Site icon Sanchika

రాజకీయ వివాహం-6

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం’. ఇది ఆరవ భాగం. [/box]

అధ్యాయం- 6

[dropcap]“ఇ[/dropcap]దంతా ఒకపెద్ద పొలిటికల్ గ్యాంబుల్ సుకన్యా. మనకు తెలియకుండానే మనం ఈ ఉచ్చులో ఇరుక్కుని చాలా రోజులుగా ఇక్కడ బందీలుగా ఉన్నాము” తనపక్కనున్న సుకన్యను ఉద్దేశించి అన్నాడు చరణ్.

వారిద్దరూ ఊరికి దూరంగా ఉన్న ఒక గోడౌన్లో బంధింపబడ్డారు. వారిని ఎవరు ఇక్కడికి తీసుకువచ్చారో కూడా వారికి తెలీదు. ఆ బిల్డింగ్‌లో మాత్రం నిరంతరం గన్‌మెన్లు తిరుగుతూనే ఉంటారు. తమకి ప్రతీరోజూ అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ ఉంటారు అక్కడున్న వ్యక్తులు. అసలు ఏమి ప్రతిఫలం ఆశించి తమ ఇద్దరినీ ఇక్కడ బంధించారో ఎంత ఆలోచించినా సుకన్యకు అర్థం కాదు. ఆ బిల్డింగ్‌కు నాలుగువైపులా ఉన్న ప్రహారీగోడపైన ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వెయ్యబడి ఉంది.

“అవును ఇప్పుడిప్పుడే ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థం అవుతోంది. దీనివెనుక ఎవరెవరి హస్తాలు ఉన్నాయో కూడా నాకు తెలిసింది సుకన్యా” ఆమె నిశ్శబ్దంగా ఉండేసరికి తానే మళ్ళీ అన్నాడు చరణ్.

“నువ్వేమి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు చరణ్. అసలు మన ఇద్దరికీ ఉన్న సంబంధం గురించి బయట ప్రపంచానికి తెలుస్తుందనే నేను అనుకోను. అలాంటిది ఇద్దరినీ కలిపి ఇంతకాలం బంధించడంలో వారి ఉద్దేశం ఏంటి. పోనీ వారి కోరికేంటో చెప్పడం అటుంచు కనీసం వారి నాయకుడు ఎవరో కూడా ఇప్పటివరకు తెలీదు. ఆరోజు ప్రతాప్ బర్త్ డే ఫంక్షన్‌కు నువ్వు ఇన్వైట్ చేసిన దగ్గర నుండీ ఇదంతా స్టార్ట్ అయ్యిందని నా నమ్మకం” తనకి తెలిసిన విషయాన్ని అతనితో షేర్ చేసుకుంది సుకన్య.

గత కొంత కాలంగా ఇలా చీకట్లో మగ్గిపోవడం వలన ఆమెకు తన పాపవైపు, భర్త నాచిరెడ్డి వైపు మనసు మళ్ళింది. తను బందీ అవ్వడానికి ముందే అసలు నాచిరెడ్డి ప్రవర్తనలో మార్పు తను గమనించింది. ఇది జరిగిన తరువాత తను ఎంత ఆవేదన చెండుతున్నాడో, తన పాప పరిస్థితి ఎలా ఉందో అని ఆమెకు దిగులు ఎక్కువైంది.

“నువ్వు అనుకుంటున్నట్లుగా ఇది ఆ రోజు నుంచే స్టార్ట్ అయ్యిందని నా అభిప్రాయం కూడా. ఇదంతా నీ భర్త నాచిరెడ్డిని డీఫేం చెయ్యడానికి ఆడుతున్న డ్రామా ఏమో అని నాకు అనిపిస్తోంది. మనం ఇక్కడ ఉండగానే, మన ఇద్దరి రిలేషన్ మీద ఊహాగానాలూ దుష్ప్రచారాలూ జరుగుతూనే ఉంటాయి అని నా అభిప్రాయం.

వీటన్నిటినీ నాచిరెడ్డి గారి రాజకీయ జీవితంతో ముడిపెట్టి ఆయనను భూస్థాపితం చెయ్యడమే ఆయన ప్రత్యర్థుల లక్ష్యం అయ్యుంటుంది. ఇందుకు ఆధారంగా నాకు ఇదివరకు ఎవరో ఒక తెలియని వ్యక్తి నుండి హెచ్చరిక కాల్ కూడా వచ్చింది. అయితే నేను పెద్దగా పట్టించుకోలేదు. బహుశా ఆ నిర్లక్ష్యమే ప్రస్తుత మన పరిస్థితికి కారణం అయ్యుంటుంది. ఇంకా మనం ఎన్నిరోజులు ఉండాలో. మనకి విముక్తి ఎప్పుడు కలుగుతుందో ఇక్కడనుంచి.” ఆమెతో అన్నాడు చరణ్.

“నాకెందుకో వీళ్ళు మనల్ని ఒదులుతారు అని అనిపించడం లేదు. అందుకే మనమే తప్పించుకోవాలి. ఇప్పటివరకు కనీసం చూచాయగా అయినా నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా పోయింది. ఇంతకీ ఆయన ప్రత్యర్ధులు ఎవరి ఉంటారని నీ అభిప్రాయం” అడిగింది సుకన్య.

“వీళ్ళు అని ప్రత్యేకంగా చెప్పను కానీ నా దృష్టిలో ఇద్దరున్నారు. అందులో మొదటివారు జనసమాజ్ పార్టీ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జోగేశ్వరరావు గారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా నాచిరెడ్డి గారిని ఈ స్పోర్ట్స్ వివాదంలోకి లాగి తద్వారా ఎన్నికల్లో ఓడించినది ఆయనే. ఇప్పుడు మళ్ళీ తిరిగి తన బలం పుంజుకోకుండా ఉండడానికి, తనకు ఎదురు రాకుండా ఉండడానికి నిన్ను నన్ను కలిపి బంధించి ఆ నేరానికి నాచిరెడ్డిగారే కారణం అని ప్రజలను నమ్మించే విధంగా ఆయన ప్రయత్నిస్తున్నాడట.

ఇక రెండో వ్యక్తి భూషణరావు, ప్రతాప్ ద్వారా అతను నాతో పరిచయం పెంచుకుని నిన్ను హతమార్చడానికి చూస్తున్నాడు. ఈ విషయం కూడా నాకు ఆ కాల్ చేసిన వ్యక్తే చెప్పాడు. మరి దీనివల్ల ఆయనకొచ్చే లాభం ఏంటో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అసలు మనం ఇందులో పావులు కావడమే నాకెంతో విచిత్రంగా ఉంది” తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఆమెతో చెప్పేశాడు చరణ్.

