రాజకీయ వివాహం-11

0
2

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది 11వ భాగం. [/box]

అధ్యాయం- 11

[dropcap]అ[/dropcap]తడు చాలా వేగంగా పరిగెడుతున్నాడు. గాలితో పోటీపడుతూ, దుమ్మూ ధూళి రేపుకుంటూ తనను జీవన్మరణ సమస్య వెంటాడుతున్న రీతిలో శక్తీనంతటినీ కాళ్ళలోకి తెచ్చుకుని అదే పనిగా పరిగెడుతున్నాడు. చుట్టూ చీకటి ఉన్నా, తనకి చాలా అడ్డంకులు ఎదురొస్తున్నా, కాళ్ళకున్న పాదరక్షలు తెగిపోయి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేసే స్థితిలో అతను లేడు.

అతని హడావిడి చూసి ఆ రాత్రిలో కుక్కలు అతని వెనక పడి గట్టిగట్టిగా మొరుగుతున్నాయి, అయినా కానీ అవి అతని వేగాన్ని అందుకోలేక వెనకబడిపోయాయి, దూరంగా ఎక్కడో కనిపిస్తున్న వెలుగువైపు అతని పరుగుసాగుతోంది. అతడిని వెనుక నుండి అంతే వేగంతో వెంబడిస్తున్నారు పది మందికి పైగా దుండగులు.

వారి చేతుల్లో అనేక రకాలైన మారణాయుధాలు ఉన్నాయి, అరుపులూ గోలలూ చేసుకుంటూ అతడిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారికీ అతనికీ మధ్య కనీసం ఒక రెండు వందల మీటర్ల దూరం ఉంది. ఆ ప్రదేశంలో వాహనం ప్రయాణించడం కష్టం అవ్వడం వలన వాళ్ళు కూడా కాళ్ళ మీదే ఆధారపడవలసి వచ్చింది.

అమావాస్య గడచి రెండు రోజులే అవడం వలన ఇంకా అంతగా వెన్నెల కురవడం లేదు, వారి చేతుల్లో ఉన్న హై పెర్ఫార్మెన్సు టార్చిలు వాళ్లకు దారి చూపుతున్నాయి. అతనికి కనీసం అది కూడా లేదు. వారు అతను వెళ్తున్న అలికిడిని ఆధారంగా చేసుకుని అతడి కొరకై పరుగుతీస్తున్నారు. హడావిడిలో తన మదిలో చాలా ఆలోచనలు వేగవంతంగా తిరుగుతున్నాయి.

ఎలాగైనా తనకు తెలిసిన ఈ సమాచారాన్ని అవసరమైన వాళ్ళకి తెలియచెయ్యాలి, ఈ రాష్ట్ర ప్రజల తలరాత తాను తెలుసుకున్న సమాచారం మీద ఆధారపడి ఉంది అని అతనికి నమ్మకంగా అనిపించి వెంటనే తన కర్తవ్యం తనకు గుర్తొచ్చింది. ఆ నిర్జన ప్రదేంలో తనకి ఎదురైన ఇద్దరు ముగ్గురు గుద్దుకుని బోర్లాపడి మళ్ళీ లేచి పరుగు కొనసాగించాడు. కంగారుగా తన జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసి చూసాడు బ్యాటరీ డెడ్ అవ్వడంతో అది కూడా అతనికి సహాయం చెయ్యలేకపోయింది. చిరాకుగా నేలకేసి దాన్ని విసిరికొట్టాడు. తనింక తన వెంటపడుతున్న వారి నుండి క్షేమంగా తప్పించుకోగలను అనే నమ్మకం అతనికి పోయింది.

నెమ్మదిగా తన కాళ్ళలో శక్తీ క్షీణిస్తోంది, ఆయాసపడుతూ ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. తనకు కనిపిస్తోన్న వెలుగు దగ్గర అవ్వడం చూసి అతని మనసులో ఏదో ఒక మూల చిన్న ఆశ తళుక్కున మెరిసింది.

“ఇడియట్స్, అసలు వాడు మనకు ఎదురు తిరిగే వరకూ ఎందుకు తెచ్చుకున్నారు, ఇలాంటివారిని చేర్చుకునే ముందర ఆలోచించాలి” అక్కడికి కొంత దూరంలో ఉన్న పెద్ద వేర్‌హౌస్‌లో ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర తన ఎదర ఉన్న మనుషులను ఉద్దేశించి అంటున్నాడు బ్రౌన్ సూట్ ధరించిన వ్యక్తి.

“ఇప్పుడు డాడీకి ఈ విషయం ఎలా చెప్పాలి, అసలే ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడం అన్నది నేను మొట్టమొదటి సారి సొంతంగా తీసుకున్న డెసిషన్ ఇది. అలాంటిది ఇంకా డాడీ కన్నా ఇలాంటి విషయాల్లో పెద్దవాడైన వ్యక్తి డిజైన్ చేసిన ఈ ప్లాన్ ఇంకా అమలు జరపక ముందరే మనకి ఇలాంటి అడ్డంకి ఎదురైతే ఎలాగ ఇప్పుడు నేను ఆయనకు సమాధానం చెప్పాలి” ఆవేశంగా తన ముందర వ్యక్తులతో అంటున్నాడు. విశాలమైన ఆ ప్రదేశంలో కనీసం ఒక ఇరవైమంది పైగా ఉన్నారు. వారందరూ ఏమి చెయ్యాలో తోచక వారి బాస్ వంక నిస్సహాయంగా చూస్తున్నారు.

“వాడికి ప్లాన్ ఎంతవరకూ తెలిసింది” కొద్దిగా సద్దుకున్నాడు ఆ బ్రౌన్ సూట్ వ్యక్తి

“మేము మాట్లాడుకుంటున్న సమయంలో మొత్తం మాతోనే ఉన్నాడు సార్. మేము మనవాడే కదా అని పట్టించుకోలేదు, అతనిలా ఎదురు తిరుగుతాడని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. అయినా మనవాళ్ళు కొంతమంది వెంటనే వాడిని వెంబడిస్తూ వెళ్ళారు, ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఖతం చేసేస్తారు లెండి”

“అది కాదు కదా పాయింట్, ఈలోపలే వాడు ఎవడికైనా ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తే మొత్తం ప్లాన్ అంతా గంగపాలు అవుతుంది” చిరాకుగా అన్నాడు. ఇంతలో జాన్ అనబడే వ్యక్తి తన చేతిలో ఉన్న పెద్ద డ్రాయింగ్ తీసుకువచ్చి తన బాస్ ఎదురుగా ఉన్న టేబుల్ పైన పరిచి అతనికి  అర్థం అయ్యేలా తన ఫోన్ కెమెరా ఆ డ్రాయింగ్ పైన ప్రసరింపజేశాడు, ఆ గదిలో ఉన్న అతని తలపైన పడి అతని గుండు నున్నగా మెరిసింది.

“అంటే డ్రాయింగ్స్‌లో మనం చేసిన మార్పులు మొత్తం వాడికి తెలిసిపోయాయి అన్నమాట, ఇంకేముంది మన పథకం కనక అమలు జరిపితే రేపు దీనికి కారణం మనమే అని ఈ ఒక్క ఆధారం చాలు. అయినా ఇటువంటి ఆవేశపరులతో కలిసి పనిచెయ్యాలి అనుకోవడం డాడ్ మూర్ఖత్వం. ఏమైనా సరే డాడ్‌కి తెలిసే లోపలే ఇతని సంగతి చూడండి. జానీ కం విత్ మీ” అని ఆ వ్యక్తి వెంటరాగా తనను ప్రత్యేకంగా వేయించుకున్న రోడ్ మీద కార్ వేగంగా నడుపుతూ భూషణరావు దగ్గరకు వెళ్ళడానికి ఉద్యుక్తుడు అయ్యాడు ప్రతాప్.

అతనిప్పుడు ముంబైలోని తమ గెస్ట్‌హౌస్‌లో ఉన్నాడు, కొంతమంది ఫారెన్ సప్లయర్స్‌ను కలవడానికి అతను తన తండ్రితో కలసి ఇక్కడకు వచ్చాడు, వచ్చిన సమయంలో తమకి అడుగడుగునా అడ్డుపడుతున్న రాహుల్ తండ్రి జోగేశ్వరరావు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి తన తండ్రి, ఇంకా తనకి తెలియని తన తండ్రి సహచరుడి సూచనల మేరకు సొంతంగా ఒక పథకం రూపొందించాడు.

రేపు ఉదయం ఫ్లైట్‌కి వాళ్ళిద్దరూ విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది. తన గెస్ట్‌హౌస్ ఊరికి దూరంగా ఉంది, సిటీలో తండ్రితో పాటుగా తను బస చేసిన హోటల్ వైపు వేగంగా వెళ్తున్నాడు ప్రతాప్. ఇంతలో తనకి ఒకరిదగ్గర నుండి ఫోన్ వచ్చింది

“ఎక్కడున్నారు ప్రతాప్” తనకి పరిచయమైన గొంతు అవతలివైపు నుంచి వినిపించాడంతో కొద్దిగా ఆశ్చర్యపోయాడు.

ఈ సమయంలో ఇతను ఫోన్ చేసాడంటే కొంపతీసి ఇతడికి తమ పథకం లీక్ అవ్వలేదు కదా, అసలే ఇలాంటి విషయాల్లో ఇతను చాలా వేగంగా ఉంటాడు, ఎలా తెలుస్తుందో తెలీదు కానీ దేశం మొత్తం మీద ఈ సుదర్శన్‌కి నెట్వర్క్‌లు ఉంటాయనుకుంటా, వెంటనే పసిగట్టేస్తాడు, ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

 “ఆ సుదర్శన్ చెప్పు, నేనొక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ కోసమని ముంబై వచ్చాను డాడీతో కలపి. ఏమిటీ ఈ మధ్య పెద్దగా నాతో పనిపడలేదా అస్సలు కాల్ చెయ్యడమే మానేశావ్” ఆశ్చర్యం నటిస్తూ అన్నాడు ప్రతాప్.

“భలేవారే సార్, సుకన్య గారి కేస్ తరువాత మీకే మేము గుర్తులేము అనుకుంటా, ఎంతైనా మీరు క్లైంట్స్ మేము సర్వెంట్స్ అంతే కదా” అన్నాడు సుదర్శన్.

“హా చచ్చిన వాళ్ళ గురించి ఎందుకులే, అయినా ఇంకా నువ్వు ఆ కేసు గురించి మర్చిపోలేనట్లు ఉంది. ఏంటి సంగతులు? ” అడిగాడు ప్రతాప్

 “ఏమి లేదు సార్. ఇప్పుడే నాకొక నమ్మకమైన సోర్స్ నుంచి బ్లాంక్ కాల్ వచ్చింది, దానికీ మీకు ఏమైనా రిలేషన్ ఉందేమో అని కాల్ చేసాను, ఇంకో విచిత్రం ఏంటంటే అది కూడా ముంబై ఏరియా నుండే వచ్చింది” నెమ్మదిగా అతనితో అన్నాడు సుదర్శన్. గతుక్కుమన్నాడు ప్రతాప్.

 “ఏమో నాకైతే ఏమీ తెలీదు కానీ, ఇంతకీ ఎవరా రిలయబుల్ సోర్స్” అతడిని దారి మళ్ళించడానికి అడిగాడు ప్రతాప్.

 “ఏమి లేదులెండి సార్, అది కొంచెం కాన్ఫిడెన్షియల్ బిజినెస్ సీక్రెట్” తన కూడా ఏమీ తగ్గకుండా సమాధానం ఇచ్చాడు ప్రతాప్.

“ఓకే ఓకే నేను మళ్ళీ ఊరొచ్చిన తరువాత కాంటాక్ట్ చేస్తాను, అప్పుడు తీరికగా మాట్లాడుకుందాం, ఉంటాను” అని ఫోన్ డిస్కనెక్ట్ చేసి కారును ముందుకు పోనిచ్చాడు ప్రతాప్.

పరిగెడుతున్న సూరిని ఆనందంలోకి ముంచెత్తుతూ అతనికి నేషనల్ హైవే మీద ఉన్న వెలుతురు దర్శనం ఇచ్చింది. తన ప్రయత్నాలు ఫలిస్తాయేమో అని అతను తనకు ఎదరగా వస్తున్న వాహనాలను ఆపడానికి ప్రయత్నించాడు. ఒక్కళ్ళకి కూడా తన బాధ పట్టినట్లు లేదు, ఇంతలో తనని వెంబడిస్తున్న దుండగుల చేతుల్లో ఉన్న టార్చ్ లైట్లు దూరంగా అతనికి కనిపించాయి.

ఇంకా ఎక్కువ ఉపేక్షించి లాభం లేదని దూరంగా ఉన్న కర్ర ఒకటి తీసుకుని తనకి అభిముఖంగా వస్తున్న ఒక వాహనదారుడిని గట్టిగా కొట్టాడు, కీచుగా శబ్దం చేస్తూ వాహనదారుడు తన బైకు మీద నుండి కిందకు పడ్డాడు. హడావిడిగా ఆ బైకును తాను సొంతం చేసుకుని శరవేగంగా దూసుకుపోతున్నాడు. హైవే కావడం వలన దగ్గరలో ఎక్కడా కానీ అతనికి ఎటువంటి దుకాణాలు కనపడడం లేదు, కనీసం ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా వీలుపడడం లేదు.

తన వెనక దుండగుల గురించి ఆలోచించే పరిస్థితిలో తానిప్పుడు లేడు. తక్షణమే తను హైదరాబాద్ చేరుకోవడానికి ప్రయత్నించాలి, ఈలోపులో తనకి తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగైనా అవసరమైన వారికి చేరవెయ్యాలి, ఈ క్షణంలో తనకు సహాయపడగలిగింది వాళ్ళు ఒక్కరే. తన తండ్రిమాట వినకుండా తను ఈ ప్రతాప్ బృందంతో చేయికలపడం వలన తనకు తగిన శాస్తి జరిగింది.

తనను విశాఖపట్నంలో వీరు కలిసినప్పుడు తనకు ఎలాగైనా తన తండ్రి స్థలం ప్రభుత్వం వారి దగ్గర నుంచి తిరిగి దక్కుతుందని భూషణరావు తనయుడు ప్రతాప్ తన బృందంలో చేరమని తనకి నమ్మకంగా చెప్పాడు. అతని మాటలను అప్పుడప్పుడు టీవీలలో కనిపించే ఒక పెద్దాయన ఆదిత్యనారాయణ గారు కూడా బలపరిచారు.

తను చదువుకున్నది కూడా అంతంత మాత్రమే, అందుకే ఇప్పుడు తనకి తన స్థలాన్ని దక్కించుకోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు, అందుకే తన తండ్రి ఇలాంటివారితో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినా ఖాతరు చెయ్యకుండా వీరితో కలిసాడు, వీరు తనకి కొంత డబ్బు కూడా ఆశ చూపించారు, అయితే తనకి ముందర ఈ విషయం  అర్థంకాలేదు.

తానున్న పరిస్థితుల దృష్ట్యా వారిచ్చిన దాన్ని స్వీకరించక తప్పలేదు, కానీ వాళ్ళు ఇంత పెద్ద పథకం ప్లాన్ చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. బైక్ కన్నా వేగంగా అతని ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. ఇంతలో తన వెనక వేగంగా కొంతమంది దుండగులు వాహానాలపై రావడం అతను గమనించాడు. తాను వారికన్నా ముందుగా ప్రయాణించడం వలన వారికి తనని చేరుకోవడానికి సమయం పడుతోంది.

