రాజకీయ వివాహం-4

0
3

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది నాలుగవ భాగం. [/box]

అధ్యాయం- 4

[dropcap]ప్ర[/dropcap]సాద్ గారితో జరిగిన ఆ సంవాదం తరువాత ఆమె అంతరానగం తీవ్ర సంచలనానికి లోనయ్యింది. తాను వేటికైతే దూరంగా ఉండాలి అని అనుకుందో వాటిలోకి మెల్లిగా ఆమె ఆకర్షింపబడటం ఆమెకు విచిత్రంగా అనిపించింది. అందుకే ఈ విషయాలకు దూరంగా ఉండాలని ఆమె బయటకు వెళ్ళడం మానేసి ఎక్కువ సమయం తన తండ్రితోనే గడుపుతోంది. తండ్రికి పూర్తిగా నయమైన తరువాత చెన్నై వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది.

ఈమధ్య కాలంలో ఎందుకో తెలీదు కానీ రాహుల్ తరచుగా తమ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడు, దానివల్ల పెద్దగా నష్టం ఏమీ లేకపోయినా రాహుల్ మనసులో ఏముందో తెలుసుకోవడం కొంచెం కష్టం అని ఆమెకు అనిపించింది. కానీ ఇదివరకు కంటే ఈ మధ్య తను రాహుల్ వైపు అనుకోకుండా ఆకర్షితురాలు అవుతోంది. అతను తమ ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడూ కూడా వేసిన బట్టలు మళ్ళీ వెయ్యకుండా రోజుకొక ఫేషన్లో రావడమే అందుకు కారణం.

ఒకరోజు కొద్దిగా మాసిన గడ్డంతో వస్తే ఒక రోజు పూర్తి షేవ్‌తో వస్తాడు, ఒకరోజు ఫుల్ సూట్‌లో ఒకరోజు పోలో టీ షర్ట్, జీన్స్ తో వస్తాడు. ఒకరోజు బైక్లో వస్తే ఒక రోజు కార్లో వస్తాడు, కానీ రావడం మాత్రం మరచిపోకుండా వస్తూనే ఉంటాడు. ఎందుకో ఆమెకు అర్థం కావడం లేదు. వచ్చినవాడు పోనీ ఎక్కువ సమయం ఉంటాడా అంటే అలా ఏమీ లేదు, ఎంత హడావిడిగా అయితే వస్తాడో అంతే హడావిడిగా వెళ్ళిపోతాడు. కానీ ప్రతీసారీ తన తల్లి సుమిత్ర దగ్గర మాత్రం ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోడు.

ఇంకా ఆరోజు ఎలాగైనా విషయం తేల్చుకోవాలనిచెప్పి “ఏంటి రాహుల్ ఇంప్రెస్ చెయ్యాలని చూస్తున్నావా?” సోఫాలో కూర్చున్న ప్రియాంక అతను అటుగా రావడం గమనించి అడిగింది. రాహుల్ దేవుడి గదిలో ఉన్న సుమిత్రతో మాట్లాడి ఇప్పుడే బయటకు వచ్చాడు, గాలిలో తేలియాడే ‘మాస్క్యులైన్’ అనబడే ఫారెన్ పెర్ఫ్యూం యొక్క సువాసన ఆమె ముక్కుపుటాలకు తాకింది, అదేగాలికి సోఫాలో రిలాక్స్‌డ్‌గా కూర్చున్న ముడివేయకుండా వదిలిన ఆమె ముంగుర్లు ఒక్కసారిగా ఎగిరి ఆమె పెదవులపై పడడంతో ఆమె వాటిని వెనుకకు సర్దుకోవడం రాహుల్ కంట పడింది. ఆ క్షణంలో ఇద్దరూ అనుకోకుండా ఒకరినొకరు చూసుకోవడం జరిగింది. ఎందుకో ఇదేవారి మొట్టమొదటి కలయికగా క్షణంసేపు ఇద్దరూ అనుభూతి చెందారు.

వెంటనే తేరుకున్న రాహుల్ “ ఇంప్రెసివ్‌గా ఇంప్రెస్ చెయ్యాలనే ఇంప్రెషన్ నాకేమీ లేదు మేడం. అయినా ఆ అవసరం నాకేంటి, నాకోసం చాలామంది అమ్మాయిలు క్యూ కడతారనే అనే విషయం తమరికి తెలుసుకదా” కొంచెం కొంటెగా ఆమెవైపు చూస్తూ అన్నాడు రాహుల్. తనకు తెలిసి తమ మధ్య ఇంత ఎక్కువ సమయం గడవడం ఇదే మొదటిసారి అయ్యుంటుంది.

“నిజమే అలాంటి క్యూలను దాటుకుని రావడానికే నీకు ప్రతీరోజూ ఇంత టైం పడుతుందేమో కదా” తను కూడా అతనికేసి చూస్తూ సోఫాలో నుంచి లేచి అతని దగ్గరకు వచ్చి చెప్పింది.

“అంటే నేను ప్రతీరోజూ ఎప్పుడు ఏ టైంకి వస్తానా అని ఎదురు చూస్తున్నవన్నమాట” ఈసారి కొంటెగా కన్నుగీటుతూ అన్నాడు రాహుల్. ఇప్పుడు వారిద్దరి మధ్యా దూరం మరింత తగ్గింది. ఈసమయంలో ఇంట్లో పెద్దగా సందడి లేదు. నకునారెడ్డి సెక్రెటరీ ఈరోజు సెలవులో ఉన్నాడు. నౌకర్లిద్దరూ బయటేదో పనిలో నిమగ్నమై ఉన్నారు. సుమిత్ర ఇంకా పూజగదిలోనే ఉంది.

“నేను ఎదురు చూసేది నీకోసం కాదు, నాకోసం క్యూ కట్టే మనుషుల్లో ఒకరికోసం” ఆమె తిప్పికొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ గ్రహించాడు. అందుకే కొంచెం గంభీరంగా ఫోజుపెట్టి అన్నాడు

“ఎవరో ఆ మహానుభావుడు.”

“నీకు చెప్పాలని రూల్ లేదు కదా”.

“ఆహా..” గట్టిగా అన్నాడు.

“ఆ.. అవును” అంతకన్నా గట్టిగా ఆమెకూడా సమాధానం ఇచ్చింది.