ఆమె అతని వంక నిస్సహాయంగా చూస్తూ “మరింత జరుగుతున్నా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదే. అసలు ప్రతాప్ పరిచయంతోనే ఇదంతా ప్రారంభం అయ్యింది కనుక మనిద్దరి కిడ్నాప్‌కు కూడా కారణం అతనే అయ్యుంటాడు. అసలిప్పుడు అతనెక్కడ ఉన్నాడో నీకేమైనా తెలుసా” అడిగింది సుకన్య.

“నీతో ఏమి చెప్పమంటావ్ సుకన్యా. అసలే బయట ప్రపంచం మన గురించి ఏదేదో అనుకుంటోంది. ఇంకా ఎక్కువగా మన వెనక కట్టుకథలు అల్లుతోంది. అలాంటప్పుడు నేను నీతో విలాంటి విషయాలు షేర్ చేసుకోవడానికి కలుస్తూ ఉంటే, వారి మాటలకు బలం చేకూర్చినట్లు అవుతుంది. ఈ అంతట్లో మీ భర్త నాచిరెడ్డి ఎంత మనోవేదన అనుభవించి ఉంటాడో కొంచెమైనా ఆలోచించావా.

ఆయన ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయి చాలా చిక్కుల్లో ఉన్నారు. అందుకే ఇలాంటి తలా తోకా లేని అనుమానాలు, వార్తలూ తెలిసినా లేదా ఎవరినోట అయినా విన్నా ఇంకా ఎక్కువ కుంగిపోతారని తెలిసి నేను పెద్దగా నీతో మాట్లాడలేదు. అయినా మనం ఇక్కడికి వచ్చేవరకు నాతో మాట్లాడిన వ్యక్తి హెచ్చరికలు నిజమవుతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిజమయ్యాయి కనుక ఇక ముందర ఏమి చెయ్యాలో ఆలోచించాలి” ఆమెతో అన్నాడు చరణ్.

ఇంతలో ముసుగు ధరించి మిలటరీ దుస్తులు లాంటో దుస్తుల్లో ఉన్న వ్యక్తులు తుపాకులతో వచ్చి తమను అక్కడ నుండి వేరే గదిలోకి తరలించారు. ఈసారి ఉంచిన గదిలో కన్నుపొడుచుకున్నా కానరానంత చీకటి అలుముకుని ఉంది. ఎందుకో అనుకోకుండా ఆ సమయంలో వారి ఒంట్లోకి భయం ప్రవేశించింది.

“ఇక్కడ మనం ఎక్కువ కాలం ఉండవేమో అనిపిస్తోంది చరణ్. బహుశా ఈ ప్రదేశంలో మన ప్రాణాలకి కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందనిపిస్తోంది. వీళ్ల ధోరణి చూస్తుంటే పనులను వేగవంతం చేస్తున్నట్లు అనిపిస్తోంది” ఆందోళన నిండిన కంఠంతో అంది సుకన్య.

తన భర్త చాలా సమయాల్లో తనను ప్రయివేట్ సెక్యూరిటీ పెట్టుకోమని తనకి సలహా ఇచ్చాడు, అప్పుడు తను ఆ మాట వినకపోవడం వలన పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తోంది అనిపిస్తోంది ఆమెకు. భర్తను తలుచుకునేప్పటికి అప్రయత్నంగా ఆమె కంట్లో నీళ్ళు తిరిగాయి, చిమ్మచీకటిగా ఉండడం వలన వాటిని గమనించలేకపోయాడు చరణ్.

“దిగులు పడకు సుకన్యా. వారు మనల్ని తీసుకొచ్చే మార్గంలో నాకు జంతువుల శబ్దంతో పాటు కొన్ని వాహనాలు ధ్వనులు కూడా వినిపించాయి, నాకు తెలిసి మనం ఏదో అడవి ప్రాంతంలో ఉండి ఉంటాము. ఇక్కడ నుండి బయటపడడానికి మనకి ఆ వాహనాల్లో ఒకటి కావాలి. ఎలాగైనా వాటిని దక్కించుకుందాం. డోంట్ వర్రీ” అని చెప్పి తన బంధాలను విడిపించుకోవడానికి సిద్ధపడ్డాడు చరణ్.

***

తన పరీక్షలు అయిపోయిన తరువాత తనతో మాట మాత్రం అయినా చెప్పకుండా జె.హెచ్. పార్టీలో చేరిన సిధ్ధార్థ పట్ల చాలా కోపంగా ఉంది ప్రియాంక. అయితే ఎవరితోనూ ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఆఖరికి తన తండ్రి నకునారెడ్డి ప్రస్తుతానికి రీసెర్చ్ సంగతి పక్కన పెట్టమన్నాడు. అందుకే హైదరాబాద్ తన తండ్రి దగ్గరకు వచ్చేసింది. ప్రస్తుతం తను ఏమి చెయ్యాలో అని ఆమె ఇంకా నిర్ణయించుకోలేకపోతోంది.

ఒకపక్క రాహుల్ రోజురోజుకీ తండ్రికి సపోర్ట్‌గా దూసుకువెళ్ళిపోతున్నాడు. నూతనంగా వ్యర్థనిర్వహణ ద్వారా విద్యుదుత్పత్తి చేసే ఒక పవర్ ప్లాంట్‌ను కూడా జోగేశ్వరరావు ప్రభుత్వం ప్రయివేట్ భాగస్వామ్యంతో సమర్ధవంతంగా మొదలుపెట్టింది. దానికి రాహుల్ భారీ ఎత్తున ప్రచారం కూడా నిర్వహించాడు. మరొకపక్క తన తండ్రిని కలిసే అసమ్మతివాదుల యొక్క తాకిడి రోజురోజుకూ అధికమవుతోంది.

ప్రతీ ఒక్కరిదీ ఏదో ఒక సమస్య అది తీర్చకపోతే కోపతాపాలు, వ్యతిరేకత, బెదిరింపు ఆ తరువాత బదలాయింపు ఇదీ వరస. ప్రొఫెసర్ వరదరాజన్ కూడా రాహుల్‌కి సహకరిస్తున్నాడు అని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. అయితే తను ఆ విషయాన్ని నమ్మడానికి సిద్ధంగా లేదు, ఆయనమీద తనకెంతో నమ్మకం ఉంది, కేవలం సభల్లో పాల్గొన్నంత మాత్రాన ఒక పక్షం వహిస్తున్నారని నిశ్చయంగా చెప్పలేము అని ఆమె అభిప్రాయం.

ఇకపోతే తండ్రి గురించే ఆమె దిగులంతా. ఈ వయసులో కూడా ప్రజాలకేదో మంచి చెయ్యాలనే ఆలోచన మంచిదైనా కానీ అయన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని చూస్తే అది ఆమెకు ఇబ్బంది కలిగిస్తోంది. దీనికి తోడు సిబిఐ విచారణ ఒకటి. ఇదిలా ఉండగా నకునారెడ్డిని కలుసుకోవడానికి ఒక రైతు కుటుంబం వచ్చింది.

