Site icon Sanchika

రాజకీయ వివాహం-16

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది 16వ భాగం. [/box]

అధ్యాయం- 16

[dropcap]“చా[/dropcap]లా ఆశ్చర్యంగా ఉంది మేడం ఈ విషయం, మేము సరిగ్గా ఇతని సంగతి మీతో మాట్లాడదాం అనుకుంటున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఆలోచించదగిన అంశం. అసలు గణేష్‌ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది.”

ఒక్కసారిగా ఆమెకు తన కళ్ళముందు భూషణరావు మెదిలాడు. వైజాగ్ లోని తమ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఘటనా స్థలానికి చేరుకుంటున్న సమయంలో ప్రియాంకతో అన్నాడు జగదీశ్వరరావు. సిద్ధార్థ, చక్రధర్ కూడా వారితో పాటే ఉన్నారు. రాహుల్ ఈ పాటికే అక్కడికి చేరుకొని ఉంటాడు.

“గణేష్ గురించి ఏమి మాట్లాడదాం అనుకుంటున్నారు” అర్థం కానట్లుగా అడిగింది ప్రియాంక.

“అతను గత కొంతకాలంగా కనపడకుండా పోయాడు కదా, దానికి సంబంధించిన విషయాలు మీకేమైనా తెలిసే అవకాశం ఉందేమోనని” చెప్పాడు జగదీశ్వరరావు.

“నాకైతే పెద్దగా తెలీదు, గణేష్‌తో నాకు చాలా తక్కువ పరిచయం ఉంది”  ఎందుకో తెలీదు కానీ నాచిరెడ్డి కేసుని పరిశోధించమని తను గణేష్‌కి చెప్పినట్లుగా ఆమె సిద్ధార్థతో కలిపి ఇంక ఎవరికీ కూడా చెప్పదలచుకోలేదు, ఎంత ఉన్నత స్థాయిలో, ఎంత సెక్యూరిటీ ఉన్నా బహుశా తన ప్రాణాలకి కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆమె భయపడుతూ ఉండవచ్చు.

తాము ఆ స్థలానికి చేరుకునేసరికి అక్కడ పోలీస్ బలగాలు మొహరించి ఉన్నాయి. బ్యారికేడ్ చెయ్యబడి ఉన్న ఆ ప్రదేశం అంతా పోలీస్ జాగిలాలు అదే పనిగా మొరుగుతూ తిరుగుతున్నాయి. మొత్తం ఆ ప్రాంతం అంతా టీవీ రిపోర్టర్లు, పత్రికా విలేకరులతో గుమిగూడిపోయి ఉంది. తను అక్కడికి వెళ్లేసరికి అక్కడ తనకు దుర్గాభవాని కనిపించి ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ప్రాంతం ధరణికోటకు దగ్గరగా ఉండడం గమనార్హం.

“దుర్గా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి” ఆశ్చర్యం ఎక్కువ అవుతూండగా అడిగింది ప్రియాంక

“ఈ బాడీని ఐడెంటిఫై చేసి మాకు తెలియపరిచింది ఈమే మేడం” ఆ కేసుని పరిశోధిస్తున్న ఆఫీసర్ ఆమెకు చెప్పాడు.

“నా వీకెండ్ ప్రోగ్రాం కోసం మా స్థలం చూడడానికి ఇక్కడికి వచ్చాను అక్కా, చూస్తే ఈయన ఇక్కడ ఇలా పడిఉన్నాడు. వెంటనే భయంతో పోలీసులకు ఫోన్ చేసాను.” ఆందోళన నిండిన కంఠంతో చెప్పింది దుర్గ. ఆమె అసలే పెద్దగా మాట్లాడదు అన్న విషయం తెలిసిన ప్రియాంక ఇంక ఆమెను ఎక్కువగా ప్రశ్నించలేదు. రాహుల్ కూడా అక్కడే ఉండి మీడియా వారికి సమాధానాలు చెప్తున్నాడు.

“గణేష్ నాకు చాలా మంచి మిత్రుడు. అతడిని ఇంత దారుణంగా చంపడం అసలు ఊహించలేని విషయం. మా ఈ ధరణికోట ప్రాజెక్ట్ నిర్మాణ స్థాయికి చేరుకోవడానికి అతను చేసిన కృషి మరవలేనిది. పైకి కనిపించేది మేమే దానికి వెనక మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి మా నాన్నగారు బ్రతికి ఉన్న సమయంలో ప్రజలకి ప్రభుత్వానికి చేరువచేయ్యడానికి ఎంతో సహకరించాడు.

మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఈస్థితిలో హత్య చెయ్యబడ్డాడు అంటే దీనికి కారణం ఎవరనేది జ్ఞానమున్న ఎవరికైనా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ జరగకుండా అడ్డుపడడానికి ఎంతటి ఘాతకానికైనా ఒడిగట్టే కొందరి స్వార్ధపరుల పని ఇది అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, గతంలో హిస్టరీ ప్రొఫెసర్ విషయంలో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరిగింది.

ఆ కేసుపై ఇంకా సంతృప్తికరమైన నివేదిక అందాలని నా అభిప్రాయం. అందుకే ఒక ఫుల్ స్కేల్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిపి ఇందుకు కారణం అయిన వారు ఎంతటి గొప్పస్థానంలో ఉన్నాకానీ శిక్షింపబడే విధంగా చూస్తాము. ఇందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది”

ఆ  భవనంలో రెండవ అంతస్తులో విగతజీవుడై పడిఉన్న గణేష్‌ను రకరకాల భంగిమల్లో ఫోటోలు తీస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. అతడిని ఎవరో రివాల్వర్‌తో కాల్చి చంపారు, కానీ వారికి అక్కడ ఎటువంటి మారణాయుధం లభించలేదు.

సిబిఐ పేరు ఎత్తగానే అక్కడున్న అందరూ ఆ ప్రదేశాన్ని దీర్ఘంగా పరిశీలిస్తున్న జగదీశ్వరరావు బృందం వైపు పరుగెత్తారు. ఒక్కసారిగా తమని చుట్టుముట్టిన మీడియా వర్గాలను ఎలా సమాధాన పరచాలా అని ఆలోచిస్తూ వారిని అయోమయంగా చూస్తున్నాడు జగదీశ్వరరావు. వారితోపాటు ప్రియాంక కూడా అక్కడే ఉండడం వలన మీడియా వారు అత్యుత్సాహాన్ని ఎవరూ అదుపు చేయలేకపోయారు.

“సార్ ప్రభుత్వం వారు గతంలో వరదరాజన్ గారి విషయంలో కూడా ఇలానే జరిగింది అని అభిప్రాయపడుతున్నారు, ఆ సందర్భంలో మరణించిన సుకన్య గారి కేసును కూడా ఇన్వెస్టిగేట్ చేసినది మీరే కదా. దానికీ ఈ కేసుకీ ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా. ఈ హత్యాలన్నీ ప్రభుత్వం పై ప్రజలకు అపనమ్మకం కలిగించడానికే జరుగుతున్నాయి అనుకుంటున్నారా. అసలు వీటిని ఎవరు చేయిస్తున్నారు అంటారు” ప్రశ్నల మీద ప్రశ్నలు వారి మీద గుప్పిస్తున్నారు అయితే అపారమైన అనుభవం కలిగిన జగదీశ్వరరావు వారిని సమర్థవంతంగానే ఎదురుకుంటున్నాడు.

