Site icon Sanchika

రామ నామావాహన – రామాస్వాదన

[శ్రీరామనవమి సందర్భంగా ‘రామ నామావాహన – రామాస్వాదన’ అనే వ్యాసాన్ని అందిస్తున్నారు శ్రీ రోచిష్మాన్.]

‘రామ’ అన్నది ‘భారతీయత’ ఉన్న భారతీయులకు ఒక శబ్ద మాహాత్మ్యం. రామ నామం సనాతనులు లేదా హిందువుల్ని లేదా భారతీయుల్ని కలిపి నిలిపే సూత్రం. రామ నామం, రామత్వం, రామ తత్త్వం ఇవి సనాతనుల్ని, భారతీయత ఉన్న భారతీయుల్ని కదిలిస్తున్నాయి; నడిపిస్తున్నాయి; ఏకీకరిస్తున్నాయి.

ఇటీవల ఈ దేశ ప్రజా విజయంగా అయోధ్య రామాలయం నిర్మితమైంది. తద్వారా మన జాతీయతా భావన వైభవంగా పున్నర్మితమైంది. మన జాతి జనుల ఆకాంక్షకు సాకారంగా అయోధ్య రామాలయం పొలుపుగా పొటమరించింది. ఆ ప్రదేశంలో రామాలయం ఉండేది కాదని చారిత్రిక వక్రీకరణ చేసేందుకు ప్రయత్నించి కొందఱు విఫలం అయ్యారు. మకాలి (Macaualy) చదువులవల్ల వాళ్లకు అబ్బిన బానిస మనస్తత్వాన్నీ, వాళ్ల మతి‌ భ్రష్టత్వాన్నీ, వాళ్ల చింతనా కాలుష్యాన్నీ, ప్రపంచం పరిహసించింది, నిరసించి తిరస్కరించింది.

ఉన్నతంగా అయోధ్య రామాలయం కట్టుకుని భారతీయులు విదేశీ మతోన్మాదంపై గెలిచారు. విదేశీ మతోన్మాదంపై భారత ప్రజలు సాధించిన పెను విజయం అయోధ్య రామాలయం. ఇవాళ్టి అయోధ్య రామాలయం ప్రపంచానికి మనదేశం ఇచ్చిన ఒక విశిష్ట సందేశం. ప్రపంచానికే ఒక సందేశంగా అమరిన అయోధ్య రామాలయం సాకారం ఐన తరువాత వచ్చిన ఈ శ్రీరామ నవమి సందర్భంలో ‘భారతీయత’ ఉన్న ప్రతి భారతీయ వ్యక్తీ రాముడికి “నమామి” అంటూ రామ నామావాహన చెయ్యాలి; రామాస్వాదన చెయ్యాలి.

రాముడు, రామత్వం, రామ తత్త్వం మనకు రామాయణం ద్వారా తెలియవచ్చాయి. రామాయణం శ్రుతంగా మన మట్టిలో ఎప్పటి నుంచో నెలకొని ఉంది. రామాయణం సామాన్య శకానికి పూర్వం (B.C.E.) 300 నాటిదని Oxford English Reference Dictionary తెలియజేస్తోంది. అంతర్జాతీయ పరిశోధకుడు Robert Philip Goldman రామాయణ పాఠం (text) సామాన్య శకానికి పూర్వం (B.C.E.) 7వ శతాబ్ది నుంచి లభ్యమౌతోందని తెలియజెప్పారు. రామాయణంలో ప్రస్తావితమైన ఖగోళ సంఘటనల ఆధారంగా రామాయణ కాలం గుఱించి సహేతుకంగా చేసిన అంచనాలు ఉన్నాయి. రామాయణం ఇప్పటికి 7000యేళ్ల క్రితంది అని అవి తెలియజెబుతున్నాయి.

ఆ వివరాలు తెలిపే లింక్స్:

The Times of India link:

https://weather.com/en-IN/india/space/news/2020-10-07-world-space-week-astronomical-dating-methods-ancient-indian-epics

మఱొక లింక్:

https://advocatetanmoy.com/2021/08/25/astronomical-dating-of-the-ramayan/

మఱొక లింక్:

https://www.millenniumpost.in/sundaypost/inland/clearing-the-mists-of-time-411204#:~:text=Thus%2C%20Sri%20Ram%20was%20born,

Shukla%20Paksha%20in%20Chaitra%20month.