పదెకరాలు స్థలం కలిగిన భూస్వామి అతను, ఏదో ప్రాజెక్ట్ పేరు చెప్పి ప్రభుత్వం తన నుంచి తక్కువధరకు స్వాధీనపరుచుకోవాలి అనుకుంటోంది అని, తను తన కుటుంబం ఎంతో కాలంగా వ్యవసాయాన్ని నమ్ముకునే బతుకుతున్నామని, దాన్నే లాక్కుంటే తాము ఏమయిపోవాలి అని తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు ఆ రైతు. అతడిని చూడగానే నకునారెడ్డికే కాకుండా, ప్రియాంకకు కూడా హృదయాంతరాళాలలో జాలి కలిగింది.

అయితే ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఆ రైతు కుటుంబంలోని కుమారుడు కొద్దిగా ఆవేశపరుడు. అతన్ని చూడగానే ఎవరో కావాలని ప్రేరేపించి తన మీదకు ఉసిగొల్పినట్లుగా అర్థం చేసుకున్నాడు నకునారెడ్డి

“అయ్యా మీలాంటి వారికి మా బాధ అర్థం అవుతుందో లేదో తెలీదు కానీ మానాన్న నాకు వ్యాపారం కన్నా వ్యవసాయాన్నే నేర్పాడు. అది లేకపోతే నేను బతకలేను. అందుకే మీరు ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

ఈ భూమి ఎవడబ్బ సొత్తు కాదు, ఇష్టం వచ్చినట్లు సొంతం చెడుకోవడానికి. పెద్ద పొజిషన్‌లో ఉన్నారు ఏదైనా చెయ్యగలుగుతారు అనే గంపెడాశతో వచ్చాము. లేదంటే చెప్పండి మా దారి మేము వెతుక్కుంటాము. ఎవరికీ లబ్ది చేకూర్చడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందో అందరికీ తెలుసు. వాళ్ళను ఎలా ఎదుర్కోవాలో మా ఊళ్ళో వేటకి వెళ్ళే చాలామందికి తెలుసు” అతిగా ఉత్సాహపడుతూ అన్నాడు ఆ వ్యక్తి. అతడి తండ్రి అతడిని మందలింపుగా కసరడంతో కొద్దిగా తగ్గాడు.

ఇలాంటి వారు చాలా ప్రమాదకరం అని నకునారెడ్డి తన అనుభవంతో తెలుసుకున్నాడు. వీరే ముందుకు వెళ్లి ఉద్యమం అనే మత్తులో లేనిపోని ఆవేశానికి లోనై నక్సలిజం వైపుకు వెళ్తూ ఉంటారు. ఇలాంటివారిని పసిగట్టి వారి సమస్యను పరిష్కరించకపోతే అతడు అన్నట్లుగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసిందే.

“చూడు బాబూ, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. తిరగబడడం, వ్యతిరేకించడం, ఎదురించడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. దేనికైనా లోతుగా పరిశీలించి మాత్రమే మనం చర్యలు తీసుకోవాలి. అంతేకానీ ఆవేశపడి లాభం లేదు. మీ సమస్యను నేను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్ళి, అసెంబ్లీలో పోరాడి ఖచ్చితంగా మీకు న్యాయం చేకూరేలా చేస్తాను. అంతవరకూ మీరు ఎటువంటి విపరీత చర్యలకూ పాల్పడకండి” అని చెప్పి వారిని పంపించేసాడు, అక్కడనుంచి అపనమ్మకంగానే కదిలింది ఆ కుటుంబం. ఈ సంఘటన అంతా ప్రియాంక దృష్టిలో పడడం గమనించాడు.

“ఏంటమ్మా అలా చూస్తున్నావు” తన వంకే ప్రశ్నర్ధకంగా చూస్తున్న ప్రియాంకను ఉద్దేశించి అడిగాడు నకునారెడ్డి.

“ఏమీలేదు డాడీ, అస్సలిటువంటి సమస్యలకు పరిష్కారం ఏమిటా అని. అంటే నా ఉద్దేశం మనం అందరం ఒకరకమైన అబద్ధంలో జీవిస్తున్నామని నాకు అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ సమస్యలు మీరు తీర్చలేరని వారికి కూడా తెలుసు. తీర్చాలి అని అనుకోరని మీకు కూడా తెలుసు, కానీ ప్రయత్నించడం మాత్రం మానరు. ఎందుకనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఇదొక నిరంతరం సాగుతూ ఉండే ప్రక్రియ. నాకు ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కానిది ఏంటంటే మనం ఒక వ్యక్తి లేదా వ్యవస్థకు వ్యతిరేకంగా ఎందుకు వెళదాం అనుకుంటాం.

అందరు నడిచే బాటలో నడవడం మనకి ఇష్టం ఉండదు. సమ్మెలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం. ఫలితంగా ఏమి సాధిస్తాం అని మనకు మనమే ప్రశ్నించుకుంటే ఎప్పటికీ సమాధానం దక్కదు. అయినా ప్రపంచం అంతటినీ ఉద్ధరించినట్లుగా మనకు మనమే జవాబిచ్చుకుంటాం. ఇదిలా ఎంతకాలం సాగుతుంది, ఎప్పుడు మనం వ్యతిరేకత వదిలి స్వశక్తి మీద కృషిచేస్తాం అన్నదే నా ప్రశ్న” ఆ రైతు కుటుంబంతో తన సంభాషణ విన్న ప్రియాంక అడిగిన ప్రశ్న ఇది.

“చూడమ్మా ఇది నువ్వు అనుకున్నంత సులభంగా పరిష్కారం అయ్యే సమస్య కాదు. నేను ఇప్పుడు వారికి హామీ ఇచ్చినది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి కాదు. ఈ భూసంస్కరణలు అనేవి ఎన్నో యుగాలుగా జరుగుతున్న యుధ్ధాల లాంటివి. వాటిని ప్రపంచంలో ఎవరూ ఆపలేరు, అలాగని బహిరంగంగా ప్రోత్సహించనూ లేరు. వాటిని అలా బదిలీలు చేస్తూ ఉండడం ద్వారా ప్రజలందరిలో ఒకరకమైన నమ్మకాన్ని క్రియేట్ చెయ్యడమే మన లక్ష్యం.