“గణేష్ హత్య విషయంలో ఇప్పుడే ఎటువంటి అజంప్షన్స్ చెయ్యడానికి వీలు లేదు. ఇది ఎవరికీ అర్థం కాని ఒక షాక్ లాంటిది. ఇందాక హోంమంత్రి గారు అన్నట్లు ఫుల్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ జరగాలని మేము కూడా ఆశిస్తున్నాము. మీరన్నట్లుగా గతంలో ఆ కేసు డీల్ చేసింది నేనే కాబట్టి ఆ కేసును కూడా రీ ఓపెన్ చేసి మాకు అప్పగిస్తే బాగానే ఉంటుంది. దానితోపాటుగా ఇంకా చాలా కేసెస్‌కి సంబంధించిన వివరాలు ఈ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడతాయి అని నా నమ్మకం” చెప్పాడు జగదీశ్వరరావు.

“ఇంకా చాలా కేసెస్ అంటే ఏంటి సార్ అవి. వాటి గురించి మేము తెలుసుకోవచ్చా” ఒక విలేకరి అడిగాడు.

“చెప్పాను కదా ఇప్పుడే ఎలాంటి అజంప్షన్స్ కంక్లూజన్స్ చేయలేమని. ఇఫ్ ది గవర్నమెంట్ ప్లాన్స్ టూ రీ ఓపెన్ ది కేస్, దెన్ ఇట్ విల్ బీ ఏన్ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్. సో ఫుల్ డిస్క్లోజర్ విల్ బీ గివెన్ టూ ది మీడియా వెన్ వీ ఫైండ్ ది ఫాక్ట్స్” చెప్పాడు జగదీశ్వరరావు. సిధ్ధార్థ కూడా ఈ సంభాషణ అంతటినీ ఆసక్తిగా తిలకిస్తున్నాడు. ఆయన అలా అనడంతో ఇంక ఏమీ చెయ్యలేక ప్రియాంక వైపు తిరిగి

“మేడం ప్రభుత్వం వారు ధరణికోట ప్రాజెక్ట్ విషయంలో భూసేకరణకి వ్యతిరేకంగా ఉన్న ప్రజల విషయంలో అవగాహన కలిపించడానికి గణేష్ గారు చాలా కృషి చేసారు అని చెప్పారు. గతంలో వరదరాజన్ గారు కూడా ఇదే విధంగా మృతి చెందారని దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది స్వార్ధపరులు కారణం అని ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఒక్కటే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూసేకరణ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నది మీరే కదా, అంటే ఆయన పరోక్షంగా మిమ్మల్ని విమర్శిస్తున్నట్లు మీమీద అనుమాన పడుతున్నట్లు అనిపిస్తోంది. దీనిపైన మీ స్పందన ఏంటి” ఆమె తన చెవులను తానే నమ్మలేకపోయింది.

రాహుల్ నిజంగా ఆ ఉద్దేశంతో అలా అన్నాడా, లేదా ఎటువంటి మాటల్నైనా వక్రీకరించగల సామర్ధ్యం మీడియా వారికి సొంతమా. ఆమెకు వారికి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.

సిధ్ధార్థ కలిపించుకుని “ఇందాకా సార్ చెప్పినట్లు సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము, అప్పుడే కదా నిజానిజాలు బయటపడేది. ఇకపోతే మా జె.హెచ్. పార్టీ దివంగత నేత మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చిరకాల కోరిక అందరికీ భూమి అన్న లక్ష్యాన్ని చేరుకోవడానికే మా పార్టీ ప్రయత్నిస్తోంది.

దాని కోసమే రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు, సమ్మెలు నిర్వహిస్తున్నాం. ఆరోపించడానికి ఎవరైనా ఎన్నైనా ఆరోపించవచ్చు బట్ సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడడం అంత మంచి విషయం కాదు. మీకు తెలిసే ఉంటుంది గణేష్ మాకు కూడా స్నేహితుడే, అలాంటిది మేము అతడి గురించి ఎందుకు అలా ఆలోచిస్తాము.

ప్రభుత్వానికి వ్యతిరేకమని మీరు అంటున్నారు ప్రజలకు అనుకూలమని మేము అంటున్నాము, ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది సార్. వారు కూడా ప్రతీ విషయాన్ని గమనించి గతంలో లాగ కాకుండా ఈసారి విజ్ఞతతో ప్రవర్తించి సరైన వ్యక్తిని ఎన్నుకుంటారని నాకు గట్టి నమ్మకం ఉంది” కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్పాడు సిద్ధార్థ.

అతను చెప్పినదాంట్లో తమ పార్టీ లక్ష్యం ప్రజలకు తెలుపుతూనే తమ పట్ల అనుమానలకి తావు ఇవ్వకుండా ఉండే విధంగా ఉంది. తాము ఈ హడావిడిలో ఉండగా చక్రధర్ దుర్గతో మాట్లాడుతూ ఉండడం ఆమె కంటపడింది. అప్పటికి సాయంత్రం ఆరు గంటలు కావొస్తోంది, ఆ రాత్రికి ఇంక బాడీని తీసుకు వేళ్ళడం అంత మంచిది కాదని ఆ మరుసటిరోజు ఉదయాన్నే తరలించే ఏర్పాటు చేయించారు.

గణేష్‌కి ఇంకా వివాహం కాకపోవడం వలన ఇంకా తన తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. ఒక్కగానొక్క కుమారుని జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయేసరికి వారి బాధ వర్ణణాతీతంగా ఉంది. రాహుల్, ప్రియాంక, సిద్ధార్థ ఒకరి తరువాత ఒకరు వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వాళ్లకి ధైర్యంగా ఉంటుందని తన తల్లిని వారి ఇంటికి వెళ్ళవలసినదిగా కోరింది ప్రియాంక.

ఇంకా తమ ఈ రాజకీయ జీవితాల్లో ఎన్ని చావులు చూడవలసి వస్తుందో అని ఆమె ప్రియాంకతో అన్నప్పుడు నిజమేనేమో అనిపించింది. ఆ రాత్రికి దుర్గతో కలిపి వారందరూ కూడా అక్కడే తమ గెస్ట్ హౌస్‌లో ఉండిపోవడానికి నిర్ణయించుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు సిద్ధార్థ చూసుకున్నాడు.

రాహుల్ బాడీని హాండ్ ఓవర్ చేసుకుని ఉదయం ప్రయాణానికి సిద్ధపడే విధంగా ఏర్పాట్లు చేసి తన అతిథి గృహానికి చేరుకున్నాడు.

***

ఆ తరువాత పరిణామాలు అన్నీ చాలా వేగవంతంగా జరిగిపోయాయి. గణేష్‌తో పరిచయమున్న వారు అందరూ కూడా అతని మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. సుదర్శన్ కూడా అతని అంత్యక్రియలకు రావడం జరిగింది. ఆ సందర్భంలో ప్రియాంకకు అతను ఎదురుపడినప్పుడు వారిద్దరూ మాట్లాడుకోవడం సుదర్శన్ తాను ఈ విషయం ముందే ఊహించి ఆమెకు తెలియజేయడం వాటి గురించి చర్చజరిగింది.

ఈ విషయం రహస్యంగా గమనించాడు జగదీశ్వరరావు, అప్పుడే అతనికి అర్థం అయ్యింది ప్రియాంక తమకు చెప్పినదానికన్నా ఆమెకు ఎక్కువ తెలుసు అని. రాహుల్ చెప్పినట్లుగానే ప్రభుత్వం వారు మళ్ళీ వరదరాజన్, సుకన్య కేసును ఓపెన్ చేసి, గణేష్ కేసుతో పాటు దానిని కూడా సాల్వ్ చెయ్యవలసినదిగా సిబిఐ వారిని కోరారు.

