున్న చనువుతో మాట్లాడతాను తప్ప మీలాంటి పెద్దలమనసు నొప్పించడానికి కాదు” తన మనసులోని మాటలను నిజాయితీగా చెప్పాడు సిద్ధార్థ్.

 “నాకు తెలుసు సిద్ధు, అందుకేగా నకునారెడ్డిగారు నిన్ను ఏరికోరి మరీ ఎంచుకున్నారు. అదిసరే నాకొక అనుమానం ఉంది” అడిగాడు ప్రసాద్.

“చెప్పండి సర్”

“నువ్వు ప్రియాంక స్నేహితులేనా.. లేక అంతకన్నా” అతను ఏమంటాడో అని ఎదురు చూసాడు. అతను దానికి అవుననీ కాదనీ ఏమీ సమాధానం చెప్పకుండా “వస్తాను సర్” అని చెప్పి అక్కడ నుండి తన కార్లో వెళ్ళిపోయాడు. ప్రసాద్ చిన్నగా తనలో తానే నవ్వుకున్నాడు.

***

తన ముందరున్న వాక్యాలు చదివిన సిద్ధార్థకు ఏ విధంగా స్పందించాలో అర్థం కాలేదు. ఒక వ్యక్తి అంతరంగం ఏ సమయంలో ఏ విధంగా రూపాంతరం చెందుతుందో అర్థం చేసుకోవడం కష్టం. దానికి చాలా కారణాలు చాలా విధాలుగా ప్రేరేపిస్తూ ఉంటాయి. ప్రసాద్ గారు అంగీకారం తెలిపిన తరువాత తను వెంటనే ఈ విషయాన్ని ప్రియాంక చెప్పి ఆమె అర్ధాంగీకారంతో ఉన్నా వినకుండా జైల్లో ఉన్న నాచిరెడ్డిని కలుసుకున్నాడు.

ఒక్కోసారి ఏదైనా మంచి చేద్దామనకునే వ్యక్తులు ఆ తాపత్రయంలో మంచేదో చెడేదో తెలుసుకోలేక ముందడుగు వెయ్యడానికి తటపటాయిస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రియాంకను చూస్తే సిద్ధార్థకు అదే అభిప్రాయం కలిగింది. సుకన్యది ఆక్సిడెంట్ అని కొందరు, హత్య అని కొందరూ ఎవరి వాదనలు వారు వినిపిస్తూనే ఉన్నారు.

ఈ సందర్భంగా చరణ్‌ను కూడా మీడియా వారు తెగ ఇబ్బంది పెడుతున్నట్లుగా సమాచారం అందింది. అందుకే వీరి నుంచి తప్పించుకోవడానికి అతను విదేశాల్లో కొంతకాలం ఉండే ఉద్దేశంలో ఉన్నాడు అన్న విషయం తెలిసింది. తన ముందు ఉన్న నాచిరెడ్డి తనకు చూపించిన ఈ వాక్యాన్ని చూసి ఏమి చెయ్యాలో తెలీక దిక్కులు చూస్తున్నాడు.

రాజకీయాలు ఒకపక్క తన వ్యక్తిగత జీవితం ఒకపక్క జైల్లో ఉన్న అవి ఆయనను వెంటాడుతూనే ఉంది. అయితే సిద్ధార్థకు అర్థంకాని విషయం ఏంటంటే తను అరెస్ట్ అవ్వడాన్ని నాచిరెడ్డి ఏ విధంగానూ ప్రతిఘటించడానికి ప్రయత్నించలేదు, అంతే కాకుండా పార్టీవారు తనని బర్తరఫ్ చేసినా పట్టనట్లు ఉన్నాడు, దీనినిబట్టి ఆలోచిస్తే ఆయన కూడా ఈ విషయంలో కొంతవరకూ దోషే అన్న అనుమానం కలుగుతోంది. లేదా ఇవాన్నీ పట్టించుకునే స్థాయిలో ఆయన ఇప్పుడు లేరేమో.