ఇందులో ఎవరికీ జరిగే నష్టం ఉండదు అయితే నష్టపోయాం అనే మన దృక్పధమే స్వార్ధపరులకు మనని వశం చేసుకునే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు వచ్చిన రైతు కుటుంబం కూడా ఆ విధంగా వచ్చినదే. వారిని ప్రత్యేకంగా ఎవరు ప్రోత్సహించి పంపించి ఉంటారో కూడా నాకు తెలుసు. ఇదంతా నేను ఎన్నో సంవత్సరాలుగా అలుపు లేకుండా ఆడుతున్న ఆట” అన్నాడు నకునారెడ్డి.

ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆ సమయంలో ఆమెకు కనిపించాడు. ఏది ఏమైనా ఆమె ఎప్పటికీ ఎందుకో తన తండ్రిని సమర్ధించలేకపోతోంది. తన తండ్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తే ఆ ఊహే ఆమె జీర్ణించుకోలేకపోతోంది.

ఒకప్పుడు తానే ఈ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా ముందుకు నడిపించేవాడే మరి అప్పుడు క్రియాశీలకమన్న ఆయన ధోరణి ఇప్పుడెందుకు వ్యతిరేక రీతిలో వెళ్ళాలి. దీనికంతటికీ కారణం రాజకీయం కాదా అని ఆమె మనసులో మళ్ళీ మళ్ళీ అనుకుంది.

“ఈ సమయంలో నీలాంటి యువత అందరూ మా ధోరణిని తప్పుపట్టడంలోనే సగం కాలం వృథా చేస్తున్నారమ్మా. అయితే ఇక్కడ అర్థం కావలసిన విషయం ఏంటంటే అభివృద్ది ఉన్నచోట అసంతృప్తి చాపకింద నీరులా ఉంటుంది. అటువంటి సమయంలో ముందుకు అడుగెయ్యాలి అనుకునే నీలాంటివారు ఆ నీటిని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచించాలి.

అంతేకానీ పదేపదే నీరు ఉంది, నీరు ఉంది అని అనుకోవడం వలన లాభం ఏముంది. నాకు తెలిసి నీకూ, నీ స్నేహితుడు సిద్ధార్థకూ ఇదే వ్యత్యాసం ఉంది, అది గమనించిన నేను అతడిని పార్టీలో చేరమని ఆహ్వానించాను. అయితే ఇంట్లో మనిషివైనా నీ మనసును ఒప్పించలేకపోతున్నాను” తన నిస్సహాయతను ఆమెకు వ్యక్తపరిచాడు నకునారెడ్డి. సిద్ధార్థ పట్ల తన అంతరంగాన్ని ఆమెకు అర్థం అయ్యేలా చేసిన ఆయన పట్ల ఆమె గౌరవం ద్విగుణీకృతము అయ్యింది. ఏమీ మాట్లాడకుండా అక్కడనుండి వెళ్ళిపోయింది.

***

“వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలులు. ఎంతోవ్యయ ప్రయాసలతో ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదములు” తన ముందున్న జనాన్ని ఉద్దేశించి అన్నాడు ప్రొఫెసర్ వరదరాజన్.

గతకొన్ని రోజులుగా ఆయన తెలుగు రాష్ట్రంలోనే ఉంటున్నారు. అందుకు తగిన ఏర్పాట్లన్నీ రాహుల్ చూస్తున్నాడు. ఏ ప్రదేశాల్లో అయితే ప్రజల్లో తమపట్ల వ్యతిరేకత ఉందో అలాంటి చోట్లలో సభలు నిర్వహించి, ప్రజావేదికలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యాడు రాహుల్.

“మన భారతభూమి చాలా పురాతనమైనది. ఎంతోకాలంగా ఇక్కడ ప్రజలు సామరస్యంతో గడుపుతున్నారు. ఎన్ని ప్రపంచ యుద్ధాలు వచ్చినా, ప్రపంచ ముఖచిత్రంలో ఎన్ని దేశాలు బహిరంగంగా యుద్ధాలలో పాల్గొన్నా ఆ యుద్ధ చాయలు భారతదేశాన్ని ఎప్పుడూ తాకలేదు.

చరిత్రను చూస్తే కనుక దీనికి కారణం ఒకటే అని మనకు తెలుస్తోంది, అదేంటంటే భారతదేశంలో ఉన్న అపారమైన సహజవనరులు. ప్రతీ ఒక్కరూ జాతి, కుల, మత, ప్రాంత భావాలు లేకుండా సామరస్యంగా జీవించగలిగిన అవకాశాలు కలిగి ఉండడం.”

దాదాపుగా ఆ సభకు ఏభైవేల మంది పైగా జనం వచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఆ సభకు కేంద్రమంత్రులు ఇద్దరితోపాటు, సినీతారలు కూడా వచ్చారు. వారందరినీ గణేష్ సహాయంతో సమర్ధవంతంగా మేనేజ్ చేస్తున్నాడు రాహుల్. తను చెన్నై నుండి వచ్చేసిన తరువాత దాదాపుగా పార్టీలో తను చేరడం ఖరారు అన్న విషయం పైన పత్రికలు అప్పుడే ఊహాగానాలు చెయ్యడం ప్రారంభించాయి.

“అయితే ప్రజలారా భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు అన్నది జగమెరిగిన సత్యం. మరలాంటప్పుడు భూమిని అమ్ముకోవాలి అని ఎందుకు అనుకోవాలి అని మీరు ప్రశ్నించవచ్చు. పురాతనకాలంలో రాజ్యాలను విస్తరింపజేయడానికి రాజులు తమ పక్కన ఉన్న రాజ్యాలపై యుద్ధాలు ప్రకటించేవారు, దానియొక్క పర్యవసానాలు ఎప్పుడూ తాము ఆశించిన విధంగా ఉండేవి కాదు.

ఎవరైతే యుద్ధం ప్రారంభిస్తారో వాళ్ళకు దానిని ఎప్పుడు ముగించాలో కూడా తెలియాలి, అలా తెలియని పక్షంలో ఫలితంగా ప్రజలు మాత్రమే నష్టపోతారు. ప్రజలకు నష్టం కలిగించే ఏ ఒక్క వ్యవస్థా ఎక్కువకాలం నిలువదు చరిత్రలో ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. ప్రజల పురోగమనాన్ని సమిష్టిగా కోరుకునే ప్రభుత్వాన్ని మాత్రమే ప్రజాస్వామ్య విలువలు మూలల్లో ఇమిడించుకున్న భారతదేశ ప్రజలు ఆశిస్తున్నారు.

ఒక ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుందంటే దానికి ప్రజల సహకారం ఎంతో అవసరం, ఒకవేళ సహకరించిదానికి విముఖంగా ఉంటే కనుక వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ప్రజలే కనుక. కాబట్టి ప్రజలారా మీరందరూ సూచనాత్మకంగా వ్యవహరించి ప్రభుత్వానికి సహకరిస్తూ ఒకనూతనమైన వ్యవస్థ నిర్మాణంలో భాగస్వామికండి. వ్యక్తులు ఎవరైనప్పటికీ అందరి అంతిమ లక్ష్యం ఒకటే అయ్యుండాలి.

