[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది 19వ భాగం. [/box]
అధ్యాయం- 19
[dropcap]అం[/dropcap]దరూ ఊహించినట్లుగానే ఢిల్లీలోని హైకమాండ్ రాహుల్‌ని తప్పించి ఎంతోకాలంగా పార్టీలో ఉండి మెప్పు పొందిన చంద్రశేఖర్ అనే ఒక డమ్మీ అభ్యర్ధిని అధ్యక్షుడిగా చేసారు. అదే క్షణంలో అతడినే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి ప్రజలను ఆశ్చర్యపరిచారు. చంద్రశేఖర్ పట్ల ప్రజల్లో ఎవరికీ దురభిప్రాయం లేకపోయినా ఆయన వల్ల పెద్దగా ప్రయోజనం లేదని ఏ విషయంలోనైనా అతనికి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉండకుండా ఢిల్లీ నుండి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వోటర్లు అందరూ అభిప్రాయపడ్డారు.
ఇంత తక్కువ సమయంలో జనసమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజలు స్వాగతించలేకపోయారు. రాజకీయ పండితులు అంతా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర నష్టం ఏర్పడుతుంది అనే అభిప్రాయం వెలిబుచ్చారు. దీనికి సమాధానంగా రాహుల్ జనసమాజ్ పార్టీ నుండి బయటకు వచ్చెయ్యడం జరిగింది, హనుమంతరావుతో కలిపి కేబినెట్లో మంత్రిపదవి నిర్వహిస్తున్న చాలామంది అదే బాటలో రాహుల్‌తో చేరారు.
నాచిరెడ్డి, ప్రియాంక, రాహుల్, హనుమంతరావు వీరందరి కలయికతో ఏర్పడిన రాష్ట్రీయ జనసమాజ్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఉద్భవించింది.
రాష్ట్రంలో ఇప్పుడు మూడు ప్రధాన రాజకీయ పక్షాలు ఉన్నాయి
సిద్ధార్థ నేతృత్వంలోని జె.హెచ్. పార్టీ (జె.హెచ్.పి),
చంద్రశేఖర్ నాయకత్వంలో జనసమాజ్ పార్టీ (జే ఎస్ పీ),
రాహుల్ అధ్యక్షతన రాష్ట్రీయ జనసమాజ్ పార్టీ (ఆర్ జే ఎస్ పీ), దీనికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా హనుమంతరావు గారు ఎన్నుకోబడ్డారు.
ఈ ముగ్గురిలో ఒకరినిమించిన వారు ఒకరుగా మీడియా అభివర్ణించింది. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాలు ముదిరి పాకానపడ్డాయి అని వివిధ సభల్లోనూ, కార్యక్రమాల్లోనూ పాత్రికేయులు ప్రజలందరికీ తమతమ కథనాల ద్వారా వివరించారు.
“ఆ ముగ్గురిలో ఎవరికి ఓటేసినా పెద్ద సమస్యేమీ లేదు, పేదవాడికి ఒరిగింది లేదు. ఎందుకంటే ప్రాజెక్టులని, ఉపాధని ఒకళ్ళు భూమి అని నైపుణ్యం అంటూ మరొకరు, ఇంకొకరు ఇంకొక విధంగా ప్రచారం చేస్తున్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తరువాత అందరిదీ ఒకేబాట. రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశం మీద పరిస్థితి ఇదేవిధంగా ఉంది అయినా వాళ్ళనని లాభంలేదు.
మనమందరం మనుషులం రా, ఎంత నిజాయితీగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోపెట్టినా ఆఖరికి అతను మనకి వ్యతిరేకంగా ఉన్నాడు అని ఎన్నికలు అయిపోయిన తరువాత అనిపిస్తుంది. ఒకవేళ అలా అనిపించకపోయినా అనిపించేలా చెయ్యడానికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తమ శక్తివంచన లేకుండా మనలాంటి వారికి అలా అనిపించేలా చేస్తారు.
మొత్తంమీద పదికొట్లున్న మన రాష్ట్రజనాభా, నూటపది కొట్లున్న దేశజనాభాలో అందరినీ సమన్వయపరిచి, ఒకత్రాటి మీద నడిపించి ఏకాభిప్రాయం తీసుకురావాలంటే మనుషుల విషయం వదిలేయ్ ఆ దేవుడి తరం కూడా కాదు.
అందుకే స్వతంత్రం వచ్చి ఇంతకాలం అయినా కానీ మనదేశంలో మొత్తం రిజిస్టర్డ్ ఎలెక్టోరేట్ లోని వోటింగ్ కేవలం అరవై శాతం మాత్రమే నమోదవుతోంది, అంటే మిగిలిన నలభైశాతం మందికి ఏ విధమైన అభిప్రాయం లేదనా, ఉన్నా వారి అభిప్రాయానికి విలువ లేదనా? అలాంటిదేమీ కాదు దానికి కారణం డెమోక్రసీ అని మనం ఏర్పరుచుకున్న వ్యవస్థ.
కఠినంగా అనిపించినా ఇదొక నిజం సెంట్రలైజ్డ్ డెమోక్రసీ యుటిలైజెస్ ఎవ్రీ అదర్ ఐడియాలజీ టూ ఇట్స్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫైనల్లీ ఎక్స్ప్లాయిట్స్ ఎవ్రీవన్ ఆఫ్టర్ దీ రిసల్ట్. ఇట్స్ ది వే డెమోక్రసీ ఆపరేట్స్ అండ్ ఇట్స్ ది ఓన్లీ వే. కనుక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ట్రై టూ హెల్ప్ ఇట్ ఏజ్ బెస్ట్ ఏజ్ యూ కెన్.
వ్యవస్థలో ఉన్నంతకాలం దానికి సహకరించడం తప్ప వేరే మార్గం లేదు. నాయకుడు, ప్రజలూ అని తేడా లేకుండా అందరూ ప్రజాస్వామ్యం నుండి ప్రతీ ఒక్కరూ లాభపడతారు, ప్రజాభిప్రాయాన్ని నిరంతరం వ్యవస్థలో ఉన్నవారు వివిధ మాధ్యమాల ద్వారా ప్రభావితం చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో నేను ప్రియాంక గారితో ఏకీభవిస్తాను. ఆమె మొదటి నుంచీ చెప్తున్నదే స్వశక్తి పైన నమ్మకం అదే ఉంటే మనకి రాజకీయాలు అవసరం లేదు” ఒక యువకుడు ఆవేదన ఒక టీవీ ఛానెల్ వారు ప్రసారం చేసారు.
చాలామంది ఇలాంటి అభిప్రాయాలను కొట్టిపడేసారు, పనీపాటా లేనివారు అవగాహనారాహిత్యంతో చేసే వ్యాఖ్యలని వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అంతేకాకుండా ప్రియాంక లాంటివారు చేసుకునే స్వీయ ప్రచారం అని సిద్ధార్థతో కలిపి జేఎస్పీ వారు కూడా అందరికీ చెప్పడానికి చూసారు.
కానీ ఏదేమైనా ఎంత విప్లవాత్మకంగా అనిపించినా ఒక ఆలోచనను మనం ఎప్పటికీ తక్కువగా చూడలేము అని అభిప్రాయపడిన ప్రియాంక ఆ యువకుడిలాంటి చాలామంది వ్యక్తుల ఆవేదనను తనతో తాను పోల్చిచూసుకుంది. నిశ్చేతన వ్యవస్థ కన్నా చైతన్యం గొప్పది అని ఆమె అబిప్రాయపడింది.
తాను ఏ విధంగా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి అని కోరుకున్నదో అదే విధంగా వస్తున్నందుకు ఆమె ఆనందపడింది. విజయం సాధించడానికి తాను ఎంచుకున్న మార్గం గురించి ఆమె ఎప్పుడూ బాధపడింది లేదు, ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా తన ఆలోచన ప్రజల్లోకి వెళ్ళగలిగినందుకు ఆమెకు చెప్పలేని ఆనందంగా ఉంది.
రాహుల్ పార్టీ ఆర్జేఎస్పీ ఖచ్చితంగా గెలుస్తుంది అని ఆమెకు అనిపించింది. రాష్ట్రం మొత్తం ఒక సంబరంలా జరుపుకుంటున్న ఈ ఎన్నికలు విపరీతమైన ప్రచారాలతో, బలాబల ప్రదర్శనలతో, చెదురుమదురు ఘటనలతో, అల్లర్లతో, వ్యక్తిగత విమర్శలతో, బహిరంగ సభలతో, సినిమా తారల గ్లామర్‌తో కళకళలాడుతూ ఉంది.
