రజనీ మహరాజ్

2
2

[12 డిసెంబర్ 2023 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రచనని అందిస్తున్నారు శ్రీ చావలి సాయి ప్రకాష్.]

[dropcap]శి[/dropcap]వాజీ రావ్ గైక్వాడ్ ఎవరో తెలుసా అని అడిగితే అధిక శాతం జనాభాకి తెలియకపోవచ్చు కానీ అదే సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుసా అంటే ఎల్‍కెజీ చదివే పిల్లాడు కూడా స్టైల్‌గా కళ్ళజోడు పెట్టుకొని సెల్యూట్ చేసి వాడిలోనే మనకి రజనీని చూపిస్తాడు. భారతదేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే పరిచయం అక్కర్లేని పేరు రజనీకాంత్. ఈ రోజున ప్రతి నోటా నానే పాన్ ఇండియా అనే పదం ప్రాచుర్యం లేని రోజుల్లోనే దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా తన సినిమాలు రిలీజ్ చేసిన అసలు సిసలు పాన్ ఇండియా హీరో తలైవర్ రజనీకాంత్. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం తన స్టైల్‌తో, నటనతో ఫిదా అయ్యేలా చేసి అభిమానులని సంపాదించుకున్న అతి కొద్ది మంది భారతీయ నటుల్లో రజనీ ఒకరు.

మన దేశంలో రజనీ సినిమా విడుదల క్రేజ్ ఎలా ఉంటుందంటే కొన్ని కంపెనీలు ఆరోజు సెలవు ప్రకటిస్తాయి కూడా! సినిమా విడుదలైన మొదటిరోజు మొదటి ఆటని అభిమానుల సందడి మధ్యలో చూసి ఆస్వాదించాలని విదేశాల నుండి రజనీ అభిమానులు మన దేశం వచ్చి మరీ సినిమా చూస్తారంటే అభిమానుల గుండెల్లో అతడు ఎలాంటి స్థానం సంపాదించుకున్నాడో అర్థమవుతుంది.

ఇటీవల జపాన్‌లోని ఒసాకా నగరం నుండి ఒక జంట పదహారు గంటలకి పైగా ప్రయాణం చేసి చెన్నై వచ్చి మరీ మొదటి రోజు ‘జైలర్’ సినిమా చూశారంటే వాళ్ళ అభిమానం ఎలాంటిదో ఊహించవచ్చు. తాము గత ఇరవై ఏళ్లకు పైగా రజని అభిమానులమనీ, రెండున్నర దశాబ్దాల క్రితం చూసిన రజనీ సినిమా ‘ముత్తు’ నుండి ఆయనకి అభిమానులుగా మారిపోయామని చెప్పుకొచ్చారు.

‘ముత్తు’ సినిమా జపనీయులకి అంతలా నచ్చేసింది మరి! గత సంవత్సరం మన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జపాన్‌లో విడుదల అయ్యి వంద రోజులు ఆడటమే కాకుండా అప్పటిదాకా అత్యధిక కలెక్షన్ల రికార్డు ఉన్న రజనీకాంత్ ‘ముత్తు’ సినిమాని కలెక్షన్లలో దాటేసి జపాన్‌లో విడుదలైన భారతీయ సినిమాల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది, అంటే ఓ ఇరవై ఏడు సంవత్సరాలుగా రజనీ ‘ముత్తు’ సినిమా రికార్డు అలానే ఉండటం గమనార్హం.

అలాంటి రికార్డు ఉన్న ‘ముత్తు’ సినిమా గురించి, జపనీయుల్లో రజనీ ఫాలోయింగ్ గురించి ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం.

జపాన్‌లో సినిమాలు అంటే అప్పటిదాకా జపనీస్ భాషలో తీసిన సినిమాలు లేదా హాలీవుడ్ సినిమాలే! అవి కాకుండా భారతీయ సినిమాలు కొన్ని విడుదలైన కూడా ఎక్కువ ఆదరణ పొందలేదు, అప్పటిదాకా విడుదలైన వాటిలో షారుఖ్ ఖాన్ నటించిన ‘రాజు బన్‌గయా జెంటిల్మాన్’ సినిమా బాగా ఆడింది.