అవి రెండూ తిరిగి జగదీశ్వరరావు గారికే అప్పగించడం జరిగింది. ఇక సిద్ధార్థ విషయం చెప్పనవసరం లేదు, ఎలెక్షన్స్ ఇంకొక మూడు నెలలు మాత్రమే ఉండడంతో అతను ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టి వాటిలో తలమునకలై ఉన్నాడు. టీవీల్లో తరచుగా అతను కనిపించడం మామూలు అయిపోయింది. ప్రియాంక కూడా అలుపనేదే లేకుండా పర్యటనలు చేస్తూనే ఉంది. అయితే గణేష్ హత్య తమ పార్టీకి తీరని కళంకం తెచ్చినట్లు అయ్యింది.

రాహుల్ ఆ రోజు చేసిన వ్యాఖ్యలు ప్రజలు బాగా దృష్టిలో పెట్టుకున్నట్లు ఉన్నారు, ఆమె ఇన్వెస్టర్లు ఆమెతో ఈ విధమైన పనులు చేయిస్తున్నారని కొంతమంది నమ్ముతున్నారు. చాలా చోట్ల ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాము ఇంతవరకూ చేసిన కార్యక్రమాలు నిర్వహించిన సభలూ ఒక ఎత్తయితే గణేష్ మృతి తరువాత తమపట్ల ప్రజలు ఏర్పరుచుకున్న అభిప్రాయం మరొక ఎత్తు. దానితో అనుకోకుండానే పార్టీ చాలా విషయాల్లో దుర్బలం అయ్యింది.

ఇంక తమ పార్టీ నుంచి బయటకు వెళ్ళేవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఆమె ఎవరినీ ప్రభావితం చేసే స్థితిలో లేకపోయింది, ఆఖరికి ప్రసాద్ గారు ఒక్కరే తమ పార్టీని అంటిపెట్టుకుని ఉంటారేమో అని ఆమెకు అనిపించింది. అటువంటి పరిస్థితుల్లో ఆమె రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులు ఏ విధంగా నిలబెట్టగలదు అని ఆమెకు అనిపించింది. తనకు ఇప్పటివరకూ లాభించిన విషయాలు రెండే రెండు మొదటిది ప్రజల నుంచి  తమ కనస్ట్రక్టివ్ ఫోర్స్‌కి లభిస్తున్న సహకారం, సిద్ధార్థ యొక్క దీక్ష, పట్టుదల మరియు అతని బుద్ధి కుశలత.

అంతేకాకుండా తరతరాలుగా తన తండ్రిపై ప్రజలు ఏర్పరుచుకున్న నమ్మకం కూడా లాభదాయకమే, అయితే ఆమెను ఆ నమ్మకాన్ని ఎంత వరకూ చేరుకోగలదు అని ఆమెకు ఇప్పుడిప్పుడే అనుమానం కలుగుతోంది. ఇంతకాలం తను చేసినది అంతా గణేష్ విషయంలో తను చూపిన అజాగ్రత్త వల్ల పూర్తిగా కోల్పోయి ఉంటుంది అని ఆమె అభిప్రాయపడింది. అసలు గణేష్ ను ఎవరు చంపి ఉంటారనేది ఇప్పటికీ తనకు అర్థం కాని విషయం.

అయితే సిధ్ధార్థకు మాత్రం ఈ విషయం పట్టినట్లు లేదు. అతను అలా టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ, ప్రచారం చేస్తూ పోతున్నాడు. ఛానెల్స్ వారి సహకారంతో ప్రజలతో కూడా ఇంటరాక్టివ్ డిస్కషన్స్ చేస్తున్నాడు. ఈరోజు రాత్రి కూడా అతడిని ఒక ప్రముఖ టీవీ ఛానెల్ వారు ముఖాముఖి చర్చకు ఆహ్వానించారు.

తనని కూడా రమ్మని ఆహ్వానించినా తాను అందుకు నిరాకరించింది, ప్రస్తుతానికి ఆ విభాగం మొత్తం సిద్ధార్థనే చూసుకోమన్నట్లుగా ఆమె అతనితో చెప్పింది, తనకి ఇప్పుడు ప్రజల్లో ఏమనుకుంటున్నారో అన్నదానికన్నా తను వ్యక్తిగతంగా నిర్వహించవలసిన కర్తవ్యం మాత్రమే ముందుగా కనపడుతోంది, అందుకే వాళ్ళకి తమ లక్ష్యాన్ని చేతల ద్వారా నిరూపించాలి అని ఆమె అభిప్రాయం.

ఆ సాయంత్రం సిద్ధార్థ ఏమి చెప్తాడా అని తన తల్లితో పాటు ఆమె కూడా ఆసక్తిగా టీవీ ముందర కూర్చొని చూస్తోంది. ఆ కార్యక్రమం ప్రారంభానికి ముందర టీవీ ఛానెల్ వారు సిద్ధార్థ, రాహుల్, గణేష్ మరియు తనకి మధ్య ఉన్న స్నేహం గురించి ఏషియన్ కాలేజీలో ఉండగా రాహుల్ నిర్వహించిన హరితభూమి కార్యక్రమం దానికి ప్రియాంక సహకరించడం, వరదరాజన్ ప్రసంగం ఇవన్నీ ప్రసారం చేసారు.

వాటిలో సరాదాగా తమ కాలేజీ రోజులలో తీసుకున్న ఫోటోలు అవీ, రహస్యంగా తను చేసిన మొట్టమొదట ప్రసంగం యొక్క వీడియోలో కొంత భాగం, మొన్నమొన్ననే  తాజ్ రెస్టారెంట్‌లో తాము ముగ్గురూ కలసి లంచ్ చేస్తూ ఉండగా తీసిన ఫోటో ఇవన్నీ మనోహరమైన సంగీతం జోడించి ఒక సినిమా మాదిరి చూపించారు ఆ ఛానల్ వాళ్ళు. అసలు వీరికి ఈ సమాచారం అంతా ఎక్కడినుంచి లభిస్తుందో అని ఆలోచిస్తేనే ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది.

“నమస్కారం ‘ప్రముఖులతో ముఖాముఖీ’ కార్యక్రమానికి స్వాగతం” స్టూడియోలో ఉన్న వ్యాఖ్యత కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అన్నాడు, అతని వయసు నలభై ఐదు, ఏభై ఈ మధ్య ఉంటుంది. సిద్ధార్థను చూస్తే చాలా ఆత్మవిశ్వాసంతో కూర్చుని ఉన్నట్లుగా అనిపించింది ప్రియాంకకు.

“ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా, ఎవరి వారసత్వం కాకుండా స్వశక్తితో ఒక ప్రాంతీయ పార్టీలో అనతికాలంలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్న యువకుడు, ఎంతో ప్రతిభాశాలి మాటలతో మంత్రాలు జల్లే మన అందరి అభిమాన వక్త సిద్ధార్థకు ప్రేక్షకుల అందరి తరఫునా ఘన స్వాగతం తెలుపుతున్నాను. నమస్కారం సిద్ధార్థ గారు” టీవీ హోస్ట్ అన్నాడు

“నమస్కారం సర్, మీరు చెప్పినవన్నీ వింటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నా ఈ రాజకీయ జీవితం అంతా కూడా మా పార్టీ నేత శ్రీ నకునారెడ్డిగారు, ఇంకా మీలాంటి ఎంతో మంది పెద్దల దగ్గరనుంచి నేర్చుకున్నదే, నాకంటూ సొంతంగా గుర్తింపు కలగడానికి నేను ఒక్కడిని మాత్రమే కారణం కాదు” వినయంగా సమాధానం చెప్పాడు సిద్దార్థ

“ఇప్పుడు కూడా మాటల చాతుర్యం వదలలేదు సిద్ధార్థ గారు” అన్నాడు ఆ ఏంకర్. స్టూడియోలో చిన్నగా నవ్వులు వినిపించాయి

“ఒకే సిద్ధార్థ గారు, ఇప్పటివరకు మీ గురించి మన రాష్ట్రంలో తెలియని ప్రజలు ఉన్నారంటే నేను నమ్మను. పార్టీని వేగవంతంగా ముందుకు నడిపించడంలో కానీ, కఠిన తరమైన నిర్ణయాలను తీసుకోవడంలో కానీ, పార్టీ స్ట్రాటజీలను డిజైన్ చెయ్యడంలో కాని ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చాలా మందికన్నా మీరే గొప్ప అని అతి తక్కువ కాలంలోనే మీరు ఖ్యాతి గడించారు.

