Site icon Sanchika

ఇంకా రుచికరంగా వండవచ్చు ఈ “రాజ్మా చావల్” ని

[box type=’note’ fontsize=’16’] “వొక ఇంటి వాతావరణాన్ని తలపుకు తేవాలని పేరు పెట్టినట్టున్నట్లున్న ఈ సినిమాని రిషి గురించి చూడవచ్చు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘రాజ్మా చావల్’ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఇ[/dropcap]ది లీనా యాదవ్ నాలుగో చిత్రం. మొదటిది శబ్ద్, ఇది నేను చూడలేదు. ఆ తర్వాత వచ్చిన “తీన్ పత్తీ” బాగా తీసింది. మూడో చిత్రం “పార్చడ్” కూడా బాగానే వుంది, బలమైన స్త్రీవాద భావనలతో. ఈ నాలుగో చిత్రమే కాస్త అటూ ఇటూ గా వుంది. మూలకథలో బలం వున్నా, రొమాన్సు, పాటలు, ఇతరత్రా అన్నీ కలుపుకుంటూ పోయి అసలు కథకు అన్యాయం చేసింది.

కొత్త ఢిల్లీలో ఇల్లు ఖాళీ చేసి పాత ఢిల్లీలోని చాందనీ చౌక్ కు మారతారు తండ్రీకొడుకులైన రాజ్ మాథుర్ (రిషీ కపూర్), కబీర్ (అనిరుధ్ తన్వర్) లు. తండ్రికేమో పుట్టిపెరిగిన చోటుకు వెళ్తున్నానని, తన స్నేహితుల మధ్య వుండబోతున్నాని సంతోషం. కొడుకుకేమో చిరాకు, కోపం. వొకటి తన తల్లి జ్ఙాపకాలున్న ఇల్లు వదలాల్సి రావడం, రెండు తను తన మిత్రులకు దూరం అవ్వాల్సి రావడం. అంతే, అలిగి తండ్రితో మాట్లాడడు. తన మిత్రులతో వో మ్యూజిక్ బేండ్ లో కలిసి పనిచేసే అవకాశం కూడా తప్పుతుంది, ఇల్లు మారడం వల్ల. ఇవన్నీ తన స్వార్థం మాత్రమే చూసుకునే తన తండ్రికి పట్టవు. ఇదీ అతని బాధ. టీనేజ్ వయసులో కొన్నాళ్ళు వుండే సంగతే ఇది. తల్లిదండ్రులను అర్థం చేసుకోరు, వాళ్ళ పట్ల అకారణ కోపాన్ని పోషిస్తారు వగైరా. అయితే ఆ కారణంగా తండ్రీ కొడుకుల మధ్య దూరాన్ని పూరించడం యెలా అన్నదే మిగతా కథ.

న్యాయంగా ఈ చిత్రానికి కథానాయకుడు తండ్రి. భార్య యెలా చనిపోయింది, ఆమె అనారోగ్యం కొడుకునుంచి యెందుకు దాయాల్సి వచ్చింది, సొంత ఇల్లు యెందుకు అమ్మాల్సి వచ్చింది ఇవన్నీ చివర్లో రేఖా మాత్రంగా చెప్పిస్తాడు. కథ దాని మీద దృష్టి పెట్టకుండా చాలావరకు కొడుకు, అతని కోపతాపాలు, అలగటాలు, తర్వాత ప్రేమ వీటి మీద యెక్కువ ఫుటేజి (బైట్స్ అనాలేమో) వాడారు. పోనీ ఆ కొడుకు నటన అయినా ఆకట్టుకుంటుందా అంటే అబ్బే. అనిరుధ్ తన్వర్ ముఖంలో సొట్ట బుగ్గలు తప్ప ఎలాంటి expression కనబడదు. కాని రిషి కపూర్ మాత్రం చాలా బాగా చేశాడు. అదే అతని కథను కాస్తా వివరంగా చెప్పి వుంటే ఇంకా బాగుండేది.