రజనీకాంత్ – జపాన్ అని వినగానే ముందుగా గుర్తొచ్చేది ‘ముత్తు’ సినిమానే. మన దక్షిణాది మాస్ మసాలా చిత్రాలంటే అసలే తెలియని జపనీయులకి వాటిని పరిచయం చేసింది ఈ సినిమాయే. ఆ వైనం మీద ఒక డాక్యుమెంటరీ తీయగలిగినంత సమాచారం ఉందంటే నమ్మితీరాలి. అసలు ‘ముత్తు’ సినిమా జపాన్ దేశంలోకి ఎలా ప్రవేశించిందన్న దగ్గర మొదలుపెడదాము.

***

సింగపూర్ 1996

ముందుగా మీకో వ్యక్తిని పరిచయం చేయాలి, అతనే ఫుమియో ఫురుయా అలియాస్ జున్ ఎడోకి (Fumio Furuya a.k.a Jun Edoki). మనం ఎడోకి అని పిలుద్దాం. ఈ ఎడోకి లేకపోతే రజనీకి జపాన్‌లో ఇంతటి ఆదరణ సాధ్యమయ్యుండేదా అనేది ఆలోచించాల్సిన విషయమే.

భారతదేశంలో ‘ముత్తు’ సినిమా విడుదల అయ్యి అప్పటికే సంవత్సరం అవుతోంది. సీడీలు, డీవీడీలు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి.

అది 1996వ సంవత్సరం. సింగపూరు లిటిల్ ఇండియా ప్రాంతంలో ఉన్న మహమ్మద్ ముస్తఫా షాపింగ్ సెంటర్. అక్కడికి పర్యాటక నిమిత్తం వచ్చిన ఓ ముగ్గురు జపనీయులు అన్ని సినిమాల డీవీడీలు చూస్తున్నారు. ఆ ముగ్గురిలో ఒకడు మన ఎడోకి. ఇతను ఒక సినీక్రిటిక్. అక్కడ టీవీలో ‘ముత్తు’ సినిమాలోని పాట వస్తుంటే కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు. అందులో హీరో హీరోయిన్లు చేస్తున్న నృత్యాలు వేషధారణ, ఆ ప్రదేశాలు, అందులో ఉన్న ఏనుగులు అతనికి భలే నచ్చేసాయి.

‘ముత్తు’ సినిమాలో పాట చూస్తుంటే ఎడోకికి అతని ఊహాలోకంలో ఉన్న భారతదేశ చిత్రం కనపడింది. అలా టీవిలో ‘ముత్తు’ని చూస్తూ తన మిత్రులతో సినిమా గురించి అందులో హీరో రజనీకాంత్ గురించి సంభాషించుకుంటూ ఉండగా అక్కడే డీవీడీ షాపులో ఉన్న ఒక భారతీయుడికి వినపడింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ‘ముత్తు’ సినిమా నిర్మాత కందస్వామి గారే. వీళ్ళ జపనీస్ భాష కందస్వామి గారికి అర్థం కాకపోయిన కూడా వాళ్ళ మాటల మధ్యలో ఎక్కువ సార్లు రజనీకాంత్ అనే పేరు వినపడేసరికి కుతూహలంతో వాళ్ళ దగ్గరికి వెళ్లి విషయమేంటో తెలుసుకుందామని పలకరించాడు. కందస్వామి తనని నిర్మాత కాకుండా, భారతీయ సినిమాల గురించి సహాయం చేయగలను అన్నట్లు ఒక భారతీయుడిగా పరిచయం చేసుకున్నారు. ఎడోకి రజనీకాంత్ నటించిన ఓ నాలుగు సినిమాల డివిడిల కావాలని కందస్వామితో చెప్పారు, ఆ నాలుగిటిలో కాసేపటి క్రితం టీవీలో చూసినప్పుడు ఎడోకికి నచ్చిన ‘ముత్తు’ కూడా ఒకటి.