అందరూ తమ శక్తివంచన లేకుండా ఏదో ఒక విధంగా వేల్యూ ఎడిషన్ కోసం చూస్తుండడం వలన రాష్ట్రంలో ఒక కొత్త వాతావరణం ఏర్పడినట్లుగా రాజకీయ పండితులు అభిప్రాయపడ్డారు. ఏది జరిగినా మంచికే అన్వయించుకోవడం వలన మాత్రమే ప్రయోజనం ఉంటుంది.
***
ముంబైలోని అతిపెద్ద ఐదు నక్షత్రాల హోటల్స్‌లో ఒకటైన ఆర్చిడ్ హోటల్‌లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఐదు వందల పైగా రూమ్స్ కలిగిన ఆ హోటల్‌లో మొత్తం పై నాలుగు అంతస్తులు ఆ రోజు సాయంత్రం జరగబోయే మీటింగ్ గురించి ముందుగానే బుక్ చేయబడి ఉన్నాయి. ఈ మీటింగ్ గురించి బయటవారికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తెలీకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు అక్కడ సిబ్బంది ఇంకా ఇతర ఈవెంట్ మేనేజ్మెంట్ టీం. మొత్తం మీద చెప్పాలంటే బయటకు బాహాటంగా కనిపిస్తున్నా కానీ అదొక అండర్ గ్రౌండ్ మీటింగ్ లాంటిది.
ప్రైవేట్ సెక్యూరిటీ ఆ భవనం మొత్తాన్ని జల్లెడ పడుతోంది. మన ప్రభుత్వం తరుఫున పనిచేసే రక్షణశాఖ ఇతర పోలీసు శాఖలకు తీసిపోని విధంగా అక్కడున్న వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఆ హోటల్ యాజమాన్యం వారికి అక్కడ జరగబోయే సమావేశం గురించి తెలుసు లాగుంది అందుకే వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ద కనబరుస్తున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంట నుండీ అక్కడికి ఒకొక్కరుగా అతిథులు రావడం మొదలుపెట్టారు. వారందరూ మన దేశంలో మొత్తం అన్నిచోట్ల వ్యాపారాలున్న బడా బడా పారిశ్రామికవేత్తలు, సినిమా ప్రొడ్యూసర్స్, రాజకీయ నాయకులు రియాల్టర్స్ మొదలగువారు. వచ్చిన ప్రతీవారినీ హోటల్ వారు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అదే సమయంలో ఎవరినీ కూడా వదలకుండా పర్యవేక్షిస్తున్నారు. ఆ రోజు జరగబోయే ఆ సమావేశంలో వారందరూ ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోబోతున్నారు. దాదాపు మూడు వందల పైగా అతిధులు అక్కడికి వస్తారు అని అంచనా వెయ్యడం జరిగింది.
కేవలం ఆ ఒక్కరోజు జరగబోయే ఆ మీటింగ్‌కి మాత్రమే కనీసం కొన్ని కోట్ల డబ్బు ఖర్చు అవుతుందేమో అన్నట్లుగా ఉంది అక్కడ వ్యవహారం. ప్రతీ ఒక్కరూ ఆసక్తిగానూ, కొంచెం భయం భయంగానూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజు అక్కడ అధ్యక్షత వహించబోతున్నది ఒక తెలుగువారు కావడం విశేషం. భూషణరావు గురించి అక్కడవారికి కూడా పూర్తిగా తెలుసు, అతడు ఎన్నో సార్లు ఎన్నో వ్యాపారానికి సంబంధించిన సమావేశాలు హోటల్ వారి సహకారంతో అక్కడ నిర్వహించాడు.
అంతర్జాతీయ ఎగుమతీ దిగుమతులకు ఆ ప్రదేశాన్ని ఒక హబ్ కింద వాడుకుంటాడు భూషణరావు. అక్కడికి వచ్చేవారు అందరూ అరిస్ట్రోక్రాట్స్ కావడం వలన సాధారణంగా ఇటువంటి మీటింగ్స్ ఎవరిదైనా ఇంట్లో లేదా రహస్యమైన అతిథి గృహాలలో జరుగుతాయని అనుకునేవారు ఉంటారు, కానీ అటువంటి అవసరం లేకుండా ఎవరికీ అనుమానం రాకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగింది.
దానికి కారణం ఏంటంటే కొన్నికొన్ని అసాంఘిక కార్యకలాపాలను చెయ్యగలరు అని అనుమానం కలిగిన వారిపైన, వారి పేరన ఉన్న అన్ని ప్రాపర్టీస్ పైనా పోలీసులు ఇతర జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీలు అనుక్షణం నిఘా వేసి ఉంచుతారు. అందుకే వారిని పక్కదోవ పట్టించడానికే ఇలాంటి సమావేశాలు హోటల్స్‌లో జరుగుతూ ఉంటాయి.
ఆ హోటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అవసరమైన అంతర్జాతీయ జాతీయ అతిథులకు రెంటల్ బేసిస్ మీద చాపర్ ప్రోవైడ్ చెయ్యడం, అంతేకాకుండా సొంత చార్టెడ్ ఎయిర్లైనర్స్ కలిగిన వారికి అక్కడ ల్యాండ్ అయ్యే అవకశం కలిగించడం. ఇప్పటివరకూ ఆ ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించి ఒక అవగాహనకు రాగలిగారు జగదీశ్వరరావు, సుదర్శన్ బృందం. అక్కడంతా సీసీ టీవీలు ఇతర ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలు ఏర్పాటు చెయ్యబడి ఉంది.
ఆ సందడి మొత్తాన్ని సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రొఫెషనల్ సెక్యూరిటీ టీం పర్యవేక్షిస్తూ ఉంది, అక్కడ నుంచి చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే అవకాశం ఉన్నంత పటిష్టంగా ఉంది భద్రత. ప్రభుత్వం వారు కూడా ఈ స్థాయి భద్రతా ఏర్పాట్లు చెయ్యలేరేమో అని చక్రధర్‌కు అనిపించింది. మధ్యాహ్నం రెండున్నర ఆ సమయంలో దాదాపు రెండు వందల మంది పైగా వేంచేసి ఉన్న కాన్ఫరెన్స్ హాల్‌లో ఒక గంభీరమైన స్వరం వారిని ఉద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టింది, అందరికీ అర్ధమయ్యే భాషలో అక్కడ ప్రసంగం జరుగుతోంది
“ఫ్రెండ్స్, ది షో ఈజ్ అబౌట్ టూ బిగిన్. సాయంత్రం నాలుగు గంటల సమయానికి మనం ఎంతోసేపటినుంచీ ఎదురు చూస్తున్న మన నాయకుడు రాబోతున్నాడు అని సమాచారం అందింది. ఇక్కడికి విచ్చేసిన వారు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మన కలయికతో దేశంలోనే పారిశ్రామిక, వ్యాపార తదితర అనుసంధాన రంగాలు ఊపందుకుని మన అందరికీ తరతరాలుగా తరగని ఆస్తిని, అధికారాన్నీ అందిస్తాయి అని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అంతవరకూ ఇక్కడ ఉన్న అన్ని సౌకర్యాలను, అందాలనూ, ఆనందాలనూ పూర్తిగా వినియోగించుకుంటూ సేద తీరండి. ఈ సమావేశం ముగిసిన తరువాత మనకి అంత సమయం కూడా దొరకకపోవచ్చు” అక్కడ చిన్నగా నవ్వులు వినిపించాయి. అదే హాల్‌లో ఒక మూలగా అందరికీ అవసరమైన ఘన ద్రవపదార్ధాలు అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రదేశం అంతా రౌండ్ టేబుల్స్ పరచబడి ఉన్నాయి.
ఒకొక్క టేబుల్ చుట్టూ కొంతమంది ఒక ప్రాంతానికి చెందిన, లేదా ఒక రంగానికి చెందిన పెద్దమనుషులు కూర్చుని ఉన్నారు. కనీసం ఒక ముప్పైమంది వెయిటర్లు అక్కడ ఉన్న అందరికీ అవసరమైన అన్నీ అందిస్తూ చేతుల్లో పళ్ళాలతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు, వారిలో కొంతమంది అమ్మయిలు కూడా ఉన్నారు. అక్కడ ఉన్న వారిలో కొంతమంది అప్పుడే ఆల్కహాల్ పుచ్చుకోవడం మొదలుపెట్టారు.
