[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత శ్రీ ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారు వ్రాసిన 20 కథలతో వెలువరించిన సంపుటి ‘రాజనాల బండ’.
“ఇవి అచ్చమైన మన కతలు. గతం అనే బావి లోకి జారిపోయిన ఎన్నో మనవైన అనుభూతుల్ని, మనవైన ఆత్మీయతల్ని, మనవైన జీవితపు పరిమళాల్ని పరిచయం చేసే కథలు” అని వ్యాఖ్యానించారు శ్రీ పల్లిపట్టు నాగరాజు తమ ముందుమాట ‘మనకి మనం దొరికిపోయే కథలు’ లో. ఈ కథలు చదివాకా ఈ మాటలు నిజమనిపిస్తాయి.
***
‘పాతాళ భేరి’ చాలా ఆసక్తికరమైన కథ. పాతకాలపు బావులలో ఏవైనా వస్తువులు పడిపోతే తీసేందుకు ఉపయోగించే పరికరం ఇది. ఈ పరికరం ఆధారంగా అల్లిన ఈ కథలో మానవ మనస్తత్వాలు స్పష్టమవుతాయి. పాతాళ భేరిని ఎంత నైపుణ్యంగా ఉపయోగించాలో తెలుసుకున్నప్పుడు సమాజంలో సమస్యల పరిష్కారానికి కూడా అంతే నైపుణ్యం అవసరమన్న భావన స్ఫురిస్తుంది. ప్రియురాలి కోసం సాహసం చేసి బావిలోకి దూకిన ఏలుమలై పైకి వస్తుంటే – అందరికీ ఏలుమలై కనిపిస్తే ఆమెకు పాతాళభైరవి సినిమాలోని ఎన్టీయార్ కనిపిస్తాడు.
‘కొడుకా! కట్ట తెగనీయొద్దు!!’ కథలో కొత్తగా పెళ్ళయిన తుకారాముడు తన భార్య పుట్టింటికి వెళ్తే తట్టుకోలేకపోతాడు. దిగులు పడతాడు. చివరికి అతని దిగులు చూడలేని అమ్మానాన్నలు – అత్తవారింటికి వెళ్ళమంటారు. కానీ కొన్ని సూచనలు చేస్తారు. సామెతల రూపంలో చెప్పిన ఈ సూచనల వల్ల పాఠకులకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అత్తారింటి భోగం అనుభవించి ఇంటికొచ్చిన తుకారాముడికి తండ్రి చెప్పిన సామెత లోని అసలు అర్థం గ్రహింపుకొస్తుంది
మేనమామతో తిరునాళ్ళకి వెళ్ళిన పాండురంగడికి అక్కడ ఎదురైన అనుభవాలేమిటో తెలుసుకోవాలంటే ‘మావా! సుందరం మావా’ కథ చదవాలి. ద్రౌపదమ్మ తిరునాళ్ళ దృశ్యాన్ని రచయిత వర్ణించిన విధానాన్ని చదివితే, మనం ఆ తిరునాళ్లలో తిరుగాడినట్టు ఉంటుంది. ఓ హోటల్‍లో మామ చేసిన మోసాన్నే, మరో హోటల్‍లో తానూ చేయబోయి తన్నులు తింటాడు పాండురంగడు. పరిహారంగా నిప్పులు తొక్కుతారు మామాఅల్లుళ్ళిద్దరూ.
‘తలిగ’ కథ ఓ గొప్ప ఆచారాన్ని తెలియజేస్తుంది. అందమైన బాల్యాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. అవ్వా, మనవళ్ళ ప్రేమాభిమానాల్ని పరిచయం చేస్తుంది. “ఆరోగ్య విషయాలు ఇంట్లో వాళ్ళ దగ్గర దాచి పెట్టకూడదు, అమ్మానాన్నలు తిడతారు, కొడతారు అని భయపడి నెత్తిమీదకు తెచ్చుకోకూడదు” అని అవ్వ మనవడికి చెప్పిన మాటలు ఎంతో నిజం.
అమ్మకి సాయం చేయమన్న మేనమామ దగ్గర మార్కులు కొట్టేయడానికి కిష్టడు చేసిన పని పాఠకుల పెదవులపై నవ్వులు పూయిస్తుంది. అయినా ఆ పని చేయడంలో కిటుకు తెలుసుకుని విజయం సాధిస్తాడు. ‘కొత్తిమీర కట్ట’ కథ ఆసక్తిగా చదివిస్తుంది.