‘ముత్తు’ సినిమాలో తాను చూసిన పాట తెగ నచ్చెయ్యడంతో ఆ సినిమా డివిడిని టోక్యోకి తీసుకెళ్లి తన భార్యతో కలిసి చూసాడు. వాళ్ళిద్దరికీ పాటలతో పాటు సినిమా మొత్తం కూడా తెగ నచ్చేసింది. ఎంతలా నచ్చిందంటే రోజుకు ఒక్కసారైనా సినిమాలోని కొంత భాగాన్ని చూసేంతగా ఆ సినిమాకి బానిసలయ్యారు.

మెల్లగా ఎడోకి తన స్నేహితులకి ఈ సినిమా చూపించటం, చూసిన వారు వాళ్ళ స్నేహితులని తీసుకువచ్చి వారికీ కూడా చూపించడంతో అతను నివసించే అపార్ట్‌మెంట్స్ మొత్తం ‘ముత్తు’ అనే సినిమా గురించి వార్త చక్కర్లు కొట్టింది. తనకి, ఇరుగుపొరుగులకి ఒక దక్షిణ భారతీయ చిత్రం ఇంతగా నచ్చుతోందంటే జపనీయులందరికీ ఈ సినిమా బాగానే నచ్చుతుంది అని ఎడోకి అనుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఈ సినిమాని జపాన్‌లో థియేటర్‍లో విడుదల చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచించాడు.

వెంటనే అక్కడ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు Xanadeux, JCA లోని మిత్రుల వద్దకు ఈ సినిమా ప్రస్తావన తీసుకెళ్లాడు. జపాన్‌లో ఈ సినిమాని విడూదల చెయ్యాలంటే ముందుగా ఆ సినిమా హక్కులు దక్కించుకోవాలి. దానికోసం ఈ త్రయం(ఎడోకి, Xandeux, JCA కంపెనీవాళ్ళు) కలిసి ‘ముత్తు’ సినిమా నిర్మాత కందస్వామిని సంప్రదించారు. వాళ్ళు తమిళ సినిమా హక్కులు కొనడం అదే మొదటిసారి. తమిళ నిర్మాత కందస్వామికి కూడా తన సినిమాని జపాన్‌లో అమ్మడం అదే మొదటిసారి. దాంతో ఇద్దరికి బేరసారాలు సరిగా కుదరలేదు.

ఇక చేసేదేమీ లేక కందస్వామి ఈ సినిమా హక్కులకి ప్రతిఫలంగా ఒక డాలర్ ఇస్తే చాలన్నాడు. ఆ మాటలు వినగానే అతను జోక్ చేస్తున్నాడనుకున్నారు జపాన్ సంస్థవాళ్ళు.

జపాన్‌లో తమిళ సినిమా మార్కెట్ ఎలా ఉందో తెలియదు కనుక ఈ సినిమా కోసం కందస్వామి తనకి నిజంగానే ఒక డాలర్ చాలని చెప్పి, ‘ముత్తు’ సినిమా గనక అక్కడ బాగా ఆడితే ఆయన నిర్మాణ సంస్థ నుండి భవిష్యత్తులో ఇంకా అనేక సినిమాలని వాళ్ళు తీసుకునేటట్టు ఒప్పందం కుదుర్చుకుందామని చెప్పగానే, జపాన్ సంస్థ కూడా దానికి అంగీకరించింది.

వాళ్ళు తీసుకున్న నిర్ణయం చరిత్ర సృష్టించబోతోందని ఆ రోజున ఎవరూ ఊహించి ఉండరు.

ప్రచారం

‘ముత్తు’ సినిమా తీయటానికి ఆరు నెలలు పడితే జపాన్‌లో విడుదల చేయడానికి ముందు అక్కడ ప్రచారానికే తొమ్మిది నెలలు పట్టింది. దానికోసం ఒక చక్కని వివరణాత్మక ప్రణాళికను రూపొందించారు. జపాన్ వాళ్ళకి రజనీకాంత్ గురించి తెలీదు, వాళ్ళకి తెలిసింది బాలీవుడ్ హీరోలైన షారుఖ్, ఆమీర్ మాత్రమే కాబట్టి అప్పటికే అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన జాకీచాన్ పేరు వాడుకొని రజనీకాంత్‌ను ‘భారతీయ జాకీచాన్’ గా అభివర్ణించారు. మరో పక్క ఎందుకైనా మంచిదని రజనీకాంత్ సినిమాగా కంటే మీనా ఉన్న పోస్టర్లుతోనే ఎక్కువ ప్రచారం చేసారు. భారతీయ ప్రాంతీయత ఉట్టి పడే విధంగా ఏనుగుల బొమ్మలు కూడా పోస్టర్లలో చేర్చారు.