వారిలో ఇద్దరు వారు ప్రయాణిస్తున్న వాహనాల నుండి రెండు బైక్స్‌తో బయటకు దూకి వేగంగా ప్రయాణిస్తున్నారు, ఆ చీకట్లో బైక్ హెడ్ లైట్ క్లు తప్ప మరేమీ కనపడడం లేదు. అతని బైకుకీ వారి బైక్స్‌కీ మధ్య దూరం నెమ్మదిగా తగ్గుతోంది. కంగారుగా బైకు నడుపుతున్న అతడు తన పక్కనున్న వాహనాలను గుర్తుపట్టలేక పోయాడు, ఇంతలో తనని దాటుకుని ముందుకు వెళ్ళిన వాహనాన్ని తప్పించబోయే ప్రయత్నంలో పక్కనే ఉన్న రాయికి తగులుకుని అమాంతం గాలిలోకి లేచి కింద పడిపోయాడు.

ఆ దుండగులు చేస్తున్న హాహాకారాలు తన చెవికి సోకగా అతను స్పృహ కోల్పోయాడు, ఎవరో తనని ఎత్తుకుని ఒక కార్లో కూర్చోపెట్టడం వరకు మాత్రమే అతనికి గుర్తుంది. ఆ తరువాత తను ఎక్కడికి వెళ్ళాడు, ఏమి చేసాడు. తనని దుండగులనుంచి కాపాడినది ఎవరు అతనికి తెలీదు.

***

“ఇతని పేరు అప్పన్న. ఆ చాపర్‌కి పైలెట్. ఒక నెలరోజుల క్రితం అక్కడ పని చేస్తున్న ఒక పంజాబీని అక్కడ నుంచి తప్పించి వేరే శాఖకి ట్రాన్స్‌ఫర్ చెయ్యడం జరిగింది. అప్పన్న మనకు చాలా నమ్మకమైనవాడు, పైలట్‌గా జాయిన్ అయిన అతి తక్కువ వ్యవధిలోనే జర్మనీ వాళ్ళతో కో-ఆర్డినేట్ చేసి మనకు అవసరమైన స్కీమాటిక్స్ తీసుకురాగలిగాడు. దానితోపాటుగా బ్లాకుడ్యూయల్ బాక్స్ స్కీమాని ఈ చాపర్ ఇంజిన్‌కి ఇంటిగ్రేట్ చెయ్యడానికి కూడా సహకరించాడు. ఇతను చాలా నమ్మకస్తుడు. మనకోసం ఏమి చెయ్యడానికైనా వెనుకాడడు”

“అది సరే ఇప్పుడు ఇతని అవసరం మనకేముంది, అస్సలు ఇప్పుడు ఎక్కడున్నాడు ఇతను”  అర్థం కాక అడిగాడు భూషణరావు, తన మీటింగ్ అయిపోయిన తరువాత హోటల్‌లో రిలాక్స్ అవుతున్న తనతో మాట్లాడడానికి వచ్చిన కొడుకుని చూసి అడిగాడు.

“అదే చెప్తున్నాను, అప్పన్న ఉండేది హైదరాబాద్‌లో. నాకు తెలిసిన సమాచారం ప్రకారం జోగేశ్వరరావు గారు తన విదేశీ ప్రయాణం పూర్తి చేసుకుని ఎవరికీ తెలీకుండా అందరినీ ఆశ్చర్యపరచడానికి రేపు ఇరవై తారీఖున ధరణికోట దగ్గర జరిగే సభకు హాజరు కావడానికి నిశ్చయించుకున్నారు. ఈ విషయం అతని కుమారుడు రాహుల్‌కి కూడా తెలియకపోవడం వలన పెద్దగా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదు.

సరిగ్గా ఉదయం ఎనిమిది గంటల సమయంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి తన చాపర్ ఉన్న ప్రదేశానికి చేరుకోనున్న జోగేశ్వరరావుగారు మరొక రెండు గంటలలో తన నిర్ణీత ప్రదేశానికి చేరుకొని అందరినీ ఆశ్చర్యపరచాలనే యోచన. అక్కడే మన అప్పన్న మనకు సహాయపడతాడు, సరిగ్గా హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఇరవై నిమిషాల తరువాత ‘చెంచుకోన’ దగ్గర చాపర్ టెంపరేచర్ పెరుగుతున్నట్లుగా గమనించి అప్పన్న నియరెస్ట్ లాండింగ్ కోసం శంషాబాద్ విమానాశ్రయాన్ని కాంటాక్ట్ చెయ్యడానికి ట్రై చేస్తాడు.

వారి నుంచి ఎటువంటి స్పందనా లభించకపోవడంతో ఏమి చెయ్యాలో తెలీక తనకు తెలిసిన త్రోవలో ల్యాండ్ చెయ్యడానికి కోపైలేట్ సహాయం కోరతాడు, అదే సమయంలో ఇన్‌స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ అయ్యేలా మన ఛాపర్ టేకాఫ్‌కి ముందరే డిజైన్‌లో ఇంకార్పోరేట్ చేస్తాం. దానితో ఇన్‌స్ట్రుమెంట్ ఓవరైడ్ ప్రొసీజర్స్ చేస్తూ డిష్ట్రాక్షన్ వల్ల అతను సహాయం చెయ్యలేకపోతాడు.

ఈ హడావిడిలో ఉండగానే దట్టమైన చెంచుకోనలోయ మనకి చెయ్యవలసిన సహాయం చేస్తుంది. దానితో జోగేశ్వరరావు ప్రాణాలు గాల్లోకి నువ్వు కోరుకున్నట్లుగానే మన స్థలంతో పాటుగా ఈ రాష్ట్రం కూడా మన చేతుల్లోకి. ఒకరకంగా చెప్పాలంటే ఇదొక సూసైడ్ మిషన్ లాంటిది, దీనిపై మన భవిష్యత్తు మొత్తం ఆధారపడడం వలన నీ సలహా తీసుకోకుండా మన దగ్గరున్న మాగ్జిమం రిసోర్సెస్ ఉపయోగించి ఈ పథకం రూపొందించాను” తన తండ్రికి తన పథకం పూర్తిగా వివరించాడు ప్రతాప్.

“ఫెంటాస్టిక్. పథకం చాలా బాగుంది, అంతా నాకోరిక ప్రకారమే జరుగుతోంది. ఈ విషయం తెలియవలసిన వాళ్ళకి తెలిస్తే చాలా ఆనందపడతారు. కానీ ఇది నీ ఒక్కడివల్లే సాధ్యం అయ్యిందంటే నాకు నమ్మకం కలగడం లేదు” ఆనందంగా అన్నాడు భూషణరావు.

“హమ్మయ్య, ఎక్కడ నువ్వు నా పధకాన్ని ఒప్పుకోవో అని కొంచెం భయంగా ఉండేది డాడీ, ఇప్పుడు ఆ అనుమానం తీరిపోయింది, ఇంక అప్పన్నను ఆ పొజిషన్‌లో నియమించడానికి చాలా మంది మంత్రులను ఖరీదు చెయ్యాల్సి వచ్చింది. నీకెప్పుడూ నా శక్తీ మీద నమ్మకం లేదు కదా. అయినా దీనివెనుక నాకు అవసరమైన సహాయం నేను తీసుకున్నానులే. ఈ దెబ్బతో మళ్ళీసారి నువ్వే ముఖ్యమంత్రివి కావచ్చేమో ఎవరు చెప్పొచ్చారు” తన తండ్రితో అన్నాడు ప్రతాప్.

వారిద్దరూ కలిసి పన్నిన ఈ కుటిల పధకానికి ప్రకృతికూడా సహకరిస్తోంది అన్నట్లుగా పెద్దగా మెరుపు ఒకటి మెరిసింది.