మీ వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటివరకు చాలా తక్కువమందికి తెలుసు. మా ప్రేక్షకుల కోసం ఆ సమాచారం కొంత చెప్తారా?” అడిగాడు ఆయన

“మా తల్లిదండ్రులు ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉంటారు. మా నాన్నగారు చీఫ్ ఎడిటర్ ఆఫ్ డెక్కన్ టైమ్స్, అమ్మ హౌస్ వైఫ్, మా ఇంట్లో నేను ఒక్కడినే. కాబట్టి నాకు పెద్దగా ఆంక్షలు ఏమీ లేవు, ఏది చదవాలన్నా ఏమి చెయ్యాలన్నా అంతా నాకు నచ్చినట్లుగానే జరిగింది, మా ఫాదర్ ఎప్పుడూ నన్ను ఏ విషయం మీద స్ట్రెస్ చెయ్యకుండా ఫుల్ ఇండిపెండెన్స్ ఇచ్చారు.

అందుకే ఎమ్మెసీ చేసి కొన్నాళ్ళు ఒక సాఫ్ట్‌వేర్ కంపనీలో ఉద్యోగం తరువాత జర్నలిజం కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ నాకు పరిచయం అయ్యారు నకునారెడ్డి గారి కుమార్తె, ప్రస్తుతం జె.హెచ్. పార్టీ అధ్యక్షురాలు ప్రియాంక గారు. ఆ తరువాత అంతా మీకు తెలిసిందే, నకునారెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో ఒక ముఖ్యమైన పదవిని అందించడం.

ఆ తరువాత ప్రియాంక గారు పార్టీ అధ్యక్షురాలు కావడం ఇదంతా ఆలోచిస్తే చాలా తక్కువ కాలంలో జరిగినప్పటికీ సుదీర్ఘమైన ప్రయాణంగా అనిపిస్తుంది. ఇంక ఇంతకన్నా నా గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, వ్యాయామం, స్పోర్ట్స్, వీకెండ్స్, టూర్స్, సినిమాలు ఇవన్నీ మామూలే కదా. అయితే ప్రతీదాన్ని బాలన్సడ్‌గా చెయ్యడానికి ప్రయత్నిస్తాను” తన గురించి చెప్పుకొచ్చాడు సిద్ధార్థ, ఏంకర్ కూడా ఆసక్తిగా వింటున్నాడు.

“సార్, నాదొక చిన్న క్వశ్చన్. మనం ఏదైనా పని చేసాం అంటే, అది ఏ పనైనా కానివ్వండి దాని వెనక బలమైన డ్రైవింగ్ ఫోర్సు, ఒక ఇన్స్పిరేషన్,  ఒక మోటివేషన్ లాంటిది ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతుంటాను. అలా మీరు రాజకీయాల్లో రావడం వెనుక బలమైన కారణం ఏదైనా ఉందా, ఉంటే అదేంటో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా” అడిగాడు ఆయన.

“నిజం చెప్పాలంటే రాజకీయాల్లోకి రావాలని నేను కూడా అనుకోలేదు, నా జీవితంలో కొంతమంది  మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు వారిని చూసి నేను సెల్ఫ్ ఇన్స్పైర్ అయ్యి ఇందులోకి వచ్చాను అని చెప్పగలను. ప్రజలకు సేవ చెయ్యాలి, ప్రజలను ఉద్ధరించాలి, నేను లేకపోతే వారిని ఇంకెవరూ కాపాడలేరు అని నేను ఎప్పుడూ అనుకోలేదు.

కాకపోతే నాకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం వెన్ను చూపే స్వభావం నాకు లేదు. నకునారెడ్డి గారు అస్వస్థతతో ఉన్న సమయంలో ఆయనను చూడడానికి నేను తరచుగా వస్తూ ఉండేవాడిని, ఈ విషయం ఇక్కడ చెప్పచ్చో లేదో తెలీదు కానీ ఆయన ప్రియాంక గారితో కన్నా నాతో  ఎక్కువగా రాజకీయాల గురించి చర్చిస్తూ ఉండేవారు. ఒకనాటి రాత్రి ఫోన్ చేసి తన ఆవేదన అంతా వెళ్ళబుచ్చుకున్నారు.

ఈ ప్రభుత్వం ఏ విధంగా అవకాశవాద రాజకీయంతో ప్రజల భూములని సొంతం చేసుకుంటోంది అన్న విషయం పదేపదే నాకు చెప్పి నా అభిప్రాయం కోరేవారు. అప్పట్లో నాకు అంతగా అవగాహన లేకపోయినా నాకు తెలిసినంత వరకూ చెప్పడానికి ప్రయత్నించే వారిని, నా అభిప్రాయాలు ఆయనకి నచ్చి పార్టీలో యువత యొక్క ఆవశ్యకత గ్రహించి నన్ను పార్టీలోకి ఆహ్వానించారు, ఇది ఇప్పటివరకు  జరిగిన చరిత్ర.

అయితే నాకు ఇక మీదట కూడా ప్రభుత్వం వారి ఈ దురాగతాలు ఆగుతాయని నేను అనుకోవడం లేదు. తన హయాములో ఎంతోమందికి సొంతం చేసిన స్థలాలను ప్రభుత్వం ఇప్పటికి కూడా అలా సేకరిస్తూనే ఉందని, తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు తాను ఏమీ చెయ్యలేకపోయాను అనే  దిగులుతోనే ఆయనకు రెండు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చి మరణించారు.

అక్కడి నుంచీ నాలో ఆయన నింపిన ఆశయం బలపడింది, ఆ తరువాత అదే నా జీవిత లక్ష్యంగా మా పార్టీ యొక్క ప్రధాన అజెండాగా మారింది” కొద్దిగా ఆవేశంతో చెప్పాడు సిద్ధార్థ.

“కొందరు మహోన్నతమైన వ్యక్తులు అన్నారు కదా సిద్ధార్థ గారు వారెవరో మా ప్రేక్షకులు తెలుసుకోవచ్చా?” కొంచెం టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఏంకర్. దానికి సమాధానం చెప్పకుండా ముసిముసిగా నవ్వాడు సిద్దార్థ

“మీరు అనుకుంటున్న వారు ఎవరూ కాదు లెండి, ప్రేక్షకులకు కూడా ఈ విషయం తెలుసుకోవడానికి పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పినా కానీ వాళ్ళు ముందే డిసైడ్ ఐపోయి ఉంటారు, మీరే ఆ విధంగా వారిని ట్యూన్ చేసి ఉంటారని కూడా నా అనుమానం. కాదంటారా?” అన్నాడు సిద్ధార్థ, దానికి అతను కూడా చిన్నగా నవ్వాడు

“అబ్బెబ్బే అలాంటిది ఏమీ లేదు సిద్ధార్థగారు, ప్రేక్షకులు ఏమి కోరుకుంటే మేము వారికి అదే చూపిస్తాం, ఉన్నవీ లేనివీ కలిపించి చెప్పడం వలన మా ఇమేజే కదండీ డ్యామేజ్ అవుతుంది. ఏమైనాకానీ మీరు నిజం ఒప్పుకోవడం లేదని నాకు అనిపిస్తోంది. సరే అదలా ఉంచితే కనుక. మీరు జర్నలిజం కాలేజ్‌లో చదువుతున్నప్పుడు ప్రియాంక, రాహుల్, గణేష్ ఇంకా మీరందరూ ఫ్రెండ్స్ కదా, వారితో మీకున్న సంబంధం గురించి కొంచెం చెప్తారా? ఇప్పుడు మీరు ఇంకా మీ స్నేహితులు రాహుల్  ప్రతిపక్షాల్లో ఉన్నారు కదా. దాని మీద మీ భావాలు ఏంటి” ఈసారి కొంచెం చిక్కుప్రశ్న వేసాడు ఆ ఏంకర్.

సిద్ధార్థ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు “కంగారు పడకండి సిద్ధార్థగారు ప్రేక్షకులకి అన్ని విషయాలు తెలుసు, అయితే చాలా విషయాలు వాళ్ళు సొంతంగా వ్యక్తుల నోటినుంచి మాత్రమే వినడానికి ఇష్టపడతారు. మీరు అందరికీ కావలసినవారు అని కూడా మేము ప్రేక్షకులతో నిర్వహించిన సర్వేలో తేలింది. కనుక మీ సమాధానం ఏదైనా దాన్ని ప్రజలు స్వాగతిస్తారు అని నా అభిప్రాయం” చెప్పాడు ఆ ఏంకర్. అతని వంక విచిత్రంగా చూసాడు సిద్ధార్థ. అస్సలు ఇందులో కంగారు పడడానికి ఏముంది, అతని ఉద్దేశం ఏంటో సిద్ధార్థకు అర్థం కాలేదు అయినా కానీ బయటపడకుండా

 “అదేమీ లేదు సార్, మేము నలుగురం చాలా మంచి స్నేహితులం, గణేష్ మరణం నన్ను ఎంతో కలచివేసింది. రాహుల్‌తో కూడా మేము ఎప్పుడూ కలుస్తూ ఉంటాం, రాజకీయపరంగా మేము ప్రతిపక్షాల్లో ఉన్నప్పటికీ నేను ప్రియాంక, రాహుల్ అప్పుడప్పుడు పార్టీలకి కూడా వెళ్తూ ఉంటాము. వ్యక్తిగతంగా రాహుల్ లోని కొన్ని క్వాలిటీస్ నాకు ఇష్టం కూడా” చెప్పాడు సిద్ధార్థ

“మీరు అప్పుడప్పుడు పార్టీలకు కూడా వెళ్తూ ఉంటారు అన్నది నిజమే సిద్ధార్థ గారు. ఈ ఫోటో చూస్తే ఆ విషయం అర్థం అవుతోంది” వారు ముగ్గురూ తాజ్ రెస్టారెంట్‌లో ఉండగా రహస్యంగా తీసిన ఫోటో మరొక సారి టీవీలో ప్రదర్శించారు. ఆయన మాటలతో అక్కడ స్టూడియోలో నవ్వులు విరిశాయి, అందరూ హాయిగా నవ్వుకున్నారు, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియాంక కూడా చిన్నగా నవ్వుకుంది.

“ఇంత కలిసిమెలిసి తిరిగే మీరు మీ స్నేహితుడు గణేష్ మరణంవల్ల మీ పార్టీ పై రాహుల్ బహిరంగంగా వ్యాఖ్యానించే స్థాయికి వెళ్ళారు అంటే దీనిపై మీ కామెంట్ ఏంటి. దీనిని మీ పార్టీ ఏ విధంగా సమర్ధించుకుంటుంది” ఈసారి వాతావరణం గంభీరంగా మారడం అందరూ గమనించారు.

“మొదట రాహుల్ ఏ కారణం చేత ఆ విమర్శలు చేసాడు అన్నది అతనికి మాత్రమే తెలియాలి. ఇకపోతే ఇదొక జరుగుతున్న పరిశోధన కనుక నిజానిజాలు బయటపడే వరకూ దీనిమీద మాట్లాడడానికి ఏమీ ఉండదు. నా మటుకు నాకు మాత్రం ఇలాంటి వాటి మీద పెద్దగా ఆసక్తి ఉండదు, నేను నిరంతరం మా పార్టీకి అవసరమైన పని చెయ్యడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాను.

అది మాత్రమే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమేదో ప్రజలను కూడగట్టుకుంటున్నాం అనుకునే అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కనస్ట్రక్టివ్ ఫోర్సు స్థాపించి సాధ్యమైనంత ఎక్కువగా ప్రభుత్వానికి సహాయపడడానికే ప్రయత్నిస్తున్నాం. అలా అని చెప్పి నిరాధారమైన వ్యక్తిగతమైన విమర్శలు చెయ్యడం మంచి లక్షణం కాదు.

ఇది ప్రభుత్వం వారు అర్థం చేసుకుంటే మంచిది. గణేష్ చావుని రాజకీయం చేయడం మాత్రం నేను జీవితంలో ఎప్పటికీ చెయ్యని చెయ్యలేని పని. మీరు ఇందాకా అన్నారే అందరికీ కావాల్సిన వాడిని అని. అదే కోవలోకి గణేష్ కూడా చెందుతాడు” కొంచెం ఆవేశంతో అన్నాడు సిద్ధార్థ్. అది గమనించిన వ్యాఖ్యత కొద్దిసేపు కార్యక్రమానికి  విరామం ఇచ్చాడు.

తిరిగి వచ్చిన తరువాత “ఒకే ఆ విషయాలు అన్నీ పక్కన పెడితే, మీరు ప్రభుత్వం వారి సభలకూ వెళ్తారు, అదే మాదిరి జె.హెచ్. పార్టీ వారి సభలను కూడా మీరే నిర్వహిస్తారు. జె.హెచ్. పార్టీ ప్రియాంక గారిని అభ్యర్ధిగా ప్రకటించిన కొంతకాలానికే జనసమాజ్ రాహుల్‌ని బరిలోకి దింపింది అన్న విషయం తెలిసినదే. అంటే ఇప్పుడు ఎలెక్షన్ బరిలో ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా ఉన్న  ఇరు పార్టీల నేతలు రాహుల్, ప్రియాంక వారిద్దరూ మీకు కావలసిన వాళ్ళే కదా.

ఇద్దరితో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అంతేకాకుండా ఇద్దరికీ కూడా రాజకీయపరంగా సహాయం చేసినవారే అందువల్ల మీరు ఈ ఎన్నికల్లో డిసైడింగ్ ఫాక్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే మా ప్రేక్షకులు అంతా మేము కండక్ట్ చేసిన సర్వేలో మిమ్మల్ని ‘కింగ్ మేకర్’గా అభివర్ణించారు. మరి ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని మీరు ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకుంటున్నారు, ఈ కింగ్ మేకర్ ఎవరిని కింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు” అక్కడే ఎన్నికల ఫలితాలు వెల్లడించినట్లు ఉంది వాతావరణం. అసలు ఇలాంటి ఒక సర్వే కూడా జరిగింది అని కూడా తనకు తెలీదు

“అరెరే అలాంటిదేమీ లేదండీ, మొట్టమొదట నుంచీ నేను జె.హెచ్. పార్టీతో ఉన్నప్పటికీ నాకు జనసమాజ్ పార్టీతో కూడా సత్సంబంధాలు ఉండడం వాస్తవమే. అయితే అవి వ్యక్తిగతమైనవా, రాజకీయ, వ్యాపార పరమైనవా అని నేను చెప్పినా కానీ మీరు నమ్మరు. ప్రజలు నన్ను అలా అనుకోవడం కూడా నా అదృష్టమో లేదా దురదృష్టమో నేను స్పష్టంగా చెప్పలేను.

అయితే ఇద్దరిలో ఎవరు అనేది ప్రజలనే డిసైడ్ చేసుకోనిద్దాం. నాకైతే ఇద్దరిలో ఎటువంటి వ్యత్యాసం కనిపించదు. ఇద్దరూ సమఉజ్జీలే, ఇకపోతే నా అభిప్రాయం అంటారా నేను ప్రజలు ఏమి కోరుకుంటే అదే చేస్తాను” తెలివిగా సమాధానం ఇచ్చాడు సిద్ధార్థ

“ఒకే సిద్ధార్థగారు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మీలాంటి యువకులు ఈ దేశానికి ఎంతో అవసరం, ఈసారికి కుదరకపోయినా మళ్ళీ వచ్చేసారి అయినా మీరు  కూడా ఎన్నికల్లో పాల్గొనాలి అని నా కోరిక” అక్కడితో ఆ కార్యక్రమం ముగిసింది.

సిద్ధార్థ అక్కడ మాట్లాడిన తీరు ప్రియాంకను అబ్బురపరచింది. ఇప్పటికే పార్టీ పరిస్థితి పూర్తిగా నాశనం ఐపోయినట్లుగా ఉంది, ఆ సమయంలో ఇతని మాటలు ఇంకా ఎక్కువగా దెబ్బతీసే విధంగా ఉన్నాయి.

తను ప్రియాంకనే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాను అని కనీసం అతనైనా చెప్పలేనప్పుడు ఇంక ప్రజలు ఆ విధంగా భావించగలుగుతారు అనుకోవడం తన మూర్ఖత్వం. తను మాటల గారడీ చేస్తున్నాను అనే భ్రమలో అతను పార్టీకి తీరని నష్టం కలిగించాడేమో అని ఆమెకు అనిపిస్తోంది, ఇప్పుడు తను ఇన్వెస్టర్స్‌కి ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు. తన అనుమానాలన్నీ ఆ మరుసటిరోజు జరిగిన పార్టీ సమావేశంలో నిజమయ్యాయి.

“ఏమండీ అసలు మిమ్మల్ని చూస్తుంటే నెగ్గే ఉద్దేశం మీకు లేనట్లు అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మీరే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేకపోతే ఇంక ప్రజలు ఏమి ఆశించి మనకి ఒటేస్తారు. ఇప్పటికే రాహుల్ గణేష్ విషయంలో చేసిన వ్యాఖ్యల వలన మనం పూర్తిగా నష్టపోయి ఉన్నాము, మీరెన్ని సర్వేలు నిర్వహించినా, ఎన్ని ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించినా మీరన్న చిన్న మాట చాలు మొత్తం నాశనం చెయ్యడానికి.

ఆఖరి క్షణం వరకూ ప్రజలు ఇలాంటి వాటికోసమే ఎదురు చూస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా నాకు ప్రియాంక, రాహుల్ ఇద్దరూ ఒక్కటే అని, మరి ప్రభుత్వం పట్ల నమ్మకున్న ఎక్కువశాతం మంది ప్రజలు ఇప్పటికే అధికారంలో ఉన్న రాహుల్ వైపు మొగ్గు చూపరని నమ్మకం ఏంటి. దానికి తోడు పుండు మీద కారం జల్లినట్లు ఈ సిబిఐ ఎంక్వైరీ ఒకటి.

మొదటినుంచీ మీ పార్టీలో ఇదే పరిపాటిగా సాగుతున్నట్లు ఉంది. చూస్తుంటే గతంలో నకునారెడ్డిగారు ఏ విధంగా ఎన్నికల్లో నష్టపోయారో సరిగ్గా అదే విధంగా ఇప్పుడు మనం కూడా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది, కాకపోతే అప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కనుక కొంతైనా ఆశ ఉండేది ఇప్పుడది పూర్తిగా నాశనం అయిపోయింది” పార్టీలో మిగిలి ఉన్న ఎమ్మెల్యేలలో ఒకరు కొంచెం హెచ్చు స్వరంతోనే తమ బాధను వెళ్ళబుచ్చుకున్నాడు.

 అక్కడున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆ సమావేశం తమ క్యాంపెయిన్ ఆఫీసులో జరుగుతోంది. ప్రియాంక ముఖ్యమంత్రి అభ్యర్ధిత్వాన్ని సపోర్ట్ చేసే చాలా మంది ఇన్వెస్టర్లు ఆ సమావేశానికి హాజరయ్యారు, నిజానికి వారి ప్రోద్బలం మీదటే ఈ సమావేశం జరుగుతున్నట్లుగా ప్రియాంక అభిప్రాయపడింది. వారిముందు దోషులుగా నిలబడడం ఆమె సహించలేకపోయింది, సిద్ధార్థ ఇంకా ప్రసాద్ గారు అక్కడే తను ఏమి చెప్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

“నాకు తెలిసి ఇప్పటికి పెద్దగా నష్టం ఏమీ జరగలేదు, సిద్ధార్థ చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అబద్ధం లేదు, కనుక మనం ఈ విషయంలో అతడిని తప్పుపట్టడానికి ఆస్కారం లేదు. మీరన్నట్లుగా సిబిఐ ఎంక్వయిరీలు మనకి కొత్తేమీ కాదు. దురదృష్టవశాత్తూ ఇంకా అధికారంలోకి రాకముందరే ఇవి మనల్ని చుట్టుముట్టాయి, అఫ్కోర్స్ అధికారంలో ఉంటే అవి మనల్నేమీ చెయ్యలేవు అనుకోండి.

ఈ విషయం మన పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయిన నాచిరెడ్డిగారిని చూస్తే అర్థం అవుతుంది. ఒకవేళ అంతవరకూ వస్తే దీన్ని ఏ విధంగా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు, దానికి నా దగ్గర మీ ఎవరికీ తెలియని ఒక మార్గం ఉంది. అవసరమైతే అది ఉపయోగించి పార్టీలో మిగిలి ఉన్న ఎమ్మెల్యేలు తిరిగి గెలిచేలా, ఇన్వెస్టర్స్ ఎవరూ నష్టపోకుండా ఉండే విధంగా చర్య తీసుకుంటాను. పార్టీ అధ్యక్షురాలిగా ఇది నేను మీకిస్తున్న హామీ, మా నాన్నగారి మీద నమ్మకంతో మీరు నన్ను ఈ స్థానంలో కూర్చుండబెట్టారు, ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నేను వమ్ముచెయ్యను. నన్ను నమ్మండి” సిద్ధార్థ ఆమె వంక ఆశ్చర్యంగా చూసాడు.

ఇప్పటివరకు ప్రజలు, స్వశక్తి ఇలాంటి విషయాలు మాత్రమే మాట్లాడిన ప్రియాంక, ఇప్పుడు రాజకీయాలు కూడా చాలా సునాయాసంగా మాట్లాడుతోంది, బహుశా అవసరం ఆమెను ఆ విధంగా మాట్లాడేలా చేస్తోందేమో, తనదగ్గర ఉన్న ఎవరికీ తెలియని ఆ మార్గం ఏమై ఉంటుందో అని సిద్ధార్థ ఆలోచనలో పడ్డాడు. అయితే ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు అక్కడున్నవారు అందరూ నమ్మినట్లుగా అనిపించింది, అందరి ముఖాల్లో అదొక రకమైన సంతృప్తి కనిపించింది.