అలా రెండు మూడుసార్లు పరస్పరం వారిద్దరూ అరుచుకున్న తరువాత అమాంతం ఆమె నడుముపైన చెయ్యేసి దగ్గరకు లాక్కుని ఆమె పెదాలను చుంబించాడు రాహుల్. ఊహించని ఈ చర్యకు ఆమె హతాశురాలయ్యింది. అసలు అతనిలా చేస్తాడనే తను అనుకోలేదు, ఇంకా ఆ షాక్ లో తనుండగానే చిన్నగా నవ్వుతూ అక్కడ నుండి బయటపడ్డాడు రాహుల్.

 ఆ సంఘటన తరువాత వారిమధ్య ఒక కొత్తరకమైన ఆకర్షణ ఏర్పడినట్లు రాహుల్ అనుకున్నాడు. ప్రియాంక మాత్రం ఏ విధమైన స్పందన లేకుండా ఉంది. కానీ జరిగినదాని గురించి ఆమె మనసులో ఏదో మూలా ఆనందంగా ఉంది. ఈ విషయం ఆమె సిద్ధార్థతో పంచుకోవాలా వద్దా అని అనుకుంది, కొన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ ఈ విషయం చెప్తే అతను ఏమనుకుంటాడో అని కొద్దిగా భయపడిన మాట వాస్తవమే. అందుకే తను హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నాడు అన్న విషయం తెలుసుకుని మాత్రమే ఫోన్ పెట్టేసింది.

గతకొన్నిరోజులుగా తనకి చిన్ననాటి స్నేహితురాలైన శ్వేత తనతో తరచుగా ఫోన్‌లో మాట్లాడుతోంది. రెండుమూడుసార్లు ఇంటికి కూడా వచ్చింది. ఆమె ఏదో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోందట, శ్వేత తండ్రి ఒక ప్రభుత్వోద్యోగి. ఎంతమంది స్నేహితులు తనని కలవడానికి, తనతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించినా ఆమె పట్టించుకోలేదు, కానీ శ్వేతను మాత్రం ఆమె కాదనలేకపోయింది. దానికి కారణం మోడరన్‌గా ఉన్నాకానీ శ్వేతలో కనిపించే అమాయకత్వం, చురుకుదనం.

తనతోపాటు సినిమాలకు రమ్మని శ్వేత తెగ బలవంతపెడుతూ ఉంటుంది, ఐనా కానీ చూద్దాంలే అని తప్పించుకుంటూ ఉంటుంది. కానీ ఆమెకు ఎందుకో సినిమాలు, షికార్లు, షాపింగ్లు, డిస్కోలు ఇలాంటివంటే కొంచెం ఎలర్జీ. ఎలాగైనా సరే ఈమెను సినిమాకు తీసుకువెళ్లాలని శ్వేత తాపత్రయం. తన ఫ్రెండ్స్‌ను ఆమెకు పరిచయం చెయ్యడానికి శ్వేత ప్రయత్నించింది కానీ ప్రియాంక సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం వలన ఆ ప్రయత్నం విరమించుకుంది.

“అబ్బా నీకులాగా ఇంట్లో ఉండి టైం వెస్ట్ చెయ్యాలంటే నా వల్ల కాదే బాబూ. మీ డాడ్ లాగా మా డాడ్ ఏ సీఎమ్మో పీఎమ్మో అయ్యుంటే నేను నా లైఫ్‌ని ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని” కళ్ళను చక్రాల్లా తిప్పుతూ ప్రియాంకతో చెప్పింది శ్వేత.

“ఎంజాయ్ చెయ్యడం అంటే ఏంటి శ్వేతా. నాకు తెలిసి ఇటాల్ డిపెండ్స్ ఆన్ యువర్‌సెల్ఫ్. మనకేది ఎంజాయ్‌మెంటో  తెలుసుకోవాడం ముఖ్యం అంతే.” ఆమెను మెల్లిగా శాంతపరుస్తూ అంది ప్రియాంక.

“అమ్మా తల్లీ నీకొక నమస్కారం. ది వరల్డ్ ఈజ్ ఆన్ పేస్ బుక్, ట్విట్టర్, ఆండ్రాయిడ్ అండ్ సోషల్ నెట్వర్కింగ్. వేర్ ఇన్ ద వరల్డ్ ఆర్ యూ. ఇది నా మోటో ఆఫ్ లైఫ్” ఆమెకు దండం పెడుతూ చిన్నగా తన భావాన్ని చెప్పింది శ్వేత. ప్రియాంక ఆమెను దీవిస్తున్నట్లుగా భంగిమ ఇస్తే ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు.

***

మూడు రోజుల నుంచీ తనకొక తెలియని నెంబర్ నుండి కాల్స్ వస్తున్నాయి. తన రీసెర్చ్ కొంత ఊపందుకుంటున్న సమయంలో ఈ కాల్స్ రావడం సిద్ధార్థకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆరోజు సాయంత్రం ప్రియాంకను హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కిన్చినప్పటి నుంచీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండడం అతనిని ఆశ్చర్యానికి గురి చేసాయి. అంతేకాకుండా తన ఫేస్‌బుక్ ఎకౌంటుకి కూడా రెండు అనానిమస్ రిక్వస్ట్లు వచ్చాయి. ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతీ ఒక్కరూ ఈ సామాజిక అనుసంధాన వేదికను వాడడం ద్వారా నిరంతరం ప్రజలతో కాంటాక్ట్‌లో ఉంటున్నారు.

దీనికి పొలిటీషియన్స్ ఏమీ అతీతం కాదు. తను ప్రొఫెసర్ వరదరాజన్ ఇంటికి వచ్చే ముందర ప్రియాంక ఆరోజు ఆయనతో ఏమి చర్చించి ఉంటుంది అని అడుగగా భూసంస్కరణల గురించి మాట్లాడామని ఆమె ఫోన్లో చెప్పింది.

“ఏంటి మీ రాహుల్‌కు అనుకూలంగా భూమికి సంబధించిన థియరీ ఏమైనా తయ్యారు చెయ్యాలి అనుకుంటున్నావా? అవును ఇప్పుడు రాహుల్ హైదరాబాద్‌లోనే ఉన్నాడట కదా. విషయం ఏంటి?” అతని స్వరంలో కొంచెం హాస్యం ధ్వనించింది.

“థియరీయో, థీసీసో తెలీదు కానీ భూమి మూలాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అది ఎవరికైనా అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఉంటుంది అనుకోవడం నీ థియరీ అవుతుంది.” చిన్నగా నవ్వుతూనే చురక అంటించింది.