“నేను మీ రచనలన్నీ చదివాను. నాకు అన్నిటికన్నా ఎక్కువ ఇష్టమైనది మీ రచనల్లోని స్త్రీ పాత్రలు. వేటికవే చాలా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. నాకు తెలిసి ఆడవారి గురించి బహుశా మీకున్నంత స్పష్టమైన అవగాహన వారికి కూడా ఉండదేమో” తను మాట్లాడే విషయానికి ఉపోద్ఘాతంగా అన్నాడు సిద్ధార్థ. వారిద్దరూ ఇప్పుడు సెంట్రల్ జైల్లోని ప్రత్యేకమైన సందర్శకుల భవనంలో ఉన్నారు.

“మీరు చెప్పినది నిజమో కాదో నాకు తెలీదు కానీ, నాకు అనిపించింది నేను రాస్తూ ఉంటాను, అది నచ్చిన వారు ఇంకా చదువుతారు. అయినా ఇదంతా నేను ఆత్మ సంతృప్తి కోసం రాస్తున్నదే తప్ప ఎవరినీ ఉద్ధరించడానికి కాదు, ఎవరి చేతా మెప్పు పొందడానికి కాదు. దీని వల్ల నాకు తప్ప ఎవరికీ ఉపయోగం ఉండదు అనేవారు కూడా ఉన్నారు. అయితే రాజకీయాలు వేరు నిజజీవితం వేరు. దురదృష్టవశాత్తు నా వ్యక్తి గత జీవితాన్ని రాజకీయాలతో ముడిపెట్టారు.

నన్ను మెచ్చుకున్నవారు కూడా నిజానిజాలని పక్కన పెట్టి వారికి నచ్చినది వారు నమ్మారు. ఇటువంటి పరిస్థితుల్లో నేను జరుగుతున్న వాటికి తలొంచడం తప్ప వేరే ఏమీ చెయ్యలేను. అయినా నేను ఇంకా సాధించవలసినది కూడా ఏమీ లేదు. నేను ఎవరినైతే అత్యంత ఎక్కువగా ఇష్టపడ్డానో వాళ్ళే లేనప్పుడు ఇంకా ఎందుకు ఈ తాపత్రయం అంతా.

ప్రజలు ఎప్పుడూ ఒకేలాగున్నారు, వారికి ఏదో ఒక కథ కావాలి అంతే, దానివల్ల ఎవరి జీవితాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయి అనేది వారికి అనవసరం. అయినా కడుపు నిండినవాడికి కర్తవ్యం ఎక్కడ గుర్తొస్తుంది. అందుకే ఇలాంటి లేనిపోని రాజకీయాలు చేస్తుంటారు” నిరాశగా అన్నాడు నాచిరెడ్డి.

“కావచ్చు, మీరన్నట్లుగా ప్రజలు ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు. వారిలో నానారకాల బాధలు అనుభవించే వారు ఉంటారు, సాఫీ జీవితం గడిపేవారు ఉంటారు. మనం అందరినీ ఒకే త్రాటిక్రిందకు తీసుకువచ్చే విధంగా ఉండాలి, అప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం చెప్పినట్లు అవుతుంది” నెమ్మదిగా అన్నాడు. వీరిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండగానే బయట చిన్నగా కలకలం వీరి దృష్టిని ఆకర్షించింది ఇంతలో ఒక కానిస్టేబుల్ వీరిదగ్గరకు వచ్చాడు.

“సర్. మీరు ఇక్కడికి రావడం మీడియా వారికి తెలిసినట్లుంది బయట చాలామంది రిపోర్టర్లు, పత్రికా ప్రతినిధులు కెమెరాలతో హడావిడి చేస్తున్నారు.

“ఓహ్ మై గాడ్. ఎంత పని జరిగింది. నేను సూపరింటెండెంట్ గారితో దీన్ని సాద్యమైనంతవరకు రహస్యంగా ఉంచమని కోరానే, మరిది ఈ రాబందులకు ఎలా తెలిసి ఉంటుంది.” తనలో తాను అనుకుంటున్నట్లుగా పైకి అన్నాడు సిద్ధార్థ.