తనతో మాట్లాడని కొడుకుని తనతో సంభాషించేలా చేయడం యెలా అని మథన పడుతున్నప్పుడు అతను బీజి అని పిలిచే వో పెద్దావిడ సలహా ఇస్తుంది. తను వో అమ్మాయి ఫొటో ని నెట్లోంచి తస్కరించి కెనడాలో చదువుకుంటున్న తార అన్న అమ్మయి పేరుతో ఫేస్‌బుక్ ఫేక్ ఖాతా తెరిచి వుంటుంది. తన కొడుకుతో ఆ ఖాతా ద్వారా సంభాషించమని సలహా ఇస్తుంది. ఇంతకు ముందు తనపేరుతో ఫేస్‌బుక్ అభ్యర్థన పంపితే కొడుకు తిరస్కరించడం గుర్తుకొచ్చి సరేనంటాడు. ఇక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. కాస్త హాస్యం, కాస్త చిరాకూ అపనమ్మకమూ తావిచ్చే డ్రామా. కొడుకు నిజంగానే ఆ ఫొటోలో వున్న అమ్మాయి తో ప్రేమలో పడతాడు. నిజంగానే ఢిల్లీలో వుంటున్న ఆ అమ్మాయి అసలు పేరు సెహెర్ (అమైరా దస్తూర్). యూనిసెక్స్ సలూన్ కం బ్యూటిపార్లర్లో పనిచేసే ఈ అమ్మాయి అప్పులు చేయడంలో, అబద్ధాలాడడంలో, మనుషులను వాడుకోవడంలో ఆరితేరి వుంటుంది. తర్వాత తన గతాన్ని చెప్పినప్పుడు ఈ రెండు అవతారాలూ వొకే మనిషిలో పొసగవని అనిపిస్తుంది. సరే ఈ డ్రామా చివరి దాకా సాగుతుంది. చివరికి తండ్రీ కొడుకులు వొకటవడంతో కథ ముగుస్తుంది.

రిషి ఈ మధ్య బాగా నటించడం ఆశ్చర్యం కలిగించడం లేదు. మామూలైపోయింది. ఇక ఇతర పాత్రలు పోషించిన కుముద్ మిశ్రా, మనోజ్ పహ్వా, గజరాజ్ రావ్, మను రిషి, షీబా ఛద్ధా, నిర్మల్ రిషి లాంటివాళ్ళు బాగా నటించారు. కాని వాళ్ళ పాత్రలు కూడా పూర్తిగా తీర్చిదిద్దినవి కావు. కబీర్ మ్యూజిక్ బేండ్ కూడా వొక డ్రామాలానే వుంటుంది, తప్ప మనల్ను నమ్మించదు, ఆకట్టుకోదు. పాటలు కూడా బాధ్యత వహించాలి దానికి. డొనాల్డ్ ఆల్పీన్ అనే హాలివుడ్ చాయాగ్రాహకుడు, థోం నోబెల్ అన్న హాలివుడ్ ఎడిటరు దీనికి పనిచేశారు. కానీ ఢిల్లీ ఆత్మను పట్టుకోలేదు. పంజాబీ కుటుంబాలలో వుండే “అతి” మాత్రం మన కళ్ళ ముందు పెట్టారు, కాని మిగతా విషయాలలో లేదు. మొన్నమొన్నటి సుయీ ధాగా లో కూడా ఢిల్లీ ప్రపంచాన్ని బాగా పట్టుకున్నారు. ఇక తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ అంటే గుర్తుకొచ్చేది విక్రమాదిత్య మోత్వానే చిత్రం “ఉడాన్”. యెంత గొప్ప చిత్రం అది. అలాగే అందులో కొడుకుగా చేసిన రజత్ బార్మెచా. కానీ ముందే చెప్పుకున్నట్టు డ్రామాను సాగదీసి అసలు కథకు అన్యాయం చేయడం మూలాన ఇది వో గుర్తుండిపోయే చిత్రం కాలేకపోయింది. “స్త్రీ” చిత్రంలో చేసిన అపరాశక్తి ఖురానా ఇందులోనూ బాగా చేశాడు. కొత్తవాళ్ళలో ఇతనే ఇందులో గుర్తుపెట్టుకోతగ్గది. దస్తూర్ అందంగా వుంది, నటన బానే వున్నా పాత్ర సరిగ్గా మలచలేదు.

చిత్రానికి రాజ్మా చావల్ అని పేరు యెందుకు పెట్టినట్టు? రాజ్మా అంటే వొక రకమైన బీన్స్. దాంతో చన్నా మసాలా చేసినట్టు కూర చేస్తారు. అన్నంతో పాటు తినడం పంజాబీ ఇళ్ళల్లో సర్వసాధారణం. అంటే వొక ఇంటి వాతావరణాన్ని తలపుకు తేవాలని పెట్టినట్టున్నారు ఈ పేరు.

రిషి గురించి చూడవచ్చు.

Exit mobile version