“అబ్బో మీ రాహుల్‌ని అంటే ఎంత కోపం. సరేకానీ నువ్వు అంటూంటే నాకు అనిపిస్తోంది. మనమెందుకు ఈ భూయాజమాన్యం అనే అంశం పై రీసెర్చ్ చెయ్యకూడదు. మనకు హెల్ప్ చెయ్యడానికి ప్రొఫెసర్ వరదారాజన్ కూడా ఉన్నారు కదా. మీ రాహుల్‌కి కూడా ప్రజల మెప్పు పొందడానికి సహాయం చేసినట్లు అవుతుంది.” మళ్ళీ అదే రకమైన హాస్యం ధ్వనించింది సిద్ధార్థ స్వరంలో.

“అబ్బా. మాటిమాటికీ రాహుల్ పేరు ఎందుకు ఎత్తుతావు సిద్ధూ. అతనికీ నా ఈ ఆలోచనకీ అసలేమీ సంబంధం లేదు. తన ఒంతుగా అతనేదో సేవ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు. ఎనీవే అదలా ఉంచితే నువ్వు అన్నట్లుగా ఈ రీసెర్చ్ విషయం నాకు కూడా అనిపించింది. అది చాలా మంచి ఆలోచన, నువ్వోకసారి హైదరాబాద్ వస్తే బాగుంటుంది, నీకు ఇక్కడి పరిస్థితులు కూడా అర్ధమవుతాయి. నువ్వు డాడ్‌ను ఇప్పటివరకూ చూడలేదు కదా, చూసినట్లుగా కూడా ఉంటుంది.” అతడిని ప్రశ్నించింది ప్రియాంక.

“యా. నేను కూడా వద్దామనే అనుకుంటున్నాను. వీలు చూసుకుని నెక్స్ట్ వీక్ వస్తాను. ఇంతలోపు ఈ భూమికి సంబంధించిన వివరాలు సేకరిస్తూ ఉంటాను. సీ యూ సూన్.” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సిద్ధార్థ్. తనకి గత కొన్నిరోజులుగా వస్తున్న అపరిచిత కాల్స్ గురించి ఆమెకు చెప్పలేదు, లేనిపోని అనుమానాలకి తావిచ్చినట్లు అవుతుందని భావించాడు. సిద్ధార్థతో ఆరోజు ఆ సంభాషణ ముగియగానే ఆమెకు శ్వేత నుంచి ఫోన్ వచ్చింది. ఆరోజు శనివారం అవ్వడంతో శ్వేత ఆఫీస్ కు సెలవు.

“హాయ్ డాలింగ్, ఏం చేస్తున్నావ్” ఉత్సాహంగా అడిగింది అడిగింది శ్వేత.ఇలాంటి చురుకుదనమే ఆమెకు శ్వేతలో నచ్చింది.

“నేనేమి చేస్తాను డియర్. ఎవరికీ సైట్ కొడదామా అని ఆలోచిస్తున్నాను. నీ దగ్గర ఎవరైనా అబ్బాయిల నెంబర్లు ఉంటే ఇవ్వు” ఈసారి ఆమె పంథాలోనే ఆమెతో మాట్లాడాలని నిర్ణయించుకుంది ప్రియాంక.

“వావ్ ఆర్.ఓ.ఎఫ్. ఎల్.ఎం.ఏ.ఓ. ‘రాఫుల్ మావో’. నువ్వు ఇలాంటి జోక్స్ కూడా వేస్తావా హౌ థ్రిల్లింగ్. నువ్వు అడగాలే కానీ నీతో పరిచయం పెంచుకోవడానికి ఎంతోమంది క్యూలో నిలబడి ఉంటారు బేబీ” గట్టిగా నవ్వుతూ చెప్పింది శ్వేత. ఆమె ఆ మాట అనడంతో ఎందుకో ప్రియాంకకు ఆ సమయంలో అప్రయత్నంగా రాహుల్ గుర్తొచ్చాడు. అది కూడా క్షణకాలం మాత్రమే.

ఆమె వెంటనే “ ‘రాఫుల్ మావో’ నా అంటే ఏంటి ఇదేదో కొత్తగా ఉంది దీనికి అర్థం ఏంటి?” శ్వేతను అడిగింది ప్రియాంక. తను ఫోన్ చేసిన ప్రతీసారీ ఇలాంటివేవో కొత్తవి చెప్తూనే ఉంటుంది శ్వేత.

 “రాఫుల్ మావో టిక్కిఫికేషన్నెస్హ హ హ” మరింత ఉత్సాహంగా నవ్వుతో మాట్లాడింది శ్వేత, ప్రియాంకను టీజ్ చెయ్యడం ఆమెకు చాలా సరదాగా ఉంది

“నీ బొంద ముందు అడిగిన డానికి సమాధానం చెప్పవే ఇడియట్”  చిరుకోపంతో శ్వేతను అంది ప్రియాంక

“అమ్మ తల్లీ ఈ ఇంటర్నెట్ స్లాంగ్ ను నీకు అర్ధమయ్యేలా చెప్పడం నావల్ల కాదు కానీ, లిజన్ ఐ నీడ్ ఏ ఫేవర్ ఫ్రం యూ”

“షూట్” తను కూడా ఆమెతోపాటుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తోంది ప్రియాంక.

 “నువ్వు ఈరోజు చాల మంచి మూడ్లో ఉన్నట్లున్నావ్, నాకు కూడా కావలసింది అదేలే. అయితే రేపు ఇనార్బిట్ మాల్‌కి నువ్వు రావాలి. నీకు ఇష్టముండదు అని తెలుసు కానీ రేపు కొంతమంది స్నేహితులు వస్తున్నారు. నువ్వు వాళ్ళని కలవాలి” ఆమె తనను రిక్వెస్ట్ చెయ్యడంతో ప్రియాంకకు ఇబ్బందిగా అనిపించింది.

“ఒకే డన్. దానికింత ఆలోచన ఎందుకు. ఏ టైంకో చెప్పు డెఫినెట్‌గా వస్తాను.” ఆమెకు హామీ ఇస్తున్నట్లుగా చెప్పింది ప్రియాంక.

“వెయిట్ వెయిట్, నా రిక్వెస్ట్ ఇంకా అయిపోలేదు. నువ్వు వచ్చేటప్పుడు నీతోపాటుగా రాహుల్ రెడ్డిని కూడా తీసుకురావాలి. నీకు అతను బాగా పరిచయం ఉంటాడు కదా.” అడిగింది శ్వేత. రాహుల్ పేరు వినగానే ఎందుకో ఆమె హృదయ స్పందన వేగవంతం అయ్యింది.

“రాహుల్ నా ఎందుకు. అఫ్‌కోర్స్ రాహుల్ నాకు తెలుసు. కానీ విషయం ఏంటో చెప్తేనేకానీ నేనందుకు ఒప్పుకోను.” కొద్దిగా బెట్టు చేస్తున్నట్లుగా అంది ప్రియాంక. ఆమె అడగడంతో ఏదో మూల రాహుల్‌తో పరిచయం పెంచుకోవాలని నలుగురిలో రాహుల్ తనతో ఏ విధంగా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలని కూడా తనకి అనిపించింది, ఐనా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. ఈ రకమైన భావం ఆమెకు చాలా కొత్తగా అనిపించింది.

“డోంట్ బీ సిల్లీ డార్లింగ్. రాహుల్ ముఖ్యమంత్రి కుమారుడని ప్రపంచం అంతా తెలుసు. పైపెచ్చు అతను చెన్నైలో చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల అతనికి మా సర్కిల్స్‌లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అతడి పేస్ బుక్ పేజ్ కు విపరీతమైన లైక్స్ వచ్చేసాయి. అతనితో పరిచయం చేసుకోవాలని మా ఆఫీస్‌లో చాలామంది అమ్మాయిలు ఎగబడుతున్నారు. నువ్వు నాకు తెలుసు అని చెప్పగానే రాహుల్‌తో మీటింగ్ ఎరేంజ్ చేయించడానికి నిన్ను అడగమని చెప్పి నన్ను బలవంతం పెట్టారు” ఉన్న విషయాన్ని బయట పెట్టింది శ్వేత.

“స్టుపిడ్, అంటే ఈ మీటింగ్ నాకోసం కాదు రాహుల్ కోసం అన్నమాట. నన్ను వాడుకుంటున్నావా” పైకి అలా అన్నదే కానీ రాహుల్‌ను కలవాలని ఆమెకు కూడా ఉండడం వలన శ్వేత అభ్యర్ధనను ఆమె కాదనలేకపోయింది.

“హహ వాడుకున్నోళ్ళకి వాడుకున్నంత అనే డైలాగ్ వినలేదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ డాళింగ్ అవతల నేను అందరికీ కమిట్మెంట్ ఇచ్చేసాను. నువ్వు తప్పకుండా రావాలి. రాహుల్‌ని కూడా తీసుకురావాలి. అంతే నీకు వేరే ఆప్షన్ లేదు. నీకు డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను. బై. రాఫుల్ మావో” అని చెప్పి తనకు తనకు రెండవ మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది శ్వేత.

“ఇడియట్” తనలో తాను అనుకుంటున్నట్లు పైకి అనేసింది ప్రియాంక.

ఆ సమయంలో ఆమె పెదవులపైన అప్రయత్నంగా సన్నని చిరునవ్వు ఒకటి మెరిసింది. రాహుల్ తో ఈ విషయం మాట్లాడి ఎలా ఒప్పించాలా అని ఆమె ఆలోచిస్తోంది. ఎందుకో శ్వేత రాహుల్ గురించి మాట్లాడుతుంటే తనకు చెప్పలేని ఆనందం కలిగింది. ఆఖరికి అతనితో ఫోన్‌లో మాట్లాడాలని ఆమె నిర్ణయించుకుంది. తమ తండ్రులిద్దరూ రాజకీయంగా బద్ధశత్రువులైనా తమ మధ్య ఈ సాన్నిహిత్యం ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో తనకి తెలీదు. అయినా ఆ విషయాలి ఆమె పట్టించుకోవాలి అనుకోవడం లేదు. ఫోన్ రింగయ్యిన వెంటనే అవతల వైపు నుంచి ఆన్సర్ చేసినట్లు శబ్దం వచ్చింది.

“హలో” అతని స్వరం గంభీరంగా ఉంది.

“ఏంటి నా ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నావా? ఒక్క రింగ్‌కే కాల్ లిఫ్ట్ చేసావ్” అతడిని ఏడిపించడానికి అడిగింది.

“ఇంక మాకు వేరే పనేమీ లేదనుకున్నావా. ఏదో నీకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ఫీల్ అవుతావని వెంటనే ఆన్సర్ చేసాను. అసలు ఇప్పుడే అర్జెంట్‌గా డాడ్ పార్టీ ఆఫీస్‌కి రమ్మన్నారు కూడా. సో విసిగించక విషయం ఏంటో త్వరగా చెప్పు” అతనిప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నాకానీ ఆమె ముందు విషయం బయటపడితే ఇంకా ఎక్కువగా ఎడిపిస్తుందేమో అని అలా చెప్పాడు

“అబ్బ ఛా. నువ్వింత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనుకోలేదు. సరేకానీ నీకస్సలు ఫ్లిర్టింగ్ రాదుకదా. ఒకమ్మాయి ఫోన్ చేసి మాట్లాడితే విసిగించకు అంటావా?” బుంగమూతి పెట్టి అడిగింది. తన చదువు, ఆదర్శాలు, లక్ష్యాలూ ఇవన్నీ రాహుల్ ముందర ఎందుకో పని చెయ్యడం లేదు అని ఆమెకు అనిపిస్తోంది.

“నీ ఉద్దేశం ఏంటో నాకు పెద్దగా తెలీదు కానీ, అమ్మాయిలు వెంటపడి నన్ను ఫ్లర్ట్ చెయ్యి అంటే అది ఖచ్చితంగా ఫ్లిర్టింగ్ అవ్వదు. కొంతమందికి ఫ్లిర్టింగ్ అవసరం కొంతమందికి అవసరం లేదు” తమ ఇంట్లోని గార్డెన్‌లో పచార్లు చేస్తూ అన్నాడు రాహుల్. వేసవికాలం అయినా ఆరోజు చిన్నగా మబ్బు పట్టి వాతావరణం కొద్దిగా ఆహ్లాదంగా ఉంది.

“సరే అయితే ఫ్లిర్టింగ్ చెయ్యడం అవసరమా, చేయించుకోవడం అవసరమా. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరి విషయం తీసుకుంటే కనుక.” అతనన్నది ఆమెకు అర్థం కాక అతడిని అడిగింది.

“రెండింటిలో ఏది తీసుకున్న నీకు కావలసిన సమాధానం లభిస్తుంది.” పైన ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూస్తూ చెప్పాడు.