అప్పుడే ప్రజాస్వామ్యం అనే మాటకు నిజమైన అర్థం చెప్పినట్లు అవుతుంది. ఏ ఒక్కరికో లబ్ది చేకూర్చేలాగ ప్రభుత్వం పనిచెయ్యదు. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పటికీ ఆమోదించరు అన్నది నిర్వివాదాంశం, ఇందుకు భారతదేశ సమగ్ర చరిత్రే నిదర్శనం. ఎంతోమంది ఈ భూమిని పాలించడానికి, దోచుకోవడానికి వచ్చారు, వస్తూనే ఉంటారు. అయితే వీరెవ్వరికీ తలొంచకుండా, తలపడకుండా ఓర్పుతో సహనంతో ముందుకు సాగిపోయింది మన భారతదేశం.

ఇప్పటికీ మన దేశంలో ఏ మారుమూల ప్రదేశానికి వెళ్ళినా కానీ అక్కడ ఒక ఋతువులో గుండెలమీద చెయ్యేసుకుని ప్రశాంతంగా నిదురించే వ్యక్తిని మనం చూడగలుగుతాము. ఎంతతరచి చూసినా కానీ ప్రపంచంలో ఎక్కడా కానీ ఒక నిర్ణీతసమయంలో ఇటువంటి పరిస్థితులు కలిగి ఉన్న దేశం మనకి కనిపించదు. అటువంటి పరిస్థితులను ప్రజలకు కలిపించడంలో మన ప్రభుత్వాలు ఇప్పటివరకు సమర్ధవంతంగా వ్యవహరించాయి.

అందుకే ప్రజలారా ఇదే నా విజ్ఞప్తి, వ్యతిరేకతను వీడండి, సమిష్టిగా పనిచేసి అగ్రభాగానికి చేరుకొని ప్రపంచమంతటినీ కలుపుకుని ఒక వసుధైక కుటుంబంగా వ్యవహరించి ముందుకు సాగుదాం” అని చెప్పి తను చెప్పదలచుకున్నది పూర్తిచేసాడు ప్రొఫెసర్ వరదరాజన్. ఒక్కసారిగా ఆయన ప్రసంగంతో కరతాళధ్వనులు మిన్నంటాయి.

ఎటువంటి రాజకీయ పార్టీకి చెందని వరదరాజన్ ఇచ్చిన స్పీచ్ విని నిజంగానే ప్రజలందరూ ప్రభావితం అయ్యారనే చెప్పవచ్చు. అదే వేదికపై ముఖ్యమంత్రి జోగేశ్వరరావు గారు కూడా ఉండడం విశేషం. అయితే ముందుగా అనుకున్నట్లుగా ఆయన ఈ సభలో కేవలం గౌరవ అతిధిగా మాత్రమే వ్యవహరించారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడితే తమ మీద నమ్మకం తగ్గకుండా ప్రజలను తమవైపుకు లాక్కోవడానికి వేసిన రాజకీయ ఎత్తుగడ అని చాలామంది అభిప్రాయపడవచ్చు అని ఆయన ఉద్దేశం,

అందుకే ఎవరూ ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చెయ్యలేదు. ఇందులో తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనే అంశాన్ని నిగూఢమైనదిగా ప్రజలకు చేరవెయ్యాలి అని అయన లక్ష్యం. ఆ తరువాత పార్టీ కార్యకర్తలు ఇంకా అభిమానులు రాహుల్ పైన ప్రసంసల జల్లు కురిపించారు. హరితభూమి కార్యక్రమాన్ని ఇంకా ఏయే ప్రదేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి సహకారంగా రాష్టప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహిస్తుందో ప్రజలందరికీ అర్థం అయ్యేలా వివరించాడు గణేష్.

అతనుకూడా రాహుల్‌తో తిరుగుతూ శాశ్వతంగా అతనితో ఉండడానికి సిద్ధపడ్డాడు. ఆ తరువాత జరిగిన పత్రికా విలేఖర్లు మరియు మీడియా సమావేశంలో పార్టీ సభ్యులు కొంతమంది సమాధానాలు ఇచ్చారు. రాహుల్ పార్టీలో రాక కోసమే తామందరూ ఎదురు చూస్తున్నామని వారు వివరించారు. ఈ విషయం మీద తన అభిప్రాయాన్ని బయటపడకుండా చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రాహుల్. పత్రికా విలేఖరుల అభినందనల మధ్య సభ ముగిసింది.

***

అది ఒక విశాలమైన అతిధి గృహం, ఊరికి దూరంగానూ సముద్రానికి దగ్గరగా ఉన్న ఆ అతిధిగృహం తన అంతరంగిక సమావేశాలకు వాడుకుంటూ ఉంటాడు భూషణరావు. దాదాపు అన్ని ముఖ్యపట్టణాల్లో తనకి ఇలాంటి అతిధి గృహాలు ఉన్నాయి. ఆరోజు భూషణరావు పిలుపు మీదకు అక్కడ వచ్చాడు సుదర్శన్. అందరికీ డ్రింక్స్ సర్వ్ చెయ్యబడ్డాయి.

తన గ్లాస్లోని విస్కీ వంక చూస్తూ చెప్పాడు సుదర్శన్ “మీపట్ల కోర్ట్ చాలా అన్యాయంగా వ్యవహరించింది అని నాకు అనిపిస్తోంది భూషణరావుగారు. కానీ మీరు ఏమీ చెయ్యలేకపోవడమే నాకు కొంచెం బాధగా ఉంది. నాకు చేతనైన సహాయం ఏదైనా డెఫినెట్‌గా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.” ఆయనవైపు చూసాడు.

“దాని గురించి మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. అయినా నేనింకా ఈ కేసును ఒదులుకునే ఉద్దేశంలో లేను. ఎలా అయినా నాకు కేటాయించబడిన స్థలం నాకు దక్కాలి. ఇంతకీ మీకు అప్పగించిన పని ఏమి చేసారు” సూటిగా అతనివంక చూస్తూ అడిగాడు భూషణరావు.

అక్కడ వారితోపాటు నున్నగా గీసిన గుండుతో, నల్లకళ్ళద్దాలు నల్లటి జెర్కిన్ ధరించిన మూడవవ్యక్తి కూడా కూర్చుని ఉన్నాడు. అతడు పెద్దగా ఏమీ మాట్లాడడం లేదు కానీ, వీరు చెప్పేది ప్రశాంతంగా వింటున్నాడు.