“సార్ అతడు తప్పించుకున్నాడు సర్” హడావిడిగా తమ సూట్లోకి ప్రవేశించిన వ్యక్తి సూరికి ఆక్సిడెంట్ అవ్వడం గురించి వారికి వివరించాడు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అతడిని కాపాడి తీసుకెళ్ళినట్లు చెప్పాడు.

“దద్దమ్మల్లారా, అసలు మీ వల్ల ఉపయోగం ఏంటిరా, డాడీ ఇప్పుడే పథకం ఒప్పుకున్నారు అన్న ఆనందంలో ఉంటే ఇప్పుడొచ్చి అది తెలుసుకుని పారిపోతున్న వాడి తప్పించుకున్నాడు అని చెప్తారా, వాడు ఎవరి దగ్గరా నోరు విప్పకముందే వాడి పని పూర్తి చేసెయ్యండి” కోపంతో రగిలిపోతూ వాళ్ళతో అన్నాడు.

అప్పుడే అక్కడే తను తన తండ్రికి వారి అజాగ్రత్త వల్ల తప్పించుకున్న ‘సూరి’ అని తమ బృందంలో చేరిన సభ్యుడు గురించి మొత్తం వివరాలు చెప్పాడు.

“అయినా దిగులు పడకు, వాడు మనల్ని ఏమీ చెయ్యలేడు, ఒకప్పుడు వాళ్ళ నాన్న నన్ను వాళ్ళ స్థలం గురించి నకునారెడ్డిగారిని కలవమని నేనే వాళ్లకి చెప్పాను, వాళ్ళ తండ్రి మన చేతుల్లో ఉన్నంతవరకు అతడి ప్రాణాలు మన గుప్పిట్లో ఉన్నట్లే. గాయపడిన వాడిని ఏదో ఒక హాస్పిటల్‌లో జాయిన్ చేసి ఉంటారు.

వీళ్ళ ఎవ్వరి వల్లా కాదు కానీ నువ్వు ఇమ్మీడియేట్‌గా జానీను ఈపనికి ఉపయోగించు. నీ పవర్స్ మొత్తం ఉపయోగించి వాడెక్కడున్నాడో కనుక్కుని అంతం చెయ్యి. ఏం ప్రాబ్లం లేదు, ఇంకా నేను రంగంలోకి దిగాక మనం ఎవరి గురించీ భయపడాల్సిన అవసరం లేదు. పని మొత్తం ఈ రాత్రికే ముగిసేలా చూసుకో, మనం కూడా రేపు ఉదయం ఫ్లైట్‌కి హైదరబాద్ చేరుకోవాలి” భరోసా ఇస్తున్నట్లుగా అన్నాడు. ఆయన అన్నదానికి కొద్దిగా ఊపిరి పీల్చుకున్న ప్రతాప్ వారిని తీసుకుని జానీతో పాటుగా అక్కడ నుండి బయటపడ్డాడు. అప్పుడు సమయం సరిగ్గా రాత్రి తొమ్మిది అవ్వడానికి ఇంకొక పది నిమిషాలు మిగిలి ఉంది.

***

“అస్సలు మీరెవరు సార్. నన్నెక్కడకు తీసుకువచ్చారు” తనను కాపాడిన వ్యక్తిని ఉద్దేశించి అడుగుతున్నాడు సూరి. అతనిప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. అదొక పెద్ద హాస్పిటల్ లాగ అనిపించింది.

“హలో మిస్టర్ సూరి, నేనెవరో మీకు తెలీదు కానీ మీరు ఆపదల్లో ఉన్నారని మా బాస్ ఊహించి మీకేమైనా సహాయం కావాలేమో చూడమని నన్ను పంపించారు. అక్కడ బైక్ ఆక్సిడెంట్ అవ్వడం వలన మీ కాలికి పూర్తిగా గాయం అయ్యింది, అస్సలు చెప్పండి ఎందుకు అంత కంగారుగా ఉన్నారు. మిమ్మల్ని వెంటాడుతున్నది ఎవరు”

“వాళ్ళు భూషణరావు అనే వ్యాపారవేత్తకి సంబధించిన మనుషులు సార్. గతంలో ధరణికోట దగ్గర మా తండ్రి స్థలం ప్రభుత్వం వారు స్వాధీనపరుచుకున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి నకునారెడ్డి గారి దగ్గరకు వెళ్ళాము సార్. ఆయన కూడా ప్రస్తుతానికి ఏమీ చెయ్యలేని దుస్థితిలో ఉండగా ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో నేను ఒకనాడు మా ఊరి దగ్గర నాయుడుపల్లి అనే గిరిజన తండాలో జరిగిన ఒక రహస్య సభలో ఎంతోమంది యువకులు అక్కడ భూమికోసం పోరాడుతూ ఉండడం చూసాను.

వారి సహాయం పొందితే కనుక మా భూమి మాకు దక్కుతుందనే ఆశతో వారితో చేతులు కలిపి వారు చేసే పనుల్లో సహాయపడడానికి నిశ్చయించుకున్నాను. ఈ విషయం మా నాన్నకు తెలిసి ఇలాంటి పనులు మానుకోమని ఆయన నన్ను హెచ్చరించారు, నేను ఆయన మాటను పెడచెవిని పెట్టాను. ఇంతలో వీరు ఒక అర్జెంటు సమావేశం ఉందని అందరినీ ముంబై తీసుకువచ్చారు, అక్కడ నాకు చాలా భయంకరమైన విషయాలు తెలిసాయి.

అలాంటి రహస్య పధకాలు భూషణరావుగారు పన్నుతారని, అలాంటి విషయాలు జరుగుతాయని నేను కల్లో కూడా ఊహించలేదు, అందుకే వారికి తెలీకుండా వారు వేస్తున్న పథకం మొత్తాన్ని నా సెల్ ఫోన్‌తో ఫోటో తీసాను. ఎలాగైనా వాటిని బయటవారికి తెలియజెయ్యాలని నకునారెడ్డిగారి పార్టీలో పరిచయం ఉన్న సిద్ధార్థ గారికి ఫోన్ చేసాను.

నేను ఫోటోలు తీయడం తెలుసుకున్న వారు నన్ను బంధించడానికి ప్రయత్నిస్తే నేను వారి నుండి పారిపోతున్న సమయంలో ఈ ఆక్సిడెంట్ జరిగింది. నేను ఒకందుకు వారి సహాయం ఆశిస్తే నాకు అనుకోకుండా వేరే విషయాలు తెలిసాయి. అందుకే నేను వీరికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను నాకు సహాయం చెయ్యండి సర్” సూరి ఆ మాటలు అంటున్నంత సేపు చాలా ఆయాసపడుతూ ఉన్నాడు, జరిగిన ఆక్సిడెంట్ వలన అతని తలకి కూడా బాగా గాయం అయ్యింది. బాగా రక్తం కూడా పోయింది, దాదాపు అపస్మారక స్తితిలో ఉన్నట్లుగా నెమ్మదిగా వినవస్తోంది అతడి స్వరం.

“అది సరే ఇంతకీ మీరు చూసిన ఆ రహస్య పథకం ఏంటి. మీరు ఫోటోలు తీసాను అన్న మీ ఫోన్ ఇప్పుడు మీ దగ్గరే ఉందా” కుతూహలంగా అడిగాడు ఆ అపరిచిత వ్యక్తి. అప్పుడు సూరికి గుర్తొచ్చింది ఫోటోలు తీసిన తన సెల్ ఫోన్ బ్యాటరీ అయిపోవడంతో చిరాకుగా విసిరికోట్టిన విషయం, కొంతసేపటి క్రితం తను చేసిన తప్పుకు అతను ఇప్పుడు బాధపడుతున్నాడు.

“క్షమించండి సర్, నా అజాగ్రత్త వల్ల ఆ సెల్ ఫోన్ అక్కడే వారి గెస్ట్ హౌస్ నుండి హైవే మీదకు వచ్చే అడ్డదారిలో ఉన్న తుప్పల్లో ఎక్కడో మిస్ అయ్యింది. దానికి కారణం నేనే. ఇంతకీ మీరెవరు సార్, మిమ్మల్ని ఎవరు పంపించారు”  అర్థం కానట్లుగా అడిగాడు సూరి అతను ఇంకా ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. డాక్టర్ అతనితో మాట్లాడడానికి కేవలం పది నిమిషాలు మాత్రమే సమయం కేటాయించాడు.

“నా పేరు గణేష్, నేను మన ముఖ్యమంత్రి కుమారుడు రాహుల్ ఆంతరంగిక మిత్రుడిని. సిద్ధార్థ నాకు కూడా స్నేహితుడే, అతడి ఫ్రెండ్ ఎవరో సుదర్శన్ అట, నేను ముంబైలో ఉన్నాను అని తెలుసుకుని మీకు హెల్ప్ చెయ్యమని నాకు కాల్ చేసాడు. మీరేమి భయపడకండి మీకు ఇక్కడ ఎటువంటి సమస్యా రాదు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి డాక్టర్లు ఉన్నారు. మనం జస్ట్ మీ సెల్ ఫోన్ దక్కించుకుంటే చాలు. ఈ భూషణరావు సంగతి చూడచ్చు. ఇతడు రాను రాను మన ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిలా తయ్యారవుతున్నాడు. ఆ ఇందాకా చెప్తున్నారు కదా అది ఏ ఏరియాలో ఉంది” అడిగాడు గణేష్.

“థానే దగ్గర సక్రోలి అనే విలేజ్ సార్, ముంబై నాశిక్ నేషనల్ హైవే నుండి చేరుకోవచ్చు” ఆ మాటలు చెప్పడానికి అతను చాలా శ్రమ తీసుకున్నాడు.

“డోంట్ వర్రీ మీ సెల్ ఫోన్ సంగతి మేము చూసుకుంటాము. ఇందాకా ఆ రహస్య పథకం గురించి ఏదో చెప్తూ మధ్యలో ఆగినట్లున్నారు” అడిగాడు గణేష్.

“అవును సార్, మీరు రాహుల్ గారి స్నేహితులు అంటున్నారు కాబట్టి మీకు మన ముఖ్యమంత్రిగారు కూడా బాగా తెలిసే ఉండాలి. జోగేశ్వరరావుగారు రేపు…” అతను ఇంకా ఏదో చెప్తూ ఉండగా గణేష్ జేబులోని సెల్ ఫోన్ మోగడంతో అతను తీసి చూసాడు, ఎవరో అర్జెంట్ ఫోన్ కింద అనిపించి “ఒక్క క్షణం సూరిగారు, మనం ఒక పది నిమిషాల్లో మాట్లాడుకుందాం” అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ అక్కడ నుండి వెళ్ళాడు.

చాలా అంతస్తులున్న ఆ హాస్పిటల్ నగరంలో చాలా ప్రఖ్యాతి గాంచినది. తనకి అక్కడ బోలెడు గెస్ట్ హౌస్లు ఉన్నప్పటికీ అతడిని అక్కడకి తీసుకువెళ్ళడం మంచిది కాదని భావించి సూరిని ‘చంద్రావతి’ హాస్పిటల్‌లో ఉండే ఏర్పాటు చేసాడు సుదర్శన్. ఏమి జరుగుతుందా అని కుతూహలంగా గణేష్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎనిమిదవ ఫ్లోర్ లోని ఐసీయూలో ఉన్నాడు సూరి. తన పద్ధతిని ఉపయోగించి సూరి ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టగలిగాడు ప్రతాప్, ఎవరికీ అనుమానం రాకుండా జానీని పై అంతస్తులోకి వెళ్ళే ఏర్పాటు చేసాడు.

నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని డాక్టర్ వేషంలో ఉన్న జానీను ఇప్పుడు ఎవరు చూసినా డ్యూటీ డాక్టర్ అనే భ్రమలో ఉంటారు. అతను నెమ్మదిగా ఒకొక్క ఫ్లోర్ దాటుకుంటూ ఎనిమిదవ ఫ్లోర్ చేరుకున్నాడు మధ్య దారిలో అతనికి గణేష్ కనిపించాడు కాని ఒకరికి ఒకరు తెలీకపోవడం వలన గణేష్ పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.

“సాబ్ ఆప్కో కౌన్సా ఫ్లోర్ జానా హై” లిఫ్ట్‌లో ఉన్న అటెండెంట్ అతడిని అడిగాడు, దానికి జవాబు చెప్పకుండా అతడు ఆపిన ఫ్లోర్‌లో దిగి అక్కడ నుండి మెట్ల ద్వారా పైకి చేరుకున్నాడు. ముప్పై గదులు ఉన్న ఆ ఫ్లోర్లో చివరగా ఎడమ పక్కగా ఒక మూలకి ఉంది ఐసీయూ, దానిని గుర్తించడానికి వీలుగా నీలం రంగులో ఉన్న బాణం గుర్తులు ప్రతీ పది మీటర్లకీ వెళ్ళాడుతున్నాయి.

ఒక రూమ్ నుండి ఇంకొక రూమ్‌లోకి అప్పుడప్పుడు హడావిడిగా కదులుతున్న వార్డ్ బాయ్స్ చేతులో రకరకాల మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్న పళ్ళాలతో తిరుగుతున్నారు. వారిలో ఒకరిని ఆపి అతని దగ్గర ఉన్న మెడికల్ ఫోర్సెప్స్, నైఫ్‌ను తీసుకున్నాడు, ఒక పెద్ద పావు అంగుళం ఉన్న ఒక ప్లాస్టిక్ ట్యూబ్ కూడా తీసుకున్నాడు. తన వంక విచిత్రంగా చూస్తున్న వార్డ్ బాయ్‌ని పట్టించుకోకుండా ఫ్లోర్ చివరకి చేరుకొని ఎడం పక్కకు వెళ్ళాడు.

అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ను ఒకేదెబ్బతో నేలకూల్చాడు. తను లోపల ప్రవేసించే సరికి అలసిపోయిన సూరి నిద్రపోతూ ఉన్నాడు, ఒక్కసారి తన కళ్ళజోడు సవరించుకుని అతని పడుక్కుని ఉన్న మంచం దగ్గరకు వెళ్ళాడు. ఈసీజీ మెషిన్ చిన్నగా శబ్దం చేస్తోంది. అతని ముఖానికి ఆక్సిజన్ మాస్క్ కూడా తగిలించబడి ఉంది.

మొదటగా తన ముఖానికి నలుపు రంగు దళసరి ప్లాస్టిక్ మాస్కు తగిలించుకుని తన జేబులో ఉన్న చిన్న సిలిండర్‌కి తాను తెచ్చిన ట్యూబ్ ఫిక్స్ చేసి దాన్ని ఫోర్సెప్స్ సహాయంతో ఆక్సిజన్ సిలిండర్‌కి ఫిక్స్ చేసాడు. అప్పుడే బాత్రూంలో నుంచి బయటకు వచ్చిన నర్స్ ‘కౌన్ హై ఆప్. క్యా కర్ రహే హై’ అని ఆందోళనగా అరిచింది.

లోపల ఇంకొకళ్ళు ఉండే అవకాశం ఉందని ముందే ఆలోచించని జానీ ఒక్కసారి సీరియస్‌గా ఆమెవైపు చూసాడు. ఆమె కంగారుగా అరవడానికి సిద్ధపడుతూ ఉండగా అమాంతం ఆమెను ఒడిసి పట్టుకున్నాడు, అతని చేతుల్లో పెనుగులాడుతున్న ఆమెను ఒకేఒక్కసారి గట్టిగా మేడపై చరిచాడు, ఆమె తోటకూర కాడలా నేలకు ఒరిగింది. ఇంతలో తాను టాంక్ లోకి ఎక్కించిన విషవాయువు ప్రభావం చూపుతూండడం వలన సూరి ఊపిరి తీసుకోవడానికి అవస్థపడుతూ బెడ్ మీద పైకీ కిందకి ఎగిరెగిరి పడుతున్నాడు, అతడు ఎక్కువ శబ్దం చెయ్యకుండా అతడిని బెడ్ మీదే ఉంచడానికి చాలా కష్టపడుతున్నాడు జానీ.

అతడిని చూడగానే సూరి కళ్ళు చాలా పెద్దవయ్యాయి, ఇంకా ఎక్కువ సేపు ఉంచితే ప్రమాదం అని తన తెచ్చిన చిన్న సిలిండర్‌కి ఉన్న నాబ్ ను పూర్తిగా తిప్పడంతో శబ్దం చేస్తూ పెద్ద సిలిండర్ లోకి ప్రవేశించింది విషవాయువు, మరొక రెండు నిమిషాలు పెనుగులాడిన తరువాత సూరి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అతని వంక ఒక్కసారి చూసి చిన్నగా నవ్వి అక్కడనుంచి బయటపడ్డాడు జానీ.

తాను వెళ్ళేసరికి గణేష్ ప్రతాప్‌ని గుర్తుపట్టి అతని దగ్గరకు రావడానికి ప్రయత్నించడం గమనించాడు, ఆ విషయం ప్రతాప్ తెలుసుకుని గణేష్ పిలుస్తున్నా వినకుండా జాన్, ప్రతాప్ ఇద్దరూ తమ కార్‌లో వేగంగా వెళ్ళిపోయారు.

***

“చెంచుకోన దగ్గర గల్లంతైన ముఖ్యమంత్రి జోగేశ్వరరావు చాపర్, రెస్క్యూ ఆపరేషన్‌ని నిర్వహిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్సు” అన్ని జాతీయ అంతర్జాతీయ ఇరవై నాలుగు గంటల వార్తా చానెల్స్‌లో ఈ వార్త అదే పనిగా ప్రసారం అవుతోంది. రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా నివ్వెరపోయింది, ఎవరూ ఊహించని ఈ పరిణామానికి ఏమి చెయ్యాలో తోచక తమ ప్రియతమ ముఖ్యమంత్రిని క్షేమంగా తీసుకురమ్మని అందరూ రకరకాలుగా తమ ఇష్టదైవాలను ప్రార్ధిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రిజర్వ్ పోలీస్ ఫోర్సును, థర్మల్ ఇమేజింగ్ కెపాసిటీ కలిగిన యుద్ధ విమానాలను తమ దగ్గర ఉన్న అన్ని వనరులనూ ఇందుకు వినియోగించింది, మిలిటరీ వారు అక్కడ స్థానికంగా ఉన్న కోయలు సహాయంతో అడవంతా జల్లెడ పడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద సెర్చ్ నెట్వర్క్ స్థాపించి నిరంతరం అలుసొలుపూ లేకుండా జోగేశ్వరరావు జాడ కోసం గాలిస్తున్నాయి ఇరు ప్రభుత్వాలు.

రాహుల్ మొత్తం పనులన్నీ కాన్సిల్ చేసుకుని వచ్చి ‘చెంచుకోన’ మొత్తం తన సహాయక సిబ్బందితో కలియదిరుగుతున్నాడు. అతనికి సహాయపడడానికి గణేష్, సిద్ధార్థలు కూడా అక్కడే వున్నారు, మామూలు సమయాల్లో అయితే సిద్ధార్థను వారించేవాడేమో కానీ ఈ పరిస్థితిలో ఏమి మాట్లాడడానికి రాహుల్‌కి మాటలు కూడా రావడం లేదు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక మాత్రం కనీసం రాహుల్‌కు ఫోన్ అయినా చెయ్యలేకపోతోంది. ఆమె మనసు పరిపరి విధాలుగా కీడు శంకిస్తోంది, దీని వెనుక ఏదైనా కాన్స్పిరసీ ఉండే అవకాశం ఉందా అని ఆమెకు అనుమానం కలిగింది. ఆమె మీడియావారు ఎవరితోనూ మాట్లాడేలనే ఉద్దేశంలో లేదు.

తన ప్రోగ్రామ్స్ అన్నీ రద్దు చేసుకుని ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంది. ఈ విషయం తన తండ్రికి తెలీకుండా తగు చర్యలు తీసుకుంటోంది. ఆమెకు నిరంతరం అక్కడ వివరాలు తెలియజేస్తున్నాడు సిధ్ధూ, ప్రస్తుతానికి ఆమె మనసు శూన్యంగా ఉంది. తన పరిస్థితే ఇలా ఉంటే రాహుల్ గురించి ఆమెకు ఊహించదానికే కష్టంగా ఉంది. ఇదిలా వుంటే ప్రసాద్ గారు తనకి ఒక కొత్త న్యూస్ తెలియచేసారు, అధికార పార్టీ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు కేంద్రంలోని ఒక ప్రముఖ నాయకుడి అండతో ప్రభుత్వం స్థాపించడానికి చూస్తున్నారని, వారి ఊహలో జోగేశ్వరరావు తరువాత స్థానంలో రాహుల్ లేడని వారు వేరే వ్యక్తిని బలుపరుస్తున్నారని చెప్పారు.

అంతేకాకుండా తమ పార్టీ నుండి ‘హనుమంతరావు’తో కూడా వారు మంతనాలు జరిపినట్లుగా సమాచారం తెలిసింది. ఇంకా జోగేశ్వరరావుగారి సంగతి ఏమైందో తెలీకుండానే వీరిన్ని రాజకీయాలు చేస్తుంటే రేపు ఆయనకి జరగరానిది ఏదైనా జరిగింది అని తెలిస్తే వీరు ఇంకెన్ని అనర్ధాలకు ఓడిగడతారో అని ఆలోచించడానికే భయంగా ఉంది.

దీనికి కారణం వాతవరణంలోని మార్పులేనని టీవీల వాళ్ళు మొత్తుకుంటున్నారు, వాతావరణం సహకరించని పక్షంలో సిబ్బంది స్టాండర్డ్ ప్రోటోకాల్ కింద బేస్‌కి రిటర్న్ అవ్వాలని అనుకోకుండా దానిని ఎదుర్కుని ముందుకి సాగడం ఇంతలో ఇన్‌స్ట్రుమెంట్ మాల్ ఫంక్షన్‌తో వారు ఆ పనిమీద ఉండగానే ఉదయం తొమ్మిది గంటల ఏభై నిమిషాలకి బేస్‌తో వారికి సంబంధం తెగిపోయింది.

అప్పటినుంచీ అన్వేషణ కొనసాగుతూనే ఉంది, ఎంత వద్దనుకున్నా టీవీల వాళ్ళు ప్రసారం చేసే ఈ కధనం ఆమెకు చేరకుండా ఉండలేకపోయింది. ఈ సమయంలో ఆమెకు కొంచెం శాంతి కలిగించడంలో శ్వేత ఉపయోగపడింది. ఆమెను చూస్తేనే ఎదో తెలియని ప్రశాంతత చేకూరిన అనుభూతి కలుగుతుంది ప్రియాంకకు.

“అంకుల్ ఈ సమయంలో కూడా మనం ఈ విషయం గురించి ఆలోచించాలా, నాకైతే నేరుగా ఆ అడవిలోకి వెళ్లి రాహుల్ బృందానికి సహాయపదాలని ఉంది. రాహుల్ ఇంకా సిద్ధూలు నన్ను వారించి ఉండకపోతే నేనీపాటికి వారిదగ్గరకు వెళ్లిపోయేదాన్ని” సాయంత్రం ఆరుగంటల సమయంలో తన ఇంటికి వచ్చి తనతో హనుమంతరావు గురించి తమ పార్టీ ఏమి నిర్ణయించుకుంటుంది అని అడగడానికి వచ్చాడు ప్రసాద్.

“మన పార్టీ నుండి హనుమంతరావు పక్షంలో కనీసం ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కసారి అతడిని కనుక జనసమాజ్ వాళ్ళు హనుమంతరావుకి మంత్రిపదవి ఆశ చూపి తమలోకి తీసుకుంటే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు ప్రియాంక, ఇంక అప్పుడు నేను, సిద్ధార్థ కాదు కదా ఆ దేవుడు కూడా మనకి సహాయపడలేడు, సాయంత్రం నేను అక్కడ నుండి తిరిగి వచ్చే సమయానికి లేక్ వ్యూ గెస్ట్ అతిధి గృహం అంతా చాలా కోలాహలంగా ఉంది. అక్కడకి వచ్చేవారికి నిరంతరం రెస్క్యూ ఆపరేషన్ గురించి అప్డేట్స్ తెలిసేలాగా రహస్యంగా ఒక తెర ఏర్పాటు చేసారు, ఇదంతా చూస్తూ ఉంటే నాకెంత బాధగా ఉందో నేను చెప్పలేను, ఒక మనిషి ప్రాణాలపైన బెట్టింగ్ కాస్తున్నట్లుగా ఉంది అక్కడ వాతావరణం.

కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడెప్పుడు ఏమి దుర్వార్త వినాల్సి వస్తుందా దానివలన తమ ప్రభుత్వానికి ఎటువంటి నష్టం చేకూరుతుందా అని కుతూహలంగా ఎదురు చూస్తోంది, కేంద్రంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ అధ్యక్షుడు కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లుగా తెలుస్తోంది” తనకు తెలిసిన వివరాలు ఆమెకు చెప్తున్నాడు ప్రసాద్. రాష్ట్రవ్యాప్తంగా జోగేశ్వరరావు అభిమానులు రకరకాల మీటింగ్లు జరుపుతున్నారు, ఈ వేడి రాష్ట్రం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసినట్లు అయ్యింది. ఇప్పటివరకూ ప్రాచుర్యంలో ఉన్న సమస్యలన్నీ మరుగున పడిపోయి ప్రస్తుతానికే ఇదే రాష్ట్రం యొక్క భవిష్యత్తు అన్న రీతిలో పరిస్థితులు ఏర్పడ్డాయి.

“నాకు ఇప్పుడు వాటి గురించి ఆలోచించాలి అనిపించడం లేదు అంకుల్. ఈ విషయం డాడీకి తెలియకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయినా ఇలాంటి హత్యారాజకీయాలను మనం ప్రోత్సహించాలి అని మీరు అనుకుంటున్నారా. నా నుంచి ఏమి సమాధానం మీరు ఆశిస్తున్నారో నాకైతే తెలీదు కానీ, నేనిప్పుడు అందుకు సిద్ధంగా లేను” కొంచెం అవేశపడుతూ ఆయనతో చెప్పింది.

“చూడమ్మా జరుగుతున్న పరిణామాల పట్ల ఎవరూ ఆనందంగా లేరు, అయితే మనం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని లాభం లేదు. నువ్వు ఇష్టపడితే నేను ఇప్పుడే హనుమంతరావుతో మాట్లాడే ఏర్పాటు చేస్తాను, నీ లక్ష్యం నా లక్ష్యం సిద్ధార్థ లక్ష్యం, రాహుల్ లక్ష్యం అందరిదీ ఒకటేనమ్మా, కానీ ఇప్పుడా సిద్ధార్థ, రాహుల్ వీరెవరూ స్పందించే స్థితిలో లేరు, ఈ అవకాశాన్ని కొన్ని గుంటనక్కలు కాష్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నాయి. నీకింకా ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతావ్, భూషణరావుని కూడా నేను అక్కడ చూసాను తెలుసా” ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రియాంక.

“భూషణరావా ఆయన ఇప్పటివరకూ ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటాను కదా, ఒక్కసారిగా సమీకరణాలు తారుమారు చేస్తూ అతను అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు” ఆశ్చర్యంగా అడిగింది.

“నీకు తెలియని విషయం ఏంటంటే భూషణరావు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, అతడు గత ఎన్నికల్లో జనసమాజ్ పార్టీ నెగ్గిన దగ్గర నుంచీ ఎప్పుడూ జోగేశ్వరరావు గారితో కలవడానికి ప్రయత్నించాడు. అయితే జోగేశ్వరరావు ఎప్పుడూ అతడిని చేరదీయలేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తనకి, లేదా తన వారి ఎవరికైనా పార్టీలో స్థానం దక్కుతుందా అని మాట్లాడుకోవడానికి వచ్చి ఉంటాడు. ఎవరు చెప్పొచ్చేరు రాబోయే మధ్యంతర ఎన్నికల్లో అతనికి జనసమాజ్ వారు టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు” తన ఊహలను ఆమె ముందుంచాడు ప్రసాద్.

“ఎంత దారుణం అంకుల్, అయితే ఈ విమానం గల్లంతవ్వడం వెనుకాల భూషణరావు హస్తం ఉండి ఉంటుందేమో అని నాకు అనిపిస్తోంది” భయంగా అన్నది ప్రియాంక.

“ఇప్పుడే మనం అంత దూరం ఆలోచించలేము ప్రియాంక, ఇది కేవలం అజాగ్రత్త వలన జరిగిన ప్రమాదం అని ప్రాథమిక నివేదిక ప్రకారం తెలుస్తోంది, కానీ భూషణరావు అంత రిస్క్ తీసుకుంటాడని నేనైతే అనుకోను, ఏదేమైనా లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నువ్వు ఎలాగైనా హనుమంతరావు విషయం డీల్ చెయ్యాలి, ఒక్కసారి ఆలోచించుకుని ఏ విషయం నాకు చెప్పు ఎంత రాత్రి అయినా మీటింగ్ అరేంజ్ చెయ్యడానికి నేను సిద్ధమే. రావడానికి అతనెప్పుడూ సిద్ధంగానే ఉంటాడు” అని చెప్పి అక్కడ నుండి నిష్క్రమించాడు ప్రసాద్. ఈ పరిణామాల వెనక ఎవరిదైనా హస్తం ఉందా, లేదా అంతా యాదృచ్ఛికంగా జరుగుతోందా ఆమెకు అర్థంకాలేదు.

***

“నిన్న జరిగిన హెలీకాప్టర్ దుర్ఘటనలో మన రాష్ట్రముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు శ్రీ జోగేశ్వరరావుగారు మృతి చెందారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన అన్వేషణ నేటి ఉదయానికి ఫలించింది. దాదాపుగా ఇరవై గంటలు నిరంతరాయంగా జరిగిన ఈ ప్రక్రియ ప్రమాదవశాత్తూ కూలిపోయిన చాపర్ అవశేషాలను కనుగొనడంతో ముగిసింది. ఘటనా స్థలమైన “చెంచుకోన’ అటవీ ప్రాంతంలో కూలిపోయిన చాపర్‌లో పైలట్, ముఖ్యమంత్రితో పాటుగా ప్రయాణిస్తున్న రక్షణ సిబ్బంది ముగ్గురూ కూడా మృతి చెందారు. అత్యంత దురదృష్టకరమైన ఈ సంఘటన రాష్ట్రం మొత్తాన్ని కలచివేసింది.