 కానీ ఈ సమయంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందరి నమ్మకాన్ని నిజం చేయ్యగలుగుతుందా? తన లక్ష్యం చేరుకోగలుగుతుందా, దానికి ఆమె ఎంతవరకూ సిద్ధపడగలదా? తనకి ఎదురైనా అడ్డంకులను ఆమె ఎదుర్కుని ముందుకు సాగుతుందా? ప్రజలా, రాజకీయమా అని చిరకాలంగా ఆమెను వేధిస్తున్న ప్రశ్నకు ఆమె సమాధానం ఏమిటి? ఆమె మనసంతా అయోమయంగా, చిందరవందరగా ఉంది.

***

గత వారంరోజులుగా తను ఆమెనే ఫాల్లో అవడం దినచర్యగా పెట్టుకున్నాడు చక్రధర్. విశాఖపట్నంలో గణేష్ హత్య గావింపబడిన చోట ఆమె కనపడిన దగ్గర నుంచీ ఆమె విషయం అతనికి ఆసక్తిగా అనిపించింది. ఆ తరువాత కేసు తమ చేతుల్లోకి వచ్చిన దగ్గర నుంచీ జగదీశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేసి ఆమెను ఫాల్లో అయ్యే డ్యూటీ తీసుకున్నాడు.

“మీరు నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా” ఒకరోజు కాఫీ షాప్ లో ఉండగా తన దగ్గరకు నేరుగా వచ్చి అడిగింది దుర్గాభవాని.

“మీరు ప్రియాంక గారితో ఎంత కాలంగా ఉంటున్నారు” ఆమె తన ఎదర ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది.  తానే ఆమెను అడగాలి అనుకుంటే ఆమె తన దగ్గరకు రావడం విచిత్రంగా అనిపించింది

“దాదాపు ఒక రెండున్నర సంవత్సరాలుగా ఉంటున్నాను. మా ఛానెల్ లోని ప్రోగ్రాం ప్రెజెంటర్ ఒకామె నన్ను ప్రియాంకగారికి పరిచయం చేసింది, మా స్థలం విషయంలో నాకు జె.హెచ్. పార్టీవారు సహాయం చేస్తారని ఆమె నాకు ప్రియాంక గారితో పరిచయం ఏర్పరిచింది. నేను ఒంటరిగా ఉండడం, మా తల్లిదండ్రులు ఎవరూ బతికి ఉండకపోవడం వలన తనతోనే ఉండమని ప్రియాంక గారు నన్ను వారింటికి ఆహ్వానించారు.

ఎవరూ లేని నాకు అది చాలా పెద్ద వరంగా అనిపించి అక్కడ నుంచీ ఆమెతోనే ఉంటున్నాను. ఆరోజు నేను వైజాగ్ అనుకోకుండా వెళ్లాను, కేవలం వీకెండ్‌కి సరదాగా వెళ్దామని మాత్రమే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడప్పుడూ నేను అలా మా ఊరు వెళ్తూ ఉంటాను, ఈ విషయం కావలంటే మీరు ప్రియాంకగారిని అడిగి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అక్కడ నాకు గణేష్ గారి మృతదేహం కనిపించడం చాలా యాధృచ్ఛికంగా జరిగింది” ఆమె చెప్పినదాంట్లో నమ్మకుండా ఉండేటటువంటి విషయాలేమీ చక్రధర్‌కు కనిపించలేదు.

కాకపోతే అతని మనసులో ఇంకా ఏదో మూల అనుమానం అలానే ఉంది. ఆమె తనకి తెలిసిన దానికంటా చాలా తక్కువ విషయాలు చెప్తోంది అని చక్రధర్‌కు అనిపించింది. “మరైతే అక్కడ కనిపించిన గణేష్ అనే విషయం మీకు అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది. సహజంగా అతను జనసమాజ్ పార్టీలో పనిచేసినప్పటికీ చాలా తక్కువమందికి మాత్రమే అతను తెలిసే అవకాశం ఉంది,

ఎందుకంటే రాహుల్ కనిపించినంత ఎక్కువగా అతను టీవీల్లోనూ పత్రికల్లోనూ కనిపించడు, అతను కేవలం వెనక ఉండి కార్యక్రమాలను నిర్వహించడంలో మాత్రమే సహాయపడ్డాడు. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా అతడిని కలిసారా?” అడిగాడు చక్రధర్. కొంచెం సేపు ఆలోచించిన తరువాత ఆమె చెప్పింది

“అవును కలిసాను, ఒకసారి కాదు రెండు సార్లు. కొంతకాలం క్రితం ఒకరోజు ప్రియాంక గారు అతడిని ఫోన్ చేసి తమ ఇంటికి పిలిపించారు, ఆ సమయంలో వారిద్దరూ చాలా సమయం మాట్లాడుకున్నారు, మరి ఏమి మాట్లాడుకున్నారో నాకు తెలీదు. అప్పుడొకసారి అతడిని చూడడం జరిగింది.

 ఆ తరువాత ఒకరోజు ఈవెనింగ్ నేను మా ఊరు వెళ్తున్న సమయంలో అతను నాకు ట్రైన్‌లో కనిపించి తాను కూడా వైజాగ్ వెళ్తున్నట్లు చెప్పాడు, తనది కూడా ఆ ఏరియా అని చెప్పాడు. ఆ సమయంలో నాకు ట్రైన్ టికెట్ దొరకడం కష్టం అయితే అతనే తన పలుకుబడి ఉపయోగించి సీట్ ఇప్పించాడు కూడా, అప్పుడు అతడిని చూడడం జరిగింది.

అయితే ఆరోజు తరువాత మళ్ళీ ఎప్పుడూ నేను ఆయనను కలవలేదు. మా లాండ్ కూడా అదే ఏరియాలో ఉంది అనుకోకుండా ఆ భవనం దగ్గరకు వెళ్ళిన నేను తను విగతజీవుడై కనిపించడంతో ఆ ఏరియా పోలీస్ స్టేషన్‌కీ మా ఛానెల్ వారికీ తెలియజేశాను”  చెప్పింది దుర్గ, ఆమె చెప్పినదంతా సాంతం విన్న చక్రధర్ కి ఎక్కడో ఏదో లింక్ దొరికినట్లు అనిపించింది.

ఒకసారి ప్రియాంకను కలిస్తే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. “ఒకే దుర్గా, నేను ఈ విషయం తెలుసుకోవడానికే నిన్ను ఫాలో అవుతున్నాను. అయితే ఎందుకో డైరెక్ట్‌గా నిన్ను అప్రోచ్ అవ్వాలి అని నాకు అనిపించలేదు. అవసరమైతే నువ్వు ఈ విషయంలో నీ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది” చెప్పాడు చక్రధర్. సరే అన్నట్లుగా తలూపింది ఆమె. ఇంకా ఆమెతో మాట్లాడడానికి పెద్దగా విషయాలేమీ లేవనిపించి అక్కడనుండి సరాసరి ప్రియాంక సెక్రెటరీతో మాట్లాడి ఆమె క్యాంపెయిన్ ఆఫీస్‌లో మీటింగ్ ఎరేంజ్  చేయించుకున్నాడు.

ఆ సమయంలో సిద్ధార్థ ఇంకొంతమంది ఇన్వెస్టర్స్‌ను కలవడానికి ముంబై వెళ్ళడం వల్ల ఆమె సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, అయితే ఇప్పుడు ఆమె అన్నిటికీ సిద్ధపడి ఒక ధృడ నిశ్చయంతో ఉంది. తను ఎటువంటి అపరాధం చెయ్యకపోయినా దాన్ని నిరూపించడం చాలా కష్టం, అందులోనూ సిబిఐ వారు ఏ విధంగా పనిచేస్తారో ఆమె తన తండ్రి విషయంలో రెండు మూడు సార్లు గమనించి ఉంది.

అతను వచ్చేప్పటికి తను పార్టీ ఎమ్మెల్యేలతో అప్పుడే మీటింగ్ ముగించుకుంటోంది, తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం కోసం ప్రియాంక ఎప్పుడు పర్యటించవలసినది ఆ ప్రణాళికలు ఆమెకు వివరంగా చెప్పారు ఆ ఎమ్మెల్యేలు, ఆ విషయంలో ఆమెకు అవగాహన కలిపించడానికి ప్రసాద్ గారు ఎంతో సహాయం చేసారు. చక్రధర్ ఆంతరంగిక సమావేశం కోరడంతో వారిద్దరినీ అక్కడ వదిలేసి అక్కడ నుంచి బయటపడ్డాడు ఆయన.

“మీ సమయం ఎక్కువ తీసుకొను మేడం, మీరు మీ ఎలక్షన్స్‌లో ఎంత బిజీగా ఉంటారో నేను ఊహించగలను, అయితే గణేష్ గారి కేసు, నాచిరెడ్డి భార్య సుకన్యగారి కేసు ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉన్నాయని, దీనివెనుక ఒక పెద్ద కాన్స్పిరసీ ఉందని మా డిప్యూటీ సూపరింటెండెంట్ గారి అనుమానం, కనుక ఈ రెండు కేసెస్‌నూ సాల్వ్ చెయ్యడం చాలా అవసరం, అది మీ క్యాంపెయిన్‌కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం.

అందుకే నేరుగా విషయంలోకి వస్తాను మా ఎంక్వైరీలో తెలిసిన వివరాల ప్రకారం గణేష్ గారు కొంతకాలం క్రితం విశాఖపట్నం వెళ్లారు. అప్పటినుంచీ ఆయన రాహుల్ గారితో కానీ, ఇంకా తన పరిచయస్తులు ఎవరితోకానీ సంబంధం పెట్టుకోలేదు. ఇన్ఫాక్ట్ ఆయన ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలీదు, మా అనుమానం ఏమిటంటే అతను విశాఖపట్నంలో ఏదో ఒక విషయం తెల్సుకున్నాడు, అది బయటపడకుండా ఉండడానికే అతడు హత్య చేయబడడం జరిగింది.

ఒకవేళ అది నిజమైతే అందుకు కారణం అయినవాళ్ళు కూడా అనుమానితులు అవుతారు. కనుక చెప్పండి  అతడు వైజాగ్ వెళ్ళడంలో మీ ప్రమేయం ఏమైనా ఉందా?” అడిగాడు చక్రధర్, అతను జగదీశ్వరరావు గారి అనుమతి లేకుండా నేరుగా తానే ఈ విషయం తేల్చుకోవాలి అనుకున్నాడు.

ప్రియాంకకు అతడి ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు. అయితే ఇప్పటివరకూ తను గణేష్‌ని నాచిరెడ్డి భార్య సుకన్య కేసు గురించి తెలుసుకోవడానికి పంపించింది అనే విషయం ఎవరికీ చెప్పకుండా తప్పు చేసానేమో అనిపించింది, ఒకానొక సమయంలో తన తండ్రి నకునారెడ్డి ఆయన తరువాత నాచిరెడ్డి ఏ విధమైన ఒత్తిడికి గురయ్యి ఉంటారో అర్థం చేసుకోగలిగింది.

 అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో, దీనివల్ల ఎవరు లాభపడతారో ఆమె తెల్చుకోలేకపోతోంది, ప్రజల మాట దేవుడెరుగు ఇప్పుడు తన నిజాయితీని, నిబద్ధతను తానే శంకించే స్థితికి చేరుకుంది. ఇదొక విషియస్ సైకిల్ లాగ ఆమెకు అనిపించింది.

“ఒకే మిస్టర్…” అని కొంచెం ఆగింది

“చక్రధర్” అతను తన పేరు చెప్పాడు

“ఆ చక్రధర్. మీ లెక్క ప్రకారమే కాన్స్పిరసీ ఉందని అనుకుందాం, దానివల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు. మీరు డైరెక్ట్‌గా మా పార్టీని నన్ను అనకపోయినప్పటికీ నేను అర్థం చేసుకోగలను, అయితే ఇందులో పొలిటికల్ బెనిఫిట్ ఉందని మీరు భావిస్తే కనుక మీరు పూర్తిగా తప్పు ద్రోవలో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే ఏజ్ యూ కెన్ సీ వీ ఆర్ నాట్ పెర్ఫార్మింగ్ మచ్ ఎఫెక్టివ్లీ ఆన్ ద పొలిటికల్ ఎండ్, రీసెంట్ స్టడీస్ హావ్ షోన్ ఇట్.

ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను, ఒకవేళ గణేష్ నా కోరిక మీదటే విశాఖపట్నం వెళ్ళాడు అనుకుందాం, ఇట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్. మేమందరం ఫ్రెండ్స్ కనుక ఒక స్నేహితుడిగానే నేను అతడిని సహాయం కోరడం జరిగింది. అంతేకానీ ఇందులో ఇంకొక ఉద్దేశం ఏమీ లేదు. అయితే దురదృష్టవశాత్తూ అతని మరణించడం వల్ల అతను ఏమి తెలుసుకున్నాడు అని మీరు అనుకున్నారో అది నాకు కూడా తెలీకుండా పోయింది.

నేను ఇంతకన్నా మీకు ఈ విషయంలో ఎక్కువ సహాయం చెయ్యలేను. ఇంకా ఏమైనా కావాలంటే మా లాయర్‌తో మాట్లాడండి. అస్సలు ముందర సిద్ధార్థ లేకుండా నేను మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడమే తప్పు” ఆమెకు తాను చేస్తున్న పనులేమీ నచ్చడం లేదు, తనని తాను సమర్ధించుకోవాల్సిన అవసరం రావడం ఆమెకు చాలా బాధను కలిగించింది.

“ఒకే అయితే అతను వైజాగ్‌లో ఉన్న సమయంలో అతడి నుంచి మీకేమైనా సమాచారం తెలిసిందా. అతడికి ఏమైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని మీకు ముందుగానే తెలిసిందా” సూటిగా అడిగాడు చక్రి. లేదన్నట్లుగా ఆమె తలూపింది. తనకు తెలీకుండానే తాను ఊబిలోకి కూరుకుపోతున్నట్లుగా ఆమెకు అనిపించింది.

 “ఒక్కసారి గత ఆరు నెలలుగా మీ కాల్ రికార్డ్స్ చెక్ చెయ్యచ్చా?” కొంచెం నెమ్మదిగా అడిగాడు చక్రధర్.

“ఈజ్ ఇట్ ఆఫ్ ద రికార్డ్” అడిగింది ప్రియాంక. ‘ప్చ్’ అతను పెదవి విరిచాడు

“దెన్ ప్రోబబ్లీ యూ షుడ్ కాంటాక్ట్ మై లాయర్. ఐ థింక్ వీ హావ్ నథింగ్ ఎల్స్ టూ టాక్” ఆమె అతని వంక సూటిగా చూస్తూ చెప్పింది. అతను ఇంక ఆమెను ఎక్కువగా మాట్లాడించకుండా అక్కడ నుండి బయటపడ్డాడు.

ఇంకాసేపు అక్కడే ఉంటే వాళ్ళ సెక్యూరిటీని పిలిపిస్తుందేమో అని చక్రధర్ భయపడ్డాడు. ప్రియాంక కళ్ళలో అప్రయత్నంగా నీరు చేరింది, ఏమి చెయ్యాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఆమెను రాహుల్‌ని వాళ్ళ ఇంటి దగ్గర కలుసుకోవాలని అనుకుని అతని సెక్రెటరీని సంప్రదించింది.

(సశేషం)

Exit mobile version