“ఆ పనిమీదే ఉన్నాను సర్. రెగ్యులర్‌గా జోగేశ్వరరావుగారి మీటింగ్స్ ఫాలో అవుతున్నాం. ఇద్దరు యువకులను అదే పనిమీద నియమించాను. వారికి సంబంధించిన అన్ని వివరాలు బయట ప్రపంచానికి తెలియనివి మనకి అందుతాయి. అయితే కొంత సమయం పడుతుంది. ఇకపోతే నేను నేనుగా గమనించిన విషయం ఏంటంటే మనం ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్స్ ఎన్ని చేసినా కానీ జోగేశ్వరరావు ప్రభుత్వానికి ప్రజల నమ్మకం రోజురోజుకీ పెరిగిపోతోంది.

అంతేకాకుండా రాహుల్ ఇప్పుడు తన చదువు పూర్తిచేసుకుని తన తండ్రితోనే కలిసి పనిచేస్తూ ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య వారధిలాగా ఉంటూ జోగేశ్వరరావుకి బలం చేకూరుస్తున్నాడు. రీసెంట్‌గా జరిగిన భారీ బహిరంగ సభలో వరదరాజన్ అనే ఒక హిస్టరీ ప్రొఫెసర్‌ను ఉపయోగించి, అతని ద్వారా తన తండ్రి పద్ధతుల ప్రజలు ఆమోదం పొందడానికి పరోక్షంగా సహకరించేలా చేసాడు. ఈ సంగతి మీకు కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే అన్ని ప్రముఖ పత్రికలూ దీని గురించి చాలా పెద్దగా రాసాయి కదా.

ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ తొందరలోనే ఢిల్లీ వెళ్లి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్‌కు మద్దతుగా వరదరాజన్‌ను ఉపయోగించుకొబోతున్నాడు అని నాకు తెలిసిన సమాచారం. ఒకవేళ అదే జరిగితే కనుక ఇప్పటివరకు సేకరించిన భూములు అన్నీ కూడా చట్టపరం అవుతాయి, అప్పుడు మీరు ఏ కోర్టుకు వెళ్ళినా ఫలితం ఒకటే అవుతుంది. అందుకే ఈ విషయం మీద కొంచెం ఆచీ తూచీ వ్యవహరించాలి.” తన రెండో రౌండ్ పూర్తిచేసి చెప్పాడు సుదర్శన్.

“ఈ వరదరాజన్ గురించి నేను కూడా విన్నాను. ఈ మధ్యకాలంలో చాలాసార్లు టీవీలో చూసాను. అతను ఏ పార్టీతో సంబంధం లేని వాడు, ఇతర రాష్ట్రంవాడు అవ్వడం వల్ల ప్రజలు అతని మాటను నమ్ముతున్నారు అని నాకు అనిపిస్తోంది. నువ్వన్నట్లుగా అతను ఢిల్లీ కనుక వెళ్తే ప్రస్తుత ప్రభుత్వానికి మరింత బలం చేకూరుతుంది, దానితో సెంటర్‌లో కూడా అక్విజిషన్స్‌కు అడ్డు లేకుండా పోతుంది. ఈ సమయంలో నకునారెడ్డిని నమ్ముకుని ఎటువంటి ప్రయోజనం లేదు. తన ఆరోగ్యం, వ్యక్తిగతమైన సమస్యలతో పాటు, గతంలో జరిగిన ఒక కేస్ విషయంలో సిబిఐ ఎంక్వయిరీలతో తల మునకలై ఉన్నాడు. అయినా ఆ ముసలాడు ఇంకా ఎక్కువకాలం బతుకుతాడని నేననుకోను. ఇప్పుడు కొత్తగా పార్టీలో ఒక యువకుడు వచ్చాడని విన్నాను” అతని సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లుగా అడిగాడు భూషణరావు

“అవును, సిద్ధార్థ్ అతని పేరు. నకునారెడ్డి కుమార్తె ప్రియాంక చెన్నైలో జర్నలిజం కాలేజ్‌లో చదువుతున్న సమయంలో ఆమె స్నేహితుడు. రాహుల్, ప్రియాంక, సిద్ధార్థ వీరు ముగ్గురూ ప్రొఫెసర్ వరదరాజన్ విద్యార్థులు అవడం ఇక్కడ విశేషం” తనకు తెలిసిన వివరాలను చెప్పాడు సుదర్శన్.

“ఎనీవే వీరి విషయాలు తరువాత తెలుసుకోవచ్చు, ప్రస్తుతం మనం చెయ్యవలసినది ఏంటంటే ఈ వరదరాజన్‌ను సమర్దవంతంగా టాకిల్ చెయ్యడం. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఇతను నాకొక సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. అందుకే దీనికి నేనొక పథకం ఆలోచించాను. దానికి నీ సహకారం కావాలి, అందుకే నిన్ను ఇక్కడకు పిలిపించడం జరిగింది” ఆ గుండువ్యక్తి వైపు చూస్తూ అన్నాడు భూషణరావు.

సుదర్శన్ కూడా అతడిని చూసాడు, చూడ్డానికి మామూలుగా ఉన్నాకానీ అతనిలో ఒకరకమైన కర్కశత్వాన్ని, కోల్డ్ బ్లడెడ్నెస్ ను గమనించాడు.

 “ఏంటది” భూషణరావు వంక ప్రశ్నార్ధకంగా చూస్తూ అడిగాడు సుదర్శన్.

“ఇతని పేరు జానీ. గతంలో చాలాసార్లు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు నాకు నాకు సహాయం చేసాడు. ఇప్పుడు కూడా వరదరాజన్ విషయంలో నేను ఇతడిని వినియోగించాలి అనుకుంటున్నాను” గుండు వ్యక్తిని సుదర్శన్‌కు పరిచయం చేస్తూ అన్నాడు భూషణరావు.

“మీరేమి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సర్. అసలు మీ పథకం ఏంటి” కొద్దిగా ఆందోళన చెందినట్లుగా అడిగాడు సుదర్శన్.

“వరదరాజన్‌ను ఎలిమినేట్ చెయ్యాలి” తన చేతిలో ఉన్న విస్కీ గ్లాస్‌ను అమాంతం ఖాళీచేసి చెప్పాడు భూషణరావు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు సుదర్శన్, ఇప్పటివరకు ఇలాంటివి జరగుతాయని విన్నాడు కానీ ప్రత్యక్షంగా ఎప్పుడూ సంబంధం పెట్టుకోలేదు.

ఇప్పుడు తను వారికి సహకరించకపోతే భూషణరావు ఊరుకోడు. తన అవసరం ఉంది కాబట్టి బహుశా చంపకపోవచ్చు కానీ, ప్రమాదాలు మాత్రం సృష్టించవచ్చు వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగా రెండు విధాలగా కూడా. అందులోనూ తను చేసే బిజినెస్‌కు భూషణరావులాంటి వ్యక్తుల అవసరం ఎప్పటికీ ఉంటుంది, అందుకే అతనికి హెల్ప్ చేద్దామనే నిర్ణయించుకున్నాడు సుదర్శన్.