విడుదల

1998 జపాన్‌లో ‘ముత్తు’ సినిమా ‘‘ముత్తు’ – ఒడోరి మహారాజా (‘ముత్తు’, ది డ్యాన్సింగ్ మహారాజా)’ అనే పేరుతో విడుదలైంది.

ఈ సినిమా జపాన్ వాళ్ళకి చాలా నచ్చేసింది, ఆ డైలాగులు, కామెడీ, హీరో హీరోయిన్ల డ్యాన్సులు, ఫైట్లు.. అబ్బో ఒకటి అని కాదు, ఆ సినిమాలో అన్ని అంశాలూ జపనీయులని ఆకట్టుకున్నాయి.

జపాన్‌లో ‘ముత్తు’ సినిమా ఆడుతున్న హాల్లో ఒకరోజు హీరోయిన్ మీనా అకస్మాత్తుగా ప్రత్యక్షమై జపనీస్ భాషలో మూడు ముక్కలు వ్రాసింది – “నాకు జపాన్ అంటే ఇష్టం. నాకు జపనీయులు అంటే ఇష్టం. మా సినిమా కేవలం మూడు సార్లు చూడండి” అని. అలా మీనా అడిగినట్లుగానే మూడుసార్లు సినిమా చూసిన జపనీయులు అధిక శాతంలో ఉన్నారు.

మీనాకి అక్కడ అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి, ‘ముత్తు’ తరువాత మీనా నటించిన ఎన్నో సినిమాలు జపనీస్ భాషలోకి అనువదించారు.

నిజం చెప్పాలంటే అసలు ఒక మాస్ మసాలా కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో తెలియని జపనీయులకి దాని రుచి చూపించిన సినిమా ‘ముత్తు’. ఈ సినిమా ప్రదర్శన జరిగే అన్ని థియేటర్లలో లైవ్ కన్సర్ట్ తరహాలో ప్రేక్షకులు కుర్చీలో నుండి లేచి డ్యాన్సులు చేస్తూ, ఈలలేసి గోల చేస్తూ సినిమాని పూర్తిగా ఆస్వాదించారు. ‘థిల్లానా థిల్లానా’ పాట గురించి ఇక ప్రత్యేకించి చెప్పేది ఏముంది? ఆ పాట హాల్ మొత్తాన్ని ఊపేసింది. మొత్తానికి ఈ సినిమా బాగుందనే మౌత్ టాక్ వచ్చేసింది.

వెంటనే ఈ సినిమా ప్రదర్శించే హాళ్ల సంఖ్య కూడా పెరిగింది. జపాన్ మొత్తం ‘ముత్తు’ మేనియాగా మారింది. రజనీకాంత్ స్టైల్, మ్యానరిజమ్స్ అయితే వాళ్ళకి తెగ నచ్చేసాయి. రజనీని తెర మీద చూస్తుంటే ఎప్పుడూ చూడని ఒక హీరోని చూస్తున్న అనుభూతి. అప్పటిదాకా అత్యధిక కలెక్షన్లు ఉన్న షారుఖ్ సినిమా ‘రాజు బన్‍గయా జెంటిల్మన్’ను ‘ముత్తు’ దాటేసి జపాన్‌లో భారతీయ సినిమా స్థాయిని పెంచింది.

జపాన్ వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న లియోనార్డో డికాప్రియో స్థానాన్ని ‘ముత్తు’తో రజని సొంతం చేసుకున్నాడు. అక్కడ ‘ముత్తు’ సినిమాకి వచ్చిన వసూళ్ళని చూసి ఇది ‘టైటానిక్ అఫ్ ఆర్ట్ థియేటర్స్’ అని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానించారు.