“వీరికి తెలీడం ఏముంది సర్, ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ది చెందింది కదా ఏ చిన్న సెంట్రీ మెసేజ్ పెట్టినా చాలు ఇట్టే వాలిపోతారు. అయినా భూమిపైన ఉన్న చెత్తను కొంతవరకు ఏరెయ్యడానికి ఈ ‘రాబందుల’ అవసరం మనకి ఎంతైనా ఉంది సర్” అతను వాళ్ళిద్దరి వంకా సూటిగా చూస్తూ ఉన్నాడు.

ఎందుకో తెలీదు కానీ అతను నాచిరెడ్డి పైన అకారణమైన ద్వేషం పెంచుకున్నట్లు ఉన్నాడు, బహుశా ఈ మీటింగ్ విషయం బయటకి పోక్కేలా చేసింది ఇతనే అయ్యుంటాడు అన్న విషయం అతని మాటలు చెప్పకనే చెప్తున్నాయి. అయినా కానీ వీరు అతనిపైన ఏ విధమైన చర్య తీసుకోలేరు, అందుకే నిస్సహాయంగా అతనివైపు చూసాడు సిద్ధార్థ. ఇంకా అక్కడే ఉన్న అతన్ని ఉద్దేశించి అన్నాడు నాచిరెడ్డి

“నాకింకా ఈయనతో మాట్లాడడానికి కొంత సమయం మిగిలి ఉంది అనుకుంటాను” అతని స్వరంలో వినిపించిన గాంభీర్యతకు ఆ కానిస్టేబుల్ కొద్దిగా భయపడి అక్కడ నుంచి నిష్క్రమించాడు

“నేను బయటకి రావాలి అనుకుంటున్నాను సిద్ధార్థ. మీరు నాకు సహాయం చెయ్యగలుగుతారా” ఈసారి ఆశ్చర్యపోవడం సిద్ధార్థ వంతయ్యింది. ఒక్కసారిగా ఆయన అంతరంగం అలా మారడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

“మిమ్మల్ని కలవడంలో నా ముఖ్య ఉద్దేశం అలాగే సర్. అయితే మీ అంతట మీరే ఈ విధంగా అడుగుతారని నేను అస్సలు ఊహించలేదు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు అయ్యింది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది, బయటకి వచ్చిన తరువాత మీరు మన పార్టీకి ముఖ్యంగా నాకు అనుకూలంగా ప్రవర్తించాలి.

ఇది అందరి మంచిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే నేను చేస్తున్నాను అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని బయటకి తీసుకురావడం అన్నది చాలా శ్రమతో కూడుకున్న పని. అందుకోసం మనకి చాలా మంది చాలా రకాలుగా సహాయపడతారు,వారందరినీ దృష్టిలో ఉంచుకుని మనం ప్రవర్తించాలి.

అప్పుడే కదా నకునారెడ్డి గారు ఇన్నాళ్ళుగా చేసినదానికి మనమొక అర్థం తీసుకురాగలుగుతాం. నాకింకా పూర్తిగా మీసాలు కూడా రాకముందు నుంచే రాజకీయాల్లో ఉన్న మీకు ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను” ఆయనతో అన్నాడు సిద్ధార్థ, అతని మాటల్లో బెదిరింపు, కట్టడి, భరోసా, భయం అన్నీ కలగలిసి కనిపిస్తున్నాయి, నేటి సమాజంలోని యువత తెగింపు అతని మాటల్లో అర్ధమవుతోంది.

“మరేమీ పరవాలేదు నేను కూడా అందరికీ ఉపయోగపడే పనే చేస్తాను. ఒకవేళ అలాకాకపోయినా చేస్తున్నాను అనే భ్రమలో వారుండే విధంగా చేస్తాను. మీరు అడిగారు కదా ఎందుకు సడన్‌గా నా మనసు మార్చుకున్నాను అని చెప్తాను వినండి. ఇందాక వచ్చిన ఆ సెంట్రీని చూసిన తరువాత నాకు అర్థం అయ్యింది, బయట ఉన్న వాడి కథకి లోపల ఉన్న వాడి కథకీ చాలా తేడా ఉంది.