“ఈరోజు వెదర్ చాలా బాగుంది కదా” తను కూడా ఇంట్లో నుంచి బయటకి వస్తూ అతనితో అంది ప్రియాంక.

“ఇప్పుడు చెప్పు ఎవరు ఎవరితో ఫ్లిర్ట్ చేస్తున్నారంటావ్” చిన్నగా అడిగాడు రాహుల్.

అటుపక్క నుంచి సన్నటి నవ్వొకటి వినిపించింది. రాహుల్ కూడా తన హృదయ స్పందన అధికం కావడం గమనించాడు. ఇద్దరూ మరికొన్ని క్షణాలు నిశ్సబ్దంగా ఉన్న తరువాత

“ఒకే జోక్స్ ఎసైడ్. ఇప్పుడు అసలు విషయం చెప్తావా” ఈసారి అతని గొంతులో నిజాయితీ ధ్వనించింది.

“ఏమీ లేదు. రేపు నీ ప్రోగ్రామ్స్ ఏంటో తెలుసుకుందామని.” ఇంకా విషయం ఏంటో చెప్పకుండా అడిగింది ప్రియాంక.

“తెలుసుకుని ఏమి చేస్తావ్”

“ఏమీ చెయ్యను నువ్వు ఖాళీగా ఉంటే కనుక రేపు ఇనార్బిట్ మాల్‌కి రావాలి వితౌట్ యువర్ ప్రైవేట్ సెక్యూరిటీ” కొంచెం సీరియస్‌గా నటిస్తూ అంది ప్రియాంక.

“కొంపతీసి నామీద మర్డర్ అట్టెంప్ట్ ఏమైనా ప్లాన్ చేసావేంటి” తమాషాగా అన్నాడు రాహుల్.

“మర్డర్ అటెంప్ట్‌లు చెప్పి చేయ్యరమ్మా బాబూ అప్పారావ్. ఏమీ లేదు. ముచ్చట పడుతున్నావ్ కదా నీతో సరదాగా డేటింగ్ చేద్దామని.” తను కూడా అలాగే మాట్లాడింది ప్రియాంక. కొద్దిసేపు నిశ్శబ్దం తరువాత అవతలి వైపు నుంచి స్పందన వచ్చింది.

“నో డేట్స్ తినేవాళ్ళతో, డైటింగ్ చేసేవాళ్ళతో డేటింగ్ చెయ్యడం అవుట్ డేటెడ్ పద్ధతని నా మొబైల్‌లో ఇప్పుడే అప్డేట్ వచ్చింది. కాబట్టి రావడం కుదరదు.” బెట్టుచేస్తున్నట్లుగా అన్నాడు రాహుల్

“నేను డేట్స్ తింటానని నీకెవరు చెప్పారు. ఆపవయ్యా నీ పంచ్ డైలాగులు రైమింగ్, రిథమ్ కలిపి రివర్స్‌లో తిప్పికొట్టడం మాకు కూడా తెలుసు. రేపు నువ్వు తప్పకుండా రావాలి, వచ్చి తీరుతావు అంతే. వెయిట్ ఫర్ మై కాల్ ఎగైన్, ఉంటాను.” అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది ప్రియాంక. చిన్నగా నవ్వుకున్నాడు రాహుల్.

***

“హలో మిస్టర్ సిద్ధార్థ్, నేను చెప్పగానే చెన్నై నుండి హైదరాబాద్ వచ్చినందుకు ధన్యవాదాలు” తన ఎదురుగా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి అన్నాడు. ఇప్పుడు వారిద్దరూ హైదరాబాద్లోని ఒక షాపింగ్ మాల్‌లో ఉన్నారు.

“మీరెవరు మిస్టర్. మీరు పిలవగానే నేను హైదరాబద్ వచ్చానని ఎలా అనుకున్నారు. మా ఫ్రెండ్ ఫాదర్‌కి కొంచెం ప్రాబ్లెం అయితే చూడడానికి హైదరాబాద్ వచ్చాను. పనిలోపనిగా మీతో కూడా కలిసాను అంతే. ఇంతకీ అసలు మీరెవరు, చెన్నైలో ఉండగా నాకెందుకు ఫోన్ చేసేవారు” అతన్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు సిద్దార్థ్. ఆరోజు ఉదయమే ఫ్లైట్ దిగిన అతను, తన ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి తిన్నగా అక్కడకు వచ్చాడు. ఇంకా నకునారెడ్డిగారిని చూడడం కూడా అవ్వలేదు.

“ఒక్క నిమిషం ఆగండి. కూర్చుని మాట్లాడుకుందామా” పక్కనే ఉన్న కాఫీ షాప్ వైపు చూపిస్తూ అడిగాడు అతను. సిద్ధార్థ్ సరే అన్నట్లుగా తలూపి అతడిని అనుసరించాడు. అ కాఫీ షాప్‌లో హుక్కా కూడా సర్వ్ చేస్తుంటారు. వారిద్దరూ చీకటిగా ఉన్న ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు.

“ఇప్పుడు చెప్పండి మీ గురించి. అసలు నా గురించి మీకు ఎలా తెలిసింది. ఏమి ఆశించి నన్ను పదేపదే కాంటాక్ట్ చేసేవారు” అతనివంక చూస్తూ అడిగాడు సిద్ధార్థ్. ఆ చీకటిలో అతని ముఖం కొద్దిగా అస్పష్టంగా కనిపిస్తోంది.

“నా పేరు సుదర్శన్. బ్యాక్ ఎండ్ మీడియా అనే సంస్థకు డైరెక్టర్‌ను నేను” మెల్లిగా చెప్పాడు అతను.

***

“వావ్ సూపర్బ్. చిల్లింగ్. కిల్లింగ్” రోడ్ మీద గట్టిగా కేకవేస్తూ ప్రియాంకతో అంది శ్వేత.