ఎవరు నమ్మినా నమ్మకపోయిన ఒకటి మాత్రం నిజం, కేవలం తన హావభావాలతో, తనకి మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన స్టైలుతో రజనీ జపనీయుల మనసులని గెల్చుకున్నాడు. రజనీ ప్రభావం ఎంతగా వ్యాపించిందంటే, ‘హీరో అనేవాడు అందంగా లేకపోయినా తన నటనతో మనల్ని అలరిస్తే చాలు!’ అని జపనీయులు ఆలోచన విధానం మార్చేసిన సినిమా ‘ముత్తు’. ‘ముత్తు’లోని ‘థిల్లానా థిల్లానా’ స్టెప్ ఉపయోగించి జపాన్ దేశంలో ఓ మద్యపాన సంస్థ తమ బ్రాండ్ యాడ్లకి వాడుకొని కొనుగోళ్ళు పెంచుకుంది. ‘ముత్తు’ సినిమా రికార్డులు సినిమా ప్రదర్శనతో మాత్రమే ఆగలేదు. టీవీలో ప్రసారమైనప్పుడు, డీవీడీల అమ్మకాల రూపంలో కూడా భారీ రికార్డులు సొంతం చేసుకుంది.

జపాన్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మొట్టమొదటి నాన్-హాలీవుడ్ చిత్రంగా ‘ముత్తు’ నిలిచింది. ‘ముత్తు’ హక్కుల కోసం అంగీకరించిన ధర $1 అయినప్పటికీ, జపనీస్ బాక్సాఫీస్ వద్ద ‘ముత్తు’ విజయం సాధించడంతో ‘ముత్తు’ నిర్మాణ సంస్థ కవితాలయాకు జపాన్ సంస్థ చాలా పెద్ద మొత్తమే చెల్లించింది.

జపాన్‌లో రజనీకి వేల సంఖ్యలో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. కొంతమంది వీరాభిమానులైతే తమిళ్ కూడా నేర్చుకొని, ఇప్పటికీ రజనీ సినిమా విడుదల రోజుకి జపాన్ నుండి చెన్నైకి వచ్చి ఇక్కడ మొదటి రోజు మొదటి ఆట చూసి ఆనందిస్తారు.

2006లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ టోక్యోను సందర్శించినప్పుడు పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ‘ముత్తు’ గురించి ప్రస్తావించగానే కరతాళ ధ్వనులతో హాల్ అంతా మారుమ్రోగింది.

ఈ సినిమా విడుదలయ్యాకా వారు భారతదేశం గురించి మరింతగా తెలుసుకుని మన వస్త్రధారణని, రుచులని ఆస్వాదించడం మొదలెట్టారంటే అతిశయోక్తి కాదు. ‘ముత్తు’ తర్వాత జపనీస్ ప్రజల దుస్తులు, ఆహారపు అలవాట్లు మారిపోయాయి. జపాన్ స్త్రీలు భారతీయ వస్త్రధారణని ప్రతిబింబించే సల్వార్ కమీజ్ ధరించడం ట్రెండ్‌గా మారింది. అలాగే వారు భారతీయ రుచులైన మసాలా దోసెలు, సాంబార్, మొదలైన దక్షిణభారత రుచులని ఆస్వాదించడం మొదలుపెట్టారు. సినిమా పాటల తరహా డాన్సులు నేర్చుకోవాలని ఎంతో ఆసక్తి చూపటంతో ఎన్నో బాలీవుడ్ డాన్స్ స్కూల్స్ జపాన్‌లో నెలకొల్పడం జరిగింది.

జపాన్‌లో ‘ముత్తు’ చిత్రాన్ని రజనీకాంత్ చిత్రంగా ప్రచారం చేయకపోయినా కానీ విడుదలయ్యాకా అక్కడ ఎవరూ ఊహించని విధంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు తలైవా రజనీకాంత్.

‘ముత్తు’ తర్వాత జపాన్‌లో భారతీయ చిత్రాలు, ఎక్కువగా తమిళం, హిందీ, తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ‘ముత్తు’ తర్వాత రజనీకాంత్ నటించిన సినిమాలు కూడా జపాన్‌లో విడుదలయ్యాయి కానీ ‘ముత్తు’ని మాత్రం ఢీకొట్టిన దాఖలాలు లేవు. గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చేవరకూ జపాన్‌లో విడుదలైన మరే ఇతర భారతీయ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంతటి ఘన విజయం సాధించలేదు.