ఓ ప్రఖ్యాత సినీ నటి ఓ పల్లెటూరికి వస్తే ఎంత హంగామా జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ‘హలం మా ఊరికి వచ్చిందోచ్!’ కథ. పెద్దలు, పిల్లలు చంద్రమోహన్‌ని, హలం ను చూడడానికి ఎంత హాడావిడి చేసారో చదువుతుంటే – నగరమైనా, పల్లెటూరయినా సినీతారల పైన జనాల అభిమానం ఒకేలా ఉంటుందని అర్థమవుతుంది.
‘రోకలి అత్త – కీపాసు మామ’ కథలో డిగ్రీ చదివే సుబ్రమణ్యం మేనత్త ఊరు ‘రాయల చెరువు’ కి వెళ్తాడు. గ్రహణం రోజున అత్త రోట్లో రోకలిని నిలబెడుతుందని, ఆ విచిత్రాన్ని చూడడానికి ఊళ్ళో వాళ్ళంతా వస్తారని అమ్మ చెప్తుంది. మామకి కీపసు మామ అని పేరెలా వచ్చిందో తెలుసుకుంటాడు. ఆ ఊరి చెరువు వద్ద ‘రచ్చ’ సినిమా షూటింగ్ జరిగిందని మామ చెప్తాడు. ఎన్నో విశేషాలు చూసి, విని ఇంటికి తిరిగి వస్తాడు సుబ్రమణ్యం. దగ్గరి బంధువుల ఆత్మీయతలను చవి చూపుతుంది ఈ కథ.
పల్లెటూరి మనుషుల అభిమానాలని, అమాయకత్వాన్ని చాటిన కథ ‘కాశెమ్మ కొడుకు’. కువైట్ నుంచి వచ్చి, సొంత ఊరికి మేలు చేయాలని భావించిన కిష్టడు – ఊరికి చేయాలనుకున్న ఉపకారం ఎలా బెడిసికొట్టిందో ఈ కథ చెబుతుంది.
‘సుబ్బులు మావ’ ఓ చిత్రమైన వ్యక్తి. జేబులో తళతళలాడే వంద నోటుని పదేళ్ళుగా పెట్టుకు తిరుగుతూ దాన్ని ఖర్చు చేయని మనిషి. టీ కొట్టు దగ్గర కూర్చుని జనాలకి కబుర్లు చెబుతూ వాళ్ళ డబ్బుల్తో టీ తాగుతుంటాడు. ప్రపంచమంతా మారతా వున్నా పెళ్ళాలు మాత్రం మారరు గాక మారరు అని అంటాడు. అలా ఎందుకన్నాడో తెలియాలంటే ఈ కథ చదవాలి.
కొత్తగా పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిన మునస్వామికి అత్తగారింటి ముందు నిగనిగలాడే మునగచెట్టు కనిపిస్తుంది. మొదటిసారి అత్తగారు చేసిన ‘మునక్కాయ పులుసు’ బాగా నచ్చేస్తుందతనికి. భార్య బాలామణిని కాపురానికి తమ ఊరికి తీసుకొస్తాడు. సేద్యం పనులలో పడి మూడు నెలలు అత్తారింటికి వెళ్ళడు. కానీ తాను తిన్న మునక్కాయ పులుసు గురించి ఊరంతా గొప్పగా చెప్పుకుంటాడు. అతనికి భార్య చేసే వంటలు నచ్చవు. మూడు నెలల తరువాత భార్యతో కలిసి అత్తారింటికి వెళ్తాడు. మళ్ళీ మునక్కాయ పులుసు చేస్తుంది, అత్తగారు. ఇష్టంగా తింటాడు. కానీ మర్నాడు కూడా మునక్కాయ వంటలే చేయడంతో విసుక్కుంటాడు. ఆ మర్నాడు కూడా మునక్కాయ వంటలే వండడంతో కోపంతో భార్యని తీసుకుని ఊరికి బయల్దేరుతాడు. అప్పుడు అత్త అతనికి నచ్చచెబుతుంది. భర్తకి నచ్చేలా వంటలు ఎలా చేయాలో బాలామణికి తెలుస్తుంది. కథా సుఖాంతం.