“నీ మొహం, కార్ టైర్ పంక్చర్ అయితే కూడా నీకు థ్రిల్లింగ్‌గా ఉందా. అవతల మన దగ్గర స్టెఫినీ లేదు. దగ్గరలో మెకానిక్ షెడ్ కూడా లేదు. ఇక్కడ రోడ్ మీద చూస్తే అన్ని కార్లు హడావిడిగా పోతున్నాయి. క్యాబ్స్ అన్నీ బిజీగా ఉన్నాయట. అన్ని ఉపద్రవాలూ ఒకేసారి వచ్చి ఏమి చెయ్యాలా అని నేను ఆలోచిస్తూ ఉంటే, నీకు చిల్లింగ్‌గా ఉందా” వారిద్దరూ ఇప్పుడు ఇనార్బిట్ మాల్‌కు వెళ్ళేదారిలో ఒక ఫ్లై ఓవర్ కింద కార్ టైర్ పంక్చర్ కాగా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

“అది కాదే నేననేది. మన హీరో వస్తున్నాడు చూడు. అతడిని చూస్తుంటే నాకు ఉత్సాహం ఆగడం లేదు చిల్లింగ్, కిల్లింగ్” మళ్ళీ గట్టిగా అరిచింది శ్వేత. ఆమె అరుపులకి కోపం వచ్చినా కానీ ఏమీ అనలేక ఆమె వెళ్తున్న వైపు చూసింది.

రోడ్‌కి అటువైపు రెడ్ కలర్ హోండా సీబీఆర్ బైక్ పార్క్ చేసి దిగి నడుచుకుంటూ ఇటువైపు వస్తున్నాడు. అతను ధరించిన డార్క్ బ్రౌన్ కలర్ జెర్కిన్ లోపల వైట్ టీ షర్ట్, మేడలో బ్లాక్ కలర్ బీడ్స్ ఉన్న చిన్న చైన్ ఆ చైన్‌కు వేళ్ళాడే లవ్ మీ అనే లాకెట్, కొద్దిగా పెరిగిన గెడ్డం అతనికొక రఫ్ లుక్ ఇస్తున్నాయి.

అతను తన కూలింగ్ గ్లాసెస్ తీసి తన జెర్కిన్ పాకెట్‌లో పెట్టుకున్నాడు. ఆ పెట్టుకోవడంలో ఒకరకమైన ఎలిగెన్స్ చూపించాడు. ప్రియాంక అయితే రెప్ప ఆర్పకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. శ్వేత రోడ్ మీద వాహనాలను పట్టించుకోకుండా పరుగుపరుగున అతని దగ్గరకు వెళ్ళింది. అతను సున్నితంగా ఆమెను వారించి వాహనాలన్నీ తప్పించుకుని ఇటుపక్కకి తీసుకువచ్చాడు, ప్రియాంక కార్ వంక చూసి విషయం అర్థం చేసుకున్నాడు.

“ఇప్పుడేమి చేద్దాం” ప్రియాంకను అడిగాడు రాహుల్.

“అది తెలిస్తే నువ్వొచ్చే వరకూ ఇక్కడెందుకు వెయిట్ చేస్తాం” చిరుకోపం ప్రదర్శించింది ప్రియాంక. తను శ్వేతతో కలిపి చేతిలో చెయ్యేసుకుని రావడం ఆమెకు నచ్చలేదేమో అని అనుకున్నాడు.

“నా దగ్గర ఒక ఐడియా ఉంది” శ్వేత వైపు చూసి ప్రియాంక గమనించకుండా కన్నుకోట్టాడు రాహుల్. అతడు పార్టీకి వస్తాడని తెలియగానే బలవంతాన ప్రియాంకను అడిగి అతని ఫోన్ నెంబర్ తీసుకుని చాలా సేపు మాట్లాడింది శ్వేత. ఆమె ఉత్సాహాన్ని కాదనలేక అతను కూడా ఆమెతో మాట్లాడాడు.

“ఏంటది” ఉత్సుకత ఎక్కువకాగా అడిగింది శ్వేత.

“బైక్ మీద ….” అని కొద్దిగా ఆగాడు.

“ఇద్దరమ్మాయిలతో…” తను అతని బైక్ వైపు చూస్తూ అంది శ్వేత. అవునన్నట్లుగా తలూపాడు రాహుల్.

“వాట్” ప్రియాంక గట్టిగా అడిగింది.

“వావ్ సూపర్ రాహుల్. నీ ఐడియా అదిరింది. అస్సలే నిన్నటి నుంచీ వెదర్ కూడా చాలా రొమాంటిక్‌గా ఉంది. ఇంకా లేట్ చెయ్యద్దు. కమాన్ క్విక్ థ్రిల్లింగ్, కిల్లింగ్, చిల్లింగ్” మళ్ళీ గట్టిగా అరిచింది శ్వేత.

“ఏం మాట్లాడుతున్నావే అస్సలు అర్ధమేమైనా ఉందా. పోలీసులు ఎవరైనా పట్టుకుంటే మన పరువేమి కాను” రాహుల్ వైపు చూస్తూ వారిద్దరినీ ఉద్దేశించి అంది ప్రియాంక.

“అయితే ఒకపని చేద్దాం. నేను రాహుల్‌తో కలిపి బైక్ మీద వెళ్ళిపోతాను. నువ్విక్కడే ఉండు, మేమక్కడ ఏసీ రెస్టారెంట్‌లో ఓసీగా ఐస్ వేసిన జ్యూస్ తాగుతూ మా ఫ్రెండ్ కార్ నీకు పంపిస్తాం. ఈలోపులో రాహుల్ మేము పరిచయం పెంచుకుంటాం” ఆమెను ఏడిపించడానికి అన్నట్లు అంది శ్వేత. రాహుల్ వీరిద్దరి గొడవ చిరునవ్వుతో గమనిస్తున్నాడు.

“పోనీ ఫోన్ చెయ్యచ్చు కదా.” అడిగింది

“బాటరీ డెడ్”

“నా ఫోన్ యూజ్ చెయ్యండి” రాహుల్ ఆఫర్ చేసాడు.

 ప్రియాంక సీరియస్‌గా చూసింది.

అది గమనించిన శ్వేత “ సారీ నాకు నెంబర్ గుర్తు లేదు” ప్రియాంక వైపు చూస్తూ చిలిపిగా అంది.

“ఛీ దుర్మార్గురాలా.. నిన్నటివరకు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి. ఈరోజు ఇలా రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతావా. సిగ్గుగా లేదు నీకు” శ్వేత తలమీద మొడుతూ అంది ప్రియాంక.

“సిగ్గుగా లేదు కానీ. దాహంగా ఉంది త్వరగా టైం వేస్ట్ చెయ్యకు డార్లింగ్ రా రా” తన చెయ్యిపట్టుకు లాగుతూ తొందర చేసింది శ్వేత. ఇంక తాను ఒద్దన్నా వినే ఉద్దేశంలో లేదని తెలుసుకుని ఆమె వెంట నడుస్తోంది ప్రియాంక. తను కూడా వాళ్ళతో వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు రాహుల్.

