Site icon Sanchika

రాజకీయ వివాహం-12

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది 12వ భాగం. [/box]

అధ్యాయం- 12

[dropcap]సి[/dropcap]ద్ధార్థ ముఖం చాలా విచారంగా ఉంది. నిశ్శబ్దంగా బయటకు వచ్చిన అతడిని ఆందోళనగా చూసింది ప్రియాంక, ఏమి జరిగిందో అర్థం చేసుకునే లోపే నకునారెడ్డి గదిలోనుండి గట్టిగా కేకలు వినిపించాయి.

అది తన తల్లి శాంతాదేవిదిగా గుర్తించి హడావిడిగా ఆయన గదిలోకి పరుగుతీసింది ప్రియాంక. తాను వెళ్లేసరికి అక్కడున్న నర్స్ సీపీఆర్ (కృత్రిమ శ్వాస) ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది, ఆమె ముఖం అంతా చెమటలతో నిండిపోయింది. ఎంతసేపటికీ ఆయనలో ఎటువంటి చలనం లేదు, పక్కనే ఉన్న ఈసీజీ మెషిన్‌లో అడ్డగీత కనిపించింది.

“హీ ఈజ్ నో మోర్ మేడం, డాక్టర్ గారు ఇంకొక ఐదు నిమిషాల్లో వస్తారు, ఇప్పుడే నేను ఆయనకు ఇన్ఫార్మ్ చేసాను, ఒక పావుగంట క్రితం వరకూ బాగానే ఉన్నారు, సడెన్‌గా ఏమైందో తెలీదు, ఏదో విషయం మీద చాలా ఎగ్జైట్ అయినట్లు ఉన్నారు.” ఆ విషయం ఏమై ఉంటుందో ఆమె ఊహించగలిగింది. తన మిత్రుని మృతి ఆయనను కూడా కలచివేస్తుంది అని ఆమె అనుకుంది కానీ, దాని పరిణామం ఇంత తీవ్రంగా ఉంటుందని ఆమె ఊహించలేకపోయింది.

ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆమెకు నోటమాట రావడం లేదు. సిద్ధార్థ ఏమి అడిగినా మాట్లాడకపోవడం, ఎంతసేపటికీ ప్రియాంక బయటకు రాకపోయేసరికి ప్రసాద్ గారు లోపలికి వచ్చి చూసారు. ఆయన విషయం అర్థం చేసుకున్నారు. నెమ్మదిగా విషయం బయట ఉన్న వారికి చేరవేయ్యగానే అక్కడ కలకలం అధికమయ్యింది.

ఎవరో అప్పుడే నకునారెడ్డి మరణించిన విషయం మీడియా వారికి అందించేసినట్లు ఉన్నారు, తమ ఇంటికి వచ్చే దారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఎటు చూసినా తెల్లని వస్త్రాలలో ఉన్న పార్టీ నాయకులు జెండాలు పట్టుకుని కోలాహలంగా తిరుగుతున్న కార్యకర్తలు కనబడుతున్నారు. “నకునారెడ్డి అమర్ రహే” “నకునారెడ్డి అమర్ రహే” ఎవరో అరిచారు, అంతే ఒక్కసారిగా ఆ ప్రదేశం మొత్తం ఆ నినాదాలతో హోరెత్తిపోయింది.

అప్పుడు ఏడ్చింది ఆమె గుండెలు పగిలేలా, పెల్లుబికిన ప్రళయంలా, ఉవ్వెత్తున ఎగసిపడిన అలలా, ఊళ్లన్నీ ముంచెత్తిన ఉప్పెనలా ఆమె ఉధృతి వర్ణనాతీతంగా ఉంది. ఆమెను ఎవరూ ఓదార్చే ప్రయత్నం కూడా చెయ్యలేదు, ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ప్రసాద్ గారు, సిద్ధార్థ అక్కడకి వచ్చిన మీడియా ప్రతినిధులతో సమావేశంలో ఉండి వారి ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు, డాక్టర్ జరగవలసిన మిగిలిన కార్యక్రమాలు అన్నీ చూస్తున్నాడు, ఆయన వెంట కొంతమంది హాస్పిటల్ సిబ్బంది కూడా ఉన్నారు.

తమ ఇంట్లోని పనివారు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. కొంతసమయం తరువాత శాంతాదేవి గారు వచ్చి ఆమె పక్కన కూర్చుని భుజంపైన చెయ్యేసారు, దానితో ఒక్కసారిగా ఆమె ఒడిలో కుప్పకూలిపోయింది. ఈ సమయంలో తన తల్లిని ఓదార్చాల్సిన తానే పూర్తిగా నియంత్రణ కోల్పోయి ఇలా బాధపడడం ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది, అయితే అవేమీ ఆలోచించే స్థితిలో లేదు, తన తల్లి ముందర ఆమె ఒక చిన్నపిల్లలాగ అయిపోయింది.

చిన్నప్పటినుంచీ తనకు తల్లి దగ్గర ఎక్కువగా చనువు లేదు, ఎప్పుడూ తను తండ్రితోనే తిరిగేది. కానీ ఈ సమయంలో ఆమెను తల్లిని గట్టిగా కౌగిలించుకుని భోరున ఏడుస్తోంది, కొంతసేపు ఆమెను ఓదార్చే ప్రయత్నం చెయ్యకుండా ఒడిలో ఉంచుకుని ఆమె తల నిమురుతున్నారు. ఇప్పుడు తను రాహుల్ గురించి ఆలోచించడం లేదు, ఎవరి సొంత బాధల్లో వారున్నారు.ఎవరు ఎవరికి అనునయంగా మాట్లాడాలి అని రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

ఒకే రోజు ఇద్దరు మహానాయకులను కోల్పోవడం మన రాష్ట్రప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, ఇది కొన్ని యుగాల వరకూ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోయే రోజు, ప్రపంచంలోనే ఇటువంటి సంఘటన ఏ దేశంలో కూడా జరిగి ఉండదు. తనకు ఇంకా ఆత్మీయులు కూడా పెద్దగా ఎవరూ లేరు, విలేఖరులతో మీటింగ్ ముగిసిన తరువాత సిద్ధార్థ సహాయంతో సుమిత్రాదేవి గారు తమ బంధువులందరికీ ఈ విషయం తెలియచేసారు, వారు కూడా ఇప్పటికే టీవీలలో ఈ వార్త విని ఉండడం వలన తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విమాన ప్రమాదంలో దాదాపుగా శరీరభాగాలు అన్నీ కోల్పోవడంతో ఎక్కువసమయం ఉంచకుండా ఆరోజు సాయంత్రం జోగేశ్వరరావుగారి మిగిలిన అవశేషాలకు ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. ఆ మరుసటిరోజు నకునారెడ్డిగారి అంత్యక్రియలు కూడా అదే ప్రదేశంలో జరిగాయి. కొంతమంది రాహుల్ ఇంటివైపు వెళ్ళగా కొంతమంది ప్రియాంక దగ్గరకు వచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రం మొత్తం స్మశాన వైరాగ్యం తలపించింది. అన్ని ప్రముఖ జాతీయా, అంతర్జాతీయ టీవీ చానళ్ళు, వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాలు రెండు వారాలు పాటు ఈ వార్తలను భిన్నమైన కథనాలతో ప్రజలు మర్చిపోకుండా ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ప్రియాంక, రాహుల్ వీరిద్దరి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలోని సగటు వ్యక్తి అంతరంగాన్ని పోలి ఉంది.

అతిచిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు తమ ప్రమేయం లేకుండానే వేసుకోవలసిన అవసరం కలిగింది. ఎంతోమంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర పార్టీల నాయకులు జోగేశ్వరరావుగారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు, వచ్చిన ప్రతీవారితో తనకు తోచిన విధంగా మాట్లాడుతున్నాడు రాహుల్.

అందులో కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు మాత్రమే కాకుండా తన తండ్రి కేబినేట్ మంత్రులు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపట్ల తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.

“చూడండి ఇప్పుడు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోగలరు, మీకు తెలుసో లేదో నాకు అర్థం కాదు కానీ ప్రతిపక్ష నేత నకునారెడ్డిగారు కూడా మరణించారు. ఇద్దరు సమవుజ్జీలైన నాయకులను కోల్పోయి రాష్ట్రం చాలా గడ్డు పరిస్థితుల్లో ఉండగా మనం ఏమి చెయ్యాలి, ప్రజలను ఏ విధంగా సాంత్వన పరచాలి అని ఆలోచించాలి కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలు గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు.