“ఇంతకీ నా నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు” తన మనసులోని భావాలను బయటపెట్టకుండా అడిగాడు సుదర్శన్.

“నువ్వేమి చెయ్యనవసరం లేదు. బయటవాళ్ళు అందరికీ వరదరాజన్ మామూలు సమయాల్లో ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసే అవకాశం లేదు. ఆయన ప్రోగ్రామ్స్ ఏంటి ఎప్పుడఎప్పుడు ఎక్కడ ఏయే ప్రసంగాలు చేస్తాడు ఇలాంటి ఒక షెడ్యూల్ లాంటిది నీకు తెలిసి ఉంటుంది. ఇది పత్రికలవాళ్లకీ మీడియా వాళ్ళకీ నీలాంటివారే సప్లై చేస్తారనే విషయం నాకు తెలుసు. అందుకే నువ్వు ఆయన ఏ సమయంలో మనకు ఒంటరిగా లభిస్తాడో నాకు చెప్పగలిగితే చాలు. మిగతా విషయాలు జానీ చూసుకుంటాడు” అని అతడిని భూషణరావు అడిగాడు.

చూస్తుంటే చాలా పెద్ద పధకంతోనే అతను ముందుకు వెళ్తున్నట్లుగా అనిపించింది సుదర్శన్‌కు. అయినా ఇంకా ఎక్కువగా ఆలోచించకుండా తనని ఎక్కడ ఏ విధంగా కాంటాక్ట్ చెయ్యాలో చెప్పి, అవసరమైన ఇన్ఫర్మేషన్ జానీకి ఇస్తానని చెప్పి అతడి వివరాలు తెలుసుకుని అక్కడ నుండి కార్లో తన ఇంటికి వెళ్తున్న సమయంలో సిద్దార్థకి ఫోన్ చేసాడు.

“ఏంటి సర్ పార్టీలో చేరిన తరువాత మీ మెయిన్ కాంట్రిబ్యూటర్ ను పెద్దగా కాంటాక్ట్ చెయ్యడం లేదేంటి” అడిగాడు సుదర్శన్.

“అవసరమైనప్పుడు అతడే నన్ను కాంటాక్ట్ చేస్తాడని నా అనమ్మకం. అప్పుడు మీ అవసరం కూడా నాకు రావచ్చు. ఇంతకీ విషయం ఏంటి” అడిగాడు సిద్ధార్థ్. అతను వరదరాజన్‌ను గురించి భూషణరావు అడగడం, ఆయనను అంతమొందించడానికి భూషణరావు భావిస్తున్నట్లుగా తన అనుమానపడడం వగైరా వివరాలన్నీ చెప్పాడు.

అంతా శాంతంగా విన్న తరువాత సిద్ధార్థ పెద్ద ఎక్కువగా స్పందించలేదు. ఏమి జరుగుతుందో చూద్దాం అన్నట్లుంది అతని ధోరణి.

***

ఆ జాతీయ రహదారి మీద వాహనాలు చాలా వేగంగా వెళ్తున్నాయి, కోల్‌కతా నుండి చెన్నైవరకు ఉన్న జాతీయ రహదారి అది. ఆ రహదారి మీద ఇద్దరు వ్యక్తులు ఒకకారులో చాలా వేగంగా వెళ్తున్నారు. అందులో ఒకరి డ్రైవింగ్ సీటులో ఉంటే మరొకరు వెనుక సీట్లో నిదురిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చాలా ఆందోళనగా ఉన్నాడు. తమను ఎవరో తరుముతున్నట్లుగా మాటిమాటికీ వెనక్కి చూస్తున్నాడు.

ఫ్యూయల్ ట్యాంక్ ముల్లు కూడా ఎప్పుడు అయిపోతుందా అని సూచిస్తోంది. అప్పుడు ఉదయం ఏడుగంటల సమయం అందుకే పెద్దగా ట్రాఫిక్ లేదు. ఒకవేళ ఫ్యూయల్ ఐపోతే తిరిగి నింపడానికి తన దగ్గర డబ్బులు కూడా లేవు, ఆ విషయం తలుచుకోగానే అతని ఆందోళన ఇంకా ఎక్కువైంది. ఇంతలో తనను తరుముతున్నవాళ్ళకి తాను దొరికితే కనుక తనతోపాటు వెనక నిద్రిస్తున్న వ్యక్తిని కూడా వారు చంపేస్తారు, భయంతో అతను ఎక్సలేటర్ ఇంకా కిందకు తొక్కాడు.

ఇంతలో ఎవరో మధ్యవయస్కుడు రోడ్డుకు అడ్డంగా వచ్చి తన కారును ఆపమని చేతులతో సైగలు చేస్తూ అరుస్తుండడం కనిపించింది. అసలే తను ఆందోళనలో ఉంటే మధ్యలో ఇతడెవరో, ఆపకుండా వెళ్లిపోదాం అనుకున్నాడు, కానీ ఏమనుకున్నాడో ఏమో అతడిని చూసి తన పరిస్థితే తనకి గుర్తుకువచ్చి రోడ్డుకు పక్కగా కారు ఆపాడు.

తను ఆపీ ఆపడంతోనే కార్ ఎదర డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి హడావిడిగా తన పక్కన కూర్చున్నాడు ఆ మధ్యవయస్కుడు. ఆయాసపడుతూ “త్వరగా పోనివ్వండి సర్, నన్నెవరో తరుముతున్నారు. వారి చేతుల్లో మారణాయుధాలు కూడా ఉన్నాయి” తనవైపు చూస్తూ చెప్పాడు ఆ వ్యక్తి. అతని మాటతీరు చూస్తుంటే చాలా దూరం పరిగెత్తి బాగా అలిసిపోయినట్లు అనిపిస్తోంది.

తమ ఇద్దరి పరిస్థితీ ఒకటే కావడం ఎందుకో అతనికి విచిత్రంగా అనిపించింది. అందుకే ఇంక మారు మాట్లాడకుండా వేగంగా కారును ముందుకు దూకించాడు. కొంచెం దూరం వెళ్ళిన తరువాత తమను వెంటాడుతున్నవారు వేగంగా ఒక నలుపు రంగు స్కోర్పియోలో వస్తుండడం గమనించి తను కూడా వారికన్నా వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అతను.

ఇంతలో తమ వాహనంలో వెనుక ఇంకొక వ్యక్తి నిదురిస్తూ ఉండడం గమనించాడు ఆ మధ్యవయస్కుడు. అంత ఖంగారులో కూడా డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అడిగాడు “మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది మిస్టర్. నాకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు” వెనుకకు మళ్ళీ ఒకసారి చూసాడు.