“థ్రిల్లింగ్, కిల్లింగ్, చిల్లింగ్” ఇంతలో వారిద్దరి చేతులూ పట్టుకుని రోడ్‌కు అటువైపుగా పరిగెత్తింది శ్వేత. అందరూ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయి శ్వేత చేష్టలకు నవ్వుకున్నారు. రాహుల్ హెల్మెట్ ధరించి ఒక్కసారిగా బైక్‌ను ముందుకు దూకించాడు. విశాలమైన రోడ్డుమీద వేగంగా సాగిపోతోంది బైక్. ప్రియాంకకూ రాహుల్‌కూ మధ్యలో కూర్చుని ఉంది శ్వేత. ఆకాశంలో చిన్నచిన్నగా మబ్బులు అలుముకుంటున్నాయి, ఉండుండి చల్లటి గాలి వీస్తోంది.

ఆ గాలికి ఒక్కసారిగా వెనకనుండి రాహుల్‌ను వాటేసుకుంది శ్వేత. అంతే వెంటనే మందలిస్తున్నట్లుగా తలమీద కొట్టింది ప్రియాంక. “ఏంటే ఆ పనులు రోడ్ మీద ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇడియట్.”

“థ్రిల్లింగ్, నీకేమీ తెలీదు లే, నువ్వూరుకో”

“నోర్ముయ్ పాపం రాహుల్ ఇబ్బందిపడతాడు వదిలేయ్” ఏమనుకుందో ఏమో కానీ కిలకిలమని నవ్వుతూ రాహుల్‌ను విడిచిపెట్టింది.

మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకున్నారు. వారు వెళ్లేసరికి శ్వేత స్నేహితులంతా వారికోసం ఎదురు చూస్తున్నారు. ఎంత కాదనుకున్నా ముఖ్యమంత్రి కుమారుడు కావడం వల్ల శ్వేత స్నేహితురాలు ఒకమ్మాయి పుష్పగుచ్చంతో స్వాగతం పలికింది. రాహుల్ కొద్దిగా ఇబ్బందిపడి ఆ పుష్పగుచ్చాన్ని ప్రియాంకకు అందించాడు. అందరూ ‘ఓ’ అని శబ్దం చేస్తూ లోపలి వెళ్ళారు.

***

“సో ఆ విధంగా భూషణరావు ఇంకా నాగేశ్వరరావు. ఒకరికి తెలీకుండా ఒకరు ఒకే లక్ష్యంతో నన్ను హైర్ చేసుకున్నారు” తన గురించి, భూషణరావు కొడుకు ప్రతాప్ గురించి చెప్పాడు సుదర్శన్

“అంతా బాగానే ఉంది. కానీ మరి నన్ను కలుసుకోవడానికి మీరెందుకు ప్రయత్నించారు” అర్థం కాక అడిగాడు సిద్ధార్థ్.

“నేనసలు హైదరాబాద్ రావాలనుకున్న విషయం వేరైనప్పటికీ, మీరూ ప్రియాంక స్నేహితులనీ, మీతో ఆమె ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారని నా సోర్సెస్ ద్వారా తెలిసింది. మీతో మాట్లాడితే కనుక ఒకవేళ ఫ్యూచర్లో ప్రియాంక పార్టీలోకి వస్తే మీరు ఆమె నిర్ణయాలు ప్రభావితం చెయ్యగలుగుతారు అని నాకు అనిపిస్తోంది. అందుకే మీలాంటి వారిని కలుసుకోవడంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంటాను. ఇది నాకు నేనుగా అసైన్ చేసుకున్న టాస్క్. మీరు నాతో చెయ్యికలిపితే కనుక భూషణరావులాంటి ఇండస్ట్రీయలిస్ట్‌లనూ చాలామంది రాజకీయ నాయకులనూ ఎలా మనచేతుల్లో పెట్టుకోవాలో చూపిస్తాను. ట్రస్ట్ మీ యూ హావ్ ద పొటెన్షియల్” హుక్కా పీలుస్తూ అన్నాడు సుదర్శన్.

మొట్టమొదటిసారి తన కళ్ళద్దాలు తీయడంతో మెరిసిన అతని కళ్ళను చూసాడు సిద్ధార్థ. ఎందుకో అతని ప్రవర్తన కొంచెం అనుమానంగా అనిపించింది.

“చూడండి మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. ఎవరినీ ప్రభావితం చెయ్యను ఏ ఒక్కరికో ప్రత్యేకమైన సహాయం కూడా చెయ్యను. నాకు నిజం అనిపించినది చేస్తాను అంతే. నాకు ఎటువంటి ఉద్దేశాలు కానీ, పేరు ప్రఖ్యాతలు కావాలనుకోవడం కానీ లేదు. అర్థం చేసుకోండి, నేను చాలా సామాన్య కుటుంబం నుండి వచ్చాను. నాకు కేవలం అసామాన్యమైన స్నేహితులు ఉన్నారంతే” ఆయనతో చెప్పాడు సిద్ధార్థ్. అతనికేమో అక్కడ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అనిపించింది.

“ఆ ఒప్పుకుంటాను, ఒప్పుకుంటాను. మీరు చాలా నిజాయితీపరులే. మీకంటూ లక్ష్యాలు ఇలాంటివేమీ లేవు. ఇవన్నీ నాకు తెలుసు. కానీ ప్రతీదానికీ ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఎవరికీ ఎవరితో అవసరం పడుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే నా నెంబర్ సేవ్ చేసుకోండి. జస్ట్ గివ్ మీ ఏ కాల్ వెన్ యూ నీడ్ మీ”

“థాంక్స్” అనిచెప్పి అతడిచ్చిన కార్డ్‌ను పాకెట్లో పెట్టుకుని అతడిని అక్కడే వదిలేసి వచ్చినదారినే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్.

***

“హలో ప్రియాంక, నువ్వు నకునారెడ్డిగారి అమ్మాయివి కదూ” ఒక్కసారి తననెవరో కొత్తవ్యక్తి పలకరించడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది ప్రియాంక.

“హలో నాచిరెడ్డిగారు, బాగున్నారా. అసలు ఎలక్షన్స్ తరువాత పూర్తిగా కనుమరుగై పోయారు” రాహుల్ జోక్యం కలిగించుకుంటూ ఆ కొత్తవ్యక్తిని ఉద్దేశించి అన్నాడు. వారందరూ ఇంకా శ్వేత స్నేహితులతో పీజ్జాలు తినడంలో బిజీగానే ఉన్నారు.