“ఈరోజు ఆఖరిలో మన అందరికీ ఒక ఆశ్చర్యం కలిగించే విషయం తెలియబోతోంది. దాని ద్వారా మన అందరికీ ఎంతో ఉపయోగం జరగబోతోంది, మన వ్యాపారాల అభివృద్ధికి ప్రభుత్వం మన గుప్పిట్లో ఉండడానికి అవసరమైన విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అని నాకు అనిపిస్తోంది. దీనికి మా రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకోబోతున్నాం. దాని వివరాలు మన నాయకుడు వచ్చిన తరువాత ఆయన నోటిద్వారానే వినాలని మీతోపాటుగా నేను కూడా ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను” వారందరినీ ఉద్దేశించి అన్నాడు ఆ సభను హోస్ట్ చేస్తున్న భూషణరావు,
దేశవ్యాప్తంగా అతనికున్న లావాదేవీలతో అండర్ గ్రౌండ్ సర్కిల్‌లో అతని గొప్పతనం ఏంటో, అతని చరిత్ర ఏంటో తెలీనివారు అక్కడ లేరు. అంతేకాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జోగేశ్వరరావు చాపర్ క్రాష్ వెనకాల కూడా అతని హస్తం ఉన్నట్లుగా చీకటిరాజ్యంలోని పెద్దలందరికీ అనుమానం కూడా ఉంది, అందుకే అతడంటే ఒకరకమైన భయం కూడా వారికి కలిగి ఉండడం సహజమే. కానీ ఇప్పుడు అతని వెనకాల కూడా ఇంకొకడు ఉన్నాడంటే ఆ వ్యక్తి ఇంకెంత పవర్ఫుల్ అయ్యుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
అతడు ఆ మాటలు అనడంతో అక్కడ అదే హాలులో ఉన్న జగదీశ్వరరావు బృందం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చూస్తుంటే అక్కడేదో పెద్ద పథకం రూపుదిద్దుకోబోతోంది అని వారందరికీ అనిపించింది. వారి అనుమానాన్ని బలపరుస్తున్నట్లుగా అక్కడ చెవుల్లో వైర్లెస్ హియరింగ్ ఎక్విప్మెంట్‌తో నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని, నల్లటి సూట్ వేసుకున్న గన్మెన్లు హడావిడిగా ఆ ప్రదేశం అంతా కలియదిరుగుతున్నారు.
వారిదగ్గర మారణాయుధాలు కూడా ఉండడం చక్రధర్‌ను ఆశ్చర్యపరిచింది. పట్టపగలే అయినా ఆ ప్రదేశం మొత్తం చీకటిగా ఉండి పసుపు, గోధుమ కలగలిసిన వర్ణంలో కాంతి ప్రసరింపజేసే లైట్లు ఆ ప్రదేశం అంతా వ్యాపించి ఉన్నాయి. ఒక వెయిటర్‌ని పిలిచి బ్లూ బెర్రీ ఫ్రాస్ట్ పంచ్ తెప్పించుకున్నాడు చక్రధర్. జగదీశ్వరరావు, సుదర్శన్ అతని దగ్గరే రౌండ్ టేబుల్‌లో కూర్చుని ఉన్నారు, మనసులో అందరికీ భయం ఉన్నప్పటికీ ఎవరూ వ్యక్తపరచడం లేదు. అక్కడున్న వారందరినీ గమనిస్తూ అడిగాడు జగదీశ్వరరావు “ఇది చూస్తుంటే ప్రభుత్వంతో సంబంధం లేని చాలా హై ప్రొఫైల్ మీటింగ్ లాగుంది దీనికి నువ్వు ఎలా ఎంట్రీ సంపాదించగలిగావు”
“ఏముంది సార్. ఇదొక ఇల్లీగల్ సిండికేట్ లాంటిది, దీంట్లో ఎంత ఎక్కువమంది ఇన్వెస్ట్ చేస్తే అంత ప్రయోజనం ఉంటుంది అన్న విషయం ఇలాంటి సిండికేట్‌లు రన్ చేసే వాళ్ళకి తెలీకుండా ఉంటుందా? అందుకే మా కంపెనీ నుండి కూడా మేము సహకరించడానికి ఇష్టపడుతున్నట్లు వాళ్ళకి తెలియజేసాం, వెంటనే ముందు వెనకా ఆలోచించకుండా మనకి ఆహ్వానం పంపించారు. మంచిపని చెయ్యాలన్నా చెడ్డపని చెయ్యాలన్నా ఎలాగైనా మనుషుల సహకారం ఉండాలి కదా” చెప్పాడు సుదర్శన్.
ఆశ్చర్యంగా అతనివైపు చూస్తూ “అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ ఐన మనం ఇక్కడికి ఈ సిండికేట్‌లో మెంబర్స్ కింద రావడం జరిగింది అన్నమాట. అంటే నా ఉద్దేశం ఇప్పుడు మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు కనుక మీరు కూడా గవర్న్మెంట్ సర్వెంట్ కింద లెక్క” అడిగాడు జగదీశ్వరరావు.
“అవును, కాకపోతే వాళ్ళు మనల్ని పిలిచినా ఉద్దేశం ఒకటి, మనం ఇక్కడికి వచ్చిన ఉద్దేశం మరొకటి. ముక్కుసూటిగా వెళ్ళడం ఎప్పటికైనా రిస్క్ అని ఈ బిజినెస్‌లో చేరిన మొదటిరోజునే నేర్చుకున్నాను. కాకపోతే నాకు ఇక్కడికి వారికీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే నేను ప్రభుత్వానికి ఉపయోగపడదాం అనుకుంటాను, ఇక్కడికి వచ్చినవాళ్ళు వాళ్లకి మాత్రమే ఉపయోగపడాలి అనుకుంటారు” చెప్పాడు సుదర్శన్. సాలోచనగా తల పంకించాడు జగదీశ్వరరావు
“నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకరకంగా ఈ అంతర్గత వ్యవస్థ కార్యకలాపాలతో సంబంధం ఉండి ఉంటుంది. కనుక ఒకోక్కరి వివరాలు మనం తెలుసుకోగలిగితే భవిష్యత్తులో మనకి చాలా ఉపయోగపడుతుంది. కనుక చక్రీ నువ్వు ఆ పనిలో ఉండడం బెటర్, అందరి ఫొటోస్ డీటెయిల్స్, ఈ వ్యవస్థతో వారి డీలింగ్స్ ఈ విషయాలన్నీ నాకు కావాలి. ఏ ఒక్కటీ మిస్ అవ్వకూడదు” చెప్పాడు ఆయన. అంతటితో వారిద్దరినీ అక్కడ వదిలేసి అక్కడ గుంపులు గుంపులుగా ఉన్న వ్యక్తుల మధ్యలో మాయం అయ్యాడు చక్రధర్.
“నాకెందుకో మనం కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది అనిపిస్తోంది సార్, ఇక్కడికి వచ్చేవరకూ నేను కూడా ఇంతగా బందోబస్తు ఉంటుందని ఊహించలేదు. నేను ఇప్పుడే వైజాగ్‌లో ఉన్న మా సెక్యూరిటీ టీంను కూడా సిద్ధం చేస్తాను. ఇలాంటి విషయాలు టాకిల్ చెయ్యడానికి బలం, బలగం అవసరమైన వెపన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర” అతను చెప్పిన మాటలకు కళ్ళు పెద్దవి చేసుకుని చూసాడు జగదీశ్వరరావు.
“ఖంగారు పడకండి సార్ మీ ముందర ఈ విషయం ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే నేను చేసే ప్రతీపనిలోనూ అవసరమైన పర్మిషన్స్ లైసెన్సెస్ తీసుకునే ఉంటాను. ఇలాంటి అవసరం ఎప్పుడైనా వస్తుందని చెప్పి మా టీం మొత్తానికీ నేను సెల్ఫ్ డిఫెన్స్ కాంబాట్ ట్రైనింగ్ ఇప్పించాను” సుదర్శన్ ఆయనకు వివరించాడు, సరే అన్నట్లుగా తలూపాడు జగదీశ్వరరావు.
“బాబూ ఇలా రామ్మా” అక్కడున్న వారిని రహస్యంగా ఫోటోలు తీస్తున్న చక్రధర్‌ను ఉద్దేశించి పిలిచాడు ఒక పెద్దాయన.
ఆయన వయసు కనీసం ఏభై సంవత్సరాలు పైనే ఉంటుంది, చుట్టూ నలుగురు పెద్ద మనుషులు, ముప్పై, ముప్పై ఐదు ఈ మధ్య వయసు ఉన్న ఒక స్త్రీ కూడా కూర్చుని ఉన్నారు
“నన్నా సార్” అనుమానంగా అడిగి ఆయనవైపు కదిలాడు చక్రధర్.
ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ తనకి పరిచయం లేకపోవడం తనని ఆయన పిలిచేసరికి అతనికి కొంచెం విచిత్రంగా అనిపించింది. అందులోనూ తామీ సమావేశానికి రహస్యంగా వచ్చామని ఇందాక సుదర్శన్ మాటలను బట్టి తెలిసింది. తమ గురించి నిజాలు బయటపడి తాము ఒక కేసు విషయం పరిశోధించడానికి ఇక్కడికి వచ్చాం అని ఎవరికీ తెలిసినా మొదటికే మోసం వస్తుంది.ఇక్కడ తన ఉద్యోగం, తన గౌరవం ఇవేమీ లెక్కలోకి రావు.
తనకన్నా బలమైనవారు సాయుధులు తమ కళ్ళముందే ఎంతో ధైర్యంగా తిరుగుతున్నారు ఏమైనా తేడా పాడా వస్తే కాల్చిపాడేస్తారేమో అని కూడా అతనికి అనిపించింది. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా ప్రవర్తించడం ఎంతో అవసరం
“నిన్నేనయ్యా బాబూ, ఓ రత్నవేల్ డీఎఫ్టీ లాగ తెగ ఫోటోలు తీసేస్తున్నావ్ ఇందాకటి నుంచీ. చూడ్డానికి తెలుగోడిలా ఉన్నావ్, కొంచెం మమ్మల్ని కూడా ఫోటో తీసావనుకో సరదాగా అందరికీ చూపించుకుంటాం. ఈ ఏర్పాట్లేవో బానే చేశాడయ్యా భూషణరావు, ఒక్కో టేబుల్‌కీ ఒక్కో ఫోటోలోడిని పెట్టాడేంటి కొంపతీసి.” గదుముతున్నట్లుగా ఉన్న అతని స్వరం చాలా గంభీరంగా వినవచ్చింది.
అంటే ఇతను తనని ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నాడు అన్నమాట, పైకి తెలీకపోయినా అతని మాటలను బట్టి చూస్తే చాలాసేపటి నుంచి తన చర్యలను గమనిస్తున్నట్లుగా అర్థం అయ్యింది, అయినా అది కూడా ఒకందుకు మంచిదే తనమీద ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుంది.
“అబ్బే తప్పకుండా తీస్తానండీ, మేడం గారు మీ వైఫా అండీ” మాటలు కలుపుతున్నట్లుగా అడిగాడు, అక్కడున్న వారు అతనివంక విచిత్రంగా చూస్తున్నారు.
“అబ్బే కుర్రాడివైనా టెస్ట్ లేదయ్యా. ఈ ఫిగర్ ఎలా ఉంది వైఫ్ లాగుందా” చక్రధర్‌ను ఉద్దేశించి అడిగాడు.
ఆయన స్వరం కొంచెం మత్తుగా వచ్చింది, ఆయన కొంచెం తాగి ఉన్నాడని అతనికి అర్ధమయ్యింది. అందుకే ఇందాక అందరూ తనవంక విచిత్రంగా చూసారని అర్ధమయ్యింది.
“వీళ్ళందరూ మన ఫ్రెండ్స్, వీళ్ళకి తెలుగు రాదు మనకి హిందీ రాదు, కాపోతే వీళ్ళకి పెద్దపెద్ద వ్యాపారాలున్నాయి. నీ ఫేసు చూస్తుంటే మంచోడిలాగున్నావ్. మన కుర్రాడు ఈరోజు రాలేదు నువ్వు ఈ మీటింగ్ అయినంతవరకూ నాతోనే ఉండి మనకి కొంచెం ఈళ్ళతో హెల్ప్ చేసావనుకో బాగుంటాది అనమాట” ఊగుతూ చెప్పాడు ఆయన.
ఇతని మాటల చూస్తుంటే కొంచెం తిక్కతిక్కగా అనిపిస్తోంది, పైగా మద్యం మత్తులో ఉన్నాడు కూడా. ఎక్కువ సేపు ఇతని దగ్గరుంటే తనకే నష్టమని అతడిని ఏదో మభ్యపెట్టి అతడు పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు.
సీసీ టీవీ ఫుటేజస్ అన్నీ ఎక్కడ ఏ విధంగా ఎవరిని కవర్ చేస్తాయో జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు చక్రధర్. కొంచెం దూరంలో అక్కడకి వచ్చినవారి వస్తువులు భద్రపరుచుకోవడానికి ఒక పెద్ద గదిలాంటిది ఏర్పాటు చేసారు, అక్కడ చాలా ఐరన్ కేబినెట్స్ ఉన్నాయి.
చక్రధర్ ఆ కేబినేట్స్‌లో ఉన్న వస్తువులని ఒకొక్కటిగా తీస్తూ అందులో అవసరమైన అవసరమైన సమాచారం తన సెల్ ఫోన్ లోకి ఎక్కించుకుంటున్నాడు. చాలా మంది రహస్య జీవితాల గురించి అతనికి తెలుస్తోంది. అక్కడ సెక్యూరిటీ లేకుండా ఉన్నప్పుడు ఒక కోట్ తీసి ఏదో పరిశీలిస్తూ ఉన్నాడు
“ఆ అదే బాబూ, ఆ కోట్ ఇలాగిచ్చేయి వెళ్ళిపోతాను” అని తను అప్పుడే బయటకి తీసిన కోటును తీసుకుని వెళ్తూ “ఆ తమ్ముడూ నువ్వా, నువ్వు ఫోటోగ్రాఫర్ కం వాచ్‌మన్‌వి కూడానా చూడడానికి అంత అందంగా, పొడుగ్గా బలంగా ఉన్నాడు చూస్తేనేమో ఇక్కడ ఇన్ని పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నావు నీ సంగతేంటో నాకు అర్థం కావడం లేదు”
ఇందాకా తనను పలకరించిన వ్యక్తి తన పక్కనున్న అమ్మాయితో అనడం చక్రధర్ చెవిన పడింది. అమ్మో ఇతను మళ్ళీ వచ్చాడు తనని పట్టుకున్నాడంటే అనవసరంగా టైం వేస్ట్ అని మనసులో అనుకుని అతను పిలుస్తున్న వినిపించుకోకుండా కంట్రోల్ రూమ్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒకరితరువాత ఒకరుగా తెరమీద కనిపిస్తున్న అన్ని ముఖ్యమైన గదుల్లోని దృశ్యాలు నిరంతరం నలుగురైదుగురు ధృడకాయులు పర్యవేక్షిస్తూ ఉన్నారు.
వాళ్ళ కదలికలను జాగ్రత్తగా గమనించి వాళ్ళు లేని సమయం చూసుకుని సుదర్శన్ తనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డివైజ్ ను అక్కడున్న మెయిన్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేశాడు.
“సుదర్శన్ గారు మీరు చెప్పినట్లుగా ఆ డివైజ్ ను మెయిన్ సర్వర్‌కి కనెక్ట్ చేసాను. ఇప్పుడు ఇక్కడ లైవ్ ఫీడ్‌ని మీ వైజాగ్ ఆఫీస్‌కి అప్లింక్ చెయ్యమని చెప్పండి” అక్కడ నుంచి పర్యవేక్షిస్తున్న వారికి అనుమానం రాకుండా బయటపడడానికి ప్రయత్నిస్తూ సుదర్శన్‌కి ఫోన్‌లో చెప్పాడు చక్రధర్. అయితే జరగవలసిన నష్టం అప్పటికే జరిగిపోయింది, ఆ గార్డ్స్ తన ఉనికిని పసిగట్టేసి తను మెయిన్ సర్వర్‌కి ఏదో చేసాడని గ్రహించి తన వెంట పడ్డాడు.
పరుగుపరుగున వెళ్తున్న అతనికి దేవుడు పంపించినట్లు ఎలివేటర్ అప్పుడే. దాన్ని చేరుకునేలోపు తన మీద పడబోయిన గార్డ్‌ని వెనక నుండే మోచేతితో గుడ్డి తనకి ఎదురుగా హౌస్ కీపింగ్ కోసం పెద్ద చక్రాల బందిలాంటిది తోసుకెళ్తున్న అమ్మాయిని గుద్దుకున్నాడు. దానితో ఆ చక్రాలబండి ఒక్కసారిగా తలకిందులైంది, ఇంతలో తేరుకున్న ఆ గార్డ్స్ వరసగా వచ్చి తనను వెనక నుండి పట్టుకున్నారు.
ఇద్దరు పట్టుకోగా మూడవ వ్యక్తి పిడికిలి బిగించి తన కడుపులో కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈలోపులో తేరుకున్న చక్రధర్ తన పెడరెక్కలు విరిచిన ఇద్దరినీ బలంగా ఎదరకి లాగి తనని కొట్టడానికి వస్తున్న మూడవ వ్యక్తి మీదకి వాళ్ళిద్దరినీ విసిరాడు. ఊహించని ఈ చర్యకు బిత్తరపోయిన వాళ్ళు తేరుకునే లోపే గాలిలోకి ఎగిరి ఫ్లయింగ్ కిక్‌తో వారి ముగ్గురినీ నేలకూల్చాడు.