ఊరి ఆలయంలో జరిగే సంతర్పణకి వెళ్ళాలనుకుంటాడు కిష్టడు. అదెంత కష్టమో పద్మక్క చెబుతుంది. అయినా కిష్టడు మాట వినడు. గుట్ట మీద గుడిలో సంతర్పణకి వెళతాడు. మిత్రులతో కల్సి గుట్టకి బయల్దేరుతాడు. ఎన్నో సంఘటలను జరుగుతాయి. భయపడతారు. తేరుకుంటారు. కష్టపడి ఆలయం చేరుకుంటారు. తమ్ముడి పై తనకున్న ప్రేమని పద్మక్క చాటిన తీరుని ‘అక్కా! సిన్నక్కా!!’ కథ గొప్పగా చెబుతుంది. కిష్టడు గుట్టలెక్కుతుంటే.. మనమూ తనతో పాటే అక్కడ తిరుగాడుతున్నట్టు ఉంటుంది. అక్కాతమ్ముళ్ల అనుబంధానికి దర్పణం ఈ కథ.
గాయని స్మిత ప్రోగ్రామ్‌ని నటి సిల్క్ స్మిత కార్యక్రమంగా భావించి భంగపడిన నల్లబ్బ కథ ‘(సిల్క్)స్మిత సాంగ్’. సిల్క్ స్మిత పట్ల ఓ సామాన్యుడికి ఉన్న అభిమానాన్ని ఈ కథ చాటుతుంది.
ముక్కుపుడక పెట్టుకునే అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకునే కార్తవరాయడికి మూడు పదులు దాటినా పిల్ల దొరకదు. తల్లి ఎంత నచ్చజెప్పినా వినడు, ముక్కుపుడక పెట్టుకునే అమ్మాయినే పెళ్ళాడుతానంటాడు. ఎన్నో సంబంధాలొస్తాయి, తోసిపుచ్చుతాడు కార్తవరాయుడు. చివరికి ముక్కుపుడక ఉన్న ఓ అమ్మాయి సంబంధం నచ్చి పెళ్ళి చేసుకుంటాడు. కాని పోలీస్ కానిస్టేబుల్ అయిన మావగారి తీరు అతనికి నచ్చదు. కథ చివర్లో ఓ చేదు నిజం తెల్సినా ఏం చేయలేకపోతాడు. ‘కొత్త పెళ్ళాం ముక్కుపుడక’ కథ నవ్విస్తుంది, చదివిస్తుంది.
ఆలస్యంగా పెళ్ళయిన గురవరాజు ఓసారి భార్యని తీసుకుని అత్తారింటికి వెడతాడు. కుటుంబంతా కల్సి దగ్గరలలోని ఆలయాలకి వెడతారు. ఓ గుడిలో ద్వజస్తంభం ఆరిపోయిన ఓ దీపాన్ని వెలిగించడాని గురవరాజు అత్త ప్రయత్నిస్తుంది. అగ్గిపెట్టె కోసం వెతుకుతుంది. అక్కడ ఎదురయిన ఎవరిని అడిగినా లేదంటారు. ఒకాయాన ఖాళీ అగ్గిపెట్టె ఇచ్చి వెళ్ళిపోతాడు. దీపం పెట్టలేకపోతున్నామని అత్త బాధపడుతుంది. ఆమె బాధ చూడలేక తన జేబులో ఉన్న అగ్గిపెట్టెను ఇస్తాడు గురవరాజు. అతనికి బీడీలు తాగే అలవాటుందని అత్తవాళ్ళకి తెలిసిపోతుంది. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే ‘అగ్గిపెట్టె – బీడీకట్ట’ కథ చదవాలి.
‘మరదలి కష్టం – బావ సాయం’ కథ నవ్విస్తుంది. బావామరదళ్ళ మధ్య ప్రేమని, అభిమానాన్ని చాటుతుంది.