నాకు తెలిసి మా తండ్రిగారు నిరంతరం పని చేస్తూనే ఉండేవాడు, పనిలోనే ఆయన ఆనందం వెతుక్కునే వారు. నియంత్రణ కోల్పోకుండా మా తండ్రిగారు ఎంతో కష్టపడి ప్రజలకొరకై నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్ట్లను, తలపెట్టిన బృహత్కార్యాలను పూర్తి చెయ్యడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి. కనుక మీరు ఈ విషయంలో సహకరిస్తారు అని కోరుకుంటున్నారు” తనతో మాట్లాడిన తమ జనసమాజ్ పార్టీ రాష్ట్ర నాయకునితో అన్నాడు రాహుల్.

“అయ్యో నాకు నకునారెడ్డి గారి గురించి తెలియకపోవడం ఏంటండీ, మీకే ఆయన గురించి తెలీదేమో, ఆయన గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు, అదే విషయం వలన రాజకీయాల నుంచి వైదొలగిన ఆయన ఈరోజో, రేపో అన్నట్లు ఉన్నాడు. ఆయన గురించి రాష్ట్రం ఎప్పుడో మర్చిపోయింది, మళ్ళీ ఆయన మరణంతోనే ఆయన విషయం జ్ఞప్తికి వచ్చింది.

అయితే మీ తండ్రిగారు మృతి చెందిన సమయంలో ఇది జరగడం కాకతాళీయం అంతే. కనుక మీరు మన పార్టీలో అభ్యర్థిత్వంపై ఒక అభిప్రాయానికి వస్తే మంచిది, మీరు ఎవరినైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా మీరే బరిలోకి దిగుదాం అనుకుంటున్నారో వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అవతల హోం మంత్రిగారు ఇతరపార్టీ నాయకులను కూడగట్టుకుని ముఖ్యమంత్రి అయ్యే పనిలో ఉన్నారు. అతనికి కేంద్రం నుంచి కూడా సపోర్ట్ లభిస్తోంది. మరి మేము ఏ పక్షంలో ఉండాలో నిర్ణయించుకోవాలి కదా, మొదటినుంచీ జోగేశ్వరరావుగారే మా సీఎం అనుకోండి, కానీ జరుగుతున్న పరిణామాలు, మారుతున్న సమీకరణాల దృష్ట్యా పార్టీలో పదికాలాలుపాటు ఉండాలంటే మేము కూడా నిర్ణయం తీసుకోవాలి కదా” తన నిస్సహాయతను తెలియచేసాడు ఆయన.

తన తండ్రి కేబినేట్‌లో ఇరిగేషన్ మినిస్టర్‌గా పనిచేసిన ఆయన పార్టీలో ఒకమాదిరి పలుకుబడి ఉన్న వ్యక్తి. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన ఇలా మాట్లాడడం రాహుల్ భరించలేకపోతున్నాడు, వాళ్ళ సొమ్మేమి పోయింది, నష్టం జరిగింది తనకు కదా, కనుక వీరు ఈ విధంగా రాజకీయాలు చెయ్యడంలో తను వీళ్ళను తప్పుపట్టలేడు, ఈ ప్రపంచంలో ఎవరి స్వార్థం వారిది, మనిషిని బతికించే ఒకే ఒక్క ఇంధనం ఈ స్వార్థం, దానికి ఇతరుల చావుపుట్టుకలతో సంబంధంలేదు. ఒక వ్యక్తి పుట్టుకతో ప్రాంభమై మరణంతోనే అంతమవుతుంది.

“సార్ నాకు కొంతసమయం కావాలి. మన ప్రభుత్వం నిర్మిస్తున్న ఆ ధరణికోట ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అవుతున్నాయి, అన్ని కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ నుండీ అవసరమైన పర్మిషన్స్ వచ్చేసాయి, మొత్తం అన్ని శాఖల నుండీ క్లియరెన్స్ తీసుకున్నాం. ఇంక పని ప్రారంభించడం ఒక్కటే మిగిలి ఉంది” ఆయనతో చెప్పాడు రాహుల్.

ఆ మాటలు వినగానే ఆయన పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. వారిద్దరూ తమ అతిధిగృహంలో ఉన్నారు, ఆయనతో పాటుగా వచ్చిన పార్టీ నాయకుల ఎంతోమంది తనకోసం బయట ఎదురుచూస్తున్నారు. ఆయనెందుకు అలా నవ్వుతున్నాడో రాహుల్‌కి అర్థం కాలేదు. కాసేపటి తరువాత తేరుకుని ఆయనే అన్నాడు.

 “చూడు బాబు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నీకు తెలిసినట్లుగా లేదు. ఆ భూషణరావు నువ్వు తలపెట్టిన పనిని అంత సులభంగా జరగనిస్తాడు అనుకున్నావా, నీకు తెలుసోలేదో కానీ ఆయన ఇప్పటికే మన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు, అందరికీ అవసరమైన నజరానాలు ఇప్పటికే వారివారికి చేరుకున్నాయి. మొదటి నుంచీ అతని కన్ను మీ ధరణి కోట స్థలంపైనే ఉంది, నకునారెడ్డి గారి టైంలో అది అతనికి లభించింది. మీ నాన్నగారు ఉన్న సమయంలో అది తిరిగి ప్రభుత్వం సొంతం చేసుకుంది.

చాలాసార్లు ఎలక్షన్స్ తరువాత అతన మన దగ్గరకి చేరడానికి ప్రయత్నించినా జోగేశ్వరరావు గారు ఒప్పుకోలేదు, ఇంక ఆయన లేడు కదా కనుక అతడిని ఆపడం ఎవరి తరమూ కాదు. ప్రస్తుతం మూడు లక్షల ఎభైవేల ఎకరాలకు నీరందించే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి కూడా అతనిలాగే అడ్డుపడుతున్నాడు.

మొత్తం మీద చూస్తే రాష్ట్ర అంతటా అతనితో ఇలాంటి వివాదాలు కోకొల్లలు. దీనికితోడు అతణ్ణి ఆధారంగా చేసుకుని జరిగే చిన్నచితకా వ్యాపారాలైతే లెఖ్క లేదు, ఇలా అతను ప్రభుత్వం ఏదైనప్పటికీ ఒక పొలిటికల్ సిండికేట్ నడుపుతూ ఉన్నాడు. ఈసారి ఇంకొంచెం ముందుకు వెళ్లి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే అర్థం చేసుకో దాని వెనక ఎంత స్ట్రాటజీ ఉంది ఉంటుందో.

అంతేకాకుండా ఇతరపార్టీ నాయకులను కూడా తీసుకురావడం వెనకాల భూషణరావు ప్రోద్బలం ఎంతో ఉంది. అందుకే ఒకసారి ఆలోచించు ఈ సమయంలో నువ్వు నిర్ణయం తీసుకోవడం ఎంత అవసరమో” ఈసారి ఆయన స్వరంలో ధ్వనించిన నిజాయితీకి రాహుల్ కూడా ఆలోచనలో పడ్డాడు. అతను ఇప్పుడిప్పుడే తన తండ్రి మరణం నుంచి కోలుకుంటున్నాడు.

“సరే సార్. మీరు చెప్పినదంతా నా దృష్టిలో ఉంది, నేను సాధ్యమైనంత త్వరలో నా నిర్ణయం తెలుపడానికి ప్రయత్నిస్తాను. పనికన్నా పెత్తనం చెయ్యాల్సిన అవసరం రావడం దురదృష్టం” అతని మాటలను అర్థం చేసుకున్న అతనికి తగిన సూచనలిచ్చి అక్కడనుండి బయటపడ్డాడు.

ఇది జరిగిన కొంతకాలానికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ గత ప్రభుత్వంలో హోం మినిస్టర్‌గా చేసిన ‘హనుమంతరావు’ను కొంత మెజారిటీతో జన సమాజ్ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంది. దీని వెనుక ఎవరి హస్తం ఉందో అందరికీ తెలిసినదే.ఆ తరువాత ఒక కీలకమైన స్థానానికి జరిగిన బై ఎలక్షన్స్ లో పోటీచేసి గెలిచిన రాహుల్‌కు హోం మంత్రిత్వ శాఖ లభించింది.

అయితే తన పోర్ట్‌ఫోలియోలో మాత్రమే కాకుండా ఇండస్ట్రీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఎనర్జీ మరియు ఇన్వెస్ట్మెంట్ శాఖలలో తన నిర్ణయం కీలకమయ్యే విధంగా ఉండేలాగా రాహుల్ పార్టీలో పట్టు సాధించుకోగలిగాడు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇప్పటికి మూడున్నర ఏళ్ళు కావొస్తుంది.

***

“ఏదో ముఖ్యమైన పని ఉందన్నావ్, ఏంటి ప్రియాంక అదీ” అడిగాడు సిద్ధార్థ. వారి మధ్య గతంలో ఉన్నంతగా సఖ్యత ఈ మధ్య ఉన్నట్లుగా ఆమె అనుకోవడం లేదు. ఎందుకో తెలీదు కానీ సిద్ధార్థ కొన్ని సందర్భాల్లో వివాదాలకు కారణం అవుతున్నాడు అని ఆమెకు అనిపించింది. తన తండ్రి మరాణానంతరం నాచిరెడ్డితో అతను కలిపి చేస్తున్న కార్యకలాపాలు ప్రసాద్ గారికి నచ్చకపోవడంతో ఆయన తన దగ్గర కొన్నిసార్లు ఈ విషయం మొరపెట్టుకున్నాడు.

ఈసారి ఏదో విధంగా తిరిగి తాము పదవిలోకి రావాలంటే కింది స్థాయినుంచి నిర్మాణం చెయ్యవలసిన అవసరం ఉండగా, అటువంటి పథకాలు రూపొందించడం మాని సిద్ధార్థ ఎలక్షన్ కాంపెయిన్స్‌కి ఎక్కువగా శ్రమపడుతున్నాడు. అందుకు సరైన తార్కాణం రాహుల్‌కి వ్యతిరేకంగా బై ఎలక్షన్స్ సందర్భంగా నాచిరెడ్డి చేసిన వ్యాఖ్యలు “తండ్రి పోయాడు అని కొంచెం కూడా బాధ లేకుండా, అందుకు దోహదపడిన వారితో కలిపి రాజకీయాలు చేస్తున్నాడు” అని భూషణరావు, రాహుల్‌ని ఉద్దేశించి బహిరంగంగా నాచిరెడ్డి మాట్లాడడం చాలా కలకలం సృష్టించాయి.

ఇందుకు రాహుల్‌కు తాను క్షమాపణ చెప్పుకుందామని రెండు మూడు సార్లు ఆమె ప్రయత్నించినా కానీ అతను స్పందించలేదు. దీనికంతటికీ సిద్ధార్థ మాత్రమే కారణం అని ఆమె అభిప్రాయపడుతోంది. గతంలో తన తండ్రి మరణం సమయంలో రాహుల్‌కి పూర్తిగా సహాయం చేసిన సిద్ధార్థ ఇప్పుడు ఎందుకు ఈ బై ఎలక్షన్స్‌లో అతనికి వ్యతిరేకం అయ్యాడో ఆమెకు అర్థం కాలేదు. అదే అతడిని అడిగితే కొన్నికొన్నిసార్లు ఎలక్షన్స్ గెలవడానికి ఇలాంటివి తప్పవు అని చెప్తాడు.

 “ఆ ముఖ్యమైన పనేంటో నీకు తెలీదా సిద్ధూ, నేను చెప్పిన పార్టీ రీ-కన్‌స్ట్రక్షన్ వదిలేసి మీరు సొంత నిర్ణయాలతో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు. పార్టీ ఫండ్‌తో భూ వివాదం కోసం గ్రౌండ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ఒక ఇరవై మందిని హైర్ చెయ్యమని చెప్పాను ఏమైంది. అవన్నీ వదిలేసి నువ్వు, ఇది నేను ఎంతో కాలంగా రీసెర్చ్ చేస్తున్న విషయం అని కూడా నీకు తెలుసు కదా. అదంతా పక్కన పెట్టి నాచిరెడ్డిగారితో లేనిపోని విమర్శలు చేయిస్తున్నావ్.

నాకు తెలిసి ఆయనకు రాష్ట్ర రాజకీయాల్లో గ్రిప్ పూర్తిగా పోయింది. ఆయనిప్పుడు మనకు ఏ విధంగానూ పనికిరాడు, అందుకే ఆయనను మనం ఎంత త్వరగా వదిలించుకుని అంత మంచిది. ఆ బై ఎలక్షన్స్‌లో నాకు ఇష్టం లేకపోయినా రాహుల్‌కి వ్యతిరేకంగా నిలబెట్టావ్, ఆయన ఓడిపోవడం పార్టీకి మాయని మచ్చలాగ తయ్యారయ్యింది” కొంచెం అవేశపడుతూ అన్నది ప్రియాంక. తన తండ్రి చనిపోయిన తరువాత మొత్తం పార్టీ బాధ్యతలు తనమీదే వేసుకుని పూర్తి స్థాయి రాజకీయాలలో ఒంటరిపోరాటం సాగిస్తోంది ఆమె.

పార్టీలో స్వచ్చందంగా పనిచెయ్యడానికి ఆమెకున్న ఫాలోయింగ్ వలన ఎంతో మంది యువతీ యువకులు పూనుకున్నారు. ఆమె బహిరంగంగా ఎప్పుడూ రాహుల్‌ని సపోర్ట్ చెయ్యకపోయినా అతని కార్యకలాపాలను మాత్రం ఆమె అడ్డుకోలేదు. కనస్ట్రక్టివ్ ఫోర్స్ పేరిట ఒక విభాగాన్ని స్థాపించి అందులో కొంతమందిని రిక్రూట్ చేసి ఏయే శాఖలలో ప్రభుత్వ విధానాలపట్ల ప్రజలలో అసంతృప్తి ఉంది, ఎక్కడ అవినీతికి అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ సర్వేలద్వారా తెలుసుకోవాలని ఆమె యోచన, ఇప్పటివరకు ‘కనస్ట్రక్టివ్ ఫోర్స్’ డేటాబేస్‌లో ఇందుకు సంబంధం ఉన్న ఎన్నో టెరాబైట్ల ఇన్ఫర్మేషన్ ఆమె సేకరించగలిగింది.

అయితే ఇది చాలా వరకు కాగితాలకు మాత్రమే పరిమితం అవుతోంది, కార్యరూపం దాల్చాలంటే కొంతమంది ప్రొఫెషనల్స్‌ను తమ సంస్థలో చేర్చుకోవాలని ఆమె అభిప్రాయపడింది, అదే విషయం సిద్ధార్థతో చర్చించినా అతను అన్యాపధంగానే అంగీకరించాడు కానీ అందుకు తగిన సహకారం అందించకుండా లేనిపోనీ సమస్యలు తెస్తున్నాడు అని ఆమెకు అనిపించింది

“నీకు చెప్పినా అర్థం కాదు ప్రియాంక, నాచిరెడ్డి గారు వ్యాఖ్యలు శృతి మించిన మాట వాస్తవమే అయినా, ఒక దశలో గెలుపు మన విషయంలో దాదాపు ఖాయం అని నాకు అనిపించింది. కానీ డెమోక్రసీలో ఏదైనా సాధ్యమే అని ప్రజలు మళ్ళీ నిరూపించారు, గెలుపెవరిదో చివరివరకూ చెప్పలేము. ఐనా నువ్వు చెప్పినట్లుగా వందలమందిని ఆ కనస్ట్రక్టివ్ ఫోర్స్‌లో ఇప్పటికే వినియోగిస్తున్నాము, వీరు ప్రభుత్వం అన్ని శాఖల్లో కో-ఆర్డినేట్ అయ్యి మనకి అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు.

అది చాలదన్నట్లు ఇంకా ఎక్కువమందిని చేర్చుకోవాలంటే మన చేతుల్లో పవర్ ఉండాలి. ఏ పనైనా చేసే ముందర రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. మనకి పవర్ కావాలంటే మనం వీలైనంత ఎక్కువగా ప్రజలను చేరుకోగలగాలి అందుకు కాంపెయిన్ ఏంతో అవసరం ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వన్ త్రూ ఏ కాంపెయిన్ రేదర్ దేన్ కమిట్మెంట్. రాహుల్ కాంపెయిన్ సింపతీ మీద బేస్ అయ్యింది కనుకనే అతను విజయం సాధించాడు.

అసలు ఇంకా చెప్పాలంటే నువ్వు చేసే పనులన్నీ వన్స్ మనం పవర్ లోకి వచ్చిన తరువాత చెయ్యవలసినవి, ఐనప్పటికీ నీ మాట కాదనలేక నేను నీకు హెల్ప్ చేసాను. కానీ నువ్వు నేను చేస్తున్న పనులని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావ్. ఇలాంటి పరిస్థితుల్లో నేనేమి చెప్పినా నీకు తప్పుగానే అనిపిస్తుంది. అయితే నాచిరెడ్డి విషయంలో మాత్రం నేను తప్పు చెయ్యలేదు. కావాలంటే త్వరలో రాబోయే సిబిఐ రిపోర్ట్‌లో ఆయనకు క్లీన్ చీట్ వస్తుంది చూసుకో” గర్వంగా తన అంచనా గురించి చెప్తూ తన వంతు వాదనను ఆమెకు వివరించాడు సిద్ధార్థ.

“ఆయన వ్యక్తిగత జీవితం ఆయనపై ఉండే కేసుల గురించి నేను మాట్లాడడం లేదు సిద్ధూ. నిజంగా ఆయన భార్య విషయంలో ఏమి జరిగిందో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి కదా, ఆయన మనకు ఏ విధంగా సహాయపడతారు అన్నది ముఖ్యం.

నేనొక సారి మన కనస్ట్రక్టివ్ ఫోర్స్ గురించి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన పెద్దగా స్పందించలేదు. ఆయన ధోరణి చూస్తూంటే కాలయాపన చేస్తున్నట్లు అనిపిస్తోంది తప్ప కర్తవ్య నిర్వహణలో ఆసక్తి ఉన్నట్లు లేదు. ఇంకా ముందుకు వెళ్లి నేను ఆయనను ఈ సంస్థలో చేరమని అడిగితే ఆయన నాకు ఏమి చెప్పాడో తెలుసా.

ఇది పెద్దగా ఉపయోగం లేని ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాంటిదని దీనికీ ఆ మహిళాసంఘాలకు పెద్దగా తేడాలేదని అన్నాడు. మరి ఆయన లక్ష్యం ఏంటో నాకైతే తెలీదు. నువ్వు కనక లేకపోతే అతను మన పార్టీలోకి వచ్చేవాడు కాదు. అందుకే ఆయన గురించి నీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నువ్వే కనుక నా పొజిషన్‌లో ఉంటే ఏమి నిర్ణయం తీసుకుంటావు చెప్పు” తన స్వరంలో నిజాయితీ కూడిన అభ్యర్థన ధ్వనించగా అతడిని అడిగింది ప్రియాంక.

“శాంతంగా ఆలోచిస్తే ప్రతీదానికీ ఒక పరిష్కారం ఉంటుంది. నన్నడిగితే ఆయన భార్య కేసు విషయంలో కొంచెం ఇబ్బందిపడుతూ ఉన్నాడు. సిబిఐ విషయం పక్కన పెడితే అందులో నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకు కూడా ఉంది. అందుకే మనం అందులో సిబిఐ వారి ప్రమేయం లేకుండా అతనికి పూర్తిగా సహకరించగలిగితే అతను తిరిగి పూర్తిస్థాయిలో పార్టీలో ఇన్వాల్వ్ అవ్వవచ్చు. అది ఎలా చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో” అని చెప్పి ఆమె వద్ద నుండి సెలవు తీసుకున్నాడు.

అతను వెళ్ళిన తరువాత అతను చెప్పినదాని గురించి అలోచించిన ఆమెకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే తనకు తెలిసిన ఒక మిత్రుడికి ఫోన్ చేసి సాయంత్రం తనని కలుసుకోవడానికి రమ్మని ఆహ్వానించింది. ఈ విషయం ఆమె సిద్ధార్థకు చెప్పకుండా సొంతంగా నిర్ణయం తీసుకుంది.

“ఇన్నాళ్లు సిద్ధార్థ నాకు ఫోన్ చేసేవాడు. ఇప్పుడు నువ్వే డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతున్నావంటే ఇదేదో చాలా సీరియస్ విషయం అయినా అయ్యుండాలి. లేదా పర్సనల్ విషయం అయినా అయ్యుండాలి. రెండిటిలో ఏది నిజం మేడం” అడిగాడు అతను.

ప్రియాంక తనను ఎందుకు ఆహ్వానించిందా అని తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. రాహుల్ బై ఎలెక్షన్స్‌లో గెలుపొందిన తరువాత హైదరాబాద్‌లో పార్టీ ఆఫీస్ కాకుండా తనకంటూ ఒక సొంతమైన కార్యాలయం స్థాపించి అందులో బాధ్యతలు నిర్వర్తించవలసినదిగా తనను కోరాడు. అప్పటినుంచీ వారి మధ్య సంబంధం మరింత గట్టిపడినట్లుగా అతను భావించాడు.

“మనమందరం స్నేహితులం అనే విషయం మర్చిపోకు గణేష్, అంతేకాకుండా అనుకోకుండా అందరం ఒకే వృత్తిలో కూడా ఉన్నాం. అందుకే ఒకరినొకరు పాలకరించుకొకపోతే ఎలా. అందులోనూ నువ్వు కాబోయే సీఎం గారికి ప్రధాన సలహాదారుడివి కూడా, నిన్ను కలవాలని ఎవరికి ఉండదు చెప్పు.

సరే కానీ నువ్వు ఎవరికీ తెలీకుండా నాకొక సహాయం చెయ్యాలి. అది కేవలం నీ ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదొక స్టింగ్ ఆపరేషన్ లాంటిది. అందుకే అందరి దృష్టి తక్కువగా పడే నిన్ను ఎన్నుకోవడం జరిగింది.

నువ్వు ఏమి చేస్తావో తెలీదు కానీ ఎందుకు ఏమిటీ అని అడగకుండా, ఎలాగైనా నీ సోర్సెస్ అన్నీ ఉపయోగించి నాచిరెడ్డిగారి భార్య మరణం దాని వెనుక ఉన్న కథ మొత్తం బయటకు తీసుకురావాలి. దీని వల్ల నువ్వు ప్రస్తుతం చేస్తున్న పనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంతరాయం కలగకూడదు. సాధ్యమైనంత సీక్రసీ మైంటైన్ చెయ్యాలి.

ఈ విషయం నేను నీకు అప్పగించినట్లు నీకు నాకు తప్ప మూడవ కంటివారికి తెలీకూడదు, ముఖ్యంగా రాహుల్‌తో పాటుగా నీకు రాజకీయపరంగా సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరికీ కూడా తెలీకూడదు. ఇది నా పర్సనల్ రిక్వస్ట్ ఎందుకంటే నా అనుమానాలు నాకున్నాయి.” అతనితో చెప్పింది ప్రియాంక.

“ఇది అంత అవసరమైనదా, సడెన్‌గా ఈ విషయం మీద నీకెందుకు అంత ఇంట్రెస్ట్ కలిగింది. అయినా సిద్ధూకి తెలియకుండా నువ్వు నన్ను కాంటాక్ట్ చేసినట్లు నాకిప్పుడు అర్థం అవుతోంది. అంటే మీరిద్దరూ ఏమైనా గొడవపడ్డారా” అర్థం కానట్లుగా అడిగాడు గణేష్. తను ప్రియాంకను కలవడానికి వెళ్తున్నట్లు రాహుల్‌కి తెలియకుండా ఉండాలి అని ఆమె అతడిని కోరింది.

కొంచెం విచిత్రంగా అనిపించినా కానీ తాను అందుకు అంగీకరించాడు “గొడవలాంటిది ఏమీ లేదు కానీ, ప్రస్తుతం సిద్ధూ వేరే పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సెషన్స్‌కి మా పార్టీ ఎమ్మెల్యే ప్రసాద్ గారితో కలిపి సిద్ధం అవుతున్నాడు. అంతేకాకుండా జరిగిన పరిణామాలు చూస్తే నాకు కొత్త కొత్త ఊహలు కలుగుతున్నాయి, ప్రస్తుతానికి అవి ఊహలుగానే ఉన్నాయి.

వాటికి సరైన రూపం రావాలంటే కొంత అన్వేషణ అవసరం అని నాకు అనిపిస్తోంది, జోగేశ్వరరావుగారి మరణం పట్ల కూడా నా అనుమానాలు నాకున్నాయి, అందుకే నిన్ను ఈ సహాయం కోరడం జరిగింది. దీనివల్ల పెద్దేమి ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు, కేవలం నా అపోహలే అవ్వచ్చు, కానీ వాటిని అపోహలుగా మాత్రమే నిర్ధారింపబడి నా మనస్సాక్షి అందుకు అంగీకరించే వరకు, సమాజానికి నా ఒంతుగా నేను చేస్తున్న పనిలో నేను పూర్తిగా శ్రద్ధ పెట్టలేను.

సరే ఏదేమైనా కానీ ఇది ఎంత ముఖ్యమో నేను నీకు ఇప్పుడు చెప్పలేను కానీ నా మీద నమ్మకముంచి నువ్వు ఈ పనిలో నాకు సహాయం చెయ్యి. నీకు ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను కూడా నా ఖాళీ టైములో మాత్రమే ఈ పనిపట్ల శ్రద్ధ తీసుకుంటున్నాను” చెప్పింది ప్రియాంక.

“డోంట్ వర్రీ నీ బాధ, రాహుల్ బాధ కూడా నేను అర్థం చేసుకోగలను, పైకి చెప్పకపోయినా రాహుల్ కూడా ఇంచుమించు తన తండ్రి మరణం పట్ల ఎదో కాన్స్పిరసీ జరిగిందనే అభిప్రాయ పడుతున్నాడు. ఈ విషయంలో తన దృష్టిలోకి వచ్చిన మొదటి శత్రువు భూషణరావు. అయితే భూషణరావుగారు ఇప్పుడు జనసమాజ్‌లో చేరిపోయారు కనుక ఆయన మీద అరా తియ్యడానికి భయపడుతున్నాడు.

సరే ఇప్పుడు ఎలాగో నువ్వు అడిగావు కదా నేను ఈరోజే బయల్దేరి విశాఖపట్నం వెళ్తాను. అక్కడ నాచిరెడ్డి భార్య సుకన్య ఇంటి దగ్గర నుండి ఈ పని మొదలుపెడతాను. ఎలాగో ఈ మధ్య పార్టీ పనుల్లో చాలా బిజీగా ఉంటున్న నేను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందాం అనే యోచనలో ఉన్నాను. అలా కూడా ఇది నాకు కలిసొస్తుంది” అన్నాడు గణేష్.

“సరే అయితే ఏం పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకో, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఇది మన అందరి జీవితాలకూ ముడిపడి ఉన్న అంశం అని గుర్తుంచుకో.” అని అతనికి అవసరమైన జాగ్రత్తలు చెప్పి అతడిని పంపించింది ప్రియాంక, అనుకోకుండా ఆమెకు ఇప్పుడే ఆసక్తి కలగడం మొదలైంది.

***

“అధ్యక్షా చాలామంది బయటనుంచి చూసేవాళ్ళు కేవలం విమర్శించడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. దిగితే కదా లోతెంతుంటుందో తెలిసేది. అసలు కరప్షన్ అనేది ఏ స్థాయి నుంచి మొదలవుతుంది, ఉదాహరణకు మన దగ్గర ఏదైనా వస్తువు ఉంటే దాన్ని ప్రత్యుత్పత్తి, రవాణా మరియు అమ్మకం ద్వారా వివిధ స్థాయిల్లో ద్రవ్యం చేతులు మారుతూ ఉంటుంది.

ఒకరకంగా చెప్పాలంటే కరప్షన్ ఈజ్ నథింగ్ బాట్ మిస్ ప్లేస్డ్ మనీ అన్నమాట. అస్సలు ఉత్పత్తే లేని చోట్ల అవినీతికి చోటెక్కడ ఉంటుంది. అంటే డిమాండ్ అండ్ సప్లయ్ సైకిల్‌లో లాస్ట్ స్టేజ్‌లో మాత్రమే మనకి ఈ కరప్షన్ ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్షం వారు తమ సోర్సెస్ ఉపయోగించి స్టాటిస్టిక్స్ ద్వారా ఎక్కెడెక్కడ అవినీతి జరుగుతున్నారో తెలుసుకున్నారు బాగానే ఉంది.

కానీ ఎందుకు జరుగుతుంది అని ఆలోచించారా? దేర్ ఈజ్ ఏ సివియర్ నాలెడ్జ్ క్రైసిస్ ఇన్ అవర్ సొసైటీ, దాన్ని పూడ్చాలి అంటే స్కిల్స్ డెవలప్మెంట్ అవసరం. ముఖ్యంగా మనిషి నిత్యవసరాలను ఐడెంటిఫై చేసి ఒక పర్టికులర్ టెరిటరీని సెల్ఫ్ కంటైండ్ యూనిట్ కింద మార్చాలి అంటే ఏ యూనిట్ విచ్ ఈజ్ సస్టైనబుల్ ఇండిపెండెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ బట్ గైడెడ్ బై ది విజన్ ఆఫ్ దీ గవర్నమెంట్.

దానికి అవసరమైన ఒక టెరిటోరియల్ ఆఫీసర్‌ని మన గవర్నమెంట్ రిక్రూట్ చేస్తుంది, ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఆఫీసర్ ఆ ప్రదేశానికి కలెక్టర్ లాంటివాడు అన్నమాట. ఆ టెరిటరీకి డెవలప్మెంట్‌కి అవసరమైన స్కిల్స్ అన్నీ అక్కడే ఒక డెవలప్మెంట్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేస్తాము దీనికి అవసరమైనదే ఈ టెరిటోరియల్ టాక్స్.

అంటే కరప్షన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్‌ను మినిమైజ్ చేసి క్షేత్రస్థాయిలో సప్ప్లై అండ్ డిమాండ్ మీట్ అయ్యే విధంగా మనం ఈ సిస్టంను డిజైన్ చేస్తాం. అదంతా నేను సభకు సమర్పించిన బిల్‌లో పూర్తి వివరాలతో ఉంది.

తమ అభ్యంతరాలు సూచనలు తెలుపవలసినది పోయి అస్సలు చూడడానికే ఇష్టపడక, ఊరికే అరుస్తూ పోతే ఎలా, మా ప్రభుత్వం శాసనసభ వ్యవహారాల్లో నాయకత్వం వహించవలసినదిగా కోరితే నేను మాట్లాడాను తప్ప, ఇందులో ముఖ్యమంత్రిగారి తెలీకుండా జరిగినది లేదు. విషయాలు తెలుసుకోకుండా మాట్లాడడం బుద్దిహీనుల లక్షణం” శాసనసభలో రాహుల్ ప్రసంగానికి తీవ్రమైన దుమారం రేగింది, ప్రతిపక్షాలు అతనిపై విమర్శలతో విరుచుకుపడ్డాడు, వారిలో జనహిత పార్టీ ఎమ్మెల్యే ప్రసాద్ కూడా ఉన్నారు.

“అధ్యక్షా ఈయన చెప్పినది చాలా అసంబద్ధంగానూ, అవగాహన రాహిత్యంతో కూడుకున్నదిగానూ ఉంది, అస్సలు ఇప్పటికే కేంద్ర రాష్ట్రాల పన్నులతో విరిగిపోయిన సామాన్యుడిని ఇంకా నష్టపరిచేలా ఉన్న ఈ బిల్‌లో ఎన్ని అవకతవకలు ఉన్నాయో చూడగానే అర్థమవుతోంది. పైగా ఆ టెరిటోరియల్ ఆఫీసర్‌ని గవర్నమెంట్ ఎన్నుకుంటుంది అన్నారు, క్షేత్ర స్థాయిలో అవినీతిని అడుపుచేస్తాను అన్నారు మరి అదే స్థాయిలో అవినీతి జరగదని మనకి నమ్మకమేంటి. ఈ ఆఫీసర్ ఇప్పటికే అవినీతి నిండిపోయిన రాష్ట్ర శాఖలకు అదనంగా కొత్తశాఖగా విస్తరిస్తాడు అని మాత్రమే అర్ధమవుతోంది” ఎవరో ఒక ఎమ్మెల్యే ఎవరో గట్టిగా అరిచారు

“అధ్యక్షా అలా ఏమీ జరగదు, ఆ టెరిటరీ డేటాబేస్‌లో ఉన్న వారందరినీ వారి పరిధికి తగినట్లుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది విచ్ విల్ బీ సూపర్వైజ్ద్ బై ది ఆఫీసర్. ప్రస్తుతానికి ప్రభుత్వ భవనంలో నెలకొల్పనున్న ఈ సెంటర్ బిల్ అమలు లోకి వచ్చిన అనతికాలంలోనే తమ ప్రాంతంలోని ఒక స్వతంత్ర భవనంలోకి మార్చడం జరుగుతుంది. ఇందుకు అవసరమైన ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఆ ఆఫీసర్ పర్యవేక్షణలో జరుగుతుంది. టూ సపోర్ట్ దిస్ సిస్టం ఎవ్రీ ప్రాడక్ట్ డట్ వస్ సొల్ద్ ఆర్ ఎక్స్చేంజడ్ ఆదర్వైజ్ ఇన్ ది టెరిటరీ కంస్ అండర్ దిస్ బిల్, అండ్ ఎవ్రీ పెన్నీ ఈజ్ అకౌంటబుల్ హియర్” అతనీ మాటలు అనేప్పటికి సభలో ఇంకా కలకలం రేగింది.

“అయ్యో కొంచెం నిశ్శబ్దం పాటించండి, ఇలా చేస్తే ఎలాగండి, ఆయన చెప్తున్నారు కదా వినండి” సభాపతి సభలో నినాదాలు చేస్తున్నవారి ఉద్దేశించి మాట్లాడుతున్నారు.

“ఆ ప్రసాద్ గారు, మీరు మాట్లాడడానికి సమయం కోరుకున్నారు కదా, మీ అభిప్రాయం చెప్పండి” జనహితపార్టీ ఎమ్మెల్యే ప్రసాద్ గారితో అన్నాడు సభాపతి

“గౌరవనీయులైన అధ్యక్షులకు నమస్కారం, సార్ ఇందాకా నా తోటి సభ్యుడు అన్నట్లుగా అధికార పక్షం తీరు చూస్తుంటే అరచేతిలో స్వర్గం చూపిస్తున్నట్లుగా ఉంది. బాబూ రాహుల్ మీకు తెలుసో లేదో ఇదే సభలో మేము నా నాయకుడు దివంగత నేత శ్రీ నకునారెడ్డి గారు, మీ తండ్రిగారితో కలిసి చాలా కాలం పనిచేసాం.

కానీ ఎప్పుడూ ఆయన ఇటువంటి అవకతవక వ్యవహారాలు చెయ్యలేదు. నువ్వు చెప్పినదాని బట్టి చూస్తే ప్రజలు ఇంక ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి కదలడానికి కూడా భయపడేటట్లుగా ఉంది. ఏమండీ మీరేలాగో మాకు దారి చూపించలేరు, మా దారి మేము వెతుక్కుంటూ ఉంటే కూడా ఎందుకండీ మమ్మల్ని నియంత్రించి మీ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూస్తారు.

ఒక వ్యక్తి స్వతంత్రంగా బతికే హక్కును ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆధారంగా ప్రభుత్వం అతడి పరిధిని నియంత్రిస్తోంది. నిన్నకాక మొన్న పదవిలోకి వచ్చి ఏదో నీకు మాత్రమే ప్రజలకు సేవ చెయ్యడానికి అర్హత ఉన్నట్లు ఫీల్ అయిపోవడం మంచిది కాదు. ఇవాళ రేపు మన రాష్ట్ర యువతలో ఇదొక ఫేషన్ అయిపోయింది ఒకప్పుడు ఆర్కుట్, నేడు ఫేస్బుక్, ఇంస్టాగ్రాం అంటూ రకరకాల మధ్యామాల్లో తమకు తెలిసీ తెలియని విషయాలతో అర్థం పర్థం లేని ప్రణాళికలు రూపొందిస్తూ సమయం వృథా చేస్తున్నారు.

ఇప్పుడు ఈ రాజకీయాలు, ఈ పెద్దపెద్ద వ్యవహారాల్లో తలదూర్చడం, సొంతంగా చట్టాలు చెయ్యడం, వీరికి ఒక ఫేషన్ లాంటిది. ఇలాంటి వారి సలహాలను పాటించి మనం ఎలా ముందుకు వెళ్ళగలం. నేను చెప్పిన మాటలు నిజం కాకపోతే మన ముఖ్యమంత్రిగారు కానీ, మరి ఇతర సీనియర్ నాయకులు గానీ నోరు మెదపరెందుకు చెప్పండి” ఆవేశంగా దిగాడు ప్రసాద్. ఇంక హనుమంతరావుకి ఆ సభలో మాట్లాడక తప్పింది కాదు.

అతను మాట్లాడడానికి సిద్ధపడుతుండగా సభలో చిన్నచిన్నగా నవ్వులు వినిపించడం ప్రారంభించాయి. గత ప్రభుత్వ సమయంలో హోం మంత్రిగా చేసినప్పుడు ఆయన సభలో చేసిన వాచాలత్వం అందరికీ తెలుసు, అయితే జోగేశ్వరరావు మరణానంతరం ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆయన తన పద్ధతి మార్చుకుని మితంగా మాట్లాడడం ప్రారంభించాడు. అందుకు భూషణరావు లాంటి వ్యక్తులు ఆయనకు సహాయం చేసారు.

“అధ్యక్షా మరి మీకు తెలుసు రాహుల్ బాబు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాడు, నా కోరిక మీదటే ఆయన ఈ బిల్‌ను మా ప్రభుత్వం తరఫున సభలో ప్రవేశపెట్టడం జరిగింది, ఇది మన రాష్ట్ర పరిపాలనా విధానంలో ఒక నూతన ఒరవడిని సృష్టిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధం ఎలా ఉంటుందో, అదే విధంగా ఈ టెరిటరీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధం ఉంటుంది. ఇవన్ని వివరాలు రాహుల్ పిల్లకాయి చాలా రీసెర్చ్ చేసి రూపొందించి ఈ బిల్‌లో పొందుపరిచారు, మరి అందరూ దీన్ని చదివి ఇందుకు సహకరించాలి అని నా మనవి” అని తన ప్రసంగం ఇంకా ఎక్కువ సేపు పొడిగించకుండా ముగించాడు హనుమంతరావు.

ఇంకా వాదోపవాదాలు జరుగుతున్నా కానీ సభాపతిని వాటిని పట్టించుకోకుండా “ఈ బిల్‌కి సంబంధించిన ఓటింగ్ మళ్ళీ వచ్చే సభలో జరుగుతుంది. ఇంక మన అజెండాలోని తరువాత అంశం ధరణికోట ప్రాజెక్ట్”.

***

సికింద్రాబాద్ స్టేషన్ చాలా సందడిగా ఉంది ఆరోజు శుక్రవారం, కొన్ని రోజులు ప్రభుత్వ కార్యాలయాలకి కూడా అనుకోకుండా సెలవలు రావడంతో ఒక వారం రోజులు ప్రజలందరికీ సాధారణ జీవితం నుండి కొంత సమయం విముక్తి లభించినట్లు అయ్యింది. అక్కడ నుండి వివిధ ప్రాంతాలకు చేరుకునే వారి ఉరుకులూ పరుగులతో అప్పుడే అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

‘సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్‌ప్రెస్ నాలుగవ నెంబర్ ప్లాట్ఫారం పై వచ్చి ఉన్నది’ రైల్వే అనౌన్సర్ మూడుభాషలలో ప్రయాణికులకు వివిధ రైళ్ళ రాకపోకలు గురించి తెలియజేస్తోంది. నిశ్శబ్దంగా అందరినీ దాటుకుంటూ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లోని తన సీట్ దగ్గరకు చేరుకున్నాడు గణేష్, అతని తల్లిదండ్రులది విశాఖ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం.

అయితే తన చిన్నతనంలోనే వారి కుటుంబం హైదరాబాద్‌కు వచ్చెయ్యడం వలన అతనికి సొంత ఊరు గురించి పెద్దగా అవగాహన లేదు.ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళడం అతనికి చాలా ఆనందంగా ఉంది.శలవులకు ఊరికి వెళ్తున్న చిన్నపిల్లల రీతిలో తన మనసు ఉరకలు వేస్తోంది. కొంతసమయం ఆ భోగీ నుండి బయటకి వచ్చి ట్రైన్ ఎక్కడానికి హడావిడిగా పరుగులు తీస్తోన్న మధ్య తరగతి ప్రయాణికులను ఆసక్తిగా గమనిస్తున్నాడు.

తనకి ఎందుకో ఫ్లైట్ కన్నా నలుగురితో కలిసి ఇలా ట్రైన్‌లో వెళ్ళడం ద్వారా ఎక్కువగా మనుషుల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది అనిపించింది. అంతేకాకుండా బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయినట్లు ఉండే తన జీవితంతో అతను విసిగిపోయి కొంత విరామం కోరుకుంటున్నాడు. ఇప్పటివరకూ తన జీవితంలో రాహుల్, రాజకీయాలు తప్పితే మూడవ అంశం లేదు. ప్రియాంక చొరవతో తనకి ఈ అవకాశం లభించడం యాదృచ్ఛికమో మరేంటో అతనికి తెలీదు కానీ తనకు మాత్రం కొంత ఊరట లభించినట్లు అతను భావించాడు.

ఈ పర్యటనలో కూడా కొంతవరకు పని చెయ్యాల్సిరావడం అతని అదృష్టమో, దురదృష్టమో. అలా గమనిస్తున్న అతనికి దూరంగా అదే ప్లాట్‌ఫారం మీద ఉదాసీనంగా ఎవరికోసమో ఎదురు చూస్తున్న ఒక పాతిక సంవత్సరాల వయసున్న అమ్మాయి కనిపించింది, ఆమె భుజానికి ఒక బాగ్ తప్ప ఆమె చుట్టుపక్కల ఎటువంటి లగేజ్ కనిపించలేదు, ఆమెతో ఎవరూ ఉన్నట్లుగా కూడా అనిపించలేదు.

ఇంత హడావిడిలో ఎక్కడికి వెళ్లాలని ఎదురు చూస్తోందో ఏమో అని కుతూహలంగా అనిపించింది. ట్రైన్ బయలుదేరడానికి ఇంకొక నలభై నిమిషాలు టైం ఉండడంతో ఆమె గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఆమె దగ్గరకు వెళ్లి పక్కనే కూర్చున్నాడు, తెలుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకున్న ఆమె చూడడానికి బాగా చదువుకున్న దానిలాగే ఉంది, కాని ఆమెను చూస్తుంటే ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లుకానీ, ట్రైన్ ఎక్కాలనే హడావిడిలో ఉన్నట్లు కానీ అనిపించలేదు. అతను తన పక్కన కూర్చున్నా కానీ ఆమె పెద్దగా స్పందించలేదు.

“మీరు కూడా ఇదే ట్రైన్ లో ప్రయాణిస్తున్నారా” ఆమెను మాట్లాడించాలి అన్నట్లుగా అడిగాడు. ఆమె అతని ప్రశ్నను పట్టించుకోనట్లుగా ఉంది, అతను అటూ ఇటూ చూసారు, ప్రయాణికులు అంతా ఎవరి హడావిడిలో వారు ఉన్నారు, అతను అక్కడ నుండి లేచి ప్లాట్ఫారం మీద కొంత ముందుకు వెళ్లి మళ్ళీ ఒక్కసారి మొత్తమంతా పూర్తిగా గమనించాడు. అక్కడున్న ఎవరూ వారిద్దరి గురించి పట్టించుకున్నట్లు ఆమెకు అనిపించలేదు.

ఆమె దగ్గరకు వెళ్లి “మీ పేరేంటి” అడిగాడు

ఆమె కొంతసేపు నిశ్శబ్దం తరువాత ఏమనుకుందో ఏమో కానీ ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది “నా పేరు దుర్గాభవాని, నా దగ్గర టికెట్ లేదు, కానీ నేను ఎలాగైనా వైజాగ్ చేరుకోవాలి, నాకు బస్ ప్రయాణం అంత కంఫర్టబుల్ కాదు, తిరిగి ఇంటికి వెళ్ళే ఆలోచన కూడా లేదు. అందుకే ఏమి చెయ్యలా అని ఆలోచిస్తున్నాను” తన గురించిన వివరాలు చెప్పింది.

“హమ్మయ్య, మీకు మాటలు కూడా వచ్చు అన్నమాట. జనరల్ గా సినిమాల్లో చూపించినట్లుగా ఇలాంటి టైంలో ఇక్కడ వంటరిగా కూర్చున్నారంటే మాటలు ఇంట్లో నుంచి పారిపోయిన బాపతు అయినా ఉండాలి, లేదా టెర్రరిస్ట్ అయినా అయ్యుండాలి. మిమ్మల్ని చూస్తుంటే రెండవది అయ్యే ఛాన్స్ లేదు, మీ మాటలను బట్టి మొదటిది కూడా కాదని కన్ఫర్మ్ అయ్యింది. సో మిస్ భవాని మీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు సహాయం చేస్తాను. మరింకేమీ ఆలోచించకుండా ప్లీజ్ కం విత్ మీ” ఆమెను తనతో రమ్మన్నట్లుగా ఆహ్వానించాడు

“ఇంట్లో నుండి పారిపోయిన బాపతు కాదని మీరెలా చెప్పగలరు” అతడిని చూస్తూ అడిగింది దుర్గ

“వెరీ సింపుల్. ఒకవేళ అదే నిజమైతే ఏదో ఒకలాగ ఇక్కడినుండి దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటారు కానీ బస్‌లో కంఫర్ట్ లేదు, రైల్లో టికెట్ లేదు అని ఆలోచించరు కదా” ఆమెతో అన్నాడు గణేష్, దాదాపుగా అమె తనతో రావడానికి సిద్ధపడినట్లుగా అతను అనుకున్నాడు.

 “ఓహ్ వెరీ గుడ్, బాగానే గమనించారే, సరే మరి అలాంటప్పుడు నా దగ్గర టికెట్ లేకపోయినా ఇక్కడే ఎందుకు వెయిట్ చేస్తున్నాను అంటారు” ఆమె అతడిని అడిగింది.

“అదే నాకు కూడా అర్థం కాని విషయం, బహుశా మీ దగ్గర డబ్బులు ఉండకపోయి ఉండవచ్చు, ఎవరినైనా అడగడానికి కానీ ఫోన్ చెయ్యడానికి కానీ నామోషీ అయ్యి ఉండవచ్చు” ఆమె వంక ప్రశ్నార్థకంగా చూస్తూ అన్నాడు గణేష్. ఆమె దానికి సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంది

“ఎనీ వే, నా ఆఫర్‌కి ఇంకా వాలిడిటి ఉంది, మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు. సౌత్ సెంట్రల్ రైల్వే వారి సహకారంతో మిమ్మల్ని సేఫ్‌గా, ‘కంఫర్టబుల్’గా వైజాగ్ కి తీసుకెళతాం” ఆమె చిన్నగా నవ్వి అతని వెనక నడిచింది.

“ఒకే మీరు జాగ్రత్తగా కూపే నెంబర్ 8 లో కూర్చోండి, ఇంకొక టెన్ మినిట్స్‌లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది, నేను ఈలోపులో కొన్ని ఇంపార్టెంట్ పనులు చేసుకుని వస్తాను” ఆమెతో అని వెళ్ళబోతుండగా “ఇది ఫస్ట్ క్లాస్ భోగీ” సందేహంగా అతనితో అన్నది.

“ఏం నా ఫేస్ చూస్తుంటే ఫస్ట్ క్లాస్ లాగ అనిపించడం లేదా” ఆమె ఇబ్బందిపడినట్లుగా గమనించి “హహ జోక్ చేసాను అంతే. డోంట్ వర్రీ అబౌట్ దట్, మీకేమి ప్రాబ్లం ఉండదు నేను జస్ట్ ఇద్దరికీ డిన్నర్ తీసుకుని వచ్చేస్తాను అంతే. మీరు వెళ్లి సీట్లో కూర్చుని రిలాక్స్ అవ్వండి” అని వెళ్ళిపోయాడు.