వారు ముగ్గురూ మళ్ళీ లేవకుండా అక్కడ దూరంగా పడిఉన్న చక్రాలబండి దురుసుగా తోసుకుని వచ్చి వారిమీడకి విసిరాడు. గట్టిగా మూల్గులు వినిపించి ఆ ముగ్గురూ స్పృహ కోల్పోయారు. ఆ మరుక్షణం చెదిరిన తన బట్టలను సరిచేసుకుని లిఫ్ట్ వైపు పరిగెట్టాడు, తన అదృష్టం కొద్దీ లిఫ్ట్ ఇంకా అదే ఫ్లోర్‌లో ఉంది. అక్కడ కొంచెం చీకటిగా ఉండడం వల్ల ఆ ముగ్గురు గార్డ్స్ తనని గుర్తుపట్టలేరు అని తెలుసుకుని తృప్తిగా నిట్టూర్చాడు చక్రధర్.
ఈ మొత్తం సంఘటన జరగడానికి సరిగ్గా నాలుగు నిమిషాలు సమయం అయ్యింది అంతే. అప్పుడు సమయం నాలుగు గంటలు అవ్వడానికి ఇంకొక పదినిమిషాలు మాత్రమే ఉంది. ఆఖరి ఫ్లోర్ లోని కాన్ఫరెన్స్ రూమ్‌కి చేరుకుంటున్న సమయంలో వెనక ఎవరో తనని పిలుస్తున్నట్లు అనిపించింది
“తమ్ముడూ ఆ నేనే, ఏంటమ్మా ఇందాకా ఫోటోలు తీస్తానని చెప్పాపెట్టకుండా జంప్ ఐపోయావ్” ఇందాకా తనను ఇబ్బంది పెట్టిన వ్యక్తి మళ్ళీ పలకరించాడు, ఈఆరి అతను ఇద్దరు అమ్మాయిలను భుజాల చుట్టూ చేతులు వేసి రెండు చేతులుతోనూ పట్టుకుని ఉన్నాడు, అమ్మో ఈ జిడ్డుగాడి గొడవ మళ్ళీ మొదలైంది. కింద కంట్రోల్ రూమ్ దగ్గర పడిఉన్న గార్డ్స్ లేచారంటే ఇంక తనపని పూర్తయ్యినట్లే. అందుకే ఈసారి అతని మాటలు వినిపించినా వినిపించినట్లుగా
“కౌన్ హై తుం, క్యా బక్ బక్ కర్ రహే హై” అని హిందీలో మాట్లాడి అతడిని వదిలించుకుని దూరంగా పారిపోయాడు, తను వెళ్లి చక్రధర్ వాళ్ళను కలుసుకునే సమయానికి మైకులో భూషణరావు ఏదో అనౌన్స్ చేస్తున్నాడు.
“ఫ్రెండ్స్ ఇప్పుడే మన నాయకుడి చాపర్ ఈ హోటల్ టెర్రస్ మీద ల్యాండ్ అవ్వబోతోంది అని హోటల్ యాజమాన్యం వారు సమాచారం అందించారు. ఇక్కడ ఉన్న చాలామంది ఇప్పటివరకూ ఆయనను చూసి ఉండరు, సో ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పై ఫ్లోర్‌కి రావలసినదిగా కోరుతున్నాను. డోంట్ వర్రీ అబౌట్ ది సెక్యూరిటీ, ఎవ్రీ థింగ్ ఈజ్ టేకెన్ కేరాఫ్” అని చెప్పాడు భూషణరావు.
కొంత సేపటి తరువాత అతను కూడా మెల్లిగా పైన టెర్రస్ మీదకు వెళ్ళాడు. వారి నాయకుడు ఎవరో, ప్రతాప్ అప్పుడప్పుడూ తనతో చెప్పిన ‘పెద్ద బాస్’ ఎవరో తెలుసుకోవాలని సుదర్శన్ కూడా ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నాడు. స్టెప్స్ మీదుగా కొందరు లిఫ్ట్ మీదగా కొందరు ఇలా ఒకొక్కరిగా పైన టెర్రస్ మీదకు చేరుకున్నారు.
చాపర్ లాండింగ్‌కి అనువుగా మార్కింగ్ చెయ్యబడి ఉన్న ఆ ప్రదేశం ఒక విశాలమైన మైదానంలా ఉంది. పైనుండి కింద కాన్ఫరెన్స్‌కి వెళ్ళే మార్గం మొత్తం తాను ఇందాక కంట్రోల్ రూమ్ దగ్గర చూసిన గార్డ్స్ లాంటి వారు పహారా కాస్తూ ఉండడడం గమనించాడు చక్రధర్. జగదీశ్వరరావు, చక్రధర్, సుదర్శన్ వీరు ముగ్గురూ కూడా టెర్రస్ మీదనే ఉన్నారు, భూషణరావు తమ కనుచూపుమేరలో ఉండే విధంగా వారు జాగ్రత్తపడుతున్నారు.
అందరి కళ్ళూ ఆకాశం వైపు చూస్తున్నాయి, కారణం తమకి అందనంత ఎత్తులో దూరంగా కనిపిస్తున్న ఈసీ 155 హెలికాప్టర్ నెమ్మదినెమ్మదిగా తమను చేరుకుంటోంది. ఆశ్చర్యంగా ఆ చాపర్ వైపు చూస్తున్నాడు చక్రధర్. గంటకి మూడు వందల ఇరవై కిలోమీటర్లు అత్యధికవేగంతో ప్రయాణించగల ఆ కమర్షియల్ చాపర్లు మొత్తం భారతదేశంలోనే వేళ్ళమీద లెక్కపెట్టగలిగినంత తక్కువ సంఖ్యలో ఉంటాయి.
అలాంటిది ఒక ప్రైవేట్ వ్యక్తి దాన్ని వినియోగిస్తున్నాడు అంటే అతడు చాలా పవర్ఫుల్ అయి ఉండాలి, ఇదే విషయం సుదర్శన్‌తో చెప్పగా అతను అవునన్నట్లుగా తలూపాడు. చాపర్ ల్యాండ్ అయ్యింది మొట్టమొదటగా సెక్యూరిటీ గార్డ్స్ వెంట రాగా అందులో నుండి బయటకు దిగిన ప్రతాప్‌ను గుర్తు పట్టాడు సుదర్శన్.
అతనివెనకే ఇంకొకరెవరో వస్తున్నట్లుగా అతను వెనక్కి చూస్తున్నాడు. అక్కడ వాతావరణం అంతా ఉత్కంఠభరితంగా మారడం జగదీశ్వరరావు గమనించాడు. భూషణరావుతో కలిపి కొంతమంది పెద్దమనుషులు గన్మెన్లు వెంటరాగా చాపర్ దగ్గరకు వెళ్తున్నారు, ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఆ ప్రదేశం నుండి కొంచెం దూరంగా వచ్చాడు సుదర్శన్. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం ఒకవైపు అతి ముఖ్యమైన ఆ ఫోన్ కాల్ మాట్లాడాల్సిన అవసరం ఒకవైపు అతడిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.
“ఆ చెప్పు వంశీ, నీ టైమింగ్ చాలా గొప్పది. ఇక్కడ ఎవ్రీ మూమెంట్ చాలా టెన్షన్ టెన్షన్‌గా గడుస్తోంది”
“సార్ నేను విజయనగరం వెళ్ళాను సార్, అక్కడ తెలుసుకున్న సమాచారం చూస్తే మీరు షాక్ అవుతారు. ఇప్పుడే మీ మొబైల్‌కి ఒక ఫోటో పంపుతున్నాను చూడండి, ఆ తరువాత ఈ కేసులన్నిటికీ ఆన్సర్ మీకు దొరుకుతుంది. నేను ఇప్పుడు వైజాగ్‌లో మన ఆఫీసుకు చేరుకుంటున్నాను. మీరు పంపిన అప్లింక్ డీటెయిల్స్ అందాయి. ఆ సమావేశం అంతా మన సర్వర్స్ లోకి రికార్డ్ అవుతూ ఉంటుంది” అవతల నుంచి వంశీ తన చెప్పదలచుకున్నది చెప్పేసి అంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాడు.