పైలెట్ అప్రమత్తంగా లేకపోవడం, అనుకోని సమయంలో కాక్పిట్ పరికరాలు చెడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చు అని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. విమాన అవశేషాల దగ్గర లభించిన బ్లాక్ బాక్స్‌ను నిపుణుల పరీక్ష కొరకై విదేశాలకు తరలించి వేయడం జరిగింది. తన విదేశీ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి నిన్న జరిగే ఒక బహిరంగ సభకు ధరణికోట చేరుకోవాల్సిఉంది, తన ఆంతరంగికులకు మాత్రమే ఈ విషయం తెలీడం వలన ఆయనకు అవసరమైన అదనపు రక్షణా బలగాలను సమకూర్చలేకపోయాము” అని రాష్ట్ర హోం మంత్రి పేర్కొన్నారు.

అయితే ఈ సంఘటన పైన పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఒక వారం పదిహేను రోజులలోగా నివేదిక సమర్పించాలి అని సిబిఐ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి మృతిపట్ల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి గారు కూడా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు.

ఈ సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందవలసిన అన్ని రకాల సహాయ సహకారాలలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటామని ప్రధానమంత్రి వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. దివంగత నేత పార్థివ దేహాన్ని నేటి మధ్యానానికల్లా తమ స్వగృహానికి చేరేలాగ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ దుర్ఘటనలో మరణించిన రక్షణ సిబ్బంది ఒకొక్కరికీ పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తున్నట్లుగా రాష్ట్ర హోం మంత్రి ప్రకటన జారీ చేసారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిలు నేపధ్యంలో జన సమాజ్ పార్టీ సభ్యుల మధ్య ముఖ్యమంత్రి అభ్యర్ధిపట్ల ఏకాభిప్రాయం రాకపోవడం వలన ప్రస్తుతం తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లుగా యునైటెడ్ డెమోక్రాటిక్ గవర్నమెంట్ తెలిపింది. ఇందుకోసమై కొంతమంది కేంద్రమంత్రులతో కూడిన బృందం హైదరాబాద్ విచ్చేయునట్లుగా సమాచారం.

ఉదయం తొమ్మిది గంటల సమయంలో తాను విన్న ఈ వార్తలను ప్రియాంక జీర్ణించుకోలేకపోయింది, ముఖ్యమంత్రిగా కాకుండా జోగేశ్వరరావు గారు మామూలుగా కూడా తమ కుటుంబానికి ఆప్తమిత్రులే, అందుకే ఈ దుర్వార్త వినడంతో తమ పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఎమ్మెల్యేలు తమ ఇంటికి వచ్చి ఏమి చెయ్యాలా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. నిన్న అనుకున్నట్లుగా ఆమె హనుమంతరావుతో మాట్లాడలేదు.

అతనిప్పుడు రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్లుగా అప్పుడే వచ్చిన ప్రసాద్ గారు ఆమెతో చెప్పాడు. రాహుల్‌తో పాటుగా తను కూడా మరొక గంటలో హైదరాబాద్‌లో ఉంటాము అనే విషయం సిద్ధార్థ ఒక పది నిమిషాల ముందరే ఆమెకు ఫోన్‌లో చెప్పాడు. టీవీలో జోగేశ్వరరావు గారు మరణించిన స్థలంలో ఉన్న వీడియోలు, ఆయన శవాన్ని తరలించడం కొద్దిగా బ్లర్ చేసి చూపిస్తున్నారు, ఎంతటి కఠిన మనస్కుడికైనా ఆ దృశ్యాలు చూస్తే హృదయం ద్రవించక మానదు.

తమ ఇంట్లో దాదాపుగా పదిహేను మంది ఎమ్మెల్యేలు, మరెంతోమంది కార్యకర్తలు ఆమె మాట కోసం ఎదురు చూస్తున్నారు. హనుమంతరావు వర్గం వారు ముందరే రాహుల్ వాళ్ళింటికి వెళ్లి ఉంటారని ఆమె కూడా గ్రహించింది. తన తండ్రికి ఈ విషయం ఎలా చెప్పాలో ఆమెకు  అర్థం కాలేదు, ఆయన ఆరోగ్యం కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు, నిన్నరాత్రి కూడా ఆయన రాత్రి ఆయాసంతో ఇబ్బంది పడడంతో డాక్టర్‌ను పిలిపించారు.

పరీక్ష చేసిన తరువాత డాక్టర్ ఆయన దగ్గర ఒక నర్సును ఉంచే ఏర్పాటు చేసాడు. ఇంకా దాదాపుగా హనుమంతరావు అధికార పక్షంలో కలిసిపోవడం ఖాయం అన్న విషయం ఆమెకు అర్థమయ్యింది. అందుకే తమ తదుపరి ప్రణాళిక ఏ విధంగా ఉండాలో అని ఆమె సిద్ధార్థ రాక కోసమై ఎదురు చూస్తోంది, ఈ సమయంలో తనకు ఎవరైనా సహాయపడగలరు అంటే అది సిద్ధార్థ ఒక్కడే. మరికొంత సమయానికి నేరుగా రాహుల్ దగ్గరకు వెళ్ళకుండా అతను తమ ఇంటికి వచ్చాడు. అతడు అలా రావడంతో ఆమెకు కొండంత ధైర్యం కలిగింది.

“నేను అతడిని ఎక్కువ సేపు ఒదార్చలేకపోయాను ప్రియాంక. ఆ ప్రదేశంలో అన్వేషణ జరుగుతున్నంత సేపూ అతను ఒక్కముక్క కూడా మాట్లాడలేదు, నిన్నటి నుంచీ పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, తనదైన లోకంలో ఉన్నాడు. నేను, గణేష్ ఎంతగా మాట్లాడించడానికి ప్రయత్నించినా అతను స్పందించలేదు. కకావికలమైన తన తండ్రి శరీరాన్ని చూసిన క్షణంలో అతనిలో ఒక వేదాంత ధోరణి కనిపించింది. రాహుల్ ఇప్పుడొక మనిషి కాదు, ఒక యోగి” కొంచెం ఉద్వేగంతో అతనీ మాటలు మాట్లాడాడు.

“నాకు తెలిసిన రాహుల్ అలాంటివాడు కాదు, అతను నిశబ్దంగా ఉండడం రాష్ట్రానికి చాలా ప్రమాదకరం, ఈ విషయం అతనికి కూడా తెలుసు. అందుకే తన అంతరంగాన్ని అతను ఇతరులు గమనించకుండా తన సన్నిహితులను దూరంగా ఉంచుతున్నట్లు ఉన్నాడు, అతని మదిలో ఎన్ని రకాల పధకాలు రూపుదిద్దుకుంటున్నాయో ఎవరికి తెలుసు” కొంచెం బాధగా ఉంది.

“విచారపడి లాభం లేదు, ఇప్పుడు రాహుల్ కన్నా, ఈ రాష్ట్రం కన్నా దయనీయమైన పొజిషన్లో మనం ఉన్నాం, నాకు ప్రసాద్‌గారు అంతా చెప్పారు, హనుమంతరావు ఇంతపని చేస్తాడని నేను ఎప్పుడో ఊహించాను, అయితే ఆయన ఇంతకాలం సరైన సమయం కోసం వేచి చూసాడు. సరే అంకుల్‌కి జోగేశ్వరరావు గారి విషయం తెలిసిందా” అడిగాడు సిద్ధార్థ, లేదన్నట్లుగా తలూపింది ప్రియాంక.

ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా నకునారెడ్డి గారి గది వైపు దారితీసాడు సిద్ధార్థ, అతడిని నిరోధించే ప్రయత్నం చెయ్యలేదు ప్రియాంక. అతడు లోనికి వెళ్ళడంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇతర నాయకులలో కలకలం రేగింది. ప్రియాంక నిస్సహాయంగా సిద్ధార్థ వెళ్లినవైపు చూసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here