సిద్ధార్థ గౌతమ బుద్ధుడి కాలంలోనూ అప్పటి ప్రజలకు రాముడితో తమ కష్టాలు చెప్పుకునే అలవాటు ఉండేది. 1879లో Edwin Arnold (1832-1904), LIGHT OF ASIA పేరుతో బుద్ధుడి చరిత్రను కవితల మాలికగా రాశాడు. ఇది వందలాది పునర్ముద్రణలతో లక్షలాది ప్రతులుగా ప్రజల్లోకి వెళ్లి విశ్వవ్యాప్తమైంది. ఈ LIGHT OF ASIAలో “ఓ రామా, ఓ రామా, విను…” అంటూ కొందరు బిగ్గఱగా విలపించడం బుద్ధుడు చూశాడు అని Edwin Arnold నమోదు చేశాడు. (The kinsmen shorn, with morning marks, ungrit, / Crying upon O Rama, Rama, hear!). బుద్ధుడి గురువుల్లో ఒకరి పేరు ఉద్రక రామపుత్రుడు. ఈ ఉద్రక రామపుత్రుడు బుద్ధుడికి వైశేషికం నేర్పించాడు (ఆధారం Dwight Goddard రాసిన A Buddhist Bible). రామ పుత్రుడులోని రామ శబ్దం ఉండడం అప్పటికే ఆ శబ్దం ప్రజలో ప్రబలంగా వ్యాపించి ఉందన్న సత్యాన్ని తెలియజేస్తోంది.

రాముడు ఉత్తరాది దేవుడని, దక్షిణాది దేవుడు కాడని కొందఱు ప్రచారం చేస్తున్నారు; అది పూర్తిగా తప్పు, అజ్ఞానం. తమిళ్ష్‌నాడు కుంబకోణం దగ్గఱున్న కోలవిల్లి రామర్ ఆలయం 9వ శతాబ్ది లేదా 8వ శతాబ్ది (750) దని పరిశీలనలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయం గుఱించి 8వ శతాబ్ది తిరుమఙై (తిరుమంగై) ఆళ్ష్వార్ పాడారు. ఈ ఆలయం తరువాత 120 ఏళ్లకు మదురాందగంలో ఒక కోదండరామ ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయంలోనే (11వ శతాబ్ది) రామానుజుల వారికి వారి గురువు ఆళవందార్ శంఖు చక్రాల్ని వేశారు. అంటే రామానుజులు‌ సాంప్రదాయికంగా వైష్ణవుడయింది ఈ కోదండరామ ఆలయంలోనే. సామాన్య శకం 8, 9,10 శతాబ్దులకే దక్షిణాదిలో ప్రముఖమైన రామాలయాలు ఉన్నాయని చారిత్రికంగా తెలియవస్తోంది. మనదేశంలో రామాలయాలు ఏ నాలుగు, ఐదువందల ఏళ్ల నాటివో కావు. ఎప్పటి నుంచో మనకు రామాలయాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలోని పంచవటిలో ఉన్న కాలారామ్ గుడి 7వ శతాబ్దిలోది. అక్కడి రామ విగ్రహం 2000‌ ఏళ్ల నాటిదిగా పరిగణించబడుతోంది.

దక్షిణాదిలో అన్ని భాషల్లోని అన్ని వర్గాల హిందువుల్లోనూ రాముడికి చెందిన పేర్లు విరివిగా ఉంటాయి. అంటే రాముడు దక్షిణాది ప్రజల్లో ఎంతగా పెనవేసుకుపోయి ఉన్నాడో తెలుసుకోవచ్చు. త్యాగయ్య రామ కీర్తనలు, స్వాతి తిరునాళ్ రామ రచనలు, భద్రాచల రామదాసు రామ రచనలు రాముడు దక్షిణాదిలో ఏ మేఱకు పాతుకునిపోయి ఉన్నాడో తెలియజెబుతాయి. 8వ శతాబ్ది కులశేఖర ఆళ్ష్వార్ రాముడి ఆరాధకులు. రామాయణాన్ని ఆలపిస్తూ తనను తాను రాముడుగా భావించుకునేవారు. కులశేఖర ఆళ్ష్వార్ కారణంగా కేరళలో రామ ఆరాధన బాగా చలామణిలోకి వచ్చింది. శ్రీరంగం ఆలయంలో రాముడి సన్నిధి 10వ శతాబ్దికి పూర్వందే. రామాయణం, రాముడు కావ్యేతిహాసాలుగా 10వ శతాబ్దిలో పొన్న రాసిన రామకథ ద్వారా కన్నడంలోకి, 12వ శతాబ్దిలో కంబన్ రాసిన కంబ రామాయణం ద్వారా తమిళ్ష్‌లోకి,13వ శతాబ్దిలో గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం ద్వారా తెలుగులోకి రావడం జరిగింది. తెలివిడితో, బుద్ధితో తెలుసుకుంటే రాముడి ఆరాధన దక్షిణాదిలో ఎప్పటి నుంచో ఎంతో గాఢంగా ఉందని తెలియవస్తుంది. చరిత్ర జ్ఞానం లేకుండా, ఉన్నదాన్ని పరిగణించకుండా, విజ్ఞత లేకుండా, సంస్కారం లేకుండా రాముడు, రామాయణాన్ని వస్తువులుగా తీసుకుని ఈ దేశంలోని పెద్దశాతం ప్రజల అభినివేశంపై, అభీష్టంపై, సంస్కృతిపై దాడి జరుగుతోంది.