ఈలోపు పైన టెర్రస్ మీద హడావిడి సద్దుమణిగి అందరూ కిందకు వెళ్ళినట్లు అర్థం అయ్యింది, జగదీశ్వరరావు చక్రధర్‌లు కూడా వారితో వెళ్లి ఉంటారని కూడా అనుకున్నాడు సుదర్శన్. తన మొబైల్ ఫోన్ లో వచ్చిన ఫోటో చూసిన సుదర్శన్ ఆశ్చర్యానికి అంతులేదు.
కారణం అది కొన్ని సంవత్సరాల క్రితం భూషణరావు చేయించిన ఆక్సిడెంట్‌లో మరణించిన కలెక్టర్ ‘అశోక్ త్యాగీ’ ఫ్యామిలీ ఫోటో. తన భార్యతో పాటు యవ్వన ప్రాయంలో ఉన్న ఒక అబ్బాయి, అమ్మాయి కూడా ఉన్నారు. ఆ అబ్బాయిని సునాయాసంగానే గుర్తుపట్టగలిగాడు సుదర్శన్, అతన మరెవరో కాదు ప్రియాంక, రాహుల్ కి ఉమ్మడి స్నేహితుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ‘సిద్ధార్థ’.
అతని పక్కన ఉన్నది యవ్వన ప్రాయంలో ఉన్న దుర్గాభవానిగా గమనించాడు సుదర్శన్. అంటే ఈ పెద్ద బాస్ మరెవరో కాదు సిద్ధార్థ అన్నట్లుగా గ్రహించాడు, దానితో అతనికి మొత్తం విషయం అంతా మంచు విడిపోయిన రీతిలో అర్థం అయ్యింది. అదే ఆశ్చర్యంతో కింద కాన్ఫరెన్స్ రూమ్‌కి వెళ్ళిన సుదర్శన్ తనలాగే ఆశ్చర్యంతో, దిగ్భ్రాంతికి లోనై ఏమి చెయ్యాలో తెలీని పరిస్థితిలో ఉన్న జగదీశ్వరరావుని చేరుకున్నాడు.
కొంచెం కూడా అనుమానం రాకుండా మొదటి నుంచీ రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉండి ఇంత దారుణమైన పధకాన్ని పన్నిన సిద్ధార్థ యొక్క మాస్టర్ మైండ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ఆ ముగ్గురూ. వారికి ఇప్పుడు తమ కేసెస్ వెనక ఉన్న ప్రతీ వాస్తవం బోధపడడం మొదలుపెట్టింది. సిద్దార్థ మైకులో మాట్లాడుతున్నాడు.
***
“ఇంకొక వారం రోజుల్లో జరగబోతున్న మా రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. మీ అందరికీ తెలుసు మా రాష్ట్ర రాజకీయాల్లో భూషణరావు గారి ధరణికోట ప్రాజెక్ట్ చాలా ముఖ్యపాత్ర పోషిస్తోంది. మా పార్టీ అదే ఎజెండా మీద దాని ఆవశ్యకతను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది, కానీ ఇతర పార్టీవారు ప్రజలను కూడగట్టుకుని పరిశ్రమలకి వ్యతిరేకం చేస్తున్నారు, అదే జరిగితే మీరూ నేను ఎవరూ ఉండము.
అయితే ఆ ప్రాజెక్ట్ ఇంకా సగం కన్నా తక్కువ భాగమే పూర్తి అయ్యింది, ప్రస్తుతం ఆ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం కన్నా నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఎంతో అవసరం. దానివల్ల దేశంవ్యాప్తంగా మన అయిడియా నెక్స్ట్ స్టేజ్‌ను ఇంప్లిమెంట్ చేసే అవకాశం లభిస్తుంది. అందుకు నేనొక పథకం ఆలోచించాను, అదే ధరణికోట ప్రాజెక్ట్ సమూలంగా నాశనం చెయ్యడం. ఇప్పుడు మా సిబ్బంది అంతా అదే పనిలో ఉన్నారు” అని చెప్పి తన చేతులో ఉన్న సెల్ ఫోన్ నుండి ఒక లైవ్ వీడియో అక్కడున్న తెరమీదకు బ్రాడ్కాస్ట్ చేసాడు.
ధరణి కోట ప్రాజెక్ట్ ఏరియా మొత్తం గస్తీ తిరుగుతూ చిన్న చిన్న పెట్టెలు మోసుకుని వెళ్తున్న మనుషులు కనిపించారు, వాళ్ళందరినీ జానీ సూపర్వైజ్ చేస్తున్నాడు. భూషణరావు తన చెవులని తానే నమ్మలేకపోయాడు, ఇంతకాలం తనకి సిద్ధార్థ సహాయం చేస్తున్నాడు అని భ్రమపడి తాను అతనితో చేతులు కలిపితే ఇప్పుడు తాను ఎంతోకాలంగా శ్రమిస్తున్న ఈ ప్రాజెక్టును నాశనం చెయ్యాలి అంటున్నాడు. భూషణరావుకి సిద్ధార్థ మాటల మీద నమ్మకం పోయింది.
“నో అదెలా సాధ్యం, దీనికి నేను ఒప్పుకోను,అస్సలు దానివల్ల ఉపయోగం ఏంటి. ఇంతకాలం పరిశ్రమలు, ఉపాధీ అంటూ ప్రజలను నమ్మబలికి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారు. ఇప్పటికే నేను ఈ ప్రాజెక్ట్‌లో కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉన్నాను దాన్ని ఇలా అర్ధాంతరంగా కూల్చివేస్తే వీ విల్ విత్ డ్రా ఫ్రం యూ” ఆవేశంగా చెప్పాడు భూషణరావు.
“అదే మన స్ట్రాటజీ, అక్కడ తిరుగుతున్న మనుషులు చూసారు కదా వారిదగ్గర ఉన్న బాక్సెస్‌లో ఉన్నవి రిగ్డ్ ప్లాస్టిక్ ఎక్స్‌ప్లోజివ్స్, వాటి గురించి నేను మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అలాంటివి ఆ ఏరియా మొత్తం అమర్చడం మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఈ ఆపరేషన్ మొత్తం మిస్టర్ జాన్ సూపర్వైజ్ చేస్తున్నాడు” భూషణరావు వైపు చూస్తూ అన్నాడు సిద్ధార్థ.
“యూ సీ మిస్టర్ భూషణరావు మీ సపోర్ట్ మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇందాక మేము చాపర్‌లో వస్తున్న టైంలో మీ అబ్బాయి ప్రతాప్‌తో మాకు డీల్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ధరణికోట ఏరియాలో పనిచేస్తున్న మీ సిబ్బంది అంతా మావాళ్ళుగా మారిపోయారు, వారిప్పుడు మీమాట వినరు. వాళ్ళ కొత్త నాయకుడు దేశవ్యాప్తంగా మీ వ్యాపారాలకీ, ధందాలకీ యజమాని మీ అబ్బాయి ప్రతాప్ మాటనే వింటారు.
అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే నా మాటనే వింటారు. అందుకు మీరు ఇప్పుడు మేము చెప్పినది చెయ్యడం తప్ప వేరొక మార్గం లేదు. నా దారికి అడ్డొస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఒకే సమయంలో మరణించిన ఇద్దరి ముఖ్యమంత్రుల విషయం మర్చిపోయారా, ముఖ్యమంత్రి ప్రజలు అని ఎవరూ నాకు లెక్కలోకి రారు” క్రూరంగా చూస్తూ చెప్పాడు సిద్ధార్థ.
భూషణరావు నిస్సహాయంగా ప్రతాప్ వంక చూసాడు, అతని ముఖంలో భూషణరావు తన తండ్రి అని కొంచెం కూడా జాలి ఉన్నట్లు అనిపించలేదు, ప్రతాప్ ముఖంలో కర్కశత్వం గమనించాడు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే అక్కడున్న అతని బాడీగార్డులు తనని చంపించడానికి కూడా వెనుకాడడు అని భూషణరావుకి అర్థం అయ్యింది.
“ఈ విధ్వంసాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసాను. దీన్ని మొత్తం భూములకోసం ప్రాకులాడుతున్న అధికార పక్షంపై రుద్దే బాధ్యత మీడియా ఏజన్సీస్ అన్నిటికీ అప్పగించడం ఆల్రెడీ జరిగిపోయింది.