మరొక ఐదు నిమిషాల్లో అన్నట్లుగానే అతను వచ్చాను ట్రైన్ కూడా కదిలి వేగం పుంజుకుంది, ఫస్ట్ క్లాస్ భోగీలో ఎదురెదురు సీట్లలో కూర్చుని ఉన్నారు ఇద్దరూ, ఆమెకు బాగా ఆకలిగా ఉందేమో ట్రైన్ కదిలిన అరగంటలోనే తినడం మొదలుపెట్టింది, అతడు ఆమెను వారించలేదు .

“ఈ రోజు వర్క్ బాగా ఎక్కువైపోయి నీరసంగా ఉంది, అందుకే తినేస్తున్నాను ఏమీ అనుకోకండి”

“అయ్యో పరవాలేదండి, తిండి దగ్గర అసలు మొహమాటం ఉండకూడదు, ఇంకా మీకు నీరసంగా ఉంటే తినేసిన వెంటనే నిద్రపోవచ్చు, ఇంక ఎవ్వరూ మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యరు, టికెట్ కలెక్టర్‌తో కూడా మాట్లాడేసాను ఇందాకే.” చెప్పాడు గణేష్.

“ఓహ్ ఇంత రష్ టైములో ఫస్ట్ క్లాస్ సీట్ సంపాదించారు అంటే మీరు చాలా గొప్పవాళ్ళు అయ్యుండాలి, లేదంటే పలుకుబడి కలిగిన వాళ్ళు అయ్యుండాలి. అలోచించి చూస్తే నాకు రెండూ కరక్టే అనిపిస్తోంది” ఆమె అతని వంక చూస్తూ నెమ్మదిగా చెప్పింది.

 “ఎందుకనో” అర్థం కానట్లుగా అడిగాడు.

 “జస్ట్ ఫీలింగ్ అంతే” ఆమె భుజాలు ఎగరేసింది.

మరికొంత సేపట్లో అతను కూడా తినడం పూర్తి చేసాడు, ట్రైన్ వేగంగా ముందుకు సాగుతోంది. “అది సరే వర్క్ వల్ల నీరసం అన్నారు కదా మీరు ఏమి పనిచేస్తుంటారు” అడిగాడు ఆమెను.

“నేను బేసికల్‌గా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్‌ని, వైజాగ్‌లో ఎడ్యుకేషన్ అయిపోయిన తరువాత హైదరాబాద్‌లో ఒక టీవీ న్యూస్ ఛానెల్‌లో కంటెంట్ రైటర్‌గా వర్క్ చేస్తున్నాను. టీవీలో వర్క్ చేస్తున్నా కానీ నేను ఎప్పుడూ పెద్దగా ఫీల్డ్ లోకి వెళ్ళడం, ఇంటర్వ్యూస్ అవీ తీసుకోవడం లాంటివి చెయ్యలేదు. ఐ లవ్ ఇండోర్ జాబ్ వెరీ మచ్, నాకు వంటరిగా పనిచెయ్యడం అంటేనే ఎక్కువ ఇష్టం, ఐ విల్ బీ మోర్ ఎఫెక్టివ్ ఇన్ దట్ వే” ఆమె కొద్దికొద్దిగా తన గురించి పూర్తి వివరాలు తెలియజేస్తోంది

“ఓహ్ న్యూస్ ఛానెలా, అయితే మీ ప్రొఫెషన్‌కీ మాకు చాలా దగ్గర రిలేషన్ ఉంది.” కొంచెం ఉత్సాహంగా చెప్పాడు గణేష్.

“ఓహ్ అవునా, మీరేమి చేస్తూ ఉంటారు” ఆమె తెలీనట్లుగా అడిగింది

“మీకు నా గురించి తెలీకపోవడం కొంచెం విచిత్రంగానూ, నా గురించి నేను చెప్పుకోవాల్సి రావడం కొంచెం బాధాకరంగా ఉంది.”

ఆమె చిన్నగా నవ్వింది.

“మన హోం మినిస్టర్ మిస్టర్ రాహుల్ పురుషోత్తమ రెడ్డి గారు తెలుసా మీకు” ఆమెను అడిగాడు.

“ఓహ్ మై గాడ్, ఆయన తెలుసా అని నెమ్మదిగా అంటారేంటండీ, సినిమా హీరోకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉండే ఆయన హార్ట్ త్రోబ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ యంగ్‌స్టర్స్ ఇన్ అవర్ స్టేట్, అసలు పొరపాటున రాజకీయాలలోకి వచ్చాడు కానీ సినిమాల్లో ఉంది ఉంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, షారుఖ్, సల్మాన్, అమీర్, రణబీర్, బ్రాడ్ పిట్, లియోనార్డో వీళ్ళందరినీ మించిపోయేవాడు” ఆమె కూడా మరింత ఉత్సాహంగా చెప్పింది.

“అదేంటి మీకు తెలిసిన హీరోలు వీళ్ళేనా, ఇంకెవరూ లేరా” ఆమె నాలిక కరుచుకోవడంతో అతను సరదాగా నవ్వాడు

“మీరు చెప్పిన ఆ హీరోలందరికీ సపోర్టింగ్ రోల్స్ చేస్తుంటారే అలాంటి కారక్టర్ నాది, రాహుల్‌కి నేను అఫీషియల్ కరెస్పాండెంట్‌ను. అందుకే మనకి ఇంత ఈజీగా ఫస్ట్ క్లాస్‌లో సీట్ దొరికింది, కానీ ఏమి చేస్తాం మీరేమో ఎప్పుడూ బయటకి రారు కదా అందుకే టీవీలో కనిపించేవారు తప్పితే తెరవెనక వున్నవాళ్ళు మీకు తెలీదు” కొంచెం నెమ్మదిగా అన్నాడు గణేష్ వారిద్దరి మధ్యా బాగానే రాపో కుదిరినట్లు అతనికి అనిపించింది.

“ఇంతకీ మీరు వైజాగ్ ఎందుకు వెళ్తున్నారు” కొంతసేపటి తరువాత అడిగాడు.

“నా సొంత ఊరు వైజాగ్ దగ్గరలోని నాయుడుపల్లి అనే గ్రామం, నా చిన్నతనం అంతా అక్కడే గడిచింది. సెలవలు వచ్చాయి కదా కొన్ని రోజులు అక్కడ ఉంది వద్దాం అని వెళ్తున్నాను. అక్కడ మాకొక లాండ్ ఇష్యూ కూడా ఉంది. అది కూడా సెటిల్ చేసుకుని పూర్తిగా ఇంక వైజాగ్ కి రాంరాం చెప్పేయాలి” ఆమె తన సంగతులు బయటపెట్టింది.

“ఎందుకు రాంరాం చెప్పేయాలి, మీకు మీ ఊరు నచ్చదా” కొంచెం ఆసక్తిగా అడిగాడు “అలా ఏమి లేదు, ఒకటిన్నర ఏళ్ళ క్రితం మా డాడీ ఎక్స్‌పైర్ అయ్యారు, అందుకే నాకు అక్కడ ఉండాలి అనిపించదు, పాత జ్ఞాపకాలు అవీ..” ఆమె ఇంకేమి చెప్పాలో తెలీనట్లుగా అలాగే ఆగిపోయింది.

“ఓహ్ మీ చిన్నతనం అంతా అక్కడే గడిచింది అంటున్నారు అయితే మీకు ఆ ప్రదేశం అంతా బాగానే తెలిసుండాలి. మాది కూడా వైజాగ్ దగ్గర ఒక చిన్నపల్లెటూరు కానీ మేము నా చిన్నప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము, అక్కడ స్టేజ్ షోస్ చేసాము కానీ, నాకు ఆ ప్రాంతం పెద్దగా టచ్ లేదు. సో మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాకు హెల్ప్ చేస్తారా” సందర్భాన్ని తెలికపరచడానికి అన్నట్లుగా అతను అన్నాడు, ఆమె సరే అన్నట్లుగా తలూపింది, అక్కడితో వారి మధ్య సంభాషణ ముగిసింది, ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు. ట్రైన్ మెల్లగా లయబద్ధంగా సాగుతోంది.

(సశేషం)

Exit mobile version