భారతదేశ రాజ్యాంగం మూల ప్రతిలో రాముడి చిత్రం ఉంది. రాజ్యంగం ప్రకారం రాముడు దేవుడుగా పరిగణించబడ్డాడా? చారిత్రిక పురుషుడుగా పరిగణించబడ్డాడా? ఈ దేశానికి రాముడు అదర్శం అనో, లేదా రాముడు ఆదర్శంగా ఉండాలనో రాముడి చిత్రం రాజ్యాంగం ప్రతిలో ప్రతిష్ఠితమైందా? సెక్యులర్ అనడం పశ్చిమ దేశాలకు సంబంధించింది. ఆ దేశాల్లో చర్చ్‌కు, పరిపాలనకు సంబంధం ఉండకూడదు అన్న చింతనతో సెక్యులర్ పాలన అంటారు. మన దేశం చర్చ్‌కో, ఏదో పీఠానికో, ఏ ఆలయానికో లోబడింది కాదు. మన దేశం నైసర్గికంగా ధర్మ బద్ధం. మౌలికంగా మన దేశం ధార్మికమైంది. రాముణ్ణి మన ప్రజలు ధర్మమూర్తిగా పరిగణించారు. రాముడు ధర్మమూర్తి అన్నది ప్రజా విశ్వాసం కాబట్టే రాముడి చిత్రానికి మన రాజ్యాంగం ప్రతిలో ప్రథమ స్థానం ఇవ్వబడిందా?

ఇటీవలి కాలంలో ‘విశ్వ సనాతనత్వం లేదా విశ్వ వ్యాప్తంగా భారతీయత పునర్భవం ఔతోంది లేదా పునరుత్థానం ఔతోంది’. ప్రపంచం భారతీయతకు ప్రాముఖ్యతను ఇవ్వడం నేర్చుకుంటోంది. ఇంత కాలమూ సనాతన నాశనానికి మన దేశంలో కుమ్మరించబడ్డ విదేశీ మత ధనం, విదేశీ మత మాఫియాల పన్నాగాలు, విధ్వంసక భావజాల దాష్టికం రానున్న రోజుల్లో విఫలం కానున్నాయి. దేశ ద్రోహుల రాబడి, లాభాలు, ప్రయత్నాలు పతనం కానున్నాయి. దేశ వ్యతిరేక వాదాలు, వాదనలు పనికిరాకుండా పోనున్నాయి, భారతీయతా వ్యతిరేకత చెల్లా చెదురు అవనుంది. ‘సనాతనత్వ వ్యతిరేకత లేదా భారతీయతా వ్యతిరేకత ఒక రకమైన మానసిక రోగంగా ప్రపంచ చరిత్రలో నమోదు కానుంది. ప్రతికూలతలను అధిగమించి ‘సనాతన లేదా హిందూత్వ స్పృహ’ వ్యాప్తిని అందుకుంది! ప్రపంచం సనాతన స్పృహను అక్కున చేర్చుకుంటోంది!! ఈ పరిణామానికి రామ నామావాహన, రామాస్వాదన కూడా కారణాలయ్యాయి.

“జయ జయ రామ సమర విజయ రామ” అంటూ అన్నమయ్య ఒక సంకీర్తన చేశారు. జయ జయ రామ సమర విజయ రామ అని అన్న అన్నమయ్య రాముణ్ణి “భయహర…” అంటూ కొనసాగారు. రామ నామావాహనతోనూ, రామాస్వాదనతోనూ మన భయాలు హరమైపోగా విద్వేషవాదులు, విధ్వంసక శక్తులు, విదేశీ మతోన్మాదులు, దేశ వేఱ్పాటు వాదులపై విజయం సాధించేందుకు, భారతీయతను, భారతదేశాన్ని నిలబెట్టుకునేందుకు ఉద్యుక్తులమై మనం ముందుకు సాగాలి. రాముడి వైశాల్యం, వైశేష్యం, వైవిధ్యం వీటిని మనం అవగాహన చేసుకోవాలి. బహుముఖ రామ మూర్తిమత్వాన్ని అన్నమయ్య ఇలా నినదించారు:

“జలధి బంధించిన సౌమిత్రి రామా
సెలవిల్లు విరిచిన సీతారామా
అల సుగ్రీవు నేలిన అయోధ్య రామా
కలిగి యజ్ఞము కాచే కౌసల్య రామా

అరి రావణాంతక ఆదిత్యకుల రామా
గురు మౌనులను గాచే కోదండ రామా
ధర నహల్య పాలిటి దశరథ రామా
హరురాణి నుతుల లోకాభి రామా

అతి ప్రతాపముల మాయామృగాంతక రామా
సుత కుశలవ ప్రియ సుగుణ రామా
వితత మహిమల శ్రీ వేంకటాద్రి రామా
మతిలోన బాయని మనువంశ రామా”

రాముడి వ్యక్తిత్వాన్ని బహు అభివ్యక్తులుగా మనం చదవచ్చు.

“రాముడు ఎంతమంది రాముళ్లు?
అతడు మంచి‌వాళ్లు పూజించే దేవుడు
దేవుడు‌ రాముడు ఎంతమంది రాముళ్లు?”

అంటూ తమిళ్ష్ కవి కణ్ణదాసన్ రాముడిని ఇలా సందర్శించారు:

“కళ్యాణ రూపంలో‌ ఉన్న కళ్యాణ రాముడు
ప్రేమకు రూపం‌ ఆ సీతారాముడు
రాజ్యాధికారం చెయ్యడానికొచ్చిన‌ రాజు, రాజా రాముడు
అలంకార రూపంలో అతడు సుందర రాముడు

తల్లే‌ నా దైవం‌ అన్న కోసల రాముడు
తండ్రిపై మమకారమున్న దశరథ రాముడు
వీరం అనే విల్లునెక్కు పెట్టే కోదండరాముడు
విజయం అనే యుద్ధాన్ని ముగించిన శ్రీ జయ రాముడు

వంశానికొక రఘురాముడు
మతాలను‌‌ కలిపే‌ వాడు శివరాముడు
మూర్తికి ఒకడు‌ శ్రీరాముడు
ముగింపు లేని అనంత రాముడు

రామ జయం శ్రీ రామజయం
నమ్మిన వారికి ఏది భయం?
రామ జయం శ్రీ రామ జయం
రాముడి చేతిలో నాకు అభయం”

బహు అభివ్యక్తులుగా ఉన్న రామతత్త్వం మనం చదివి అర్థం చేసుకోవాల్సిన చదువు. ఆ చదువు మనకు జీవనానికి జీవితాన్నిస్తుంది; మన జీవితానికి జీవనాన్నిస్తుంది. అంతేకాదు మన జాతికి, మన దేశానికి చవిని, ఛవిని ఇస్తుంది. రామ నామావాహనతో, మనం భారతీయ ఏకాత్మకతను ప్రతిష్ఠితం చేసుకోవాలి; మనం సనాతన నిత్యత్వాన్ని ప్రసిద్ధం చేసుకోవాలి. రామాస్వాదనతో మనం భారతీయతకు పునరంకితమౌదాం; భారతీయతతో మనం భవిష్యత్తులోకి ప్రవేశిద్దాం. రాముడు మన జాతికి ఒక స్ఫూర్తి; రాముడు మన దేశానికి ఒక స్పృహ. భారతీయుల సమైక్యతకు ఒక ప్రేరణ రాముడు. రామ నామావాహనతో, రామాస్వాదనతో మనం కలిసి‌కట్టుగా విజయాల కోసమూ, విజయాలతోనూ ప్రయాణం చేద్దాం; సత్ఫలితాల్ని సాధిద్దాం.

***

చిత్రాలు: బీ.టీ. రాజా (చెన్నై)

Exit mobile version