‘పరిశ్రమలకు అడ్డుపడుతున్న ప్రజావ్యతిరేక ప్రభుత్వం’
‘ప్రజాభిప్రాయం ముసుగున భారీ విధ్వంసం’
‘ఇదా ప్రజలు కోరుకునే పనికిమాలిన ప్రభుత్వం’
‘కుట్రలూ కుతంత్రాలతో కుర్చీమీదకి’
రేపు అన్ని ప్రముఖ న్యూస్ పేపర్స్‌లో, విజువల్ మీడియాలో వచ్చే హెడ్లైన్స్ త్రివిక్రం పంచెస్ లాగ ఎంత ముచ్చటగా ఉన్నాయో కదా, ఇవే నన్ను ముఖ్యమంత్రిని చేస్తాయి. నాకు ఈ విషయంలో దేశవ్యాప్తంగా మీ సపోర్ట్ కావాలి. అందుకు అనుకూలంగా ఉన్నవారు అందరూ నాతో చేతులు కలపండి, లేని వాళ్ళు…” అని కొంచెం సేపు వారి స్పందన కోసం ఆగాడు సిద్ధార్థ. అక్కడ కలకలం చిన్నగా మొదలై ఇప్పుడే పెద్దదిగా మారుతోంది.
అందరి ముఖాల్లో భయాందోళనలు నిండి ఉన్నాయి. వారు తామున్న చోటనుండి పక్కకి వెళ్లబోతుంటే అక్కడున్న సెక్యూరిటీవాళ్ళు తమను నియంత్రిస్తున్నారు.
“లేనివాళ్ళు ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటకు వెళ్లరు” అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తూ చెప్పాడు సిద్ధార్థ.
నమ్మశక్యం కానీ ఈ నిజాన్ని రాహుల్, ప్రియాంక వారికి ఏ విధంగా చేరవెయ్యాలి అని మార్గాల కోసం అన్వేషిస్తున్నారు సుదర్శన్ బృందం, ఏ మాత్రం ఆలస్యం చేసినా జరగవలసిన నష్టం జరిగిపోతుంది అప్పుడు విచారించి లాభం లేదు.
“వై ఎందుకు సిద్ధార్థ, నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని నీకు ఎన్నో నీచమైన పనుల్లో సహకరిస్తే నన్నింత ద్రోహం చేస్తావా?” కోపంతో అతనిమీదకు ఉరకడానికి ప్రయత్నిస్తూ అన్నాడు భూషణరావు.
“హహహ నువ్వింకా నీచమైన పనుల్లో అథమ స్థాయికి చేరుకోలేదు భూషణరావు, అస్సలు నిన్ను ఇంతవరకూ ప్రాణాలతో ఉంచడమే నేను చేసిన తప్పు, ఈ రోజుతో ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నీ కొడుకు ద్వారా లభించింది. నీ వెనకాల ఉండి అన్ని పనులూ చేయించినది నేనే. నీ వ్యాపారాలకు అడ్డుపడుతున్న నా తండ్రి అశోక్ త్యాగీని నకునారెడ్డి అండ చూసుకుని చంపించినది నువ్వే అని తెలిసికూడా నీతోనే అనునిత్యం ఉంటూ నాకు కావాల్సిన పనులు చేయించుకున్నాను” క్రూరంగా నవ్వుతూ చెప్పాడు.
ఈ విషయం తనకి కూడా తెలీకపోవడంతో విపరీతమైన విస్మయంతో, “అంటే నువ్వు అశోక్ త్యాగీ కొడుకువా, మొదటి నుంచీ ఈ రాష్ట్ర రాజకీయాలకు నీకు సంబంధం ఉందన్నమాట. నాకు ఎదురు తిరిగిన నిన్ను ఊరికే వదలను” మీదమీదకి వచ్చి తను రహస్యంగా దాచుకున్న రివాల్వర్ తీసి సిద్ధార్థకు గురిపెట్టి కాల్చాడు.
అది ముందే గమనించిన సిద్ధార్థ పక్కకి తప్పుకోవడంతో బులెట్ పక్కగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ కుడిభుజాన్ని గాయపరిచింది.
“గార్డ్స్ కాచ్ హిం. ఇక్కడినుంచి నా అనుమతి లేకుండా బయటకి వెళ్ళడానికి ప్రయత్నించిన వారు అందరినీ నిర్దాక్షిణ్యంగా కాల్చి పారెయ్యండి” గట్టిగా వారికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాడు సిద్ధార్థ.
ఇదే అదును చూసుకుని తమని చుట్టుముట్టిన గార్డ్స్‌ను ఒక్క ఉదుటున ముందుకు తోసాడు చక్రధర్. అక్కడ ఒక్కసారిగా ఉరుకులూ, పరుగులూ తుపాకీల కాల్పులతో పెద్దగా సంచలనం రేగుతోంది. అందరూ ప్రాణాలు చేతుల్లో హడావిడిగా అటూ ఇటూ కిందకీ పైకీ పరిగెడుతున్నారు. అత్యాధునికమైన తన వెపన్స్‌తో ఆ హోటల్ మొత్తం తన చెప్పుచేతల్లోకి తెచ్చుకోగలిగాడు సిద్ధార్థ, అతనికి పూర్తిగా సహకరిస్తున్నాడు ప్రతాప్.
తనకి కొత్తగా లభించిన నాయకత్వం అతడిని ఎంతకైనా తెగించేలా చేస్తోంది, నలుగురు గార్డ్స్ వెంటరాగా సిద్ధార్థ తప్పించుకోవడానికి నానా అవస్థలూ పడుతున్న భూషణరావు వెంటపడ్డాడు. జగదీశ్వరరావు బృందం తమను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న గార్డ్స్‌తో హోరాహోరీ పోరాటం చేస్తున్నారు.
జగదీశ్వరరావు వయసులో పెద్దవాడైనా ఆయనకు హ్యాండ్ టూ హాండ్ కాంబాట్‌లో అంతులేని ప్రావీణ్యం ఉంది. తనమీదకు దూకిన ఒక గార్డ్‌ను ఒకే ఒక్క పంచ్‌తో నేలకరిపించాడు, నేలమీద పడిన కళ్ళకు బంధంగా ఉండి తనను కింద పడెయ్యడానికి చూస్తున్నాడు, ఇంతలో ఇద్దరు గార్డ్స్ తనమీదకి ఆంబోతుల్లాగా రావడం గమనించి శక్తినంతా తన ఎడమకాలిలోకి తెచ్చుకుని బంధంగా ఉన్న గార్డ్‌ను ముందరకు ఈడ్చి బలంగా కుడికాలుతో ఫుట్బాల్ కిక్ ఇచ్చాడు.
అంతే ఒక్కసారిగా కింద ఉన్న గార్డ్ గాల్లో పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి తన మీదకి రాబోతున్న గార్డ్స్ ఇద్దరిమీద ముగ్గురూ కలిపి నేలకొరిగారు, అంత బరువైన వాడు ఒక్కసారిగా మీదపడడంతో వారి శరీరాలు నుజ్జునుజ్జు అయిపోయాయి. అక్కడ గార్డ్స్ అందరూ ఒకేరకం దుస్తులు ధరించడం వలన వారిని సులభంగానే గుర్తుపట్టగలుగుతున్నారు.
ఇంతలో ఇద్దరు గార్డ్స్ సుదర్శన్‌ను గోడకి ఆన్చిపెట్టి అతడిమీద బలప్రయోగం చేస్తుంటే ఒక్కసారిగా వెనకనుండి వారిమీదకు ఉరికి రెండే రెండు పిడిగుద్దులతో వారిద్దరినీ మట్టికరిపించాడు జగదీశ్వరరావు. తనకి ధన్యవాదం చెప్తున్న సుదర్శన్‌ని పట్టింహుకోకుండా పక్కనే చక్రధర్ మీదకు వెళ్ళబోతున్న ఒక గార్డ్ మెడ మీద కత్తెరలాంటి కిక్ ఇచ్చి కడుపులో మోచేత్తో గుద్ది ఒకేవేటుకు దూరంగా పడేలా చేసాడు.
“నేను ఈ గార్డ్స్ ని కంట్రోల్ చేస్తాను. మీరు వెళ్లి సిద్ధార్థ సంగతి చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ అతను తప్పించుకోకూడదు. ధరణికోటపై అతని పధకం రాహుల్‌కి తెలియచెయ్యడానికి ప్రయత్నిస్తాను” ఈ మాటలు వారికి చెప్తూ గార్డ్స్‌తో ద్వంద్వ యుద్ధానికి దిగాడు జగదీశ్వరరావు.
వెంటనే దూరంగా స్టేజ్ మీద అందరినీ అదుపు చేస్తూ తుపాకీతో కాల్పులు జరుపుతున్న సిద్ధార్థ మీదకు సుదర్శన్, చక్రధర్ ఇద్దరూ లంకించారు. అతడికి రక్షణగా ఉన్న గార్డ్స్ సంగతి చక్రధర్ చూసుకుంటూ ఉంటే, సుదర్శన్ సిద్ధార్థతో తలపడుతున్నారు.
“ప్రజలు నీమీద ఇంతకాలంగా నమ్మకం పెట్టుకుని నీ మాటలు వింటూ ఉంటే, మనసులో ఇంత విషం పెట్టుకుని అందరికీ స్నేహితుడిగా ఎలా నటించగలిగావు. జోగేశ్వరరావు గారి చాపర్ క్రాష్‌కు కారణం నువ్వేనా?” అంత హడావిడిలోనూ సిద్ధార్థ నుంచి నిజం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాడు సుదర్శన్.
“హహహ అవును నేనే జోగేశ్వరరావు చాపర్ క్రాష్ డిసైన్ చేసినది, ఆ విజువల్స్ నకునారెడ్డికి చూపించి అప్పటికే వీక్‌గా ఉన్న అతని గుండె శాశ్వతంగా ఆగిపోయేలా చేసింది, నాచిరెడ్డి భార్య సుకన్య తన ప్రియుడితో కలిపి చంపించింది అంతా నేనే. సిద్ధార్థ నారాయణ త్యాగీ. ఆహాహహహాహ” అతను భయంకరంగా వికాటాట్టహాసం చేసాడు.
“ఎందుకు మీ నాన్నగారు ఎంతో పేరు ప్రఖ్యాతలు, నీతీ నిజాయితీ కలిగిన గవర్న్మెంట్ సర్వెంట్ కదా. నీవు ఇంత క్రూరాతిక్రూరంగా కొన్ని కోట్లమంది జీవితాలతో ఆటలు ఆడుకునే విధంగా ఎందుకు తయ్యారయ్యావ్” ఆ సంభాషణ మొత్తం రికార్డ్ అవుతున్న విషయం అక్కడ ఉన్న ఎవరికీ తెలీదు. అతడింకా నవ్వుతూనే ఉన్నాడు
“హహహ. మీరు చెప్పిన డైలాగ్స్ అన్నీ సినిమాల్లో బాగుంటాయి. మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటో తెలుసా ఈ రాజకీయం. దానితోనే కదా ఎంతో మంది మీరు చెప్పినటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు తమతమ జీవితాలను కోల్పోతున్నారు. నేను అలాంటివారి దారిలో వెళ్ళదలచుకోలేదు, ప్రభుత్వానికి సేవ చేయ్యదలచుకోలేదు, నేనే ప్రభుత్వం అన్నది నా విధానం.
జోగేశ్వరరావు, నకునారెడ్డి ఇద్దరూ చెడిపోయిన రాజకీయ నాయకులే, వీరిని మనం నమ్మినంత కాలం వీరు మనల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇద్దరిలో ఎవరివల్లా ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదు అని నా అభిప్రాయం. వీరిని నమ్ముకున్న ప్రజలు నానాటికీ కష్టాలు పడుతూనే ఉన్నారు, వీరు మాత్రం కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. దీనికోసం వాళ్ళు భూషణరావులాంటి వారిని ఎంచుకున్నారు.
అందుకే అతని ఆటలు ఇష్టం వచ్చినట్లు సాగాయి, నా తండ్రి మరణానికి ఈ ముగ్గురూ కారణమే, అంతకన్నా ఎక్కువగా ఈ వ్యవస్థ, ఇందులో ఉన్న చేతకాని ప్రజలూ కారణం. ఇటువంటి రాజకీయాలు అన్నిటికీ బుద్ది చెప్పడానికి నేను రాజకీయాన్నే మార్గంగా ఎంచుకున్నాను. మీ వేలితో మీ కంటినే పోడుచుకునేటట్లు చేసాను.
వారికి సమాధానంగా వీరితో సంబంధం లేని ఒక వ్యవస్థ ఏర్పరుచుకున్నాను, అందులో నీతీ నియమాలు అనేవే లేవు, వెన్ యూ ఆర్ ఇన్ మై వరల్డ్ యూ హావ్ టూ ప్లే బై మై రూల్స్. మన లక్ష్యం నెరవేరడానికి ఎవరినైనా ఎందుకోసమైనా ఉపయోగించుకోవడం ఒకటే మార్గం. అందరికీ నమ్మకంగా ఉంటూ ప్రియాంకతో పరిచయం ఏర్పరుచుకుని ఆమెకు ఇష్టంలేని రాజకీయాల్లోకి ఆమెను దింపాను.
నా తండ్రి పేరన ఒక స్థలం సృష్టించి దాని డాక్యుమెంట్స్ ద్వారా నా చెల్లెలు భవానీ త్యాగీ అలియాస్ దుర్గాభవానిని వాళ్ళ ఇంట్లో ప్రవేశపెట్టి ఆమెను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేలా చేసాను, ఒక రకమైన స్లో పాయిజన్ ద్వారా నకునారెడ్డి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించడానికి సహకరించింది భవాని.
నా మీద అనుమానంతో గణేష్‌ని ఎంక్వైరీ కోసం ప్రియాంక పంపగా భవానిద్వారా ఆ విషయం తెలుసుకుని అతడిని ఆమె ద్వారానే అంతమొందించాను. మొదటినుంచీ వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టి నా పబ్బం గడుపుకున్నాను. అయితే ప్రియాంక రాహుల్‌తో కలుస్తుంది అన్న విషయం నేను ఊహించలేకపోయాను.
దానితో నా పంధా మార్చుకుని భూషణరావుని తిరిగి చేర్చుకున్నాను, ఇప్పుడు ఇతడిని చంపడం ద్వారా ఈ కేసుకూడా, ధరణికోట బ్లాస్టింగ్స్‌తో కలిపి రాహుల్, ప్రియాంకల మీదకు వెళ్ళిపోతుంది. హహహా” అత్యంత క్రూరమైన అతని నవ్వును మొదటిసారిగా చూసిన సుదర్శన్ ఆశ్చర్యపోయాడు. ఇంకా వారి మధ్య పోరాటం జరుగుతూనే ఉంది.
చక్రధర్, జగదీశ్వరరావు ఈసారి పూర్తి బలంతో సిద్ధార్థ మీదకు దూకారు. “నువ్వింక తప్పించుకోలేవు సిద్ధార్థ. నువ్వు ఇప్పుడు మాట్లాడినదంతా అన్ని టీవీ చానెల్స్ ప్రసారమయ్యే ఏర్పాటు రాహుల్ చేసాడు, ఇప్పుడే అతనికి నేను ఈ వివరాలు తెలియజేశాను. ధరణి కోట బ్లాస్టింగ్స్ కోసం నువ్వు చేసిన ప్లాన్ అంతా టీవీల్లో చూపబడుతోంది.
ఆ విధ్వంసం జరగకుండా అడ్డుకోవడానికి అవసరమైన బలగాలతోపాటు రాహుల్ కూడా అక్కడికి చేరుకుంటున్నాడు. నీ రాజకీయజీవితం నేటితో భూస్థాపితం అయిపోతుంది. ఇక్కడ నుంచి బయటపడిన మరుక్షణం నువ్వు ఈరోజు ప్రజల చేతిలో కుక్కచావు చావడం ఖాయం” తీవ్రమైన స్వరంతో హెచ్చరించాడు జగదీశ్వరరావు.
“హహహ నాకు ఈ దేశ న్యాయవ్యవస్థపైన పరిపూర్ణమైన నమ్మకముంది సార్. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకన్నా బాగా ఎవరికీ తెలీదు” అంటూ వారి ముగ్గురిమీదకీ ఎగిరి దూకాడు సిద్ధార్థ.
నేలమీద పడి దోర్లారు ఆ నలుగురూ, ఒక్కసారిగా పైకి లేచిన గట్టిగా చక్రధర్ డొక్కలో తన్నాడు, పక్కకి తప్పించుకుని వెనకనుండి తనమీదకు దాడి చెయ్యడానికి వచ్చిన సుదర్శన్‌ను రెండు చేతులతో పట్టుకుని అమాంతం గాలిలోకి ఎగరేసి దానితోపాటుగా తను కూడా ఎగిరి ఒక ఫ్లయింగ్ కిక్ ఇచ్చాడు.
అతడు కూడా శరీర ధారుడ్యంలో ఎవరికీ తీసిపోయింది లేదు. ఒక నలభై నిమిషాల సేపు వారిమధ్య భీకరపోరాటం జరిగింది. ఆఖరికి ముగ్గురూ కలిపి సిద్ధార్థను లొంగదీసుకున్నారు, అతని లొంగిపోవడంతో గార్డ్స్ అందరూ హడలిపోయారు. అక్కడ జరిగిన ఆ పోరాటంలో భూషణరావు ప్రతాప్ చేతుల్లో మరణించాడు. ఆ రోజు సాయంత్రానికే సిద్ధార్థకు సంబంధించిన న్యూస్ అందరికీ తెలిసిపోయింది.
(సశేషం)