మరి ‘ముత్తు’ ఒక్కటే ఎందుకు ప్రత్యేకం? మనం ఏదైనా సినిమా చూసినా లేదా పుస్తకం చదివినా అది మన మనసుల్లో ముద్రవేసుకుపోవాలి అంటే ఆ సినిమా లేదా పుస్తకానికి మన భావోద్వేగాలు ఖచ్చితంగా ముడిపడి ఉండాలి. ఆ భావోద్వేగాలే వాటిని మనకి గుర్తుండిపోయేలా చేస్తాయి. ఈ కోణంలో పరిశీలించి ‘ముత్తు’ సినిమాని జపనీయులు ఎందుకు నెత్తిన పెట్టుకున్నారో చూద్దాము.

జపాన్ ఆర్థిక మాంద్యం

‘ముత్తు’ సినిమా జపాన్‌లో విడుదలయ్యే సమయానికి అక్కడ ప్రజలు ఆర్థిక మాంద్యంతో బాధపడుతున్నారు. మార్చి 31, 1998న ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జపాన్ ఆర్థిక వ్యవస్థ 0.7 శాతం క్షీణించింది, 1974 తర్వాత దేశం మొదటిసారిగా ప్రతికూల వృద్ధిని చవిచూసింది. డాలర్తో పోలిస్తే జపాన్ కరెన్సీ యెన్ ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోయింది. వేలాది మందిని ఉద్యోగాల నుండి తొలగించారు. అందరి జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి, భవిష్యత్తు గురించి బెంగ మొదలైంది. అందువల్ల ప్రజలు తమ ఖర్చులని అదుపులో ఉంచుకున్నారు. పైగా తరువాతి కాలం 2000వ సంవత్సరం గురించి భయాలు మొదలయ్యాయి.

అదే సమయంలో, “మాంద్యం గురించి, మిలీనియం గురించి మర్చిపోండి, ‘ముత్తు’ మాయలో పడి ఆనందించండి!” అంటూ ‘ముత్తు’ సినిమా ప్రచారాలు జరిగాయి. ఆ మార్కెటింగ్ వ్యూహం ఫలించింది. ప్రజలు కాసేపువాళ్ళ బాధలు మర్చిపోయి సరదాగా సినిమాని ఆస్వాదించారు. కామెడీ సీన్లకి నవ్వుకున్నారు, పాటలు రాగానే చిన్నపిల్లలాగా ఎగిరి గంతేసారు, సెంటిమెంట్ సీన్లకి కన్నీరు కార్చారు.

అంతకుమునుపెన్నడూ జపనీయులు ఒక సినిమా చూస్తూ ఇన్ని అనుభూతులని ఏకకాలంలో పొందలేదు. దాంతో సినిమా హాళ్ల బయట జనం క్యూ కట్టారు. సరైన సమయానికి, సరైన మనిషి ద్వారా ఓ మంచి మాట అందితే ఆ మాట విలువే వేరని ఓ మాటల రచయిత చెప్పినట్టు జపనీయుల ఆర్థిక సమస్యలకి అద్దం పడుతున్నట్టు ‘ముత్తు’ సినిమాలో కూడా డబ్బు వల్ల వచ్చే కష్టనష్టాలు ఉంటాయి. కామెడీ, ఫైట్లే కాకుండా ఈ సినిమాలో ఎంతో లోతైన తత్త్వం దాగుంది అనిపించింది సినిమా చూస్తున్నవాళ్ళకి. మనిషి ఎంత సంపాదించిన కూడా మనఃశాంతి మాత్రం డబ్బుతో కొనలేము అని తెలిసేలా చేసింది.

రజనీకాంత్ డబ్బు గురించి, జీవితం గురించి పలికే ప్రతి మాట నిరాశలో కూరుకుపోయిన జపనీయులకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. లెక్కకు మిక్కిలి డబ్బు లేకపోయినా ఉన్నదాంట్లో సంతృప్తిగా బ్రతకడాన్ని ఆ సినిమా ద్వారా రజనీ తమకి సందేశమిస్తున్నట్లనిపించింది. డబ్బు కోసం అడ్డదారులు తొక్కి కోటీశ్వరులు అయినా కూడా ఫలితం ఉండదని చెప్పడమే ఆ సినిమా కథాంశమని జపనీయులు గ్రహించారు.

ఎంత సంపాదించినా కూడా అవసరమైతే అదంతా వదులుకోవడానికి సిద్ధపడాలని, అవసరానికి తగిన ధనం ఉంచుకొని మిగతాది ఇతరులకి పంచడంలోనే జీవితంలో సుఖం ఉంటుందని, డబ్బు కోసమో, పదవికోసమో ప్రాకులాడకూడదని ఆ సినిమా వారికొక పాఠం నేర్పింది. ఈ సినిమా చూసాకా డబ్బు లేకపోయినా కూడా మనఃశాంతిగా ఎలా ఉండచ్చో వాళ్ళు తెలుసుకున్నారు. రాజులా ఉన్నా బంటులా ఉన్నా కూడా ‘ముత్తు’లాగా జీవితాన్ని అస్వాదించాలి అని ‘ముత్తు’ సినిమా వారికి నేర్పింది.

జీవితంలో డబ్బు సర్వస్వం కాదని, ప్రతి ఒక్కరూ కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలని తెలిపే ఆ సినిమా మాంద్యం వల్ల నిరాశలో కూరుకుపోయిన జపనీయులకి వారి నిరాశలని దూరం చేసి వారిలో ఓ క్రొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒంటరి అయిపోయాం అనుకునేవారికి డిప్రెషన్ని దూరం చేసింది. ఉద్యోగాలు పోవడం వల్ల డబ్బుకి ఇక్కట్లు పడుతున్నవారికి జీవితం పట్ల ఒక ఆశ చిగురింపజేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటి ఆర్థిక పరిస్థితుల్లో జపనీయులకి జీవితం పట్ల ఊరటనిచ్చిన సినిమా ‘ముత్తు’.

మనకి ‘ముత్తు’ కేవలం ఒక సూపర్ స్టార్ సినిమా మాత్రమే, కానీ జపాన్ వాళ్ళకి ‘ముత్తు’ ఒక ఎమోషన్, ఒక సెలబ్రేషన్. జపనీయుల జీవితాలను ప్రభావితం చేసిన ‘ముత్తు’ ఇప్పటికీ ప్రత్యేకమే, వాళ్ళకి రజనీ ఎప్పటికీ మహరాజే!

***

అలా ఆ రోజు ఎడోకి సింగపూర్ డీవీడీ షాపులో ‘ముత్తు’ చూసి ఉండకపోతే, వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారులే మనకెందుకు అని నిర్మాత కందస్వామి ఆ అవకాశాన్ని వదిలేసి ఉంటే, జపనీయులు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రజనీ ఇమేజ్ గురించి ఈ రోజు మనం ఇలా చెప్పుకునేవాళ్ళం కాదు!

హీరో అంటే ఆరడుగులున్న అందగాడై ఉండాలనే సినిమా ఫార్ములని ముక్కలు చేసి ఆత్మస్థైర్యంతో, తనకి మాత్రమే సొంతమైన స్టైల్తో నటుడిగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించిన ఈ రాఘవేంద్ర భక్తుడి గురించి ఎంత వ్రాసినా అభిమానులకి తనివితీరదు. మన దేశ ప్రధాని జపాన్ సందర్శించినప్పుడు “మీరు రజనీకాంత్ దేశం వారు కదా?” అని ప్రధానిని అడిగే స్థాయికి తీసుకెళ్లిన ఈ బస్ కండెక్టర్ ఎదిగినతీరు నిజంగా స్ఫూర్తిదాయకం.

ఈ సంవత్సరం రజనీ జన్మదినం పురస్కరించుకొని తమిళనాడులో ‘ముత్తు’ సినిమా రీరిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ డిసెంబర్ 12వ తారీఖున పుట్టిన రోజు జరుపుకుంటున్న మన ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇలానే నిండు నూరేళ్లు ఆరోగ్యవంతంగా జీవించి మనందరినీ తన సినిమాల ద్వారా అలరించాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here