“నా పేరు చరణ్, నేనొక టెన్నిస్ ప్లేయర్‌ని” అని చెప్పాడు డ్రైవింగ్ సీట్లోని వ్యక్తి. అంతే ఒక్కసారిగా ప్రకాశవంతం అయ్యింది ఆ మధ్యవయస్కుడి వదనం

“యా అవును. మీ గురించి నేను టీవీల్లో కూడా చూసాను. అంతేకాదు మీకూ నాచిరెడ్డి భార్యకూ సంబంధించిన విషయం గురించి అందరూ చెప్పుకోవడం కూడా విన్నాను. అంటే ఆ వెనుక నిద్రిస్తోంది” అని అతని సమాధానం కోసం ఆగాడు ఆయన

“ఎస్ మీరు అనుకున్నది కరెక్టే. ఆమె సుకన్య. మిమ్మల్ని ఎవరో వెంటాడుతున్నట్లే మమ్మల్ని కూడా వెంటాడుతున్నారు. కొంతకాలంగా మమ్మల్ని కిడ్నాప్ చేసి ఒక అడవిలో నిర్జనమైన ప్రదేశంలో బంధించి ఉంచారు. వారినుంచి తప్పించుకుని ఇలా వస్తున్నాం” తమ గురించి చెప్పాడు చరణ్. వెనక వస్తున్న స్కార్పియోతో పాటు ఇంకొక కారు కూడా జతకలిసి ముందుకు రావడం సైడ్ వ్యూ మిర్రర్ నుంచి గమనించి వారిని ఎలా తప్పించుకోవాలో తెలీక ఆందోళన చెందుతున్నాడు చరణ్, ఆ రెండో కారులోని వ్యక్తులు మధ్యవయస్కుడి కోసమే గాలిస్తున్నారని అర్థం చేసుకున్నాడు చరణ్.

ఆ వెనక వస్తున్న వ్యక్తుల దగ్గర అతను చెప్పినట్లుగా మారణాయుధాలున్నాయి, వారు ఉండి ఉండి తమమీదకు కాల్పులు జరుపుతున్నారు. అసలు ఇది తను ఊహించని పరిణామం. ఇదేమి పట్టనట్లుగా వెనక నిదురిస్తోంది సుకన్య.

“ఇంతకీ మీ సంగతేంటి వాళ్ళెవరు. మీవెంట ఎందుకు పడుతున్నారు” అడిగాను చరణ్.

“నా పేరు వరదరాజన్, మాదసలు ఈ రాష్ట్రం కూడా, కానీ నా ప్రమేయం లేకుండానే నేను ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇరుక్కుపోయాననిపిస్తోంది. నా అనుమానమే కనక నిజమైతే ప్రభుత్వానికి నేను సహాయపడుతున్నానని అనుకుని కిట్టనివాళ్ళు కొందరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు” ఆ రెండు వాహనాల తాకిడి నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్న చరణ్‌ను ఉద్దేశించి అన్నాడు వరదరాజన్.

మరుసటిరోజు తనకు హైదరాబాద్లో పర్యటన ఉంది అక్కడ కూడా ఒక సభలో పాల్గొనాలి అని రాహుల్ చెప్పాడు, తనని రాత్రి ఎవరికీ తెలీకుండా దుండగులు ఎత్తుకొచ్చారు. వాళ్ళిలా ఆలోచించుకుంటూ ఉండగానే నల్ల స్కార్పియోలోని గుండుతో ఉన్న వ్యక్తి ఒకతను వాహనం కదులుతూ ఉండగానే దానిలోనుండి బయటకు వేళ్ళాడుతూ ఆ పక్కనున్న కార్ వాళ్ళతో పోటీపడి తన చేతిలో ఉన్న మెషిన్ గన్‌తో కాలుస్తున్నాడు.

“బహుశా మమ్మల్నీ, మిమ్మల్నీ చంపడానికి ప్రయత్నిస్తున్నది ఒకళ్లేనేమో అని నా అనుమానం. సరే ఈరోజుతో వీళ్ళ పీడా విరగడైపోవాలి” అని వరదరాజన్‌తో చెప్తూ ఉండగా ఈ అంతటి హడావిడికి సుకన్య ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఏమి జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ఆమెకు కొంత సమయం పట్టింది.

ఇంతలో వాళ్ళు పేలుస్తున్న పేలుడుకి ఫ్యూయల్ ట్యాంక్‌కు కన్నం పడి ఫ్యూయల్ బయటకు ఒలకడం ప్రారంభించింది. వెనుక వస్తున్న వాహనాల్లోనించి కొందరు కొన్ని సీసాలు తమ కార్ వైపు విసరడం మొదలుపెట్టారు. వారికి ఫ్యూయల్ వాసన తెలుస్తోంది. అందరూ ఒక్కసారిగా అరవడం ప్రారంభించారు. వాహన్నని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలం అవుతున్నాడు చరణ్. బహుశా ఈ వేగంతో వెళ్ళడం వలన బ్రేక్ కూడా ఫెయిల్ అయి ఉంటుంది.

ఇంతలో వారి వేగాన్ని అధిగమించిన స్కార్పియో వారి కారును దాటుకుని ముందుకు వెళ్ళింది. వెనకనున్న కార్ కొద్దిగా వేగం తగ్గించి వెనకబడింది. ముందుకు వెళ్ళిన ఆ స్కార్పియోను రోడ్డుకు అడ్డంగా తిప్పుతూ తమ కారుకు అభిముఖంగా దానిని మళ్ళించి, స్కార్పియో నడుస్తూ ఉండగానే పక్కనే ఉన్న అడవిలోకి దూకేసాడు ఆ గుండు వ్యక్తి. వేగంగా వస్తున్న చరణ్ కార్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా వెనకవస్తున్న కారుతో కలిపి మూడు వాహనాలు భారీ ఎత్తున పైకి ఎగిరిపడ్డాయి.

ఒక్క విస్ఫోటంతో అయ్యి ఉవ్వెత్తున మంటలు పైకి ఎగసిపడ్డాయి. ఏమి జరుగుతుందో తెలిసేలోపల అంతా జరిగిపోయింది. స్కార్పియోకు వెనక వస్తున్న కారుకు మధ్య చరణ్ కార్ నలిగిపోయి నుజ్జునుజ్జు అయిపోయింది. మూడు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. చరణ్ వాహనం నుండి మంటలకు గురైన ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా నేలమీదకు పడ్డారు. జరిగింది కళ్ళారా చూసిన అక్కడకి దగ్గరలోని జనం పెద్దపెద్దగా హాహాకారాలు చేస్తూ ఆక్సిడెంట్ అని అరుస్తూ ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టారు.

(సశేషం)

Exit mobile version