నేను ఇక్కడ ఉండి రాసే రాతలు కేవలం నాలుగు గోడలకు మాత్రమే పరిమితం అవుతాయి అదే నేను బయట ఉంటే ప్రజలకు నన్ను నేగేట్ చేసే అవకాశం చాలా తక్కువ. కోర్ట్ ప్రొసీడింగ్స్‌ను వాటినీ ఎదుర్కోవడం నాకు పెద్ద సమస్య కాదు. వారు ఒక కథ కోరుకుంటున్నారు కదా, నేను వారికి అదే ఇస్తాను. ఎవరి దాంట్లో ఎంత నిజముందో మనకి అనవసరం. మన అంతిమ లక్ష్యం మనకి నిశ్చయంగా తెలిస్తే చాలు. మీరు నాకీ సహాయం చెయ్యగలరా. ప్రస్తుతం మన పార్టీ మీ చెప్పు చేతల్లో నడుస్తోంది అని నేను విని ఉన్నాను” అతడిని అభ్యర్దిస్తున్నట్లుగా అడిగాడు నాచిరెడ్డి.

“భలేవారు సర్, నేను ఏది చేసినా నకునారెడ్డి గారికి తెలీకుండా చెయ్యను. ప్రియాంక పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికవ్వడం, నేను పార్టీ లోకి రావడం ఇవన్నిటికీ కారణం ఆయనే సర్, అయన సూచనల మేరకే అన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన అస్వస్థత కారణంగా కొన్నికొన్ని నిర్ణయాలు ఆయన స్థానే ప్రియాంక ద్వారా చెయ్యడం జరుగుతోంది” సమాధానం ఇచ్చాడు సిద్ధార్థ.

“సరే సర్. ప్రజలకు మీ కథను వినిపించడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. మిగతాది పరిస్థితులకే వదిలేద్దాం” అని చెప్పి అక్కడ నుంచి బయటపడ్డాడు సిద్ధార్థ. అతను సందర్శకుల భవనం నుండి బయటకు రాగానే ఒక ఇరవై మంది విలేఖర్లు అతనిని చుట్టుముట్టారు.

“సర్ ఇప్పుడు జె.హెచ్. పార్టీ ప్రధాన నిర్ణయాలు మీమీద ఆధారపడి తీసుకుంటోంది కదా. మరి వారు బర్తరఫ్ చేసిన నాచిరెడ్డిని కలవడంలో మీ ఉద్దేశం ఏంటి. కొత్తగా అధ్యక్షురాలిగా ఎన్నికైన ప్రియాంకతో మీకున్న స్నేహాన్ని అలుసుగా తీసుకుని పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారా” ఒక విలేఖరి సూటిగా అడిగాడు, అతను హనుమంతరావుకి చెందిన వ్యక్తని సులభంగానే తెలుసుకున్నాడు సిద్ధార్థ.

 “కారణం ఏదైనప్పటికీ నాచిరెడ్డి చాలా అనుభవం ఉన్న ప్రజానాయకులు ఇలాంటి కష్ట సమయంలో పార్టీ ఆయనను ఒంటరివాడిని చెయ్యడం మంచి విషయం అని నాకు అనిపించలేదు. నిజానిజాలు ఏంటనేది త్వరలోనే బయటపడతాయి. మీకింకా వివరాలు కావాలంటే ఈ కేస్ ప్రస్తుతానికి హండిల్ చేస్తున్న పోలీస్ డిపార్టుమెంటును అడగండి.

నేను ఏ నిర్ణయం తీసుకున్న అది పార్టీ మరియు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇది మా పార్టీలో విజ్ఞత కలిగిన పెద్దలందరూ అర్థం చేసుకుని నాతో ఏకీభవిస్తారు అన్న విషయం నాకు తెలుసు” అతనికి చెప్పాడు సిద్ధార్థ.

