Site icon Sanchika

రక్త సంబంధం

[శ్రీమతి మంగు కృష్ణకుమారి రచించిన ‘రక్త సంబంధం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ప[/dropcap]ట్టాభిరామయ్య బయటనించీ ఇంటికి చేరేసరికి గుమ్మంలో ఆడుకుంటూ కనపించేరు, కూతురు కమల, కొడుకు అమర్.

సంతృప్తిగా లోపలికి వెళ్ళేసరికి భార్య జానకి వంటింట్లో ఎసట్లో బియ్యం పోస్తోంది‌. పొయ్యిలో ఉన్న ఎండుకట్టెలు భగభగా మండుతున్నాయి. ఇత్తడిగిన్నె చాలా పెద్దది. తాము నలుగురే అయినా పనివాళ్ళకి, పాలేర్లకీ, ఇంటి చాకలికీ, అందరికీ రోజూ భోజనాలు పెడుతుంది జానకి.

పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులూ కడుక్కొని వచ్చేడు. “మీ పిల్లలు చూసేరా? ఒకటే ఆటలు.. చదువు మాటే ఉండదు.. ఇహ అమర్ కి కమల ఏది చేస్తే అది. ఎంత చెప్తే అంత..” ఫిర్యాదుగా అన్నది.

“పోనీలే జానకీ.. ఆడీ పాడే వయసు. ఆడుకొనీలే.. ఏదీ నాకు ఇంత కాఫీవో, టీవో పోస్తే, తాగి పెరట్లో మొక్కలకి తాళ్ళు కడదాం అనుకుంటున్నాను. అసిరినాయడు ఇటు వస్తానన్నాడు. సాయపడతాడు” అన్నాడు.

జానకి ఒక పళ్ళేంలో సున్నుండలూ, జంతికలూ పెట్టి తెచ్చి “ఇవి తింటూ ఉండండి.. కాఫీ తెస్తాను” అంది.

అంతలో అసిరినాయడు వచ్చేడు.

“అయ్యగారండీ.. పెరట్లో పని ఉందన్నారు” అన్నాడు వినయంగా.

“మొదట ఇవి తినరా.. తరవాత కాఫీ తాగి చేసుకుందాం..” అంటూ తన చేతిలో ఉన్న పళ్ళెం ఇచ్చేసేడు.

అసిరినాయడు తినడం పూర్తి చేసేసరికి.. జానకి చిక్కటి కాఫీ తెచ్చింది. అప్పుడే మరిగిన పాలల్లో అప్పుడే దిగిన డికాషన్ వేసి కలిపిన చిక్కటి కాఫీ ఒక్కలాటివి రెండు పెద్దగ్లాసులు ఇద్దరికీ అందించింది.

కాఫీతాగి ఇద్దరూ పెరట్లోకి వెళ్ళి పాదులకి తాళ్ళు కట్టడం మొదలెట్టేరు.

భార్యాభర్తలు ఇద్దరి చేతికి ఎముక లేదనే చెప్లాలి. కష్ట పడుతున్న పాలేర్లకే కాదు.. అశ్రితులకీ, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎందరికో సాయపడతారు. అసిరినాయుడుకి వెళుతూ ఉంటే, ఆనప, బీర, వంకాయ లాటి కూరలన్నీ ఒక బేగులో ఉంచి, ఇచ్చింది జానకి.

“సల్లంతల్లి. అమ్మ‌ ఎప్పటికీ బాగుండాల..” అసిరినాయడు సంతోషంగా దీవించి వెళ్ళేడు.

ఆటలు పూర్తి చేసి పిల్లలు ఇద్దరూ లోపలకి వచ్చేరు. తండ్రి మీద పడ్డాడు అమర్. “వేడినీళ్ళు సిద్ధంగా ఉన్నాయి. మొదట ఇన్ని నీళ్ళు పోసుకు రండి..” గద్దించింది జానకి.

తల్లి ఏది చెప్పినా అలా పాటిస్తారు కమలా, అమర్. ఇద్దరూ వెళ్ళి వేడినీళ్ళతో స్నానం చేసి, మెత్తటి బట్టలు కట్టుకొని వచ్చేరు. జానకి మూడు కంచాలు పెట్టింది. ముగ్గురూ వచ్చి భోజనాలకి కూర్చున్నారు. పెద్దపీట, వెండి కంచం పట్టాభిరామయ్యకి..

జానకి కూర, అన్నం వడ్డించింది. ఎర్రకారం‌ పచ్చడీ, పప్పుచారూ.. వేపిన వడియాలూ పక్కనే ఉంచింది.

ఆత్రుతగా అన్నంలో కూర కలుపుకొని తినడం మొదలెట్టేరు అమర్.. కమలా.

“నువ్వుకూడా కూచోవచ్చుగా జానకీ..” వడియాలు కరకరలాడిస్తూ అన్నాడు పట్టాభిరామయ్య.

“నయం ముందు మీరు తినండి.. తరవాత నేను” బలంగా చెప్పి అమర్ కంచంలో ఓ గరిటెడు కూర వేసింది జానకి. “అబ్బా చాలమ్మా..” గునిసేడు అమర్. “అక్కకి వెయ్యి. నాకే అంతా పెట్టకు” అన్నాడు.

“అక్కకి పెడతానురా..” అంటూ కమల కంచంలో ఓ గరిటెడు కూర వేస్తే కమల గోల “ఒరే నువ్వు తింటే తిను. లేకపోతే మాను. నా మీదకి తిప్పుతావేంరా” అంది.

నవ్వుల మధ్య భోజనాలు ముగిసేయి. పక్కలు ముందుగదిలో పరిచింది.

కమలకి వేరు, అమర్‌కి వేరుగా వేసినా, ఇద్దరూ ఒక దగ్గరే చేరి కుమ్మేసుకుంటున్నారు. “చాలురా ఆ కుస్తీపట్లేమిటి?” తల్లి మందలించింది కొడుకుని.

ఈ నవ్వులు సరదాల మధ్యే కాలం చకచకా గడుస్తున్నాది. అమర్ పెద్దవుతున్నకొద్దీ వాడిలో చిన్నపాటి మార్పు. వాడి బెస్డ్ ఫ్రండ్స్, సోంబాబు, భూపాలరెడ్డిల ప్రభావం వాడిమీద పడింది. “ఇంట్లో ఆడపిల్లలు మైనస్సులు. వాళ్ళు ఇల్లు కొల్లగొట్టి మరీ అత్తింటికి వెళతారు‌. అయినా ఇలాటి ఆడపిల్లలకి ఎందుకు ఎక్కువ చేయాలి?” ఇలాటి మాటలు వినీ అవే నిజం అనుకున్నాడు.

వాడి భావాలు బైటకి చెప్పే ధైర్యం లేదు. కానీ నిరసనతో కమలని, కాస్త దూరం పెట్టడం మొదలెట్టేడు.

ఇటు పొలాల మీద వచ్చే ఆదాయం చాలక పట్టాభిరామయ్య, జానకి అతలాకుతలం అవుతున్నారు.

జానకి కమలకి పెళ్ళి అయిపోతే బాగుంటుంది అనుకుంది. భర్తతో అన్నాది. “ఏమండీ, మన ఆదాయం పరిస్థితి చూస్తూ ఉంటే ‘తీసికట్టూ నాగంభట్టూ’ అన్నట్టు ఉన్నాం. ఈపాటి ఉండగానే కమలకి మంచి సంబంధం చూసి పెళ్ళి చేసిస్తే సరి” అంది. పట్టాభిరామయ్య “నేనూ అదే అనుకుంటున్నాను జానకీ.. మన మునసబు గారు ఒక సంబంధం చెప్పేరు. రేపే వెళ్ళి వివరాలు కనుక్కొని వస్తాను” అన్నారు.

మర్నాడే పట్టాభిరామయ్య బయల్దేరి వెళ్ళేడు. సంగతి తెలిసి అమర్ కసిగా పళ్ళునూరేడు.

సాయంకాలానికే వికసించిన మొహంతో వచ్చేడు పట్టాభిరామయ్య. “ఏమయిందండీ పని.. కాయా? పండా?” అంది జానకి మంచి నీళ్ళ గ్లాసు అందిస్తూ.

“వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు జానకీ. అయినా చాలా మర్యాదస్థులు. మనమ్మాయి గురించి విన్నారట. తప్పక పెళ్ళిచూపులకి వస్తాం అన్నారు” అన్నాడు. చాటుగా వింటున్న కమల సిగ్గుతో పారిపోతే, అమర్ కత్తులు దూస్తూ ఫ్రెండ్ భూపాలరెడ్డి దగ్గరకి వెళ్ళేడు. అక్కడ తనింటి విషయం చెప్పీ.. కొంచెం ఓదార్పు పొందీ.. అనవసరమైన విషం మనసులో ఇంకించుకొని మరీ ఇంటికి వచ్చేడు.

ఆ రోజే పెళ్ళి చూపులు. అందరూ చాలా బాగున్నారు. ఆడవాళ్ళు ఖరీదయిన నగలు వేసుకున్నారు.

అబ్బాయి నిలువెత్తు ఉన్నాడు. సూటూ, బూటూతో మెరిసిపోతున్నాడు. అమర్‌ని ఆదరంగా పలకరించేడు. కమలని ఓరగా చూస్తూనే, అమర్‌తో మాటాడ్డం మొదలెట్టేడు. కమల సిగ్గుతో బుర్ర ఎత్తడం లేదు.

కాఫీలు పలహారాలు అయిన తరవాత అబ్బాయి ఆదిత్య తండ్రి దశరథరాం “మరి అబ్బాయి, అమ్మాయి ఒకసారి మాటాడుకుంటే బాగుంటుందండీ..” అన్నాడు.

పట్టాభిరామయ్య మిద్దెగదిలో వాళ్ళిద్దరూ మాటాడుకుందికి ఏర్పాటు చేసేడు. అమర్ ఊహలు ఎక్కడికో వెళిపోయేయి. అక్క అతనితో, తమింటి పరిస్థితులు అన్నీ చెప్పేస్తుంది. అతను విని ‘నువ్వు ముఖ్యం కానీ.. మీ నాన్న డబ్బు ముఖ్యం కాదు’ అంటాడు. కానీ ఖర్చు లేకుండా పెళ్ళి జరిగిపోతుంది.

అమర్ కల ముగియకుండానే కమలా ఆదిత్యా బయటకి వచ్చేసేరు. అబ్బాయి తన తండ్రితో ఏదో రహస్యంగా చెప్పేడు. దశరథరాం, నవ్వుమొహంతో “బావగారూ.. పిల్లలు ఓకే చేప్పేసేరు. మరి మనం తరవాత సంగతులు మాటాడుకుందామా?” అన్నాడు.

అమర్ వాళ్ళ వెనకే నక్కేడు.

మరో గదిలో అబ్బాయి తల్లితండ్రులు, అమ్మాయి తల్లి తండ్రులు ఇంకొందరు ముఖ్యులూ సమావేశం అయేరు. అమర్ మంచి నీళ్ళు అందరికీ ఇచ్చే నెపంతో అక్కడకి వెళ్ళేడు. దశరథరాం కచ్చితంగా అంటున్నాడు “కోట్లు కుమ్మరిస్తాం అన్న సంబంధాలు వదులుకొని మీ అమ్మాయినే ఎంచుకున్నాం బావగారూ.. ఎందుకూ? ‘అమ్మాయి లక్ష్మీకళతో ఉంది. బుద్ధిమంతురాలు’ అనే కదా మీరు ఈపాటయినా ఇవ్వకపోతే బంధువుల్లో మా పరువేంగాను?”

అమర్ నెత్తిన పిడుగులు పడ్డాయి.

బయటకు వచ్చేసేడు. బయట కమలా, ఆదిత్యా నవ్వుతూ మాటాడుకుంటున్నారు. అది చూసి చాలా కోపం వచ్చింది ఆదిత్యకి.

“అసలు తప్పు ఈ అక్కదే. దీనికే ఇల్లుదోచి పట్టుకెళిపోవాలని ఆరాటం ఎక్కువ” తిట్టుకున్నాడు.

పెద్దవాళ్ళందరూ నవ్వుతూ బయటకి వచ్చేరు. కమలతో ఆదరంగా మాటాడి, ఆమె భుజం తట్టీ అందరూ సెలవు తీసుకున్నారు.

భారీ కట్నం, లాంఛనాలతో పెళ్ళికి తండ్రి ఒప్పుకున్నాడు అని బోధపడింది ఆదిత్యకి.

అప్పటినించీ మొదలయింది ఇంట్లో పెళ్ళి హడావిడి. మొదట తాంబూలాలు పుచ్చుకుందాం అని అనుకోడంతో తమ ఇంట్లోనే ఆ ఫంక్షన్‌కి ఏర్పాటు చేసేడు పట్టాభిరామయ్య.

“అయ్. అదేంటిరా.. మా ఇళ్ళలో మగపిల్లోడి ఇంట్లోనే చేస్తారు అన్నీ.. మరి మీ ఇళ్ళలో ఇలాగా?” అన్నాడు భూపాలరెడ్డి. వాడికి సై అన్నట్టు సోంబాబు. “ఔనురా.. లేబర్‌లో చూడు. అన్నీ మగపిల్లడివంక వాళ్ళే చేసుకుంటారు. మనవాళ్ళే గట్టిగా మాటాడలేరు” అన్నాడు సకలం తెలిసినట్టే‌.

ఆ ప్రభావం అమర్ అక్క పెళ్ళి తాంబూలాల ఫంక్షన్‌లో నామకహా తిరిగేడు. అంతే. పెళ్ళికి మహూర్తం కూడా పెట్టేసారు. పనులు మొదలయేయి. తల్లితండ్రులు మాటాడుకుంటూ ఉంటే రహస్యంగా విన్నాడు అమర్. “మీరు ఎంతకి బంజరు భూమే అమ్ముతాం అంటే ఎవరు కొంటారండీ. పడమటవేపున్న మాగాణి అమ్మితే ధరవస్తుంది‌. కమల పెళ్ళి లక్షణంగా చేయగలం” అన్నాది జానకి.

“నిజమే జానకీ.. మాగాణీ అమ్మితే ఎవరో ఎందుకు మన సర్పంచ్ నారాయణరావే కొనడానికి రెడీగా ఉన్నాడు. నేనే భయపడుతున్నాను. అన్నం పెట్టే తల్లిలాటి భూమిని అమ్మేస్తే మన గతి తరవాత ఏమిటా? అని.”

“అలా అని ఆడపిల్లకి పెళ్ళి చేయవద్దా? ఈ పెళ్ళి లక్షణంగా జరగనీండి. తరవాత ఇహ అమరే కదా.. ఏదో బాధపడదాం..”

వింటున్న అమర్ పళ్ళు నూరేడు.

తండ్రి చక్కగా ఆలోచించేడు. అన్నం పెట్టే తల్లిలాటి భూమిని అమ్మితే ఎలా అని. తల్లి మరీను. అంతా అక్కకే దోచిపెట్టేటట్టు ఉంది.

ఇహ పెళ్ళి రోజుల్లోకి వచ్చేసింది. పెళ్ళి తరవాత పొలంలో కోతలు అనుకున్నారు. ఆసారి పంటలు విరగపండేయి. పట్టాభిరామయ్య, భార్యతో “ఈసారి పంటలు బాగున్నాయి. మనకి ఏడాది అంతా ఫరవాలేదు..” అనడం అమర్ విన్నాడు. మనసులో ఊరడిల్లేడు.

పెళ్ళి ధూం ధాం అని జరిగిపోయింది.

పెళ్ళికి వచ్చిన భూపాలరెడ్డి, సోంబాబూ అడుగడుగనా విమర్శిస్తూనే ఉన్నారు. “మాలో ఇలా కాదు. మాలో అలా కాదు..” అంటూ అమర్ తల్లితండ్రులని తక్కువ చేస్తూనే ఉన్నారు.

పెళ్ళి అవగానే కమల అత్తవారింటికి బయలుదేరింది. వెళ్ళేముందు అమర్‌ని కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడిచింది. “వీడిని వదిలి ఉండాలంటే బెంగలా ఉందమ్మా..” అన్నాది.

అమర్‌కి మనసు కరిగినా అదిమి పెట్టుకున్నాడు. కమలకి సాయం వాళ్ళ పిన్ని వెళ్ళింది.

పెళ్ళి అవగానే కోతలు కోయిద్దాం అంటే కూలీల కొరత. అనుకున్న రోజుకి అవలేదు. తీరా వాతావరణం మారి భయంకరమైన వాన, ఈదురుగాలి పట్టుకున్నాయి.

పట్టాభిరామయ్య మొహం వాడింది.

తెల్లారేసరికి ఏముంది? పంట అంతా నీళ్ళపాలు. ఏడాది గ్రాసం ఒక్కదెబ్బకి ఎగిరిపోయింది.

ఊళ్ళో అందరి పరిస్థితీ ఇదే. ఈ బెంగలు ఇటుంటే దీపావళి పండగ వస్తున్నాది. జానకి పోరు. “అమ్మాయినీ అల్లుడినీ దీపావళికి పిలవరా?” అని. “పిలిచి ఏం మర్యాద చేస్తాం జానకీ.. ఇంత దుర్భరమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు” దీనంగా అన్నాడు పట్టాభిరామయ్య.

“అలా అంటే ఎలా? ఏదో గవర్నమెంట్ సాయం డబ్బు వస్తుంది కదండీ.. మొదట ఈ గండం గడిస్తే తరవాత పొలం బాగుచేసుకుందాం..” జానకి సలహా ఇచ్చింది. “సరే..” అంటూ లేచేడు పట్టాభిరామయ్య.

అమర్ మతి పోయినవాడిలా కూచున్నాడు. “ఆఖరికి ప్రభుత్వం సహయంగా ఇచ్చిన డబ్బు ఈవిడే మింగుతుందా? ఎవరన్నారు ఆడపిల్లలు మహాలక్ష్మి రూపాలని. ఎంత ఘోరం వీళ్ళు?” కసిగా తిట్టుకున్నాడు. దీపావళికి అక్కా, బావా మాత్రమే వచ్చేరు. అమర్ అసలు పలకరించలేదు ఇద్దరినీ.

తల్లితండ్రులని వాటేసుకుంది కమల.

పంటల నష్టాలు, యోగక్షేమాలూ మాటాడేడు ఆదిత్య. దీపావళి వేడుకగా జరిగింది. పట్టాభిరామయ్య తెచ్చిన రకరకాల మతాబుల్లో ఏ ఒక్కటీ కాల్చలేదు ఆదిత్య. కమల అమర్‌తో “ఏరా.. నువ్వు ఏవీ కాల్చవా?” అంది. “ఈ ఏడాది మాకు పండగ చేసుకునే హక్కు లేదే.. పంటలు నాశనం అయి ఆ దుఖంలో ఉన్నాం” బిరుసుగా జవాబిచ్చేడు ఆదిత్య. మర్నాడు కమలా ఆదిత్య అక్కడకి దగ్గరలో ఉన్న వాళ్ళ చుట్టాలింటికి బయలుదేరేరు. కమల మతాబులు భర్తకి ఇచ్చినవీ, తమ్ముడు కాల్చకుండా ఉంచేసినవీ అన్నీ ఒక సంచిలో పెట్టుకొని బయలుదేరింది. “ఎంత కాపీనం. ఇవన్నీ అమ్ముకొని డబ్బు దాచుకుంటుంది కాబోలు..” కసిగా భూపాలరెడ్డి ఇంటికి బయలుదేరేడు అమర్.

అలా వెళ్ళిన కమలా, ఆదిత్య నాగులచవితి రోజుకి వచ్చేరు. పొద్దుట పూజా, పుట్టలో పాలు పోయడం అయి ఇంటికి వచ్చేరు అందరూ. అమర్ మనసు ద్వైధీభావాలతో ఉంది. ముందురోజు భూపాలరెడ్డి, సోంబాబు మాటాడుకుంటూ ఉంటే రహస్యంగా విన్నాడు. “అరే సోం.. మన అమర్ వాళ్ళ బావా వాళ్ళు సానా మంచోళ్ళటరా.. మా నాన్నతో నారాయణ రావు మావ అంటూ ఉంటే విన్నాను” అన్నాడు భూపాలరెడ్డి. “ఆ అంత మంచోళ్ళయితే ఇలా కట్నాలు కానుకలు ఏంటో..” వెటకారంగా అన్నాడు సోంబాబు. “కాదులే, ఇప్పుడు ఆడపిల్లలకి ఆస్తిలో సమాన వాటా ఇవ్వాలట కదా.. ఆ లెక్కన వాళ్ళ అక్కకి ఇచ్చినది ఏమంత ఉందని?” భూపాలరెడ్డి తీసిపారేసాడు.

మొదటనించీ వీళ్ళ ప్రభావంతోనే అక్క మీద వైర భావం పెంచుకున్నాడు. ఇప్పుడు ఏమనాలో తెలీక ఉన్నాడు. దానికి తగ్గట్టు బావ కొన్ని కాగితాలు పట్టాభిరామయ్య చేతిలో పెట్టేడు. పట్టాభిరామయ్య అవి చదివి కంగారు పడుతూ “ఇదేమిటి నాయనా.. ఇవి నేను అమ్మేసిన పొలం కాగితాలే..” అన్నాడు. నారాయణ రావు లోపలకి వచ్చేడు. “పట్టాభిరామయ్యా.. నీ అల్లుడు మణిపూసయ్యా.. నువ్వు భూమి అమ్ముతున్నావని తెలిసి నాతో రహస్యంగా మాటాడేడు. ఆ డబ్బంతా తనే ఇచ్చేడు. పొలం కాగితాలు మారకుండా రిజిస్ట్రేషను జరిగినట్టు చెప్పేడు. ‘ఇదంతా ఎందుకు? కట్నం మానీవచ్చు’ అంటావా? వాళ్ళ అమ్మా నాన్నల పరువు నిలబెట్టాలి కదా.” పట్టాభిరామయ్య మాటా పలుకూ లేకుండా ఉండిపోయేడు.

ఆ రోజంతా అలాటి విడ్డూరాలే జరిగేయి. “అమ్మా మా పిన్నత్తగారి పనిపిల్ల దీనమయిన పరిస్థితిలో ఉంది. దానికి మతాబులు ఇస్తే ఎంత సంతోషించింది అనుకున్నావు..” అంది.

అన్నిటికన్నా ఆదిత్య “మామయ్య గారూ.. అమర్‌ని పరీక్షలు అయిన తరవాత మాతో పంపిస్తారా? ఎలాగూ కాలేజీ చదువుకు సిటీలో ఉంచాలి కదా.. అదేదో అక్కడే అయితే వాళ్ళ అక్క సంతోషపడుతుంది. రోజూ అమర్ ని తలచుకుంటే కొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూనే ఉంటుంది” అన్నాడు.

అమర్ పెద్దపెట్టున ఏడుస్తూ కమలని పట్టుకొని “అక్కా.. నన్ను క్షమించగలవా? దేవతలాటి నీమీద ఎన్ని కోపాలు పెట్టకున్నానో..” అన్నాడు వెక్కుతూ.

“పిచ్చీ.. ఈ ఏడుపేమిటిరా.. నువ్వంటే నాకు ఎవరు? కొడుకుతో సమానం. తెలుసా?” అంది కమల ప్రేమగా అమర్ తల నిమురుతూ.

పిల్లలని చూసుకొని పట్టాభిరామయ్య దంపతులు మురిసిపోతూ ఉంటే, ఆదిత్య “మావయ్యగారూ.. మన పొలం మళ్ళా బాగు చేయించడానికి ఈ డబ్బు ఉంచండి” అంటూ ఒక కవర్ చేతిలో పెట్టేడు.

Exit mobile version