ఆయనవంక ప్రశ్నార్ధకంగా చూస్తున్న ప్రియాంకతో “నేను జె.హెచ్. పార్టీ నుండి  ఎన్నికై కేంద్రమంత్రిగా చేసాను. మీ తండ్రిగారితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దురదృష్టం చూసావా నా గురించి నేనే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను నీ ఫోటో మీ ఇంట్లో చూసాను. అవునూ. మీ నాన్నగారికి బాగాలేదని విన్నాను ఇప్పుడెలా ఉంది. నేను కేంద్రంలో ఉండడం వల్ల నాకు రాష్ట్ర రాజకీయాలతో పరిచయం లేదు. ఇంతకీ రాహుల్ మన ప్రత్యర్థి పార్టీ వాడు కదా నువ్వు ఇతనితో ఉన్నట్లు మీ తండ్రిగారికి తెలుసా?” అలా ఆపకుండా మాటలవర్షం కురిపించాడు నాచిరెడ్డి.

తన బావమరిది కంపెనీ మొదటి వార్షికోత్సవ వేడుకకు హైటెక్ గ్రౌండ్స్ దగ్గరకు వచ్చిన నాచిరెడ్డి, షాపింగ్ కోసం అక్కడికి రాగా రాహుల్, ప్రియాంకలు కనపడడంతో పలకరించకుండా ఉండలేకపోయాడు.

“అబ్బే అలాంటివేమీ లేవు సర్. అవి రాజకీయాల వరకూ మాత్రమే, ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. దిస్ ఈజ్ అవర్ ప్రైవేట్ లైఫ్. ఇంతకీ సుకన్యగారు ఎలా ఉన్నారు. నీకు తెలుసా ప్రియాంక ఈయన మంచి ఫిక్షన్ రైటర్” ఆయన వంక చూస్తూ ప్రియాంకతో చెప్పాడు రాహుల్. గత కొన్ని రోజులుగా సుకన్య ఇంటికి రాలేదు. ఆ విషయం మరి రాహుల్ తెలిసే అడిగాడో మరేమో కానీ తను మాత్రం ఆ విషయం గురించి ఇంక మాట్లాడలేదు.

“వావ్ నిజంగానే థ్రిల్లింగ్, చిల్లింగ్, కిల్లింగ్. ఈయన బుక్స్ నేను కొన్ని చదివాను. అసలు మనుషులనీ అందులోనూ ఆడవాళ్ళనీ ఏరకంగా చంపచ్చో అని ఈయన తన పుస్తకంలో ఇచ్చే డిస్క్రిప్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి థాట్స్ ఎలా వస్తాయి సర్”

“హహ అది జస్ట్ పార్ట్ ఆఫ్ ఫిక్షన్ అంతే. ఒక్కోసారి నా ఊహలు అవధులు దాటుతూ ఉంటాయి. అలాంటి టైంలో నాకు అనిపించినది రాస్తాను, అంతా కూడా జస్ట్ టూ వైప్ ఆఫ్ బోర్‌డమ్ అంతే” ఆమె అడిగిన దానికి సమాధానం ఇచ్చాడు నాచిరెడ్డి. తన స్నేహితుల్లో ఆయన్ని గుర్తు పట్టిని కొందరు ఆయనతో ఫోటోలు దిగారు.

“బాబోయి ఈరోజు ఒకేచోట ఎంతమంది సెలెబ్రిటీలు కలిసారో కలిసారో, నాకు ఆనందం తట్టుకోలేక పిచ్చెక్కిపోతోంది” ఆమె అన్న మాటలతో అందరూ పగలబడి నవ్వారు.

“హలో ప్రియాంక, ఏంటి రాహుల్‌ను బుట్టలో వేసుకున్నావా” పరిగెత్తుకుంటూ వారిదగ్గరకు వచ్చిన సిద్దార్థ ఆయాసపడుతూ ఆమెను అడిగాడు.

సుదర్శన్ దగ్గర నుంచి బయటపడి ఇంటిదారి పట్టాలి అనుకుంటున్న సిద్ధార్థకు రాహుల్‌తో కలిసి నవ్వుతూ తుళ్ళుతూ, మాట్లాడుతూ కనపడింది ప్రియాంక. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు.

“నువ్వు హైదరాబాద్ ఎప్పుడొచ్చావ్ సిద్ధూ” ఆశ్చర్యంతో అడిగింది ప్రియాంక.

“మరింక నేను ఉంటాను. మీ నాన్నగారిని చూడ్డానికి తప్పకుండా వస్తాను” అనిచెప్పి వెళ్ళిపోయాడు నాచిరెడ్డి. ఒకేరోజు అంతమందిని ఒకే ప్రదేశంలో చూడడంతో ఉక్కిరిబిక్కిరి ఐపోయింది ప్రియాంక. వీరందరినీ మార్చి మార్చి అయోమయంగా చూస్తున్నాడు రాహుల్. మరికాసేపట్లో అందరూ అక్కడ నుంచి నిష్క్రమించారు.

***

“ఇప్పుడు వాళ్ళను మా వేర్‌హౌస్ దగ్గరకు షిఫ్ట్ చేసేస్తున్నాం. ఏర్పాట్లలో ఎటువంటి లోటూ ఉండదు. ఆమె తన ప్రియునితో అక్కడే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటోంది.” తనతో ఫోనులో మాట్లాడుతోంది ఒక స్వరం. సుదర్శన్ ఇంకా హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళే ఆలోచన పెట్టుకోలేదు. ప్రస్తుతానికి తను బస చేసిన హోటల్ లోనే ఉంటున్నాడు. అవతల వ్యక్తి చెప్తున్న మాటలు ఇంకా అతనికి మింగుడు పడలేదు “అంటే నన్ను హెల్ప్ అడగడమే కాకుండా మీరు కూడా రౌడీలను ఉపయోగించి ఆమెను బంధించారు అన్నమాట. ఇంకా నా సహాయం ఎందుకు మీకు.” ఆవేశంతో అడిగాడు. “నాచిరెడ్డి పైకి ప్రజల అనుమానం కలిగించేలా చెయ్యడానికి నీ అవసరం ఉంది కదా” అని ఫోన్ డిస్కనెక్ట్ చేసాడు అవతలి వ్యక్తి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here