“సర్ మీరు నాచిరెడ్డి గారితో మాట్లాడారు కదా. ఆయన భార్య హత్య విషయంలో ఆయన హస్తం ఉంది అని మీరు భావిస్తున్నారా. ఈ విషయంలో ఆయన అంతరంగం ఏంటి” కేరళకు చెందినా ఒక ఇంగ్లీష్ పత్రిక విలేఖరి అడిగింది.

“ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండీ. మొదటిది ఇది హత్యా లేదా ఆక్సిడెంటా అన్నది ఇంకా తెలీదు. ఇట్స్ ఏన్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్. రెండవది ఆయన అంతరంగం గురించి అడిగారు కదా దానికి నాకన్నా ఆయనే బాగా సమాధానం ఇస్తారు. నాకు తెలిసి మీరు ఆయన రచనలు అన్నీ చదివే ఉంటారు కదా. ఈ పేపర్ ఒకసారి చూడండి” తన జేబులో ఉన్న చిన్న కాగితం ముక్క ఆ పాతిక సంవత్సరాల విలేఖరికి చూపించాడు సిద్ధార్థ. అందరూ ఆసక్తిగా కెమెరాలతో ఆ పేపర్ మీదకు పడ్డారు.

***

“If you legalize privacy between two individuals Crime rate will be nullified

If you make it a fundamental right you will be worshipped as a god”

ఈ వాక్యాలు దేశంలో అన్ని పత్రికల్లోనూ మొదటి పేజీలో పెద్దగా ప్రచురింపబడ్డాయి. అవి అలా ప్రచురింపబడడానికి సిద్ధూ కొద్దిగా చొరవ తీసుకుని బ్యాక్ ఎండ్ మీడియా సుదర్శన్‌ని కూడా వాడుకున్నాడు. ఈ విషయం ప్రియాంకకు తెలీకుండా జాగ్రత్త పడ్డాడు. దీనితో ప్రజాలనుంచి నాచిరెడ్డి మీద, ఆయన పైన ఉన్న ఆరోపణల మీద దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. అందరికీ గతంలో ఉన్న ఆయన చేసిన మంచిపనులు ఆయన రచనలు గుర్తుకురావడం ప్రారంభించాయి, ఈ సందర్భంగా మహిళా సంఘం ఆయన పట్ల చేసిన డిమాండ్లు అన్నీ మరుగునపడడం విశేషం.

కొంత మంది ఇంకా ముందుకు వెళ్లి చరణ్‌తో నాచిరెడ్డి భార్య సాగించిన సల్లాపాలు అంటూ వారి ఇష్టం వచ్చినట్లు రాయడం ప్రారంభించారు, అంతేకాకుండా ఒకనాటి సాయంత్రం చరణ్ సుకన్యను ఒక స్నేహితుడి బర్త్ డే పార్టీకి ఆహ్వానించడం వెనుక కూడా ఎదో నిగూఢార్ధం ఉండే ఉంటుంది అని కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే అలాంటి వార్తలు శృతి మించకుండా సిద్ధార్థ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు.

వీటిని మొదట్లోనే తుంచెయ్యకపోతే అటు ఇటూ తిరిగి అవి మొదటికే మోసం తీసుకు వచ్చే అవకాశం ఉంది అన్న విషయం ముందే గ్రహించాడు, సిద్ధార్థ అందుకే ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. మొత్తానికి ఎలాగైతేనేమి భారీ మొత్తానికి నాచిరెడ్డికి బెయిల్ మంజూరు చెయ్యబడింది. సిద్ధార్థ ఇలాంటి పనులన్నిటికీ డబ్బులు ఏ విధంగా సమకూర్చ గలుగుతున్నాడు అన్న విషయం ఎప్పుడూ ప్రియాంక ప్రశ్నించలేదు.

“ప్రపంచంలో అస్సలు ప్రైవసీ అన్న పదానికే అర్థం లేకుండా పోతోంది సర్. ఇండియాలో ప్రైవసీ కన్నా భద్రతాంశాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే మన పక్కింట్లో ఏమి కూర వండుతున్నారో మనకి ముందరే తెలిసిపోయే అంతే దగ్గరగా ఉండే మనకు ప్రైవసీ ఎందుకు అని కొన్నిసార్లు కొంత మంది మహానాయకులు కూడా అనడం గమనార్హం. అంటే భారత జాతిలో ఆంతరంగిక స్వేచ్ఛకు అస్సలు స్థానంలేదా.