ఈ కథాసంపుటికి శీర్షికగా నిలిచిన కథ ‘రాజనాల బండ’. మిత్రుడు సాంబడి ఆహ్వానం మేరకు రాజనాల బండ గుడిలో జరిగే వేడుకకి బయలుదేరుతాడు పురుషోత్తం. అక్కడికి వెళ్ళాకా, ఇద్దరూ కలిసి గుడికి వెళ్తూ దారిలో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. మాటల సందర్భంలో, “ఇప్పటికే ఆలస్యమైంది, ఇకనైనా పెళ్లి చేసుకోవచ్చు” కదా అని సాంబడు పురుషోత్తంని అడుగుతాడు. అందుకు కారణాన్ని వివరిస్తాడు పురుషోత్తం. ఇద్దరూ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు. అక్కడి ఉత్సవంలో దేవరెద్దుకు దాసప్పగా నరేష్ ఎంపికవుతాడు. ఉత్సవం అయ్యాకా, తాను బయల్దేరుతాను, అంటే ఆ రాత్రికి తమ ఇంట ఉండమంటాడు సాంబడు. అక్కడ బాలామణి అనే ఆవిడకి సాయం చేద్దామని వెళ్ళి, భంగపడతాడు పురుషోత్తం. సాంబడు తన మిత్రుడు కళ్యాణ యోగం కలిగించమని దేవుణ్ణి వేడుకుంటాడు. కపటం లేని, స్వార్థం లేని స్నేహానుబంధాలను ప్రదర్శిస్తుందీ కథ.
‘కులుకు కిష్టడు’ కథ ఓ పల్లెలో జరిగే జాతరని కళ్లకి కడుతుంది. ఎంత మంది మనుషులు, ఎన్ని రకాల స్వభావాలు, ఎన్ని వ్యక్తిత్వాలు – ఆయా పనులని ఎంత నైపుణ్యంగా నిర్వహించడం – అన్నీ కథలో అంతర్లీనంగా ఇమిడిపోయి కథకి వన్నె తెచ్చాయి.
పురంధరుడి ఆవు ఓ బావిలో పడిపోతుంది. ఊళ్ళో వాళ్ళంతా ఏకమై ఆవుని బయటకి తీయడానికి ప్రయత్నిస్తారు. ఆర్ముగం అందరినీ ప్రోత్సహిస్తూ ఆ కష్టమైన పని సుసాధ్యం అయ్యేట్టు చేస్తాడు. ‘అయిడియాల ఆర్ముగం’ కథ ఆసక్తిగా చదివిస్తుంది. మూగ ప్రాణుల పట్ల పల్లెజనుల ఆపేక్షని కళ్ళకు కడుతుంది.
“ఏది మిగలబెట్టినా పనికొస్తుంది కానీ, ఒళ్ళు మిగలబెడితే పనికిరాదు” అంటూ సోమరితనాన్ని విడనాడాలని చెప్తుంది ‘పొట్టేళ్ళాయన’ కథ. తన వద్దకి మాంసం కొనుగోలుకి వచ్చే అందరినీ పేరుపేరునా అభిమానంగా పలకరిస్తాడు పొట్టేళ్ళాయన. అయితే పొట్టేళ్ళయన రహస్యం తెలుసుకున్న విజయుడు నవ్వుకుంటాడు. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే కథ చదవాలి.
‘గెడ్డం గీకుడు’ కథ హాయిగా చదివిస్తుంది. నవ్విస్తుంది. పల్లెటూరి అమ్మాయికి అమెరికా అబ్బాయితో పెళ్ళవుతుంది. అల్లుడు ఎందుకు గడ్డం గీసుకోడో మామగారికి అర్థం కాదు. కారణం తెలిసాకా, చదువరుల పెదాలపై చిరునవ్వు మొలుస్తుంది.
***
ఈ కథలలో స్నేహం ఉంది, మనుషుల మధ్య ప్రేమలు, ఆప్యాయతలు ఉన్నాయి. ఈ కథల్లో తమ ఊరి పట్ల అభిమానం ఉన్న వ్యక్తులు తారసిల్లుతారు. అమాయకులూ ఉన్నారు, గడుసుదనం ఉన్నవాళ్ళూ ఉన్నారు. చాలావరకు కల్మషం అంటని మనుషులు వీరంతా.
రచయిత ఆయా ప్రాంతాలకి, ఆయా కాలాల్లోకి, ఆ వాతావరణంలోకి పాఠకులను తీసుకువెడతారు. కాసేపు పాఠకులు కూడా కథలలోని పాత్రలలో ఒకరైపోతారు. హాయిగా చదివించే కథలివి.
***
రాజనాల బండ (కథాసంపుటి)
రచన: ఆర్.సి.కృష్ణస్వామి రాజు
మల్లెతీగ ముద్రణలు
పుటలు: 160
వెల: ₹ 200/-
ప్రతులకు:
ఆర్.సి. కృష్ణస్వామి రాజు
ఫోన్ 9393662821.
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు