[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది ఐదవ భాగం. [/box]
అధ్యాయం- 5
[dropcap]ఇ[/dropcap]దిలా ఉండగా తనకు పూర్తిగా స్వస్థత చేకూరడంతో పార్టీ కార్యక్రమాల్లోకి వెళ్ళడం ప్రారంభించాడు నకునారెడ్డి. ఇప్పటికే తన పార్టీలో తనపట్ల బాగా అసమ్మతి పెరిగిపోతోంది. ఒక్క ప్రసాద్ తప్ప పార్టీలో తనకు అనుకూలంగా మాట్లాడే మనుషులే కరువయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో తరచుగా వాకవుట్ చెయ్యాలంటూ తనపార్టీ వారే తనపైన ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఒకపక్క భూషణరావు ప్రతీరోజూ తనకి ఫోన్ చేసి తనని విసిగిస్తున్నాడు. తనకు ఒంట్లో బాగోలేని సమయంలో ఒక్కసారి ఫోన్ చెయ్యడం కాదు కదా. కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు, ఇప్పుడు తాను కోలుకున్నాను అని తెలియగానే తనమీద దాడి చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు.
తనకు సుస్తీ చేసిన సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జోగేశ్వరరావుతో పాటు చాలామంది తనని పలకరించడానికి వచ్చారు. వారిలో ఎక్కువమంది తననుండి ఏదో ఒక విధమైన లాభం పొందాలి అనుకున్నావారే. కానీ తనకు ఎందుకో ఒక వ్యక్తి బాగా ఆకర్షణగా అనిపించాడు. అతడు తన కుమార్తె ప్రియాంక స్నేహితుడైన సిద్ధార్థ్. తను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒకరోజు సిద్ధార్థను తీసుకువచ్చి తనకు పరిచయం చేసింది ప్రియాంక.
వాళ్ళ తల్లిదండ్రులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. తండ్రి ఒక ఇంగ్లీష్ న్యూస్‌పేపర్‌కి ఆర్టికల్స్ రాస్తాడని చెప్పింది. తామిద్దరూ భూ యాజమాన్యం గురించి రీసెర్చ్ చెయ్యాలని అనుకుంటున్నట్లుగానూ ప్రస్తతం సామాజిక పరిస్థితుల్లో దానియొక్క అవసరం చాలావరకూ ఉందనే విషయం తనకు వివరించాడు. కొన్నికొన్ని సమస్యలు రాజకీయాలు, వాగ్వివాదాల కన్నా విషయగ్రాహణ కార్యాచరణవల్ల సులువుగా పరిష్కారం అవుతాయని అతను చెప్పిన తీరు తనకి ఎంతో నచ్చింది. అంతేకాకుండా తనకు ఇటువంటి ఆలోచనలు కలగడానికి కారణం ప్రియాంకతో తనకున్న సానిహిత్యమే అని తన అభిప్రాయం అని చివరగా అతను అన్నాడు.
ప్రియాంకకు ఇవేమీ పట్టవని తను కేవలం తన పద్ధతిలోనే ముందుకు సాగిపోతుందని చెప్పాడు. ఆ సమయంలో వారిద్దరూ ఎక్కువసేపు మాట్లాడుకోవడం గమనించాడు నకునారెడ్డి. ఆ తరువాత కొన్నిరోజులకి తమ చదువు కొనసాగించడానికి వారిద్దరూ చెన్నై వెళ్ళిపోయారు. తమకు సంవత్సరాంతపు పరీక్షలు ఉన్నాయని చెప్పారు. తనకు ఆ సమయంలోనే అనిపించింది ఏంటంటే భూషణరావు లాంటివారిని టాకిల్ చెయ్యడానికి సిద్ధార్థ లాంటివారు తనకి అవసరం అవుతారని.
అంతేకాకుండా తమ పార్టీకి ఒక స్పోక్స్‌పర్సన్ లాంటివారు కావాలి. ప్రస్తుతం ఉన్నవారందరూ యువతను ఆకర్షించడంలో పెద్దగా సఫలం కాలేకపోయారనే చెప్పుకోవాలి. తన తండ్రి చేసే ప్రతీ పనినీ సపోర్ట్ చెయ్యడానికి రాహుల్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అంతేకాదు త్వరలో జనసమాజ్ పార్టీ జాతీయస్థాయి అధ్యక్షుడుగా ఎదగడానికి కూడా అతడు ప్రయత్నిస్తున్నాడు. అసలు జనసమాజ్ పార్టీ ఒక్కటే ప్రస్తుతానికి కేంద్రంతో సంబంధం లేకుండా ప్రభుత్వం చేసే ప్రతీ పనిలో సహకరిస్తున్నట్లు కనిపించినా జోగేశ్వరరావు ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉండడానికి ఇష్టపడడు.
అందుకే రాహుల్‌ను ఉపయోగించి తను చేసే పనులన్నీ ప్రభుత్వానికి అనుకూలమే అని అందరికీ భ్రమ కలిగేలా చేస్తాడు. కానీ అంతర్గతంగా అతనెప్పుడూ ఢిల్లీలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా శక్తులు కూడగట్టుకుంటూనే ఉంటాడు. అయితే ఈ విషయం బహిరంగంగా వ్యక్తమైన దాఖలాలు లేవు. ఆ విధంగా జాగ్రత్త పడతాడు జోగేశ్వరరావు. కానీ రాహుల్ మాత్రం తన తండ్రి ఏమి చెప్పినా చెయ్యడానికి సిద్ధపడతాడు.
బహుశా తన తండ్రి ప్రోత్సహించడం మీదనేమో గతంలో తనని పరామర్శించడానికి వచ్చాడు. ఈ విషయం ఎవరూ గమనించకపోయినా తాను గమనించాడు. తానెప్పుడూ ప్రియాంక విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆమెను తన సహజసిద్ధమైన ధోరణిలోనే వెళ్ళడానికి ప్రోత్సాహించాడు. తను కూడా ఇలాంటివాటికీ, ఈ రాజకీయ పోకడలకూ దూరంగా ఉంటూ ఉంటుంది. అయితే ఆమె కొంతవరకూ రాహుల్ పట్ల ఆకర్షితురాలయ్యిందనే విషయం తాను గ్రహించాడు.
అదంత ప్రమాదకరమైనది కాదని ప్రియాంక తన వ్యవహారం తానే చూసుకోగలదని ఇంక ఆమెను హెచ్చరించాలనే ఉద్దేశం మానుకున్నాడు. ఇంక సిద్ధార్థ విషయానికి వస్తే అతన్ని ఒకసారి కలిసి వ్యక్తిగతంగా మాట్లాడదాం అనుకున్నాడు. అసలు ప్రియాంక తనకు రాహుల్ జోగేశ్వరరావుకి చేసినట్లు చేస్తే తనకింక వేరేవారి అవసరం ఉండకపోయేది. కానీ ప్రత్యక్ష రాజకీయాలకు తను ఎప్పుడూ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ఆమె తనకు చెప్పింది.
అందుకే తనకు ప్రత్యామ్నాయంగా సిద్ధార్థను పార్టీలో పనిచెయ్యమని అడగడానికి నిర్ణయించుకున్నాడు. ఈమధ్యలో భూషణరావు సంబంధించిన ల్యాండ్ కేస్ ఒకటి హియరింగ్‌కు రాగా తను కూడా హాజరుకావాలని కోర్టువారు సమన్లు జారీ చేసారు. తను డిఫెన్స్ లాయర్‌తో మాట్లాడి రేపటికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అయితే భూషణరావు ఈ సమయంలో అందుబాటులో లేడు.
***
“ఏంటి నువ్వు మా డాడీతో ఈ మధ్య ఎక్కువసేపు ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు ఉన్నావ్. విషయం ఏంటి. జె.హెచ్. పార్టీలో చేరే ఉద్దేశం ఏమైనా ఉందా” అడిగింది ప్రియాంక.
తానిప్పుడు సిద్ధార్థతో కాలేజీ ఆవరణలో ఉన్న లాన్‌లో నడుస్తోంది. వారిద్దరూ అప్పుడే తమ పీజీ కోర్స్‌కి సంబంధించి ఎకడమిక్ ఆన్యువల్ ఎగ్జాం రాసి బయటకి వచ్చారు.
“అవును మాట్లాడుతున్నాను. నిజం చెప్పాలంటే మీ డాడ్‌కు ఇప్పుడు నాకన్నా నీ అవసరం ఎక్కువుంది. కానీ ఏమి చేస్తాం, నువెప్పుడూ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. ఆదర్శాలూ, అదీ ఇదీ అంటూ పనికిరాని కబుర్లు చెప్తూ ఉంటావ్. ఇన్ని ఆదర్శాలూ అవీ తెలిసిన దానివి ఆ రోజు షాపింగ్ మాల్‌లో రాహుల్ మాయలో ఎలా పడ్డావో నాకు అర్థం కాలేదు. అందుకే పాపం మీ డాడ్ ఫోన్ చేస్తుంటే నేను మాట్లాడకుండా ఉండలేకపోయాను. నువ్వు హైదరాబాద్‌లో ఉండగా మీ డాడ్‌పై జరుగుతున్న కుట్ర గురించి నాతో చెప్పావు కదా, ఆ ఐఏఎస్ ఆఫీసర్ కేస్ గురించి కూడా తను వర్రీ అవుతున్నారు. ఇక్కడేమో నిమిషనిమిషానికి రాహుల్ పాపులారిటీ పెరిగిపోతోంది. నువ్వేమో ఏమీ పట్టనట్లు ఉంటావ్. అందుకే ఆయన నాతో సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు. సిబిఐ వాళ్ళు ఇంకా ఎంక్వయిరీలు అవీ కొనసాగిస్తూనే ఉన్నారు. నేను ఆయనకు సహకరించాలి అని నిర్ణయించుకున్నాను. అయినా నేను మాట్లాడుతున్నట్లు నీకెలా తెలిసింది” అతడు ప్రియాంకను ఎదురు ప్రశ్నించాడు.
“మా డాడీ నాతోటి రాజకీయాలు తప్ప మిగిలిన అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. మా ఇద్దరి మధ్యా అలాంటి ఒప్పందం కుదిరింది. నువ్వు ఆయనకు బాగా నచ్చినట్లుగా ఉన్నావ్. నీ గురించి నన్ను పదేపదే అడుగుతున్నాడు. నువ్వు ఎలాంటివాడివి నాతో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అని” అక్కడ నుండి బయటపడి ఒక రెస్టారెంట్‌లోకి ఎంటర్ అవుతూ అంది ప్రియాంక
“మరి నువ్వేమి చెప్పావ్.”
“చెప్పడానికి ఏముంది, అంతా మన మధ్య జరిగినదే చెప్పాను. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్నంత మాత్రాన రాహుల్ జోగేశ్వరరావు గారికి సపోర్ట్ చెయ్యడం తప్పు అనడం సబబు కాదని నా అబిప్రాయం. ఎందుకో ఆయనలో రాహుల్ పట్ల విముఖత, నీ పట్ల సుముఖత ఏర్పడింది. బహుశా రాజకీయాల్లో ఉండాలంటే అనునిత్యం ఇలాంటి స్వభావం అలవరచుకోవాల్సిన అవసరం ఉంటుందేమో.
అదే మన గెలుపు ఓటములను నిర్ణయిస్తుందేమో. నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే స్వభావపరంగా చూస్తే, నీకూ రాహుల్‌కూ పెద్దగా తేడా లేదు. అయినా కానీ ఎందుకువమా డాడీ ఒకరిపట్ల మాత్రమే ఆకర్షితులు అవుతున్నారు. నా మటుకు నాకైతే ఇద్దరూ ఒకేలా అనిపిస్తారు ఇద్దరి లక్ష్యమూ ఒకటే నీకు ఓర్పూ, సహనం, నిశిత పరిశీలనా ఉన్నాయి. రాహుల్‌కు ఉత్సాహం, ఉత్తేజం, చరిస్మా ఉన్నాయి. అన్నీ వేటికవే గొప్ప లక్షణాలు అంతిమంగా వాటివల్ల ఉపయోగం ఏంటి అన్నదే ఇక్కడ కౌంట్ అవుతుంది. నాకు పక్షాలు ఎంచుకోవడం ఎప్పటికీ ఇష్టం ఉండదు. అందుకే ఇటువంటి వాటికి దూరంగా ఉండి నాకు సాధ్యమైనంతవరకు నా పక్కన వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యడానికి ట్రై చేస్తాను.”
తన స్వభావాన్ని మరొకసారి విపులంగా అతనికి వివరించింది. ఆర్డర్ సర్వ్ చెయ్యబడడంతో వారిద్దరూ తాత్కాలికంగా సంభాషణ ఆపుచేసి తినడంలో పడ్డారు.
“నాకొక విషయం అర్థం అయ్యింది ప్రియాంక. మనలో ప్రతీ ఒక్కరికీ ఒకరకమైన దృక్పథం ఉంటుంది. అందరి దృష్టిలో ఎవరికి వారే కరెక్ట్, అయితే ప్రతీ క్షణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాకపోతే హైదరాబాద్‌లో నీ ప్రవర్తనకూ, ధోరణికీ ఇక్కడ కాలేజ్‌లో నీ ప్రవర్తనకూ ధోరణికీ ఇంత వ్యత్యాసం ఎలా ఉంటుంది.
రాహుల్ చేసే ప్రతీ పని నీకు మంచిదిగానూ సమాజానికి ఉపయోగపడేదిగానూ ఎందుకు అనిపిస్తోంది. అంతేకాకుండా నువ్వు హైదరాబాద్‌లో అతనితో రాసుకుని పూసుకుని తిరగడానికి కారణం ఏంటి. ఒకపక్క మీ తండ్రిగారు అస్వస్థకు గురైతే నువ్వు ఆ విషయం వదిలేసి రాహుల్‌తో తిరగడం ఎంతవరకు సమంజసం. చెప్పు ప్రియాంక” అతని మాటల్లో తన తండ్రిపట్ల అతనికున్న సానుభూతి, తన తండ్రితో మాట్లాడడం వలన పెరిగిన స్ఫూర్తి ధ్వనించింది.
“ఏంటి జెలసీ ఫీల్ అవుతున్నావా” కొద్దిగా టాపిక్‌ను డైవర్ట్ చెయ్యడానికి అతడివంక కొంటెగా చూస్తూ అడిగింది. అయితే అతడు ఆ విషయం పట్టించుకున్నట్లు కనిపించలేదు.
“జెలసీ అనేది ఏమైనా ప్రతిఫలం ఆశించినవారికి కలిగే ఫీలింగ్. నాకు అలాంటిదేమీ లేదు అని నీకు చెప్పవలసిన అవసరం లేదు. అయితే తెలుసుకుంటే నీకే మంచిది” ఆమెకు వివరించాడు సిధ్ధార్థ్. “ఓకే ఓకే కూల్. టెన్షన్ పడకు.నేను సరదాగా జోక్ చేసానంతే. ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసావు. నీ నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటి. మా డాడీ నీతో ఏమి మాట్లాడారు” అడిగింది ప్రియాంక.
“ఏముంది ఎగ్జామ్ ఎలా రాసామో నీకు తెలిసే ఉంటుంది. ఇకపోతే మీ డాడ్ ఒక కోర్ట్ హియరింగ్‌కు అటెండ్ అవుతున్నారట. అదయ్యిన వెంటనే విశాఖపట్నం ఏరియాలో భూషణరావు అనే ఆయనను కలుసుకోవాలట.
నాకు వీలుంటే ఒకసారి నన్ను కూడా రమ్మన్నారు. అదే ఏరియాలో తన ప్రభుత్వానికి ప్రజలను అనుకూలంగా తిప్పుకోవడానికి జోగేశ్వరరావు రాహుల్‌ను ఉపయోగించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాడనే విషయం కూడా చెప్పారు” ఇద్దరూ ఆర్డర్ పూర్తి చెయ్యగానే అక్కడ నుంచి బయటపడ్డారు.
“అయితే నువ్వు జె.హెచ్. పార్టీలో చేరడానికే నిర్ణయించుకున్నావా. గతంలో నన్ను ఈ విధంగానే ప్రసాద్ అనే ఒక సీనియర్ ఎమ్మెల్యే మా డాడీకి ఆరోగ్యం బాగోలేనప్పుడు అభ్యర్ధించారు, ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరుగుతోంది నీకు అర్థం అవుతోందా” ఆమె కొంచెం ఉద్వేగంగా అతడిని ప్రశ్నించింది.
“అర్థం అయినాకానీ నేనిప్పటివరకూ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. చూద్దాం ఏమి జరుగుతుందో” ఎటూ తేల్చకుండా తన నిర్ణయాన్నో దాటవేసాడు. అక్కడితో వారిమధ్య సంభాషణ ముగియడంతో ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.
***
“నమస్తే సార్. నా పేరు గణేష్. ఇదివరకు ఒకసభలో నేను మిమ్మల్ని కలిసాను, గుర్తుపట్టరా సర్” ఫోనులో ఒక యువకుడి స్వరం ధ్వనించింది. అతన్ని ఇదివరకు తనను రాహుల్ సభకు ఆహ్వానించిన విద్యార్ధిగా గుర్తించాడు ప్రొఫెసర్ వరదరాజన్. కాలేజ్‌కు ఆరోజు సెలవు అవ్వడంవలన ఆయన ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాడు.
“ఆ గుర్తుపట్టాను. నువ్వు రాహుల్ ఫ్రెండ్‌వి కదా. ఎలా ఉన్నాడు మీ స్నేహితుడు, మీకు కాబోయే నాయకుడు” అడిగాడు వరదరాజన్. సహజంగా తను పెద్దగా మాట్లాడకపోయినా ఈ మధ్య ఎందుకో తరచుగా రాహుల్‌తో సంప్రదింపులు జరపడం వలన అతనితో సాన్నిహిత్యం పెరిగింది.
“అయ్యో మా రాహుల్‌ను అప్పుడే నాయకుడిని చెయ్యకండి సర్, మేమంతా మీలాంటి పెద్దలందరూ చూపించిన బాటలో నడిచే యువకులం. మీరెలా చెప్తే అలా చెయ్యడానికి మేము సిద్ధం సర్” కొంచెం ఇబ్బంది పడుతూ సమాధానం చెప్పాడు గణేష్. రాహుల్ ప్రోద్బలం మీదటే తాను ప్రోఫెసర్ వరదరాజన్‌కు ఫోన్ చేసాడు.
“ఇంతకీ విషయం ఏంటి గణేష్” అడిగాడు వరదరాజన్.
“ఏమీ లేదు సార్. మీరు బిజీ లేకపోతే, మీకు డిస్టర్బెన్స్ అనుకోకపోతే ఈరోజు ఈవెనింగ్ రాహుల్‌తో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి చిన్న విషయం మాట్లాడాలి సర్. అందుకే మీకు వీలవుతుందేమో అని కనుక్కుందాం అని ఫోన్ చేసాను సర్” చెప్పాడు గణేష్.
తనకి అర్థం కాలేదు ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే తనతో మాట్లాడడానికి రాహుల్ తానే స్వయంగా మాట్లాడవచ్చు కదా. తన ఫ్రెండ్‌తో మాట్లాడించడం ఎందుకు. తన మనసులో అనిపించినా ఆ విషయం బయటపెట్టలేదు ప్రొఫెసర్. తనకు అంతరాల్లో ఏదో మూల రాహుల్ ఒక రాష్ట ముఖ్యమంత్రి కుమారుడు అన్న విషయం ముద్రపడిపోయింది. అది బయటకు కనిపించదు.
“ఓకే నాకేమీ ప్రాబ్లం లేదు. మీరిద్దరూ సాయంత్రం తప్పకుండా మా ఇంటికి రావచ్చు” అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసాడు వరదరాజన్.
రాహుల్ ఏదో అవసరం కోసమే వస్తున్నాడు అన్న విషయం ఆయనకు అర్థం అయ్యింది. ఈ మధ్యకాలంలో తరచుగా తన తండ్రిగారితో కూడా ఫోన్‌లో మాట్లాడిస్తున్నాడు రాహుల్. అందుకే అతను ఏ విషయం చెప్తాడా అని కుతూహలంతో ఎదురుచూస్తున్నాడు ఆయన. బహుశా తన పార్టీ గురించి ఏమైనా మాట్లాడతాడేమో అని కూడా అనిపించింది ఎందుకో ఆ సమయంలో ప్రియాంకతో ఈ విషయం చెప్పాలని కూడా అనిపించింది. అయితే వారివారి తండ్రులు ప్రతిపక్షాల్లో ఉండడం వల్ల బహుశా ఆమె ఇబ్బంది పడవచ్చేమో ఆ ప్రయత్నం మానుకున్నాడు.
కానీ వారిద్దరి మధ్యా ఉన్న వ్యవహారం ఆయనకు తెలీదు కదా. వారిద్దరూ సాయంత్రం చెప్పిన సమయానికే తనింటికి వచ్చారు. వారు వచ్చే సమయానికి గార్డెన్లో వారికోసం ఎదురుచూస్తున్నాడు వరదరాజన్. వచ్చీ రావడంతోనే తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు రాహుల్. తండ్రి రాజకీయ లక్షణాలు వంటబట్టించుకున్నాడేమో అని ఆయనకు అనిపించింది. గణేష్ కూడా రాహుల్‌ను అనుసరించాడు.
“ఏంటి ఈ మధ్య ఢిల్లీకి చాలా ఎక్కువగా వెళ్తున్నావట కదా. ఏంటి సంగతి” అతన్ని గార్డెన్ లోకి తీసుకువెళ్తూ అడిగాడు ప్రొఫెసర్.
“అబ్బే అలాంటిదేమీ లేదులెండి సార్. జస్ట్ క్యాజువల్‌గా వెళ్తూ ఉంటాను అంతే. ఇందులో మీరు అనుకునే అటువంటి ఉద్దేశాలు లేవు. ఇంతకీ ఈ విషయం మీకెలా తెలిసింది” అడిగాడు, తను వచ్చిన విషయం మర్చిపోయి ఆయనవంక ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు రాహుల్.
“ఒక టీవీ చానెల్ వాళ్ళు నువ్వు ట్రాఫిక్‌లో స్పాట్ అయినట్లుగా ఉన్న ఇమేజెస్ చూపించారు. ఇంతకీ నా ఉద్దేశం ఏంటో నీకెలా తెలుసు” అడిగాడు రాజన్.
“ఆహా… అంటే మీ ఉద్దేశం అని కాదు, జెనరల్ పబ్లిక్ ఒపీనియన్ అని నేను అన్నది. ఈ టీవీ చానెల్ వాళ్ళ గురించి మీకు తెలిసిందే కదా ఎవరి దొరుకుతారా అని ఎదురుచూస్తూ ఉంటారు. నిజానికి నేనొక పర్సనల్ పనిమీద వెళ్ళానంతే” రాహుల్ కొద్దిగా తడబడినట్లుగా ఆయనకు అనిపించింది.
“సరే ఇప్పుడు అసలు సంగతేంటో చెప్పు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని నీ ఫ్రెండ్ గణేష్ చెప్పాడు. ఏంటది” పనమ్మాయితో వారికి డ్రింక్స్ తీసుకురమ్మని పురమాయించాడు రాజన్.
“ఏమీ లేదు సర్. మీకు మా రాష్ట్రం యొక్క పాలిటిక్స్ గురించి తెలిసే ఉంటుంది కదా” తను చెప్పదలచుకున్నడానికి ఉపోద్ఘాతంగా చెప్పాడు రాహుల్.
“కొద్దిగా తెలుసు చెప్పు చెప్పు” ఆసక్తిగా వింటూ అడిగాడు రాజన్
“అసలు మీతో ఈ విషయం డిస్కస్ చెయ్యడానికి మా డాడ్ స్వయంగా వద్దామనుకున్నారు. ఇదివరలో జరిగిన ‘హరితభూమి’ సభలో మీరిచ్చిన ప్రసంగం ఆయనను బాగా ఆకట్టుకుంది. మీకు తెలిసే ఉంటుంది మా రాష్ట్రంలో ప్రభుత్వం కొన్ని భారీ ప్రాజెక్టులు నిర్మాణం కోసం ప్రజలనుంచి భూమి సేకరిస్తోంది.
కొంతవరకూ సక్సెస్ అయినప్పటికీ ప్రాంతీయంగా కొన్ని పార్టీలు ప్రతిపక్షంతో చేతులు కలిపి ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయి. అందుకే ఈ నిరసన బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల అవగాహన పెంచడానికి మా తండ్రి జోగేశ్వరరావుగారు ఒక భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. మీరు ఆ సభకు వచ్చు అధ్యక్షత వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని ఆయన కోరిక. అది చెప్పడానికే నేనీ రోజు మీ దగ్గరకు రావడం జరిగింది. ఆయన కోరికను నెరవేర్చాలని ఆయన కుమారుడిగా నేను కూడా మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను సర్” ఈసారి అతని స్వరంలో నిజాయితీ తొణికిసలాడింది.
“జోగేశ్వరరావుగారు ఈ పనికి నన్నే ఎంచుకోవడంలో వేరే ఏమైనా ఉద్దేశం ఉండి ఉంటుందా. ఎందుకంటే నాకు తెలిసినది ప్రజలకు వివరించి వారిని ఎడ్యుకేట్ చెయ్యడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. పైపెచ్చు సంతోషం కూడా.
అయితే గతంలో ప్రియాంక కూడా నన్ను ఈ భూయాజమన్యం అంశంపైన వివరణ అడిగింది, అంతేకాకుండా తన సంవత్సరాంతపు పరీక్షలు ముగిసిన తరువాత ఇదే విషయం మీద థీసిస్ కూడా సబ్మిట్ చెయ్యాలనుకుంటున్నట్లుగా తను నాకు చెప్పింది. అందుకే నేను అక్కడికి వస్తే మీడియావారు దీనికి రాజకీయ రంగులు పులిమి మీమీద వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది” తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు ప్రొఫెసర్ వరదరాజన్.
“మీరా విషయంలో ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకండి సర్. ఇలాంటివన్నీ మాకు పెద్దగా సమస్య కాదు. మా డాడీ చూసుకుంటారు. మాకు కావాల్సింది ప్రజలకు భూ యాజమాన్యం మీద, ప్రభుత్వం ఆచరిస్తున్న విధానాల మీద నమ్మకం కలగడం మాత్రమే. సో మీరు అంగీకారం తెలిపితే చాలు” ఆఖరి అభ్యర్ధనగా అడిగాడు రాహుల్. అతనన్నదానికి సానుకూలంగా తల పంకించాడు వరదరాజన్, దానితో ముఖం చేటంత చేసుకున్న రాహుల్ “వస్తాను సర్. మీతో ప్రోగ్రాం వివరాలు షేర్ చేసుకుంటూ నిరంతరం మా గణేష్ టచ్‌లో ఉంటాడు” అని చెప్పి అక్కడనుంచి నిష్క్రమించాడు రాహుల్.
***
హై కోర్ట్ ఆవరణ అంతా కోలాహలంగా ఉంది. భూషణరావు వెర్సెస్ గవర్నమెంట్ కేస్ విషయంలో జరిగిన హియరింగ్స్‌లో ఇప్పటివరకు ఇరుపక్షాల వాదనలూ విన్న కోర్ట్ ఈరోజు తన తుది తీర్పు వెల్లడించనుంది. ఆ తీర్పు వినడానికి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మీడియా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తన ప్రభుత్వ సమయంలో భూమి ఇప్పించడం వలన నకునారెడ్డి కూడా పలుమార్లు హియరింగ్స్‌కు రావలసిన అవసరం వచ్చింది. ఈరోజు తుది తీర్పు కోసం తనతో పాటుగా గతంలో కేంద్రమంత్రి ప్రస్తుత జె.హెచ్. పార్టీ విశ్రాంతనేత నాచిరెడ్డి కూడా రావడం జరిగింది.
తన ఆరోగ్యం నలతగా ఉన్న సమయంలో తనను పరామర్శించడానికి ఒకసారి వచ్చిన నాచిరెడ్డి బహుశా అప్పటినుంచీ హైదరాబాద్లోనే ఉంటున్నట్లు తనకి తెలిసింది. తనది విశాఖపట్నం అయినా కానీ తనకూ తన భార్యకూ ఇక్కడ వ్యాపారాలు ఉండడం వల్లన ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు తనకి తెలిసింది. ఈ కేసులో తాము గెలుస్తామని నమ్మకం పూర్తిగా పోయింది. అసలు జోగేశ్వరరావు ఈ విషయం లేవదీసినప్పుడే తాను జరగబోయే పరిణామం ఏంటో గ్రహించగలిగాడు.
ప్రజలందరూ ఈ కేస్‌కు ఉన్న హై ప్రొఫైల్ స్టేటస్ వల్ల ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాబీ అంతా జనంతో కిటకిటలాడుతూ గోలగోలగా ఉంది, ఇంతలో ప్రధాన న్యాయమూర్తి రావడంతో అంతా సద్దుమణిగి ఆయనకు గౌరవంగా లేచి నుంచున్నారు. కాసేపట్లో అందరూ సర్దుకున్నాక కేస్ పూర్వాపరాలు అందరికీ పూర్తిగా వివరించిన తరువాత ప్రధాన న్యాయమూర్తి తన తీర్పును చదవడం ప్రారంభించాడు. కోర్ట్ హాల్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది, ఆ నిశ్శబ్దంలో అఖండమైన అనుభవం ప్రజ్ఞ కలిగిన న్యాయమూర్తి శర్మగారి గొంతు గంభీరంగా ధ్వనించింది.
“విశాఖపట్నం ప్రాంతం ధరణికోటలో నాలుగువందల ఎకరాల ప్రభుత్వభూమికి సంబంధించినది. సంబధిత భూషణరావు అనే వ్యక్తి వేసిన వ్యాజ్యాన్ని కోర్ట్ పరిశీలించినది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలూ విన్న కోర్టు డిఫెన్సు వారు తమ వాదనకు బలంగా ఖచ్చితమైన ఆధారాలు కోర్టుకు సమర్పించలేకపోయారు అని అభిప్రాయపడుతోంది. ఈ భూమికి ప్రభుత్వానికి సంబధించినది, దీనిని ప్రజావసారాలకు వాడుకోవడానికి మాత్రమే ప్రభుత్వం చేజిక్కించుకుంది, ఇది ప్రజా అధీన వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని మాత్రమే చెయ్యడం జరిగింది అన్న ప్రాసిక్యూషన్ వారి వాదనతో ఈ న్యాయస్థానం ఏకీభవిస్తోంది.
గత ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా భూషణరావు అనబడే వ్యక్తికి ఇవ్వబడిన స్థలం ప్రభుత్వానికి సంబంధించినదిగా కోర్టు భావిస్తూ వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా సమగ్ర ప్రజాశ్రేయస్సు కోసం తిరిగి ప్రభుత్వానికి అప్పగించవలసినదిగా ఉత్తర్వులు జారీ చేస్తోంది. అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా ఉండే విధంగా ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకునేలా తక్షణం చర్యలు తీసుకోవాలి అని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తోంది. ది కోర్ట్ ఈస్ అడ్జర్న్‌డ్” అని తీర్పును వెల్లడించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ప్రధాన న్యాయమూర్తి శర్మ.
ఆ తీర్పు వినగానే ప్రజలందరిలో విపరీతమైన సంచలనం చెలరేగింది. నకునారెడ్డి అదే ప్రదేశంలో కుప్పకూలిపోతాడేమో అని అతనికి అనిపించింది. అయితే తనపక్కనున్న నాచిరెడ్డి సహాయంతో నిలదొక్కుకోగలిగాడు. ఇప్పుడు బయట జనాల ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో తనకు అర్థం కావడంలేదు. న్యాయస్థానాన్ని ఏ సమయంలోనూ తన పలుకుబడితో, పాపులారిటీతో నకునారెడ్డి ప్రభావితం చెయ్యలేకపోయాడు అని ప్రజలందరూ భావిస్తారు.
రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో తను ఓడిపోవడంతో ప్రజల్లో కోల్పోయిన నమ్మకం ప్రస్తుతం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇంకా దిగజారిపోయి తన రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసేలాగా తయ్యారయ్యింది. తనకు మళ్ళీ గుండెపోటు వస్తుందేమో అని ఆయన ఆందోళన చెందాడు. బయటకు వెళ్తున్నప్పుడు ప్రజలు చూసే చూపులను తను తట్టుకోలేకపోయాడు. మీడియా వారందరూ తనతో మాట్లాడడానికి తన అభిప్రాయాలు తెలుసుకోవడానికీ ఎగబడుతున్నారు.
పోలీస్ యంత్రాంగాన్ని దాటి ఇంతలో ఎలా వచ్చాడో తెలీదు కానీ ఒక టీవీ ఛానెల్ జర్నలిస్ట్ వారందరినీ తోసుకుని తన దగ్గరకు మైకుతో పరిగెత్తుకుంటూ వచ్చేసాడు, అతని వెనకొక కెమెరామెన్ ఉన్నాడు. ఆ ఒక్క జర్నలిస్ట్ ధైర్యం చెయ్యడంతో అమాంతం మిగతా ఛానెల్స్ వాళ్ళందరూ తనను చుట్టుముట్టారు. ఆ గుంపుకు దూరంగా నాచిరెడ్డి వేరుకాబడ్డాడు. ఒక్కసారిగా వచ్చిపడిన ఆ మీడియా సమూహాన్ని కట్టడి చెయ్యడం పోలీస్ వారికి సాధ్యం కాలేదు.
అందుకే వారు కూడా ఏమి జరుగుతుందా అని నిస్సహాయంగా ఎదురుచూస్తున్నారు. నకునారెడ్డికి దూరంగా ఉండి ప్రశ్నలు అడిగేలా అయినా కనీసం చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ వారు.
“మీరు ఏమి ప్రశ్నించదలుచుకుంటున్నారో నాకు తెలుసు. కనుక ప్రశ్న చాలా క్లుప్తంగా ఉండేలా ప్రయత్నించండి” సూటిగా వారివంక చూస్తూ చెప్పాడు నకునారెడ్డి.
“ఈ కేస్ మీరు ఓడిపోయారు అంటే ప్రజల దృష్టిలోనూ, మీ పార్టీ వర్గాల్లో కూడా పూర్తిగా మీపైన నమ్మకం సడలిపోయినట్లు అయ్యింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి?” అంతే సూటిగా అడిగాడు ఒక యువజర్నలిస్ట్.
“చూడు బాబూ నాకు న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది. ఈ తీర్పు న్యాయస్థానం ఇచ్చింది కానీ ప్రజలు కాదు. అందుకే ప్రజల దృష్టిలో నమ్మకం ఉందా లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. అందులోనూ ఇది ప్రత్యక్షంగా నాతో సంబంధం ఉన్న కేస్ కాదు. అందువల్ల నాకు కానీ, పార్టీకి కానీ పెద్దగా నష్టం జరగలేదనే చెప్పవచ్చు” ఇరవై ఐదేళ్ళు కూడా మించని ఆ ప్రశ్న అడిగిన యువకుడిని ఉద్దేశించి అన్నాడు నకునారెడ్డి.
“అయితే ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారా. మీరు సమర్థవంతమైన ప్రతిపక్షంగా వ్యవహిరించలేకపోతున్నారు అనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. దీనికి మీ సమాధానం ఏంటి” అతడు లైవ్‌లో తనను ఎన్‌కౌంటర్ చేస్తున్నట్లు అనిపించింది
“అది నిర్ణయించుకోవలసినది నేను కాదు, ఈ కేసును ఎవరైతే న్యాయస్థానం దృష్టిలోకి తీసుకువచ్చారో వారే. ప్రధాన ప్రతిపక్షంగా మేము లేనప్పుడు మా ఒక్కరిమీదే ప్రజలు అసంతృప్తిగా ఉంటారని నేను అస్సలు అనుకోను, ఈ కేసులో నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి మాత్రమే. ప్రత్యేక కోర్టు ఆహ్వానం మీదట హియరింగ్స్‌లో పాల్గొనడం జరిగింది.” ఈ విషయం చెప్పి అక్కడదున్నవారిని అందరినీ తప్పించుకుని బయటకు వెళ్ళాడు నకునారెడ్డి. ఈసారి పోలీసులు వారిని కట్టడి చెయ్యడంలో సఫలం అయ్యారు.
తను వెళ్తుంటే తనని ఒదిలేసి ఇద్దరు ముగ్గురు జర్నలిస్ట్‌లు నాచిరెడ్డి దగ్గరకు పరుగులు తీయడం కంటపడింది. ఇంక తను అక్కడ ఉండడం ఇష్టంలేక తన సిబ్బంది వెంటరాగా ఆ ప్రాంగణం నుండి వెళ్ళిపోయాడు.
“ప్రస్తుతం పార్టీలో విశ్రాంతంగా ఉన్న మీరు ఈ కేసుతో రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెడదామనే ఉద్దేశంలో ఉన్నారా” అడిగాడు ఒక జర్నలిస్ట్.
“అలాంటిదేమీ లేదు. నకునారెడ్డి గారు పార్టీలో సీనియర్ నాయకులు. కేంద్రంలో చాలాసార్లు తన ఎంపీలతో ప్రభుత్వానికి బలం చేకూర్చినవారు, అంతేకాకుండా మూడుసార్లు తన నాయకత్వంతో పార్టీని ప్రభుత్వాన్ని ముందుకు నడిపించినవారు. అటువంటి ఆయనకు మోరల్ సపోర్ట్‌గా ఉండడానికి మాత్రమే నేనిక్కడకు వచ్చాను తప్పితే ఇందులో ఎటువంటి రాజకీయాలూ లేవు. అందులోనూ నకునారెడ్డిగారు అన్నట్లుగా ఇది పార్టీకి సంబంధం లేని విషయం, భూషణరావు గారి స్వవిషయం అని నా అభిప్రాయం.” అతను ఈ మాటలు అనేప్పటికి అక్కడ వారు ఏమీ మాట్లాడలేకపోయారు.
ఇది అదునుగా తీసుకున్న ఒక యువతి “సర్ గత కొన్నిరోజులుగా మీ భార్య సుకన్య కనిపించడం లేదు అని తెలిసింది, పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. దీనిపైన మీ కామెంట్ ఏంటి. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా” అడిగింది. ఆమె తరచుగా నాచిరెడ్డి చేసే రచనలను ఫాలో అవుతూ ఉంటుంది.
“ఇది కొంచెం వ్యక్తిగతమైన అంశం, ఐనప్పటికీ దర్యాప్తు చేస్తున్నారు అని మీరే అన్నారు కదా. ఇంక అందులో మాట్లాడడానికి ఏముంది. ఇంక ఆమెను కిడ్నాప్ చెయ్యడం అంటారా నాకు తెలిసి అలాంటిది ఏదైనా ఉంటే నాకన్నా ముందు మీరే బాగా బయటపెట్టగలుగుతారు” మీడియావారిని ఉద్దేశించి అన్నాడు నాచిరెడ్డి.
“సర్ అంటే మీరు కొత్తగా రచన చెయ్యడానికి ప్రస్తుతం జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వాటిల్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటున్నారా. మీ భార్య కనపడకపోవడం విషయంలో మీపాత్ర ఎంతవరకూ ఉంది. మీ ఇద్దరిమధ్య మనస్పర్ధలు ఏమైనా వచ్చాయా. లాస్ట్ టైం ఆమెను టెన్నిస్ ప్లేయర్ చరణ్ ఇచ్చిన పార్టీ దగ్గర చూసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది” ఆ యువతే మళ్ళీ అతడిని అడిగింది. ఆమె ఎలాగైనా అతడితో తనకు కావాల్సింది చెప్పించాలి అనుకుంటోంది.
మొదట కొద్దిగా ఇబ్బంది పడినా వెంటనే సర్దుకుని “ ఐ థింక్ దిస్ ఈస్ గెట్టింగ్ టూ మచ్ పర్సనల్. ఒకవేళ పుస్తకం రాసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ మీకే చెప్తాను. ఇన్‌ఫాక్ట్ ఈ స్టొరీ అంతా బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి నాకన్నా మీరే బాగా బుక్ రాయచ్చేమో. ఆలోచించండి” అతనన్న మాటలకు సన్నగా నవ్వులు వినిపించాయి. ఈ మధ్యలో వారి ప్రశ్నలకు పూర్తిగా సమాధానం చెప్పకుండా అక్కడనుండి జారుకున్నాడు నాచిరెడ్డి.
***
“హలో సిద్ధార్థ్” ఫోన్ లో వినిపించిన గంభీరమైన స్వరానికి ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు సిద్ధార్థ.
“హలో సర్ చెప్పండి. ఎలా ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా” అతను కొద్దిగా తడబడుతున్నట్లున్నాడు.
ఎందుకో నకునారెడ్డి ఎదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికే ఫోన్ చేసినట్లుగా అతనికి అనిపించింది.
“ఈరోజుతో మీ పరిక్షలు అయిపోతాయని చెప్పావు కదా అందుకే మాట్లాడదామని ఫోన్ చేసాను. భూషణరావు కేస్ విషయంలో హై కోర్ట్ ఇచ్చిన తీర్పు నీకీపాటికే తెలిసుండాలి” గంభీరమైన ఆయన స్వరం కొద్దిగా ఒణుకుతున్న భావన కలిగింది.
“ఆ టీవీలో చూసాను సర్. ఇందులో మనం చెయ్యగలిగినది కూడా ఏమీ లేదు అని అందరికీ తెలుసు కదా” తను కూడా గత కొన్నిరోజులుగా ఈ కేసును ఫాలో అవుతున్నాడు సిద్ధార్థ.
“ఆ సంగతి మనకీ ప్రజలకూ తెలుసుకానీ, భూషణరావు లాంటి పెట్టుబడిదార్లకు తెలీదు కదా. అందుకనే అతను తప్పంతా నాదే అన్నట్లుగా ప్రవర్తిస్తాడు. అతడిని ఫేస్ చెయ్యడం నావల్ల కావడంలేదు, నా ఆరోగ్యం కూడా అందుకు సహకరించడం లేదు. ఈ విషయం నేను ప్రియాంకతో కన్నా నీతో చర్చించడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఆమె నా ఆరోగ్యం గురించైతే పట్టించుకుంటుంది కానీ నా మనోవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించదు” ఆయన గొంతులో ఎదో పూడుకున్నట్లుగా ఉన్నాయి ఆ మాటలు.
“ఏం చేద్దాం అనుకుంటున్నారు సర్.” అర్థం కానట్లుగా అడిగాడు సిద్ధార్థ్.
“నాది ఒకటే కోరిక సిద్ధూ. ఈ కాలంలో యువతకు సామాజిక స్పృహ చాలా తక్కువగా ఉంది. ఇంట్లో మొక్క నాటి ఫేస్‌బుక్‌లో ఫోటో పెడితే తమ బాధ్యత తీరిపోయినట్లు అనుకుంటున్నారు, ఇది ఎంతవరకు ఎవరికి సహాయం చేస్తుందో ఎవరికి తెలుసు. ఒకవేళ అలాంటి బాధ్యత ఉన్నా కూడా అది ఏదో ప్రతిఫలాపేక్షతో ముడిపడి ఉంటుంది.
నువ్వు హైదరాబాద్‌లో నన్ను కలిసిన దగ్గర నుంచీ నీ గురించి నేను తెలుసుకుంటూ వచ్చాను. నీలాంటివారి కోసమే నేను ఇంతకాలంగా ఎదురుచూసినది. అభ్యుదయ భావాలున్న యువకులు ఈ సమయంలో పార్టీకి ఎంతో అవసరం. అందుకే నువ్వు పార్టీలో ఇమ్మీడియెట్‌గా చేరవలసినదిగా నేను భావిస్తున్నాను. ఇది నా అభ్యర్ధన అనుకో సిద్ధూ. నువ్వు పార్టీ స్పోక్స్‌పర్సన్‌గా, స్ట్రేటజిస్ట్‌గా ఉండాలని నేను ప్రతిపాదిస్తున్నాను” ఆయన ఉత్సాహంగా తన పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నట్లుగా తనతో మాట్లాడాడు. తనకి ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.
“సర్ ఈ సమయంలో మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల పార్టీలో మీపట్ల వ్యతిరేకత ఎక్కువ కావచ్చు. పైగా నాకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదు కదా. నేను మీ పార్టీలో ఇమడగలనంటారా” తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు సిద్ధూ.
“ప్రస్తుతం కావాల్సింది రాజకీయ అనుభవం కాదు సిద్ధూ, ఒక వినూత్నమైన ఆలోచన, కార్యాచరణ, అభ్యుదయ దృక్పధం, వీటినీ ఎవరూ కాదనలేరు, అటువంటివాటి పట్ల వ్యతిరేకత వస్తుంది అని నేను అనుకోను. ఒకవేళ వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. పైగా భూషణరావు లాంటి లబ్దిదారులను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వారి ఎత్తుగడలను తిప్పికొట్టడానికి యువరక్తం అవసరం కూడా ఎంతో ఉంది. అందుకనే నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా నా కోరికను మన్నిస్తావని ఆశిస్తున్నాను” అతనిని అడిగాడు నకునారెడ్డి. బహుశా ఈ మధ్యకాలంలో ఆయన మనసు విప్పి మాట్లాడింది సిద్ధార్థతోనే అయి ఉంటుంది అని అతనికి అనిపించింది. అందుకే ఆయన అభ్యర్ధనను కాదనలేకపోయాడు.
“అంతా ఒప్పుకుంటాను సర్. నన్ను ఇప్పుడు ఏం చెయ్యమని మీ అభిప్రాయం. మీకోరిక ప్రకారం పార్టీలో చేరడానికి నాకు సమ్మతమే.” ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలాగ ఆయనతో అన్నాడు సిద్ధార్థ్.
“నువ్వు ఇప్పుడు ఇమ్మీడియెట్‌గా విశాఖపట్నం వెళ్లి భూషణరావుని కలుసుకోవాలి. కేసు ఓడిపోయినందుకు అతను ఏమైనా సంజాయిషీ అడిగితే సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా ఆ ఏరియా గురించి బాగా రీసెర్చ్ చెయ్యి, సాధ్యమైనంత ఎక్కువమందిని కలిసి నీ ఇన్ఫర్మేషన్ నువ్వు కలెక్ట్ చేసుకో. రెండు మూడు సభల్లో కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నిన్ను ఇప్పుడే పార్టీలోకి తీసుకుంటున్నట్లుగా పార్టీలో అందరికీ చెప్తాను. మిగతా విషయాలు లోకల్‌గా ఉన్న కార్యకర్తలు చూసుకుంటారు. నువ్వు ప్రసాద్ అనే ఆయనతో టచ్‌లో ఉండు. ఆయన నీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తారు. అండ్ ప్లీజ్ డూ రిమెంబర్ టూ యూజ్ యువర్ కంప్లీట్ పవర్స్ ఎట్ డిస్‌పోజల్.” అని చెప్పి తనకు రెండో మాటకు అవకాశం లేకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసాడు నకునారెడ్డి.
ఆయనతో ఈరోజు జరిగిన సంభాషణ చాలా కొత్తగా అనిపించింది. విశాఖపట్నం వెళ్లేముందు తను కూడా గ్రౌండ్ వర్క్ చెయ్యాలి అనుకున్నాడు. నకునారెడ్డి తనమీద చాలా పెద్దబరువునే మోపినట్లుగా భావించాడు. ఆయన మాటలను బట్టి తను ఎదుర్కోబోయేది ఎలాంటి సంఘటనలో అతనికి అర్ధమయ్యింది, అందుకే ఒక వ్యక్తి తను హెల్ప్ అవుతాడు అనిపించింది, వెంటనే అతనికి కాల్ చేసాడు “హలో సుదర్శన్ హియర్” అవతలవైపు నుంచి వినవచ్చింది సన్నగా బొంగురుగా ఉన్న కంఠం.
“నమస్తే మిస్టర్ సుదర్శన్. నాపేరు సిద్ధార్థ. ఇదివరకు మనం ఒకసారి హైదరాబాద్‌లో కలిసాం. ఐ థింక్ యూ రిమెంబర్ మీ రైట్?” అడిగాడు సిద్ధార్థ్
“అఫ్‌కోర్స్ ఐ రిమెంబర్ యూ. మిమ్మల్నెలా మర్చిపోతాను, నా అంతట నేనే కదా మిమ్మల్ని కాంటాక్ట్ చేసాను. మీరే స్వయంగా ఎప్పుడో నాకు కాల్ చేస్తారనే విషయం కూడా తెలుసు” అన్నాడు సుదర్శన్
“ఎలా తెలుసు”
“మీకు పొటెన్షియల్ ఉందని నేను అప్పుడే చెప్పను కదా. పొటెన్షియల్ ఉన్న క్లైంట్స్‌ను గుర్తుపట్టడంలోనే నా పొటెన్షియల్ ఉంది. అందుకే ఆ విషయంలో నేనెప్పుడూ తప్పు చెయ్యను” సిద్ధార్థతో అన్నాడు సుదర్శన్.
“వెరీ క్లెవర్. సరే అయితే నేను జె.హెచ్. పార్టీలో చేరుతున్నాను అన్నవిషయం కూడా మీకు ముందే తెలుసా” అడిగాడు సిద్ధార్థ్.
“ముందే తెలీదు కానీ ఊహించాను. చెప్పండి నేను మీకెలా సహాయపడగలను” అతనొక పక్కా బిజినెస్మెన్ లాగా అనిపించాడు సిద్ధార్థకు.
“నాకు భూషణరావు, జోగేశ్వరరావు గురించి పూర్తి వివరాలు కావాలి. నేను త్వరలో విశాఖపట్నం రాబోతున్నాను” తన అసలు అవసరాన్ని అంతసేపటికి బయటపెట్టాడు సిద్ధార్థ.
“డెఫినెట్లీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. అయితే కొంతకాలం మనం పర్సనల్‌గా కలవకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఇప్పటికే నేను భూషణరావు కుమారుడు ప్రతాప్‌తో కలిసి ఒక కేస్ మీద వర్క్ చేస్తున్నాను. కాబట్టి లేనిపోని అనుమానాలకు తావివ్వడం మంచిది కాదు అవసరమైనప్పుడు నేనే మీటింగ్ అరేంజ్ చేసి మిమ్మల్ని మీట్ అవుతాను. మీకు మీరు అడిగిన ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంకొకరిది కూడా బోనస్‌గా ఇస్తున్నాను. నాకు ఎందుకో ఇది మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తోంది” చెప్పాడు
“ఎవరి గురించి మీరు మాట్లాడేది” అర్థంకానట్లుగా అడిగాడు సిద్ధార్థ.
“జె.హెచ్. పార్టీలో గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన నాచిరెడ్డి గురించి. మిగిలిన వివరాలు నేను మీకు ఫోన్లో కాకుండా మా ప్రతినిధి ద్వారా పంపిస్తాను. ఆల్ ద బెస్ట్” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సుదర్శన్.
తను విశాఖపట్నం వెళ్ళడానికి ప్రణాళిక రూపొందించుకున్నాడు సిద్దార్థ. ఇప్పటికే రాహుల్ అక్కడికి వెళ్లి తన తండ్రి తరఫున ఒక సభ నిర్వహించడంలో బిజీగా ఉన్నాడని తెలుసుకున్నాడు సిద్ధార్థ. ప్రొఫెసర్ వరదరాజన్ కూడా అతనికి సహాయం చేస్తున్నట్లుగా తనకి తెలిసింది. తను ఒకవేళ రాహుల్‌ను ఎదుర్కోవాలంటే ఏ విధంగా స్పందించాలి అనే విషయం మీద కూడా తన అంతరంగాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఇది జరిగిన రెండు మూడు రోజుల తరువాత అన్ని ప్రముఖ పత్రికల్లో సిద్ధార్థ జె.హెచ్. పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయం ప్రియాంకకు తెలిసినా తను పెద్దగా స్పందించలేదు.