ఎవరో సొంత విషయాలతో ఎవరినో నష్టపోతే ఆ నష్టపోయిన వారిపైనే నింద వెయ్యడం చాలా హాస్యాస్పదం. నాచిరెడ్డి గారిని అనే ముందర మహిళా సంఘాలు తమను తాము ప్రశ్నించుకోవాలి. వీలైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తోడ్పడి, ఇలాంటి వాటికి త్వరగా స్వస్తి చెప్పి అభివృద్ది వైపు మగ్గు చూపాలి” ఒళ్ళు మండిన ఒక యువ అభిమాని నాచిరెడ్డికి మద్దతుగా పెట్టిన ఈ సోషల్ మీడియా పోస్ట్ ఆయన బయటకు రావడానికి చాలా వరకూ దోహదపడింది. వ్యక్తిగత విద్వేషాలకు రాజకీయాలు ఊతమివ్వకుండా ఉండాలన్న అంశం పై సుప్రీమ్ కోర్ట్ బెయిలు మంజూరు చేసింది.

“ఎలాగైతేనే నాకు తెలీకుండా నువ్వు అనుకున్న పనిని సాధించగలిగావు. మరి ఇప్పుడు నీ తరువాత స్టెప్ ఏంటి” అడిగింది ప్రియాంక. నాచిరెడ్డి జైలు నుండి విడుదలై సరాసరి నకునారెడ్డిగారిని చూడడానికి హైదరాబాద్లోని వారి నివాసం దగ్గరకు వచ్చాడు. ఇంకా పూర్తిగా స్వస్థత చేకూరని ఆయన తమ నివాసంలోనే వైద్యుని పర్యవేక్షణలో ఉన్నాడు, ఆయన్ను ఆ స్థితిలో చూడడంతో  నాచిరెడ్డి చాలా బాధపడ్డాడు, ఒకరకంగా చెప్పాలంటే నాచిరెడ్డి ఆయనను తన రాజాకీయ గురువుగా చూస్తాడు. నాచిరెడ్డిని కలవడానికి ఆ రోజు ప్రసాద్ గారిని కూడా ప్రియాంక ఆహ్వానించింది అయితే వేరే పని ఉండడం వల్ల ఆయన రాలేకపోయాడు.

మీడియా సందడి అంతా సద్దు మణిగిన తరువాత నాచిరెడ్డి, సిద్ధార్థ, ప్రియాంక ముగ్గురూ విశాలమైన లివింగ్ రూమ్‌లో కూర్చుని వున్నారు. అప్పుడు సమయం సాయంత్రం ఏడు గంటలు అవుతోంది. ఇంట్లోని నౌకర్ వచ్చి వారికి కావాల్సిన డ్రింక్స్ స్నాక్స్ సమకూర్చి వెళ్ళాడు. “అదేంటి ప్రెసిడెంట్ గారు ఏమి చెయ్యాలో చెప్పవలసింది మీరే కదా, మీకు తెలియకుండా నేనేమైనా చేస్తానా. అందుకే మీరే చెప్పండి నేను ఆచరిస్తాను” ఆమె వంక చూసి చిన్నగా కన్నుగీటాడు సిద్ధార్థ. నాచిరెడ్డి వీరిద్దరినీ నిశ్సబ్దంగా గమనిస్తున్నాడు.

“నువ్వు డాడీకి ఎందుకంత నచ్చావో నాకిప్పుడు అర్ధమయ్యింది, మనకి ఎంతో పరిచయం ఉన్నవాళ్ళతో కూడా వారికి తెలీకుండా పాలిటిక్స్ ప్లే చెయ్యడం నీ ఒక్కడికే సాధ్యం” చురక అంటించింది ప్రియాంక.

“అయ్యో ఎంత మాట ఎవరైనా వింటే నిజమనుకుంటారు. ఇందులో రాజకీయం ఏముంది” తడబడుతున్నట్లుగా అన్నాడు సిద్ధార్థ.

“హహ సరేలే అదలా ఉంచితే. ఈ బెయిల్‌కి అవసరమైన డబ్బు ఎవరు ఇచ్చారు. నాకు తెలిసి పార్టీ ఫండ్ నుంచి ఖర్చు పెట్టడానికి సీనియర్స్ ఎవరూ సుముఖంగా లేరు, సొంత డబ్బులు ఖర్చుపెట్టే అవకాశం మనకి లేదు. మరెలా సాధించావ్” అతడిని అడిగింది ప్రియాంక. నకునారెడ్డి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ ఆయనకు చెప్పుకోదగిన ఆస్తులేమీ లేవు. సిద్ధార్థ పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. అదే ఆమెకు అర్థం కాని విషయం.

 “నా సోర్సెస్ నాకున్నాయి, అవన్నీ అవసరమైన సమయంలో అవసరమైన వ్యక్తుల మధ్య బయటకి వస్తాయి. ప్రస్తుతానికి నువ్వు వాటి గురించి బెంగ పెట్టుకోక, మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో అలోచించు” అన్నాడు ప్రియాంక. ఇంతలో వారి సంభాషణకు అంతరాయం కలిగిస్తూ దుర్గ అక్కడకి వచ్చింది. వెంటనే ప్రియాంక వదనం ప్రసన్నమైనది.

“మనం క్రితంసారి అనుకున్నట్లుగా, అదే మీ సుదర్శన్ చూపించినట్లుగా భూషణరావు రాహుల్ పైన బహిరంగ సభలో దాడి జరపలేదు అంటే అందుకు వెనకాల బలమైన కారణం ఉండి ఉంటుంది. ఇదే మనకు సరైన అవకాశం. నాకు తెలిసిన ఒక మీడియా ప్రతినిధిని మీతో పాటుగా పంపిస్తాను. మీరు వెంటనే నాచిరెడ్డి ఇంకా దుర్గను తీసుకుని వైజాగ్ వెళ్లి అక్కడ జనాల స్పందన ఎలా ఉందో తెలుసుకోండి. ధరణికోట దగ్గర ప్రాజెక్ట్ పట్ల ప్రజలు ఏ విధంగా ఉన్నారో అన్న విషయం కూడా తెలుసుకోండి. ఈ లోపులో నేను రాబోయే ఎలక్షన్‌కి సిద్ధపడుతూ ఉంటాను.

మీరు మాతో కలవడం చాలా ఆనందంగా ఉంది నాచిరెడ్డి గారు. ఈ సమయంలో మీలాంటి పెద్దల ఆశీస్సులు, అందదండలూ మాకు ఎంతో అవసరం. మీరు నేషనల్ పాలిటిక్స్‌లో ఉన్నప్పటికీ ఇప్పుడు మనం మెయిన్ ఎజండా స్టేట్ వైడ్ రీకన్‌స్ట్రక్షన్.

మీరు అందుకు మీ పూర్తి సహకారం అందించాలి. ఇప్పటికే హనుమంతరావు లాంటివారు తమతమ వర్గాలను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. వారందరూ ప్రాజా సమస్యలు మర్చిపోయి తమ స్వంత విషయాలు చూసుకుంటున్నారు ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు, అందుకే ఇప్పుడు మనం వారందరికీ పని కల్పిద్దాం. ఏమంటారు?” ప్రియాంక ఆయనతో అంది.

నాచిరెడ్డి ఆలోచనగా తలూపాడు. ఆమెను అదే పనిగా చూస్తున్నాడు సిద్ధార్థ, ఏమిటన్నట్లు అతని వైపు సైగ చేసింది ప్రియాంక.“అబ్బే ఏమీ లేదు. నువ్వు కూడా ఈ రాజకీయాల్లో తక్కువేమీ కాదు అని నాకు అనిపిస్తోంది” అన్నాడు సిద్ధూ. దానికి ఆమె ఏమీ మాట్లాడలేదు.

(సశేషం)

Exit mobile version